కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“యెహోవా తమకు దేవుడుగాగల జనులు”

“యెహోవా తమకు దేవుడుగాగల జనులు”

“యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.”—కీర్త. 144:15.

1. దేవుణ్ణి ఆరాధించేవాళ్ల గురించి కొంతమంది ఏమని నమ్ముతారు?

 క్రైస్తవమతంతో సహా నేడున్న పెద్దపెద్ద మతాలు మనుషులకు మేలు చేయడం లేదని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. అలాంటి మతాలు దేవుని గురించిన సత్యం బోధించకపోగా, దుర్మార్గపు పనులు చేస్తున్నాయి కాబట్టి దేవుడు వాటిని ఏమాత్రం అంగీకరించడని కొంతమంది అంటారు. అయితే అన్ని మతాల్లోనూ మంచివాళ్లు ఉన్నారని, దేవుడు వాళ్లను గమనించి తన ఆరాధకులుగా ఒప్పుకుంటాడని అలాంటివాళ్లు నమ్ముతారు. కానీ, ఆ నమ్మకం నిజమేనా? లేదా, తనను ఆరాధించే వాళ్లు అబద్ధమతాన్ని విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటాడా? చరిత్రంతటిలో యెహోవా సత్యారాధకుల గురించి బైబిలు ఏమి చెబుతుందో పరిశీలించి ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.

యెహోవా నిబంధన ప్రజలు

2. ఎవరు యెహోవా ప్రజలయ్యారు? వాళ్లకు యెహోవాతో ప్రత్యేక సంబంధం ఉందనడానికి ఏది గుర్తుగా ఉండేది? (ప్రారంభ చిత్రం చూడండి.)

2 యెహోవా సుమారు 4,000 సంవత్సరాల క్రితం, ఈ భూమ్మీద కొంతమందిని తన ప్రజలుగా ఎంపిక చేసుకున్నాడు. ‘నమ్మిన వాళ్లందరికీ తండ్రి’ అని బైబిలు పిలుస్తున్న అబ్రాహాము ఓ పెద్ద కుటుంబానికి యజమాని. ఆ కుటుంబంలో వందలమంది సేవకులు కూడా ఉన్నారు. (రోమా. 4:11; ఆది. 14:14) కనాను పాలకులు అబ్రాహామును ‘మహారాజుగా’ గౌరవించారు. (ఆది. 21:22; 23:5, 6) యెహోవా అబ్రాహాముతో, ఆయన సంతానంతో ఓ నిబంధన చేశాడు. (ఆది. 17:1, 2, 19) యెహోవా అబ్రాహాముకు ఇలా చెప్పాడు, “నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన యేదనగా—మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను . . . అది నాకు నీకు మధ్య నున్న నిబంధనకు సూచనగా ఉండును.” (ఆది. 17:10, 11) దాంతో అబ్రాహాము, ఆయన ఇంట్లోని మగవాళ్లందరూ సున్నతి పొందారు. (ఆది. 17:24-27) అబ్రాహాము సంతతికి మాత్రమే యెహోవాతో ప్రత్యేక సంబంధం ఉందనడానికి సున్నతి గుర్తుగా ఉండేది.

3. అబ్రాహాము సంతతి ఎలా ఓ సమూహంగా వృద్ధి చెందింది?

3 అబ్రాహాము మనుమడైన యాకోబుకు లేదా ఇశ్రాయేలుకు 12 మంది కొడుకులు. (ఆది. 35:10, 23-26) కాలం గడుస్తుండగా వాళ్లనుండి ఇశ్రాయేలు 12 గోత్రాలు వచ్చాయి. (అపొ. 7:8) కరువువల్ల యాకోబు ఆయన కుటుంబం ఐగుప్తులో ఆశ్రయం పొందారు. అక్కడ యాకోబు కుమారుడైన యోసేపు ఆహార సరఫరా అధికారిగా, ఫరోకు కుడిభుజంగా ఉన్నాడు. (ఆది. 41:39-41; 42:6) యాకోబు సంతతి బాగా వృద్ధి చెంది, “జనముల సమూహముగా” తయారైంది.—ఆది. 48:4; అపొస్తలుల కార్యములు 7:17 చదవండి.

యెహోవా “విమోచించిన” ప్రజలు

4. మొదట్లో యాకోబు సంతతికి ఐగుప్తీయులతో ఎలాంటి సంబంధం ఉండేది?

4 యాకోబు సంతతివాళ్లు, 200 సంవత్సరాలకన్నా ఎక్కువకాలం ఐగుప్తులోని గోషెనులో నివసించారు. (ఆది. 45:9, 10) ఫరోకు యోసేపు అంటే ఇష్టం, గౌరవం కాబట్టి ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో జీవించమని ఆహ్వానించాడు. (ఆది. 47:1-6) ఇశ్రాయేలీయులు చిన్నచిన్న పల్లెల్లో నివసిస్తూ, గొర్రెల్నీ పశువులనూ కాస్తూ, దాదాపు 100 సంవత్సరాలు ఐగుప్తీయులతో సమాధానంగా జీవించారు. ఐగుప్తీయులకు గొర్రెల కాపరులంటే ఏమాత్రం ఇష్టం లేకపోయినా, ఫరో ఆజ్ఞకు లోబడి ఇశ్రాయేలీయుల్ని తమతోపాటు ఉండనిచ్చారు.—ఆది. 46:31-34.

5, 6. (ఎ) ఐగుప్తులో దేవుని ప్రజల పరిస్థితి ఎలా మారిపోయింది? (బి) మోషే ఎలా బ్రతికి బయటపడ్డాడు? యెహోవా తన ప్రజలందరి కోసం ఏం చేశాడు?

5 ఆ తర్వాత దేవుని ప్రజల పరిస్థితి ఒక్కసారిగా తలక్రిందులైంది. “అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏల నారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను—ఇదిగో ఇశ్రాయేలు సంతతియైన యీ జనము మనకంటె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది. . . . ఇశ్రాయేలీయులచేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి; వారు ఇశ్రాయేలీయులచేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతిపనిలోను కఠినసేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి.”—నిర్గ. 1:8, 9, 13, 14.

6 చివరికి, హెబ్రీయుల మగ పిల్లలందర్నీ పుట్టగానే చంపేయమని ఫరో ఆజ్ఞాపించాడు. (నిర్గ. 1:15, 16) ఆ సమయంలోనే మోషే పుట్టాడు. మోషేకు మూడు నెలలు ఉన్నప్పుడు ఆయన తల్లి నైలునదిలో పెరుగుతున్న రెల్లు గడ్డిలో దాచిపెట్టింది. అలా మోషే ఫరో కుమార్తెకు దొరికాడు. తర్వాత ఆమె అతణ్ణి కొడుకుగా స్వీకరించింది. అయితే సంతోషకరంగా, మోషేను ఆయన తల్లియైన యాకెబెదు పెంచి పెద్ద చేసింది. దైవభక్తిగల ఆమె పెంపకంలో మోషే నమ్మకమైన యెహోవా ఆరాధకుడయ్యాడు. (నిర్గ. 2:1-10; హెబ్రీ. 11:23-26) తన ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను యెహోవా ‘లక్ష్యపెట్టి,’ మోషే నాయకత్వంలో వాళ్లను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాలని నిర్ణయించుకున్నాడు. (నిర్గ. 2:24, 25; 3:9, 10) అలా వాళ్లు యెహోవా “విమోచించిన” ప్రజలు అయ్యారు.—నిర్గ. 15:13; ద్వితీయోపదేశకాండము 15:14 చదవండి.

దేవుని ప్రజలు ఓ జనాంగం అయ్యారు

7, 8. యెహోవా ప్రజలు ఎలా ఓ పరిశుద్ధ జనముగా తయారయ్యారు?

7 యెహోవా అప్పటికింకా ఇశ్రాయేలీయుల్ని ఓ జనాంగంగా సంస్థీకరించకపోయినా, వాళ్లను తన ప్రజలుగా గుర్తించాడు. అందుకే, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా—అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు” అని ఫరోకు చెప్పమని యెహోవా మోషే, అహరోనులను ఆదేశించాడు.—నిర్గ. 5:1.

8 కానీ ఇశ్రాయేలీయుల్ని విడిచిపెట్టడానికి ఫరో ఒప్పుకోలేదు. తన ప్రజల్ని విడిపించడానికి యెహోవా ఐగుప్తు మీదికి పది తెగుళ్లు రప్పించాడు. ఎర్ర సముద్రం దగ్గర ఫరోను, ఆయన సైన్యాన్ని నాశనం చేశాడు. (నిర్గ. 15:1-4) ఆ తర్వాత, మూడు నెలలకే యెహోవా సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీయులతో ఒక నిబంధన చేసి ఈ చారిత్రాత్మక వాగ్దానం చేశాడు, “మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు.” అంతేకాదు వాళ్లు “పరిశుద్ధమైన జనముగా” కూడా ఉంటారని మాటిచ్చాడు.—నిర్గ. 19:5, 6.

9, 10. (ఎ) ద్వితీయోపదేశకాండము 4:5-8 ప్రకారం, ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయుల్ని ఇతర దేశాల ప్రజల నుండి ఎలా ప్రత్యేకపర్చింది? (బి) ఇశ్రాయేలీయులు ‘యెహోవాకు ప్రతిష్ఠిత జనముగా’ ఉండాలంటే ఏమి చేయాల్సి ఉంది?

9 శతాబ్దాలుగా దేవుని ప్రజల్లోని కుటుంబ శిరస్సులు అధికారులుగా, న్యాయాధిపతులుగా, యాజకులుగా సేవచేస్తూ కుటుంబాల్లో నాయకత్వం వహించేవాళ్లు. ఐగుప్తులో బానిసలు కాకముందు ఇశ్రాయేలీయులు కూడా అదే పద్ధతి పాటించారు. (ఆది. 8:20; 18:19; యోబు 1:4, 5) అయితే, యెహోవా ఇశ్రాయేలీయుల్ని బానిసత్వం నుండి విడిపించి వాళ్లకు మోషే ద్వారా నియమాలు ఇచ్చాడు. అవి ఇతర దేశాల ప్రజల నుండి ఇశ్రాయేలీయుల్ని వేరుగా ఉంచాయి. (ద్వితీయోపదేశకాండము 4:5-8 చదవండి; కీర్త. 147:19, 20) జనాంగం తరఫున ప్రత్యేకంగా కొంతమంది యాజకులుగా సేవచేసేలా ధర్మశాస్త్రం ఏర్పాటు చేసింది. అంతేకాక తమ జ్ఞానంతో, వివేచనతో ఇతరుల మన్ననలు పొందే ‘పెద్దలను’ న్యాయాధిపతులుగా నియమించింది. (ద్వితీ. 25:7, 8) ధర్మశాస్త్రం ఆ కొత్త జనాంగానికి ఆరాధనకు, ప్రవర్తనకు సంబంధించిన నిర్దేశాలు ఇచ్చింది.

10 ఇశ్రాయేలీయులు ఇక వాగ్దాన దేశంలోకి ప్రవేశిస్తారనగా యెహోవా తన నియమాల్ని వాళ్లకు మళ్లీ చెప్పాడు. మోషే ప్రజలతో ఇలా అన్నాడు, “యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమైయుండి తన ఆజ్ఞలన్నిటిని గైకొందువనియు, తాను సృజించిన సమస్త జనముల కంటె నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను.”—ద్వితీ. 26:18, 19.

పరదేశుల్ని ఆహ్వానించారు

11-13. (ఎ) దేవుని ప్రజల్లో ఎవరు కూడా చేరారు? (బి) ఇశ్రాయేలీయులుకాని వాళ్లు యెహోవాను ఆరాధించాలనుకుంటే ఏమి చేయాల్సి ఉంది?

11 యెహోవా భూమ్మీద తన జనాంగంగా ఇశ్రాయేలీయుల్ని ఎంపిక చేసుకున్నప్పటికీ, అన్యుల్ని కూడా తన ప్రజల మధ్య ఉండనిచ్చాడు. ఉదాహరణకు, దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి విడిపించినప్పుడు, కొంతమంది ఐగుప్తీయులతో సహా “అనేకులైన అన్యజనుల సమూహము” కూడా బయలుదేరిందని బైబిలు చెబుతుంది. (నిర్గ. 12:38) ఏడవ తెగులు వచ్చినప్పుడు, యెహోవా మాటకు భయపడిన కొంతమంది “ఫరో సేవకులు” కూడా ఆ సమూహములో ఉండివుంటారు. —నిర్గ. 9:20.

12 కనానును స్వాధీనం చేసుకోవడానికి ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దాటబోతుండగా, వాళ్లు తమ మధ్యవున్న ‘విదేశీయులను ప్రేమించాలి’ అని మోషే ఆజ్ఞాపించాడు. (ద్వితీ. 10:17-19, పరిశుద్ధ బైబల్‌ తెలుగు: ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ప్రాథమిక ఆజ్ఞలను పాటించడానికి ఇష్టపడే పరదేశులను ఇశ్రాయేలీయులు తమ సమాజంలో ఉండనివ్వాలి. (లేవీ. 24:22) కొందరు పరదేశులు యెహోవా ఆరాధకులయ్యారు. ఉదాహరణకు, మోయాబీయురాలైన రూతు యెహోవాను ఆరాధించాలని కోరుకుంది. ఆమె ఇశ్రాయేలీయురాలైన నయోమితో “నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు” అని చెప్పింది. (రూతు 1:16) ఈ పరదేశులు యూదామత ప్రవిష్టులయ్యారు. పురుషులైతే సున్నతి పొందారు. (నిర్గ. 12:48, 49) తన ప్రజల సమాజంలో సభ్యులుగా ఉండడానికి యెహోవా వాళ్లను ఆహ్వానించాడు.—సంఖ్యా. 15:14, 15.

ఇశ్రాయేలీయులు పరదేశుల్ని ప్రేమించారు (11-13 పేరాలు చూడండి)

13 ఇశ్రాయేలీయులుకాని ఆరాధకులను కూడా యెహోవా అంగీకరిస్తాడని సొలొమోను చేసిన ఒక ప్రార్థన చూపిస్తుంది. ఆలయ ప్రతిష్ఠాపన సమయంలో సొలొమోను ఇలా ప్రార్థించాడు, “నీ జనులైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గూర్చియు, నీ బాహుబలమును గూర్చియు, చాచిన చేతులను గూర్చియు వినినవారై, దూరదేశము నుండి వచ్చి ఈ మందిరముతట్టు తిరిగి విన్నపము చేసినపుడు నీ నివాసస్థలమగు ఆకాశమునుండి నీవు వారి ప్రార్థన నంగీకరించి, నీ జనులగు ఇశ్రాయేలీయులు తెలిసికొనినట్లు భూజనులందరును నీ నామమును తెలిసికొని, నీయందు భయభక్తులు కలిగి, నేను కట్టిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడెనని గ్రహించునట్లుగా ఆ యన్యులు నీకు మొఱ్ఱపెట్టిన దానిని నీవు దయచేయుదువు గాక.” (2 దిన. 6:32, 33) యేసు కాలంలో కూడా, ఇశ్రాయేలీయులుకాని వాళ్లెవరైనా యెహోవాను ఆరాధించాలనుకుంటే వాళ్లు దేవుని నిబంధన ప్రజలతో కలిసి ఆయనను ఆరాధించాలి.—యోహా. 12:20; అపొ. 8:27.

సాక్షులుగా ఉన్న ఓ జనాంగం

14-16. (ఎ) ఇశ్రాయేలీయులు ఏవిధంగా యెహోవాకు సాక్షులైన జనాంగంగా ఉండాలి? (బి) నేటి యెహోవా ప్రజలకు ఏ నైతిక బాధ్యత ఉంది?

14 ఇశ్రాయేలు జనాంగం తమ దేవుడైన యెహోవాను ఆరాధిస్తే, ఇతర దేశాలవాళ్లు తమతమ దేవతలను ఆరాధించారు. యెషయా కాలంలోని లోక పరిస్థితిని కోర్టులో జరిగే న్యాయవిచారణతో యెహోవా పోల్చాడు. తమ దైవత్వాన్ని నిరూపించుకోవడానికి సాక్షులను తెచ్చుకోమని ఇతర దేశాల దేవుళ్లను సవాలుచేస్తూ యెహోవా ఇలా ప్రకటించాడు, “సర్వజనులారా, గుంపుకూడి రండి జనములు కూర్చబడవలెను వారిలో ఎవరు [ఏ దేవుడు] ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగినవాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పుపొందునట్లు తమ సాక్షులను తేవలెను లేదా, విని సత్యమేయని యొప్పుకొనవలెను.”—యెష. 43:9.

15 జనాంగాల దేవుళ్లు తమ దైవత్వాన్ని నిరూపించుకోలేకపోయారు. వాళ్లు మాట్లాడలేని, ఎవరైనా తీసుకెళ్తేతప్ప ఎక్కడికీ కదల్లేని విగ్రహాలు మాత్రమే. (యెష. 46:5-7) అయితే యెహోవా ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు, “మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు . . . నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు.”—యెష. 43:10-12.

16 “సర్వోన్నత దేవుడు ఎవరు?” అనే విషయంలో విశ్వ కోర్టులో జరుగుతున్న విచారణలో, ‘యెహోవా మాత్రమే సత్య దేవుడు’ అని ఆయన ప్రజలు బిగ్గరగా, స్పష్టంగా సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది. ‘నా స్తోత్రమును ప్రచురము చేయడం కోసం, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు’ అని యెహోవా తన ప్రజలను పిలిచాడు. (యెష. 43:21) వాళ్లు ఆయన నామాన్ని ధరించిన ప్రజలు. యెహోవా వాళ్లను ఐగుప్తు నుండి విమోచించాడు కాబట్టి, భూమ్మీదున్న ఇతర ప్రజలందరి ముందు ఆయన సర్వాధిపత్యాన్ని సమర్థించాల్సిన నైతిక బాధ్యత వాళ్లకుంది. నిజానికి వాళ్లు, నేటి యెహోవా ప్రజలను ఉద్దేశిస్తూ మీకా ప్రవక్త రాసిన ఈ మాటల్ని పాటించాల్సి ఉంది, “సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.”—మీకా 4:5.

తిరుగుబాటుదారులైన ప్రజలు

17. ఇశ్రాయేలు జనాంగం యెహోవా దృష్టిలో “జాతిహీనపు ద్రాక్షావల్లివలె” ఎలా మారింది?

17 అయితే విచారకరంగా, ఇశ్రాయేలీయులు యెహోవాకు ద్రోహం చేశారు. చెక్కతో, రాళ్లతో చేసిన విగ్రహాలను పూజించే ఇతర దేశాల ప్రజలను అనుకరించడం మొదలుపెట్టారు. సా.శ.పూ. 8వ శతాబ్దంలో హోషేయ ప్రవక్త ఇలా రాశాడు, “ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్షచెట్టుతో సమానము . . . వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచువచ్చిరి; . . . వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు.” (హోషే. 10:1, 2) సుమారు 150 సంవత్సరాల తర్వాత, అవిశ్వాసులైన తన ప్రజల గురించి యెహోవా చెప్పిన ఈ మాటల్ని యిర్మీయా రాశాడు, “శ్రేష్ఠమైన ద్రాక్షావల్లివంటి దానిగా నేను నిన్ను నాటితిని; కేవలము నిక్కమైన విత్తనమువలని చెట్టు వంటిదానిగా నిన్ను నాటితిని; నాకు జాతిహీనపు ద్రాక్షావల్లివలె నీవెట్లు భ్రష్టసంతానమైతివి? నీకు నీవు చేసికొనిన దేవతలు ఎక్కడ నున్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించునేమో; . . . నా ప్రజలు . . . నన్ను మరచియున్నారు.”—యిర్మీ. 2:21, 28, 32.

18, 19. (ఎ) తన నామం కోసం ఓ కొత్త జనాంగాన్ని ఏర్పర్చుకుంటానని యెహోవా ముందే ఎలా చెప్పాడు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏం పరిశీలిస్తాం?

18 స్వచ్ఛారాధన చేస్తూ, యెహోవా గురించి నమ్మకంగా సాక్ష్యమిస్తూ శ్రేష్ఠమైన ఫలాలు ఫలించే బదులు ఇశ్రాయేలు జనాంగం విగ్రహారాధన అనే కుళ్లిన ఫలాన్ని ఫలించింది. అందుకే యేసు తన కాలంనాటి వేషధారులైన యూదా మతనాయకులతో ఇలా అన్నాడు, “దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడును.” (మత్త. 21:43) యెహోవా యిర్మీయా ప్రవక్త ద్వారా తెలియజేసిన ‘కొత్త నిబంధనలోని’ వాళ్లు మాత్రమే ఆ కొత్త జనాంగంలో అంటే ఆధ్యాత్మిక ఇశ్రాయేలులో సభ్యులుగా ఉంటారు. “నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు” అని యెహోవా వాళ్ల గురించి ప్రవచించాడు.—యిర్మీ. 31:31-34.

19 సహజ ఇశ్రాయేలీయులు అవిశ్వాసులుగా మారిన తర్వాత, యెహోవా మొదటి శతాబ్దంలో తన ప్రజలుగా ఉండడానికి ఆధ్యాత్మిక ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు. మరి నేడు భూమ్మీద దేవుని ప్రజలు ఎవరు? మంచి మనసున్నవాళ్లు దేవుని సత్యారాధకులను ఎలా గుర్తుపట్టవచ్చు? వీటి గురించి తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిద్దాం.