కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ప్రభువునందు మాత్రమే” పెళ్లి చేసుకోవాలి—ఈ సలహా ఇప్పటికీ ఉపయోగపడుతుందా?

“ప్రభువునందు మాత్రమే” పెళ్లి చేసుకోవాలి—ఈ సలహా ఇప్పటికీ ఉపయోగపడుతుందా?

“నాకు మా సంఘంలో సరైన వ్యక్తి దొరకడం లేదు. జీవితమంతా ఇలానే ఒంటరిగా ఉండిపోతానేమో అని భయమేస్తుంది.”

“బయట కొంతమంది అబ్బాయిలు దయగా, ప్రేమగా ఉంటారు, బాగా అర్థం చేసుకుంటారు. పైగా నా మతాన్ని గౌరవిస్తారు కూడా. కొంతమంది బ్రదర్స్‌ కన్నా వాళ్లే బాగుంటారని అనిపిస్తుంది.”

పెళ్లికాని కొంతమంది దేవుని సేవకులు ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. “ప్రభువునందు మాత్రమే” పెళ్లిచేసుకోవాలని అంటే యెహోవాసాక్షిని మాత్రమే పెళ్లి చేసుకోవాలనే యెహోవా ఆజ్ఞ గురించి వాళ్లకు తెలుసు. (1 కొరిం. 7:39) అయినా, కొంతమంది ఎందుకలా అనుకుంటారు?

కొంతమంది ఎందుకు దిగులుపడతారు?

యెహోవాసాక్షుల్లో సహోదరీలకన్నా సహోదరులు తక్కువమంది ఉన్నారని అలాంటి కొంతమంది అనవచ్చు. నిజమే, చాలా దేశాల్లో పరిస్థితి అలాగే ఉంది. ఉదాహరణకు కొరియా దేశంలో, పెళ్లికానివాళ్లలో సహోదరీలు 57 శాతం ఉంటే, సహోదరులు 43 శాతం మాత్రమే ఉన్నారు. అలాగే కొలంబియాలో, 66 శాతం అవివాహిత సహోదరీలు ఉంటే సహోదరులు 34 శాతం మాత్రమే ఉన్నారు.

కొన్ని ప్రాంతాల్లో, తమ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయి ఎక్కువ కట్నం ఇవ్వాలని సాక్షులుకాని తల్లిదండ్రులు కోరుకోవచ్చు. కానీ కొంతమంది సహోదరులకు అంత స్తోమత ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో, తమకు ఎప్పటికైనా యెహోవాసాక్షితో పెళ్లి అవుతుందా అని కొంతమంది సహోదరీలు దిగులుపడతారు. a

యెహోవా మీద నమ్మకం ఉంచండి

ఒకవేళ మీకుకూడా ఎప్పుడైనా అలా అనిపించివుంటే, మీ పరిస్థితిని యెహోవా అర్థం చేసుకుంటాడనీ మీ భావాలు ఆయనకు తెలుసనీ నమ్మకంతో ఉండండి.—2 దిన. 6:29, 30.

అయినప్పటికీ, ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలని యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు? ఎందుకంటే, మనకేది మంచో ఆయనకు తెలుసు, ఆయన మనల్ని కాపాడాలనుకుంటున్నాడు. మనకు హాని చేసే లేదా మనల్ని బాధపెట్టే నిర్ణయాలు మనం తీసుకోకూడదని ఆయన కోరుకుంటున్నాడు. నెహెమ్యా కాలంలో, చాలామంది యూదులు యెహోవాను ఆరాధించని స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. అందుకే, సొలొమోను చెడ్డ ఉదాహరణ గురించి ప్రస్తావిస్తూ నెహెమ్యా ఇలా అన్నాడు, “తన దేవునిచేత ప్రేమింపబడినవాడై ఇశ్రాయేలీయులందరిమీద రాజుగా నియమింపబడినను, అన్యస్త్రీలు అతనిచేత సహా పాపము చేయించలేదా?” (నెహె. 13:23-26) తన ఆజ్ఞలు మనకు మేలు చేస్తాయని యెహోవాకు తెలుసు. అందుకే యెహోవాసాక్షుల్ని మాత్రమే పెళ్లి చేసుకోవాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. (కీర్త. 19:7-10; యెష. 48:17, 18) దేవునికి మనమీద ప్రేమ, శ్రద్ధ ఉన్నందుకు మనం ఎంతో కృతజ్ఞత చూపిస్తూ, ఆయన నిర్దేశానికి లోబడతాం. అలా యెహోవాను మన పరిపాలకునిగా ఒప్పుకున్నప్పుడు మనమేమి చేయాలో చెప్పే హక్కు ఆయనకు ఉందని చూపిస్తాం.—సామె. 1:5.

యెహోవాను ప్రేమించని వ్యక్తితో “జోడుగా” ఉండాలని అంటే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని మీరు ఏమాత్రం కోరుకోరు. ఎందుకంటే, అతను/ఆమె మిమ్మల్ని దేవునికి దూరం చేయవచ్చు. (2 కొరిం. 6:14) యెహోవా నిర్దేశాలు ఎప్పుడూ మేలు చేస్తాయి. మనకాలంలో, చాలామంది క్రైస్తవులు వాటిని పాటించాలనే తెలివైన నిర్ణయం తీసుకున్నారు. కానీ కొంతమంది మాత్రం అలా చేయలేదు.

ఆ సలహా ఇప్పటికీ ఉపయోగపడుతుందా?

ఆస్ట్రేలియాకు చెందిన మాగీ b అనే సహోదరి, సాక్షికాని ఓ వ్యక్తితో డేటింగ్‌ చేయడం మొదలుపెట్టింది. ఆమె ఇలా చెప్తుంది, ‘కేవలం అతనితో ఉండడం కోసమే నేను మీటింగ్స్‌ మానేసేదాన్ని. నేను యెహోవాకు చాలా దూరం అయిపోయాను.’ ఇండియాకు చెందిన రత్నా అనే మరో యౌవన సహోదరి తన తోటి విద్యార్థితో ప్రేమలో పడింది. అతను స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాడు. కానీ కేవలం ఆ అమ్మాయితో చనువుగా ఉండడం కోసమే అతను కొంతకాలం స్టడీ తీసుకున్నాడు. చివరికి, అతన్ని పెళ్లి చేసుకోవడం కోసం ఆ అమ్మాయి యెహోవాను ఆరాధించడం మానేసి వేరే మతంలోకి మారింది.

కామెరూన్‌ దేశానికి చెందిన డెంకే అనే సహోదరి 19 ఏళ్లప్పుడు, యెహోవాను ఆరాధించని ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లైన తర్వాత కూడా ఆమె యెహోవాసాక్షిగానే ఉండొచ్చని అతను మాటిచ్చాడు. కానీ పెళ్లైన రెండు వారాలకే, కూటాలకు వెళ్లడం మానేయమని చెప్పాడు. ఆమె ఇలా అంటోంది, ‘నేను ఒంటరిదాన్ని అయిపోయాను అనిపించి చాలా ఏడ్చాను. నా జీవితం ఇక నా చేతుల్లో లేదని నాకు అర్థమైంది. తప్పు చేశాననే బాధ నన్నెప్పుడూ వెంటాడేది.’

అయితే, యెహోవాను ఆరాధించని వాళ్లలో కూడా దయగా, ప్రేమగా చూసుకునేవాళ్లు కొంతమంది ఉంటారు. ఒకవేళ మీరు అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకున్నా, అది యెహోవాతో మీ సంబంధం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? యెహోవా మీ మేలు కోరి ఇచ్చిన సలహాను పెడచెవిన పెట్టినందుకు మీకెలా అనిపిస్తుంది? అన్నిటికన్నా ముఖ్యంగా, మీరు తీసుకున్న నిర్ణయం గురించి యెహోవా ఏమనుకుంటాడు?—సామె. 1:33.

పెళ్లి విషయంలో యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు లోబడిన చాలామంది సహోదరసహోదరీలు, ఇదే అత్యుత్తమ నిర్ణయం అని ఒప్పుకున్నారు. పెళ్లికాని సహోదరసహోదరీలు కూడా ఆ ఆజ్ఞకు లోబడడం ద్వారా యెహోవాను సంతోషపెట్టాలని నిశ్చయించుకున్నారు. జపాన్‌కు చెందిన మీచీకో అనే సహోదరి విషయమే తీసుకోండి. బయటి వ్యక్తిని పెళ్లి చేసుకోమని బంధువులు ఆమెను ఒత్తిడిచేశారు. దానికితోడు సంఘంలోని ఆమె స్నేహితులకు కూడా ఓవైపు పెళ్లిళ్లు అవుతున్నాయి. అయినా ఆమె యెహోవాకే లోబడాలని నిర్ణయించుకుంది. ఆమె ఇలా చెప్తుంది, ‘“యెహోవా సంతోషంగల దేవుడు” కాబట్టి, మన సంతోషం పెళ్లి మీద ఆధారపడి ఉండదని నాకు నేను చెప్పుకునేదాన్ని. మన మనసులోని కోరికల్ని ఆయన తీరుస్తాడనే నమ్మకం కూడా నాకుంది. కాబట్టి పెళ్లి చేసుకోవాలని ఉన్నా, సరైన వ్యక్తి దొరకనప్పుడు కొంతకాలంపాటు ఒంటరిగా ఉండడమే ఉత్తమం.’ (1 తిమో. 1:8-11, NW) కొంతకాలానికి మీచీకో ఒక మంచి సహోదరుణ్ణి పెళ్లి చేసుకుంది, అలా యెహోవా నిర్దేశాన్ని పాటించినందుకు సంతోషంగా ఉంది.

కొంతమంది సహోదరులు కూడా, సరైన వ్యక్తి దొరికేవరకు వేచి చూశారు. ఉదాహరణకు, ఆస్ట్రేలియాకు చెందిన బిల్‌ అనే సహోదరుని విషయమే తీసుకోండి. తాను సాక్షులుకాని అమ్మాయిలను కొన్నిసార్లు ఇష్టపడ్డానని ఆయన ఒప్పుకుంటున్నాడు. కానీ, ఆయన వాళ్లలో ఎవ్వరితోనూ చనువుగా ప్రవర్తించలేదు. ఎందుకు? ఎందుకంటే, ఆ పరిచయం తాను అవిశ్వాసితో ‘జోడుగా ఉండడానికి’ దారితీస్తుందని ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత సంవత్సరాల్లో, ఆయన కొంతమంది సహోదరీలను కూడా ఇష్టపడ్డాడు, కానీ వాళ్లకు మాత్రం ఆ ఉద్దేశం లేదు. బిల్‌ 30 సంవత్సరాలు వేచి చూశాక, తనలాంటి లక్ష్యాలున్న ఓ సహోదరిని పెళ్లి చేసుకున్నాడు. ఆయనిలా చెప్తున్నాడు, ‘ఇంతకాలం ఆగినందుకు నాకు ఏమాత్రం బాధలేదు. యెహోవా నన్ను ఆశీర్వదించాడు. ఎందుకంటే మేమిద్దరం కలిసి పరిచర్యకు వెళ్తాం, కలిసి అధ్యయనం చేస్తాం, కలిసి ఆరాధిస్తాం. నా భార్య స్నేహితులు కూడా యెహోవా ఆరాధకులే, కాబట్టి వాళ్లను కలవడం, కలిసి సమయం గడపడం అంటే నాకు ఇష్టం. మేము బైబిలు సూత్రాలు పాటిస్తూ మా వివాహ బంధాన్ని బలపర్చుకుంటున్నాం.’

ఎదురుచూసే సమయాన్ని చక్కగా ఎలా ఉపయోగించుకోవచ్చు?

యెహోవా ఇచ్చిన ఆ సలహాను నమ్ముతూ, సరైన వ్యక్తి కోసం ఎదురుచూస్తున్న సమయంలో మీరేమి చేయవచ్చు? మీరింకా అవివాహితులుగా ఉండడానికి కారణమేంటో ఆలోచించండి. “ప్రభువునందు మాత్రమే” పెళ్లి చేసుకోవాలని యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు లోబడడంవల్లే మీరు ఇంకా అవివాహితులుగా ఉన్నట్లైతే మిమ్మల్ని ఎంతో మెచ్చుకుంటున్నాం. తన ఆజ్ఞను పాటించాలని మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి యెహోవా ఎంతో సంతోషిస్తున్నాడనే నమ్మకంతో ఉండండి. (1 సమూ. 15:22; సామె. 27:11) యెహోవాకు క్రమంగా ప్రార్థిస్తూ మీ మనసులోని భావాలన్నీ ఆయనకు చెప్పుకోండి. (కీర్త. 62:8) తప్పుడు కోరికలకు లొంగిపోకుండా ఉండడానికి గట్టిగా పోరాడండి, మీరలా చేస్తుండగా యెహోవాతో మీ సంబంధం రోజురోజుకీ బలపడుతుంది. మీరు ఆయనకు ఎంతో విలువైనవాళ్లు కాబట్టి మీ కోరికలను, అవసరాలను తీరుస్తాడనే నమ్మకంతో ఉండండి. భర్తను లేదా భార్యను ఇస్తానని యెహోవా ఎవ్వరికీ వాగ్దానం చేయడం లేదు. కానీ, మీకు నిజంగా ఓ తోడు అవసరమైనట్లయితే, ఆ అవసరాన్ని సరైన విధంగా ఎలా తీర్చాలో ఆయనకు బాగా తెలుసు.—కీర్త. 145:16; మత్త. 6:32.

కీర్తనకర్త దావీదు ఓసారి ఇలా అన్నాడు, “యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము . . . నీ ముఖమును నాకు మరుగుచేయకుము.” మీకు కూడా కొన్నిసార్లు అలాగే అనిపించవచ్చు. (కీర్త. 143:5-7, 10) కానీ, అలాంటి సందర్భాల్లో నిరాశపడకండి. మీరేమి చేయాలో యెహోవా తెలియజేసేంత వరకు వేచి చూడండి. బైబిలు క్రమంగా చదువుతూ, చదివినదాని గురించి లోతుగా ఆలోచిస్తూ యెహోవా చెప్పేది వినండి. దానివల్ల, మీరేమి చేయాలని యెహోవా కోరుకుంటున్నాడో, గతంలో తన సేవకులకు ఆయనెలా సహాయం చేశాడో మీరు తెలుసుకుంటారు. యెహోవా చెప్పేది వింటూ ఉంటే, ఆయనకు లోబడడం చాలా తెలివైన పని అనే నమ్మకం మీకు కలుగుతుంది.

అవివాహితులు సంఘంలోని వాళ్లకు, యెహోవాకు ఎంతో అమూల్యమైనవాళ్లు

మీరు అవివాహితులుగా ఉన్న సమయాన్ని సంతోషంగా, చక్కగా ఎలా ఉపయోగించుకోవచ్చు? యెహోవాతో మీ స్నేహాన్ని బలపర్చుకోవడానికి, ఆయన దగ్గర మంచి పేరు సంపాదించుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, ఇతరులకు సహాయం చేయడం, కష్టపడి పనిచేయడం, సర్దుకుపోవడం, యెహోవాకు నమ్మకంగా ఉండడం వంటివి అలవాటు చేసుకోవచ్చు. వివాహ జీవితం సంతోషంగా ఉండాలంటే అవి చాలా అవసరం. (ఆది. 24:16-21; రూతు 1:16, 17; 2:6, 7, 11; సామె. 31:10-27) పరిచర్యలో, సంఘానికి సంబంధించిన ఇతర పనుల్లో బిజీగా ఉంటూ రాజ్యాన్ని మొదట వెదకండి. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఇవి సహాయం చేస్తాయి. తాను ఒంటరిగా ఉన్న సంవత్సరాలను గుర్తుచేసుకుంటూ బిల్‌ ఇలా అంటున్నాడు, ‘కాలం ఇట్టే గడిచిపోయింది. ఆ సంవత్సరాల్లో నేను పయినీరుగా యెహోవా సేవ చేశాను.’

“ప్రభువునందు మాత్రమే” పెళ్లి చేసుకోవాలనే ఆజ్ఞ ఇప్పటికీ ప్రయోజనకరమైనదే. యెహోవాసాక్షిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మనం యెహోవాను ఘనపరుస్తాం, ఎంతో సంతోషంగా ఉంటాం. బైబిలు ఇలా చెప్తుంది, “యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. కలిమియు సంపదయు వాని యింట నుండును వాని నీతి నిత్యము నిలుచును.” (కీర్త. 112:1, 3) కాబట్టి, “ప్రభువునందు మాత్రమే” పెళ్లి చేసుకోవాలనే దేవుని ఆజ్ఞకు లోబడాలని నిశ్చయించుకోండి.

a ఈ ఆర్టికల్‌ సహోదరీలను ఉద్దేశించే మాట్లాడుతున్నా, దీనిలోని సూత్రాలు సహోదరులకు కూడా వర్తిస్తాయి.

b అసలు పేర్లు కావు.