కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి’

‘నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి’

“నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును [“యెహోవాను,” NW] ప్రేమింపవలెను.”—మత్త. 22:37.

1. దేవునికి, ఆయన కుమారునికి మధ్య ఉన్న ప్రేమ ఎలా అధికమైంది?

 తండ్రికి తనకు మధ్య ఉన్న సన్నిహిత అనుబంధాన్ని వర్ణిస్తూ, “నేను తండ్రిని ప్రేమించుచున్నాను,” ‘తండ్రి, కుమారుని ప్రేమించుచున్నాడు’ అని యేసు అన్నాడు. (యోహా. 5:20; 14:31) దానికి మనం ఆశ్చర్యపోము. ఎందుకంటే, యేసు మానవునిగా రాకముందు ఎన్నో యుగాలు దేవుని దగ్గర ‘ప్రధానశిల్పిగా’ పనిచేశాడు. (సామె. 8:30) యెహోవాతో కలిసి పనిచేస్తున్నప్పుడు, ఆ కుమారుడు తన తండ్రి లక్షణాల గురించి ఎంతో నేర్చుకున్నాడు, తన తండ్రిని ప్రేమించడానికి లెక్కలేనన్ని కారణాలు చూశాడు. నిజానికి, వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉన్నారు కాబట్టే ఒకరిపట్ల ఒకరికి ప్రేమ అధికమైంది.

2. (ఎ) ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు మనం ఏమి కూడా చూపిస్తాం? (బి) మనం ఏ ప్రశ్నలను చర్చిస్తాం?

2 ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు అతని మీద ఎంతో ఆప్యాయత కూడా చూపిస్తాం. కీర్తనకర్త దావీదు ఇలా పాడాడు, “యెహోవా నా బలమా, నీమీద నాకు ఆప్యాయత ఉంది.” (కీర్త. 18:1, NW) మనం కూడా కీర్తనకర్తలాగే భావించాలి, ఎందుకంటే దేవునికి కూడా మనమీద ఆప్యాయత ఉంది. మనం యెహోవాకు లోబడితే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. (ద్వితీయోపదేశకాండము 7:12, 13 చదవండి.) అయితే, మనం దేవుణ్ణి చూడలేం కాబట్టి ఆయనను ప్రేమించడం సాధ్యమేనా? యెహోవాను ప్రేమించడమంటే అర్థమేమిటి? మనం ఆయనను ఎందుకు ప్రేమించాలి? దేవుని పట్ల మనకున్న ప్రేమను ఎలా చూపించవచ్చు?

మనం దేవుణ్ణి ఎందుకు ప్రేమించగలం?

3, 4. యెహోవాను ప్రేమించడం మనకెందుకు సాధ్యం?

3 “దేవుడు ఆత్మ” కాబట్టి ఆయనను మనం చూడలేం. (యోహా. 4:24) అయినా, యెహోవాను ప్రేమించడం సాధ్యమే. అలా ప్రేమించమని లేఖనాలు మనల్ని ఆదేశిస్తున్నాయి. ఉదాహరణకు, మోషే ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు, “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.”—ద్వితీ. 6:5.

4 మనం దేవుణ్ణి ప్రగాఢంగా ఎందుకు ప్రేమించగలం? ఎందుకంటే ఆయన మనల్ని ఆధ్యాత్మిక అవసరంతో సృష్టించి, ప్రేమను చూపించే సామర్థ్యాన్ని మనకు ఇచ్చాడు. మన ఆధ్యాత్మిక అవసరం సరిగ్గా తీరినప్పుడు, యెహోవా మీద మనకున్న ప్రేమ అధికమౌతుంది, అది మన సంతోషానికి కూడా దోహదపడుతుంది. “ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది” అని యేసు చెప్పాడు. (మత్త. 5:3) మనుషుల్లో ఆరాధించాలనే కోరిక పుట్టుకతో వచ్చిందని కొందరు అంటుంటారు, దాని గురించి ఎ. సి. మోరిసన్‌, మ్యాన్‌ డస్‌ నాట్‌ స్టాండ్‌ ఎలోన్‌ అనే తన పుస్తకంలో ఇలా చెప్పాడు, “ప్రపంచ నలుమూలలా మానవులు సర్వోన్నతుని గురించి వెదకడం, ఆయనను నమ్మడం చూస్తుంటే మనలో భక్తిపూర్వక భయం, ఆశ్చర్యం కలగాల్సిందే.”

5. దేవుణ్ణి వెదకడం ఎందుకు వ్యర్థం కాదు?

5 దేవుణ్ణి వెదకడం వ్యర్థమా? కాదు. ఎందుకంటే మనం ఆయనను వెదకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అపొస్తలుడైన పౌలు, అరేయొపగు వద్ద సమకూడిన ఒక గుంపుకు సాక్ష్యమిచ్చినప్పుడు ఆ విషయాన్నే స్పష్టం చేశాడు. ప్రాచీన ఏథెన్సు వాసుల ఆరాధ్య దేవత అయిన ఎథీనాకు ప్రతిష్ఠితమైన పార్తెనాన్‌ ఆలయం సమీపంలో పౌలు మాట్లాడాడు. “జగత్తును అందలి సమస్తమును నిర్మించిన” దేవుని గురించి మాట్లాడిన తర్వాత, దేవుడు “హస్తకృతములైన ఆలయములలో నివసింపడు” అని పౌలు చెప్పినప్పుడు మీరు కూడా అక్కడ ఉన్నట్లు ఊహించుకోండి. ఆయన ఇంకా ఇలా వివరించాడు, “యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో యని, తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.” (అపొ. 17:24-27) అవును, ప్రజలు తప్పకుండా దేవుణ్ణి కనుగొనగలరు. 78 లక్షలకన్నా ఎక్కువసంఖ్యలో ఉన్న యెహోవాసాక్షులు ఆయనను నిజంగా ‘కనుగొన్నారు.’ వాళ్లు ఆయనను యథార్థంగా ప్రేమిస్తున్నారు.

దేవుణ్ణి ప్రేమించడమంటే అర్థమేమిటి?

6. “ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ” ఏదని యేసు చెప్పాడు?

6 యెహోవా మీద ప్రేమ, మన హృదయంలో నుండి పుట్టాలి. “బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని ఒక పరిసయ్యుడు ప్రశ్నించినప్పుడు యేసు ఇచ్చిన ఈ జవాబులో ఆ విషయం స్పష్టంగా చెప్పాడు, “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను . . .  ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ.”—మత్త. 22:34-38.

7. దేవుణ్ణి (ఎ) “పూర్ణహృదయముతో” (బి) “పూర్ణాత్మతో” (సి) “పూర్ణమనస్సుతో” ప్రేమించడమంటే అర్థమేమిటి?

7 మనం దేవుణ్ణి “పూర్ణహృదయముతో” ప్రేమించాలని చెప్పినప్పుడు యేసు ఉద్దేశమేమిటి? మన కోరికలను, భావోద్వేగాలను, భావాలను ప్రేరేపించే మన పూర్తి అలంకార హృదయంతో యెహోవాను ప్రేమించాలన్నది ఆయన ఉద్దేశం. మనం “పూర్ణాత్మతో” లేదా మన జీవంతో, జీవితంతో కూడా ఆయనను ప్రేమించాలి. అంతేకాదు, మనం “పూర్ణమనస్సుతో” లేదా పూర్తి ఆలోచనా సామర్థ్యంతో దేవుణ్ణి ఆరాధించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే, మన దగ్గరున్న వాటన్నిటితో, మనకున్న పూర్తి సామర్థ్యాలతో యెహోవాను ప్రేమించాలని యేసు నొక్కిచెప్పాడు.

8. దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమిస్తే మనం ఏమి చేస్తాం?

8 మనం దేవుణ్ణి పూర్ణ హృదయంతో, ఆత్మతో, మనస్సుతో ప్రేమిస్తే, మనం ఆయన వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేస్తాం, ఆయన ఉద్దేశాలను మనస్ఫూర్తిగా నెరవేరుస్తాం, ఆయన రాజ్య సువార్తను ఉత్సాహంగా ప్రకటిస్తాం. (మత్త. 24:14; రోమా. 12:1, 2) యెహోవా పట్ల చూపే యథార్థ ప్రేమ మనల్ని ఆయనకు మరింత సన్నిహితం చేస్తుంది. (యాకో. 4:8) మనం దేవుణ్ణి ప్రేమించడానికి గల కారణాలన్నింటినీ చెప్పడం సాధ్యం కాదు. అయితే, వాటిలో కొన్నిటిని ఇప్పుడు పరిశీలిద్దాం.

మనం యెహోవాను ఎందుకు ప్రేమించాలి?

9. మన సృష్టికర్త, మన పోషకుడైన యెహోవాను మనం ఎందుకు ప్రేమించాలి?

9 యెహోవా మన సృష్టికర్త, మన పోషకుడు. “మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము” అని పౌలు అన్నాడు. (అపొ. 17:28) మనం నివసించడానికి అత్యద్భుతమైన భూమిని యెహోవా ఇచ్చాడు. (కీర్త. 115:16) మనం బ్రతకడానికి కావాల్సిన ఆహారాన్ని, మరితరమైన వాటిని ఆయన అనుగ్రహిస్తున్నాడు. అందుకే, “జీవముగల దేవుడు . . . ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుటచేత తన్ను గూర్చి సాక్ష్యములేకుండ చేయలేదు” అని లుస్త్రలోని విగ్రహారాధకులతో పౌలు అన్నాడు. (అపొ. 14:15-17) మన గొప్ప సృష్టికర్త, ప్రేమగల పోషకుడైన దేవుణ్ణి ప్రేమించడానికి అది ఓ కారణం కాదా?—ప్రసం. 12:2.

10. విమోచన క్రయధనం గురించి మీరు ఎలా భావిస్తున్నారు?

10 ఆదాము నుండి వచ్చిన పాపమరణాలను దేవుడు తీసేసే ఏర్పాటు చేశాడు. (రోమా. 5:12) “దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.” (రోమా. 5:8) మనం నిజంగా పశ్చాత్తాపపడి, యేసు విమోచన క్రయధనం మీద విశ్వాసం ఉంచితే యెహోవా మనల్ని క్షమిస్తాడు. యెహోవా ఆ ఏర్పాటు చేసినందుకు ఆయన మీద ప్రేమతో మన హృదయాలు ఉప్పొంగడంలేదా?—యోహా. 3:16.

11, 12. యెహోవా మనకు ఏయే నిరీక్షణలు ఇస్తున్నాడు?

11 మనల్ని ‘ఆనందంతో, సమాధానంతో నింపే’ నిరీక్షణను యెహోవా ఇచ్చాడు. (రోమా. 15:13) దేవుడిచ్చిన నిరీక్షణ మన విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షలను తట్టుకోవడానికి సహాయం చేస్తుంది. “మరణమువరకు నమ్మకముగా” ఉన్న అభిషిక్తులకు యెహోవా ‘జీవకిరీటాన్ని’ ఇస్తాడు. (ప్రక. 2:10) భూనిరీక్షణగల వాళ్లు తమ యథార్థతను కాపాడుకుంటే, దేవుడు వాగ్దానం చేసిన భూపరదైసులో శాశ్వత దీవెనలను సొంతం చేసుకుంటారు. (లూకా 23:43) మన నిరీక్షణ గురించి మనమెలా భావిస్తాం? అది మనలో ఆనందాన్ని, సమాధానాన్ని, “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” ఇచ్చే దేవుని మీద ప్రేమను నింపుతుంది.—యాకో. 1:17.

12 మన హృదయాలను పులకరింపజేసే పునరుత్థాన నిరీక్షణను దేవుడు ఇచ్చాడు. (అపొ. 24: 14, 15) మన ప్రియమైనవాళ్లు చనిపోతే ఎంతో బాధపడతాం, కానీ పునరుత్థాన నిరీక్షణ ఉంది కాబట్టి, ‘నిరీక్షణ లేని ఇతరులవలె మనం దుఃఖపడం.’ (1 థెస్స. 4:13) యెహోవా ప్రేమగల దేవుడు, అందుకే చనిపోయిన వాళ్లను, ముఖ్యంగా నీతిమంతుడైన యోబులాంటి నమ్మకస్థులను పునరుత్థానం చేయాలని ఎంతగానో కోరుకుంటున్నాడు. (యోబు 14:15) చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతికి, తమవాళ్లను కలుసుకుంటున్నప్పుడు కలిగే ఆనందాన్ని ఒక్కసారి ఊహించండి. ఆ అద్భుతమైన పునరుత్థాన నిరీక్షణను ఇచ్చిన మన పరలోక తండ్రి మీద మన ప్రేమ అధికమవ్వడం లేదా?

13. దేవుడు మనపట్ల నిజంగా శ్రద్ధ తీసుకుంటాడని ఎలా చెప్పవచ్చు?

13 యెహోవా మనపట్ల నిజంగా శ్రద్ధ తీసుకుంటాడు. (కీర్తన 34:6, 18, 19; 1 పేతురు 5:6, 7 చదవండి.) తనకు నమ్మకంగా ఉన్నవాళ్లకు సహాయం చేయడానికి మన ప్రేమగల దేవుడు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటాడని మనకు తెలుసు. అందుకే, ‘ఆయన మంద గొర్రెలమైన’ మనం సురక్షితంగా ఉన్నట్లు భావిస్తాం. (కీర్త. 79:13) అంతేకాదు, ఆయన మెస్సీయ రాజ్యం ద్వారా మనకోసం చేయబోయేవాటిలో కూడా మనమీద ఆయనకున్న ప్రేమ కనిపిస్తుంది. ఆయన ఎన్నుకున్న రాజైన యేసుక్రీస్తు, భూమ్మీదున్న హింసనూ దౌర్జన్యాన్నీ దుష్టత్వాన్నీ కూకటివేళ్లతో పెకిలించేశాక, విధేయులైన మానవులు ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఎల్లప్పుడూ శాంతి, సంతోషాలతో వర్ధిల్లుతారు. (కీర్త. 72:7, 12-14, 16) మన శ్రద్ధగల దేవుణ్ణి మనం పూర్ణహృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో ప్రేమించడానికి అది ఓ మంచి కారణం కాదా?—లూకా 10:27.

14. దేవుడు ఏ అమూల్యమైన అవకాశాన్ని మనకిచ్చాడు?

14 తన సాక్షులుగా సేవచేసే అమూల్యమైన అవకాశాన్ని యెహోవా మనకిచ్చాడు. (యెష. 43:10-12) మనం యెహోవాను ప్రేమించడానికి మరో కారణం కూడా ఉంది. తన సర్వాధిపత్యాన్ని సమర్థిస్తూ, కష్టాలతో నిండిన లోకంలోని ప్రజలకు ఓ నిరీక్షణను ప్రకటించే అవకాశాన్ని ఆయన మనకిచ్చాడు. మనం విశ్వాసంతో, నమ్మకంతో సువార్త ప్రకటించవచ్చు. ఎందుకంటే, మనం సత్యదేవుని వాక్యం ఆధారంగా ప్రకటిస్తున్నాం, ఆయన వాగ్దానాలు ఎల్లప్పుడూ నెరవేరుతాయి. (యెహోషువ 21:44; 23:14 చదవండి.) ఇలా చెప్పుకుంటూ పోతే, యెహోవా ఇచ్చే ఆశీర్వాదాలు, ఆయనను ప్రేమించడానికి మనకుగల కారణాలు పెరుగుతూనే ఉంటాయి. అయితే, మనం ఆయన మీదున్న ప్రేమను ఎలా చూపించవచ్చు?

దేవుని మీదున్న ప్రేమను మనమెలా చూపించవచ్చు?

15. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసి, దాన్ని పాటిస్తే ఎలాంటి ప్రయోజనం పొందుతాం?

15 దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయండి, దాన్ని పాటించండి. అలా చేస్తే మనం యెహోవాను ప్రేమిస్తున్నామని, ఆయన వాక్యం ‘మన పాదములకు దీపముగా’ ఉండాలని నిజంగా కోరుకుంటున్నామని చూపిస్తాం. (కీర్త. 119:105) మనం ఒకవేళ సమస్యలతో సతమతమౌతుంటే, ఈ మాటల్లో ఉన్న ప్రేమపూర్వక అభయాన్ని బట్టి ఊరట పొందవచ్చు, “విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది.” (కీర్త. 51:17; 94:18, 19) కష్టాలు అనుభవించే వాళ్లమీద యెహోవా దయ చూపిస్తాడు, యేసు కూడా ప్రజల మీద కనికరపడ్డాడు. (యెష. 49:13; మత్త. 15:32) మనం బైబిలు అధ్యయనం చేసినప్పుడు, యెహోవాకు మనమీద ఎంత ప్రేమ ఉందో నేర్చుకుంటాం, అది యెహోవా మీద మనకున్న ప్రేమను మరింత ప్రగాఢం చేస్తుంది.

16. క్రమంగా ప్రార్థించడం వల్ల దేవుని మీదున్న ప్రేమ ఎలా పెరుగుతుంది?

16 దేవునికి క్రమంగా ప్రార్థించండి. మనం ప్రార్థించినప్పుడు, ‘ప్రార్థనలు ఆలకించే’ దేవునికి ఎంతో సన్నిహితం అవుతాం. (కీర్త. 65:2) దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తున్నాడని గ్రహించినప్పుడు ఆయన మీద మనకున్న ప్రేమ అధికమౌతుంది. ఉదాహరణకు, ‘మనం సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మనల్ని శోధింపబడనియ్యడని’ చూసివుంటాం. (1 కొరిం. 10:13) మనకు ఏదైనా చింత ఉండి యెహోవాను మనస్ఫూర్తిగా వేడుకుంటే, సాటిలేని ‘దేవుని సమాధానాన్ని’ చవిచూస్తాం. (ఫిలి. 4:6, 7) కొన్నిసార్లు, మనం నెహెమ్యాలా మౌనంగా ప్రార్థించినా వాటికి జవాబు దొరకడం చూస్తాం. (నెహె. 2:1-6) మనం “ప్రార్థనయందు పట్టుదల కలిగియుండి,” యెహోవా మన ప్రార్థనలకు జవాబిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు ఆయన మీదున్న ప్రేమ అధికమౌతుంది. అంతేకాదు, ముందుముందు వచ్చే విశ్వాస పరీక్షలను కూడా తట్టుకుని నిలబడేందుకు దేవుడు సహాయం చేస్తాడనే ధైర్యం కూడా పెరుగుతుంది.—రోమా. 12:12.

17. మనం దేవుణ్ణి ప్రేమిస్తే, కూటాలకు హాజరవ్వడాన్ని ఎలా చూస్తాం?

17 క్రైస్తవ కూటాలకు, సమావేశాలకు హాజరవ్వడం ఒక అలవాటుగా చేసుకోండి. (హెబ్రీ. 10:24, 25) ఇశ్రాయేలీయులు యెహోవా గురించి విని, నేర్చుకోవడానికి సమావేశమయ్యేవాళ్లు. దానివల్ల వాళ్లు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ, ఆయన మీద భయభక్తులు పెంపొందించుకోగలిగారు. (ద్వితీ. 31:12) మనం దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే, ఆయన చిత్తం చేయడం భారంగా అనిపించదు. (1 యోహాను 5:3 చదవండి.) కాబట్టి, అన్ని కూటాలకు హాజరవ్వడానికి మన శాయశక్తులా ప్రయత్నిద్దాం. యెహోవా మీద మనకు మొదట ఉన్న ప్రేమ ఎన్నడూ తగ్గిపోకుండా చూసుకోవాలి.—ప్రక. 2:4.

18. మనం ఏమి చేసేలా దేవుని మీదున్న ప్రేమ కదిలిస్తుంది?

18 ‘సువార్త సత్యాన్ని’ ఇతరులతో ఉత్సాహంగా పంచుకోండి. (గల. 2:5) దేవుని మీదున్న ప్రేమే మెస్సీయ రాజ్యం గురించి ప్రకటించేలా మనల్ని కదిలిస్తుంది. ఆయన ప్రియ కుమారుడు హార్‌మెగిద్దోనులో ‘సత్యాన్ని స్థాపించడానికి బయలుదేరతాడు.’ (కీర్త. 45:4; ప్రక. 16:14-16) దేవుని ప్రేమ గురించి, ఆయన వాగ్దానం చేసిన నూతనలోకం గురించి తెలుసుకునేలా ఇతరులకు సహాయం చేయడం మనకు ఎంత సంతోషాన్నిస్తుందో!—మత్త. 28:19, 20.

19. తన మందను కాయడానికి యెహోవా చేసిన ఏర్పాటుకు మనమెందుకు కృతజ్ఞత చూపించాలి?

19 తన మందను కాయడానికి దేవుడు చేసిన ఏర్పాటుకు కృతజ్ఞత చూపించండి. (అపొ. 20:28) క్రైస్తవ పెద్దలు దేవుడు ఇచ్చిన బహుమానాలు, వాళ్లు ఎల్లప్పుడూ మన శ్రేయస్సు కోసమే పాటుపడతారు. పెద్దలు, “గాలికి మరుగైన చోటువలెను గాలివానకు చాటైన చోటువలెను . . . ఎండినచోట నీళ్లకాలువల వలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను” ఉంటారు. (యెష. 32:1, 2) ఈదురు గాలులు వీస్తున్నప్పుడు, లేదా భారీవర్షం కురుస్తున్నప్పుడు ఏదైనా ఆశ్రయం దొరికితే మనం ఎంత కృతజ్ఞత చూపిస్తాం! భగభగమండే ఎండలో ఓ పెద్ద బండ నీడ దొరికినప్పుడు ఎంత కృతజ్ఞతతో ఉంటామో కదా! పెద్దలు మనకు కావాల్సిన ఆధ్యాత్మిక సహాయాన్ని, సేదదీర్పును ఇస్తారని అర్థంచేసుకోవడానికి ఈ పదచిత్రాలు సహాయం చేస్తాయి. నాయకత్వం వహిస్తున్న వాళ్లకు విధేయత చూపించినప్పుడు ‘మనుష్యుల్లో ఈవుల పట్ల మనకు ఎంత కృతజ్ఞత ఉందో చూపిస్తాం. అలా చేయడం ద్వారా దేవుని మీద, సంఘ శిరస్సైన క్రీస్తు మీద ప్రేమ ఉందని నిరూపిస్తాం.—ఎఫె. 4:8; 5:23; హెబ్రీ. 13:17.

మంద మీద నిజమైన శ్రద్ధ చూపించే కాపరులను యెహోవా అనుగ్రహించాడు (19వ పేరా చూడండి)

దేవుని మీద ఉన్న ప్రేమను అధికం చేసుకుంటూనే ఉండండి

20. మీరు దేవుణ్ణి ప్రేమిస్తే, యాకోబు 1:22-25⁠లోని మాటలకు ఎలా స్పందిస్తారు?

20 యెహోవాతో మీకు ప్రేమపూర్వకమైన సంబంధం ఉన్నట్లైతే, మీరు ‘వినేవాళ్లుగా మాత్రమే కాకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వాళ్లుగా’ ఉంటారు. (యాకోబు 1:22-25 చదవండి.) ‘వాక్య ప్రకారం ప్రవర్తించే’ వ్యక్తి, ఉత్సాహంగా ప్రకటనా పనిలో పాల్గొనేలా, క్రైస్తవ కూటాల్లో భాగం వహించేలా విశ్వాసం పురికొల్పుతుంది. మీరు దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే, ‘సంపూర్ణమైన నియమానికి’ విధేయత చూపిస్తారు, ఆ నియమంలో యెహోవా మీనుండి కోరేవన్నీ ఉన్నాయి.—కీర్త. 19:7-11.

21. మీరు హృదయపూర్వకంగా చేసే ప్రార్థనలను దేనితో పోల్చవచ్చు?

21 యెహోవా మీద మీకున్న ప్రేమే, ఆయనకు తరచూ హృదయపూర్వకంగా ప్రార్థించేలా మిమ్మల్ని కదిలిస్తుంది. ధర్మశాస్త్ర నిబంధన ప్రకారం ప్రతీరోజు ధూపం వేయడం గురించి కీర్తనకర్త దావీదు ఇలా పాడాడు, “నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక.” (కీర్త. 141:2; నిర్గ. 30:7, 8) మీరు వినయంతో చేసే విన్నపాలు, మనస్ఫూర్తిగా చేసే విజ్ఞాపనలు, హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తూ కృతజ్ఞతలు చెబుతూ పలికే మాటలు సువాసనగల ధూపంలా ఉంటాయి, అలాంటి ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తాడు.—ప్రక. 5:8.

22. ఏ విధమైన ప్రేమ గురించి మనం తర్వాతి ఆర్టికల్‌లో చర్చిస్తాం?

22 మనం దేవుణ్ణి, పొరుగువానిని కూడా ప్రేమించాలని యేసు చెప్పాడు. (మత్త. 22:37-39) తోటివాళ్లతో సరిగ్గా వ్యవహరించేలా, పొరుగువాళ్లను ప్రేమించేలా యెహోవా మీదా ఆయన సూత్రాల మీదా మనకున్న ప్రేమే మనల్ని పురికొల్పుతుంది. దీని గురించి తర్వాతి ఆర్టికల్‌లో చర్చిస్తాం.