కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు “అదృశ్యుడైనవానిని” చూస్తున్నారా?

మీరు “అదృశ్యుడైనవానిని” చూస్తున్నారా?

‘అతడు అదృశ్యుడైనవానిని చూస్తున్నట్లు స్థిరబుద్ధిగలవానిగా నడుచుకున్నాడు.’—హెబ్రీ. 11:27.

1, 2. (ఎ) మోషే ప్రమాదంలో చిక్కుకున్నట్లు ఎందుకు అనిపించింది? వివరించండి. (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) రాజాగ్రహానికి మోషే ఎందుకు భయపడలేదు?

 అప్పట్లో ఐగుప్తీయులకు ఫరో అంటే తిరుగులేని పాలకుడు, ప్రత్యక్ష దైవం. వాళ్ల దృష్టిలో ఆయన “జ్ఞానంలో, శక్తిలో ఇహలోక జీవులన్నిటికన్నా ఉన్నతమైనవాడు” అని వెన్‌ ఈజిప్ట్‌ రూల్డ్‌ ద ఈస్ట్‌ (ఇంగ్లీషు) అనే పుస్తకం చెబుతుంది. తమ పౌరుల్లో భయం పుట్టించడానికి, ఫరోలు పడగెత్తిన తాచుపాము ఆకారమున్న కిరీటాన్ని ధరించేవాళ్లు. అది, రాజు శత్రువులు తక్షణమే నామరూపాల్లేకుండా పోతారనే హెచ్చరికగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో, “నిన్ను ఫరో యొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెను” అని యెహోవా చెప్పినప్పుడు మోషేకు ఎలా అనిపించివుంటుందో ఒక్కసారి ఊహించుకోండి.—నిర్గ. 3:10.

2 మోషే ఐగుప్తుకు వెళ్లి, దేవుని సందేశాన్ని ప్రకటించి, ఫరో ఆగ్రహానికి గురయ్యాడు. తొమ్మిది తెగుళ్లు ఐగుప్తును దెబ్బతీసిన తర్వాత ఫరో, “నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువు” అని మోషేను హెచ్చరించాడు. (నిర్గ. 10:28) మోషే రాజ సన్నిధి నుండి వెళ్తూ, ఫరో మొదటి కొడుకు చనిపోతాడని ప్రవచించాడు. (నిర్గ. 11:4-8) మోషే ఆ తర్వాత, ఇశ్రాయేలీయుల్లోని ప్రతీ కుటుంబం మేకను లేదా పొట్టేలును చంపి, దాని రక్తాన్ని తమ ద్వారబంధాలపై చల్లాలని నిర్దేశించాడు. “రా” అనే ఐగుప్తీయుల దేవునికి పొట్టేలు పవిత్రమైనది. (నిర్గ. 12:6, 7) అప్పుడు ఫరో ఏమి చేశాడు? ఫరో స్పందన ఎలావున్నా మోషే మాత్రం అస్సలు భయపడలేదు. ఎందుకని? ఎందుకంటే మోషే విశ్వాసం బట్టి యెహోవాకు విధేయత చూపిస్తూ, “అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై, రాజాగ్రహమునకు” భయపడలేదు.—హెబ్రీయులు 11:27, 28 చదవండి.

3. “అదృశ్యుడైనవాని” మీద మోషే చూపిన విశ్వాసం గురించి మనం ఏమి పరిశీలిస్తాం?

3 యెహోవాను ‘చూస్తున్నంత’ బలమైన విశ్వాసం మీకుందా? (మత్త. 5:8) “అదృశ్యుడైనవానిని” ఒక నిజమైన వ్యక్తిలా చూడగలిగేలా మన విశ్వాసాన్ని ఎలా బలపర్చుకోవచ్చో మోషే జీవితాన్ని పరిశీలించి తెలుసుకుందాం. యెహోవా మీదున్న విశ్వాసం, ఆయనను మనుష్యుల భయం నుండి ఎలా కాపాడింది? దేవుని వాగ్దానాల మీద విశ్వాసం ఉందని ఆయన ఎలా చూపించాడు? ఆయన మీదకు, ఆయన ప్రజల మీదకు ఆపద ముంచుకొచ్చినప్పుడు, “అదృశ్యుడైనవానిని” చూడగలగడం వల్ల మోషే ఎలా బలం పొందాడు?

“రాజాగ్రహమునకు” భయడలేదు

4. ఫరో ముందు నిలబడ్డ మోషే పరిస్థితి కొందరికి ఎలా అనిపించివుండవచ్చు?

4 విశ్వాసం లేనివాళ్లకు, ఫరోతో మోషే ఏ విధంగానూ సరితూగలేడని అనిపించివుండవచ్చు. మోషే ప్రాణం, జీవితం, భవిష్యత్తు ఫరో గుప్పిట్లో ఉన్నాయని అనుకునివుండవచ్చు. అంతెందుకు, యెహోవాతో మాట్లాడుతూ స్వయంగా మోషే ఇలా అడిగాడు, “నేను ఫరో యొద్దకు వెళ్లుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులోనుండి తోడుకొని పోవుటకును ఎంతటివాడను?” (నిర్గ. 3:11) ఇదే ఐగుప్తు నుండి మోషే 40 ఏళ్ల క్రితం పారిపోయాడు. ‘ఐగుప్తుకు తిరిగివెళ్లడం, ఏరికోరి ఆ రాజు కోపానికి గురవ్వడం నిజంగా తెలివైన పనేనా?’ అని ఆయనకు అనిపించివుండవచ్చు.

5, 6. ఫరోకు కాకుండా యెహోవాకు భయపడేలా మోషేకు ఏది సహాయంచేసింది?

5 మోషే ఐగుప్తుకు వెళ్లేముందు, దేవుడు ఆయనకు ప్రాముఖ్యమైన సూత్రాన్ని నేర్పించాడు. ఆ సూత్రాన్నే మోషే ఆ తర్వాత యోబు పుస్తకంలో ఇలా పేర్కొన్నాడు, “యెహోవాయందలి భయభక్తులే జ్ఞానము.” (యోబు 28:28) అలాంటి భయాన్ని అలవర్చుకుని, జ్ఞానంతో నడుచుకోవడానికి మోషేకు యెహోవా దేవుడు ఎలా సహాయం చేశాడు? “మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగవానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డివానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా?” అని మోషేను అడుగుతూ, సర్వశక్తిమంతుడైన ఆయనకూ మనుష్యులకూ ఎంత తేడా ఉందో యెహోవా చూపించాడు.—నిర్గ. 4:11.

6 దేవుడు నేర్పించాలనుకున్న పాఠం ఏమిటి? మోషే భయపడాల్సిన అవసరం లేదు. ఆయనను పంపిస్తుంది యెహోవాయే కాబట్టి, ఫరోకు దేవుని సందేశం అందించడానికి అవసరమైనవన్నీ ఆయనే అనుగ్రహిస్తాడు. అంతేకాదు, ఫరో యెహోవాతో ఏ విధంగానూ సరితూగలేడు. దానికి తోడు, దేవుని సేవకులు ఐగుప్తు పాలకుల వల్ల ప్రమాదంలో పడడం ఇదేమీ మొదటిసారి కాదు. అబ్రాహామును, యోసేపును, చివరకు తనను కూడా గతంలో ఫరోల బారి నుండి యెహోవా కాపాడిన సందర్భాలు మోషే మదిలో మెదిలివుండవచ్చు. (ఆది. 12:17-19; 41:14, 39-41; నిర్గ. 1:22–2:10) మోషే, “అదృశ్యుడైన” యెహోవా మీదున్న విశ్వాసంతో ఫరో ముందు ధైర్యంగా నిలబడి యెహోవా ఆజ్ఞాపించిన ప్రతీ మాట పలికాడు.

7. యెహోవా మీదున్న విశ్వాసం ఓ సహోదరిని ఎలా కాపాడింది?

7 యెహోవా మీదున్న విశ్వాసం, మనుషుల భయానికి తలొగ్గకుండా ఎల్లా అనే సహోదరిని కాపాడింది. కే.జీ.బి. పోలీసులు, 1949⁠లో ఎస్తోనియా దేశంలో, ఎల్లాను అరెస్టు చేసి బట్టలు లేకుండా నిలబెట్టినప్పుడు, అక్కడున్న యువ పోలీస్‌ అధికారులు ఆమెను కొరకొరా చూశారు. “నేను అవమాన భారంతో కుమిలిపోయాను. అయితే, యెహోవాకు ప్రార్థించిన తర్వాత, నా మనసు కుదుటపడి, ప్రశాంతంగా అనిపించింది” అని ఆమె చెప్పింది. ఆ తర్వాత ఎల్లాను, మూడు రోజుల పాటు ఒంటరిగా ఓ గదిలో నిర్భందించారు. ఆ సంఘటన గురించి ఆమె ఇలా వివరించింది, “అక్కడి అధికారులు నా మీద ఇలా అరిచారు: ‘ఎస్తోనియాలో యెహోవా పేరే ఎప్పటికీ వినబడకుండా చేస్తాం! నువ్వు క్యాంప్‌కు, మిగతావాళ్లు సైబీరియాకు పోతారు.’ అంతేకాక ‘ఎక్కడున్నాడు, మీ యెహోవా?’ అంటూ ఎగతాళి కూడా చేశారు.” అప్పుడు ఎల్లా మనుషులకు భయపడిపోయిందా? లేక యెహోవా మీద నమ్మకం ఉంచిందా? విచారణ సమయంలో, తనను ఎగతాళి చేస్తున్నవాళ్లతో ఆమె ధైర్యంగా, “ఈ విషయం గురించి నేను బాగా ఆలోచించాను, దేవుని అనుగ్రహం కోల్పోయి స్వేచ్ఛగా జీవించడంకన్నా, ఆయనతో మంచి సంబంధాన్ని కాపాడుకుంటూ జైల్లో ఉండడానికే నేను ఇష్టపడతాను” అని చెప్పింది. ఆ సమయంలో ఎల్లాకు, తన కళ్ల ముందు నిలబడ్డ మనుష్యులు ఉన్నారనేది ఎంత నిజమో యెహోవా ఉన్నాడనేది కూడా అంతే నిజం. విశ్వాసం వల్ల ఆమె తన యథార్థతను కాపాడుకుంది.

8, 9. (ఎ) మనుషుల భయానికి విరుగుడు ఏమిటి? (బి) మీరు మనుషులకు భయపడుతుంటే, ఎవరి మీద మనసు నిలపాలి?

8 యెహోవా మీద విశ్వాసం, మీ భయాల్ని జయించడానికి తోడ్పడుతుంది. మీకు దేవుణ్ణి ఆరాధించే స్వేచ్ఛ లేకుండా చేయాలని అధికారంలో ఉన్నవాళ్లు ప్రయత్నించినప్పుడు మీ ప్రాణం, జీవితం, భవిష్యత్తు మనుషుల గుప్పిట్లో ఉన్నాయని అనిపించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో యెహోవా సేవను కొనసాగించి, అనవసరంగా అధికారులకు కోపం తెప్పించడం అంత తెలివైన పని కాదేమోనని కూడా మీకు అనిపించవచ్చు. అయితే ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి: మనుషుల భయానికి సరైన విరుగుడు దేవుని మీద విశ్వాసమే. (సామెతలు 29:25 చదవండి.) యెహోవా దేవుడు ఇలా అడుగుతున్నాడు, “చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు?”—యెష. 51:12, 13.

9 సర్వశక్తిమంతుడైన మీ తండ్రి మీద మనసు నిలపండి. అన్యాయస్థులైన పాలకుల చేతిలో నలిగిపోతున్న వాళ్ల బాధలను ఆయన చూస్తాడు, బాధపడతాడు, విడిపిస్తాడు. (నిర్గ. 3:7-10) ఒకవేళ అధికారుల ముందు మీ నమ్మకాలను సమర్థించుకోవాల్సి వస్తే, “ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింపకుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకనుగ్రహింపబడును.” (మత్త. 10:18-20) మానవ పాలకులు, ప్రభుత్వ అధికారులు యెహోవాతో ఏమాత్రం సరితూగరు. ఇప్పుడు విశ్వాసాన్ని బలపర్చుకుంటే, మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న నిజమైన వ్యక్తిలా యెహోవాను చూడగలుగుతారు.

దేవుని వాగ్దానాల మీద విశ్వాసం చూపించాడు

10. (ఎ) సా.శ.పూ. 1513, నీసాను నెలలో, యెహోవా ఏ నిర్దేశాలు ఇచ్చాడు? (బి) మోషే దేవుని నిర్దేశాలు ఎందుకు పాటించాడు?

10 సా.శ.పూ. 1513, నీసాను నెలలో, మోషే అహరోనులకు యెహోవా దేవుడు కొన్ని అసాధారణమైన నిర్దేశాలు ఇచ్చాడు. వాటి ప్రకారం ఇశ్రాయేలీయులు, ఆరోగ్యంగా ఉన్న మగ గొర్రెను లేదా మేకను తీసుకుని, దాన్ని చంపి, ఆ రక్తాన్ని తమ ద్వారబంధాలపై చల్లాలి. (నిర్గ. 12:3-7) ఆ నిర్దేశాలకు మోషే ఎలా స్పందించాడు? అపొస్తలుడైన పౌలు మోషే గురించి ఇలా రాశాడు, “తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమునుబట్టి పస్కాను, రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను.” (హెబ్రీ. 11:28) యెహోవా మీద పూర్తి నమ్మకం పెట్టుకోవచ్చని మోషేకు తెలుసు, అందుకే ఐగుప్తులోని తొలిచూలు కుమారులు చనిపోతారని యెహోవా చెప్పిన మాట నిజమవుతుందని మోషే నమ్మాడు.

11. మోషే ఎందుకు ఇతరులను హెచ్చరించాడు?

11 ఆ సమయానికి మోషే కుమారులు, ‘సంహారకునికి’ ఎంతో దూరంలో, మిద్యాను దేశంలో ఉన్నారని తెలుస్తుంది. a (నిర్గ. 18:1-6) అయినప్పటికీ మోషే, ఇశ్రాయేలీయుల తొలిచూలు కుమారులు ప్రమాదంలో ఉన్నారని గుర్తుంచుకొని ఆ నిర్దేశాలు ఇచ్చాడు. ప్రాణాలు ఆపాయంలో ఉన్నాయి, మోషే తన తోటివాళ్లను ప్రేమించాడు. “కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దల నందరిని పిలిపించి వారితో ఇట్లనెను, . . . పస్కాపశువును వధించుడి.”—నిర్గ. 12:21.

12. ఏ ప్రాముఖ్యమైన సందేశం అందించమని యెహోవా మనల్ని నిర్దేశించాడు?

12 దూతల ఆధ్వరంలో, యెహోవా ప్రజలు ఈ ప్రాముఖ్యమైన సందేశాన్ని అందిస్తున్నారు, “మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి.” (ప్రక. 14:7) ఆ సందేశాన్ని ప్రకటించాల్సిన సమయం ఇదే. మహాబబులోను మీదకు రాబోతున్న ‘తెగుళ్లలో ఏదీ వాళ్లకు ప్రాప్తింపకుండేలా’ దాని నుండి బయటకు వచ్చేయాలని మనం పొరుగువాళ్లను హెచ్చరించాలి. (ప్రక. 18:4) “వేరే గొఱ్ఱెల” సహాయంతో అభిషిక్త క్రైస్తవులు, దేవునితో “సమాధానపడుడని” ఆయనకు దూరమైన ప్రజలను బతిమాలుతున్నారు.—యోహా. 10:16; 2 కొరిం. 5:20.

యెహోవా వాగ్దానాల మీద విశ్వాసం, సువార్త ప్రకటించాలనే కోరికను సజీవంగా ఉంచుతుంది (13వ పేరా చూడండి)

13. సువార్త ప్రకటించాలనే కోరిక సజీవంగా ఉండాలంటే ఏమి చేయాలి?

13 మనం ‘తీర్పుతీర్చు గడియలో’ జీవిస్తున్నామని నమ్ముతున్నాం. అంతేకాక ప్రకటించి, శిష్యుల్ని చేసేపని ఇప్పుడు అత్యవసరమని యెహోవా చెబుతున్న మాటను కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. “భూమియొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి, . . . భూమియొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని” ఉన్నట్లు, అపొస్తలుడైన యోహాను దర్శనంలో చూశాడు. (ప్రక. 7:1) నాశనం చేసే వాయువులను విడుదల చేయడానికి సిద్ధంగావున్న ఆ దూతలు మీ విశ్వాస నేత్రాలకు కనిపిస్తున్నారా? మీ విశ్వాస నేత్రాలతో వాళ్లను చూస్తుంటే మీరు మరింత నమ్మకంతో సువార్త ప్రకటించగలుగుతారు.

14. దుర్మార్గుడు “జీవించునట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వానిని” హెచ్చరించేలా మనల్ని ఏది కదిలిస్తుంది?

14 నిజక్రైస్తవులు ఇప్పటికే యెహోవాతో స్నేహాన్ని, నిత్యజీవ నిరీక్షణను సొంతం చేసుకున్నారు. అయినప్పటికీ, దుర్మార్గుడు “జీవించునట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వానిని” హెచ్చరించాల్సిన బాధ్యత మనకు ఉందని గుర్తుంచుకుంటాం. (యెహెజ్కేలు 3:17-19 చదవండి.) అయితే, మనం ప్రకటించేది కేవలం రక్తాపరాధాన్ని తప్పించుకోవడానికి మాత్రమే కాదు. మనం యెహోవాను ప్రేమిస్తాం, మన పొరుగువాళ్లను ప్రేమిస్తాం. మంచి పొరుగువాడైన సమరయుని ఉపమానంలో యేసు, నిజమైన ప్రేమ, జాలి ఎలా ఉంటాయో బోధించాడు. ‘నేను ఆ సమరయునిలా ఎదుటివాళ్ల మీద “జాలిపడి” సాక్ష్యం అందిస్తున్నానా?’ అని మనం ఆలోచించవచ్చు. సాకులు వెదుకుతూ ‘పక్కకు పోయిన’ యాజకునిలా, లేవీయునిలా ఉండాలని మనం ఎన్నడూ కోరుకోం. (లూకా 10:25-37) దేవుని వాగ్దానాల మీద విశ్వాసం, పొరుగువాళ్ల మీద ప్రేమ ఉన్నప్పుడు, సమయం మించిపోకముందే వీలైనంత ఎక్కువగా ప్రకటించాలని కోరుకుంటాం.

‘ఎఱ్ఱసముద్రములో నడిచి పోయిరి’

15. ఏ దారి లేనట్లు ఇశ్రాయేలీయులకు ఎందుకు అనిపించింది?

15 ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత, ఇశ్రాయేలీయుల మీదకు ఆపద ముంచుకొచ్చినప్పుడు “అదృశ్యుడైన” దేవుని మీదున్న విశ్వాసం మోషేకు సహాయం చేసింది. బైబిలు ఇలా చెబుతోంది, “ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొఱపెట్టిరి.” (నిర్గ. 14:10-12) అది ఊహించని ప్రమాదమా? కానేకాదు. ఎందుకంటే యెహోవా ముందుగానే ఇలా చెప్పాడు, “నేను ఫరో హృదయమును కఠినపరచెదను; అతడు వారిని తరుమగా; నేను ఫరోవలనను అతని సమస్త సేనవలనను మహిమ తెచ్చుకొందును; నేను యెహోవానని ఐగుప్తీయులందరు తెలిసికొందురు.” (నిర్గ. 14:4) అయినప్పటికీ, ఇశ్రాయేలీయులు కంటికి కనబడే వాటిని మాత్రమే చూశారు. అంటే, ముందుకు వెళ్దామంటే దాటడానికి వీల్లేని ఎర్రసముద్రం, వెనక్కి చూస్తే తరుముకొస్తున్న ఫరో యుద్ధరథాలు, ఇక తమను నడిపిస్తున్నదేమో 80 ఏళ్ల వృద్ధ గొర్రెల కాపరి! అన్ని దారులూ ముసుకుపోయాయని వాళ్లు అనుకున్నారు.

16. మోషేకున్న విశ్వాసం ఆయనను ఎర్రసముద్రం దగ్గర ఎలా బలపర్చింది?

16 ఇలాంటి పరిస్థితుల్లో కూడా మోషే ధైర్యం కోల్పోలేదు. ఎందుకు? ఆయన విశ్వాస నేత్రాలు, సముద్రంకన్నా, సైన్యంకన్నా శక్తిమంతమైనదాన్ని చూశాయి. మోషే, “యెహోవా . . . కలుగజేయు రక్షణను” చూడగలిగాడు. అంతేకాదు, యెహోవా ఇశ్రాయేలీయుల తరఫున యుద్ధం చేస్తాడని మోషేకు తెలుసు. (నిర్గమకాండము 14:13, 14 చదవండి.) మోషే చూపిన విశ్వాసం దేవుని ప్రజల్లో మార్పు తీసుకొచ్చింది. “విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎఱ్ఱసముద్రములో బడి నడిచి పోయిరి. ఐగుప్తీయులు ఆలాగు చేయజూచి మునిగిపోయిరి” అని బైబిలు చెబుతుంది. (హెబ్రీ. 11:29) అప్పటినుండి, “ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందును, ఆయన సేవకుడైన మోషేయందును నమ్మకముంచిరి.”—నిర్గ. 14:31.

17. భవిష్యత్తులో జరిగే ఏ సంఘటన మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది?

17 మన ప్రాణాలు కూడా ఆపదలో చిక్కుకున్నాయని అనిపించే కాలం త్వరలోనే రాబోతుంది. మహాశ్రమలు ముగింపుకు చేరుకునేసరికి ఈ లోక ప్రభుత్వాలు, అన్నివిధాల మనకన్నా ఎంతో పెద్దవైన, బలమైన మత సంస్థలను నాశనం చేసి, నామరూపాల్లేకుండా చేసేసివుంటాయి. (ప్రక. 17:16) అప్పుడు మనం ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు కనిపిస్తామో వర్ణిస్తూ, ‘ప్రాకారములులేని గ్రామములుగల దేశము, ప్రాకారములును అడ్డగడియలును గవునులులేని దేశము’ అని యెహోవా ప్రవచించాడు. (యెహె. 38:10-12, 14-16) మామూలుగా చూస్తే, మనకు తప్పించుకునే అవకాశమే ఉండదని అనిపించవచ్చు. అప్పుడు మీరేమి చేస్తారు?

18. మహాశ్రమల కాలంలో మనం ఎందుకు ధైర్యంగా ఉండవచ్చు? వివరించండి.

18 మనం ధైర్యం కోల్పోనక్కర్లేదు. ఎందుకు? ఎందుకంటే, తన ప్రజల మీద దాడి జరుగుతుందని యెహోవా ముందే చెప్పాడు. అంతిమ ఫలితం ఎలా ఉంటుందో కూడా ఆయన చెప్పాడు. “గోగు ఇశ్రాయేలీయుల దేశము మీదికి రాబోవు ఆ దినమున, నా కోపము బహుగా రగులుకొనును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కాబట్టి నేను రోషమును మహా రౌద్రమును గలిగినవాడనై యీలాగు ప్రమాణముచేసితిని.” (యెహె. 38:18-23) తన ప్రజలకు హాని తలపెట్టాలనుకునే వాళ్లను యెహోవా సమూలంగా నాశనం చేస్తాడు. “యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము” వల్ల కలిగే అంతిమ ఫలితం మీద మీకున్న విశ్వాసం ‘యెహోవా కలుగజేసే రక్షణను’ చూడడానికి, మీ యథార్థతను కాపాడుకోవడానికి సహాయం చేస్తుంది.—యోవే. 2:31, 32.

19. (ఎ) మోషేకు యెహోవాతో ఎలాంటి అనుబంధం ఉంది? (బి) మీ ప్రవర్తన అంతటిలో యెహోవా అధికారానికి లోబడితే, ఏ ఆశీర్వాదాన్ని పొందుతారు?

19 “అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగల” వాళ్లలా ఉంటూ, ఒళ్లు పులకరింపజేసే ఆ సంఘటనల కోసం ఇప్పుడే సిద్ధపడండి! క్రమంగా అధ్యయనం చేస్తూ, ప్రార్థిస్తూ యెహోవా దేవునితో మీ స్నేహబంధాన్ని బలపర్చుకోండి. యెహోవాతో మోషేకు ఉన్న అనుబంధాన్ని, ఆయనను దేవుడు ఉపయోగించుకున్న శక్తిమంతమైన విధానాన్ని వర్ణిస్తూ, యెహోవాకు మోషే “ముఖాముఖిగా” తెలుసని బైబిలు చెబుతోంది. (ద్వితీ. 34:12) మోషే అసాధారణమైన ప్రవక్త. అయితే, విశ్వాసం ఉంటే మీరు కూడా యెహోవాను నిజంగా చూస్తున్నంత సన్నిహితంగా ఆయనను తెలుసుకోవచ్చు. దేవుని వాక్యం ప్రోత్సహిస్తున్నట్లు, మీ “ప్రవర్తన అంతటియందు” అన్నివేళలా యెహోవా అధికారానికి లోబడితే, ఆయన మీ “త్రోవలను సరాళము” చేస్తాడు.—సామె. 3:6.

a ఐగుప్తీయులకు విధించిన ఆ శిక్షను అమలు చేయడానికి యెహోవా తన దూతలను పంపించాడని అర్థమౌతుంది.—కీర్త. 78:49-51.