కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

రాహేలు తన పిల్లల గురించి ఏడ్చుచున్నదని చెప్పిన యిర్మీయా మాటలకు అర్థమేమిటి?

యిర్మీయా 31:15 లో ఇలా ఉంది, “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—ఆలకించుడి, రామాలో అంగలార్పును మహా రోదనధ్వనియు వినబడుచున్నవి; రాహేలు తన పిల్లలనుగూర్చి యేడ్చుచున్నది; ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది.”

రాహేలు చనిపోయిన సుమారు 1000 సంవత్సరాల తర్వాత యిర్మీయా ఆ మాటలు రాశాడు. అయితే, రాహేలు తన ఇద్దరు కుమారులు చనిపోవడానికి ముందే చనిపోయింది. కాబట్టి, ఆ మాటలు తప్పేమోనని మనకు అనిపిస్తాయి.

రాహేలు మొదటి కుమారుడు యోసేపు. (ఆది. 30:22-24) తర్వాత ఆమెకు ఇంకో కుమారుడు పుట్టాడు. ఆయన పేరు బెన్యామీను. అయితే బెన్యామీనును కంటూ ఆమె చనిపోయింది. కాబట్టి ప్రశ్నేమిటంటే, కుమారులు “లేకపోయినందున” రాహేలు ఏడుస్తున్నదని యిర్మీయా 31:15 ఎందుకు చెబుతుంది?

కొంతకాలం తర్వాత, రాహేలు మొదటి కుమారుడైన యోసేపుకు ఇద్దరు కుమారులు పుట్టారు. వాళ్లు మనష్షే, ఎఫ్రాయిము. (ఆది. 41:50-52; 48:13-20) కాలం గడుస్తుండగా, ఎఫ్రాయిము గోత్రం ఇశ్రాయేలు ఉత్తర రాజ్యమంతటిలో ప్రముఖ గోత్రంగా తయారైంది. అంతేకాక, ఆ రాజ్యంలోని పది గోత్రాలకు ప్రతినిధి అయ్యింది. మరోవైపున, బెన్యామీను గోత్రం యూదా గోత్రంతో పాటు దక్షిణ రాజ్యంలో భాగమైంది. అలా రాహేలు ఓ విధంగా మొత్తం ఇశ్రాయేలులోని అంటే ఉత్తర, దక్షిణ రాజ్యాల్లోని తల్లులందర్నీ సూచిస్తుందని చెప్పవచ్చు.

యిర్మీయా పుస్తకం రాసే సమయానికల్లా, పది గోత్రాల ఉత్తర రాజ్యం అష్షూరీయుల చేతిలో నాశనమైంది. అష్షూరీయులు వాళ్లలో చాలామందిని చెరగా తీసుకెళ్లారు. ఆ సమయంలో ఎఫ్రాయిము గోత్రానికి చెందిన కొంతమంది, యూదా ప్రాంతానికి పారిపోయి ఉండవచ్చు. సా.శ.పూ. 607లో బబులోనీయులు దక్షిణ యూదా రాజ్యాన్ని జయించారు. ఆ రాజ్యంలోని చాలామందిని చెరగా పట్టి, యెరూషలేముకు ఉత్తరాన 8 కి.మీ. దూరంలో ఉన్న రామాకు బహుశా తీసుకొచ్చి ఉంటారు. (యిర్మీ. 40:1) వాళ్లలో కొంతమందిని, రాహేలు సమాధి ఉన్న బెన్యామీను ప్రాంతంలో చంపేసి ఉండవచ్చు. (1 సమూ. 10:2) కాబట్టి రాహేలు తన పిల్లల గురించి ఏడుస్తుందంటే బెన్యామీనీయులందరి గురించి లేదా ప్రత్యేకంగా రామాలో చనిపోయిన బెన్యామీనీయుల గురించి సూచనార్థకంగా దుఃఖిస్తుందని చెప్పవచ్చు. లేదా, చనిపోయిన లేక బంధీలుగా తీసుకెళ్లిన ఇశ్రాయేలీయుల గురించి వాళ్ల తల్లులందరూ ఏడ్చారని సూచిస్తుండవచ్చు.

ఏదేమైనా, రాహేలు తన పిల్లల గురించి ఏడుస్తున్నదని యిర్మీయా చెప్పిన మాటలు, పసివాడైన యేసు ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు నెరవేరాయి. యెరూషలేముకు దక్షిణాన ఉన్న బేత్లెహేములో, రెండు సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సున్న మగ పిల్లల్ని చంపేయమని హేరోదురాజు ఆజ్ఞాపించాడు. అలా, ఆ కుమారులు లేకుండాపోయారు అంటే చనిపోయారు. తమ కన్నబిడ్డల్ని కోల్పోయిన తల్లులు ఎంతగా ఏడ్చివుంటారో ఒక్కసారి ఊహించండి! వాళ్ల ఏడ్పు చాలా దూరం వరకు అంటే యెరూషలేముకు ఉత్తరాన ఉన్న రామా వరకు వినపడినట్లు అయ్యింది.—మత్త. 2:16-18.

కాబట్టి, యిర్మీయా కాలంలో అలాగే యేసు కాలంలో రాహేలు తన పిల్లల గురించి ఏడ్వడం, చనిపోయిన తమ పిల్లల గురించి యూదా తల్లులు దుఃఖించడాన్ని సరిగానే సూచించింది. అయితే, చనిపోయి మరణమనే ‘శత్రువుని దేశానికి’ వెళ్లినవాళ్లు, పునరుత్థానమైనప్పుడు ‘తిరిగి వస్తారు.’—యిర్మీ. 31:16; 1 కొరిం. 15:26.