కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన ప్రపంచవ్యాప్త బోధనా పనిని యెహోవా నిర్దేశిస్తున్నాడు

మన ప్రపంచవ్యాప్త బోధనా పనిని యెహోవా నిర్దేశిస్తున్నాడు

“నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.”—యెష. 48:17.

1. మన కాలంలో ప్రకటనా పనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?

 బైబిలు విద్యార్థులు a సుమారు 130 ఏళ్ల క్రితం సువార్త ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు, వాళ్లకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్లా, వాళ్లు కొద్దిమందే ఉన్నారు. పైగా వాళ్లు ప్రకటించిన సందేశం చాలామందికి నచ్చలేదు. వాళ్లు అంతగా చదువుకున్నవాళ్లు కాదని ప్రజలు చిన్నచూపు చూశారు. సాతాను ఈ భూమ్మీదకు పడద్రోయబడినప్పుడు, వాళ్లు ఎన్నో హింసలు అనుభవించారు కూడా. (ప్రక. 12:12) అప్పటినుండి వాళ్లు ఈ “అపాయకరమైన” ‘అంత్యదినాల్లో’ ప్రకటిస్తూనే ఉన్నారు.—2 తిమో. 3:1.

2. మన కాలంలో జరుగుతున్న ప్రకటనా పనికి యెహోవా ఎలా సహాయం చేస్తున్నాడు?

2 అయితే యెహోవా వాళ్లకు సహాయం చేస్తూనే ఉన్నాడు. తన ప్రజలు భూవ్యాప్తంగా సువార్త ప్రకటించాలని ఆయన కోరుకుంటున్నాడు, దాన్ని అడ్డుకోవడం ఎవరివల్లా కాదు. యెహోవా గతంలో, బబులోను నుండి ఇశ్రాయేలీయుల్ని విడిపించినట్లే, మనకాలంలో కూడా తన సేవకుల్ని అబద్ధమతం నుండి విడిపించి, తనను సరైన విధంగా ఆరాధించేలా వాళ్లకు సహాయం చేశాడు. (ప్రక. 18:1-4) అంతేకాక, మనలో ప్రతీఒక్కరం ప్రయోజనం పొందేలా ఆయన మనకు బోధిస్తున్నాడు. మనం ఒకరితో ఒకరం ఎలా సఖ్యతగా ఉండాలో, ఆయన గురించి ఇతరులకు ఎలా బోధించాలో నేర్పిస్తున్నాడు. (యెషయా 48:16-18 చదవండి.) యెహోవా మన పనిని నిర్దేశిస్తున్నాడంటే, మనం ప్రకటించడానికి వీలుగా ఆయన ప్రపంచ పరిస్థితులను ప్రతీసారి మారుస్తాడని కాదు. నిజమే, ప్రపంచంలో జరిగిన కొన్ని మార్పులవల్ల మన ప్రకటనా పని మరింత తేలికైంది. అయినా మనం హింసలను, సాతాను లోకం నుండి వచ్చే ఇతర ఒత్తిళ్లను ఎదుర్కొంటూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రకటించగలుగుతున్నామంటే అది కేవలం యెహోవా దేవుని సహాయంతోనే.—యెష. 41:13; 1 యోహా. 5:19.

3. దానియేలు ప్రవచనం ఎలా నెరవేరింది?

3 అంత్యకాలములో చాలామంది బైబిలు సత్యాన్ని అర్థంచేసుకుంటారని దానియేలు ప్రవచించాడు. (దానియేలు 12:4 చదవండి.) “అంత్యకాలము” మొదలవడానికి కొంచెం ముందు, తన ప్రజలు ప్రాముఖ్యమైన బైబిలు బోధలను అర్థంచేసుకునేలా, క్రైస్తవమత సామ్రాజ్యంలోని అబద్ధ బోధలను తిరస్కరించేలా యెహోవా సహాయం చేశాడు. ఇప్పుడు, యెహోవాసాక్షులు బైబిలు సత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తున్నారు. దానియేలు ప్రవచనం నెరవేరిందని మనకు స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు 80 లక్షలమంది సత్యం నేర్చుకుని, దాన్ని ఇతరులకు బోధిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకటించడానికి వాళ్లకు ఏయే విషయాలు సహాయం చేశాయి?

బైబిలు అనువాదం

4. బైబిలు, 19వ శతాబ్దం చివరికల్లా ఎన్ని భాషల్లో అందుబాటులోకి వచ్చింది?

4 ఇప్పుడు చాలామంది దగ్గర బైబిలు ఉండడం వల్ల మనం సులభంగా సువార్త ప్రకటిస్తున్నాం. కానీ ఒకప్పుడు, పరిస్థితి ఇలా ఉండేది కాదు. వందల సంవత్సరాలపాటు క్రైస్తవ మతనాయకులు ప్రజల్ని బైబిలు చదవకుండా చేశారు. చివరికి, బైబిలు చదివేవాళ్లను హింసించారు, దాన్ని అనువదించిన వాళ్లను చంపేశారు కూడా. అయినా, 19వ శతాబ్దంలో కొన్ని సంస్థలు దాదాపు 400 భాషల్లో బైబిల్ని అనువదించి, ముద్రించాయి. ఆ శతాబ్దం చివరికల్లా చాలామంది దగ్గర బైబిలు ఉన్నా, వాళ్లు దానిలోని బోధల్ని మాత్రం అర్థంచేసుకోలేదు.

5. బైబిలు అనువాదం విషయంలో యెహోవాసాక్షులు ఎలాంటి కృషి చేశారు?

5 బైబిలు బోధిస్తున్న విషయాలను ఇతరులకు చెప్పాలని యెహోవా ప్రజలకు తెలుసు, వాళ్లు అలా చేశారు కూడా. మొదట్లో, వాళ్లు అందుబాటులో ఉన్న బైబిలు అనువాదాలను ఉపయోగించారు, వాటిని ప్రజలకు పంచిపెట్టారు. వాళ్లు 1950 నుంచి ఇప్పటివరకు, పరిశుద్ధ లేఖనాల నూతనలోక అనువాదం మొత్తం బైబిల్ని లేదా దానిలోని భాగాలను 120 కన్నా ఎక్కువ భాషల్లో ప్రచురించారు. వాళ్లు 2013⁠లో ఇంగ్లీషు నూతనలోక అనువాదం రివైజ్డ్‌ సంచికను ప్రచురించారు. ఈ బైబిల్ని అర్థంచేసుకోవడం, అనువదించడం తేలిక. ప్రజలకు తేలిగ్గా అర్థమయ్యే బైబిల్ని ఉపయోగించినప్పుడు, వాళ్లకు సులభంగా సత్యం బోధించవచ్చు.

శాంతికరమైన పరిస్థితులు

6, 7. (ఎ) గడిచిన 100 ఏళ్లలో యుద్ధాలు ఎంత ఎక్కువగా జరిగాయి? (బి) కొన్ని దేశాల్లో శాంతికరమైన పరిస్థితులు మన పనికి ఎలా సహాయం చేశాయి?

6 ‘లోకంలో శాంతి ఎక్కడ ఉంది?’ అని మీకు అనిపించవచ్చు. ఎందుకంటే, గడిచిన 100 ఏళ్లలో రెండు ప్రపంచ యుద్ధాలతో పాటు ఎన్నో యుద్ధాలు జరిగాయి. వాటిలో కోట్లాదిమంది చనిపోయారు. అయితే, రెండవ ప్రపంచ యుద్ధం ముమ్మరంగా జరుగుతున్న 1942⁠లో, అప్పట్లో యెహోవాసాక్షులకు నాయకత్వం వహిస్తున్న నేథన్‌ నార్‌ ఒక సమావేశంలో, “శాంతి—అది నిలుస్తుందా?” అనే అంశంపై ప్రసంగమిచ్చాడు. ఆ ఉత్తేజకరమైన ప్రసంగంలో ఆయన ప్రకటన 17వ అధ్యాయాన్ని వివరిస్తూ, ఈ యుద్ధం హార్‌మెగిద్దోను యుద్ధం కాదని, ఇది త్వరలో ముగిసిపోయి శాంతికరమైన పరిస్థితులు వస్తాయని చెప్పాడు.—ప్రక. 17:3, 11.

7 అయితే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత శాంతికరమైన పరిస్థితులు అన్నిచోట్లా లేవు. దాని తర్వాత జరిగిన ఇతర యుద్ధాల్లో లక్షలమంది చనిపోయారు. కానీ చాలా దేశాల్లో శాంతిసమాధానాలు ఉండడంతో, యెహోవా ప్రజలు సువార్త ప్రకటించడం వీలైంది. దాని ఫలితం? 1944⁠లో 1,10,000 కన్నా తక్కువున్న యెహోవాసాక్షుల సంఖ్య, ఇప్పుడు దాదాపు 80 లక్షలకు చేరింది! (యెషయా 60:22 చదవండి.) అవును, శాంతికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కువ మందికి సువార్త ప్రకటించడం వీలౌతుంది.

మెరుగైన ప్రయాణ సౌకర్యాలు

8, 9. రవాణా సౌకర్యాలు ఎలా మెరుగయ్యాయి? దాని వల్ల మన పని ఎలా సులభమైంది?

8 యెహోవా ప్రజలు అమెరికాలో ప్రకటనా పని మొదలుపెట్టిన కొత్తలో, ప్రయాణ సౌకర్యాలు అంతగా లేవు. 1900 సంవత్సరంలో అంటే, కావలికోట పత్రిక మొదలైన దాదాపు 21 సంవత్సరాల తర్వాత, అమెరికాలో 8,000 కార్లు మాత్రమే ఉండేవి. రోడ్లు కూడా సరిగ్గా ఉండేవి కావు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లకన్నా ఎక్కువ కార్లు, చాలా ప్రాంతాల్లో సౌకర్యవంతమైన రోడ్లు ఉన్నాయి. మనం ఈ ప్రయాణ సౌకర్యాలను ఉపయోగించుకుంటూ మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా ప్రకటిస్తున్నాం. ఒకవేళ మనకు ఇలాంటి సౌకర్యాలు లేకపోయినా, చాలా దూరం నడవాల్సి వచ్చినా, ప్రజలకు ప్రకటించడానికి చేయగలిగినదంతా చేస్తాం.—మత్త. 28:19, 20.

9 మనం ఇతర రవాణా సౌకర్యాలు కూడా ఉపయోగించుకుంటాం. ట్రక్కులు, ఓడలు, రైళ్ల ద్వారా బైబిళ్లను, ప్రచురణల్ని దూరప్రాంతాల్లో ఉన్న సహోదరసహోదరీలకు కొన్ని వారాల్లోనే పంపించగలుగుతున్నాం. ప్రాంతీయ పర్యవేక్షకులు, బ్రాంచి కమిటీ సభ్యులు, మిషనరీలు, మరితరులు సంఘాలకు సహాయం చేయడానికి, సమావేశాలు జరిగే ప్రాంతాలకు చేరుకోవడానికి విమాన సౌకర్యాలను ఉపయోగించుకుంటారు. అంతేకాక పరిపాలక సభ సభ్యులు, ప్రపంచ ప్రధాన కార్యాలయంలోని సహోదరులు విమానాల్లో చాలా దేశాలకు ప్రయాణిస్తూ, అక్కడి సహోదరసహోదరీలకు ప్రోత్సాహం, శిక్షణ ఇస్తారు. ఈ సౌకర్యాలన్నీ యెహోవా ప్రజలు ఐక్యంగా ఉండడానికి సహాయపడుతున్నాయి.—కీర్త. 133:1-3.

భాష, అనువాదం

10. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషును ఎంత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు?

10 మొదటి శతాబ్దంలో, రోమా సామ్రాజ్యంలోని చాలామంది గ్రీకు భాష మాట్లాడేవాళ్లు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇంగ్లీషు మాట్లాడుతున్నారు. నిజానికి, ప్రపంచ జనాభాలో 25 శాతం మంది ఇంగ్లీషు మాట్లాడగలరని లేదా అర్థంచేసుకోగలరని ఇంగ్లీష్‌ యాజ్‌ ఎ గ్లోబల్‌ లాంగ్వేజ్‌ అనే పుస్తకం చెప్తుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల్లో, రాజకీయాల్లో, శాస్త్ర-సాంకేతిక రంగాల్లో ఇంగ్లీషు భాషను ఉపయోగిస్తున్నారు కాబట్టి చాలామంది దాన్ని నేర్చుకుంటున్నారు.

11. ఇంగ్లీషు భాషను ఉపయోగించడం వల్ల యెహోవా ప్రజల పని ఎందుకు సులభమైంది?

11 ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషు ఉపయోగిస్తున్నారు కాబట్టి, మనం సత్యాన్ని వ్యాప్తి చేయడం సులభమైంది. కొన్ని సంవత్సరాలపాటు మన ప్రచురణల్ని మొదట ఇంగ్లీషులోనే ముద్రించేవాళ్లం. చాలా దేశాల ప్రజలకు ఇంగ్లీషు వచ్చు కాబట్టి, వాటిని ఎక్కువమంది చదవగలిగేవాళ్లు. మన ప్రపంచ ప్రధాన కార్యాలయంలో కూడా ముఖ్యంగా మాట్లాడేది ఇంగ్లీషే. ఇంగ్లీషు అర్థంచేసుకోగల చాలాదేశాల సహోదరసహోదరీలు, న్యూయార్క్‌లోని ప్యాటర్‌సన్‌లో జరిగే అనేక పాఠశాలల్లో శిక్షణ పొందుతున్నారు.

12. మన ప్రచురణల్ని ఎన్ని భాషల్లోకి అనువదిస్తున్నాం? ఈ పనికి కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లు ఎలా సహాయం చేస్తున్నాయి?

12 అయితే, అన్ని దేశాల ప్రజలకు సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మనమీద ఉంది కాబట్టి, మన ప్రచురణల్ని 700 కన్నా ఎక్కువ భాషల్లోకి అనువదిస్తున్నాం. ఇది ఎలా సాధ్యమైంది? కంప్యూటర్లు, MEPS వంటి కొన్ని కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లను ఉపయోగించడం ద్వారా అనువాద పని తేలికైంది. అనువాద పనివల్ల, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులందరూ బైబిలు సత్యానికి సంబంధించిన స్వచ్ఛమైన భాషను అర్థం చేసుకుని ఐక్యంగా ఉండగలుగుతున్నారు.—జెఫన్యా 3:9 చదవండి.

చట్టాలు, కోర్టు తీర్పులు

13, 14. చట్టాలు, కోర్టు తీర్పులు మన ప్రకటనా పనికి ఎలా సహాయం చేశాయి?

13 మొదటి శతాబ్దంలో క్రైస్తవుల ప్రకటనా పనికి రోమా చట్టం ఎన్నో విధాలుగా సహాయం చేసింది. ఈ రోజుల్లో కూడా చాలా దేశాల్లో ఉన్న చట్టాలు మన ప్రకటనా పనికి సహాయం చేస్తున్నాయి. ఉదాహరణకు, మన ప్రపంచ ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికాలో, అక్కడి రాజ్యాంగం పౌరులకు, మతాన్ని ఎంచుకునే హక్కును, తమ నమ్మకాల గురించి ఇతరులతో మాట్లాడే హక్కును, కలిసి కూడుకునే హక్కును కల్పించింది. దానివల్ల అక్కడి సహోదర సహోదరీలు స్వేచ్ఛగా కూటాలు జరుపుకుంటూ, సువార్త ప్రకటించగలుగుతున్నారు. అయితే, సువార్త ప్రకటించే తమ హక్కును కాపాడుకునేందుకు అక్కడి సాక్షులు కొన్నిసార్లు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. (ఫిలి. 1:7) కోర్టు వాళ్లకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినప్పుడు, సహోదరులు ఉన్నత న్యాయస్థానాలకు వెళ్లి చాలాసార్లు అనుకూలమైన తీర్పులు పొందారు.

14 వేరే దేశాల్లోని సహోదరులు కూడా, యెహోవాను ఆరాధించే హక్కును, ప్రకటించే హక్కును కాపాడుకోవడం కోసం కోర్టులకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఓడిపోయినప్పుడు, అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయించారు. ఉదాహరణకు, 2014 జూన్‌ కల్లా, యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టులో మనం 57 కేసులను గెలిచాం. ఆ కోర్టు ఇచ్చిన తీర్పుల్ని దాదాపు ఐరోపాలోని దేశాలన్నీ అమలు చేయాల్సిందే. మనం ‘సకల జనములచేత ద్వేషించబడుతున్నా,’ చాలా దేశాల్లోని చట్టాల వల్ల స్వేచ్ఛగా యెహోవాను ఆరాధించగలుగుతున్నాం.—మత్త. 24:9.

మన బోధనా పనికి సహాయపడ్డ ఇతర విషయాలు

మనం భూవ్యాప్తంగా ప్రజలకు బైబిలు సాహిత్యాన్ని అందుబాటులో ఉంచుతున్నాం

15. ముద్రణా పద్ధతులు ఎలా మెరుగయ్యాయి? వాటివల్ల మన ప్రకటనా పని ఎలా సులభమైంది?

15 ముద్రణలో వచ్చిన కొత్త పద్ధతుల వల్ల ఎక్కువమందికి సువార్త ప్రకటించడం వీలైంది. 1450⁠లో యోహాన్నస్‌ గూటెన్‌బర్గ్‌ కనిపెట్టిన ముద్రణా పద్ధతినే వందల సంవత్సరాల పాటు ప్రజలు వాడారు. కానీ గత 200 సంవత్సరాల్లో, ముద్రణా పద్ధతులు ఎంతో మెరుగయ్యాయి. ఆఫ్‌సెట్‌ ముద్రణ కనిపెట్టిన తర్వాత మరింత వేగంగా ముద్రించడం సాధ్యమైంది, నాణ్యత కూడా మెరుగైంది. అంతేకాక పేపరు తయారీ, పుస్తకాల బైండింగ్‌ మరింత చౌక అయ్యాయి. ఈ మార్పులవల్ల మన పని ఎలా సులభమైంది? 1879⁠లో మొదటి కావలికోట పత్రికను కేవలం ఇంగ్లీషులోనే, అదికూడా 6000 కాపీలు మాత్రమే ముద్రించారు. పైగా దానిలో చిత్రాలు ఉండేవి కావు. అయితే, ఇప్పుడు కావలికోట పత్రిక 200 కన్నా ఎక్కువ భాషల్లో వస్తోంది, దానిలో అందమైన రంగురంగుల చిత్రాలు ఉంటున్నాయి. దాని ప్రతీ సంచిక దాదాపు 5 కోట్లకు పైగా కాపీలు ముద్రిస్తున్నారు.

16. ప్రపంచవ్యాప్తంగా ప్రకటించడానికి ఏ కొత్త పరికరాలు సహాయం చేశాయి? (ప్రారంభ చిత్రం చూడండి.)

16 గత 200 సంవత్సరాల్లో కనిపెట్టిన కొత్త పరికరాలు, ప్రకటనా పనిలో యెహోవా ప్రజలకు ఎంతో సహాయం చేశాయి. రైళ్లు, కార్లు, విమానాలు ఎలా ఉపయోగపడ్డాయో చూశాం. వాటితోపాటు సైకిళ్లు, టైప్‌రైటర్లు, బ్రెయిలీ పరికరాలు, టెలిగ్రాఫ్‌లు, ఫోన్లు, కెమెరాలు, ఆడియో రికార్డర్లు, వీడియో రికార్డర్లు, రేడియో, టీవీ, చలనచిత్రాలు, కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ వంటివి కూడా మనకు సహాయం చేశాయి. వీటన్నిటినీ ఉపయోగించుకుంటూ మనం ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తున్నాం. యెహోవా ప్రజలు “జనముల పాలు” త్రాగుతారని బైబిలు ప్రవచించింది. దాని నెరవేర్పుగా, “జనముల” అంటే ఇతరుల సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటూ చాలా భాషల్లో బైబిళ్లను, బైబిలు సాహిత్యాన్ని తయారు చేస్తున్నాం.—యెషయా 60:16 చదవండి.

17. (ఎ) ఇప్పటి వరకూ మనం చూసిన రుజువులు ఏ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి? (బి) మనం తనతో కలిసి పనిచేయాలని యెహోవా ఎందుకు కోరుకుంటున్నాడు?

17 యెహోవా మన ప్రకటనా పనిని నిర్దేశిస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. ఆయన ఆ పనిని మన సహాయం లేకుండా కూడా చేయగలడు. కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం తనతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాడు. అందుకే దాన్ని మనకు అప్పగించాడు. ప్రకటించడం ద్వారా మనం యెహోవాను, ప్రజలను ప్రేమిస్తున్నామని చూపిస్తాం. (1 కొరిం. 3:9; మార్కు 12:28-31) మనం భూవ్యాప్తంగా ప్రకటించేలా సహాయం చేస్తున్నందుకు యెహోవాకు ఎంతో రుణపడి ఉన్నాం. కాబట్టి యెహోవా గురించి, రాజ్యం గురించి ప్రకటించడానికి ప్రతీ అవకాశాన్నీ ఉపయోగించుకుందాం.

a బైబిలు విద్యార్థులు 1931⁠లో యెహోవాసాక్షులనే పేరు పెట్టుకున్నారు.—యెష. 43:10.