కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన ప్రవర్తనంతటిలో పరిశుద్ధంగా ఉండాలి

మన ప్రవర్తనంతటిలో పరిశుద్ధంగా ఉండాలి

“సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.”—1 పేతు. 1:14-16.

1, 2. (ఎ) తన ప్రజల ప్రవర్తన ఎలా ఉండాలని యెహోవా కోరుతున్నాడు? (బి) మనం ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలకు జవాబులు చూస్తాం?

 అపొస్తలుడైన పేతురు దైవ ప్రేరణతో లేవీయకాండము పుస్తకంలోని విషయాలు ఎత్తి చెబుతూ, ఇశ్రాయేలీయుల్లాగే క్రైస్తవులు కూడా పరిశుద్ధంగా ఉండాలని వివరించాడు. (1 పేతురు 1:14-16 చదవండి.) అభిషిక్తులు, “వేరే గొఱ్ఱెలు” కేవలం కొన్ని విషయాల్లోనే కాదుగానీ, తమ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధంగా ఉండడానికి శాయశక్తులా కృషిచేయాలని ‘పరిశుద్ధుడైన’ యెహోవా కోరుకుంటున్నాడు.—యోహా. 10:16.

2 లేవీయకాండములో ఉన్న ఆధ్యాత్మిక ఆణిముత్యాలను మరింతగా పరిశీలించడం ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతాం. అలాగే నేర్చుకున్నవాటిని పాటించడం వల్ల మన ప్రవర్తనంతటిలో పరిశుద్ధంగా ఉన్నామని చూపిస్తాం. మనం ఇప్పుడు ఈ ప్రశ్నలను పరిశీలిద్దాం: రాజీపడడం గురించి మనం ఎలా భావించాలి? యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించడం గురించి లేవీయకాండము మనకు ఏమి బోధిస్తుంది? ఇశ్రాయేలీయులు అర్పించిన బలుల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

రాజీపడకుండా జాగ్రత్తగా ఉండండి

3, 4. (ఎ) దేవుని నియమాలు, సూత్రాల విషయంలో క్రైస్తవులు ఎందుకు రాజీపడకూడదు? (బి) మనం ఎందుకు పగతీర్చుకోకూడదు లేక కోపాన్ని మనసులో ఉంచుకోకూడదు?

3 మనం యెహోవాను సంతోషపెట్టాలంటే, ఆయన నియమాలకూ సూత్రాలకూ కట్టుబడి ఉండాలి. వాటి విషయంలో రాజీపడే చెడు స్వభావాన్ని ఎన్నడూ వృద్ధి చేసుకోకూడదు. మనం మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేకపోయినా, దానిలోని విషయాలను చూస్తే దేవుడు వేటిని అంగీకరిస్తాడో వేటిని అంగీకరించడో అర్థమౌతుంది. ఉదాహరణకు, దేవుడు ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించాడు, “కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచు కొనక నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.”—లేవీ. 19:18.

4 మనం పగ తీర్చుకోకూడదని, కోపాన్ని మనసులో ఉంచుకోకూడదని యెహోవా కోరుకుంటున్నాడు. (రోమా. 12:19) మనం దేవుని నియమాలను, సూత్రాలను నిర్లక్ష్యం చేస్తే సాతాను ఎంతో సంతోషిస్తాడు, పైగా యెహోవాకు చెడ్డపేరు తీసుకొస్తాం. ఎవరైనా మనల్ని కావాలనే నొప్పించినా, మనం మాత్రం మనసులో కోపాన్ని ఉంచుకోకూడదు. పరిచర్య అనే ఐశ్వర్యం నిండిన ‘మంటి ఘటాల్లా’ ఉండే గొప్ప అవకాశం యెహోవా మనకు ఇచ్చాడు. (2 కొరిం. 4:1, 7) ఆ పాత్రల్లో యాసిడ్‌వంటి కోపానికి చోటు లేదు.

5. అహరోను గురించిన, ఆయన కుమారులు చనిపోవడం గురించిన వృత్తాంతం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

5 అహరోను కుటుంబాన్ని కలచివేసిన ఒక సంఘటన లేవీయకాండము 10:1-11 వచనాల్లో ఉంది. ఆకాశం నుండి అగ్నివచ్చి, ప్రత్యక్ష గుడారం దగ్గరున్న అహరోను కుమారులైన నాదాబు అబీహులను నాశనం చేసినప్పుడు ఆ కుటుంబం గుండెకోత అనుభవించివుంటుంది. అయితే చనిపోయిన ఆ ఇద్దరి గురించి ఏడవకూడదని అహరోనుకు, ఆయన కుటుంబానికి దేవుడు చెప్పాడు. అది వాళ్ల విశ్వాసానికి ఎంత పెద్ద పరీక్ష! బహిష్కృతులైన మీ కుటుంబ సభ్యులతో లేదా ఇతరులతో సహవసించకుండా, మీరు పరిశుద్ధంగా ఉన్నట్లు నిరూపించుకుంటున్నారా?1 కొరింథీయులు 5:11 చదవండి.

6, 7. (ఎ) చర్చిలో జరిగే పెళ్లికి వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకునేటప్పుడు, మనం ఏ ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించాలి? (అధస్సూచి చూడండి.) (బి) ఆ విషయంలో మన నిర్ణయం గురించి సాక్షులుకాని బంధువులకు ఎలా వివరించవచ్చు?

6 అహరోనుకు, ఆయన కుటుంబానికి వచ్చినంత తీవ్రమైన పరీక్ష మనకు రాకపోవచ్చు. కానీ చర్చిలో జరిగే తన పెళ్లికి రమ్మని సాక్షికాని బంధువు మనల్ని ఆహ్వానిస్తే అప్పుడేమిటి? అలాంటి వాటికి వెళ్లకూడదని బైబిలు సూటిగా ఆజ్ఞాపించకపోయినా, సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేసే బైబిలు సూత్రాలు మాత్రం ఉన్నాయి. a

7 యెహోవాను సంతోషపెట్టాలనే, పరిశుద్ధంగా ఉండాలనే మన నిర్ణయం సాక్షులుకాని మన బంధువులకు అర్థంకాకపోవచ్చు. (1 పేతు. 4:3, 4) మనం వాళ్లను బాధపెట్టాలనుకోం, కానీ వాళ్లతో దయగానే అయినా సూటిగా మాట్లాడడం మంచిది. బహుశా ముందే ఆ పనిచేస్తే మరీ మంచిది. మనల్ని ఆ పెళ్లికి ఆహ్వానించినందుకు సంతోషిస్తున్నామని చెబుతూ వాళ్లకు కృతజ్ఞతలు తెలపవచ్చు. తర్వాత, ఆ ప్రత్యేకమైన రోజున వాళ్లు సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటున్నామనీ, కొన్ని మతాచారాల్లో పాల్గొనకుండా వాళ్లనూ వాళ్ల అతిథులనూ ఇబ్బందిపెట్టడం మనకు ఇష్టం లేదనీ చెప్పవచ్చు. మన నమ్మకాల విషయంలో, విశ్వాసం విషయంలో రాజీపడకుండా ఉండడానికి ఇదొక మార్గం.

యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించండి

8. లేవీయకాండము యెహోవా సర్వాధిపత్యాన్ని ఎలా ఉన్నతపరుస్తుంది?

8 లేవీయకాండము పుస్తకం యెహోవా సర్వాధిపత్యాన్ని ఉన్నతపరుస్తుంది. ఆ పుస్తకంలోని నియమాలను యెహోవాయే ఇచ్చాడని చెప్పే 30 కన్నా ఎక్కువ సందర్భాలు అందులో ఉన్నాయి. ఆ విషయాన్ని గుర్తించిన మోషే, యెహోవా ఆజ్ఞాపించిన ప్రతీది చేశాడు. (లేవీ. 8:4, 5) అదేవిధంగా, మనం కూడా సర్వాధిపతియైన యెహోవా కోరేదాన్ని ఎల్లప్పుడూ చేయాలి. ఈ విషయంలో మనకు దేవుని సంస్థ కూడా అండగా ఉంటుంది. అయితే, అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు యేసుకు శోధన ఎదురైనట్లే మనం కూడా ఒంటరిగా ఉన్నప్పుడు మన విశ్వాసానికి పరీక్ష ఎదురుకావచ్చు. (లూకా 4:1-13) దేవుని సర్వాధిపత్యానికి మద్దతిస్తూ ఆయన మీద నమ్మకం ఉంచితే, మనం రాజీపడేలా లేదా భయానికి లొంగిపోయేలా చేయడం ఎవరివల్లా కాదు.—సామె. 29:25.

9. దేవుని ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ద్వేషానికి గురౌతున్నారు?

9 క్రీస్తు అనుచరులుగా, యెహోవాసాక్షులుగా మనం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో హింసలు అనుభవిస్తున్నాం. “జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు” అని యేసు తన శిష్యులకు చెప్పాడు కాబట్టి హింసలు వస్తాయని మనకు తెలుసు. (మత్త. 24:9) అలాంటి ద్వేషాన్ని ఎదుర్కొంటున్నా, మనం ప్రకటనా పనిలో కొనసాగుతూ యెహోవా దృష్టిలో పరిశుద్ధంగా ఉన్నామని ఎల్లప్పుడూ నిరూపించుకుంటాం. మనం నిజాయితీగా ఉంటున్నా, శారీరకంగా, నైతికంగా పరిశుభ్రంగా జీవిస్తున్నా, చట్టానికి కట్టుబడే పౌరులుగా ఉంటున్నా ఇతరులు మనల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు? (రోమా. 13:1-7) ఎందుకంటే మనం యెహోవాను సర్వాధిపతిగా చేసుకున్నాం! మనం “ఆయనను మాత్రమే” సేవిస్తాం, ఆయన నీతియుక్త నియమాలు, సూత్రాల విషయంలో ఎన్నడూ రాజీపడం.—మత్త. 4:10.

10. ఒక సహోదరుడు తటస్థత విషయంలో రాజీపడినప్పుడు ఏమి జరిగింది?

10 అంతేకాదు, మనం ‘లోక సంబంధులం కాము.’ అందుకే మనం లోకంలోని యుద్ధాల్లో, రాజకీయ వ్యవహారాల్లో తటస్థంగా ఉంటాం. (యోహాను 15:18-21; యెషయా 2:4 చదవండి.) దేవునికి సమర్పించుకున్న కొంతమంది తటస్థత విషయంలో రాజీపడ్డారు. వాళ్లలో చాలామంది పశ్చాత్తాపపడి, కనికరంగల మన పరలోక తండ్రికి మళ్లీ దగ్గరయ్యారు. (కీర్త. 51:17) కానీ కొంతమంది పశ్చాత్తాపపడలేదు. ఉదాహరణకు, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హంగరీ దేశమంతటా చాలామంది సహోదరులను అన్యాయంగా జైళ్లలో పెట్టారు. వాళ్లలో 45 ఏళ్లకన్నా తక్కువ వయసున్న 160 మంది సహోదరులను అధికారులు ఒక పట్టణానికి తీసుకొచ్చారు. వాళ్లను సైన్యంలో చేరమని ఆజ్ఞాపించారు. నమ్మకమైన సహోదరులు స్థిరంగా నిరాకరించారు, కానీ ఆ గుంపులోని తొమ్మిది మంది మాత్రం సైన్యంలో చేరుతున్నట్లు ప్రమాణం చేసి, యూనిఫాం వేసుకున్నారు. అలా రాజీపడిన వాళ్లలో ఒకాయనకు రెండు సంవత్సరాల తర్వాత, నమ్మకమైన సాక్షులను కాల్చి చంపే పనిని అప్పగించారు. ఆ సాక్షుల్లో తన సొంత అన్నయ్య కూడా ఉన్నాడు! అయితే తర్వాత పరిస్థితులు మారడంతో అధికారులు సాక్షుల్లో ఎవ్వరినీ చంపలేదు.

యెహోవాకు శ్రేష్ఠమైనది ఇవ్వండి

11, 12. ప్రాచీన ఇశ్రాయేలులో అర్పించిన బలుల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

11 మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ఇశ్రాయేలీయులు నిర్దిష్టమైన బలులు అర్పించాలి. (లేవీ. 9:1-4, 15-21) అవి యేసు పరిపూర్ణ బలికి సూచనగా ఉన్నాయి కాబట్టి ఏ లోపం లేనివాటినే అర్పించాలి. అంతేకాక, ప్రతీ విధమైన అర్పణను లేదా బలిని అర్పించడానికి నిర్దిష్టమైన విధానం ఉండేది. ఉదాహరణకు, బిడ్డను కన్న తర్వాత తల్లి ఏమి చేయాలో లేవీయకాండము 12:6 ఇలా చెబుతుంది, “కుమారునికొరకేగాని కుమార్తెకొరకేగాని ఆమె శుద్ధిదినములు సంపూర్తియైన తరువాత ఆమె దహనబలిగా ఒక యేడాది గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్లగువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తీసికొని రావలెను.” దేవుడు కోరుకున్నవి నిర్దిష్టమైనవే అయినా ధర్మశాస్త్రం ఆయన ప్రేమను, సహేతుకతను ప్రతిబింబించింది. ఆమె గొర్రెను తీసుకురాలేకపోతే, రెండు గువ్వలను లేదా పావురాలనైనా అర్పించవచ్చు. (లేవీ. 12:8) ఖరీదైన అర్పణను తెచ్చినవాళ్లను యెహోవా ప్రేమించి, మెచ్చుకున్నట్లే ఆ పేద మహిళను కూడా ఎంతో ప్రేమించి, మెచ్చుకునేవాడు. దీనినుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

12 దేవునికి “స్తుతియాగము” అర్పించమని అపొస్తలుడైన పౌలు తోటి ఆరాధకులను ప్రోత్సహించాడు. (హెబ్రీ. 13:15) యెహోవా పరిశుద్ధ నామం గురించి ఇతరులకు చెప్పినప్పుడు మనం “స్తుతియాగము” అర్పిస్తాం. బధిరులైన సహోదరసహోదరీలు సంజ్ఞా భాషను ఉపయోగిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఇల్లు కదల్లేని స్థితిలో ఉన్న క్రైస్తవులు ఉత్తరాల ద్వారా, టెలిఫోన్‌ ద్వారా సాక్ష్యమిస్తూ తమకు సేవచేసేవాళ్లకు, చూడ్డానికి వచ్చేవాళ్లకు ప్రకటిస్తూ ఆయనను స్తుతిస్తారు. యెహోవా నామాన్ని తెలియజేస్తూ, రాజ్యసువార్తను ప్రకటిస్తూ మనం చేసే స్తుతియాగం మన ఆరోగ్యం, సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. అయినా మనం శ్రేష్ఠమైనదే అర్పించాలి.—రోమా. 12:1; 2 తిమో. 2:15.

13. మనం పరిచర్య చేసే సమయాన్ని ఎందుకు రిపోర్టు చేయాలి?

13 మనం యెహోవాను ప్రేమిస్తాం కాబట్టి ఇష్టపూర్వకంగా ఆయనకు స్తుతియాగాలు చెల్లిస్తాం. (మత్త. 22:37, 38) అయితే నెలనెలా పరిచర్యలో గడిపే సమయాన్ని రిపోర్టు చేయమని మనల్ని అడిగినప్పుడు మన వైఖరి ఎలా ఉండాలి? ఆ పనిని ఇష్టంగా చేయాలి, ఎందుకంటే అలా చేయడం ద్వారా మనం దేవుని మీద భక్తిని చూపిస్తాం. (2 పేతు. 1:7) అయితే, కేవలం ఎక్కువ గంటలు రిపోర్టు చేయాలనే ఉద్దేశంతో పరిచర్యలో ఎక్కువ సమయం గడపాలని ఎవ్వరం అనుకోం. కొంతమంది ప్రచారకులు వయసుపైబడడం, అనారోగ్యం వంటి కారణాలవల్ల కేవలం 15 నిమిషాలు పరిచర్య చేసినా దాన్ని రిపోర్టు చేయవచ్చు. వాళ్లు చేయగలిగినదంతా చేశారు కాబట్టి యెహోవా ఎంతో సంతోషిస్తాడు. మన సహోదరసహోదరీలు తనను ప్రేమిస్తున్నారని, తన సాక్షులుగా ఉండాలని నిజంగా కోరుకుంటున్నారని యెహోవాకు తెలుసు. పేదరికంలో ఉన్నా యెహోవాకు కానుక అర్పించగలిగిన ప్రాచీన ఇశ్రాయేలీయుల్లాగే, నేడు పరిమితులున్న దేవుని సేవకులు కూడా సంతోషంగా రిపోర్టు ఇవ్వవచ్చు. ప్రపంచవ్యాప్త రిపోర్టులో మనందరి రిపోర్టులు కూడా ఉంటాయి, దాని ఆధారంగా క్షేత్రంలోని అవసరాలకు సరిపోయే ప్రణాళికలను సంస్థ వేయగలుగుతుంది. కాబట్టి, మనం పరిచర్యలో గడిపే సమయాన్ని రిపోర్టు చేయమని అడగడం మననుండి మరీ ఎక్కువ ఆశించినట్లు అవుతుందా?

మన అధ్యయన అలవాట్లు, స్తుతియాగాలు

14. మన అధ్యయన అలవాట్లను ఎందుకు పరిశీలించుకోవాలో వివరించండి.

14 లేవీయకాండములోని కొన్ని ఆధ్యాత్మిక ఆణిముత్యాలను పరిశీలించాక, ‘ఈ పుస్తకాన్ని బైబిల్లో ఎందుకు చేర్చారో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది’ అని మీరు అనుకుంటుండవచ్చు. (2 తిమో. 3:16, 17) మీరు పరిశుద్ధంగా జీవించాలని ఇప్పుడు మరింతగా నిశ్చయించుకున్నారా? మనం శ్రేష్ఠమైనది ఇవ్వాలని యెహోవా కోరుతున్నాడు, ఆయన దానికి ఖచ్చితంగా అర్హుడు. లేవీయకాండము గురించి ఈ రెండు ఆర్టికల్స్‌లో నేర్చుకున్న విషయాలు, లేఖనాలను మరింత లోతుగా పరిశీలించాలనే మీ కోరికను బహుశా పెంచివుంటాయి. (సామెతలు 2:1-5 చదవండి.) మీ అధ్యయన అలవాట్లను ప్రార్థనాపూర్వకంగా పరిశీలించుకోండి. మీ స్తుతియాగాలను యెహోవా అంగీకరించాలని మీరు ఖచ్చితంగా కోరుకుంటారు. టీవీ కార్యక్రమాలు, వీడియోగేములు, ఆటలు లేదా హాబీలు మీ ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డుపడుతున్నాయా? అలాగైతే, హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పిన కొన్ని విషయాలను లోతుగా ఆలోచించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

బైబిలు అధ్యయనానికి, కుటుంబ ఆరాధనకు మీ జీవితంలో ప్రాధాన్యత ఇస్తున్నారా? (14వ పేరా చూడండి)

15, 16. పౌలు హెబ్రీ క్రైస్తవులకు ఎందుకు అంత సూటిగా రాశాడు?

15 పౌలు హెబ్రీ క్రైస్తవులకు పత్రిక రాసినప్పుడు వాళ్లతో చాలా సూటిగా మాట్లాడాడు. (హెబ్రీయులు 5:7, 11-14 చదవండి.) ‘మీరు వినుటకు మందులయ్యారు’ అని ఆయన వాళ్లతో అన్నాడు. ఆయన ఎందుకంత సూటిగా మాట్లాడుతున్నాడు? ఎందుకంటే, కేవలం ఆధ్యాత్మిక పాలతోనే బ్రతికేయాలని ప్రయత్నిస్తున్న ఆ క్రైస్తవులమీద యెహోవాకు ఉన్నట్లే పౌలుకు కూడా ప్రేమ, శ్రద్ధ ఉన్నాయి. బైబిల్లోని ప్రాథమిక బోధల్ని తెలుసుకోవడం ప్రాముఖ్యమే. కానీ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ, క్రైస్తవ పరిణతి సాధించాలంటే “బలమైన ఆహారము” అవసరం.

16 హెబ్రీ క్రైస్తవులు ఇతరులకు నేర్పించేంతగా ప్రగతి సాధించకపోగా, వాళ్లకే ఇతరులు నేర్పించాల్సి వచ్చింది. ఎందుకు? ఎందుకంటే, వాళ్లు “బలమైన ఆహారము” తీసుకోవడానికి ఇష్టపడలేదు. మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి: ‘బలమైన ఆధ్యాత్మిక ఆహారం పట్ల నాకు సరైన వైఖరి ఉందా? నేను దాన్ని క్రమంగా తీసుకుంటున్నానా? లేక బైబిల్ని లోతుగా అధ్యయనం చేయడానికి, ప్రార్థించడానికి వెనకాడుతున్నానా?’ అదే నిజమైతే, నా అధ్యయన అలవాట్లే సమస్యకు ఒక కారణమా? మనం ప్రజలకు ప్రకటించడంతోపాటు బోధించాలి, వాళ్లను శిష్యుల్ని చేయాలి.—మత్త. 28:19, 20.

17, 18. (ఎ) మనం బలమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని ఎందుకు క్రమంగా తీసుకోవాలి? (బి) కూటాలకు వెళ్లే ముందు మద్యం తాగడం గురించి మనం ఎలా భావించాలి?

17 మనలో చాలామందికి బైబిల్ని అధ్యయనం చేయడం అంత సులభం కాకపోవచ్చు. అయితే, బైబిల్ని అధ్యయనం చేసేలా మనల్ని బలవంతపెట్టాలని యెహోవా ఎన్నడూ కోరుకోడు. మనం యెహోవాకు సమర్పించుకొని ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా, లేదా కొంతకాలమే అయినా బలమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని ఎల్లప్పుడూ తీసుకుంటూ ఉండాలి. మనం పరిశుద్ధంగా జీవించాలంటే అలా చేయడం ప్రాముఖ్యం.

18 పరిశుద్ధంగా ఉండాలంటే మనం లేఖనాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ, దేవుడు చెప్పింది చేయాలి. బహుశా మద్యం మత్తులో, దేవుడు ‘ఆజ్ఞాపించని వేరొక అగ్నిని’ అర్పించి ప్రాణాలు కోల్పోయిన అహరోను కుమారులైన నాదాబు, అబీహుల గురించి ఆలోచించండి. (లేవీ. 10:1, 2) దేవుడు అప్పుడు అహరోనుకు ఏమి చెప్పాడో గమనించండి. (లేవీయకాండము 10:8-11 చదవండి.) అంటే మనం క్రైస్తవ కూటాలకు వెళ్లే ముందు మద్యాన్ని అస్సలు త్రాగకూడదని ఆ వృత్తాంతం చెబుతుందా? ఈ విషయాల గురించి ఆలోచించండి: మనం ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదు. (రోమా. 10:4) కొన్ని దేశాల్లో మన సహోదరసహోదరీలు, కూటాలకు వెళ్లే ముందు భోజనంతో పాటు మితంగా మద్యాన్ని తీసుకుంటారు. పస్కా ఆచరణలో నాలుగు గిన్నెల ద్రాక్షారసాన్ని ఉపయోగించేవాళ్లు. జ్ఞాపకార్థ ఆచరణను ప్రారంభించినప్పుడు తన రక్తానికి సూచనగా ఉన్న ద్రాక్షారసాన్ని త్రాగమని యేసు తన అపొస్తలులకు ఇచ్చాడు. (మత్త. 26:27) మద్యాన్ని అతిగా త్రాగడాన్ని, త్రాగుబోతుతనాన్ని బైబిలు ఖండిస్తుంది. (1 కొరిం. 6:10; 1 తిమో. 3:8) చాలామంది క్రైస్తవులు తమ మనస్సాక్షిని బట్టి, యెహోవా ఆరాధనకు సంబంధించిన దేనిలోనైనా పాల్గొనే ముందు మద్యాన్ని అస్సలు ముట్టరు. అయితే, పరిస్థితులు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి కాబట్టి క్రైస్తవులు ‘అపవిత్రమైన దానినుండి పవిత్రమైనదానిని వేరుచేయడం’ చాలా ముఖ్యం. అప్పుడే వాళ్లు దేవునికి ఇష్టమైన విధంగా పరిశుద్ధంగా ఉండగలుగుతారు.

19. (ఎ) కుటుంబ ఆరాధన, వ్యక్తిగత అధ్యయనం గురించి మనం ఏ విషయం గుర్తుంచుకోవాలి? (బి) పరిశుద్ధంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు మీరు ఎలా చూపించవచ్చు?

19 దేవుని వాక్యాన్ని లోతుగా వెదికితే మీకు ఎన్నో ఆధ్యాత్మిక ఆణిముత్యాలు దొరుకుతాయి. అందుబాటులో ఉన్న పరిశోధనా ఉపకరణాలను ఉపయోగించి మీ కుటుంబ ఆరాధనను, వ్యక్తిగత అధ్యయనాన్ని అర్థవంతంగా చేసుకోండి. యెహోవా గురించి, ఆయన సంకల్పాల గురించి ఇంకా బాగా తెలుసుకోండి. ఆయనకు మరింత సన్నిహితమవ్వండి. (యాకో. 4:8) “నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము” అని పాడిన కీర్తనకర్తలా మీరు కూడా దేవునికి ప్రార్థించండి. (కీర్త. 119:18) బైబిలు నియమాలు, సూత్రాల విషయంలో ఎన్నడూ రాజీపడకండి. ‘పరిశుద్ధుడైన’ యెహోవా ఉన్నత నియమాన్ని ఇష్టపూర్వకంగా పాటిస్తూ, “సువార్త” ప్రకటించడమనే పరిశుద్ధ పనిలో ఉత్సాహంగా పాల్గొనండి. (1 పేతు. 1:14-16; రోమా. 15:15, 16) దుష్టత్వంతో నిండిన ఈ అంత్యదినాల్లో పరిశుద్ధంగా ఉన్నారని నిరూపించుకోండి. కాబట్టి, మనందరం పరిశుద్ధంగా జీవిస్తూ పరిశుద్ధ దేవుడైన యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థిద్దాం.

a కావలికోట మే 15, 2002⁠లో “పాఠకుల ప్రశ్నలు” చూడండి.