కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తలాంతుల ఉపమానం నుండి నేర్చుకోండి

తలాంతుల ఉపమానం నుండి నేర్చుకోండి

‘అతడు ఒకనికి అయిదు తలాంతులు ఒకనికి రెండు, ఒకనికి ఒకటి ఇచ్చెను.’మత్త. 25:15.

1, 2. యేసు తలాంతుల ఉపమానం ఎందుకు చెప్పాడు?

 యేసుక్రీస్తు తన అభిషిక్త అనుచరులకు వాళ్ల బాధ్యతను స్పష్టం చేయడానికి తలాంతుల ఉపమానం చెప్పాడు. అయితే, ఆ ఉపమానం నుండి యేసు శిష్యులందరూ పాఠం నేర్చుకోవచ్చు. కాబట్టి మనకు పరలోక నిరీక్షణ ఉన్నా, భూనిరీక్షణ ఉన్నా మనందరం ఆ ఉపమానాన్ని అర్థం చేసుకోవాలి.

2 యేసు తలాంతుల ఉపమానాన్ని ఏ సందర్భంలో చెప్పాడు? తాను రాజయ్యానని, యుగసమాప్తి మొదలైందని గుర్తుపట్టడానికి సహాయం చేసే ఓ సూచనను తన శిష్యులకు ఇస్తూ యేసు ఆ ఉపమానాన్ని చెప్పాడు. (మత్త. 24:3) కాబట్టి, తలాంతుల ఉపమానం కూడా ఆ సూచనలో ఓ భాగమే, అది మన కాలంలో నెరవేరుతోంది.

3. మత్తయి 24, 25 అధ్యాయాల్లోని ఉపమానాల నుండి మనమేమి నేర్చుకుంటాం?

3 యేసు తలాంతుల ఉపమానం చెప్తున్న సందర్భంలో, మరో మూడు ఉపమానాలను కూడా చెప్పాడు. అవి కూడా యుగసమాప్తికి సంబంధించిన సూచనలో భాగమే. తన అనుచరులకు ఉండాల్సిన లక్షణాల గురించి క్రీస్తు ఆ ఉపమానాల్లో నొక్కిచెప్పాడు. మత్తయి 24:45 నుండి మత్తయి 25:46 వరకున్న వచనాల్లో మనం ఆ ఉపమానాలను చూడవచ్చు. మొదటి ఉపమానంలో, నమ్మకమైన దాసుని గురించి అంటే యెహోవా ప్రజలకు బోధించే బాధ్యత ఉన్న అభిషిక్తుల చిన్నగుంపు గురించి చూస్తాం. వాళ్లు నమ్మకంగా ఉంటూ బుద్ధి లేక వివేచన చూపించాలి. పదిమంది కన్యకల ఉపమానంలో, తాను ఏ రోజున లేదా ఏ ఘడియలో వస్తానో తెలియదు కాబట్టి అభిషిక్తులందరూ సిద్ధంగా, మెలకువగా ఉండాలని యేసు హెచ్చరించాడు. తర్వాత తలాంతుల ఉపమానంలో, అభిషిక్త క్రైస్తవులందరూ తమకిచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి కష్టపడి పనిచేయాలని ఆయన బోధించాడు. దాని తర్వాత గొర్రెలు-మేకల ఉపమానంలో, భూనిరీక్షణ ఉన్నవాళ్లు అభిషిక్తులకు నమ్మకంగా ఉంటూ, వాళ్లకు మద్దతివ్వడానికి చేయగలిగినదంతా చేయాలని నొక్కిచెప్పాడు. a మనం ఈ ఆర్టికల్‌లో, తలాంతుల ఉపమానాన్ని పరిశీలిద్దాం.

యజమాని తన దాసులకు చాలా డబ్బు ఇచ్చాడు

4, 5. ఆ ఉపమానంలోని వ్యక్తి ఎవర్ని సూచిస్తున్నాడు? ఒక తలాంతు విలువ ఎంత?

4 మత్తయి 25:14-30 చదవండి. తలాంతుల ఉపమానంలో, దూరదేశానికి ప్రయాణమైన ఓ వ్యక్తి గురించి యేసు చెప్పాడు. అలాంటి మరో ఉపమానంలో, ‘రాజ్యం సంపాదించుకోవడానికి’ ప్రయాణమైన వ్యక్తి గురించి కూడా ఆయన చెప్పాడు. (లూకా 19:12) ఆ రెండు ఉపమానాల్లోని వ్యక్తులు, సా.శ. 33లో పరలోకానికి వెళ్లిన యేసును సూచిస్తున్నారని ఎన్నో సంవత్సరాలుగా మన ప్రచురణలు చెప్తున్నాయి. యేసు పరలోకానికి వెళ్లిన వెంటనే రాజు అవ్వలేదు. b బదులుగా, తన శత్రువులు “తన పాదములకు పాదపీఠముగా చేయబడువరకు” అంటే 1914 వరకు ఆయన వేచి చూశాడు.—హెబ్రీ. 10:12, 13.

5 ఓ వ్యక్తి దగ్గర ఎనిమిది తలాంతులున్నాయని యేసు ఆ ఉపమానంలో చెప్పాడు. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ డబ్బు. c అయితే ఆ వ్యక్తి ప్రయాణమయ్యే ముందు వాటిని తన దాసులకు పంచిపెట్టి, వాటితో వ్యాపారం చేసి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించమని చెప్పాడు. ఆ వ్యక్తికి తన డబ్బు ఎంతో విలువైనది, అలాగే యేసుకు కూడా భూమ్మీదున్నప్పుడు తాను చేసిన ఓ పని చాలా విలువైనది.

6, 7. తలాంతులు దేన్ని సూచిస్తున్నాయి?

6 యేసు, ప్రకటనా పనిని చాలా ముఖ్యమైనదిగా ఎంచాడు. ఆ పని వల్ల చాలామంది ఆయన శిష్యులయ్యారు. (లూకా 4:43 చదవండి.) అయితే, చేయాల్సిన పని ఇంకా చాలా ఉందని, ఎంతోమంది తన శిష్యులు అవుతారని ఆయనకు తెలుసు. అందుకే తన శిష్యులతో, “మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవి” అని అన్నాడు. (యోహా. 4:35-38) ఓ మంచి రైతు కోతకు వచ్చిన పొలాన్ని విడిచిపెట్టడు, యేసు కూడా ఆ రైతులాగే ప్రవర్తించాడు. అందుకే పరలోకానికి వెళ్లేముందు తన అనుచరులను, “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని ఆజ్ఞాపించాడు. (మత్త. 28:18-20) ఆ విధంగా, యేసు తన శిష్యులకు ఓ విలువైన సంపదను అంటే ప్రకటనా పనిని అప్పగించాడు.—2 కొరిం. 4:7.

7 ఉపమానంలోని వ్యక్తి తన దాసులకు డబ్బు ఇచ్చినట్లే, యేసు కూడా శిష్యులను చేసే పనిని తన అభిషిక్త అనుచరులకు అప్పగించాడు. (మత్త. 25:14) కాబట్టి “తలాంతులు,” ప్రకటించి శిష్యులను చేసే బాధ్యతను సూచిస్తున్నాయి.

8. యజమాని తన దాసులకు వేర్వేరు మొత్తాల్లో డబ్బు ఇచ్చినా, ఆయనేమి కోరుకున్నాడు?

8 ఆ ఉపమానంలో యజమాని ఒక దాసునికి ఐదు తలాంతులు, రెండో దాసునికి రెండు తలాంతులు, మూడో దాసునికి ఒక తలాంతు ఇచ్చాడని యేసు చెప్పాడు. (మత్త. 25:15) యజమాని తన దాసులకు వేర్వేరు మొత్తాల్లో డబ్బు ఇచ్చినా, దాని ద్వారా ఇంకా ఎక్కువ సంపాదించడానికి అందరూ తమ శక్తి కొలది కృషి చేయాలని కోరుకున్నాడు. అదేవిధంగా యేసు కూడా తన అభిషిక్త అనుచరులు ప్రకటనాపని చేయడానికి శాయశక్తులా కృషి చేయాలని కోరుకున్నాడు. (మత్త. 22:37; కొలొ. 3:23, 24) సా.శ. 33 పెంతెకొస్తు రోజు నుండి, యేసు అనుచరులు ఆ తలాంతులను ఎక్కువ చేసే పని మొదలుపెట్టారు అంటే అన్ని దేశాల ప్రజలను శిష్యులుగా చేయడం మొదలుపెట్టారు. అలా చేయడానికి వాళ్లెంత కష్టపడ్డారో అపొస్తలుల కార్యములు పుస్తకంలో వివరంగా ఉంది. dఅపొ. 6:7; 12:24; 19:20.

యుగసమాప్తి కాలంలో దాసులు తమ తలాంతులను ఉపయోగించారు

9. (ఎ) యజమాని ఇచ్చిన తలాంతులను ఇద్దరు నమ్మకమైన దాసులు ఏమి చేశారు, దాని నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (బి) భూమ్మీద నిత్యం జీవించేవాళ్లకు ఏ బాధ్యత ఉంది?

9 యజమాని ఇచ్చిన తలాంతులను చక్కగా ఉపయోగించిన ఇద్దరు దాసులు, యుగసమాప్తి కాలంలో ఉన్న నమ్మకమైన అభిషిక్త సహోదరసహోదరీలను సూచిస్తున్నారు. ముఖ్యంగా 1919 నుండి, వాళ్లు ప్రకటనా పనిలో తాము చేయగలిగినదంతా చేస్తున్నారు. ఆ ఉపమానంలో యజమాని తన ఇద్దరు దాసులకు వేర్వేరు మొత్తాల్లో డబ్బు ఇచ్చాడు. అంతమాత్రాన, నమ్మకమైన అభిషిక్తుల్లో రెండు వేర్వేరు గుంపులుంటాయని దానర్థం కాదు. ఉపమానంలోని దాసులిద్దరూ కష్టపడి పనిచేసి, తమకిచ్చిన డబ్బును రెట్టింపు చేశారు. అంటే, ప్రకటించి శిష్యులు చేసే పనిలో అభిషిక్తులు మాత్రమే కష్టపడాలని దానర్థమా? కాదు. యేసు గొర్రెలు-మేకల ఉపమానంలో, భూమ్మీద నిత్యం జీవించేవాళ్లు ప్రకటనాపనిలో అభిషిక్త సహోదరులకు మద్దతిస్తూ, వాళ్లకు నమ్మకంగా ఉంటారని చెప్పాడు. నిజానికి, అలా మద్దతివ్వడాన్ని వాళ్లు గౌరవంగా భావిస్తారు. కాబట్టి, యెహోవా ప్రజలంతా ‘ఒకే మందగా’ ఉంటూ, ప్రకటించి శిష్యులు చేసే పనిలో అందరూ కష్టపడతారు.—యోహా. 10:16.

10. మనం యుగసమాప్తి కాలంలో జీవిస్తున్నామని దేన్నిబట్టి చెప్పవచ్చు?

10 తన అనుచరులందరూ కష్టపడి పనిచేస్తూ, ఎక్కువమందిని శిష్యుల్ని చేయాలని యేసు కోరుకుంటున్నాడు. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు అలాగే చేశారు. మరి ఈ యుగసమాప్తి కాలంలో, అంటే తలాంతుల ఉపమానం నెరవేరుతున్న మన కాలంలో యేసు అనుచరులు ఆ పనిని చేస్తున్నారా? ఖచ్చితంగా. ముందెన్నడూ లేనంతగా ఎంతోమంది సువార్తను అంగీకరించి, శిష్యులౌతున్నారు. యేసు అనుచరులందరూ కష్టపడి పనిచేయడంవల్ల ప్రతీ సంవత్సరం లక్షలమంది బాప్తిస్మం తీసుకుని, ప్రకటనాపనిలో పాల్గొంటున్నారు. వీటన్నిటినిబట్టి, యుగసమాప్తి గురించి యేసు చెప్పిన సూచనలో ప్రకటనాపని ఎంతో ముఖ్యమైనదని స్పష్టంగా తెలుస్తోంది. తన అనుచరుల విషయంలో యేసు ఎంతో సంతోషిస్తున్నాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

సువార్త ప్రకటించే అమూల్యమైన బాధ్యతను యేసు తన శిష్యులకు అప్పగించాడు. (10వ పేరా చూడండి)

యజమాని ఎప్పుడు వస్తాడు?

11. మహాశ్రమల కాలంలో యేసు వస్తాడని మనకెలా తెలుసు?

11 “బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను” అని యేసు చెప్పాడు. (మత్త. 25:19) యజమాని అయిన యేసు ఆ పనిని మహాశ్రమల ముగింపులో చేస్తాడు. అది మనకెలా తెలుసు? యేసు తన రాక గురించి, మత్తయి 24, 25 అధ్యాయాల్లో చాలాసార్లు ప్రస్తావించాడు. ఉదాహరణకు, మనుష్యకుమారుడు “ఆకాశ మేఘారూఢుడై వచ్చుట” ప్రజలు చూస్తారని ఆయన చెప్పాడు. మహాశ్రమల కాలంలో ప్రజలకు తీర్పుతీర్చడానికి యేసు వచ్చే సమయాన్ని అది సూచిస్తుంది. అంతేకాదు, యుగసమాప్తి కాలంలో జీవిస్తున్న తన అనుచరులు మెలకువగా ఉండాలని ఆయన హెచ్చరించాడు. అందుకే, “ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు,” “మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును” అని ఆయన చెప్పాడు. (మత్త. 24:30, 42, 44) కాబట్టి యేసు తలాంతుల ఉపమానంలో కూడా, ప్రజలకు తీర్పుతీర్చి సాతాను లోకాన్ని నాశనం చేసే సమయం గురించే మాట్లాడుతున్నాడు. e

12, 13. (ఎ) యజమాని తన ఇద్దరి దాసులతో ఏమి చెప్తాడు, ఎందుకు? (బి) అభిషిక్తులు చివరి ముద్రను ఎప్పుడు పొందుతారు? (“ చనిపోయినప్పుడు లెక్క అప్పజెప్తారు” అనే బాక్సు చూడండి.) (సి) అభిషిక్తులకు సహాయం చేసినవాళ్లు ఏ బహుమానం పొందుతారు?

12 యజమాని తిరిగొచ్చినప్పుడు, ఐదు తలాంతులు ఉన్న దాసుడు మరో ఐదు తలాంతులనూ, రెండు తలాంతులు ఉన్న దాసుడు మరో రెండు తలాంతులనూ సంపాదించారని గమనించాడు. అందుకే ఆయన, ‘భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటిమీద నియమిస్తాను’ అని వాళ్లిద్దరితో అన్నాడు. (మత్త. 25:21, 23) మరి, యజమాని అయిన యేసు భవిష్యత్తులో వచ్చినప్పుడు ఏమి చేస్తాడు?

13 మహాశ్రమలు మొదలవ్వడానికి కాస్తముందు, భూమ్మీద కష్టపడి పని చేస్తున్న అభిషిక్తులు తమ చివరి ముద్రను పొందుతారు. (ప్రక. 7:1-3) హార్‌మెగిద్దోనుకు ముందే, యేసు వాళ్లను పరలోకానికి పునరుత్థానం చేయడం ద్వారా వాళ్లకు ప్రతిఫలమిస్తాడు. మరి ప్రకటనా పనిలో అభిషిక్తులకు సహాయం చేసిన భూనిరీక్షణ ఉన్నవాళ్ల సంగతేంటి? వాళ్లు గొర్రెలుగా తీర్పు పొంది, దేవుని రాజ్య పరిపాలనలో భూమ్మీద నిత్యం జీవించే బహుమానాన్ని పొందుతారు.—మత్త. 25:34.

సోమరియైన చెడ్డ దాసుడు

14, 15. అభిషిక్తుల్లో చాలామంది చెడ్డవాళ్లలా, సోమరుల్లా తయారౌతారని యేసు చెప్తున్నాడా? వివరించండి.

14 ఒక తలాంతు పొందిన మరో దాసుని గురించి కూడా యేసుక్రీస్తు ఆ ఉపమానంలో చెప్పాడు. అతను దాన్ని ఉపయోగించి వ్యాపారమూ చేయలేదు, కనీసం వడ్డీకి కూడా ఇవ్వలేదు. బదులుగా అతను దాన్ని భూమిలో దాచిపెట్టాడు. అందుకే యజమాని అతన్ని “సోమరియైన చెడ్డ దాసుడా” అని పిలిచాడు. అంతేకాదు, అతని దగ్గరున్న ఆ ఒక్క తలాంతును కూడా తీసేసుకొని మొదటి దాసునికి ఇచ్చాడు. ఆ తర్వాత అతన్ని “చీకటిలోనికి” పడేశాడు, అక్కడ ఆ దాసుడు బాధతో ఏడ్చాడు.—మత్త. 25:24-30; లూకా 19:22, 23.

15 ముగ్గురు దాసుల్లో ఒకడు సోమరిగా, చెడ్డవాడిగా మారాడని యేసు చెప్పాడు. అంటే, అభిషిక్తుల్లో మూడొంతుల మంది ఆ చెడ్డ దాసునిలా ఉంటారని దానర్థమా? కాదు. ఈ ఉపమానాన్ని యేసు చెప్పిన మిగతా రెండు ఉపమానాలతో పోలిస్తే ఆ విషయం మనకు అర్థమౌతుంది. నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుని ఉపమానంలో, ఇతర దాసులను హింసించిన ఓ దుష్ట దాసుని గురించి యేసు మాట్లాడాడు. అయితే, నమ్మకమైన దాసునిగా సేవ చేస్తున్నవాళ్లలో కొంతమంది దుష్టులుగా మారతారని దానర్థం కాదు. బదులుగా, అలా మారవద్దని యేసు వాళ్లను హెచ్చరిస్తున్నాడు. అలాగే పదిమంది కన్యకల ఉపమానంలో ఐదుగురు బుద్ధిలేని కన్యకల గురించి యేసు చెప్పాడు. ఇక్కడ కూడా, అభిషిక్తుల్లో సగం మంది వివేచన లేకుండా ప్రవర్తిస్తారని ఆయన చెప్పడం లేదు. దానికి బదులు, వాళ్లు సిద్ధంగా, మెలకువగా లేకపోతే ఏం జరుగుతుందో ఆయన హెచ్చరిస్తున్నాడు. f అదేవిధంగా తలాంతుల ఉపమానంలో కూడా, చివరిదినాల్లో అభిషిక్తుల్లో చాలామంది చెడ్డవాళ్లలా, సోమరుల్లా తయారౌతారని యేసు చెప్పడంలేదు. బదులుగా, చెడ్డ దాసునిలా ఉండకుండా తలాంతులతో “వ్యాపారం” చేయమని అంటే ప్రకటనా పనిలో కష్టపడి పనిచేస్తూ ఉండమని యేసు అభిషిక్తుల్ని హెచ్చరించాడు.—మత్త. 25:16.

16. (ఎ) తలాంతుల ఉపమానం నుండి మనం ఏ రెండు పాఠాలు నేర్చుకుంటాం? (బి) తలాంతుల ఉపమానాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఆర్టికల్‌ మనకెలా సహాయం చేసింది? (“ తలాంతుల ఉపమానాన్ని మనమెలా అర్థం చేసుకోవాలి?” అనే బాక్సు చూడండి.)

16 తలాంతుల ఉపమానం నుండి మనం ఏ రెండు పాఠాలను నేర్చుకుంటాం? మొదటిది, యేసు తన అభిషిక్త అనుచరులకు ఓ విలువైన సంపదను అంటే ప్రకటించి, శిష్యులను చేసే ముఖ్యమైన బాధ్యతను అప్పగించాడు. రెండవది, ప్రకటనా పనిలో మనందరం కష్టపడి పనిచేయాలని యేసు కోరుకుంటున్నాడు. మనం ఆ పనిలో నమ్మకంగా కొనసాగుతూ, యేసుకు యథార్థంగా ఉంటూ ఆయనకు లోబడితే మనకు తప్పకుండా ప్రతిఫలమిస్తాడు.—మత్త. 25:21, 23, 34.

a నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు ఎవరో కావలికోట జూలై 15, 2013, 21-22 పేజీల్లోని, 8-10 పేరాల్లో చర్చించాం. ముందటి ఆర్టికల్‌లో పదిమంది కన్యకల ఉపమానాన్ని పరిశీలించాం. తర్వాతి ఆర్టికల్‌లో, అలాగే కావలికోట అక్టోబరు 15, 1995, 23-28 పేజీల్లో, గొర్రెలు-మేకల ఉపమానం గురించిన వివరణ ఉంది.

c యేసు కాలంలో, ఒక తలాంతు 6,000 దేనారాలతో సమానం. ఓ పనివాడు రోజంతా కష్టపడితే ఒక దేనారము సంపాదించేవాడు. కాబట్టి ఒక తలాంతు సంపాదించాలంటే అతను 20 సంవత్సరాలు పనిచేయాలి.

d అపొస్తలులు చనిపోయిన తర్వాత మతభ్రష్టత్వం అన్ని సంఘాలకు వ్యాపించింది. ఎన్నో శతాబ్దాలపాటు ప్రకటనా పని అంతంత మాత్రంగానే జరిగింది. అయితే, ‘కోతకాలంలో’ లేదా యుగసమాప్తి కాలంలో ప్రకటనాపని మరింత బాగా జరుగుతుంది. (మత్త. 13:24-30, 36-43) కావలికోట జూలై 15, 2013, 9-12 పేజీలు చూడండి.

f ఈ పత్రికలో, “మీరు ‘మెలకువగా’ ఉంటారా?” అనే ఆర్టికల్‌లో 13వ పేరా చూడండి.