కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆనాటి జ్ఞాపకాలు

“చాలా ప్రాముఖ్యమైన కాలం”

“చాలా ప్రాముఖ్యమైన కాలం”

అమెరికాలో ఉన్న పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో, 1870వ సంవత్సరంలో ఒక చిన్న గుంపు లేఖనాలను పరిశోధించడం ప్రారంభించింది. ఛార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌ నాయకత్వంలో ఆ గుంపులోని వాళ్లు, క్రీస్తు విమోచన క్రయధనం గురించి అధ్యయనం చేసి, యెహోవా సంకల్పంలో అది ఎంత ముఖ్యమైనదో అర్థంచేసుకున్నారు. యేసు గురించి తెలియని వాళ్లతోసహా మనుషులందరూ విమోచన క్రయధనం ద్వారా రక్షణ పొందవచ్చని తెలుసుకుని వాళ్లు ఎంత పులకించిపోయి ఉంటారో! ఆ కృతజ్ఞతతో, యేసు మరణాన్ని ప్రతీ సంవత్సరం జ్ఞాపకం చేసుకోవాలని వాళ్లు నిర్ణయించుకున్నారు.—1 కొరిం. 11:23-26.

అంతేకాదు, సహోదరుడు రస్సెల్‌, జాయన్స్‌ వాచ్‌ టవర్‌ పత్రికను మొదలుపెట్టాడు. విమోచన క్రయధనం దేవుని ప్రేమకు అతిగొప్ప రుజువనే విషయాన్ని ఆ పత్రిక నొక్కిచెప్పింది. అది, క్రీస్తు మరణ జ్ఞాపకార్థ కాలాన్ని “చాలా ప్రాముఖ్యమైన కాలం” అని వర్ణిస్తూ, పిట్స్‌బర్గ్‌లో లేదా వేరే ప్రాంతాల్లో చిన్నగుంపుగా దాన్ని ఆచరించమని పాఠకులను ప్రోత్సహించింది. ‘ఒకేలాంటి విశ్వాసమున్న ఇద్దరుముగ్గురు సమకూడి ఆచరించినా, లేదా కనీసం ఒక్కరు ఆచరించినా యేసు అక్కడ ఉంటాడు’ అని ఆ పత్రిక చెప్పింది.

జ్ఞాపకార్థ ఆచరణ కోసం పిట్స్‌బర్గ్‌కు వచ్చేవాళ్ల సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతూ వచ్చింది. ‘ఇక్కడున్న ప్రేమగల సహోదరసహోదరీలు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు’ అని వాచ్‌ టవర్‌ పత్రిక పాఠకుల్ని ఆహ్వానించింది. పిట్స్‌బర్గ్‌లోని బైబిలు విద్యార్థులు, వేరే ప్రాంతాల నుండి వచ్చిన సహోదరసహోదరీలకు ప్రేమగా ఆతిథ్యం ఇచ్చారు. 1886⁠లో జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో కొన్నిరోజుల పాటు ఓ సమావేశం జరిగింది. “యజమాని మీద, ఆయన సహోదరుల మీద, సత్యం మీద ప్రేమతో నిండిన హృదయాలతో రండి” అంటూ ఆ పత్రిక పాఠకులను ఆహ్వానించింది.

లండన్‌ టబర్నకల్‌లో జ్ఞాపకార్థ చిహ్నాలను అందించడానికి గీసిన చార్టు

పిట్స్‌బర్గ్‌లోని బైబిలు విద్యార్థులు, జ్ఞాపకార్థ ఆచరణకు వచ్చేవాళ్ల కోసం ఎన్నో ఏళ్లపాటు అలాంటి సమావేశాలను ఏర్పాటు చేశారు. బైబిలు విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్దీ, ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల జ్ఞాపకార్థ ఆచరణను ఆచరించడం మొదలుపెట్టారు. అంతేకాదు, దానికి హాజరయ్యేవాళ్ల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. చికాగో సంఘానికి చెందిన రే బాప్‌ అనే సహోదరుడు ఇలా గుర్తుచేసుకున్నాడు, ‘1910లలో జ్ఞాపకార్థ ఆచరణకు వందలమంది హాజరయ్యేవాళ్లు. వాళ్లలో దాదాపు అందరూ చిహ్నాలు తీసుకునేవాళ్లే, అందుకే వాటిని అందించడానికి చాలా గంటలు పట్టేది.’

ఆచరణలో వాళ్లు ఏ చిహ్నాలు ఉపయోగించేవాళ్లు? ప్రభువు రాత్రి భోజనంలో యేసు పులిసిన ద్రాక్షారసాన్ని ఉపయోగించాడని వాచ్‌ టవర్‌ వివరించింది. అయితే మద్యం అలవాటున్న వాళ్లకు శోధనగా ఉండకూడదన్న ఉద్దేశంతో, ఆచరణ సమయంలో తాజా ద్రాక్షారసాన్ని లేదా ఉడకబెట్టిన ఎండు ద్రాక్షల రసాన్ని ఉపయోగించమని ఆ పత్రిక మొదట్లో చెప్పింది. అయితే, జ్ఞాపకార్థ ఆచరణలో “పులిసిన ద్రాక్షారసాన్నే” ఉపయోగించాలని కోరుకునేవాళ్లకు మాత్రం దాన్నే అందించేవాళ్లు. ఏమీ కలపని స్వచ్ఛమైన ఎర్రని ద్రాక్షారసమే (వైన్‌) యేసు రక్తానికి సరైన చిహ్నమని బైబిలు విద్యార్థులు ఆ తర్వాత అర్థంచేసుకున్నారు.

నికరాగ్వాలో, జైల్లో జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన వాళ్ల సంఖ్యను రాయడానికి ఒక గది నుండి మరో గదికి అందించుకున్న పేపరు, పెన్సిలు

యేసు మరణం ఎంత ప్రాముఖ్యమైనదో ఆలోచించడానికి జ్ఞాపకార్థ ఆచరణ ఒక మంచి అవకాశంగా ఉండేది. కానీ, కొన్ని సంఘాల్లో ఆచరణప్పుడు అందరూ ఎంత విచారంగా ఉండేవాళ్లంటే, ఆ ఆచరణ అయిపోగానే ఒక్కమాట కూడా మాట్లాడుకోకుండా వెళ్లిపోయేవాళ్లు. అయితే, యేసు శ్రమపడి చనిపోయినందుకు “దుఃఖంతో” కాకుండా, 1914 నుండి రాజుగా పరిపాలిస్తున్నందుకు “సంతోషంతో” దాన్ని ఆచరించాలని 1934⁠లో జెహోవా (ఇంగ్లీషు) అనే పుస్తకం చెప్పింది.

1957⁠లో రష్యాలోని మార్డ్‌వినియా లేబర్‌ క్యాంపులో జ్ఞాపకార్థ ఆచరణ కోసం సమకూడిన సహోదరులు

అయితే 1935⁠లో, ప్రకటన 7:9⁠లోని “గొప్పసమూహము” గురించిన అవగాహనలో మార్పు వచ్చింది. దాంతో ఆ తర్వాత జరిగిన జ్ఞాపకార్థ ఆచరణల్లో కొన్ని మార్పులు వచ్చాయి. గొప్పసమూహం అంటే తక్కువ ఉత్సాహం ఉన్న సమర్పిత క్రైస్తవులని అప్పటిదాకా యెహోవా ప్రజలు అనుకున్నారు. కానీ, పరదైసు భూమ్మీద జీవించే నమ్మకమైన సేవకులే గొప్పసమూహం అని 1935⁠లో అర్థం చేసుకున్నారు. అవగాహనలో వచ్చిన ఆ మార్పువల్ల చాలామంది తమనుతాము జాగ్రత్తగా పరిశీలించుకున్నారు. రస్సెల్‌ పోగెన్సీ అనే ఓ సహోదరుడు ఇలా ఒప్పుకున్నాడు, “పరలోకానికి వెళ్లాలనే కోరికను పరిశుద్ధాత్మ ద్వారా యెహోవా నాలో కలిగించలేదు.” ఆ సహోదరుడు, ఆయనలాంటి ఎంతోమంది నమ్మకమైన సేవకులు చిహ్నాలు తీసుకోవడం ఆపేశారు. కానీ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడం మాత్రం మానలేదు.

“చాలా ప్రాముఖ్యమైన కాలం” అయిన జ్ఞాపకార్థ కాలంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను ఏర్పాటు చేసేవాళ్లు. విమోచన క్రయధనం పట్ల కృతజ్ఞత చూపించేందుకు సహోదరసహోదరీలకు అవి చక్కని అవకాశాల్ని ఇచ్చాయి. ప్రకటనా పని చేయకుండా, కేవలం చిహ్నాలను మాత్రమే తీసుకునే ‘మెమోరియల్‌ సెయింట్స్‌గా’ ఉండొద్దని 1932⁠లో బులెటిన్‌ క్రైస్తవుల్ని ప్రోత్సహించింది. 1934⁠లో మరో బులెటిన్‌, “సహాయ పయినీరు సేవ” చేయమని సహోదరసహోదరీలను ఆహ్వానిస్తూ ‘ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో 1,000 మంది ఆ సేవ చేయగలరా?’ అని అడిగింది. ఆ తర్వాత, ఇన్ఫార్మెంట్‌ అభిషిక్తుల గురించి ఇలా చెప్పింది, “వాళ్లు రాజ్యాన్ని ప్రకటించడంలో పాల్గొంటేనే పూర్తి సంతోషాన్ని అనుభవిస్తారు.” a భూనిరీక్షణ ఉన్నవాళ్ల విషయంలో కూడా అది నిజం.

ఒంటరిగా జైల్లో ఉన్నప్పుడు హెరాల్డ్‌ కింగ్‌, జ్ఞాపకార్థ ఆచరణ గురించి పద్యాలు, పాటలు రాశాడు

యెహోవా ప్రజలందరికీ, జ్ఞాపకార్థ దినం సంవత్సరమంతటిలో చాలా పవిత్రమైన రోజు. కష్టమైన పరిస్థితుల్లో కూడా వాళ్లు దాన్ని ఆచరిస్తారు. ఓర, పెర్ల్‌ ఇంగ్లీష్‌ అనే అక్కాచెల్లెళ్లు 1930⁠లో జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడానికి సుమారు 80 కి.మీ. నడిచివెళ్లారు. హెరాల్డ్‌ కింగ్‌ అనే మిషనరీ, చైనాలో ఒంటరిగా జైల్లో ఉన్నప్పుడు జ్ఞాపకార్థ ఆచరణ గురించి పద్యాలు, పాటలు రాశాడు. అంతేకాదు, నల్ల ద్రాక్షల్లాంటి ఒకరకమైన పండ్లతో, అన్నంతో జ్ఞాపకార్థ చిహ్నాలు తయారుచేసుకున్నాడు. యుద్ధాలూ నిషేధాలూ ఉన్నా, తూర్పు ఐరోపా నుండి సెంట్రల్‌ అమెరికా, ఆఫ్రికా వరకు క్రైస్తవులు యేసు మరణాన్ని ధైర్యంగా జ్ఞాపకం చేసుకున్నారు. మనం ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంతో ప్రాముఖ్యమైన జ్ఞాపకార్థ ఆచరణకు హాజరై యెహోవాను, యేసుక్రీస్తును ఘనపరుస్తాం.

a బులెటిన్‌ను ఆ తర్వాత ఇన్ఫార్మెంట్‌ అని పిలిచారు, ఇప్పుడు దాన్ని మన రాజ్య పరిచర్య అని పిలుస్తున్నాం.