కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సానుకూల దృక్పథాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

సానుకూల దృక్పథాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

“ఒకడు చాలా సంవత్సరములు బ్రదికినయెడల . . . తాను బ్రదుకు దినములన్నియు సంతోషముగా ఉండవలెను.”—ప్రసం. 11:8.

1. మనల్ని సంతోషంగా ఉంచడానికి యెహోవా ఏయే దీవెనలు దయచేశాడు?

 యెహోవా మన సంతోషాన్నే కోరుకుంటాడు, అందుకే మనకు సంతోషాన్నిచ్చే ఎన్నో ఆశీర్వాదాలను ఆయన విస్తారంగా కుమ్మరిస్తున్నాడు. ఆయన మనకు జీవాన్ని ఇచ్చాడు. అంతేకాదు మనల్ని సత్యారాధనవైపు కూడా ఆకర్షించాడు, అందుకే మన జీవితాన్ని యెహోవాను స్తుతించడానికి ఉపయోగిస్తాం. (కీర్త. 144:15; యోహా. 6:44) మనమీద ప్రేమ ఉందనే భరోసా ఇస్తూ, మనం ఆయన సేవలో కొనసాగేలా సహాయం చేస్తున్నాడు. (యిర్మీ. 31:3; 2 కొరిం. 4:16) పైగా, మనం ఆధ్యాత్మిక పరదైసులో ఉంటూ, సమృద్ధిగా ఆధ్యాత్మిక ఆహారాన్ని ఆస్వాదిస్తున్నాం, సహోదరుల ప్రేమను చవిచూస్తున్నాం. వీటితోపాటు, మనకు భవిష్యత్తు విషయంలో అద్భుతమైన నిరీక్షణ కూడా ఉంది.

2. కొంతమంది నమ్మకమైన దేవుని సేవకులు వేటితో సతమతమవుతుంటారు?

2 సంతోషించేందుకు ఇన్ని కారణాలు ఉన్నా, కొంతమంది నమ్మకమైన దేవుని సేవకులు ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతుంటారు. తమకు, తమ సేవకు యెహోవా దృష్టిలో పెద్దగా విలువలేదని వాళ్లనుకుంటారు. ఎప్పుడూ ప్రతికూల ఆలోచనలతో ఉన్నవాళ్లకు ‘చాలా సంవత్సరాలు’ సంతోషంగా బ్రతకడమనే ఆలోచనే ఓ కలలా ఉంటుంది. అలాంటివాళ్లకు జీవితమంతా చీకటిగా అనిపిస్తుంది.—ప్రసం. 11:8.

3. ప్రతికూల ఆలోచనలు వేటివల్ల కలగవచ్చు?

3 అలాంటి సహోదరసహోదరీలకు బహుశా నిరుత్సాహం, అనారోగ్యం లేదా వయసు పైబడేకొద్దీ వచ్చే ఇబ్బందుల వల్ల ప్రతికూల ఆలోచనలు రావచ్చు. (కీర్త. 71:9; సామె. 13:12; ప్రసం. 7:7) అంతేకాదు, మన హృదయం ‘మోసకరమైనదని,’ దేవుడు మనల్ని చూసి సంతోషిస్తున్నా, అది మనల్ని నిందించవచ్చనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. (యిర్మీ. 17:9; 1 యోహా. 3:19, 20) దేవుని సేవకుల గురించి సాతాను అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నాడు. సాతానులా ఆలోచించేవాళ్లు, యోబు కాలంలో విశ్వాసంలేని ఎలీఫజు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని, అంటే మనం దేవుని దృష్టిలో పనికిరానివాళ్లమనే ఆలోచనను మనలో నాటవచ్చు. అయితే, అది పచ్చి అబద్ధం!—యోబు 4:18, 19.

4. ఈ ఆర్టికల్‌లో మనమేమి చూస్తాం?

4 ‘గాఢాంధకారపు లోయలో సంచరించే’ వాళ్లకు తోడుగా ఉంటానని లేఖనాల్లో యెహోవా భరోసా ఇస్తున్నాడు. (కీర్త. 23:4) ఆయన, తన వాక్యం ద్వారా మనకు తోడుగా ఉన్నాడు. అపోహలు, ప్రతికూల ఆలోచనలు వంటి ఎలాంటి ‘దుర్గములనైనా పడద్రోయజాలినంత బలం’ బైబిలుకు ఉంది. (2 కొరిం. 10:4, 5) కాబట్టి, సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుని దాన్ని కాపాడుకోవడానికి మనకు బైబిలు ఎలా సహాయం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. దానివల్ల మీరు స్వయంగా ప్రయోజనం పొందడమే కాక, ఇతరులను ప్రోత్సహించే మార్గాలను కూడా తెలుసుకుంటారు.

బైబిలు సహాయంతో సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోండి

5. సానుకూల దృక్పథాన్ని అలవర్చుకునేందుకు మనల్ని మనం ఏమని పరీక్షించుకోవాలి?

5 సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడానికి మనకు సహాయం చేసే కొన్ని విషయాలను పౌలు వివరించాడు. “మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి” అని ఆయన కొరింథు సంఘంలోని వాళ్లకు ఉపదేశించాడు. (2 కొరిం. 13:5) బైబిల్లో ఉన్న క్రైస్తవ నమ్మకాల సమాహారమే “విశ్వాసము.” ఆ నమ్మకాల ప్రకారమే మన మాటలూ ప్రవర్తనా ఉంటే, మనం ఆ పరీక్షలో నెగ్గినట్లే, ‘విశ్వాసంలో’ ఉన్నామని చూపించుకున్నట్లే. అంతేకాదు, మనం క్రైస్తవ బోధలన్నిటి ప్రకారం జీవిస్తున్నామో లేదో కూడా పరీక్షించుకోవాలి. మనకు నచ్చిన బోధల్ని మాత్రమే పాటిస్తే సరిపోదు.—యాకో. 2:10, 11.

6. ‘మనం విశ్వాసముగలవారమై ఉన్నామో లేదో’ ఎందుకు పరీక్షించుకోవాలి? (ప్రారంభ చిత్రం చూడండి.)

6 కానీ, అలా పరీక్షించుకోవడానికి మీరు వెనుకాడుతుండవచ్చు, ఓడిపోతామనే భయం ముఖ్యంగా మీకుండవచ్చు. అయితే ఈ విషయంలో మన అభిప్రాయంకన్నా యెహోవా అభిప్రాయమే ముఖ్యం, ఆయన మనకంటే ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తాడు. (యెష. 55:8, 9) ఆయన తన ఆరాధకులను పరిశీలిస్తాడు, వాళ్లలో తప్పులు పట్టుకోవాలని కాదుగానీ మంచి లక్షణాలను చూడడానికే ఆ పని చేస్తాడు. దేవుని వాక్య సహాయంతో, “మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో” పరీక్షించుకున్నప్పుడు, యెహోవా మిమ్మల్ని చూస్తున్నట్లుగా మిమ్మల్ని మీరు చూడడం నేర్చుకుంటారు. దానివల్ల, దేవుని దృష్టిలో పనికిరానివాళ్లనే ఎలాంటి ఆలోచన నుండైనా బయటపడి, ఆయన మిమ్మల్ని ఎంతో విలువైన వ్యక్తులుగా చూస్తున్నాడనే భరోసాతో ఉండగలుగుతారు. ఆ మార్పును, సూర్యకాంతి చీకటిగదిలోకి ప్రవేశించేలా ఆ గది కిటికీకున్న కర్టెన్‌ను తెరవడంతో పోల్చవచ్చు.

7. విశ్వాసానికి సంబంధించిన బైబిలు ఉదాహరణల నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?

7 ఆ విధంగా మనల్ని మనం పరీక్షించుకునేందుకు ఓ చక్కని మార్గం, బైబిల్లోని నమ్మకస్థులు ఉంచిన ఆదర్శం గురించి ధ్యానించడమే. వాళ్ల పరిస్థితులను, భావాలను మీ పరిస్థితులతో, భావాలతో పోల్చి చూసుకోండి, వాళ్ల స్థానంలో మీరుంటే ఏమి చేసివుండేవాళ్లో ఆలోచించండి. “మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో” పరీక్షించుకునేందుకు బైబిలు ఎలా సహాయం చేస్తుందో అర్థంచేసుకోవడానికి ముగ్గురు వ్యక్తుల గురించి ఇప్పుడు గమనిద్దాం. దానివల్ల, మీరు సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోగలుగుతారు.

బీద విధవరాలు

8, 9. (ఎ) బీద విధవరాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? (బి) ఆమెకు ఎలాంటి ప్రతికూల ఆలోచనలు వచ్చివుండవచ్చు?

8 యేసు యెరూషలేము దేవాలయంలో ఓ బీద విధవరాలిని గమనించాడు. పరిమితులున్నా సానుకూల దృక్పథాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఆమె ఆదర్శం మనకు నేర్పిస్తుంది. (లూకా 21:1-4 చదవండి.) ఆమె పరిస్థితి గురించి ఓసారి ఆలోచించండి. ఆమె, భర్త లేడనే బాధను ఓర్చుకోవడంతోపాటు, తనలాంటి దిక్కులేనివాళ్లకు సహాయం చేయకపోగా “విధవరాండ్ర యిండ్లను దిగమ్రింగే” మతనాయకుల అన్యాయాల్ని కూడా భరించాల్సి వచ్చింది. (లూకా 20:47) అంతేకాదు, ఆమె ఎంత బీదరికంలో ఉందంటే, ఓ పనివాడు కేవలం కొన్ని నిమిషాల్లో సంపాదించే డబ్బును మాత్రమే చందా వేయగలిగే స్థితిలో ఉంది.

9 కేవలం రెండు చిన్న కాసులను చెత్తో పట్టుకుని, ఆలయంలోని ఆవరణలోకి వస్తున్నప్పుడు ఆ విధవరాలికి ఎలా అనిపించివుంటుందో ఆలోచించండి. తన భర్త బ్రతికున్న రోజుల్లో తాను ఇచ్చిన విరాళాలతో పోలిస్తే ఇప్పుడు ఇస్తున్నది ఎంత తక్కువో ఆమె ఆలోచిస్తూ ఉందా? తన ముందున్న వాళ్లు పెద్ద మొత్తాల్లో కానుకలు ఇవ్వడం చూస్తూ, తానిచ్చేది అసలు విలువైనదేనా అనుకుంటూ చిన్నతనంగా భావించిందా? ఒకవేళ అలాంటి ఆలోచనలు వచ్చినా, ఆమె మాత్రం సత్యారాధన కోసం తాను ఇవ్వగలిగింది ఇచ్చింది.

10. విధవరాలు దేవుని దృష్టిలో అమూల్యమైనదని యేసు ఎలా చూపించాడు?

10 ఆ విధవరాలిని, ఆమె ఇచ్చిన కానుకను యెహోవా ఎంతో అమూల్యంగా ఎంచాడని యేసు వివరించాడు. ఆమె “అందరికంటె [ధనవంతుల కంటే] ఎక్కువ వేసెను” అని యేసు చెప్పాడు. ఆమె వేసిన రెండు చిన్న కాసులు, మిగతావాళ్లు వేసిన కానుకలతో కలిసిపోయినా, యేసు మాత్రం ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించాడు. విరాళాలను లెక్కిస్తున్నప్పుడు దేవాలయ ఉద్యోగులు ఆ రెండు కాసులను చూసుంటారు. అయితే, యెహోవా దృష్టిలో ఆ రెండు కాసులకు, వాటిని వేసిన వ్యక్తికి ఎంత విలువుందో వాళ్లకు తెలియదు. అయినా ఈ విషయంలో ఇతరుల అభిప్రాయం కన్నా, చివరికి ఆమె సొంత అభిప్రాయం కన్నా యెహోవా అభిప్రాయమే ముఖ్యం. “మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో” పరీక్షించుకోవడానికి ఈ వృత్తాంతాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు?

బీద విధవరాలి నుండి మీరేమి నేర్చుకుంటారు? (8-10 పేరాలు చూడండి)

11. బీద విధవరాలి నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?

11 కొన్నిసార్లు మీ పరిస్థితుల వల్ల మీరు యెహోవా సేవను ఎక్కువగా చేయలేకపోవచ్చు. వయసు పైబడడం, అనారోగ్యం కారణంగా మీరు కొంచెం సమయం మాత్రమే సువార్త ప్రకటిస్తుండవచ్చు. మీరు చేస్తున్న సేవ, రిపోర్టు చేసేంత విలువైనది కాదని మీరు అనుకోవడం సబబేనా? ఒకవేళ మీ పరిచర్య గంటలు మరీ తక్కువగా లేకపోయినా, దేవుని ప్రజలు ఆయన సేవకోసం ప్రతీ సంవత్సరం వెచ్చిస్తున్న గంటల్లో మీ భాగం సముద్రంలో నీటి బొట్టంతేనని మీరు అనుకుంటుండవచ్చు. అయినా, తనకోసం చేసే ప్రతీ పనినీ ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో చేసే ప్రతీదాన్ని యెహోవా గమనిస్తాడనీ విలువైనదిగా ఎంచుతాడనీ బీద విధవరాలి వృత్తాంతం మనకు నేర్పిస్తుంది. గత సంవత్సరం మీరు యెహోవా సేవ కోసం వెచ్చించిన గంటల గురించి ఓసారి ఆలోచించండి. వాటిలో ఒకానొక గంట చేయడానికి మీరు ప్రత్యేకంగా త్యాగాలు చేయాల్సివచ్చిందా? అలాగైతే, ఆ గంటసేపు మీరు తనకు చేసిన సేవను యెహోవా ఎంతో విలువైనదిగా ఎంచాడని మీరు భరోసాతో ఉండవచ్చు. ఆ బీద విధవరాల్లాగే మీరూ యెహోవా సేవలో చేయగలిగినదంతా చేస్తుంటే, మీరు ‘విశ్వాసంలో’ ఉన్నారని నిర్ధారించుకోవచ్చు.

“నా ప్రాణము తీసికొనుము”

12-14. (ఎ) ప్రతికూల భావాలు ఏలీయాను ఎలా కృంగదీశాయి? (బి) ఏలీయా ఎందుకు అలా భావించివుంటాడు?

12 ఏలీయా ప్రవక్త యెహోవాకు యథార్థంగా ఉంటూ, బలమైన విశ్వాసాన్ని చూపించాడు. అయినా, ఒక సందర్భంలో ఆయనెంతగా కృంగిపోయాడంటే, “యెహోవా, . . . ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము” అని యెహోవాకు ప్రార్థించాడు. (1 రాజు. 19:4) అలాంటి నిరాశానిస్పృహలను అనుభవించని వాళ్లు, ఏలీయా చెప్పినవి “నిరర్థకమైన మాటలు” అని కొట్టిపారేయవచ్చు. (యోబు 6:3) కానీ, ఏలీయా నిజంగానే ఎంతో కృంగిపోయాడు. అయితే, చనిపోవాలని కోరుకున్న ఏలీయాను కోపగించుకోకుండా యెహోవా ఆయనకు సహాయం చేశాడు.

13 అంత నిస్పృహలో కూరుకుపోయే పరిస్థితి ఏలీయాకు ఎందుకొచ్చింది? ఆయన అంతకుముందే ఓ ప్రాముఖ్యమైన పరీక్ష ద్వారా యెహోవాయే నిజమైన దేవుడని నిరూపించి, 450 మంది బయలు ప్రవక్తలను చంపించాడు. (1 రాజు. 18:37-40) దానివల్ల దేవుని ప్రజలు సత్యారాధన వైపు తిరుగుతారని ఏలీయా అనుకున్నాడు, కానీ అలా జరగలేదు. పైగా ఆయనను మట్టుపెడతానని దుష్ట రాణియైన యెజెబెలు సందేశం పంపించింది. దాంతో ఏలీయా ప్రాణభయంతో దక్షిణాన ఉన్న యూదా ప్రాంతాన్ని దాటుకుంటూ నిర్మానుష్యమైన అరణ్యానికి పారిపోయాడు.—1 రాజు. 19:2-4.

14 అరణ్యంలో ఒంటరిగా ఉన్న ఏలీయా, ప్రవక్తగా తాను పడిన కష్టమంతా వృథా అయిపోయిందని బాధపడ్డాడు. “నా పితరులకంటే నేను ఎక్కువవాడను కాను” అని ఆయన యెహోవాతో అన్నాడు. అంటే, సమాధుల్లో ఉన్న తన పూర్వికుల ఎముకల్లా, మట్టిలా తాను ఎందుకూ పనికిరానివాణ్ణని ఆయన అనుకున్నాడు. నిజానికి, ఏలీయా తన సొంత ప్రమాణాలతో తనను తాను పరీక్షించుకొని, తాను ఓడిపోయానని, యెహోవా దృష్టిలో ఇతరుల దృష్టిలో ఏమాత్రం విలువలేనివాణ్ణని అనుకున్నాడు.

15. ఏలీయా తనకు ఇంకా అమూల్యమైనవాడేనని యెహోవా ఎలా భరోసా ఇచ్చాడు?

15 అయితే, ఏలీయా గురించి సర్వశక్తుడు అలా అనుకోలేదు. ఆయన దృష్టిలో ఏలీయా ఇంకా అమూల్యమైనవాడే, ఆ వాస్తవాన్ని ఏలీయా అర్థం చేసుకునేందుకు దేవుడు సహాయం చేశాడు. దేవుడు ఏలీయాను బలపర్చడానికి దేవదూతను పంపించాడు. ఆహారం, మంచినీళ్లు ఇచ్చి ఏలీయాను పోషించి, ఆ శక్తితో ఆయన 40 రోజులు ప్రయాణించి దక్షిణాన ఉన్న హోరేబు పర్వతం చేరుకునేలా చేశాడు. తాను తప్ప ఇశ్రాయేలీయుల్లో ఏ ఒక్కరూ యెహోవాకు నమ్మకంగా లేరని పొరబడిన ఏలీయా అభిప్రాయాన్ని కూడా ఆయన సరిచేశాడు. పైగా, యెహోవా ఆయనకు కొత్త నియామకాల్ని ఇచ్చాడు, ఏలీయా వాటిని స్వీకరించాడు. యెహోవా సహాయం వల్ల ఏలీయా ప్రయోజనం పొంది, ప్రవక్తగా తన పనిని నూతనోత్సాహంతో మళ్లీ మొదలుపెట్టాడు.—1 రాజు. 19:5-8, 15-19.

16. దేవుడు మిమ్మల్ని ఏయే రకాలుగా బలపర్చివుంటాడు?

16 మీరు విశ్వాసంలోనే ఉన్నారని నిర్ధారించుకోవడానికి, సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడానికి ఏలీయా అనుభవం మీకు సహాయం చేస్తుంది. మొదటిగా, యెహోవా మిమ్మల్ని ఏయే విధాలుగా బలపర్చాడో ఆలోచించండి. మీరు ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు ఆయన సేవకుల్లో ఒకరు, బహుశా ఓ సంఘపెద్ద లేదా పరిణతిగల మరో క్రైస్తవుడు మీకు సహాయం చేశారా? (గల. 6:2) బైబిలు వల్ల, క్రైస్తవ ప్రచురణల వల్ల, సంఘ కూటాల వల్ల మీరు ఆధ్యాత్మిక పోషణ పొందుతున్నారు. మీరు ఈసారెప్పుడైనా అలా ప్రయోజనం పొందితే, ఆ సహాయానికి మూలమైన దేవుని గురించి ఆలోచించి, ప్రార్థనలో ఆయనకు కృతజ్ఞత చెప్పండి.—కీర్త. 121:1, 2.

17. యెహోవా తన సేవకుల్లో వేటిని అమూల్యంగా ఎంచుతాడు?

17 రెండవదిగా, ప్రతికూల ఆలోచనలు మోసకరమైనవని అర్థం చేసుకోండి. మనగురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అన్నదే అన్నిటికంటే ప్రాముఖ్యం. (రోమీయులు 14:4 చదవండి.) ఆయన పట్ల మనకున్న భక్తిని, విశ్వసనీయతను దేవుడు ఎంతో అమూల్యంగా ఎంచుతాడు; కేవలం మనం సాధించినవాటిని బట్టే ఆయన మన గురించి ఓ అభిప్రాయానికి రాడు. యెహోవా కోసం మీరు చేసిన వాటన్నిటినీ ఏలీయాలాగే బహుశా మీరు గుర్తించకపోవచ్చు. బహుశా మీకు తెలియకుండానే సంఘంలోని కొంతమందిని ప్రోత్సహించివుంటారు లేదా మీ ప్రాంతంలోని ప్రజలు మీ ప్రయత్నాల వల్ల సత్యం తెలుసుకునివుంటారు.

18. యెహోవా మీకిచ్చే నియామకం దేనికి నిదర్శనం?

18 చివరిగా, యెహోవా ఇచ్చే ప్రతీ నియామకాన్నీ ఆయన మీకు తోడుగా ఉన్నాడనేందుకు నిదర్శనంగా చూడండి. (యిర్మీ. 20:11) మీ సేవకు ఫలితాలు రావట్లేదనో లేదా ఒకానొక ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరలేకపోతున్నారనో అనిపించినప్పుడు ఏలీయాలాగే మీకు కూడా నిరుత్సాహం కలుగవచ్చు. అయితే ఇప్పుడు దేవుని సేవకులందరికీ ఉన్న అవకాశం అంటే సువార్త ప్రకటించే, దేవుని నామాన్ని ధరించే అత్యంత గొప్ప అవకాశం మీకూ ఉంది. కాబట్టి యెహోవాకు నమ్మకంగా ఉండండి. అప్పుడు మీరు, యేసు చెప్పినట్లు ‘మీ యజమాని సంతోషంలో పాలు పొందుతారు.’—మత్త. 25:23.

‘శ్రమపడుతున్న వ్యక్తి ప్రార్థన’

19. కీర్తన 102ను రాసిన వ్యక్తి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు?

19 కీర్తన 102ను రాసిన వ్యక్తి చాలా ఆందోళనలో మునిగివున్నాడు. ఆయన తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ‘శ్రమపడుతున్నాడు.’ తన సమస్యలతో పోరాడే శక్తి ఆయనకు లేదు. (కీర్త. 102, పైవిలాసం, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అక్కడున్న మాటల్ని చూస్తే కీర్తనకర్త బాధతో, ఒంటరితనంతో, ప్రతికూల ఆలోచనలతో కృంగిపోయాడని అర్థమవుతుంది. (కీర్త. 102:3, 4, 6, 11) యెహోవా తనను పారవేయాలనుకుంటున్నాడని ఆయన నమ్మాడు.—కీర్త. 102:10.

20. ప్రతికూల ఆలోచనలతో పోరాడడానికి ప్రార్థన ఎలా సహాయం చేస్తుంది?

20 అయినప్పటికీ, యెహోవాను స్తుతించడానికి తన జీవితాన్ని ఉపయోగించే అవకాశం కీర్తనకర్తకు అప్పటికీ ఉంది. (కీర్తన 102:19-21 చదవండి.) 102వ కీర్తనను పరిశీలిస్తే, విశ్వాసంలో ఉన్నవాళ్లకు కూడా బాధలు వస్తాయని, ఆ సమయంలో మిగతా విషయాల గురించి ఆలోచించడం కష్టమౌతుందని తెలుస్తుంది. కీర్తనకర్త “ఇంటిమీద ఒంటిగా నున్న పిచ్చుకవలె,” అంటే కష్టాలు-కన్నీళ్లు తప్ప ఇంకే తోడూ లేని ఒంటరిపక్షిలా ఉన్నట్లు భావించాడు. (కీర్త. 102:7) మీకెప్పుడైనా అలా అనిపిస్తే, కీర్తనకర్తలాగే యెహోవా ముందు మీ హృదయాన్ని కుమ్మరించండి. శ్రమపడుతున్న మీరు చేసే ప్రార్థనలు ప్రతికూల ఆలోచనలతో పోరాడేందుకు మీకు సహాయం చేస్తాయి. యెహోవా “దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనవైపు తిరిగియున్నాడు” అని బైబిలు భరోసా ఇస్తుంది. (కీర్త. 102:17) ఆ భరోసాను నమ్మండి.

21. ప్రతికూల ఆలోచనలతో పోరాడే ఓ వ్యక్తి మరింత సానుకూల దృక్పథాన్ని ఎలా అలవర్చుకోవచ్చు?

21 మరింత సానుకూల దృక్పథాన్ని ఎలా అలవర్చుకోవచ్చో కూడా 102వ కీర్తన చూపిస్తుంది. కీర్తనకర్త తన అవధానాన్ని యెహోవాతో తనకున్న సంబంధంపై నిలపడం ద్వారా సానుకూలంగా ఉండడం నేర్చుకున్నాడు. (కీర్త. 102:12, 27) కష్టాలు అనుభవించే తన ప్రజలకు యెహోవా ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడనే విషయం తెలుసుకుని కీర్తనకర్త ఓదార్పు పొందాడు. కాబట్టి మీరు కోరుకున్నంతగా యెహోవా సేవ చేయకుండా ప్రతికూల భావాలు అడ్డుపడుతుంటే, ఆ విషయం గురించి ప్రార్థించండి. మీ కష్టాల నుండి కాస్త ఉపశమనం పొందాలని మాత్రమే కాదుగానీ, ‘యెహోవా నామ ఘనత ప్రకటించబడాలి’ అని కూడా ఆయనను వేడుకోండి.—కీర్త. 102:19, 20.

22. మనలో ప్రతీ ఒక్కరం యెహోవాను ఎలా సంతోషపెట్టవచ్చు?

22 అవును, మనం విశ్వాసంలో ఉన్నామనీ యెహోవా దృష్టిలో విలువైనవాళ్లమనీ మనకు మనం నిర్ధారించుకునేందుకు బైబిలు సహాయం చేస్తుంది. ఇప్పుడున్న దుష్టలోకంలో ప్రతికూల ఆలోచనలను లేదా నిరుత్సాహాన్ని పూర్తిగా తీసేసుకోవడం సాధ్యం కాదు. అయినప్పటికీ, మనలో ప్రతీ ఒక్కరం యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగితే ఆయనను సంతోషపెట్టవచ్చు, రక్షణ పొందవచ్చు.—మత్త. 24:13.