కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబ ఆరాధన—మరింత ఆహ్లాదకరంగా చేసుకోగలరా?

కుటుంబ ఆరాధన—మరింత ఆహ్లాదకరంగా చేసుకోగలరా?

“కుటుంబ ఆరాధనలో మేమెంతగా మునిగిపోతామంటే, నేను గనుక ఆపకపోతే తరచూ అర్థరాత్రి వరకు చర్చించుకుంటూనే ఉంటాం” అని బ్రెజిల్‌లోని ఓ తండ్రి అంటున్నాడు. ‘మావాడు అసలు టైమ్‌ గమనించడేమో అనిపిస్తుంది, ఎంతసేపు చేసినా ఇంకాసేపు చేద్దామంటాడు’ అని తన పదేళ్ల కొడుకు గురించి జపాన్‌లోని ఓ తండ్రి సరదాగా చెబుతున్నాడు. ఎందుకో వివరిస్తూ ఆయనిలా అంటున్నాడు, ‘కుటుంబ ఆరాధనంటే వాడికి చాలా ఇష్టం, అది వాడికి సంతోషాన్ని ఇస్తుంది.’

అయితే, కొంతమంది పిల్లల్లో ఆ ఉత్సాహం కనిపించదు, నిజం చెప్పాలంటే మరికొందరు పిల్లలు కుటుంబ ఆరాధనను అంతగా ఇష్టపడరు. కారణం ఏమైవుంటుంది? “యెహోవా ఆరాధన బోరు కొట్టకూడదు” అని టోగో దేశానికి చెందిన ఓ తండ్రి వివరిస్తున్నాడు. ఒకవేళ అలా బోరు కొడుతుందంటే, కుటుంబ ఆరాధనను జరుపుకునే పద్ధతుల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందేమో ఆలోచించాలి. విశ్రాంతి దినం గురించి యెషయా వర్ణించినట్లు, తమ కుటుంబ ఆరాధనను ‘మనోహరంగా’ చేసుకోవచ్చని చాలా కుటుంబాలు తెలుసుకున్నాయి.—యెష. 58:13, 14.

కుటుంబ ఆరాధన సరదాగా ఉన్నప్పుడే, కుటుంబంలోని వాళ్లంతా ఆనందంగా పాల్గొంటారని చాలామంది క్రైస్తవ తండ్రులు గమనించారు. తమ కుటుంబ ఆరాధన, ఓ అధ్యయనంలా కాకుండా, కుటుంబమంతా కలిసి సరదాగా మాట్లాడుకుంటున్నట్లుగా ఉంటుందని ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్న రాల్ఫ్‌ అనే సహోదరుడు చెబుతున్నాడు. అయితే, చర్చించే విషయాలపై ప్రతీ ఒక్కరు ఆసక్తిని, అవధానాన్ని నిలిపేలా నిర్వహించడం కొన్నిసార్లు కష్టమే. ఒక తల్లి ఇలా ఒప్పుకుంటుంది: “మా కుటుంబ ఆరాధనను చాలా ఆహ్లాదకరంగా చేయాలనుకుంటాను, కానీ అన్నిసార్లూ అలా చేయడానికి నాకు ఓపిక ఉండదు.” మరి మీ కుటుంబ ఆరాధనను ఆహ్లాదకరంగా ఎలా చేసుకోవచ్చు?

అవసరాలకు తగ్గట్లుగా, వైవిధ్యంగా

కుటుంబ ఆరాధన అవసరాలకు తగ్గట్లుగా ఉండాలని జర్మనీకి చెందిన ఇద్దరు పిల్లల తండ్రి అంటున్నాడు. ఇద్దరు పిల్లలున్న నటాల్యా ఇలా చెబుతుంది: “మా కుటుంబ ఆరాధనకు సంబంధించిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం, వైవిధ్యం, వైవిధ్యం, వైవిధ్యం.” చాలా కుటుంబాలు తమ కుటుంబ ఆరాధనను కొన్ని భాగాలుగా విభజించుకుంటాయి. “అది అధ్యయనాన్ని మరింత ఉత్సాహవంతంగా మార్చి, ఇంట్లోని ప్రతీ ఒక్కరు పాల్గొనేలా చేస్తుంది” అని బ్రెజిల్‌లోని ఇద్దరు యౌవనుల తండ్రియైన క్లేటాన్‌ చెబుతున్నాడు. పిల్లల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రతీ పిల్లవాడి అవసరాల మీద తల్లిదండ్రులు మనసు పెట్టాలంటే అలా సమయాన్ని విభజించడం మంచిది. తల్లిదండ్రులు కుటుంబంలోని ప్రతీ ఒక్కరి అవసరాల గురించి చర్చించవచ్చు, అలాగే వాళ్ల కోసం ఏ సమాచారాన్ని, ఏ రూపంలో చర్చించాలో కూడా నిర్ణయించుకోవచ్చు.

వైవిధ్యం కోసం కొన్ని కుటుంబాలు ఏమి చేస్తున్నాయి? కొంతమంది యెహోవాకు స్తుతిగీతాలు పాడి కుటుంబ ఆరాధన మొదలుపెడతారు. “అది అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంతోపాటు, చర్చించే సమాచారం కోసం మనసుల్ని సిద్ధం చేస్తుంది” అని మెక్సికోకు చెందిన క్వాన్‌ వివరిస్తున్నాడు. ఆయన కుటుంబ సభ్యులు, ఆ రోజు చర్చించే సమాచారానికి సరిపోయే పాటలు ఎంపిక చేసుకుంటారు.

శ్రీలంక

చాలా కుటుంబాల్లో, అందరూ కలిసి బైబిల్లోని ఓ భాగం చదువుతారు. వైవిధ్యం కోసం, ఆ భాగంలోని ఒక్కొక్క పాత్రను ఒక్కొక్కరు చదువుతారు. “అలా చదవడం మొదట్లో కొంచెం వింతగా అనిపించేది” అని జపాన్‌లోని ఓ తండ్రి ఒప్పుకుంటున్నాడు. అయితే వాళ్ల పిల్లలు మాత్రం, అమ్మానాన్నలు తమతో కలిసి అలా చేస్తున్నందుకు చాలా సంతోషించారు. కొన్ని కుటుంబాలైతే, బైబిలు కథలను నటిస్తాయి కూడా. “తల్లిదండ్రులమైన మేము ఓ బైబిలు వృత్తాంతంలో గమనించలేకపోయిన విషయాల్ని చాలాసార్లు మా పిల్లలు గమనిస్తారు” అని దక్షిణ ఆఫ్రికాలోని ఇద్దరు కొడుకుల తండ్రి రాజర్‌ అంటున్నాడు.

దక్షిణ ఆఫ్రికా

కుటుంబ ఆరాధనను వైవిధ్యంగా చేసుకునే మరో మార్గం, నోవహు ఓడ లేదా సొలొమోను దేవాలయం వంటి ప్రాజెక్టులు తయారుచేయడం. అలాంటి ప్రాజెక్టుల కోసం పరిశోధన చేయడం ఎంతో ఉత్తేజాన్నిస్తుంది. ఒకానొక ఆసియా దేశంలోని ఓ కుటుంబంలో ఉన్న ఐదేళ్ల పాప అమ్మానాన్నలతో, నానమ్మతో కలిసి ఓ ప్రాజెక్టు తయారుచేసింది. పౌలు చేసిన మిషనరీ యాత్రల ఆధారంగా తమ ఇంటి హాలులో అట్ట మీద ఓ ఆటను ఆమె తయారుచేసింది. మరికొన్ని కుటుంబాలు, నిర్గమకాండములోని వృత్తాంతాల ఆధారంగా అలాంటి సరదా ఆటలు తయారుచేశాయి. వైవిధ్యం “మా కుటుంబ ఆరాధనకు, ఇంకా చెప్పాలంటే మా కుటుంబానికే కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది” అని టోగోకు చెందిన 19 ఏళ్ల డానల్డ్‌ అంటున్నాడు. మీ కుటుంబ ఆరాధనను మరింత ఆహ్లాదకరంగా చేసే ఏదైనా ప్రాజెక్టును మీరూ చేయగలరా?

అమెరికా

సిద్ధపడడం తప్పనిసరి

కుటుంబ ఆరాధనను అవసరాలకు తగ్గట్లుగా, వైవిధ్యంగా చేసుకోవడం వల్ల అది ఆసక్తికరంగా తయారైనా, దానివల్ల నిజంగా ఉపదేశం పొందాలంటే కుటుంబంలోని ప్రతీ ఒక్కరు సిద్ధపడాలి. కొన్నిసార్లు పిల్లలు అలసిపోతుంటారు, కాబట్టి ఏ రకమైన సమాచారాన్ని చర్చించాలో కుటుంబ శిరస్సులు ముందే ఆలోచించి, చక్కగా సిద్ధపడాలి. ‘నేను ముందుగానే సిద్ధపడినప్పుడు, మా ఇంట్లోని అందరూ అధ్యయనం వల్ల ఎంతో ప్రయోజనం పొందుతున్నారు’ అని ఓ తండ్రి చెబుతున్నాడు. జర్మనీలోని ఒక తండ్రి, రాబోయే వారాల్లో తమ కుటుంబ ఆరాధనలో చర్చించబోయే అంశాల్ని తన పిల్లలకు ముందే చెబుతాడు. బెనిన్‌లోని ఓ కుటుంబ శిరస్సు, సంస్థ తయారుచేసిన డీవీడీలను కుటుంబ ఆరాధనలో చూపించాలనుకున్నప్పుడు, వాటికి సంబంధించిన ప్రశ్నలను 13 ఏళ్ల లోపున్న తన ఆరుగురు పిల్లలకు ముందే ఇస్తాడు. నిస్సందేహంగా, సిద్ధపాటు కుటుంబ ఆరాధనా నాణ్యతను మరింత పెంచుతుంది.

కుటుంబ ఆరాధనలో ఏయే విషయాల్ని చర్చించబోతున్నారో కుటుంబ సభ్యులకు ముందే తెలిస్తే, వాళ్లు వారమంతా వాటి గురించి మాట్లాడుకుంటూ, ఉత్సాహాన్ని పెంచుకోగలుగుతారు. కుటుంబంలోని అందరికీ ఏదోక నియామకం ఉంటే, ప్రతి ఒక్కరూ ఇది నా కుటుంబ ఆరాధనని భావిస్తారు.

క్రమంగా చేయడానికి కృషి చేయండి

కుటుంబ ఆరాధనను క్రమంగా జరుపుకోవడం చాలా కుటుంబాలకు పెద్ద సమస్యగా ఉంది. ఎందుకు?

చాలామంది తండ్రులు తమ కుటుంబ కనీస అవసరాలు తీర్చడానికే రోజుకు ఎన్నో గంటలు కష్టపడుతున్నారు. ఉదాహరణకు, మెక్సికోలోని ఓ తండ్రి పొద్దున ఆరింటికి పనికెళ్తే, రాత్రి ఎనిమిదికి గానీ ఇంటికి చేరుకోడు. అంతేకాక, అప్పుడప్పుడు ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం వల్ల కుటుంబ ఆరాధన చేసుకునే రోజులో, వేళల్లో మార్పు చేసుకోవాల్సిరావచ్చు.

ఏదేమైనా, కుటుంబ ఆరాధనను క్రమం తప్పకుండా చేసుకోవాలనే దృఢ సంకల్పం మనకు ఉండాలి. కుటుంబ ఆరాధన తమకు ఎంత ప్రాముఖ్యమైనదో, టోగోలోని 11 ఏళ్ల లోవస్‌ ఇలా చెబుతుంది: “కొన్నిసార్లు పనులవల్ల మేము సాయంత్రం ఆలస్యంగా కుటుంబ ఆరాధనను మొదలుపెట్టాల్సి వచ్చినా, క్రమం తప్పకుండా చేసుకుంటాం.” కొంతమంది, కుటుంబ ఆరాధనను వారం ఆరంభంలోనే చేసుకోవాలనుకుంటారు. ఎందుకు? ఏదైనా అవాంతరం వల్ల కుటుంబ ఆరాధనను అనుకున్న రోజున జరుపుకోలేకపోతే, అదే వారం మరో రోజున వాళ్లు దాన్ని జరుపుకుంటారు.

“కుటుంబ ఆరాధన” అనే పేరు చూపిస్తున్నట్లుగా, అది యెహోవాకు మనం చేసే ఆరాధనలో భాగం. కాబట్టి, యెహోవాకు ప్రతీవారం ‘తమ పెదవుల నుండి స్తుతిని సమర్పించే’ అవకాశం మీ కుటుంబంలోని ప్రతీ ఒక్కరికి ఇవ్వండి. (హోషే. 14:2, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) కుటుంబ ఆరాధనా సమయం మీ ఇంటిల్లిపాదికీ ఆనందాన్ని పంచాలి, ఎందుకంటే “యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు.”—నెహె. 8:9, 10.