కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బహిష్కరించడం ఎందుకు ప్రేమతో చేసిన ఏర్పాటు?

బహిష్కరించడం ఎందుకు ప్రేమతో చేసిన ఏర్పాటు?

‘మా అబ్బాయిని బహిష్కరిస్తున్నట్లు చేసిన ప్రకటన వినగానే నాకు ప్రపంచమంతా ఆగిపోయినట్లు అనిపించింది. వాడు మా పెద్దబ్బాయి, మేమిద్దరం చాలా సన్నిహితంగా ఉండేవాళ్లం, ఏ పనైనా కలిసి చేసేవాళ్లం. వాడు ఎప్పుడూ పద్ధతిగానే ప్రవర్తించేవాడు. కానీ ఉన్నట్టుండి వాడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అది చూసి మా ఆవిడ చాలాసార్లు ఏడ్చింది, ఆమెను ఎలా ఓదార్చాలో నాకు అర్థమయ్యేది కాదు. మా పెంపకంలో ఏదైనా పొరపాటు జరిగిందేమోనని బాధపడుతూ ఉండేవాళ్లం’ అని హ్యూల్యాన్‌ అనే తండ్రి గుర్తుచేసుకుంటున్నాడు.

సంఘం నుండి ఎవర్నైనా బహిష్కరించినప్పుడు మనం చాలా బాధపడతాం. అయినా అది ప్రేమతో చేసిన ఏర్పాటేనని ఎలా చెప్పవచ్చు? ఈ ఏర్పాటు వెనకున్న లేఖనాధార కారణాలు ఏమిటి? అసలు ఓ వ్యక్తిని సంఘం నుండి ఎందుకు బహిష్కరిస్తారు?

ఓ వ్యక్తిని ఎందుకు బహిష్కరిస్తారు?

బాప్తిస్మం తీసుకున్న ఓ యెహోవాసాక్షి ఏదైనా ఒక పెద్ద తప్పు చేసి, పశ్చాత్తాపం చూపించకపోతేనే ఆ వ్యక్తిని సంఘం నుండి బహిష్కరిస్తారు.

యెహోవా మన నుండి పరిపూర్ణత ఆశించకపోయినా, పవిత్రంగా ఉండే విషయంలో తన సేవకులు కొన్ని ప్రమాణాలను పాటించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఉదాహరణకు వ్యభిచారం, విగ్రహారాధన, దొంగతనం, మోసం, హత్య, మంత్రతంత్రాలు వంటి గంభీరమైన పాపాలకు దూరంగా ఉండాలని యెహోవా ఖచ్చితంగా చెప్తున్నాడు.—1 కొరిం. 6:9, 10; ప్రక. 21:8.

యెహోవా దేవుని ఉన్నత ప్రమాణాలు సరైనవని, అవి మన మేలు కోసమేనని మనందరం ఒప్పుకుంటాం. అంతేకాదు ప్రశాంతంగా, మర్యాదగా ఉండే నమ్మదగిన ప్రజల మధ్య జీవించాలని మనం కోరుకుంటాం. అలాంటివాళ్లు యెహోవాసాక్షుల సంఘాల్లో ఉన్నారు. బైబిలు ప్రమాణాల ప్రకారం జీవిస్తామని దేవునికి సమర్పించుకునేటప్పుడు మనం ఆయనకు మాటిచ్చాం కాబట్టే మన సంఘాల్లో అలాంటి వాతావరణం ఉంది.

అయితే బాప్తిస్మం తీసుకున్న ఓ క్రైస్తవుడు, బలహీనత వల్ల ఏదైనా పెద్ద తప్పు చేస్తే అప్పుడేంటి? గతంలో, యెహోవాను నమ్మకంగా సేవించినవాళ్లు కూడా అలాంటి తప్పులు చేశారు. అయితే, యెహోవా వాళ్లను పూర్తిగా విడిచిపెట్టలేదు. దానికి ఓ మంచి ఉదాహరణ, రాజైన దావీదు. ఆయన వ్యభిచారం చేశాడు, పైగా ఓ హత్య కూడా చేశాడు. అయినా, యెహోవా “నీ పాపమును క్షమించెను” అని నాతాను ప్రవక్త దావీదుతో అన్నాడు.—2 సమూ. 12:13, పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము.

దావీదు నిజమైన పశ్చాత్తాపం చూపించాడు కాబట్టే యెహోవా క్షమించాడు. (కీర్త. 32:1-5) ఇప్పుడు కూడా, యెహోవాను సేవించే ఓ వ్యక్తి పశ్చాత్తాపం ఏమాత్రం చూపించకుండా, తప్పులు చేస్తూ ఉంటేనే ఆయన్ను సంఘం నుండి బహిష్కరిస్తారు. (అపొ. 3:19; 26:20) ఆ వ్యక్తి నిజమైన పశ్చాత్తాపం చూపించట్లేదని న్యాయనిర్ణయ కమిటీలోని పెద్దలు గ్రహిస్తే, ఆ వ్యక్తిని సంఘం నుండి బహిష్కరించాలి.

ఓ వ్యక్తి తప్పు చేసినంత మాత్రాన, అతన్ని బహిష్కరించడం సరికాదని, అది మరీ కఠినమైన శిక్ష అని మొదట్లో మనకనిపించవచ్చు. ముఖ్యంగా ఆ వ్యక్తి మనకు బాగా దగ్గరివాడైతే మనకలా అనిపిస్తుంది. కానీ, బహిష్కరించడం ఓ ప్రేమపూర్వక ఏర్పాటని నమ్మడానికి దేవుని వాక్యంలో ఎన్నో కారణాలున్నాయి.

బహిష్కరించడం వల్ల వచ్చే ప్రయోజనాలు

“జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పు పొందును” అని యేసు చెప్పాడు. (మత్త. 11:19) పశ్చాత్తాపం చూపించని వ్యక్తిని బహిష్కరించడం తెలివైన నిర్ణయమని, దానివల్ల వచ్చే మంచి ఫలితాలను బట్టి తెలుస్తుంది. వాటిలో మూడిటిని పరిశీలించండి.

యెహోవా నామానికి ఘనత తెస్తుంది. మనం యెహోవా పేరు పెట్టుకున్నాం, కాబట్టి మన ప్రవర్తన ఖచ్చితంగా ఆయన నామం మీద ప్రభావం చూపిస్తుంది. (యెష. 43:10) పిల్లల ప్రవర్తన వల్ల తల్లిదండ్రులకు మంచి పేరైనా రావచ్చు, చెడ్డ పేరైనా రావచ్చు. అదేవిధంగా ఇతరులు యెహోవా గురించి ఓ అభిప్రాయానికి రావడానికి కొంతమేరకు మన ప్రవర్తన కారణమౌతుంది. ఉదాహరణకు, యెహెజ్కేలు కాలంలో యూదుల ప్రవర్తన వల్ల అన్యజనులు యెహోవా నామాన్ని దూషించారు. (యెహె. 36:19-23) అయితే, యెహోవా నైతిక ప్రమాణాలను పాటిస్తే, మనం ఆయనకు ఘనత తీసుకొస్తాం.

మనం విచ్చలవిడిగా జీవిస్తే దేవుని పవిత్రమైన నామానికి కళంకం తెస్తాం. “నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి” అని అపొస్తలుడైన పేతురు క్రైస్తవుల్ని హెచ్చరించాడు. (1 పేతు. 1:14-16) అయితే, మనం పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించినప్పుడు యెహోవా దేవుని నామానికి ఘనత తెస్తాం.

ఓ యెహోవాసాక్షి చెడు పనులు చేస్తుంటే, దానిగురించి ఆయన స్నేహితులు, తెలిసినవాళ్లు వింటారు. అలాంటి వ్యక్తిని బహిష్కరించడం వల్ల, యెహోవా ప్రజలు బైబిలు నిర్దేశాలు పాటిస్తారనీ, తమ సంఘాన్ని పవిత్రంగా ఉంచుకుంటారని వాళ్లు తెలుసుకుంటారు. ఈ అనుభవాన్ని పరిశీలించండి. ఒకరోజు స్విట్జర్లాండ్‌లో ఓ రాజ్యమందిరానికి ఒక వ్యక్తి వచ్చి, తాను ఆ సంఘంలో సభ్యునిగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఆయన తోబుట్టువు ఓ యెహోవాసాక్షి. అయితే తప్పుడు పని చేసినందుకు ఆమెను సంఘం నుండి బహిష్కరించారు. “చెడు ప్రవర్తనను ఏమాత్రం సహించని” ఇలాంటి సంస్థలో తాను ఉండాలని కోరుకుంటున్నట్లు అతను చెప్పాడు.

క్రైస్తవ సంఘాన్ని పవిత్రంగా ఉంచుతుంది. కావాలనే తప్పు చేసేవాళ్లను తమ మధ్య ఉంచితే వచ్చే ప్రమాదం గురించి అపొస్తలుడైన పౌలు కొరింథీయులను హెచ్చరించాడు. వాళ్లు సంఘంపై ఎలాంటి చెడు ప్రభావం చూపిస్తారో చెప్తూ, ‘పులిసిన పిండి కొంచెమే అయినా ముద్దంతా పులియజేస్తుంది’ అని ఆయన హెచ్చరించాడు. అందుకే, ‘ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి’ అని పౌలు చెప్పాడు.—1 కొరిం. 5:6, 11-13.

ఆ వచనాల్లో పౌలు చెప్తున్న వ్యక్తి నీచమైన అనైతిక జీవితాన్ని గడుపుతున్నాడు. ఆ సంఘంలో కొంతమంది అతని ప్రవర్తనను సమర్థించడం మొదలుపెట్టారు కూడా. (1 కొరిం. 5:1, 2) అది చాలా ప్రమాదకరం, ఎందుకంటే వాళ్లవల్ల సంఘంలోని మిగతా క్రైస్తవులు కొరింథు నగరంలోని విచ్చలవిడితనం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అలాగే నేడుకూడా, కావాలని చేసే తప్పుల్ని సంఘం చూసీచూడనట్లు వదిలేస్తే, దేవుని ప్రమాణాల పట్ల లెక్కలేనితనాన్ని ప్రోత్సహించినట్లు అవుతుంది. (ప్రసం. 8:11) అంతేకాదు, ‘నీటి కింద దాగివుండే రాళ్లు’ ఓడను ఎలా బద్దలు చేయగలవో అలాగే, పశ్చాత్తాపం చూపించని పాపులు సంఘసభ్యుల విశ్వాసాన్ని పాడుచేసే ప్రమాదం ఉంది.—యూదా 4, 12, NW.

ఓ వ్యక్తి తన తప్పు తెలుసుకునేలా చేస్తుంది. తండ్రి ఆస్తిలో తన వాటా తీసుకుని, ఆ డబ్బుతో విచ్చలవిడిగా జీవించిన ఓ యౌవనుడి గురించి యేసు ఓ ఉపమానంలో చెప్పాడు. అతను ఎన్నో కష్టాలు అనుభవించిన తర్వాత, ఇంటిని వదిలేసి వస్తే జీవితం శూన్యమనీ ఎవరూ తన మీద జాలి చూపించరనీ తెలుసుకున్నాడు. చివరికి ఆ యౌవనుడు తన తప్పు తెలుసుకుని, పశ్చాత్తాపపడి, ఇంటికి తిరిగివెళ్లాలని నిర్ణయించుకున్నాడు. (లూకా 15:11-24) తప్పు తెలుసుకుని తిరిగొచ్చిన తన కుమారుణ్ణి చూసి ప్రేమగల ఆ తండ్రి ఎంత ఆనందపడ్డాడో యేసు వివరించాడు. అది యెహోవా భావాలను అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. “దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు; దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రదుకుటవలన నాకు సంతోషము కలుగును” అని యెహోవా హామీ ఇస్తున్నాడు.—యెహె. 33:11.

బహిష్కరించబడినవాళ్లు క్రైస్తవ సంఘానికి అంటే తమ ఆధ్యాత్మిక కుటుంబానికి దూరమౌతారు. అయితే తామేమి పోగొట్టుకున్నామో కొంతకాలానికి వాళ్లు బహుశా తెలుసుకోవచ్చు. చేసిన తప్పుకు పర్యవసానాలు అనుభవిస్తూ, ఒకప్పుడు యెహోవా దేవునితో, ఆయన ప్రజలతో సన్నిహితంగా ఉన్నప్పుడు పొందిన ఆనందాల్ని గుర్తుచేసుకుంటూ వాళ్లు చివరికి తమ తప్పు తెలుసుకోవచ్చు.

వాళ్లలో ఆ మార్పు రావాలంటే, మనం వాళ్ల విషయంలో స్థిరంగా ఉండడం ద్వారా వాళ్లమీద ప్రేమ చూపించాలి. “నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము” అని కీర్తనకర్త దావీదు రాశాడు. (కీర్త. 141:5) ఉదాహరణకు, ఒక వ్యక్తి భోజనం చేస్తున్నప్పుడు గొంతులో ఏదైనా ఆహారం అడ్డుపడితే, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతాడు. ఆ సమయంలో ఏమీ మాట్లాడలేడు కూడా. వెంటనే ఎవరోఒకరు సహాయం చేయకపోతే అతను చనిపోతాడు. కాబట్టి పక్కనున్న అతని స్నేహితుడు, ఆ వ్యక్తి వీపు మీద కొడుతూ ఇరుక్కున్న ఆహారం బయటికి వచ్చేలా చేస్తాడు. అలా కొట్టడం వల్ల నొప్పి కలిగినా అది అతని ప్రాణాన్ని కాపాడుతుంది. అదేవిధంగా దావీదు కూడా, నీతిమంతులు కొన్నిసార్లు తనని సరిదిద్దాల్సిన అవసరం ఉందని గుర్తించాడు. దానివల్ల బాధ కలిగినా అది తనకు మేలు చేస్తుందని అర్థం చేసుకున్నాడు.

బహిష్కరణ వల్ల, తప్పు చేసినవాళ్లు అవసరమైన క్రమశిక్షణ పొందుతారని చాలా అనుభవాలు చూపిస్తున్నాయి. హ్యూల్యాన్‌ వాళ్ల అబ్బాయి తన ప్రవర్తనను మార్చుకుని సుమారు పదేళ్ల తర్వాత సంఘానికి తిరిగొచ్చాడు. ఇప్పుడు ఆయన సంఘ పెద్దగా సేవ చేస్తున్నాడు. ఆయనిలా ఒప్పుకుంటున్నాడు, ‘నన్ను బహిష్కరించిన తర్వాత, నా చెడు ప్రవర్తన వల్ల వచ్చిన ఫలితాల్ని అనుభవించాను. అలాంటి క్రమశిక్షణ నాకు నిజంగా అవసరమైంది.’—హెబ్రీ. 12:7-11.

బహిష్కరించబడిన వ్యక్తి పట్ల ఎలా ప్రేమ చూపించవచ్చు?

ఒకర్ని సంఘం నుండి బహిష్కరించినప్పుడు చాలా బాధనిపిస్తుంది. అయితే, ఆ వ్యక్తి ఇక ఎప్పటికీ యెహోవా దగ్గరకు తిరిగిరాలేడని మనం అనుకోకూడదు. బహిష్కరించబడిన వ్యక్తి ఆ క్రమశిక్షణ నుండి ప్రయోజనం పొందేలా మనందరం సహాయం చేయవచ్చు.

పశ్చాత్తాపం చూపించినవాళ్లు యెహోవాకు మళ్లీ దగ్గరయ్యేలా పెద్దలు సహాయం చేస్తారు

సంఘ పెద్దలు యెహోవాలాంటి ప్రేమ చూపించడానికి ఎప్పుడూ కృషి చేస్తారు. మరిముఖ్యంగా, బహిష్కరిస్తున్నామనే విషయాన్ని ఒక వ్యక్తికి చెప్పాల్సి వచ్చినప్పుడు పెద్దలు అలాంటి ప్రేమను చూపిస్తారు. అంతేకాదు, సంఘంలోకి తిరిగి రావాలంటే అతనేమి చేయాలో కూడా పెద్దలు దయగా, స్పష్టంగా వివరిస్తారు. ఆ వ్యక్తి ప్రవర్తనలో ఏదైనా మార్పు కనిపిస్తే, పెద్దలు అప్పుడప్పుడు అతన్ని కలిసి, అతను మళ్లీ యెహోవాకు దగ్గరయ్యేందుకు ఏమి చేయాలో గుర్తుచేయవచ్చు. a

కుటుంబ సభ్యులు పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించడం ద్వారా సంఘం పట్ల, తప్పు చేసినవ్యక్తి పట్ల తమకు ప్రేమ ఉందని చూపిస్తారు. హ్యూల్యాన్‌ ఇలా చెప్తున్నాడు, ‘వాడు మా అబ్బాయే అయినా వాడి చెడు ప్రవర్తన మా మధ్య అడ్డుగోడలా నిలిచింది.’

సంఘ సభ్యులు బహిష్కరించబడిన వ్యక్తితో కలవకుండా, మాట్లాడకుండా ఉండడం ద్వారా ఆ వ్యక్తిపై నిజమైన ప్రేమ చూపించవచ్చు. (1 కొరిం. 5:11; 2 యోహా. 10, 11) అలా చేస్తే, సంఘ పెద్దల ద్వారా యెహోవా ఆ వ్యక్తికి ఇచ్చిన క్రమశిక్షణను సమర్థించినవాళ్లౌతారు. అయితే, ఆ వ్యక్తి కుటుంబంలోని వాళ్లు ఎంతో వేదన అనుభవిస్తుంటారు. సంఘ సభ్యులు తమను కూడా దూరం పెడుతున్నారనే భావన వాళ్లలో కలగకుండా చూసుకోవాలి. అందుకే వాళ్లపట్ల ఇంతకుముందుకన్నా ఎక్కువ ప్రేమ చూపించాలి, మద్దతివ్వాలి.—రోమా. 12:13, 15, 16.

హ్యూల్యాన్‌ ఇలా అంటున్నాడు, ‘బహిష్కరణ ఏర్పాటు యెహోవా ప్రమాణాల ప్రకారం జీవించేలా మనకు సహాయం చేస్తుంది, ఆ ఏర్పాటు మనకు అవసరం. మొదట్లో బాధ కలిగించినా చివరికి అది మేలు చేస్తుంది. మా అబ్బాయి చేసిన చెడ్డ పనులను నేను వెనకేసుకొచ్చి ఉంటే, వాడు ఎప్పటికీ మారి ఉండేవాడు కాదు.’

a కావలికోట ఫిబ్రవరి 1, 1992, 16-21 పేజీలు చూడండి.