కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

ఒకప్పుడు మన ప్రచురణలు పోలికలు లేదా సాదృశ్యాల గురించి ఎక్కువగా చెప్పేవి. అయితే, ఈ మధ్య కాలంలో వాటి గురించి ఎందుకు అంతగా ప్రస్తావించట్లేదు?

కొన్నిసార్లు బైబిల్లోని వ్యక్తులు, సంఘటనలు లేదా వస్తువులు రాబోయే మరింత గొప్పవాటిని సూచించవచ్చని కావలికోట (ఇంగ్లీషు) సెప్టెంబరు 15, 1950 సంచిక వివరించింది. దెబోరా, ఏలీహు, యెఫ్తా, యోబు, రాహాబు, రిబ్కా ఇంకా ఎంతోమంది నమ్మకమైన స్త్రీపురుషులు అభిషిక్తులకు లేదా ‘గొప్పసమూహానికి’ సూచనగా ఉన్నారని ఒకప్పుడు మన ప్రచురణలు చెప్పాయి. (ప్రక. 7:9) ఉదాహరణకు యెఫ్తా, యోబు, రిబ్కా అభిషిక్తులను సూచించారనీ దెబోరా, రాహాబు గొప్పసమూహాన్ని సూచించారనీ మనం భావించాం. అయితే, ఈ మధ్య కాలంలో అలాంటి పోలికల గురించి మనం చెప్పట్లేదు. ఎందుకు?

బైబిల్లోని కొంతమంది వ్యక్తులు, రాబోయే మరింత గొప్పవాళ్లకు లేదా గొప్పవాటికి సూచనగా ఉన్నారని లేఖనాలు చెప్తున్న మాట నిజమే. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు గలతీయులు 4:21-31 వచనాల్లో ఇద్దరు ‘అలంకారిక’ స్త్రీల గురించి ప్రస్తావించాడు. ఆ ఇద్దరిలో ఒకరు, అబ్రాహాము దాసురాలైన హాగరు. ఆమె, ధర్మశాస్త్రం ద్వారా యెహోవాకు కట్టుబడివున్న ఇశ్రాయేలు జనాంగాన్ని సూచించింది. మరొకరు ‘స్వతంత్రురాలైన’ శారా. ఆమె, దేవుని భార్యకు అంటే ఆయన సంస్థలోని పరలోక భాగానికి సూచనగా ఉంది. రాజూ యాజకుడూ అయిన మెల్కీసెదెకు యేసును సూచిస్తున్నాడని పౌలు వివరిస్తూ, వాళ్లిద్దరి మధ్యవున్న కొన్ని పోలికల గురించి రాశాడు. (హెబ్రీ. 6:20;7:1-3) పౌలు మరో సందర్భంలో, యెషయా ప్రవక్తను యేసుతో, యెషయా కుమారులను అభిషిక్త క్రైస్తవులతో పోల్చాడు. (హెబ్రీ. 2:13-15) ఈ విషయాలను రాసేలా పౌలును యెహోవాయే ప్రేరేపించాడు, కాబట్టి ఈ పోలికలు సరైనవని మనం నమ్మవచ్చు.

సూచన

ప్రాచీన ఇశ్రాయేలులో వధించబడిన పస్కా పశువు. —సంఖ్యా. 9:2.

వాస్తవం

యేసే ఆ “పస్కా పశువు” అని పౌలు చెప్పాడు. —1 కొరిం. 5:7.

అయితే, ఒక వ్యక్తి ఎవర్నైనా లేదా దేన్నైనా సూచిస్తున్నాడని బైబిలు చెప్పినంత మాత్రాన, ఆయన జీవితంలో జరిగిన ప్రతీ విషయం లేదా సంఘటన మరో గొప్ప విషయాన్ని సూచిస్తుందని మనం అనుకోకూడదు. ఉదాహరణకు, మెల్కీసెదెకు యేసుకు సూచనగా ఉన్నాడని పౌలు రాసినా, ఆయన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి మాత్రం పౌలు ప్రస్తావించలేదు. ఓ సందర్భంలో నలుగురు రాజులను జయించి వచ్చిన అబ్రాహాము కోసం మెల్కీసెదెకు రొట్టెలు, ద్రాక్షారసం తీసుకొచ్చాడు. పౌలు దానిగురించి ఏమీ చెప్పలేదు, కాబట్టి ఆ సంఘటనకు ఏదో లోతైన అర్థం ఉందని మనం అనుకోకూడదు.—ఆది. 14:1, 18.

అయితే, క్రీస్తు తర్వాతి కాలంలో జీవించిన కొంతమంది రచయితలు, దాదాపు బైబిల్లోని ప్రతీ వృత్తాంతం రాబోయే ఏదో గొప్ప విషయాన్ని సూచిస్తుందని తప్పుగా అనుకున్నారు. ఆరిజెన్‌, ఆంబ్రోస్‌, జెరోమ్‌ బోధించిన వాటిగురించి వివరిస్తూ, ది ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ బైబిల్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెప్తుంది, “వాళ్లు లేఖనాల్లో ఉన్న ప్రతీ చిన్న సంఘటనకు, ప్రతీ సందర్భానికీ సాదృశ్యాలను వెదికిపట్టుకునేవాళ్లు. చివరికి చాలా చిన్నచిన్న వాటిలో, సర్వసాధారణమైన వాటిలో కూడా ఏదో లోతైన అర్థం [దాగి] ఉందని అనుకునేవాళ్లు . . . , రక్షకుడు తిరిగి లేచి శిష్యులకు కనిపించిన రాత్రి, వాళ్లు పట్టిన చేపల సంఖ్యలో కూడా ఏదో సాదృశ్యం ఉందని అనుకున్నారు. ఆ 153 సంఖ్య దేన్ని సూచిస్తుందో తెలుసుకోవడానికి కొంతమంది చాలా ప్రయత్నించారు.”

యేసు ఐదు రొట్టెలు, రెండు చేపలతో 5,000 మంది పురుషులకు ఆహారం పెట్టిన వృత్తాంతానికి ఒక లోతైన అర్థం ఉందని అగస్టీన్‌ అనే మరో మతగురువు వివరించాడు. బార్లీతో చేసిన ఆ ఐదు రొట్టెలు బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలను సూచిస్తున్నాయని ఆయన చెప్పాడు. బార్లీ, గోధుమ కంటే తక్కువ కాబట్టి “పాత నిబంధన” “కొత్త నిబంధన” కంటే తక్కువని ఆయన చెప్పాడు. ఆ రెండు చేపలు ఓ రాజును, ఓ యాజకుణ్ణి సూచిస్తున్నాయని కూడా చెప్పాడు. మరో విద్వాంసుడైతే, యాకోబు ఓ గిన్నెనిండా ఎర్రని చిక్కుడుకాయల కూరను ఇచ్చి ఏశావు దగ్గర జ్యేష్ఠత్వపు హక్కు కొనుక్కోవడం, యేసు తన ఎర్రని రక్తాన్నిచ్చి మానవులకోసం పరలోక నిరీక్షణను కొనడాన్ని సూచించిందని వివరించాడు.

ఆ వివరణల్ని నమ్మడం మీకు కష్టంగా ఉందా? ఉంటే, సమస్య ఏంటో మీకు అర్థమైనట్లే. బైబిల్లోని ఏ వృత్తాంతాలు రాబోయే గొప్పవాటిని సూచిస్తున్నాయో, ఏవి సూచించట్లేదో మనుషులు తెలుసుకోలేరు. మరి ఏమి చేయడం తెలివైన పని? ఓ వ్యక్తి, సంఘటన లేదా ఓ వస్తువు రాబోయే మరింత గొప్పవాటికి సూచనని లేఖనాలు బోధిస్తే, మనం నమ్మాలి. కానీ, లేఖనాలు అలా చెప్పనప్పుడు, వాటికి ఏదో అర్థం ఉందని మనం అనుకోకూడదు.

మరైతే, బైబిల్లోని వృత్తాంతాల నుండి, ఇతర వివరాల నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు? అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు, “ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.” (రోమా. 15:4) మొదటి శతాబ్దంలోని అభిషిక్త క్రైస్తవులు బైబిలు వృత్తాంతాల నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చో పౌలు ఆ మాటల్లో వివరించాడు. అయితే, మొదటి శతాబ్దం నుండి ఇప్పటివరకు, క్రైస్తవులందరూ అంటే ‘వేరే గొర్రెలు’ కూడా లేఖనాల్లోని విషయాల నుండి ప్రయోజనం పొందుతూనే ఉన్నారు.—యోహా. 10:16; 2 తిమో. 3:1.

అందుకే చాలా బైబిలు వృత్తాంతాలు కేవలం అభిషిక్త క్రైస్తవులకు లేదా ‘వేరే గొర్రెలకు’ లేదా ఒక నిర్దిష్ట కాలంలోని క్రైస్తవులకు మాత్రమే వర్తించవు. బదులుగా, పూర్వకాలంలోనూ అలాగే ఇప్పుడున్న దేవుని సేవకులందరూ వాటినుండి ప్రయోజనం పొందారు. ఉదాహరణకు, యోబు అనుభవించిన కష్టాలు, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో కేవలం అభిషిక్తులు అనుభవించిన కష్టాల్నే సూచించట్లేదు. ‘వేరే గొర్రెల్లో’ కూడా చాలామంది దైవభక్తిగల స్త్రీపురుషులు యోబులాగే కష్టాలు పడ్డారు. వాళ్లు యోబు వృత్తాంతాన్ని చదివి ఎంతో ఊరట పొందారు. అంతేకాదు, కష్టాల్ని సహించిన యోబుకు యెహోవా ఇచ్చిన ప్రతిఫలం చూసి, ‘ఆయన [యెహోవా] ఎంతో జాలి కనికరం గలవాడని’ వాళ్లు తెలుసుకున్నారు.—యాకో. 5:11.

నేడు మన సంఘాల్లో, దెబోరాలా నమ్మకంగా ఉన్న వృద్ధ స్త్రీలూ, ఏలీహులా తెలివైన యౌవన సంఘపెద్దలూ ఉన్నారు. అంతేకాదు, యెఫ్తాలా ఎంతో ఉత్సాహం-ధైర్యం గల పయినీర్లు, యోబులా సహనంగల నమ్మకమైన స్త్రీపురుషులు కూడా ఉన్నారు. మనం లేఖనాల నుండి ‘ఆదరణ, నిరీక్షణ’ పొందేలా ‘పూర్వం రాయబడినవన్నీ’ అందుబాటులో ఉంచినందుకు యెహోవాకు ఎంతో రుణపడి ఉన్నాం.

పై కారణాలనుబట్టి, బైబిల్లోని ప్రతీ వృత్తాంతం జరగబోయే గొప్పవాటిని సూచిస్తుందని చెప్పేబదులు, వాటినుండి మనం నేర్చుకోగల విలువైన పాఠాలకే మన ప్రచురణలు ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాయి.