కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాతో పనిచేసే అవకాశాన్ని అమూల్యంగా ఎంచండి!

యెహోవాతో పనిచేసే అవకాశాన్ని అమూల్యంగా ఎంచండి!

“మేము దేవుని జతపనివారమై యున్నాము.”—1 కొరిం. 3:9.

1. యెహోవా ఎలా పనిచేస్తాడు? ఆయన ఇతరులకు ఏ అవకాశం ఇస్తాడు?

 యెహోవా తన పనిని ఆనందంగా చేస్తాడు. (కీర్త. 135:6; యోహా. 5:17) దూతలు, మనుషులు కూడా తమ పనిలో ఆనందించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే వాళ్లకు సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చే పనుల్ని ఆయన అప్పగిస్తాడు. ఉదాహరణకు, సృష్టిని చేస్తున్నప్పుడు తనతోపాటు పనిచేసే అవకాశాన్ని తన ఆదిసంభూతుడైన కుమారునికి ఇచ్చాడు. (కొలొస్సయులు 1:15, 16 చదవండి.) యేసు భూమ్మీదకు రాకముందు పరలోకంలో దేవునితో పాటు ‘ప్రధానశిల్పిగా’ పనిచేశాడని బైబిలు చెబుతుంది.—సామె. 8:30.

2. యెహోవా దేవదూతలకు ప్రాముఖ్యమైన, సంతృప్తినిచ్చే పనుల్ని ఎల్లప్పుడూ అప్పగించాడని ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి?

2 బైబిలు మొదటినుండి చివరిదాకా చూస్తే, యెహోవా తన ఆత్మ కుమారులకు పనులు అప్పగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పాపం చేసిన ఆదాముహవ్వలను ఏదెను తోట నుండి వెళ్లగొట్టాక, యెహోవా “ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.” (ఆది. 3:24) అలాగే “త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను” ఆయన పంపించాడని ప్రకటన 22:6 తెలియజేస్తుంది.

మనుషులకు అప్పగించిన పనులు

3. యేసు భూమ్మీదున్నప్పుడు తన తండ్రిని ఎలా ఆదర్శంగా తీసుకున్నాడు?

3 యేసు పరిపూర్ణ మనిషిగా భూమ్మీద జీవించినప్పుడు, యెహోవా అప్పగించిన పనుల్ని ఎంతో సంతోషంగా చేశాడు. అలాగే తన తండ్రిని ఆదర్శంగా తీసుకుంటూ తన శిష్యులకు కూడా ఎన్నో ముఖ్యమైన పనులు అప్పగించాడు. వాళ్లు ముందుముందు సాధించబోయే పనుల విషయంలో ఆసక్తి రేకెత్తిస్తూ ఆయనిలా చెప్పాడు, “నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” (యోహా. 14:12) అంతేకాక, “పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు” అని వివరిస్తూ వాటిని అత్యవసరంగా చేయాలని నొక్కిచెప్పాడు.—యోహా. 9:4.

4-6. (ఎ) నోవహు, మోషే వీళ్లిద్దరూ యెహోవా అప్పగించిన పనులు చేసినందుకు మనం ఎందుకు రుణపడివున్నాం? (బి) దేవుడు మనుషులకు అప్పగించిన పనులవల్ల ఏ రెండు ఫలితాలు వచ్చాయి?

4 యేసు భూమ్మీదకు రావడానికి ఎంతోకాలం ముందే, యెహోవా మనుషులకు ఎంతో సంతృప్తినిచ్చే పనులు అప్పగించాడు. ఆదాముహవ్వలైతే దేవుడు ఇచ్చిన పనిని చేయలేదు, కానీ ఇతరులు మాత్రం దేవుడు చెప్పినట్లు చేశారు. (ఆది. 1:28) జలప్రళయంలో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఓడను ఎలా నిర్మించాలో నోవహుకు స్పష్టమైన నిర్దేశాలు ఇచ్చాడు. వాటిని నోవహు జాగ్రత్తగా పాటించాడు. ఆయనలా జాగ్రత్తగా పాటించాడు కాబట్టే నేడు మనందరం ఉనికిలో ఉన్నాం.—ఆది. 6:14-16, 22; 2 పేతు. 2:5.

5 అలాగే ప్రత్యక్ష గుడారాన్ని ఎలా నిర్మించాలో, యాజకత్వాన్ని ఎలా వ్యవస్థీకరించాలో యెహోవా మోషేకు సవివరంగా ఉపదేశాలిచ్చాడు, వాటిని మోషే తూ.చా. తప్పకుండా పాటించాడు. (నిర్గ. 39:32; 40:12-16) మోషే ఆ పనులను నమ్మకంగా చేయడంవల్ల, ప్రస్తుతం మనం కూడా ప్రయోజనం పొందుతున్నాం. ఏ విధంగా? ప్రత్యక్ష గుడారం, యాజకత్వం ముందుముందు రాబోయే మంచి విషయాలను సూచిస్తున్నాయని అపొస్తలుడైన పౌలు వివరించాడు.—హెబ్రీ. 9:1-5, 9; 10:1.

6 దేవుని సంకల్పం క్రమక్రమంగా నెరవేరుతుండగా, ఆయన తన సేవకులకు వివిధ రకాల పనులు అప్పగించాడు. అయినప్పటికీ ఆ పనులన్నీ యెహోవా దేవుని నామానికి ఘనత తీసుకొచ్చాయి, నమ్మకస్థులైన మనుషులకు మేలు చేశాయి. ముఖ్యంగా యేసు పరలోకంలో ఉన్నప్పుడు అలాగే భూమ్మీద ఉన్నప్పుడు చేసిన పనుల విషయంలో ఆ మాటలు నూటికి నూరుపాళ్లు నిజం. (యోహా. 4:34; 17:4) అలాగే యెహోవా నేడు మనకు అప్పగించిన పని కూడా ఆయనను ఘనపరుస్తుంది. (మత్త. 5:16; 1 కొరింథీయులు 15:58 చదవండి.) అలాగని ఎందుకు చెప్పవచ్చు?

మీ పని విషయంలో ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండండి

7, 8. (ఎ) నేటి క్రైస్తవులకు ఏ గొప్ప పనిలో పాల్గొనే అవకాశం ఉంది? (బి) యెహోవా నిర్దేశాలకు మనం ఎలా స్పందించాలి?

7 తనతోపాటు పనిచేసే గౌరవాన్ని యెహోవా అపరిపూర్ణులైన మనుషులకు ఇవ్వడం చాలా గొప్ప విషయమని మీరు ఒప్పుకుంటారు. (1 కొరిం. 3:9) కొంతమంది క్రైస్తవులు నోవహులా, మోషేలా నిర్మాణ పనిలో సహాయం చేస్తున్నారు. వాళ్లు సమావేశ హాళ్లు, రాజ్య మందిరాలు, బ్రాంచి వసతులు వంటివి నిర్మిస్తున్నారు. మీరు ఓ రాజ్యమందిరాన్ని మరమ్మతు చేసే పనిలో పాల్గొంటున్నా లేదా న్యూయార్క్‌లోని వార్విక్‌లో మన ప్రధాన కార్యాలయ భవనాలను నిర్మించే పనిలో సహాయం చేస్తున్నా, మీ పనిని అమూల్యంగా ఎంచండి. (ప్రారంభ నమూనా చిత్రం చూడండి.) అది పరిశుద్ధ సేవ. అయితే చాలామంది క్రైస్తవులు ఆధ్యాత్మిక నిర్మాణ పనిలో పాల్గొంటున్నారు. ఈ పనికూడా యెహోవాకు ఘనత తీసుకొచ్చి, విధేయులైన మనుషులకు మేలు చేస్తుంది. (అపొ. 13:47-50) ఆ పని సమర్థవంతంగా జరిగేలా చూడడానికి దేవుని సంస్థ తగిన నిర్దేశాల్ని అందిస్తుంది. అందులో భాగంగా మనకు కొన్నిసార్లు కొత్త సేవా నియామకాలు ఇవ్వవచ్చు.

8 నమ్మకమైన దేవుని సేవకులు ఆయనిచ్చే నిర్దేశాలను పాటించడానికి ఎల్లప్పుడూ ముందుంటారు. (హెబ్రీయులు 13:7, 17 చదవండి.) మనకు ఫలానా కొత్త సేవా నియామకం ఎందుకు ఇచ్చారో మొదట్లో పూర్తిగా అర్థం కాకపోవచ్చు. అయినా, మనం పూర్తిగా సహకరిస్తాం. ఎందుకంటే ఆ కొత్త నియామకాలు యెహోవా నుండే వస్తున్నాయనీ వాటివల్ల మంచి ఫలితాలు వస్తాయనీ మనకు తెలుసు.

9. పెద్దలు పని విషయంలో సంఘానికి ఏ మంచి మాదిరి ఉంచుతారు?

9 నేటి క్రైస్తవ పెద్దలు సంఘాన్ని నడిపించే విధానంలో, తాము యెహోవా చిత్తం చేయాలని ఎంతగా కోరుకుంటున్నారో చూపిస్తారు. (2 కొరిం. 1:24; 1 థెస్స. 5:12, 13) వాళ్లు కష్టపడి పనిచేయడానికి, సంస్థ ఇస్తున్న నిర్దేశాలు పాటించడానికి, ప్రకటనా పనిలో వచ్చే కొత్తకొత్త విధానాలను నేర్చుకోవడానికి ముందుంటారు. టెలిఫోన్‌ సాక్ష్యం కోసం, ఓడ రేవుల్లో లేదా బహిరంగ సాక్ష్యం కోసం ఏర్పాట్లు చేయడానికి మొదట్లో కొంతమంది పెద్దలు వెనకాడినా, తర్వాత చక్కని ఫలితాలు పొందారు. ఉదాహరణకు, జర్మనీలో నలుగురు పయినీర్లు చాలాకాలంగా ప్రకటించని వ్యాపార క్షేత్రంలో పనిచేయాలని అనుకున్నారు. మికాయెల్‌ ఇలా అంటున్నాడు, “మేము వ్యాపారక్షేత్రంలో ప్రకటించి చాలా సంవత్సరాలు అయ్యింది, అందుకే ఎంతో ఆందోళనపడ్డాం. అది యెహోవాకు తప్పకుండా తెలిసుంటుంది, అందుకే ఆ ఉదయం మేము చేసిన సేవ మరపురాని అనుభూతిగా మిగిలేలా చేశాడు. మన రాజ్య పరిచర్యలో వచ్చిన నిర్దేశాల్ని పాటించినందుకు, సహాయం కోసం యెహోవాపై ఆధారపడినందుకు మేమెంత సంతోషించామో!” మీ ప్రాంతంలో కూడా కొత్తకొత్త పద్ధతుల్లో సాక్ష్యం ఇవ్వాలని మీరు ఉవ్విళ్లూరుతున్నారా?

10. ఈమధ్య కాలంలో సంస్థలో ఎలాంటి మార్పులు జరిగాయి?

10 అయితే కొన్నిసార్లు, సంస్థలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈమధ్య కాలంలో కొన్ని చిన్నచిన్న బ్రాంచీలను పెద్ద బ్రాంచీల్లో విలీనం చేశారు. ఆ చిన్న బ్రాంచీల్లో సేవ చేస్తున్న సహోదరసహోదరీల మీద అది ప్రభావం చూపించింది. వాళ్లు కొన్ని సర్దుబాట్లు కూడా చేసుకోవాల్సి వచ్చింది, అయితే తర్వాత వాళ్లు దానివల్ల వచ్చే ప్రయోజనాలను గమనించారు. (ప్రసం. 7:8) పనిచేయడానికి ఇష్టపడే ఈ సాక్షులు, యెహోవా ప్రజల ఆధునిక చరిత్రలో తమకు కూడా వంతు ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నారు!

11-13. సంస్థలో జరిగిన మార్పులవల్ల కొంతమంది ఎలాంటి సర్దుబాట్లు చేసుకోవాల్సి వచ్చింది?

11 ఆ సహోదరసహోదరీల నుండి మనమందరం ఎన్నో ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. వాళ్లలో కొందరు తమతమ బ్రాంచీల్లో దశాబ్దాలపాటు నమ్మకంగా సేవ చేశారు. సెంట్రల్‌ అమెరికాలోని ఒక చిన్న బెతెల్‌ కుటుంబంలో సేవ చేస్తున్న రోకేల్యోను, అతని భార్యను తమ బెతెల్‌కన్నా దాదాపు 30 రెట్లు పెద్దదైన మెక్సికో బెతెల్‌లో సేవ చేయమని చెప్పారు. “కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని విడిచిపెట్టి వెళ్లడం చాలా కష్టమైంది” అని రోకేల్యో అంటున్నాడు. వాళ్లలాగే క్వాన్‌ అనే సహోదరుణ్ణి కూడా మెక్సికో బ్రాంచికి పంపించారు. ఆయన ఏమంటున్నాడంటే, “ఇక్కడ కొత్తవాళ్లతో స్నేహాల్ని ఏర్పర్చుకోవాలి కాబట్టి నాకైతే దాదాపు రెండవసారి పుట్టినట్లుగా అనిపించింది. కొత్తకొత్త పద్ధతులకు అలవాటుపడాలి, ఆలోచనా విధానాన్ని కూడా మార్చుకోవాలి.”

12 అలాగే, కొన్ని ఐరోపా దేశాల్లోని బెతెల్‌ సభ్యుల్ని జర్మనీ బ్రాంచిలో సేవ చేయమని అడిగినప్పుడు కూడా వాళ్లు కొన్ని ఇబ్బందులు అనుభవించారు. స్విట్జర్లాండ్‌లోని ఎత్తైన ఆల్ఫ్స్‌ పర్వతాల అందాల్ని వదిలిరావడం ఎంత కష్టమో, పర్వతాల్లోని సుందర దృశ్యాలను ఇష్టపడేవాళ్లకు తెలుసు. ఆస్ట్రియాను వదిలి వచ్చిన బెతెల్‌ సభ్యులు, అక్కడి ప్రశాంత జీవితాన్ని మొదట్లో బాగా గుర్తుచేసుకునేవాళ్లు.

13 వేరే దేశంలోని బెతెల్‌లో సేవ చేయడానికి వెళ్లిన సహోదరసహోదరీలు చాలా మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. వాళ్లు అక్కడి కొత్త పరిసరాలకు, తమకు తెలియని సహోదరసహోదరీలతో పనిచేయడానికి అలవాటు పడాల్సివచ్చింది, వేరే పని కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. అలాగే కొత్త సంఘానికి, కొత్త క్షేత్రానికి చివరికి కొత్త భాషకు కూడా అలవాటు పడాల్సివచ్చింది. ఇలాంటి మార్పులు చేసుకోవడం కష్టమే అయినా చాలామంది బెతెల్‌ సభ్యులు సంతోషంగా మార్పులు చేసుకున్నారు. ఎందుకు?

14, 15. (ఎ) యెహోవాతోపాటు సేవచేసే ఏ అవకాశాన్నైనా అమూల్యంగా ఎంచుతున్నామని చాలామంది ఎలా చూపించారు? (బి) వాళ్లు ఏ విషయంలో మనందరికీ చక్కని ఆదర్శం ఉంచారు?

14 గ్రెటల్‌ అనే సహోదరి ఇలా చెబుతుంది, “యెహోవా మీద నాకున్న ప్రేమకు దేశంతో, భవనంతో లేదా ఒకానొక సేవావకాశంతో సంబంధం లేదని చూపించడం కోసమే ఆ ఆహ్వానాన్ని స్వీకరించాను.” డాయిస్కా అనే మరో సహోదరి ఇలా అంటుంది, “ఈ ఆహ్వానం యెహోవా నుండి వచ్చిందనే విషయం గుర్తుతెచ్చుకున్నప్పుడు, నేను దాన్ని సంతోషంగా అంగీకరించాను.” ఆంద్రే, గాబ్రీయెలా దంపతులు ఏమంటున్నారంటే, “సొంత కోరికలను పక్కనపెట్టి యెహోవాను సేవించేందుకు ఇది మరో అవకాశంగా మేము భావించాం.” యెహోవా సంస్థ మార్పులు చేస్తున్నప్పుడు, వాటిని వ్యతిరేకించే బదులు ఆనందంగా స్వాగతించడం చాలా మంచిదని వాళ్లు నమ్ముతున్నారు.

యెహోవా పని చేయడం, మనకు గొప్ప అవకాశం!

15 బ్రాంచీలను విలీనం చేసినప్పుడు, కొంతమంది బెతెల్‌ సభ్యులను పయినీర్లుగా పంపించారు. డెన్మార్క్‌, నార్వే, స్వీడన్‌ బ్రాంచీలను కలిపి స్కాండినేవియా బ్రాంచిగా ఏర్పాటు చేసినప్పుడు ఆ బ్రాంచీల్లోని చాలామందిని అలాగే పంపించారు. వాళ్లలో ఫ్లోరీయన్‌, ఆన్యా దంపతులు కూడా ఉన్నారు. వాళ్లు ఏం చెబుతున్నారో వినండి, “ఈ కొత్త నియామకాన్ని ఉత్తేజాన్నిచ్చే ఓ సవాలుగా తీసుకున్నాం. మేమెక్కడ సేవ చేస్తున్నా, యెహోవా మమ్మల్ని ఉపయోగించుకోవడమే మాకు అద్భుతంగా అనిపిస్తుంది. మాకెన్నో ఆశీర్వాదాలు వచ్చాయని మనస్ఫూర్తిగా చెప్పగలం.” అలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం మనలో చాలామందికి ఎన్నడూ రాకపోయినా, రాజ్యానికి మొదటిస్థానం ఇస్తూ ఆ సహోదరసహోదరీలు చూపించిన స్ఫూర్తిని మనం అనుకరించవచ్చు. (యెష. 6:8) తనతో పనిచేసే అవకాశాన్ని, అది ఎక్కడైనా సరే అమూల్యంగా ఎంచేవాళ్లను యెహోవా ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు.

యెహోవాతో పనిచేసే మీ అవకాశాన్ని ఆస్వాదిస్తూ ఉండండి

16. (ఎ) ఏమి చేయమని గలతీయులు 6:4 మనకు చెబుతుంది? (బి) ఏ మనిషైనా పొందగల అత్యంత గొప్ప అవకాశం ఏమిటి?

16 మనం అపరిపూర్ణులం కాబట్టి, అప్పుడప్పుడు ఇతరులతో మనల్ని పోల్చుకుంటాం. అయితే మన పరిస్థితుల్ని బట్టి చేయగలిగిన దానిమీదే మనసు పెట్టమని దేవుని వాక్యం చెబుతుంది. (గలతీయులు 6:4 చదవండి.) మనలో అందరూ పెద్దలుగా, పయినీర్లుగా, మిషనరీలుగా లేదా బెతెల్‌ సభ్యులుగా సేవ చేయలేరు. ఇవన్నీ శ్రేష్ఠమైన సేవావకాశాలే, అయినా అన్నిటికన్నా గొప్ప అవకాశం మనందరికీ ఉంది. అదే, యెహోవాతోపాటు పనిచేస్తూ రాజ్యసువార్త ప్రకటించడం. ఆ అవకాశాన్ని అమూల్యంగా ఎంచుదాం.

17. సాతాను లోకం ఉన్నంతకాలం మనం ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి? అయితే మనం ఎందుకు నిరుత్సాహపడకూడదు?

17 సాతాను దుష్టలోకం ఉన్నంతకాలం, మనం కోరుకున్నంతగా యెహోవా సేవ చేయలేకపోవచ్చు. కుటుంబ బాధ్యతలు, ఆరోగ్యం, మరితర విషయాలు మన చేతుల్లో ఉండకపోవచ్చు. అయితే వాటినిబట్టి మనం అతిగా నిరుత్సాహపడకూడదు. మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా మనం ఎల్లప్పుడూ యెహోవా నామం, ఆయన రాజ్యం గురించి ప్రకటించవచ్చు. ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మీ పరిస్థితులు అనుకూలించినంత మేరకు ఆయనతో కలిసి పనిచేస్తున్నారు; మీకన్నా ఎక్కువగా సేవ చేయగలుగుతున్న సహోదరుల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు. యెహోవా నామాన్ని స్తుతించే ప్రతీ ఒక్కరు ఆయనకు అమూల్యమైన వాళ్లేనన్న విషయం గుర్తుంచుకోండి!

18. మనం భవిష్యత్తులో దేనికోసం ఎదురుచూస్తున్నాం? అయితే ఇప్పటికే మనందరికీ ఏ గొప్ప అవకాశం ఉంది?

18 లోపాలు, అపరిపూర్ణతలు ఉన్నా మనల్ని తన తోటి పనివాళ్లుగా యెహోవా సంతోషంగా ఉపయోగించుకుంటాడు. ఈ అంత్యదినాల్లో మన దేవునితో పనిచేయడం ఎంత అద్భుత అవకాశం! భవిష్యత్తులో రాబోయే “వాస్తవమైన జీవము” కోసం మనం ఎదురుచూస్తున్నాం, ఇప్పటికన్నా అప్పుడు మనం జీవితాన్ని బాగా ఆస్వాదిస్తాం. యెహోవా త్వరలోనే, నూతనలోకంలో శాంతిసంతోషాలతో నిండిన నిత్యజీవాన్ని మనకు బహుమతిగా ఇస్తాడు.—1 తిమో. 6:18, 19.

మీ సేవావకాశాన్ని అమూల్యంగా ఎంచుతారా? (16-18 పేరాలు చూడండి)

19. యెహోవా మనకోసం ఎలాంటి మంచి భవిష్యత్తును వాగ్దానం చేశాడు?

19 దేవుడు వాగ్దానం చేసిన కొత్తలోకం త్వరలోనే వస్తుంది. ఇశ్రాయేలీయులు వాగ్దానదేశంలోకి ప్రవేశిస్తారనగా మోషే వాళ్లతో, “నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను . . . నిన్ను వర్ధిల్లజేయును” అని చెప్పిన మాటల గురించి ఆలోచించండి. (ద్వితీ. 30:9) హార్‌మెగిద్దోను ముగిశాక, అప్పటిదాకా తనతోపాటు పనిచేసిన వాళ్లకే యెహోవా వాగ్దానం చేసిన భూమిని ఇస్తాడు. అప్పుడు దేవుడు మనకు మరో పని అప్పగిస్తాడు. అదే, భూమిని అందమైన పరదైసుగా మార్చడం!