కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రీస్తు సహోదరులకు నమ్మకంగా మద్దతివ్వడం

క్రీస్తు సహోదరులకు నమ్మకంగా మద్దతివ్వడం

“మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి.”మత్త. 25:40.

1, 2. (ఎ) యేసు తన స్నేహితులకు ఏ ఉపమానాలు చెప్పాడు? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) గొర్రెలు-మేకల ఉపమానం గురించి మనం ఏమి తెలుసుకోవాలి?

 యేసుక్రీస్తు తన స్నేహితులైన పేతురు, అంద్రెయ, యాకోబు, యోహానులతో మాట్లాడుతున్నాడు. ఆయన వాళ్లకు, నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుని ఉపమానం, పదిమంది కన్యకల ఉపమానం, తలాంతుల ఉపమానం చెప్పాడు. ఆ తర్వాత ‘సమస్త జనములకు’ తీర్పుతీర్చడానికి “మనుష్యకుమారుడు” వచ్చే సమయం గురించి వివరించాడు. అప్పుడు ఆయన ఆసక్తికరమైన మరో ఉపమానాన్ని చెప్పాడు. అందులో గొర్రెలుగా, మేకలుగా తీర్పుపొందే రెండు గుంపులు గురించి అలాగే, రాజు “సహోదరులు” అనే మరో ప్రాముఖ్యమైన గుంపు గురించి కూడా ఆయన చెప్పాడు.—మత్తయి 25:31-46 చదవండి.

2 అపొస్తలుల్లాగే, ఇప్పుడున్న యెహోవా సేవకులు కూడా ఈ ఉపమానం విషయంలో చాలాకాలంగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే, ఇది మన జీవితాలకు సంబంధించింది. కొంతమంది నిత్యజీవం పొందుతారని, మిగతావాళ్లు నాశనం అవుతారని యేసు చెప్పాడు. కాబట్టి, ఈ ఉపమానం అర్థం ఏమిటో, మనం నిత్యజీవం పొందాలంటే ఏమి చేయాలో తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మనం ఈ ప్రశ్నలకు జవాబులను చూద్దాం: గొర్రెలు-మేకల ఉపమానాన్ని అర్థం చేసుకోవడానికి యెహోవా మనకెలా సహాయం చేశాడు? ఈ ఉపమానం ప్రకటనాపని గురించి నొక్కి చెప్తుందని మనకెలా తెలుసు? ప్రకటనాపని ఎవరు చేయాలి? మనం ‘రాజుకు,’ ఆయన ‘సహోదరులకు’ నమ్మకంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

ఉపమానాన్ని అర్థం చేసుకోవడానికి యెహోవా మనకెలా సహాయం చేశాడు?

3, 4. (ఎ) గొర్రెలు-మేకల ఉపమానాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఏ విషయాలు తెలుసుకోవాలి? (బి) ఈ ఉపమానాన్ని 1881లో వాచ్‌ టవర్‌ పత్రిక ఎలా వివరించింది?

3 గొర్రెలు-మేకల ఉపమానాన్ని అర్థం చేసుకోవాలంటే, మనం మూడు విషయాలు తెలుసుకోవాలి: (1) “మనుష్యకుమారుడు” లేక “రాజు” అలాగే గొర్రెలు, మేకలు, రాజు “సహోదరులు” ఎవర్ని సూచిస్తున్నారు? (2) “మనుష్యకుమారుడు” ప్రజల్ని గొర్రెలుగా, మేకలుగా ఎప్పుడు వేరుచేస్తాడు? (3) కొంతమంది గొర్రెలని, మిగతావాళ్లు మేకలని ఆయన దేన్నిబట్టి తీర్పు తీరుస్తాడు?

4 “మనుష్యకుమారుడు” లేక “రాజు” యేసే అని 1881లో జాయన్స్‌ వాచ్‌ టవర్‌ చెప్పింది. అంతేకాదు, యేసుతోపాటు పరలోకంలో పరిపాలించేవాళ్లూ అలాగే భూమ్మీద జీవించే పరిపూర్ణ మానవులందరూ, రాజు “సహోదరులు” అని ఆ పత్రిక చెప్పింది. ప్రజల్ని వేరుచేసే పని, క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన కాలంలో జరుగుతుందనీ, ఎల్లప్పుడూ దేవునిలా ప్రేమను చూపించేవాళ్లు గొర్రెలనీ ఆ పత్రిక వివరించింది.

5. గొర్రెలు-మేకల ఉపమానాన్ని దేవుని ప్రజలు 1923లో ఎలా అర్థంచేసుకున్నారు?

5 ఆ తర్వాత సంవత్సరాల్లో, తన ప్రజలు ఈ ఉపమానాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి యెహోవా సహాయం చేశాడు. వాచ్‌ టవర్‌ అక్టోబరు 15, 1923 సంచిక, “మనుష్యకుమారుడు” యేసేనని నొక్కిచెప్పింది. అయితే, యేసుతోపాటు పరిపాలించేవాళ్లు మాత్రమే రాజు ‘సహోదరులనీ,’ వాళ్లందరూ వెయ్యేళ్ల పరిపాలనా కాలంలో పరలోకంలో ఉంటారనీ లేఖనాధారంగా వివరించింది. వాళ్ల పరిపాలన కింద భూమ్మీద జీవించే ప్రజలే గొర్రెలని ఆ పత్రిక చెప్పింది. వీళ్లు రాజు సహోదరులకు మద్దతిస్తారని ఉపమానం చెప్తుంది కాబట్టి, అభిషిక్తులు ఇంకా భూమ్మీద ఉండగానే, అంటే వెయ్యేళ్ల పరిపాలనకు ముందే ప్రజల్ని వేరుచేసే పని జరుగుతుందని అది వివరించింది. అంతేకాదు, యేసు మీద విశ్వాసం ఉంచుతూ, దేవుని రాజ్యం మంచి పరిస్థితుల్ని తీసుకొస్తుందని నమ్మేవాళ్లు గొర్రెలుగా తీర్పు పొందుతారని ఆ ఆర్టికల్‌ చెప్పింది.

6. గొర్రెలు-మేకల ఉపమానం విషయంలో 1995లో మన అవగాహన ఎలా మెరుగైంది?

6 మన కాలంలోని ప్రకటనాపనికి ప్రజలు స్పందించే తీరునుబట్టే, వాళ్లు గొర్రెలుగా లేదా మేకలుగా తీర్పు పొందుతారని మనం చాలాకాలంగా అనుకున్నాం. మన సందేశాన్ని వినేవాళ్లు గొర్రెలని, విననివాళ్లు మేకలని అనుకునేవాళ్లం. అయితే, 1995లో మన అవగాహనలో మార్పు వచ్చింది. కావలికోట అక్టోబరు 15, 1995 సంచిక, మత్తయి 24:29-31 (చదవండి) వచనాల్ని మత్తయి 25:31, 32 (చదవండి) వచనాలతో పోలుస్తూ, మనుష్యకుమారుడైన యేసు “తన మహిమతో” వచ్చినప్పుడు, అంటే మహాశ్రమల కాలంలో ప్రజల్ని గొర్రెలుగా లేదా మేకలుగా తీర్పుతీరుస్తాడని వివరించింది. a

7. గొర్రెలు-మేకల ఉపమానాన్ని మనకాలంలో ఎలా అర్థంచేసుకున్నాం?

7 యేసు చెప్పిన గొర్రెలు-మేకల ఉపమానాన్ని మనకాలంలో మరింత స్పష్టంగా అర్థం చేసుకున్నాం. “మనుష్యకుమారుడు” లేదా “రాజు” యేసనీ, రాజు “సహోదరులు” పరిశుద్ధాత్మతో అభిషేకించబడి, యేసుతోపాటు పరలోకంలో పరిపాలించే స్త్రీపురుషులనీ మనకు తెలుసు. (రోమా. 8:16, 17) “గొర్రెలు,” “మేకలు” అన్ని దేశాల ప్రజల్ని సూచిస్తున్నాయి. మహాశ్రమల ముగింపులో యేసు వాళ్లకు తీర్పుతీరుస్తాడు. అవి త్వరలోనే మొదలౌతాయి. అలాగే, భూమ్మీద జీవిస్తున్న అభిషిక్తులకు మద్దతిస్తారా లేదా అనే దాన్నిబట్టే ప్రజలు తీర్పు పొందుతారని మనం తెలుసుకున్నాం. కాలం గడిచేకొద్దీ, ఈ ఉపమానంతోపాటు మత్తయి 24, 25 అధ్యాయాల్లో ఉన్న ఇతర ఉపమానాల్ని అర్థంచేసుకోవడానికి యెహోవా మనకు సహాయం చేస్తున్నందుకు ఎంతో కృతజ్ఞులం.

ప్రకటనా పని చాలా ప్రాముఖ్యమని ఈ ఉపమానం చెప్తుంది

8, 9. గొర్రెలను “నీతిమంతులు” అని యేసు ఎందుకు పిలిచాడు?

8 యేసు గొర్రెలు-మేకల ఉపమానంలో, “ప్రకటించండి” లేదా “ప్రకటనా పని” వంటి మాటల్ని ఉపయోగించలేదు. మరైతే, ప్రకటనాపని చాలా ప్రాముఖ్యమని ఈ ఉపమానం నొక్కిచెప్తుందని మనకెలా తెలుసు?

9 మొదటిగా, యేసు ఉపమానం ద్వారా బోధిస్తున్నాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యేసు నిజమైన గొర్రెలు, మేకల గురించి మాట్లాడడంలేదు. అలాగే, ఓ వ్యక్తి గొర్రెగా తీర్పు పొందాలంటే అభిషిక్తులకు ఆహారం, బట్టలు ఇవ్వాలనో, ఆరోగ్యం బాగోలేనప్పుడు వాళ్లను చూసుకోవాలనో, జైల్లో ఉన్నప్పుడు చూడడానికి వెళ్లాలనో యేసు చెప్పడంలేదు. బదులుగా గొర్రెల్లాంటివాళ్లకు తన సహోదరుల పట్ల ఎలాంటి వైఖరి ఉంటుందో యేసు ఉపమాన రూపంలో చెప్తున్నాడు. గొర్రెలు, అభిషిక్తులను క్రీస్తు సహోదరులుగా గుర్తిస్తూ ఈ అపాయకరమైన చివరి రోజుల్లో నమ్మకంగా మద్దతిస్తున్నారు కాబట్టే యేసు వాళ్లను “నీతిమంతులు” అని పిలిచాడు.—మత్త. 10:40-42; 25:40, 46; 2 తిమో. 3:1-5.

10. గొర్రెలు యేసు సహోదరులకు ఎలా సహాయం చేయవచ్చు?

10 రెండవదిగా, యేసు గొర్రెలు-మేకల ఉపమానాన్ని ఏ సందర్భంలో చెప్పాడో పరిశీలించండి. ఆయన తన ప్రత్యక్షతకు, యుగసమాప్తికి సంబంధించిన సూచన గురించి మాట్లాడుతూ ఆ ఉపమానం చెప్పాడు. (మత్త. 24:3) ఆ సూచనలోని ముఖ్యమైన విషయం, రాజ్య సువార్తను ‘లోకమందంతటా ప్రకటించడం.’ (మత్త. 24:14) అయితే, యేసు గొర్రెలు-మేకల ఉపమానాన్ని చెప్పడానికి ముందు తలాంతుల ఉపమానం చెప్పి, అభిషిక్తులు ప్రకటనాపనిలో కష్టపడి పనిచేయాలని నొక్కిచెప్పాడు. కానీ ఇప్పుడు భూమ్మీద అభిషిక్తులు కొద్దిమందే ఉన్నారు, చేయాల్సిన పని మాత్రం ఎంతో ఉంది. వాళ్లు, అంతం రాకముందే “సకల జనములకు” సువార్త ప్రకటించాలి. అయితే యేసు గొర్రెలు-మేకల ఉపమానంలో చెప్పినట్లు, ఈ పనిలో అభిషిక్తులకు గొర్రెల్లాంటివాళ్లు మద్దతిస్తారు. వాళ్లు అలా మద్దతివ్వగల ముఖ్యమైన మార్గాల్లో, ప్రకటనా పని ఒకటి. అయితే, ఆ పనికి మద్దతుగా కేవలం విరాళాలిస్తే లేదా ప్రకటించమని అభిషిక్తుల్ని ప్రోత్సహిస్తే సరిపోతుందా?

ప్రకటనాపని ఎవరు చేయాలి?

11. కొంతమందికి ఏ ప్రశ్న రావచ్చు? ఎందుకు?

11 నేడు దాదాపు 80 లక్షలమంది యేసు అనుచరులు ఉన్నారు. వాళ్లలో చాలామంది అభిషిక్తులు కాదు, యేసు వాళ్లకు తలాంతులు ఇవ్వలేదు. ఆయన తన అభిషిక్త సహోదరులకు మాత్రమే తలాంతులు ఇచ్చాడు. (మత్త. 25:14-18) అందుకే కొంతమంది ఇలా అంటారు, ‘అభిషిక్తులుకానివాళ్లకు యేసు తలాంతులు ఇవ్వలేదు కదా, మరి వాళ్లు కూడా ప్రకటించాలా?’ ప్రకటించాలి. ఎందుకో ఇప్పుడు చూద్దాం.

12. మత్తయి 28:19, 20 వచనాల్లోని యేసు మాటల నుండి మనం ఏమి నేర్చుకుంటాం?

12 ప్రకటించమని యేసు తన శిష్యులందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. పునరుత్థానమైన తర్వాత యేసు తన అనుచరులకు కనబడి, ప్రజల్ని శిష్యులుగా చేయమని, తాను ఆజ్ఞాపించిన “వాటినన్నిటిని” పాటించేలా వాళ్లకు బోధించమని చెప్పాడు. కాబట్టి కొత్తగా శిష్యులైనవాళ్లు పాటించాల్సిన ఆ ఆజ్ఞల్లో, ప్రకటించమనే ఆజ్ఞ కూడా ఉంది. (మత్తయి 28:19, 20 చదవండి.) కాబట్టి మనకు పరలోక నిరీక్షణ ఉన్నా లేక భూనిరీక్షణ ఉన్నా మనందరం ప్రకటనాపని చేయాలని తెలుస్తోంది.—అపొ. 10:42.

13. యోహాను దర్శనం నుండి మనమేమి అర్థంచేసుకున్నాం?

13 అభిషిక్తులతోపాటు ఇతరులు కూడా సువార్త ప్రకటిస్తారని ప్రకటన పుస్తకం చెప్తుంది. జీవజలాన్ని త్రాగమని “పెండ్లి కుమార్తె” ప్రజల్ని ఆహ్వానించడం అపొస్తలుడైన యోహాను ఒక దర్శనంలో చూశాడు. యేసుక్రీస్తుతోపాటు పరలోకంలో రాజులుగా పరిపాలించే 1,44,000 మంది అభిషిక్త క్రైస్తవుల్ని ఆ “పెండ్లి కుమార్తె” సూచిస్తుంది. (ప్రక. 14:1, 3; 22:17) ఆ ‘జీవజలం,’ యేసు బలి ఆధారంగా మానవజాతిని పాపమరణాల నుండి విడిపించడానికి యెహోవా చేసిన ఏర్పాట్లను సూచిస్తుంది. (మత్త. 20:28; యోహా. 3:16; 1 యోహా. 4:9, 10) అభిషిక్తులు యేసు బలి గురించి, దానివల్ల వచ్చే ప్రయోజనాల గురించి ఉత్సాహంగా ప్రకటిస్తున్నారు. (1 కొరిం. 1:23) అయితే, ఆ దర్శనంలో అభిషిక్తులుకాని మరో గుంపును కూడా యోహాను చూశాడు. భూనిరీక్షణ ఉన్న ఆ గుంపు కూడా, “రమ్ము” అని ప్రజల్ని ఆహ్వానించాలనే ఆజ్ఞను పొందారు. వాళ్లు ఇతరులకు సువార్త ప్రకటించడం ద్వారా ఆ ఆజ్ఞకు లోబడుతున్నారు. కాబట్టి, సువార్తను అంగీకరించిన వాళ్లందరూ ప్రకటించాలని యోహాను దర్శనం నుండి స్పష్టంగా తెలుస్తోంది.

14. మనం ఎలా ‘క్రీస్తు నియమానికి’ లోబడతాం?

14 ‘క్రీస్తు నియమానికి’ లోబడేవాళ్లందరూ ప్రకటించాలి. (గల. 6:2) తనను ఆరాధించేవాళ్లందరూ ఒకేవిధమైన నియమాలకు లోబడాలని యెహోవా కోరుతున్నాడు. గతంలో, ఇశ్రాయేలీయులతోపాటు వాళ్లమధ్య ఉంటున్న పరదేశులు కూడా తన నియమాలకు లోబడాలని ఆయన చెప్పాడు. (నిర్గ. 12:49; లేవీ. 24:22) నిజమే, క్రైస్తవులమైన మనం ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదు. కానీ, మనం అభిషిక్తులమైనా కాకపోయినా అందరం ‘క్రీస్తు నియమానికి’ లోబడాలి. క్రీస్తు ఇచ్చిన నియమాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది, ప్రేమ చూపించడం. (యోహా. 13:35; యాకో. 2:8) మనం యెహోవాను, యేసును, ప్రజల్ని ప్రేమించాలి. రాజ్యసువార్త ప్రకటించడమే అందుకు చక్కని మార్గం.—యోహా. 15:10; అపొ. 1:8.

15. ప్రకటించమనే ఆజ్ఞ యేసు శిష్యులందరికీ వర్తిస్తుందని ఎందుకు చెప్పవచ్చు?

15 యేసు కొద్దిమందికి చెప్పినవి కొన్నిసార్లు చాలామందికి వర్తిస్తాయి. ఉదాహరణకు, తనతోపాటు రాజ్యపరిపాలన చేస్తారని యేసు తన 11 మంది శిష్యులతో మాత్రమే నిబంధన చేశాడు. కానీ, ఆ నిబంధన 1,44,000 మందికి కూడా వర్తిస్తుంది. (లూకా 22:29, 30; ప్రక. 5:9, 10; 7:4-8) యేసు పునరుత్థానమైన తర్వాత, ప్రకటించమనే ఆజ్ఞను కేవలం కొద్దిమంది శిష్యులకే ఇచ్చాడు. (అపొ. 10:40-42; 1 కొరిం. 15:6) అయితే, మొదటి శతాబ్దంలోని యేసు శిష్యులందరూ ఆ ఆజ్ఞకు లోబడ్డారు. (అపొ. 8:4; 1 పేతు. 1:8, 9) ఇప్పుడు కూడా, ప్రకటించమని యేసు స్వయంగా మనతో చెప్పకపోయినా ప్రకటించాలని మనకు తెలుసు. నిజానికి, ఇప్పుడు దాదాపు 80 లక్షలమంది ఆ పని చేస్తున్నారు. ప్రకటించడం ద్వారా మనకు యేసుమీద నిజంగా విశ్వాసం ఉందని చూపిస్తాం.—యాకో. 2:18.

నమ్మకంగా ఉండాల్సిన సమయం ఇదే

16-18. మనం క్రీస్తు సహోదరులకు ఎలా సహాయం చేయవచ్చు? ఇప్పుడే అలా చేయడం ఎందుకు ప్రాముఖ్యం?

16 సాతాను తనకు మిగిలి ఉన్న “సమయము కొంచెమే” అని తెలుసుకుని, భూమ్మీదున్న క్రీస్తు అభిషిక్త సహోదరులతో తీవ్రంగా పోరాడుతున్నాడు. (ప్రక. 12:9, 12, 17) సాతాను ఎన్ని దాడులు చేసినా, అభిషిక్త క్రైస్తవులు మాత్రం ప్రకటనా పనిని ముందుండి నడిపిస్తూనే ఉన్నారు. ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా ఎక్కువమంది ప్రజలు సువార్త వింటున్నారు. యేసు అభిషిక్తులకు తోడుగా ఉండి, వాళ్లను నడిపిస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది.—మత్త. 28:20.

17 ప్రకటనాపనిలో క్రీస్తు సహోదరులకు మద్దతివ్వడాన్ని మనం ఓ గౌరవంగా భావిస్తాం. అంతేకాదు ఆ పనికోసం విరాళాలిస్తాం, రాజ్యమందిరాలు, సమావేశ హాళ్లు, బ్రాంచి కార్యాలయాలు నిర్మించడంలో సహాయం చేస్తాం. “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” నియమించిన సంఘపెద్దలకు, ఇతర సహోదరులకు నమ్మకంగా లోబడినప్పుడు కూడా మనం క్రీస్తు సహోదరులకు మద్దతిస్తాం.—మత్త. 24:45-47; హెబ్రీ. 13:17.

మనం క్రీస్తు సహోదరులకు ఎన్నో విధాలుగా మద్దతిస్తాం (17వ పేరా చూడండి)

18 భూమ్మీద మిగిలివున్న అభిషిక్తులు త్వరలోనే చివరి ముద్రను పొందుతారు. అప్పుడు దేవదూతలు “భూమియొక్క నాలుగు దిక్కుల వాయువులను” విడిచిపెట్టడంతో మహాశ్రమలు మొదలౌతాయి. (ప్రక. 7:1-3) హార్‌మెగిద్దోను మొదలవడానికి ముందే, యేసు అభిషిక్తులను పరలోకానికి తీసుకువెళ్తాడు. (మత్త. 13:41-43) కాబట్టి యేసు మనల్ని గొర్రెలుగా తీర్పుతీర్చాలంటే, మనం ఆయన సహోదరులకు నమ్మకంగా మద్దతివ్వాలి. అలా చేయడానికి సరైన సమయం ఇదే.

a ఈ ఉపమానం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, కావలికోట అక్టోబరు 15, 1995 సంచికలో “తీర్పు సింహాసనం ఎదుట మీరు ఎలా నిలుచుంటారు?” అలాగే “మేకలకు, గొర్రెలకు ఏ భవిష్యత్తు ఉంది?” అనే ఆర్టికల్స్‌ చూడండి.