కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ మధ్యవున్న వృద్ధులను ఘనపర్చండి

మీ మధ్యవున్న వృద్ధులను ఘనపర్చండి

‘తల నెరసినవాని ఎదుట లేచి, ముసలివాని ముఖమును ఘనపరచుడి.’—లేవీ. 19:32.

1. మనుషుల పరిస్థితి ఎలా ఉంది?

 మనుషులు వృద్ధాప్యం వల్ల బాధలుపడాలని యెహోవా దేవుడు ఎప్పుడూ కోరుకోలేదు. మనుషులందరూ అందమైన తోటలాంటి భూమ్మీద పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే ఆయన కోరుకున్నాడు. కానీ ప్రస్తుతం, ‘సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచున్నది.’ (రోమా. 8:22) పాపం వల్ల మనుషులకు తగులుతున్న ఇలాంటి గాయాలను చూసినప్పుడు దేవుడు ఎలా భావిస్తాడని మీరనుకుంటున్నారు? ప్రస్తుతం ఎందరో వృద్ధులు సరిగ్గా సహాయం అవసరమైన వయసులోనే నిర్లక్ష్యానికి గురౌతున్నారు.—కీర్త. 39:5; 2 తిమో. 3:3.

2. క్రైస్తవులు వయసుమళ్లిన వాళ్లను ఎందుకు ప్రత్యేకంగా చూసుకుంటారు?

2 యెహోవా ప్రజలు, తమ సంఘాల్లోవున్న పెద్దవయసు వాళ్లకు ఎంతో విలువిస్తారు. మనం, వాళ్ల అనుభవం నుండి ప్రయోజనం పొందుతూ, వాళ్ల విశ్వాసాన్ని స్ఫూర్తిగా తీసుకుంటాం. సంఘంలోని అలాంటి ప్రియమైన వృద్ధులతో బహుశా మనలో చాలామందికి బంధుత్వం ఉండివుంటుంది. అయితే అలాంటి బంధుత్వం ఉన్నా లేకపోయినా, మనం వాళ్ల బాగోగులు శ్రద్ధగా చూసుకుంటాం. (గల. 6:10; 1 పేతు. 1:22) వయసుమళ్లిన వాళ్లను దేవుడు ఎలా చూస్తాడో తెలుసుకుంటే మనం ప్రయోజనం పొందుతాం. దానితోపాటు, ప్రియమైన ఆ వృద్ధుల విషయంలో వాళ్ల కుటుంబ సభ్యులకు, సంఘానికి ఉన్న బాధ్యతల గురించి ఇప్పుడు చూద్దాం.

“నన్ను విడనాడకుము”

3, 4. (ఎ) కీర్తనకర్త, 71వ కీర్తనలో యెహోవాకు ఏ ప్రాముఖ్యమైన విన్నపం చేశాడు? (బి) సంఘంలోని వయసుపైబడిన వాళ్లు దేవుణ్ణి ఏమని వేడుకోవచ్చు?

3 “వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము” అని కీర్తన 71:9వ వచనంలో కీర్తనకర్త దేవుణ్ణి వేడుకున్నాడు. ఈ కీర్తన, “దావీదు రచించినది” అనే పైవిలాసమున్న 70వ కీర్తనకు కొనసాగింపు అయ్యుండొచ్చు. కాబట్టి, కీర్తన 71:9⁠లో మనం చదివిన విన్నపాన్ని దావీదే చేసివుంటాడు. దావీదు జీవితాంతం దేవుణ్ణి సేవిస్తూనే ఉన్నాడు, యెహోవా కూడా ఆయనను ఎంతో శక్తివంతమైన విధానాల్లో ఉపయోగించుకున్నాడు. (1 సమూ. 17:33-37, 50; 1 రాజు. 2:1-3, 10) అయినప్పటికీ వృద్ధాప్యం వచ్చేసరికి, తనపట్ల శ్రద్ధ చూపించేలా యెహోవాను వేడుకోవాలని దావీదుకు అనిపించింది.—కీర్తన 71:17, 18 చదవండి.

4 ఈ రోజుల్లో దావీదులాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లు వయసు పైబడుతున్నా, ‘దుర్దినాల్లో’ ఉన్నా, దేవుని సేవలో కొనసాగడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. (ప్రసం. 12:1-7) వాళ్లలో చాలామంది, పరిచర్యతో సహా జీవితంలోని మిగతా విషయాల్లో ఒకప్పుడు చేసినంత చేయలేకపోతుండవచ్చు. అయితే వాళ్లు కూడా యెహోవా చల్లని చూపు కోసం, ఆయన సంరక్షణ కోసం వేడుకోవచ్చు. దేవుడు తమ ప్రార్థనలకు తప్పకుండా జవాబిస్తాడని, అలాంటి నమ్మకస్థులైన వృద్ధులు నిబ్బరంతో ఉండవచ్చు. ఎంతైనా వాళ్ల ప్రార్థనలు, దైవ ప్రేరణతో దావీదు చేసిన సమంజసమైన విన్నపాలనే ప్రతిధ్వనిస్తాయి.

5. తనకు నమ్మకంగా సేవ చేస్తున్న వృద్ధులను యెహోవా ఎలా చూస్తాడు?

5 నమ్మకంగా సేవ చేస్తున్న వృద్ధులు యెహోవాకు ఎంతో అమూల్యమైనవాళ్లు. వాళ్లను తన సేవకులు గౌరవించాలని ఆయన కోరుకుంటున్నాడు. (కీర్త. 22:24-26; సామె. 16:31; 20:29) “తల నెరసినవానియెదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను; నేను యెహోవాను” అని లేవీయకాండము 19:32⁠లో యెహోవా చెబుతున్నాడు. ఆ కాలంలో, సమాజంలోని వృద్ధులను గౌరవించే బాధ్యత చాలా ప్రాముఖ్యమైనది, అది ఇప్పటికీ ప్రాముఖ్యమైనదే. అయితే, వాళ్ల బాగోగులు చూసుకునే విషయంలో బైబిలు ఏమి చెబుతుంది? ఆ బాధ్యత ఎవరిది?

కుటుంబానికున్న బాధ్యత

6. తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకునే విషయంలో యేసు మనకెలా ఆదర్శం?

6 “నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము” అని దేవుని వాక్యం చెబుతోంది. (నిర్గ. 20:12; ఎఫె. 6:2) తల్లిదండ్రులను చూసుకోవడానికి ఇష్టపడని శాస్త్రులను, పరిసయ్యులను గద్దిస్తున్నప్పుడు యేసు ఈ ఆజ్ఞనే ఎత్తి చెప్పాడు. (మార్కు 7:5, 10-13) ఈ విషయంలో స్వయాన యేసే మంచి ఆదర్శం. ఆయన మ్రాను మీద ప్రాణాలు విడిచే ముందు, తన తల్లిని చూసుకోమని ప్రియ శిష్యుడైన యోహానుకు చెప్పాడు. బహుశా అప్పటికే మరియ భర్త చనిపోయి ఉండవచ్చు.—యోహా. 19:26, 27.

7. (ఎ) తల్లిదండ్రుల బాగోగులు చూసుకునే విషయంలో పౌలు ఏ సూత్రం ఇచ్చాడు? (బి) పౌలు ఏ సందర్భంలో ఈ మాటలు రాశాడు?

7 విశ్వాసులు తమ కుటుంబ సభ్యుల బాగోగులు పట్టించుకోవాలని అపొస్తలుడైన పౌలు దైవ ప్రేరణతో రాశాడు. (1 తిమోతి 5:4, 8, 16 చదవండి.) తిమోతికి పౌలు ఆ మాటలు రాసిన సందర్భాన్ని గమనించండి. సంఘం నుండి ఆర్థిక మద్దతు పొందడానికి ఎవరెవరు అర్హులో పౌలు ఆ సందర్భంలో వివరించాడు. వయసుమళ్లిన విధవరాళ్లను చూసుకునే బాధ్యత ముఖ్యంగా విశ్వాసంలోవున్న వాళ్ల పిల్లలు, మనుమలు, బంధువులపైనే ఉంటుందని ఆయన స్పష్టంగా చెప్పాడు. దానివల్ల సంఘం మీద అదనపు ఆర్థిక భారం పడదు. క్రైస్తవులు ఈ రోజుల్లో కూడా, అవసరంలోవున్న తమ బంధువులకు సహాయం చేయడం ద్వారా ‘భక్తి కనబరుస్తారు.’

8. వయసుమళ్లిన తల్లిదండ్రులను ఖచ్చితంగా ఎలా చూసుకోవాలో బైబిలు ఎందుకు చెప్పడం లేదు?

8 ఒక్కమాటలో చెప్పాలంటే, తమ తల్లిదండ్రుల భౌతిక అవసరాలు తీరేలా చూసుకోవాల్సిన బాధ్యత, ఎదిగిన క్రైస్తవ పిల్లలపై ఉంది. పౌలు ఇక్కడ ‘విశ్వాసంలో ఉన్న బంధువుల’ గురించే మాట్లాడుతున్నా, విశ్వాసులుకాని తల్లిదండ్రులను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఏ రెండు కుటుంబాల పరిస్థితీ ఒకేలా ఉండదు కాబట్టి, తమవాళ్ల బాగోగులు చూసుకునే విషయంలో ఏమి చేయాలో ప్రతీ కుటుంబం సొంతగా నిర్ణయించుకోవాలి. అందరి అవసరాలు, మనస్తత్వం, ఆరోగ్యం ఒకేలా ఉండవు. కొందరికి ఎక్కువమంది పిల్లలు ఉంటే, మరికొందరికి ఒక్కరే ఉంటారు. కొందరికి ప్రభుత్వ సహాయం అందుబాటులో ఉంటుంది, మరికొందరికి ఉండదు. అంతేకాదు వాళ్ల ఇష్టాయిష్టాల్లో కూడా తేడాలుంటాయి. అందుకే, వయసుమళ్లిన బంధువుల విషయంలో ఆయా కుటుంబాలు శ్రద్ధ తీసుకునే విధానాన్ని ఇతరులు తప్పు పట్టడం ప్రేమను, వివేకాన్ని చూపిస్తున్నట్లు అనిపించుకోదు. ఏదేమైనా, యెహోవా ప్రాచీన కాలం నుండి చేస్తున్నట్లే, లేఖనాధారంగా తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని ఆశీర్వదిస్తాడు, సఫలం చేస్తాడు.—సంఖ్యా. 11:23.

9-11. (ఎ) కొంతమందికి ఎలాంటి కష్టతరమైన పరిస్థితి ఎదురుకావచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) ఎదిగిన పిల్లలు పూర్తికాల పరిచర్యను వదులుకోవడానికి ఎందుకు తొందరపడకూడదు? ఉదాహరణ చెప్పండి.

9 పిల్లలు వృద్ధులైన తమ తల్లిదండ్రులకు దూరంగా జీవిస్తున్నప్పుడు, వాళ్లకు అవసరమైన సహాయం అందించడం కాస్త కష్టమే. జారిపడి ఎముక విరిగిపోవడంవల్ల లేదా మరేదైనా కారణం వల్ల ఆ తల్లిదండ్రుల ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణిస్తే వాళ్లను వెంటనే సందర్శించాల్సి రావచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు, కొంతకాలం లేదా చాలాకాలం వాళ్లకు తోడుగా ఉండాల్సి రావచ్చు. a

10 ప్రత్యేకించి తల్లిదండ్రులకు దూరంగా, మరో ప్రాంతంలో సేవ చేస్తున్న పూర్తికాల పరిచారకులకు, ఈ విషయంలో ఓ నిర్ణయానికి రావడం మరింత కష్టంగా ఉంటుంది. బెతెల్‌సభ్యులుగా, మిషనరీలుగా, ప్రయాణ పర్యవేక్షకులుగా సేవచేసే వాళ్లు, తమ నియామకాన్ని అమూల్యంగా, యెహోవా ఇచ్చిన దీవెనగా భావిస్తారు. అలాంటి వాళ్లు కూడా, తమ తల్లిదండ్రులు అనారోగ్యం పాలైనప్పుడు ‘మా నియామకాన్ని విడిచిపెట్టి, ఇంటికి వెళ్లి మా అమ్మానాన్నల్ని చూసుకోవాలి’ అనుకుంటారు. అయితే, ‘తమ తల్లిదండ్రుల అవసరాలు తీర్చేది, వాళ్లు ఆశించేది నిజంగా అదేనా?’ అని వాళ్లు ప్రార్థనాపూర్వకంగా ఆలోచించడం మంచిది. ఎవరైనాసరే, తొందరపడి సేవావకాశాల్ని వదులుకోకూడదు, చాలా సందర్భాల్లో అలాంటి అవసరం రాకపోవచ్చు. ఆ అనారోగ్యం కొద్దికాలంలోనే నయమయ్యే అవకాశం ఉందా? ఆ సమయంలో వాళ్లున్న సంఘంలోని సహోదరులు ఎవరైనా సహాయం చేయడానికి ఇష్టపడతారా?—సామె. 21:5.

11 తల్లిదండ్రులకు దూరంగా వేరే ప్రాంతంలో సేవచేసిన ఇద్దరు అన్నదమ్ముల ఉదాహరణను పరిశీలించండి. వాళ్లలో తమ్ముడు దక్షిణ అమెరికాలో మిషనరీగా సేవ చేసేవాడు, అన్న న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న ప్రధాన కార్యాలయంలో ఉండేవాడు. అయితే జపాన్‌లో నివసిస్తున్న వీళ్ల వృద్ధ తల్లిదండ్రులకు ఓ సందర్భంలో సహాయం అవసరమైంది. కొడుకులు తమ భార్యలతో సహా, తమ తల్లిదండ్రులను పరామర్శించడానికి వెళ్లారు. మిషనరీలుగా సేవ చేస్తున్న కొడుకూ కోడలూ తమ సేవను ఆపేసి తల్లిదండ్రులను చూసుకోవాలని తీవ్రంగా ఆలోచించసాగారు. అయితే ఆ సమయంలో తల్లిదండ్రుల సంఘంలోని పెద్దలసభ సమన్వయకర్త నుండి వీళ్లకు ఫోన్‌ వచ్చింది. ఆ సంఘంలోని పెద్దలు ఈ సమస్య గురించి చర్చించుకుని, ఈ జంట వీలైనంత ఎక్కువకాలం తమ మిషనరీ సేవలో కొనసాగేలా సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆ పెద్దలు ఈ దంపతుల సేవను మెచ్చుకుంటూ, వాళ్ల తల్లిదండ్రులను చూసుకోవడానికి తాము చేయగలిగినదంతా చేయాలని నిర్ణయించుకున్నారు. సంఘం ప్రేమతో ఇచ్చిన ఆ చేయూతకు ఆ కుటుంబంలోని వాళ్లందరూ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలిపారు.

12. తల్లిదండ్రులను చూసుకునే విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు క్రైస్తవ కుటుంబాలు దేన్ని మనసులో ఉంచుకోవాలి?

12 వయసుపైబడిన తల్లిదండ్రులను చూసుకోవడానికి ఓ క్రైస్తవ కుటుంబం ఏ నిర్ణయం తీసుకున్నా, దానివల్ల దేవుని నామానికి ఘనత వచ్చేలా వాళ్లందరూ చూసుకోవాలి. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ, యేసు కాలంనాటి మతనాయకుల్లా ఉండకూడదు. (మత్త. 15:3-6) మన నిర్ణయాలు దేవునికీ సంఘానికీ మంచి పేరు తేవాలనే కోరుకుంటాం.—2 కొరిం. 6:3.

సంఘానికున్న బాధ్యత

13, 14. వయసుపైబడిన సహోదరసహోదరీలకు సహాయం చేయాల్సిన బాధ్యత సంఘాలకు ఉందని లేఖనాలు ఎలా చూపిస్తున్నాయి?

13 తల్లిదండ్రులను చూసుకునే విషయంలో, పూర్తికాల సేవకులందరికీ పైన చెప్పుకున్నలాంటి సహాయం అందకపోవచ్చు. అయితే, నమ్మకంగా సేవచేసిన వృద్ధ సహోదరసహోదరీలకు సంఘాలు సహాయం చేయాలని మొదటి శతాబ్దంలో జరిగిన ఓ సంఘటన చూపిస్తుంది. ఆ సమయంలో, యెరూషలేము సంఘంలో “ఎవనికిని కొదువలేకపోయెను” అని బైబిలు చెబుతోంది. అంటే అప్పుడున్న వాళ్లంతా ధనవంతులని కాదు. వాళ్లలో కొందరి ఆర్థిక స్థితి అంతంత మాత్రంగానే ఉంది, కాని “వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి.” (అపొ. 4:34, 35) కొంతకాలానికి, అక్కడొక సమస్య తలెత్తింది. ఆహారం పంచిపెట్టే విషయంలో కొంతమంది “విధవరాండ్రను చిన్నచూపు” చూస్తున్నారని అపొస్తలులకు తెలిసింది. అప్పుడు వాళ్లు, విధవరాళ్లందరిని సమానంగా చూస్తూ వాళ్లకు ఆహారం పంచిపెట్టేందుకు అర్హులైన కొంతమంది పురుషులను నియమించమని సహోదరులకు చెప్పారు. (అపొ. 6:1-5) సా.శ. 33 పెంతెకొస్తు రోజున, వేర్వేరు దేశాల నుండి వచ్చిన చాలామంది, క్రైస్తవులుగా మారి తమ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి యెరూషలేములోనే ఉండిపోయారు. అలాంటివాళ్లకు ఆహారం అందించడం తాత్కాలికంగా చేసిన ఏర్పాటే అయినా, ఆ సందర్భంలో అపొస్తలులు వ్యవహరించిన తీరును చూస్తే అవసరంలో ఉన్నవాళ్లకు సంఘం సహాయం చేయవచ్చని అర్థమౌతుంది.

14 ముందు పేరాల్లో చూసినట్లుగా, సంఘం నుండి వస్తుపరమైన సహాయం అందుకునే క్రైస్తవ విధవరాళ్లకు ఉండాల్సిన అర్హతలను తిమోతికి పౌలు సూచించాడు. (1 తిమో. 5:3-16) అనాథలను, విధవరాళ్లను, శ్రమలూ ఇబ్బందులూ పడుతున్నవాళ్లను చూసుకోవాల్సిన బాధ్యత క్రైస్తవులకు ఉందని యాకోబు కూడా అన్నాడు. (యాకో. 1:27; 2:15-17) అపొస్తలుడైన యోహాను ఇలా అడిగాడు: “ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?” (1 యోహా. 3:17) ఒక్కో క్రైస్తవునికి అలాంటి బాధ్యత ఉందంటే, మొత్తం సంఘానికి ఉండదా?

ప్రమాదం జరిగితే, సంఘం ఎలా సహాయం చేయవచ్చు? (15, 16 పేరాలు చూడండి)

15. వయసుపైబడిన సహోదరసహోదరీలకు చేసే సహాయం పరిస్థితిని బట్టి ఎలా మారవచ్చు?

15 కొన్ని దేశాల్లోని ప్రభుత్వాలు, వృద్ధుల కోసం పింఛన్లను, సంక్షేమ కార్యక్రమాలను, ఇంటికి వచ్చి చూసుకునే సహాయకుల్ని ఏర్పాటు చేస్తాయి. (రోమా. 13:6) కానీ మిగతా ప్రాంతాల్లో అలాంటి సేవలు ఉండవు. కాబట్టి, వృద్ధాప్యంలో ఉన్న సహోదరసహోదరీలకు వాళ్ల బంధువులు, సంఘ సభ్యులు ఎంత మేరకు సహాయం అందించాలనేది పరిస్థితిని బట్టి మారుతుంది. విశ్వాసులైన పిల్లలు ఒకవేళ దూర ప్రాంతంలో జీవిస్తుంటే, తల్లిదండ్రులకు వాళ్లు చేయగల సహాయానికి పరిమితులు ఉంటాయి. అలాంటి పిల్లలు తమ తల్లిదండ్రుల సంఘ పెద్దలతో చర్చించి, తమ కుటుంబ పరిస్థితిని అందరికీ అర్థమయ్యేలా వివరించడం మంచిది. ఉదాహరణకు, అక్కడున్న ప్రభుత్వ లేదా సామాజిక సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకునేలా ఆ వృద్ధులకు ఆ సంఘ పెద్దలు సహాయం చేయవచ్చు. వృద్ధులు ప్రాముఖ్యమైన బిల్లులు చూసుకోకపోవడం, మందులు సరిగ్గా వేసుకోకపోవడం వంటివి జరుగుతుంటే పెద్దలు గమనించి, దూర ప్రాంతంలో ఉన్న పిల్లలకు ఎప్పటికప్పుడు తెలియజేయవచ్చు. మంచి మనసుతో, దయతో ఎప్పటికప్పుడు అలా సమాచారాన్ని తెలియజేయడం వల్ల పరిస్థితులు మరింత జటిలం కాకుండా చూసుకోవడానికి, చేతనైనంత సహాయం అందించడానికి వీలౌతుంది. ఇలా ఇరుగుపొరుగున ఉంటూ సహాయాన్ని, సలహాను అందించే సహోదరులు, దూరంలో ఉన్న పిల్లల “కళ్లలా” పనిచేస్తూ, ఆ కుటుంబ సభ్యుల ఆందోళనను తగ్గించవచ్చు.

16. కొంతమంది క్రైస్తవులు సంఘంలోని వయసుమళ్లిన వాళ్లకు ఎలా సహాయం చేస్తారు?

16 ప్రియమైన వృద్ధుల మీదున్న ఆప్యాయత వల్ల వాళ్ల అవసరాలు తీర్చడానికి తమ సమయాన్ని, శక్తిని వెచ్చిస్తూ చేతనైన సహాయం చేస్తామంటూ కొందరు క్రైస్తవులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అలాంటి సహోదరులు, సంఘంలోని వృద్ధుల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించడానికి ప్రత్యేకంగా కృషిచేస్తారు. అలా స్వచ్ఛందంగా ముందుకొచ్చేవాళ్లు ఆ బాధ్యతల్ని సంఘంలోని ఇతరులతో పంచుకుంటూ, వంతులవారీగా వృద్ధుల బాగోగులు చూసుకుంటారు. పూర్తికాల పరిచర్యలో ఉండడానికి తమ పరిస్థితులు అనుకూలించవని అర్థం చేసుకున్న వాళ్లు, అలా సేవచేస్తున్న పిల్లల తల్లిదండ్రులకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారు. దానివల్ల ఆ పిల్లలు వీలైనంత ఎక్కువ కాలం పూర్తికాల సేవలో కొనసాగగలుగుతున్నారు. అలాంటి సహోదరులు ఎంత చక్కని స్ఫూర్తిని చూపిస్తున్నారు! మంచి మనసుతో అలా సహాయం చేసేవాళ్లు ఉన్నప్పటికీ, తల్లిదండ్రుల విషయంలో తాము చేయగలిగినదంతా చేయాల్సిన బాధ్యత పిల్లలపై ఎప్పుడూ ఉంటుంది.

బలపర్చే మాటలతో ఘనపర్చండి

17, 18. వృద్ధులకు సహాయం చేసే పని తేలికగా సాగిపోవాలంటే ఎలాంటి మనస్తత్వం ఉండాలి?

17 వయసు పైబడినవాళ్లు, వాళ్లను చూసుకునే ఇతరులు సానుకూల స్ఫూర్తిని చూపించడానికి శాయశక్తులా కృషి చేసినప్పుడు ఏదీ అంత కష్టంగా అనిపించదు. వృద్ధాప్యం కొంతమందిలో నిరాశానిస్పృహలను, కొన్నిసార్లు కృంగుదలను కూడా కలిగిస్తుంది. అందుకే, వయసుపైబడిన సహోదరసహోదరీలతో సమయం గడుపుతున్నప్పుడు వాళ్లను బలపర్చేలా మాట్లాడుతూ ఘనపర్చడానికి ప్రత్యేకంగా కృషి చేయాల్సిరావచ్చు. దేవుని సేవలో మంచి పేరు సంపాదించుకున్న వీళ్లు ఎప్పుడూ అభినందనీయులే. తన సేవ కోసం అలాంటి వాళ్లు చేసిన త్యాగాలను యెహోవా మర్చిపోడు, తోటి క్రైస్తవులు కూడా మర్చిపోరు.—మలాకీ 3:16; హెబ్రీయులు 6:10 చదవండి.

18 అలాగే వృద్ధులు, వాళ్లను చూసుకునేవాళ్లు అప్పుడప్పుడు సరదాగా జోకులు వంటివి చెప్పుకున్నప్పుడు వాళ్ల రోజువారీ పనులు పెద్ద భారంగా అనిపించవు. (ప్రసం. 3:1, 4) సహాయం పొందుతున్న వృద్ధుల్లో చాలామంది, ఎదుటివాళ్ల నుండి మరీ ఎక్కువగా ఆశించకుండా జాగ్రత్తపడతారు. తాము ప్రేమగా ప్రవర్తిస్తే, తమతో మాట్లాడడానికి, బాగోగులు చూసుకోవడానికి సహోదరులు ఇష్టపడతారని వాళ్లు అర్థం చేసుకుంటారు. వృద్ధులను సందర్శించడానికి వెళ్లే చాలామంది, “ఆయనను ప్రోత్సహిద్దామని వెళ్లాను, కానీ నేనే ప్రోత్సాహం పొందాను” అని అనడం సర్వసాధారణం.—సామె. 15:13; 17:22.

19. వయసుతో సంబంధం లేకుండా, భవిష్యత్తు విషయంలో మనందరి ఆలోచనా ఎలా ఉండాలి?

19 అపరిపూర్ణత తీసుకొచ్చిన ఇబ్బందులతోపాటు ఏ కష్టం ఉండని రోజు కోసం మనందరం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాం. ఆ ఆశ నిజమయ్యే వరకూ దేవుని సేవకులు శాశ్వతమైన వాటి మీద మనసు లగ్నం చేయాలి. కృంగదీసే కష్టాలు, తీవ్రమైన శ్రమలు వంటి బలమైన అలల తాకిడిని తట్టుకోవాలంటే, దేవుని వాగ్దానాల మీద విశ్వాసమనే లంగరు అవసరమని మనకు తెలుసు. “మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు” అని చెప్పే ధైర్యాన్ని, ఆ విశ్వాసమే మనలో నింపుతుంది. (2 కొరిం. 4:16-18; హెబ్రీ. 6:18, 19) వృద్ధులను చూసుకునే విషయంలో, దేవుని వాగ్దానాల మీద బలమైన విశ్వాసంతో పాటు ఇంకా ఏమేమి అవసరం? తర్వాతి ఆర్టికల్‌లో కొన్ని చక్కని సలహాలు ఉన్నాయి.

a వయసుపైబడిన వాళ్ల బాగోగులు విషయంలో వాళ్లూ, వాళ్ల పిల్లలూ ఏమి చేయవచ్చో కొన్ని సలహాలు తర్వాతి ఆర్టికల్‌లో ఉన్నాయి.