కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రాజ్యంపై అచంచలమైన విశ్వాసం ఉంచండి

రాజ్యంపై అచంచలమైన విశ్వాసం ఉంచండి

“విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపము.”—హెబ్రీ. 11:1.

1, 2. మానవజాతి విషయంలో యెహోవా సంకల్పాన్ని దేవునిరాజ్యం నెరవేరుస్తుందని ఎలా చెప్పవచ్చు? ఎందుకు? (ప్రారంభ చిత్రం చూడండి.)

 దేవుని రాజ్యం మాత్రమే మన కష్టాలన్నిటినీ పూర్తిగా తీసేస్తుందని యెహోవాసాక్షులమైన మనం ఉత్సాహంగా ప్రకటిస్తాం. ఆ రాజ్యం ఇచ్చే నిరీక్షణవల్ల ఎంతో ఓదార్పు కూడా పొందుతాం. అయితే, ఆ రాజ్యం వాస్తవమైనదనీ అది దాని సంకల్పాన్ని పూర్తిగా నెరవేరుస్తుందనీ మనం నిజంగా నమ్ముతున్నామా? రాజ్యంపై అచంచలమైన విశ్వాసం ఉంచడానికి మనకు ఏదైనా బలమైన ఆధారం ఉందా?—హెబ్రీ. 11:1.

2 సృష్టి విషయంలో తన సంకల్పాన్ని నెరవేర్చడానికి సర్వశక్తిగల దేవుడే స్వయంగా మెస్సీయ రాజ్యాన్ని స్థాపించాడు. ‘యెహోవాకు మాత్రమే ఉన్న పరిపాలనా హక్కు’ అనే స్థిరమైన పునాదిపై ఆ రాజ్యం ఆధారపడివుంది. ఆ రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన అంశాల్ని అంటే, దాని రాజు ఎవరు? సహపరిపాలకులుగా ఎవరుంటారు? ఆ రాజ్యం దేన్ని పరిపాలిస్తుంది? వంటివాటిని స్థిరపర్చడానికి యెహోవా కొన్ని నిబంధనలు లేదా చట్టబద్ధమైన ఒప్పందాలు చేశాడు. యెహోవాతోపాటు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా మనుషులతో నిబంధన చేశాడు. వాటిగురించి ధ్యానిస్తే, దేవుని సంకల్పం నిస్సందేహంగా ఎలా నెరవేరుతుందో మరింతగా అర్థం చేసుకుంటాం, ఆ రాజ్యం స్థిరమైనదనే మన నమ్మకం కూడా బలపడుతుంది.—ఎఫెసీయులు 2:12 చదవండి.

3. ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

3 యేసుక్రీస్తు ఆధ్వర్యంలోని మెస్సీయ రాజ్యా నికి సంబంధించిన ఆరు ముఖ్యమైన నిబంధనల్ని బైబిలు ప్రస్తావిస్తుంది. అవి: (1) అబ్రాహాము నిబంధన, (2) ధర్మశాస్త్ర నిబంధన, (3) దావీదు నిబంధన, (4) మెల్కీసెదెకులా యాజకునిగా ఉండమని నిబంధన, (5) కొత్త నిబంధన, (6) రాజ్య నిబంధన. ప్రతీ నిబంధనకు రాజ్యంతో ఎలాంటి సంబంధం ఉందో; భూమిపట్ల, మానవజాతిపట్ల దేవుని సంకల్పాన్ని అవి ఎలా నెరవేరుస్తున్నాయో ఇప్పుడు చూద్దాం.—“ దేవుడు తన సంకల్పాన్ని ఎలా నెరవేరుస్తాడు?” అనే బాక్సు చూడండి.

దేవుని సంకల్పం ఎలా నెరవేరుతుందో చూపించే ఓ వాగ్దానం

4. యెహోవా మనుషుల గురించి ఏ మూడు తీర్మానాలు తెలియజేశాడు?

4 మనుషులు నివసించడానికి అందమైన భూమిని సిద్ధం చేసిన తర్వాత, యెహోవా వాళ్ల గురించి మూడు తీర్మానాలు తెలియజేశాడు. వాళ్లను తన స్వరూపంలో సృష్టిస్తానని, వాళ్లు పరదైసును భూమంతా విస్తరింపజేసి నీతిమంతులైన తమ పిల్లలతో భూమిని నిండించాలని, మంచి చెడుల తెలివినిచ్చు చెట్టు పళ్లను తినకూడదని చెప్పాడు. (ఆది. 1:26, 28; 2:16, 17) మనుషుల విషయంలో, భూమి విషయంలో తన సంకల్పం ఏమిటో ఆ మూడు తీర్మానాల్లో యెహోవా సవివరంగా తెలియజేశాడు. మరైతే, నిబంధనలు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది?

5, 6. (ఎ) దేవుని సంకల్పం నెరవేరకుండా చేయడానికి సాతాను ఎలా ప్రయత్నించాడు? (బి) ఏదెనులో సాతాను చేసిన సవాలుకు యెహోవా ఎలా స్పందించాడు?

5 దేవుని సంకల్పాన్ని అడ్డుకోవడానికి, అపవాదియైన సాతాను తిరుగుబాటు లేవనెత్తాడు. మంచిచెడుల తెలివినిచ్చే చెట్టు పళ్లను తినేలా హవ్వను శోధించి, మనుషులు దేవునికి అవిధేయులయ్యేలా చేశాడు. (ఆది. 3:1-5; ప్రక. 12:10) అలా, యెహోవా దేవునికున్న పరిపాలనా హక్కును అతను సవాలు చేశాడు. అంతేకాదు, స్వార్థంతోనే యెహోవాను ఆరాధిస్తున్నారని ఆయన యథార్థసేవకులపై కూడా సాతాను నిందమోపాడు.—యోబు 1:9-11; 2:4, 5.

6 ఏదెనులో సాతాను చేసిన సవాలుకు యెహోవా ఎలా స్పందించాడు? ఆయన ఆ తిరుగుబాటుదారులను నాశనం చేసివుంటే ఆ తిరుగుబాటు అక్కడితోనే ఆగిపోయివుండేది. కానీ అలాచేస్తే, విధేయులైన ఆదాముహవ్వల పిల్లలతో భూమిని నింపాలన్న యెహోవా సంకల్పం కూడా నెరవేరదు. అందుకే జ్ఞానవంతుడైన యెహోవా ఆ తిరుగుబాటుదారులను అక్కడికక్కడే నాశనం చేసే బదులు ఓ గొప్ప ప్రవచనాన్ని చెప్పాడు, అదే ఏదెను వాగ్దానం. భూమికి, మనుషులకు సంబంధించిన దేవుని వాగ్దానాల్లో ప్రతీదీ నిజమౌతుందని అది భరోసా ఇచ్చింది.—ఆదికాండము 3:15 చదవండి.

7. సాతానుకి, అతని సంతానానికి ఏమి జరుగుతుందని ఏదెను వాగ్దానం తెలియజేసింది?

7 యెహోవా ఏదెనులో చేసిన వాగ్దానం ద్వారా సర్పంపై అంటే సాతానుపై; దాని సంతానంపై అంటే తన పరిపాలనా హక్కును వ్యతిరేకించే వాళ్లపై తీర్పు ప్రకటించాడు. అంతేకాదు, సాతానును నాశనం చేసే అధికారాన్ని పరలోక స్త్రీ సంతానానికి యెహోవా ఇచ్చాడు. అలా ఏదెనులో చేసిన వాగ్దానం, సాతాను నాశనం అవుతాడనీ అతని తిరుగుబాటువల్ల వచ్చిన సమస్యలు పూర్తిగా పోతాయనీ నొక్కి చెప్పడంతోపాటు, వాటిని ఎవరు చేస్తారో కూడా తెలియజేసింది.

8. స్త్రీ గురించి, స్త్రీ సంతానం గురించి ఏమి నేర్చుకున్నాం?

8 మరి, స్త్రీ సంతానం ఎవరు? ఆ సంతానం, సర్పం తలను చితకకొట్టాలి అంటే ఆత్మ ప్రాణియైన సాతానును ‘నశింపజేయాలి,’ కాబట్టి ఆ సంతానం కూడా ఆత్మ ప్రాణే అయ్యుండాలి. (హెబ్రీ. 2:14, 15) అందుకే, ఆ సంతానాన్ని కనే స్త్రీ కూడా ఆత్మ ప్రాణులకు సంబంధించినదే అయ్యుండాలి. ఓవైపు సర్ప సంతానం విస్తరిస్తున్నా; ఆ స్త్రీ ఎవరో, ఆమె సంతానం ఎవరో వంటి విషయాలు ఏదెను వాగ్దానం తర్వాత దాదాపు 4,000 సంవత్సరాల పాటు మర్మంగా మిగిలిపోయాయి. ఈలోగా ఆ సంతానాన్ని గుర్తుపట్టేందుకు, సాతాను తిరుగుబాటువల్ల వచ్చిన నష్టాన్ని ఎలా భర్తీ చేస్తాడో తెలియజేసేందుకు దేవుడు కొన్ని నిబంధనలు చేశాడు.

సంతానాన్ని గుర్తించే నిబంధన

9. అబ్రాహాము నిబంధన అంటే ఏమిటి? అది ఎప్పుడు అమలులోకి వచ్చింది?

9 యెహోవా సాతానుపై తీర్పు ప్రకటించిన సుమారు రెండు వేల సంవత్సరాల తర్వాత, “ఊరు” పట్టణంలోని ఇంటిని విడిచిపెట్టి కనాను దేశానికి వెళ్లమని అబ్రాహాముకు ఆజ్ఞాపించాడు. (అపొ. 7:2, 3) యెహోవా ఆయనకిలా చెప్పాడు, “నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువులయొద్దనుండియు నీ తండ్రి యింటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడును.” (ఆది. 12:1-3) దేవుడు అబ్రాహాముతో చేసిన ఆ వాగ్దానమే, అబ్రాహాము నిబంధన. యెహోవా అబ్రాహాముతో ఖచ్చితంగా ఎప్పుడు ఆ నిబంధనను మొదటిసారి చేశాడో మనకైతే తెలియదు. అయితే, 75 ఏళ్ల వయసులో అబ్రాహాము హారానును విడిచిపెట్టి, యూఫ్రటీసు నది దాటినప్పుడు అంటే సా.శ.పూ. 1943⁠లో అది అమలులోకి వచ్చింది.

10. (ఎ) దేవుని వాగ్దానాలపై అబ్రాహాము ఎలా అచంచల విశ్వాసం చూపించాడు? (బి) స్త్రీ సంతానానికి సంబంధించిన ఎలాంటి వివరాల్ని యెహోవా క్రమక్రమంగా తెలియజేశాడు?

10 యెహోవా అబ్రాహాముకు మరిన్ని వివరాలు తెలియజేస్తూ ఆ నిబంధన గురించి మళ్లీమళ్లీ చెప్పాడు. (ఆది. 13:15-17; 17:1-8, 16) అబ్రాహాము తన ఏకైక కొడుకును బలి అర్పించడానికి సిద్ధపడి, దేవుని వాగ్దానాలమీద అచంచల విశ్వాసం చూపినప్పుడు, యెహోవా తన వాగ్దానం నిజమౌతుందని అబ్రాహాముకు భరోసా ఇస్తూ ఆ నిబంధనను స్థిరపర్చాడు. (ఆదికాండము 22:15-18; హెబ్రీయులు 11:17, 18 చదవండి.) అబ్రాహాము నిబంధన అమలులోకి వచ్చాక, స్త్రీ సంతానానికి సంబంధించిన ముఖ్యమైన వివరాల్ని యెహోవా క్రమక్రమంగా తెలియజేశాడు. ఆ సంతానం అబ్రాహాము వంశం నుండి వస్తుందని, ఆ సంతానంలో చాలామంది ఉంటారని, వాళ్లు రాజులుగా పరిపాలిస్తారని, శత్రువులందర్నీ నాశనం చేస్తారని, చాలామందికి ఆశీర్వాదాలు ఇస్తారని తెలియజేశాడు.

అబ్రాహాము దేవుని వాగ్దానాల మీద అచంచలమైన విశ్వాసం చూపించాడు (10వ పేరా చూడండి)

11, 12. అబ్రాహాము నిబంధన మరింత గొప్పగా నెరవేరుతుందని లేఖనాలు ఎలా చూపిస్తున్నాయి? దానివల్ల మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం?

11 అబ్రాహాము సంతతి వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ నిబంధన మొదటిసారిగా నెరవేరింది. అయితే ఆ నిబంధనలోని విషయాలు ఆధ్యాత్మిక భావంలో కూడా నెరవేరతాయని బైబిలు చూపిస్తుంది. (గల. 4:22-25) అబ్రాహాము సంతానంలో ప్రథమ లేదా ముఖ్యమైన భాగం యేసుక్రీస్తని అపొస్తలుడైన పౌలు దైవప్రేరణతో వివరించాడు. అందులోని రెండవ భాగం 1,44,000 మంది అభిషిక్త క్రైస్తవులను సూచిస్తుంది. (గల. 3:16, 29; ప్రక. 5:9,10; 14:1, 4) ఆ సంతానాన్ని కనే స్త్రీ, “పైనున్న యెరూషలేము” అంటే దేవుని సంస్థలోని పరలోక భాగం. అందులో నమ్మకమైన ఆత్మప్రాణులు ఉన్నారు. (గల. 4:26, 31) అబ్రాహాము నిబంధనలో దేవుడు వాగ్దానం చేసినట్లు, స్త్రీ సంతానం మానవజాతికి ఆశీర్వాదాలు తెస్తుంది.

12 అబ్రాహాము నిబంధన పరలోక రాజ్యానికి చట్టబద్ధమైన పునాది వేయడంతోపాటు, ఆ రాజ్యాన్ని పొందేందుకు రాజుకు, ఆయన సహపరిపాలకులకు మార్గం తెరిచింది. (హెబ్రీ. 6:13-18) ఈ నిబంధన ఎంతకాలంపాటు అమలులో ఉంటుంది? అది “నిత్యనిబంధన” అని ఆదికాండము 17:7 చెబుతుంది. మెస్సీయ రాజ్యం దేవుని శత్రువులందర్నీ నాశనం చేసి, భూమ్మీదున్న అన్ని కుటుంబాల్ని ఆశీర్వదించే వరకూ అది అమలులో ఉంటుంది. (1 కొరిం. 15:23-26) నిజానికి, అప్పుడు భూమ్మీద జీవించేవాళ్లు శాశ్వతమైన ప్రయోజనాలు పొందుతారు. నీతిమంతులైన మనుషులతో ‘భూమిని నిండించాలనే’ తన సంకల్పాన్ని నెరవేర్చాలని యెహోవా ఎంత పట్టుదలగా ఉన్నాడో అబ్రాహాము నిబంధన చూపిస్తుంది.—ఆది. 17:7.

రాజ్యం నిరంతరం ఉంటుందని హామీ ఇచ్చే నిబంధన

13, 14. మెస్సీయ రాజ్యం గురించి దావీదు నిబంధన ఏ హామీ ఇస్తుంది?

13 యెహోవా పరిపాలన ఎల్లప్పుడూ ఆయన నీతి ప్రమాణాలపై ఆధారపడి ఉంటుందని ఏదెనులో చేసిన వాగ్దానం, అబ్రాహాముతో చేసిన నిబంధన చూపిస్తున్నాయి. కాబట్టి ఆయన ఏర్పాటు చేసిన మెస్సీయ రాజ్యం కూడా అవే నీతి ప్రమాణాలపై ఆధారపడివుంటుంది. (కీర్త. 89:14) మెస్సీయ రాజ్యం కలుషితం అయిపోయి, దాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఎప్పటికైనా వస్తుందా? అలా ఎన్నటికీ జరగదని మరో నిబంధన హామీ ఇస్తుంది.

14 దావీదు నిబంధన ద్వారా, యెహోవా ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదుకు ఏమి వాగ్దానం చేశాడో చూడండి. (2 సమూయేలు 7:12, 16 చదవండి.) దావీదు యెరూషలేములో రాజుగా పరిపాలిస్తున్నప్పుడు యెహోవా నిబంధన చేసి, మెస్సీయ అతని సంతతిలో నుండి వస్తాడని చెప్పాడు. (లూకా 1:30-33) అలా, స్త్రీ సంతానం ఏ కుటుంబం నుండి వస్తాడో చెబుతూ, దావీదు వంశస్థుడు మెస్సీయ రాజ్యానికి “స్వాస్థ్యకర్త” అవుతాడని యెహోవా తెలియజేశాడు. (యెహె. 21:25-27) యేసు ద్వారా దావీదు రాజరికం ‘నిత్యం స్థిరపర్చబడుతుంది.’ నిస్సందేహంగా, దావీదు సంతానం ‘శాశ్వతంగా ఉంటుంది, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలం ఉంటుంది.’ (కీర్త. 89:34-37) అవును, మెస్సీయ రాజ్యం ఎప్పటికీ కలుషితమవ్వదు, అది చేసే పనులు శాశ్వతంగా ఉంటాయి!

యాజకునిగా ఉండేందుకు నిబంధన

15-17. మెల్కీసెదెకులా యాజకునిగా ఉండమని చేసిన నిబంధన ప్రకారం, సంతానం ఏ పని కూడా చేయాలి? ఎందుకు?

15 స్త్రీ సంతానం రాజుగా పరిపాలిస్తాడని అబ్రాహాము నిబంధనవల్ల, దావీదు నిబంధన వల్ల స్పష్టమైనా, అన్ని దేశాల ప్రజలకు ఆశీర్వాదాలు తీసుకురావాలంటే రాజరికం ఒక్కటే సరిపోదు. మనుషులు నిజంగా ఆశీర్వాదాలు అనుభవించాలంటే, తమ పాపపు స్థితినుండి బయటపడాలి, యెహోవా విశ్వ కుటుంబంలో సభ్యులవ్వాలి. అలా జరగాలంటే, ఆ సంతానం యాజకునిగా కూడా సేవచేయాలి. అందుకే జ్ఞానవంతుడైన మన సృష్టికర్త మరో చట్టబద్ధమైన ఒప్పందం చేశాడు, అదే మెల్కీసెదెకులా యాజకునిగా ఉండమని నిబంధన.

16 తాను యేసుక్రీస్తుతో ఓ నిబంధన చేయబోతున్నానని యెహోవా దావీదు ద్వారా తెలియజేశాడు. అందులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేంటంటే, తన శత్రువులందర్నీ నాశనం చేసేంతవరకు యేసుక్రీస్తు ‘[దేవుని] కుడి పార్శ్వమున కూర్చుంటాడు.’ రెండవది, ఆయన ‘మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకునిగా ఉంటాడు.’ (కీర్తన 110:1, 2, 4 చదవండి.) యేసు ఎందుకు ‘మెల్కీసెదెకు క్రమం చొప్పున’ యాజకునిగా ఉంటాడు? ఎందుకంటే, అబ్రాహాము సంతతి వాగ్దానదేశాన్ని జయించడానికి చాలాకాలం క్రితం, షాలేము రాజైన మెల్కీసెదెకు ‘మహోన్నతుడగు దేవుని యాజకునిగా’ సేవ చేశాడు. (హెబ్రీ. 7:1-3) అలా సేవ చేసేలా ఆయన్ను స్వయంగా యెహోవాయే నియమించాడు. రాజుగా, యాజకునిగా సేవ చేసినట్లు హెబ్రీ లేఖనాలు ఒక్క మెల్కీసెదెకు గురించే ప్రస్తావించాయి. అంతేకాదు, ఆయనకు ముందుగానీ తర్వాతగానీ ఎవ్వరూ అలా సేవ చేసినట్లు ఆధారాలు లేవు, అందుకే మెల్కీసెదెకు “నిరంతరము యాజకుడుగా ఉన్నాడు.”

17 ఆ నిబంధన ద్వారా యెహోవాయే యేసును యాజకునిగా నియమించాడు. యేసు ‘మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకునిగా ఉంటాడు.’ (హెబ్రీ. 5:4-6) యెహోవా భూమిపట్ల, మనుషులపట్ల తన సంకల్పాన్ని నెరవేర్చడానికి తాను మెస్సీయ రాజ్యాన్ని ఉపయోగిస్తానని ఈ నిబంధన ద్వారా హామీ ఇస్తున్నాడు.

నిబంధనలు రాజ్యానికి చట్టబద్ధమైన పునాది వేశాయి

18, 19. (ఎ) ఇప్పటివరకూ మనం చర్చించిన నిబంధనలు రాజ్యం గురించి ఏమి తెలియజేశాయి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి చర్చిస్తాం?

18 ఇప్పటివరకు పరిశీలించిన నిబంధనల గురించి ఆలోచిస్తే, వాటికి మెస్సీయ రాజ్యంతో ఉన్న సంబంధం ఏమిటో అర్థమౌతుంది. అంతేకాదు ఆ రాజ్యం, చట్టబద్ధమైన ఒప్పందాలు అనే స్థిరమైన పునాదిపై ఎలా ఆధారపడివుందో స్పష్టంగా చూడగలుగుతాం. యెహోవా ఏదెనులో చేసిన వాగ్దానాన్ని బట్టి భూమిపట్ల, మనుషులపట్ల తన సంకల్పాన్ని స్త్రీ సంతానం ద్వారా నెరవేర్చడానికి కట్టుబడివున్నాడు. ఆ సంతానం ఎవరు? ఆయన ఏ పని చేస్తాడు? ఈ ప్రశ్నలన్నిటికీ అబ్రాహాము నిబంధనలో సమాధానాలు ఉన్నాయి.

19 స్త్రీ సంతానంలోని ప్రథమ భాగం ఏ కుటుంబం నుండి వస్తాడో దావీదు నిబంధన తెలియజేసింది. అంతేకాదు, భూమిని నిరంతరం పరిపాలించే హక్కును ఆ నిబంధన యేసుకు ఇచ్చింది. మెల్కీసెదెకులా యాజకునిగా ఉండమనే నిబంధన, ఆ సంతానం యాజకునిగా సేవ చేసే వీలు కల్పించింది. అయితే, మనుషుల్ని పరిపూర్ణులుగా చేసేపనిని యేసు ఒక్కడే చేయడు. అభిషిక్తులైన ఇతరులు కూడా రాజులుగా, యాజకులుగా సేవ చేస్తారు. ఇంతకీ వాళ్లెక్కడ నుండి వచ్చారు? ఆ విషయాన్ని తర్వాతి ఆర్టికల్‌లో చర్చిస్తాం.