కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా బోధ కోసం దేశాల్ని సిద్ధం చేయడం

యెహోవా బోధ కోసం దేశాల్ని సిద్ధం చేయడం

“అంతట ఆ అధిపతి . . . ప్రభువు [“యెహోవా,” NW] బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను.”—అపొ. 13:12.

1-3. “సకల జనములకు” సువార్త ప్రకటించే విషయంలో శిష్యులకు ఏ సవాళ్లు ఉన్నాయి?

 యేసుక్రీస్తు తన శిష్యులకు చాలా పెద్దపని అప్పగించాడు. “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని ఆయన ఆజ్ఞాపించాడు. వాళ్లు ‘రాజ్య సువార్తను’ “సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతట” ఉన్న ప్రజలకు ప్రకటించాలి.—మత్త. 24:14; 28:19.

2 శిష్యులు యేసును, సువార్తను ప్రేమించారు. కానీ ‘ఆయన అప్పగించిన ఆ పని చేయడం మావల్ల అవుతుందా?’ అని వాళ్లు అనుకొని ఉండొచ్చు. ఎందుకంటే వాళ్లు చాలా తక్కువమంది ఉన్నారు. పైగా దేవుని కుమారుడని వాళ్లు ప్రకటిస్తున్న యేసు చంపబడ్డాడు. అంతేకాదు, యేసు శిష్యులు “విద్యలేని పామరులని” చాలామంది ప్రజల అభిప్రాయం. (అపొ. 4:13) వాళ్లు యూదా మతనాయకుల్లా, మతాన్ని బోధించే పాఠశాలల్లో చదువుకోలేదు. దానికి తోడు వాళ్లు ప్రకటించాల్సిన సందేశం, యూదా మతనాయకులు వందల సంవత్సరాలుగా బోధిస్తున్న ఆచారాలకు విరుద్ధమైనది. ‘సొంతప్రజలే మమ్మల్ని గౌరవించట్లేదు, ఇక అంతపెద్ద రోమా సామ్రాజ్యంలో మేము చెప్పేది ఎవరు వింటారు?’ అని వాళ్లు అనుకొనివుంటారు.

3 శిష్యులను ప్రజలు ద్వేషిస్తారని, హింసిస్తారని, కొంతమందిని చంపుతారని కూడా యేసు హెచ్చరించాడు. (లూకా 21:16, 17) సొంత స్నేహితులు, కుటుంబ సభ్యులే వాళ్లను అప్పగిస్తారని ఆయన చెప్పాడు. అంతేకాక, క్రీస్తు శిష్యులమని చెప్పుకునే అబద్ధ ప్రవక్తలు వస్తారని కూడా యేసు అన్నాడు. పైగా నేరం, దౌర్జన్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో శిష్యులు ప్రకటించాల్సి ఉంది. (మత్త. 24:10-12) ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు “భూదిగంతముల వరకు” సువార్త ప్రకటించడం సాధ్యమేనా? (అపొ. 1:8) బహుశా శిష్యులు కూడా, ‘ఇన్ని సవాళ్ల మధ్య మేమెలా సువార్త ప్రకటించగలం?’ అని అనుకొని ఉండొచ్చు.

4. తొలి క్రైస్తవుల ప్రకటనాపనికి ఎలాంటి ఫలితం వచ్చింది?

4 ఆ పని అంత సులభం కాదని తెలిసినా, శిష్యులు యేసు ఆజ్ఞకు లోబడి యెరూషలేములో, సమరయలో, ఇతర ప్రాంతాల్లో కూడా ప్రకటించారు. వాళ్లు ఎన్నో దేశాలకు వెళ్లి సువార్త ప్రకటించారు కాబట్టే, “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి” సువార్త చేరిందని సుమారు 30 ఏళ్ల తర్వాత అపొస్తలుడైన పౌలు చెప్పగలిగాడు. ఫలితంగా వేర్వేరు దేశాల ప్రజలు శిష్యులుగా మారారు. (కొలొ. 1:6, 23) ఉదాహరణకు, పౌలు కుప్ర అనే ద్వీపంలో ప్రకటించినప్పుడు, అక్కడి రోమా అధిపతి కూడా “ప్రభువు [“యెహోవా,” NW] బోధకు ఆశ్చర్యపడి” శిష్యుడయ్యాడు.అపొస్తలుల కార్యములు 13:6-12 చదవండి.

5. (ఎ) యేసు తన శిష్యులకు ఏమని మాటిచ్చాడు? (బి) మొదటి శతాబ్దం గురించి ఒక చరిత్ర పుస్తకం ఏమి చెప్తుంది?

5 తమ సొంత శక్తితో భూవ్యాప్తంగా ప్రకటించలేమని శిష్యులకు తెలుసు. అయితే, తాను వాళ్లకు తోడుగా ఉంటానని, పరిశుద్ధాత్మ సహాయం కూడా ఉంటుందని యేసు వాళ్లకు మాటిచ్చాడు. (మత్త. 28:20) దానికి తోడు, అప్పుడున్న కొన్ని పరిస్థితులు కూడా వాళ్లకు అనుకూలించి ఉండవచ్చు. నిజానికి, క్రైస్తవులు ప్రకటనా పని మొదలుపెట్టడానికి బహుశా మొదటి శతాబ్దమే అత్యంత అనుకూల సమయమని ఒక చరిత్ర పుస్తకం చెప్తుంది. అంతేకాదు, క్రైస్తవత్వం వృద్ధి చెందేలా దేవుడే తమకు మార్గం సిద్ధం చేశాడని, ఆ తర్వాత కాలంలోని క్రైస్తవులు అనుకున్నట్లు కూడా ఆ పుస్తకం చెప్తుంది.

6. ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏమి పరిశీలిస్తాం?

6 మరైతే, క్రైస్తవులు ప్రకటించగలిగేలా మొదటి శతాబ్దంలోని ప్రపంచ పరిస్థితుల్ని యెహోవా మార్చాడా? బైబిలు దాని గురించి ఏమీ చెప్పడంలేదు. అయితే, తన ప్రజలు సువార్త ప్రకటించాలని యెహోవా కోరుకున్నాడనీ, దాన్ని ఆపడం సాతాను వల్ల కాదనీ మనకు ఖచ్చితంగా తెలుసు. మొదటి శతాబ్దంలో క్రైస్తవుల ప్రకటనా పనికి అనుకూలించిన కొన్ని విషయాలను ఈ ఆర్టికల్‌లో చూద్దాం. మనకాలంలో ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించడానికి సహాయం చేస్తున్నవాటి గురించి తర్వాతి ఆర్టికల్‌లో చర్చిస్తాం.

రోమా సామ్రాజ్యంలో శాంతి వర్ధిల్లింది

7. పాక్స్‌ రోమనా అంటే ఏమిటి? ఆ కాలం ఎందుకు ప్రత్యేకమైనది?

7 మొదటి శతాబ్దంలో, రోమా సామ్రాజ్యం అంతటా శాంతి వర్ధిల్లింది. ఆ కాలాన్నే లాటిన్‌ భాషలో పాక్స్‌ రోమనా అని పిలుస్తారు. ఆ కాలంలో, యేసు శిష్యులు సులభంగా సువార్త ప్రకటించగలిగారు. అప్పట్లో ఏ చిన్న తిరుగుబాటు జరిగినా రోమా ప్రభుత్వం అణచివేసేది. నిజమే, యేసు ముందే చెప్పినట్లు అప్పట్లో కూడా కొన్ని యుద్ధాలు జరిగాయి. (మత్త. 24:6) రోమన్లు, సా.శ. 70⁠లో యెరూషలేమును నాశనం చేయడంతోపాటు తమ రాజ్య సరిహద్దుల్లో చిన్నచిన్న యుద్ధాలు కూడా చేశారు. కానీ ఆ సామ్రాజ్యంలోని చాలా ప్రాంతాల్లో శాంతిసమాధానాలు ఉండేవి. దానివల్ల శిష్యులు ప్రయాణించడం, ప్రకటించడం తేలికైంది. అలా 200 సంవత్సరాల పాటు రోమా సామ్రాజ్యంలో శాంతి వర్ధిల్లింది. మానవచరిత్రలో, ఎక్కువమంది ప్రజలు అంతకాలంపాటు శాంతిసామరస్యాలతో ఉండడం అదే మొదటిసారి అని ఒక పుస్తకం చెప్తుంది.

8. శిష్యులు రోమా సామ్రాజ్యంలోని శాంతికరమైన పరిస్థితులను ఎలా ఉపయోగించుకున్నారు?

8 ఆ కాలం గురించి, మూడవ శతాబ్దానికి చెందిన ఆరిజెన్‌ అనే విద్వాంసుడు రాశాడు. రోమా అధికారం కింద చాలా దేశాలు ఉండడం వల్ల, శిష్యులు వాటన్నిటిలో సువార్త ప్రకటించగలిగారని ఆయన రాశాడు. తమ దేశాన్ని కాపాడుకోవడానికి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయా దేశాల ప్రజలు ప్రశాంతంగా జీవించేవాళ్లని, దానివల్ల శిష్యులు ప్రేమ-శాంతి గురించి ప్రకటించినప్పుడు చాలామంది విన్నారని ఆయన చెప్పాడు. యేసు శిష్యులు హింసలు అనుభవించినా, సమాధానంగానే ఉంటూ, ఆ కాలంలోని శాంతికరమైన పరిస్థితులను చక్కగా ఉపయోగించుకుని అన్నిచోట్లా సువార్త ప్రకటించగలిగారు.—రోమీయులు 12:18-21 చదవండి.

ప్రయాణించడం తేలికైంది

9, 10. రోమా సామ్రాజ్యంలో ప్రయాణం ఎందుకు సులభంగా ఉండేది?

9 రోమన్లు, తమ సామ్రాజ్యంలోని దాదాపు అన్ని ప్రాంతాలను కలుపుతూ 80,000 కిలోమీటర్లకు పైగా పొడవున్న రోడ్లను నిర్మించారు. తమ సామ్రాజ్యంలోని ప్రాంతాలను కాపాడుకోవడానికి, ప్రజలను తమ అదుపులో పెట్టుకోవడానికి రోమా సైనికులు ఆ రోడ్ల ద్వారా ఏ ప్రాంతానికైనా త్వరగా చేరుకునేవాళ్లు. అడవుల్లో, ఎడారుల్లో, కొండల మీద కూడా రోడ్లు ఉండేవి. క్రైస్తవులు వాటి ద్వారా చాలా ప్రాంతాలకు వెళ్లి సువార్త ప్రకటించారు.

10 రోమన్లు ఓడ ప్రయాణాలు కూడా చేసేవాళ్లు. రోమా సామ్రాజ్యమంతటా వందలాది ఓడరేవులు ఉండేవి. వాటిని కలుపుతూ 900కు పైగా ఉన్న సముద్రమార్గాలను వాళ్లు ఉపయోగించేవాళ్లు. క్రైస్తవులు కూడా చాలా ప్రాంతాలకు ఓడల్లో ప్రయాణించేవాళ్లు. పాస్‌పోర్ట్‌లు, వీసాలు వంటివి అవసరం లేకుండానే వాళ్లు వేరే దేశాలకు వెళ్లగలిగేవాళ్లు. రోమన్లు దొంగల్ని కఠినంగా శిక్షించేవాళ్లు, అందుకే రోడ్లమీద దోపిడీలు జరిగేవి కావు. అలాగే, రోమా సైనిక నౌకలు సముద్రం మీద ప్రయాణిస్తూ ఉండేవి కాబట్టి సముద్రదొంగల భయం కూడా ఉండేది కాదు. పౌలు ప్రయాణిస్తున్న ఓడ కొన్నిసార్లు ప్రమాదానికి గురైందని, ఇంకొన్నిసార్లు ఆయన సముద్రంలో ఆపదలో చిక్కుకున్నాడని బైబిలు చెప్తుంది. కానీ, ఆయనమీద సముద్రదొంగలు దాడి చేసినట్లు బైబిలు ఎక్కడా చెప్పడంలేదు. వీటినిబట్టి రోడ్లమీద, సముద్రంమీద ప్రయాణం సురక్షితంగా ఉండేదని తెలుస్తుంది.—2 కొరిం. 11:25, 26.

గ్రీకు భాష

కోడెక్స్‌లో లేఖనాలను సులభంగా కనుగొనవచ్చు (12వ పేరా చూడండి)

11. శిష్యులు ఎందుకు గ్రీకు భాషను ఉపయోగించారు?

11 రోమా సామ్రాజ్యంలో చాలా ప్రాంతాలను, గ్రీకు పరిపాలకుడైన అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ ఒకప్పుడు పరిపాలించాడు. అందువల్ల ఆ ప్రాంతాల్లోని ప్రజలు, కొయిని గ్రీకు అనే సామాన్య గ్రీకు భాష మాట్లాడేవాళ్లు. అందుకే శిష్యులు ఆ భాషలో సువార్త ప్రకటించగలిగారు. ఐగుప్తులో ఉన్న యూదులు చాలాకాలం క్రితం హెబ్రీ లేఖనాలను గ్రీకులోకి అనువదించారు. దాన్నే సెప్టువజింటు అంటారు. ఆ అనువాదం గురించి చాలామంది ప్రజలకు తెలుసు కాబట్టి శిష్యులు దానిలోని లేఖనాలను ఉపయోగించేవాళ్లు. బైబిలు రచయితలు కూడా మిగతా బైబిలు పుస్తకాలను గ్రీకు భాషలోనే రాశారు. ఆ భాషలో ఎక్కువ పదాలు ఉండడం వల్ల లోతైన బైబిలు సత్యాలను వివరించడం తేలికైంది. గ్రీకు భాషవల్ల వేర్వేరు సంఘాల వాళ్లు చక్కగా మాట్లాడుకుంటూ, ఐక్యంగా ఉండగలిగారు.

12. (ఎ) కోడెక్స్‌ అంటే ఏంటి? దాన్ని ఉపయోగించడం ఎందుకు తేలిక? (బి) క్రైస్తవులు కోడెక్స్‌ను ఉపయోగించడం ఎప్పుడు మొదలుపెట్టారు?

12 మొదటి శతాబ్దంలోని శిష్యులు ప్రజలకు లేఖనాలను ఎలా చూపించేవాళ్లు? మొదట్లో వాళ్లు గ్రంథపు చుట్టలను ఉపయోగించారు. కానీ వాటిని తీసుకెళ్లడం, ఉపయోగించడం కష్టం. ఎందుకంటే, ఏదైనా లేఖనం చూపించాల్సి వస్తే, శిష్యులు ఆ గ్రంథపు చుట్టను విప్పి, మళ్లీ చుట్టాలి. సాధారణంగా దానిలో ఒకవైపు మాత్రమే లేఖనాలు ఉండేవి. ఒక్క మత్తయి సువార్తే ఓ గ్రంథపు చుట్టనిండా సరిపోతుంది. అయితే, ఆ తర్వాత గ్రంథపు చుట్టలకు బదులు పుస్తకం రూపంలో ఉండే కోడెక్స్‌ను ఉపయోగించడం మొదలుపెట్టారు. ఓ రకంగా చెప్పాలంటే పుస్తకాలను వాడడం మొదలైంది దానితోనే. ఆ కోడెక్స్‌ను తెరచి, పేజీలు తిప్పి, ఓ లేఖనాన్ని కనుగొనడం చాలా తేలిక. క్రైస్తవులు కోడెక్స్‌ను ఉపయోగించడం ఎప్పుడు మొదలుపెట్టారో ఖచ్చితంగా తెలియదు. అయితే ఓ రెఫరెన్సు పుస్తకం ఏం చెప్తుదంటే, ‘క్రైస్తవులు రెండవ శతాబ్దంలో కోడెక్స్‌ను చాలా ఎక్కువగా ఉపయోగించారు కాబట్టి, దీన్ని క్రీ.శ. 100వ సంవత్సరానికి చాలాముందే కనిపెట్టివుంటారు.’

రోమా చట్టం

13, 14. (ఎ) పౌలు తన రోమా పౌరసత్వాన్ని ఎలా ఉపయోగించుకున్నాడు? (బి)  క్రైస్తవులు రోమా చట్టం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందారు?

13 మొదటి శతాబ్దంలో, క్రైస్తవులు రోమా చట్టంవల్ల ఎన్నో ప్రయోజనాలు పొందారు. ఉదాహరణకు, పౌలు రోమా పౌరసత్వాన్ని చాలా సందర్భాల్లో ఉపయోగించుకున్నాడు. ఓసారి రోమా సైనికులు యెరూషలేములో పౌలును బంధించి, కొరడాలతో కొట్టబోతుండగా, తాను ఒక రోమా పౌరుణ్ణని వాళ్లకు చెప్పాడు. శిక్ష విధించకముందే ఒక రోమా పౌరుణ్ణి కొరడాలతో కొట్టకూడదని ఆయన సైనిక అధికారికి గుర్తుచేశాడు. దాంతో ‘అతన్ని ప్రశ్నించబోయేవాళ్లు వెంటనే వెనక్కు తగ్గారు. అతడు రోమా పౌరుడని తెలుసుకొన్నప్పుడు అతన్ని బంధించిన కారణంగా పైఅధికారికి కూడా భయం వేసింది.’—అపొ. 22:25-29 పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

14 రోమా పౌరసత్వం ఉండడంవల్ల పౌలు ఫిలిప్పీలోని జైలునుండి గౌరవంగా విడుదలయ్యాడు. (అపొ. 16:35-40) మరోసారి ఎఫెసు పట్టణంలో, ఓ అల్లరిమూక కొంతమంది క్రైస్తవుల మీద దాడి చేయాలని చూసింది. అప్పుడు, అక్కడి అధికారి ఆ అల్లరి మూకను శాంతపర్చి, రోమా న్యాయవ్యవస్థ గురించి వాళ్లను హెచ్చరించాడు. (అపొ. 19:35-41) మరోసారి పౌలు కైసరయలో ఉన్నప్పుడు, రోమా పౌరునిగా తన హక్కును ఉపయోగించుకుని రోమా చక్రవర్తి ఎదుట మాట్లాడే అవకాశాన్ని అడిగాడు. తర్వాత ఆయనను కలిసి, సువార్తను సమర్థిస్తూ మాట్లాడాడు. (అపొ. 25:8-12) అలా క్రైస్తవులు ‘సువార్త పక్షాన వాదించేందుకు, దాన్ని స్థిరపర్చేందుకు’ రోమా చట్టాన్ని ఉపయోగించుకున్నారు.—ఫిలి. 1:7.

యూదులు చాలా దేశాల్లో నివసించారు

15. మొదటి శతాబ్దంలో యూదులు ఏయే దేశాల్లో ఉండేవాళ్లు?

15 భూవ్యాప్తంగా ప్రకటించడానికి అప్పటి క్రైస్తవులకు మరో విషయం కూడా సహాయం చేసివుంటుంది. ఆ సమయంలో యూదులు చాలా దేశాల్లో ఉండేవాళ్లు. ఎందుకంటే, వందల సంవత్సరాల క్రితం యూదులను అష్షూరుకు, ఆ తర్వాత కాలంలో బబులోనుకు బంధీలుగా తీసుకెళ్లారు. పారసీకులు బబులోనును జయించిన తర్వాత, యూదులు పారసీక సామ్రాజ్యమంతటా విస్తరించారు. (ఎస్తే. 9:30) యేసు భూమ్మీద జీవించిన మొదటి శతాబ్దంకల్లా, యూదులు రోమా సామ్రాజ్యమంతటా అంటే ఐగుప్తులో, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో, గ్రీసు, ఆసియా మైనరు, మెసొపొతమియ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. రోమా సామ్రాజ్యంలో సుమారు 6 కోట్ల జనాభా ఉంటే, అందులో 40 లక్షలమందికి పైగా యూదులు ఉండేవాళ్లని అంచనా. యూదులు ఏ దేశంలో ఉన్నా, తమ నమ్మకాల్ని మాత్రం విడిచిపెట్టలేదు.—మత్త. 23:15.

16, 17. (ఎ) యూదులు చాలా దేశాల్లో ఉండడం వల్ల, అన్యులు ఎలా ప్రయోజనం పొందారు? (బి) యూదులు ఉపయోగించిన ఏ పద్ధతిని క్రైస్తవులు అనుసరించారు?

16 యూదులు చాలా దేశాల్లో ఉండడం వల్ల, వాళ్ల నమ్మకాల గురించి, హెబ్రీ లేఖనాల గురించి చాలామంది అన్యులకు తెలుసు. ఉదాహరణకు, ఒకే ఒక నిజమైన దేవుడున్నాడనీ ఆయన్ను సేవించేవాళ్లు ఆయన నియమాలకు లోబడాలనీ అన్యులు నేర్చుకున్నారు. అంతేకాదు, హెబ్రీ లేఖనాలను దేవుడే రాయించాడని, వాటిలో మెస్సీయ గురించి చాలా ప్రవచనాలున్నాయని కూడా వాళ్లు తెలుసుకున్నారు. (లూకా 24:44) కాబట్టి క్రైస్తవులు ప్రకటిస్తున్న కొన్ని విషయాల గురించి యూదులకూ అన్యులకూ ముందే కొంచెం అవగాహన ఉంది. అందుకే పౌలు, సువార్త వినే ప్రజలను కనుగొనడానికి, యూదులు ఆరాధన కోసం కూడుకునే సమాజమందిరాలకు తరచూ వెళ్లి వాళ్లతో లేఖనాలను తర్కించేవాడు.—అపొస్తలుల కార్యములు 17:1-3 చదవండి.

17 ఆరాధన కోసం యూదులు సమాజమందిరాల్లో, మరితర చోట్ల క్రమంగా కలుసుకునేవాళ్లు. ఆ సమయంలో వాళ్లు పాటలు పాడేవాళ్లు, ప్రార్థించేవాళ్లు, లేఖనాలు చర్చించేవాళ్లు. క్రైస్తవులు అదే పద్ధతిని అనుసరించారు. ఇప్పుడున్న క్రైస్తవ సంఘాల్లో కూడా మనం ఆ పద్ధతినే పాటిస్తున్నాం.

యెహోవా వాళ్లకు సహాయం చేశాడు

18, 19. (ఎ) మొదటి శతాబ్దంలోని పరిస్థితులు క్రైస్తవులకు ఎలా సహాయం చేశాయి (బి) ఈ ఆర్టికల్‌లోని విషయాలను పరిశీలించాక యెహోవా గురించి మీకేమి అనిపిస్తుంది?

18 చరిత్రంతటిలో, మొదటి శతాబ్దం చాలా ప్రత్యేకమైన సమయం. ఆ కాలంలో, రోమా సామ్రాజ్యంలో శాంతి వర్ధిల్లింది, చాలామంది ప్రజలు ఒకే భాషను మాట్లాడారు, రోమా చట్టంవల్ల ప్రజలు సురక్షితంగా జీవించారు, ఎక్కడికైనా సులభంగా ప్రయాణించేవాళ్లు, చాలా దేశాల్లోని ప్రజలకు యూదుల గురించి, హెబ్రీ లేఖనాల గురించి తెలుసు. ఇవన్నీ క్రైస్తవులు సులభంగా ప్రకటించడానికి సహాయం చేశాయి.

19 మనుషులు సృష్టికర్తను తెలుసుకోవడం చాలా కష్టమని, ఆయన గురించి లోకమంతటా చెప్పడం అసాధ్యమని, క్రీస్తుకు 400 ఏళ్ల ముందు జీవించిన ప్లేటో రాశాడు. కానీ “మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు” అని యేసు చెప్పాడు. (లూకా 18:27) యెహోవా సహాయంతోనే ప్రకటనా పని జరుగుతోందని స్పష్టంగా తెలుస్తుంది. “సమస్త జనులు” సువార్త వినాలని, తనను తెలుసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. (మత్త. 28:19) అయితే, మన కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రకటనా పని ఎలా జరుగుతుందో తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాం.