కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మీరు నాకు సాక్షులు’

‘మీరు నాకు సాక్షులు’

‘మీరు నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు.’—యెష. 43:10, 12.

1, 2. (ఎ) సాక్షి అంటే ఎవరు? ఈ లోక వార్తా మాధ్యమాలు ఏ ప్రాముఖ్యమైన విషయంలో విఫలమయ్యాయి? (బి) ఈ లోక వార్తా మాధ్యమాల మీద యెహోవా ఎందుకు ఆధారపడడు?

 సాక్షి అంటే ఎవరు? ఒక నిఘంటువు నిర్వచిస్తున్నట్లుగా, “ఒక సంఘటనను ప్రత్యక్షంగా చూసి, ఏమి జరిగిందో ఇతరులకు చెప్పేవాడే సాక్షి.” ఉదాహరణకు, దక్షిణ ఆఫ్రికాలోని పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో ప్రస్తుతం ద విట్నెస్‌ అనే పేరుతో ఓ వార్తాపత్రిక 160 కంటే ఎక్కువ సంవత్సరాలుగా ప్రచురితమౌతోంది. ఆ పేరు దానికి తగినదే, ఎందుకంటే లోకంలో జరిగే సంఘటనలను ఖచ్చితంగా తెలియజేయడమే వార్తాపత్రికల ఉద్దేశం. ద విట్నెస్‌ వార్తాపత్రికను స్థాపించిన సంపాదకుడు ఆ వార్తాపత్రిక, “నిజాన్ని, పూర్తి నిజాన్ని, కేవలం నిజాన్ని” మాత్రమే చెబుతుందని వాగ్దానం చేశాడు.

2 అయితే విచారకరంగా, లోకంలోని వార్తా మాధ్యమాలు మానవ చరిత్రలోని అతి ప్రాముఖ్యమైన నిజాలను చాలావరకు నిర్లక్ష్యం చేశాయి లేదా వక్రీకరించాయి. ముఖ్యంగా సర్వశక్తిమంతుడైన దేవుని గురించిన సత్యం విషయంలో అవి అలా చేశాయి, కానీ యెహోవా తన ప్రాచీనకాల ప్రవక్త యెహెజ్కేలు ద్వారా ఇలా చెప్పాడు, ‘నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకుంటారు.’ (యెహె. 39:7) అయితే విశ్వ సర్వోన్నత పరిపాలకుడైన యెహోవా ఈ లోక వార్తా మాధ్యమాల మీద ఆధారపడడు. ఆయనకు దాదాపు 80 లక్షలమంది సాక్షులు ఉన్నారు. వాళ్లు ఆయన గురించి, నాడూ నేడూ మనుషులతో ఆయన వ్యవహారాల గురించి అన్ని దేశాల ప్రజలకు చెబుతున్నారు. అంతేకాక ఈ సాక్షుల సైన్యం, మానవజాతి కోసం యెహోవా భవిష్యత్తులో చేయబోతున్న అద్భుతమైన విషయాల గురించి కూడా ప్రకటిస్తోంది. యెషయా 43:10, 12 వచనాల్లో ఇలా ఉంది, ‘మీరును, నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు.’ ఈ సాక్ష్యపు పనికి మన జీవితాల్లో ప్రముఖ స్థానం ఇవ్వడం ద్వారా దేవుడు మనకిచ్చిన పేరుకు తగ్గట్లుగా జీవిస్తాం.

3, 4. (ఎ) బైబిలు విద్యార్థులు కొత్తపేరును ఎప్పుడు పెట్టుకున్నారు? ఆ పేరు విషయంలో వాళ్లు ఎలా భావించారు? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) ఇప్పుడు ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

3 ‘సకల యుగములలో రాజైన’ యెహోవా పేరును ధరించడం ఎంత గొప్ప భాగ్యం! ఆయనిలా చెబుతున్నాడు, “నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము.” (1 తిమో. 1:17; నిర్గ. 3:15; ప్రసంగి 2:16తో పోల్చండి.) బైబిలు విద్యార్థులు 1931⁠లో “యెహోవాసాక్షులు” అనే పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత, చాలామంది తమ కృతజ్ఞత తెలియజేస్తూ పంపించిన ఉత్తరాలు కావలికోట పత్రికలో ప్రచురితమయ్యాయి. కెనడాలోని ఓ సంఘం ఇలా రాసింది, “మనం ఇప్పటి నుండి ‘యెహోవాసాక్షులం’ అనే మంచివార్త విని మేము పులకించిపోయాం. ఈ కొత్త పేరుకు తగినట్లుగా జీవించాలని ఇప్పుడు మేము మరింత నిశ్చయతతో ఉన్నాం.”

4 దేవుని నామాన్ని ధరించే గొప్ప అవకాశం విషయంలో మీరు కృతజ్ఞత ఎలా చూపించవచ్చు? అలాగే, యెషయా గ్రంథంలో ఉన్నట్లుగా, యెహోవా మనల్ని తన సాక్షులని ఎందుకు పిలుస్తున్నాడో మీరు వివరించగలరా?

ప్రాచీనకాలంలో దేవుని సాక్షులు

5, 6. (ఎ) ఇశ్రాయేలులోని తల్లిదండ్రులు ఏవిధంగా యెహోవాకు సాక్షులుగా ఉండేవాళ్లు? (బి) ఇంకా ఏమి చేయమని దేవుడు ఇశ్రాయేలులోని తల్లిదండ్రులకు ఆజ్ఞాపించాడు? అది నేటి క్రైస్తవ తల్లిదండ్రులకు కూడా ఎందుకు వర్తిస్తుంది?

5 యెషయా కాలంలో ప్రతీ ఇశ్రాయేలీయుడూ యెహోవా ‘సాక్షే,’ అలాగే ఆ మొత్తం జనాంగం దేవుని “సేవకుడు.” (యెష. 43:10) ఇశ్రాయేలులోని తల్లిదండ్రులు సాక్ష్యం ఇచ్చిన ఓ విధానం ఏమిటంటే, తమ పితరులతో యెహోవా ఎలా వ్యవహరించాడో తమ పిల్లలకు బోధించడం. ఉదాహరణకు, ప్రతీ సంవత్సరం పస్కాను ఆచరించమని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సందర్భంలో యెహోవా వాళ్లకు ఇలా చెప్పాడు, “మీ కుమారులు—మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు మీరు—ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల యిండ్లను విడిచి పెట్టెను అనవలెను.” (నిర్గ. 12:26, 27) అంతేకాక, ఇశ్రాయేలీయులు అరణ్యంలో యెహోవాను ఆరాధించేలా వాళ్లను విడిపించమని మోషే అడిగినప్పుడు, “నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు?” అని ఫరో అడిగాడని కూడా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పివుండవచ్చు. (నిర్గ. 5:2) అలాగే, పది తెగుళ్లు ఐగుప్తును సర్వనాశనం చేశాక, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గర ఐగుప్తు సైన్యం బారినుండి తప్పించుకున్నప్పుడు, ఫరో అడిగిన ప్రశ్నకు స్పష్టమైన జవాబు వచ్చిందని కూడా వాళ్లు చెప్పివుండవచ్చు. యెహోవా అప్పుడూ ఇప్పుడూ సర్వశక్తిమంతుడే. యెహోవా నిజమైన దేవుడని, చేసిన వాగ్దానాలు నెరవేర్చేవాడని చెప్పడానికి అప్పుడున్న ఇశ్రాయేలు జనాంగమే సజీవ సాక్ష్యంగా నిలిచింది.

6 యెహోవా నామాన్ని ధరించడాన్ని గొప్పతనంగా భావించిన ఇశ్రాయేలీయులు ఈ విషయాలను తమ పిల్లలతోపాటు, తమ ఇళ్లలో దాసులుగా పనిచేస్తున్న పరదేశులకు కూడా తప్పకుండా చెప్పేవుంటారు. అంతేకాక, తమ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలని కూడా ఇశ్రాయేలీయులకు తెలుసు. యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు, “మీరు పరిశుద్ధులై యుండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై యున్నాను.” తమ పిల్లలు పరిశుద్ధంగా ఉండేలా అంటే దేవుని ప్రమాణాల ప్రకారం జీవించేలా వాళ్లకు శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఇశ్రాయేలీయులకు ఉంది. (లేవీ. 19:2; ద్వితీ. 6:6, 7) నేటి క్రైస్తవ తల్లిదండ్రులు అదే చేయాలి. తమ పిల్లలు పవిత్రమైన ప్రవర్తనను అలవర్చుకుని, దేవుని మహాగొప్ప నామానికి వాళ్లు ఘనత తెచ్చేలా తల్లిదండ్రులు సహాయం చేయాలి.—సామెతలు 1:8; ఎఫెసీయులు 6:4 చదవండి.

మన పిల్లలకు యెహోవా గురించి బోధించడం ద్వారా ఆయన నామానికి ఘనత తీసుకొస్తాం (5, 6 పేరాలు చూడండి)

7. (ఎ) ఇశ్రాయేలీయులు నమ్మకంగా ఉన్నప్పుడు, అది వాళ్ల చుట్టుపక్కల జనాంగాలపై ఎలాంటి ప్రభావం చూపించింది? (బి) దేవుని నామాన్ని ధరించిన వాళ్లందరి మీద ఏ బాధ్యత ఉంది?

7 అలా ఇశ్రాయేలీయులు నమ్మకంగా ఉన్నంతకాలం దేవుని నామానికి చక్కని సాక్ష్యం ఇచ్చారు. దేవుడు వాళ్లకిలా చెప్పాడు, “భూప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు.” (ద్వితీ. 28:10) అయితే విచారకరంగా ఇశ్రాయేలీయుల చరిత్ర ఎక్కువగా వాళ్ల అవిధేయతతో నిండిపోయింది. వాళ్లు పదేపదే విగ్రహారాధనలో మునిగిపోయారు. అంతేకాక, తాము ఆరాధించిన కనాను దేవుళ్లలా వాళ్లు క్రూరులుగా తయారై, తమ పిల్లల్ని బలి అర్పించారు, బీదలను అణచివేశారు. వాళ్ల చెడు ప్రవర్తన మనకు ఓ శక్తిమంతమైన పాఠాన్ని నేర్పిస్తుంది. మనం పరిశుద్ధ దేవుడైన యెహోవా నామాన్ని ధరించాం కాబట్టి ఆయనను అనుకరిస్తూ, ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండాలి.

“ఇదిగో, నేనొక నూతనక్రియ చేయుచున్నాను”

8. యెహోవా యెషయాకు ఏమి చేయమని చెప్పాడు? దానికి యెషయా ఎలా స్పందించాడు?

8 ఇశ్రాయేలీయులు చెరలోనుండి అద్భుతమైన విడుదలను చూస్తారని యెహోవా ముందే చెప్పాడు. (యెష. 43:19) యెషయా గ్రంథంలోని మొదటి ఆరు అధ్యాయాలు పరిశీలిస్తే, యెరూషలేముపై దాని చుట్టుపక్కల నగరాలపై ఒకానొక విపత్తు ముంచుకురాబోతోందనే హెచ్చరికలే ఎక్కువగా ఉంటాయి. ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడరని యెహోవాకు తెలుసు, అయినా ఈ హెచ్చరికలను ప్రకటిస్తూనే ఉండమని ఆయన యెషయాకు చెప్పాడు. అయితే ఆ జనాంగం అలా ఎంతకాలం అవిధేయంగా ఉంటుందని యెషయా తెలుసుకోవాలనుకున్నాడు. దానికి దేవుడు, “నివాసులు లేక పట్టణములును, మనుష్యులు లేక యిండ్లును పాడగు వరకును దేశము బొత్తిగా బీడగువరకును” అని సమాధానం ఇచ్చాడు.—యెషయా 6:8-11 చదవండి.

9. (ఎ) యెరూషలేము గురించి యెషయా చెప్పిన ప్రవచనం ఎప్పుడు నెరవేరింది? (బి) నేడు మనం ఏ హెచ్చరికను లక్ష్యపెట్టాలి?

9 యెషయాకు ఈ నియామకం ఉజ్జియా రాజు పాలనలోని చివరి సంవత్సరం అంటే సుమారు సా.శ.పూ. 778⁠లో వచ్చింది. అప్పటి నుండి సా.శ.పూ. 732 తర్వాతి వరకూ అంటే హిజ్కియా రాజు పరిపాలనలో కూడా ప్రవచిస్తూ, యెషయా దాదాపు 46 సంవత్సరాలు ప్రవక్తగా సేవ చేశాడు. ఆ తర్వాత 125 సంవత్సరాలకు అంటే సా.శ.పూ. 607⁠లో యెరూషలేము నాశనమైంది. అలా, తమ జనాంగానికి ముందుముందు ఏమి జరగనుందో యెహోవా ఎంతో ముందే ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు. అలాగే నేడు కూడా, భవిష్యత్తులో ఏమి జరగనుందో యెహోవా తన ప్రజల ద్వారా ఎంతో ముందే తెలియజేశాడు. సాతాను దుష్ట పరిపాలన అంతం కాబోతుందని, యేసుక్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన మొదలవ్వబోతోందని కావలికోట తన మొట్టమొదటి సంచిక నుండి 135 ఏళ్లుగా ప్రజలకు చెబుతూనే ఉంది.—ప్రక. 20:1-3, 6.

10, 11. యెషయా చెప్పిన ఏ ప్రవచన నెరవేర్పును బబులోనులో ఉన్న ఇశ్రాయేలీయులు చూశారు?

10 దేవుని మాటకు విధేయులైన చాలామంది యూదులు బబులోనీయులకు లొంగిపోయి, బబులోనుకు చెరగా వెళ్లారు. అలా వాళ్లు యెరూషలేము నాశనం నుండి తప్పించుకున్నారు. (యిర్మీ. 27:11, 12) అక్కడ వాళ్లు, 70 సంవత్సరాల తర్వాత మరో అద్భుతమైన ప్రవచనం నెరవేరడం కళ్లారా చూశారు. “ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—మీ నిమిత్తము నేను బబులోను[కు] పంపితిని, నేను వారినందరిని పారిపోవునట్లు చేసెదను.”—యెష. 43:14.

11 ఆ ప్రవచనానికి అనుగుణంగా, సా.శ.పూ. 539 అక్టోబరులో ఒక రాత్రి ఓ ప్రాముఖ్యమైన సంఘటన జరిగింది. బబులోను రాజు, అతని అధిపతులు యెరూషలేము ఆలయం నుండి తీసుకొచ్చిన పరిశుద్ధమైన గిన్నెలలో ద్రాక్షారసం తాగుతూ తమ దేవతలను స్తుతిస్తుండగా, కోరెషు సారధ్యంలో మాదీయ-పారసీక సైన్యాలు బబులోనును జయించాయి. సా.శ.పూ. 538 లేదా 537⁠లో కోరెషు, యూదులందర్నీ యెరూషలేముకు వెళ్లి ఆలయాన్ని మళ్లీ కట్టమని ఆజ్ఞాపించాడు. ఇదంతా యెషయా ముందే ప్రవచించాడు, అంతేకాక ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపంతో యెరూషలేముకు తిరిగొచ్చేటప్పుడు వాళ్ల అవసరాలు తీరుస్తానని, కాపాడతానని యెహోవా చేసిన వాగ్దానం గురించి కూడా ప్రవచించాడు. “నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు” అని యెహోవా వాళ్ల గురించి చెప్పాడు. (యెష. 43:21; 44:26-28) వాళ్లు యెరూషలేముకు తిరిగివచ్చి, ఆలయాన్ని మళ్లీ కట్టిన తర్వాత, ఏకైక సత్యదేవుడైన యెహోవా తాను ఇచ్చిన మాటను ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటాడనే వాస్తవానికి సాక్షులుగా నిలిచారు.

12, 13. (ఎ) యెహోవా ఆరాధన పునః స్థాపించబడినప్పుడు ఇశ్రాయేలీయులతోపాటు ఎవరు కూడా ఉన్నారు? (బి) ‘దేవుని ఇశ్రాయేలుకు’ మద్దతిస్తున్న ‘వేరేగొర్రెలు’ ఎలా ఉండాలి? వాళ్లకు ముందుముందు ఏ గొప్ప అవకాశం ఉంది?

12 ఆలయాన్ని మళ్లీ కట్టడానికి ఇశ్రాయేలీయులు యెరూషలేముకు తిరిగొచ్చినప్పుడు, వాళ్లతో కలిసి వేలమంది విదేశీయులు యెహోవాను ఆరాధించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత, ఇంకా ఎక్కువమంది అన్యులు యెహోవా ఆరాధకులయ్యారు. (ఎజ్రా 2:58, 64, 65; ఎస్తే. 8:17) నేడు యేసు ‘వేరే గొర్రెలకు’ చెందిన “గొప్పసమూహము,” ‘దేవుని ఇశ్రాయేలైన’ అభిషిక్త క్రైస్తవులకు యథార్థంగా మద్దతిస్తోంది. (ప్రక. 7:9, 10; యోహా. 10:16; గల. 6:16) గొప్పసమూహం సభ్యులు కూడా యెహోవాసాక్షులనే దైవిక నామాన్ని ధరిస్తారు.

13 క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన కాలంలో, గొప్పసమూహం సభ్యులకు అద్భుతమైన అవకాశం దొరుకుతుంది. సాతాను లోకం చివరి రోజుల్లో యెహోవాసాక్షిగా జీవించడం ఎలా ఉండేదో, పునరుత్థానమైన వాళ్లకు చెబుతున్నప్పుడు వాళ్లు పొందే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. అయితే ప్రస్తుతం మనం మన పేరుకు తగ్గట్లుగా జీవిస్తూ, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయాసపడితేనే ఆ అవకాశం దొరుకుతుంది. యెహోవా ప్రమాణాల ప్రకారం జీవించాలని మనం ఎంతగా కృషి చేసినా, మనం రోజూ తప్పులు చేస్తుంటాం. కాబట్టి మనం ప్రతీరోజూ యెహోవాను క్షమాపణ వేడుకోవాలి. తన పరిశుద్ధ నామాన్ని మనం ధరించేలా అనుమతిస్తున్న యెహోవాకు కృతజ్ఞత చూపించాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి.—1 యోహాను 1:8, 9 చదవండి.

దేవుని పేరుకున్న అర్థం ఏమిటి?

14. యెహోవా పేరుకు అర్థం ఏమిటి?

14 యెహోవా నామాన్ని ధరించే గొప్ప గౌరవం పట్ల మన కృతజ్ఞత పెంచుకోవడానికి, ఆ పేరుకున్న అర్థం గురించి ఆలోచించడం మంచిది. యెహోవా అనే పేరు, క్రియను సూచించే ఓ హీబ్రూ పదం నుండి వచ్చింది, దాన్ని “అవ్వు” అని కూడా అనువదించవచ్చు. అలా యెహోవా అనే పేరుకు “తానే కర్త అవుతాడు” అనే అర్థముందని తెలుస్తుంది. ఈ పేరుకున్న అర్థం, భౌతిక విశ్వాన్ని, తెలివిగల ప్రాణులను సృష్టించిన సృష్టికర్తగా, తన వాగ్దానాలు నెరవేర్చే వ్యక్తిగా ఆయన పాత్రలకు సరిగ్గా సరిపోతుంది. సంఘటనలు జరుగుతుండగా తన చిత్తం, సంకల్పం క్రమంగా నెరవేరేలా ఆయన చేస్తాడు. యెహోవా చిత్తం జరగకుండా ఆపాలని సాతానులాంటి శత్రువులు ఎంత ప్రయత్నించినా అది జరిగితీరుతుంది.

15. యెహోవా మోషేతో చెప్పినదాన్ని బట్టి, దేవుని పేరు గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు? (“ పరిపూర్ణ అర్థమున్న పేరు” అనే బాక్సు చూడండి)

15 యెహోవా తన పేరుకున్న అర్థాన్ని మోషేకు మరింతగా వివరించాడు. తన ప్రజల్ని ఐగుప్తునుండి విడిపించే పనిని మోషేకు అప్పగిస్తూ ఆయనిలా అన్నాడు, ‘నేను ఎలా అవ్వాలనుకుంటే అలా అవుతాను. [లేదా, నేను ఎలా కావాలనుకుంటే అలా అవుతాను.] “నేను అవుతాను” అనే ఆయన మీ దగ్గరికి నన్ను పంపించాడని నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను.’ (నిర్గ. 3:14, NW) అలా యెహోవా ఏ పరిస్థితిలోనైనా, తన సంకల్పాన్ని నెరవేర్చడానికి కావాల్సిన విధంగా అవుతాడు. అప్పట్లో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులకు ఆయన విమోచకుడు, రక్షకుడు, నిర్దేశకుడు, భౌతిక-ఆధ్యాత్మిక అవసరాలు తీర్చే పోషకుడు అయ్యాడు.

మన కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు?

16, 17. (ఎ) యెహోవా నామాన్ని ధరించే అరుదైన గౌరవం పట్ల మన కృతజ్ఞత ఎలా చూపించవచ్చు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

16 యెహోవా నేడు కూడా మన ఆధ్యాత్మిక, భౌతిక అవసరాలన్నిటినీ తీరుస్తూ తన పేరుకున్న అర్థానికి తగ్గట్లుగా వ్యవహరిస్తున్నాడు. అయితే యెహోవా పేరు ఆయన గురించిన మరో విషయాన్ని కూడా మనకు నేర్పిస్తుంది. ఏమిటా విషయం? యెహోవా తన చిత్తం నెరవేర్చేందుకు తన సృష్టి కూడా అవసరమైన విధంగా అయ్యేలా చేయగలడు. ఉదాహరణకు, తన పనిని చేయడానికి ఆయన తన సాక్షులను ఉపయోగించుకుంటున్నాడు. ఆ విషయం గురించి ఆలోచించడంవల్ల, ఆయన పేరుకు తగ్గట్లుగా మనం జీవించాలనే పురికొల్పు పొందుతాం. నార్వేలో గత 70 సంవత్సరాలుగా ఉత్సాహంగా సాక్ష్యమిస్తోన్న 84 ఏళ్ల కోరా ఏమంటున్నాడంటే, “నిరంతరం రాజుగావున్న యెహోవాను సేవించడం, ఆయన పరిశుద్ధ నామంతో పిలువబడే ప్రజల్లో ఒకరిగా ఉండడం ఓ గొప్ప గౌరవంగా నేను భావిస్తున్నాను. బైబిలు సత్యాన్ని ఇతరులకు వివరించడం, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు వాళ్ల కళ్లలో ఆనందం చూడడం ఒక అరుదైన అవకాశం. క్రీస్తు విమోచన క్రయధనం ఎలా పనిచేస్తుందో, దానివల్ల వాళ్లు నీతియుక్త నూతనలోకంలో శాంతిగా ఎలా జీవించవచ్చో ఇతరులకు బోధిస్తున్నప్పుడు ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది.”

17 నిజమే, దేవుని గురించి నేర్చుకోవాలని కోరుకునే వాళ్లను కలుసుకోవడం కొన్ని ప్రాంతాల్లో అంతకంతకూ కష్టమౌతోంది. అయినప్పటికీ, సత్యాన్ని వినాలనుకునే వ్యక్తిని కనుగొని ఆయనకు యెహోవా పేరు గురించి బోధించినప్పుడు కలిగే హృదయపూర్వక ఆనందాన్ని కోరాలాగే మీరు కూడా ఆస్వాదించడం లేదా? అయితే, మనం యెహోవాసాక్షులుగా ఉంటూనే యేసుకు కూడా ఎలా సాక్షులుగా ఉండవచ్చు? తర్వాతి ఆర్టికల్‌లో ఈ విషయం పరిశీలిద్దాం.