కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రీస్తు—దేవుని శక్తి

క్రీస్తు—దేవుని శక్తి

“క్రీస్తు దేవుని శక్తి.”—1 కొరిం. 1:24.

1. ‘క్రీస్తు, దేవుని శక్తి’ అని పౌలు ఎందుకు చెప్పాడు?

 యెహోవా తన శక్తిని యేసుక్రీస్తు ద్వారా అసాధారణమైన విధానాల్లో చూపించాడు. యేసు భూమ్మీదున్నప్పుడు చేసిన కొన్ని అద్భుతాల గురించి బైబిల్లో ఉంది. వాటిని చదివినప్పుడు మన విశ్వాసం బలపడుతుంది. (మత్త. 9:35; లూకా 9:11) అవును, అద్భుతాలు చేసేలా యేసుకు శక్తినిచ్చింది యెహోవాయే, అందుకే ‘క్రీస్తు, దేవుని శక్తి’ అని పౌలు చెప్పగలిగాడు. (1 కొరిం. 1:24) అయితే, యేసు చేసిన అద్భుతాల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

2. యేసు చేసిన అద్భుతాల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

2 యేసు ‘మహత్కార్యాలు’ చేశాడని అపొస్తలుడైన పేతురు అన్నాడు. (అపొ. 2:22) ఆ ‘మహత్కార్యాలను’ లేదా అద్భుతాలను పరిశీలిస్తే, యేసు తన వెయ్యేళ్ల పరిపాలనలో ఏమేమి చేస్తాడో తెలుస్తుంది. అప్పుడు భూమ్మీద జీవించే మనుషులందరూ ప్రయోజనం పొందేలా ఆయన ఇంకా గొప్ప అద్భుతాలు చేస్తాడు. అంతేకాదు, యేసు చేసిన అద్భుతాలను గమనిస్తే యేసుకు, యెహోవాకు ఉన్న లక్షణాల గురించి కూడా తెలుసుకుంటాం. ఈ ఆర్టికల్‌లో, యేసు చేసిన మూడు అద్భుతాల గురించి చర్చిద్దాం. అవి ఇప్పుడూ భవిష్యత్తులోనూ మనమీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందాం.

ఉదార స్వభావం గురించి నేర్పించే అద్భుతం

3. (ఎ) ఏ పరిస్థితుల్లో యేసు తన మొదటి అద్భుతాన్ని చేశాడు? (బి) ఆయన ఉదార స్వభావాన్ని ఎలా చూపించాడు?

3 కానా అనే ఊరిలో జరిగిన పెళ్లిలో యేసు తన మొట్టమొదటి అద్భుతం చేశాడు. బహుశా ఎక్కువమంది రావడంవల్లో, మరేదైనా కారణంవల్లో పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. విందు ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఆ కొత్త జంటదే కాబట్టి, ద్రాక్షారసం అయిపోతే వాళ్లు అవమానంగా భావిస్తారు. ఆ పెళ్లికి వచ్చినవాళ్లలో యేసు తల్లి మరియ కూడా ఉంది. ఆమె యేసును సహాయం అడిగింది. ఆ సమస్యను పరిష్కరించే శక్తి యేసుకు ఉందని నమ్మబట్టే ఆమె అలా అడిగిందా? తన కుమారునికి సంబంధించిన ప్రవచనాలన్నిటినీ మరియ ఖచ్చితంగా ధ్యానించి ఉంటుంది. ఆయన “సర్వోన్నతుని కుమారుడు” అని పిలువబడతాడని కూడా ఆమెకు తెలుసు. (లూకా 1:30-32; 2:52) ఏదేమైనా మరియ, యేసు ఆ కొత్త జంటకు సహాయం చేయాలనుకున్నారు. అందుకే యేసు దాదాపు 380 లీటర్ల నీటిని అద్భుతరీతిలో ‘మంచి ద్రాక్షారసంగా’ మార్చాడు. (యోహాను 2:3, 6-11 చదవండి.) నిజానికి ఆ అద్భుతం చేయాల్సిన అవసరం ఆయనకు ఉందా? లేదు. కానీ ఆయనకు ప్రజలమీద శ్రద్ధ ఉంది కాబట్టే ఆ అద్భుతం చేసి, తన తండ్రిలాగే ఉదార స్వభావాన్ని చూపించాడు.

4, 5. (ఎ) యేసు చేసిన మొదటి అద్భుతం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (బి) కొత్తలోకంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయని, కానాలో జరిగిన మొదటి అద్భుతం బట్టి చెప్పవచ్చు?

4 యేసు చాలామందికి సరిపోయేంత మంచి ద్రాక్షారసాన్ని అద్భుతరీతిలో అందించాడు. దీనినుండి మనమేమి నేర్చుకోవచ్చు? యెహోవాకు, యేసుకు ఉదార స్వభావం ఉందనీ, వాళ్లు ప్రజల భావాలను పట్టించుకుంటారనీ ఈ అద్భుతం చూపిస్తుంది. కొత్తలోకంలో మనం ఏ ప్రాంతంలో ఉన్నా, యెహోవా తన శక్తిని ఉపయోగించి ‘సమస్త జనులకు’ సమృద్ధిగా ఆహారం ఇస్తాడని కూడా అర్థమౌతుంది.—యెషయా 25:6 చదవండి.

5 ఒకసారి ఆలోచించండి. త్వరలో, మనకు నిజంగా అవసరమైన వాటన్నిటినీ యెహోవా ఇవ్వబోతున్నాడు. ప్రతీ ఒక్కరికి మంచి ఇల్లు, ఆహారం ఉంటాయి. పరదైసులో యెహోవా మనకు సమృద్ధిగా ఇవ్వబోయే మంచి విషయాల గురించి ఆలోచించినప్పుడు మన హృదయం కృతజ్ఞతతో నిండిపోతుంది.

ఇతరుల కోసం మన సమయాన్ని ఉపయోగించినప్పుడు మనం యేసును అనుకరిస్తాం (6వ పేరా చూడండి)

6. యేసు తన శక్తిని ఎవరి కోసం ఉపయోగించాడు? మనం ఆయన్ను ఎలా అనుకరించవచ్చు?

6 యేసు ఎన్నడూ తన శక్తిని స్వార్థానికి ఉపయోగించుకోలేదు. రాళ్లను రొట్టెలుగా చేసుకోమని సాతాను శోధించినప్పుడు ఏమి జరిగిందో పరిశీలించండి. యేసు తన శక్తిని తన అవసరాల కోసం ఉపయోగించడానికి ఒప్పుకోలేదు. (మత్త. 4:2-4) తన శక్తిని ఇతరుల మేలు కోసం ఉపయోగించాలని ఆయన కోరుకున్నాడు. ఆయనలాగే మనమెలా నిస్వార్థ స్వభావాన్ని చూపించవచ్చు? మనం ఇచ్చే గుణాన్ని అలవాటు చేసుకోవాలని యేసు చెప్పాడు. (లూకా 6:38) ఇతరుల్ని మన ఇంటికి భోజనానికి పిలవడం ద్వారా మనమలా చేయవచ్చు. అంతేకాదు కూటాలు అయిపోయిన తర్వాత, సహోదరసహోదరీల కోసం సమయం కేటాయించవచ్చు. ఉదాహరణకు, ఓ సహోదరుడు తన ప్రసంగాన్ని ప్రాక్టీసు చేస్తుంటే మనం వినవచ్చు లేదా పరిచర్యలో ఎలా మాట్లాడాలో ఇతరులకు నేర్పించవచ్చు. వీలైనప్పుడల్లా ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనం యేసులా ఉదార స్వభావాన్ని చూపించవచ్చు.

‘వారందరు తిని తృప్తిపొందారు’

7. మనం సాతాను లోకంలో జీవిస్తున్నంత కాలం ఏ సమస్య ఉంటుంది?

7 పేదరికం కొత్త సమస్య కాదు. “బీదలు దేశములో ఉండకమానరు” అని యెహోవా ఇశ్రాయేలీయులకు చెప్పాడు. (ద్వితీ. 15:11) వందల సంవత్సరాల తర్వాత యేసు ఇలా చెప్పాడు, “బీదలెల్లప్పుడు మీతోకూడ ఉన్నారు.” (మత్త. 26:11) భూమ్మీద పేదవాళ్లు ఎప్పుడూ ఉంటారని యేసు చెప్తున్నాడా? కాదు. మనం సాతాను లోకంలో జీవిస్తున్నంత కాలం పేదరికం ఉంటుందని ఆయన ఉద్దేశం. కానీ కొత్తలోకంలో పరిస్థితి అలా ఉండదు. అప్పుడిక పేదరికం అనేదే ఉండదు, అందరూ తృప్తిగా తినేంత సమృద్ధిగా ఆహారం ఉంటుంది.

8, 9. (ఎ) యేసు ఎందుకు వేలమందికి ఆహారం పెట్టాడు? (బి) ఈ అద్భుతం గురించి మీకేమనిపిస్తుంది?

8 కీర్తనకర్త యెహోవా గురించి ఇలా పాడాడు, “నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు.” (కీర్త. 145:16) తన తండ్రిని అనుకరిస్తూ, యేసు కూడా భూమ్మీద ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఇతరుల అవసరాల్ని తీర్చాడు. కేవలం తన శక్తిని చూపించుకోవడానికి కాదుగానీ ప్రజల మీదున్న నిజమైన శ్రద్ధతో అలా చేశాడు. ఇప్పుడు మనం మత్తయి 14:14-21 వచనాల్లో ఉన్న విషయాన్ని పరిశీలిద్దాం. (చదవండి.) చాలామంది ప్రజలు తమ పట్టణాల నుండి నడుచుకుంటూ యేసు దగ్గరకు వచ్చారు. (మత్త. 14:13) సాయంత్రానికల్లా శిష్యులతో సహా ప్రజలందరూ ఆకలితో ఉన్నారు. కాబట్టి, ఆకలితో నీరసించిపోయిన ప్రజల్ని ఆహారం కొనుక్కోవడానికి పంపించేయమని శిష్యులు యేసును అడిగారు. అప్పుడు యేసు ఏమి చేశాడు?

9 ఆయన ఐదు రొట్టెలు, రెండు చేపలతో వాళ్లకు ఆహారం పెట్టాడు. వాళ్లలో స్త్రీలూ పిల్లలతో సహా దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు. ఆయన ఈ అద్భుతాన్ని ఎందుకు చేశాడు? ఎందుకంటే ఆయనకు చిన్నపిల్లలతో సహా ప్రజలందరి మీద నిజమైన ప్రేమ, శ్రద్ధ ఉన్నాయి. వాళ్లందరూ ‘తిని తృప్తిపొందారు’ కాబట్టి యేసు సమృద్ధిగా ఆహారం అందించివుంటాడు. దానివల్ల వాళ్లు చాలా దూరం నడిచి తమ ఇళ్లకు తిరిగి వెళ్లగలిగారు. (లూకా 9:10-17) పైగా, అందరు తిని తృప్తి పొందిన తర్వాత శిష్యులు మిగిలిన ఆహారాన్ని 12 గంపల నిండా ఎత్తారు!

10. భవిష్యత్తులో యెహోవా పేదరికాన్ని ఏమి చేస్తాడు?

10 స్వార్థపరులైన, అవినీతిపరులైన పాలకుల వల్ల కోట్లమంది ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. మన సహోదరుల్లో కూడా కొంతమంది ఆహారంలేక ఇబ్బందిపడుతున్నారు. కానీ త్వరలోనే, యెహోవాకు లోబడే ప్రజలందరూ అవినీతి, పేదరికం లేని లోకంలో జీవిస్తారు. యెహోవా సర్వశక్తిగల దేవుడు, ప్రతీఒక్కరి అవసరాల్ని తీర్చే శక్తి, తీర్చాలనే కోరిక ఆయనకున్నాయి. అతిత్వరలోనే మన బాధలన్నిటినీ పూర్తిగా తీసేస్తానని ఆయన మాటిస్తున్నాడు!—కీర్తన 72:16 చదవండి.

11. యేసు త్వరలోనే భూవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి కోసం తన శక్తిని ఉపయోగిస్తాడని మీరెందుకు నమ్ముతున్నారు? కాబట్టి మీరేమి చేయాలనుకుంటున్నారు?

11 యేసు భూమ్మీద ఉన్నప్పుడు, కొన్ని ప్రాంతాల్లోనే అద్భుతాలు చేశాడు, అది కూడా మూడున్నర సంవత్సరాలే చేశాడు. (మత్త. 15:24) కానీ ఆయన రాజుగా పరిపాలించినప్పుడు, భూవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ సహాయం చేస్తాడు. (కీర్త. 72:8) యేసు చేసిన అద్భుతాలను గమనిస్తే, ఆయన తన శక్తిని మన ప్రయోజనం కోసం ఉపయోగించాలని కోరుకుంటున్నాడని తెలుస్తుంది. అయితే, మనకు అద్భుతాలు చేసే శక్తి లేకపోయినా, బైబిలు వాగ్దానం చేస్తున్న మంచి భవిష్యత్తు గురించి ఇతరులకు చెప్పడానికి మన సమయాన్ని, శక్తిని ఉపయోగించవచ్చు. యెహోవాసాక్షులముగా అది మన బాధ్యత. (రోమా. 1:14, 15) యేసు త్వరలో ఏమి చేయబోతున్నాడో ఆలోచిస్తే, వాటిగురించి ఇతరులకు ఉత్సాహంగా చెప్తాం.—కీర్త. 45:1; 49:3.

యెహోవా, యేసు ప్రకృతి శక్తుల్ని శాసించగలరు

12. ప్రకృతి గురించి యేసుకు పూర్తిగా తెలుసని మనమెందుకు నమ్మవచ్చు?

12 దేవుడు భూమినీ దానిమీదున్న సమస్తాన్నీ తయారు చేస్తున్నప్పుడు, యేసు ఆయన దగ్గర ‘ప్రధానశిల్పిగా’ పనిచేశాడు. (సామె. 8:22, 30, 31; కొలొ. 1:15-17) కాబట్టి భూమి గురించీ దాని వాతావరణం గురించీ యేసుకు పూర్తిగా తెలుసు. ప్రకృతి శక్తులన్నిటినీ ఎలా ఉపయోగించాలో, వాటిని ఎలా అదుపులో ఉంచాలో కూడా ఆయనకు తెలుసు.

యేసు తన శక్తిని ఉపయోగించిన విధానం మీకు ఎందుకు నచ్చింది? (13, 14 పేరాలు చూడండి)

13, 14. యేసుకు ప్రకృతి శక్తుల్ని శాసించే శక్తి ఉందని చెప్పడానికి ఓ ఉదాహరణ ఇవ్వండి.

13 యేసు భూమ్మీద ఉన్నప్పుడు ప్రకృతి శక్తుల్ని శాసించడం ద్వారా, తనకు దేవుడిచ్చిన శక్తి ఉందని చూపించాడు. ఉదాహరణకు, ఆయన ఓసారి తుఫానును ఎలా నిమ్మళింపజేశాడో పరిశీలించండి. (మార్కు 4:37-39 చదవండి.) ఈ సందర్భంలో “తుఫాను” అని అనువదించబడిన గ్రీకు పదం భీకరమైన తుఫానును లేదా హరికేన్‌ను వర్ణించడానికి ఉపయోగిస్తారని ఓ బైబిలు విద్వాంసుడు వివరించాడు. కారు మబ్బులు, బలమైన ఈదురు గాలులు, ఉరుములు, కుండపోత వర్షం ఉండే తుఫానును ఆ పదం సూచిస్తుంది. అలాంటి తుఫానువల్ల అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. మత్తయి ఆ తుఫానునే “పెద్ద తుఫాను” అని వర్ణించాడు.—మత్త. 8:24, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

14 ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి. అలలు ఎగసిపడడంతో నీళ్లు మెల్లమెల్లగా పడవలోకి చేరుతున్నాయి. ఒకవైపు ఈదురుగాలుల భీకర శబ్దం, మరోవైపు అలల తాకిడికి పడవ ఊగిపోతోంది. యేసేమో బాగా అలసిపోయి నిద్రపోతున్నాడు. కానీ శిష్యులు భయంతో ఆయన్ను నిద్రలేపి, రక్షించమని వేడుకున్నారు. (మత్త. 8:25) అప్పుడు యేసు ఏమి చేశాడు? ఆయన లేచి, “ఊరుకో! నిశ్శబ్దంగా ఉండు!” అని గాలిని, సముద్రాన్ని గద్దించాడు. (మార్కు 4:39, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) దాంతో ఆ భీకరమైన తుఫాను ఒక్కసారిగా ఆగిపోయింది, వాతావరణమంతా ప్రశాంతంగా మారిపోయింది. యేసుకు ప్రకృతిని శాసించే శక్తి ఉందని చెప్పడానికి ఇది ఓ అసాధారణమైన రుజువు కాదంటారా?

15. ప్రకృతి శక్తుల్ని అదుపు చేసే శక్తి తనకుందని యెహోవా ఎలా చూపించాడు?

15 యేసుకు అంతటి గొప్ప శక్తిని ఇచ్చింది యెహోవాయే కాబట్టి, ఆయన కూడా ప్రకృతిని శాసించగలడు. ఉదాహరణకు, జలప్రళయానికి ముందు యెహోవా నోవహుతో ఇలా అన్నాడు, ‘ఇంకో ఏడు రోజుల్లో భూమ్మీద నలభై పగళ్లు, నలభై రాత్రులు వర్షం కురిపిస్తాను.’ (ఆది. 7:4, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) నిర్గమకాండము 14:21⁠లో ఇలా ఉంది, ‘యెహోవా బలమైన తూర్పుగాలిచేత సముద్రాన్ని తొలగించాడు.’ యోనా 1:4 ఇలా చెప్తుంది, ‘యెహోవా సముద్రం మీద పెద్దగాలి పుట్టించగా సముద్రంలో గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయే గతి వచ్చింది.’ భూమి పరదైసుగా మారినప్పుడు, యెహోవా ప్రకృతి శక్తుల్ని అదుపులో ఉంచుతాడని తెలుసుకోవడం ఎంతో సంతోషాన్నిస్తుంది.

16. యెహోవాకు, యేసుకు ప్రకృతి శక్తుల్ని శాసించే అధికారం ఉందని తెలుసుకోవడం మనకెందుకు ఊరటనిస్తుంది?

16 యెహోవాకూ యేసుకూ ప్రకృతిని శాసించే శక్తి ఉందని తెలుసుకోవడం మనకెంతో ఊరటనిస్తుంది. క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలనలో భూమ్మీద జీవించేవాళ్లందరూ ఏ భయం లేకుండా ఉంటారు. తుఫానులు, సునామీలు, అగ్ని పర్వతాలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులవల్ల ఎవ్వరూ గాయపడరు, చనిపోరు. అప్పుడు “దేవుని నివాసము” మనుషులతో ఉంటుంది కాబట్టి, ఎలాంటి విపత్తు వస్తుందోనని భయపడాల్సిన అవసరం ఉండదు. (ప్రక. 21:3, 4) వెయ్యేళ్ల పరిపాలనలో, యెహోవా ఇచ్చే శక్తితో యేసు ప్రకృతి శక్తుల్ని శాసిస్తాడని మనం నమ్మకంతో ఉండవచ్చు.

యెహోవాను, క్రీస్తును అనుకరించండి

17. మనం యెహోవాను, క్రీస్తును ఎలా అనుకరించవచ్చు?

17 నిజమే, ప్రకృతి విపత్తుల్ని ఆపే శక్తి మనకైతే లేదు. యెహోవా, యేసు మాత్రమే వాటిని ఆపగలరు. కానీ మనమేమి చేయవచ్చో సామెతలు 3:27 చెప్తుంది. (చదవండి.) మన సహోదరసహోదరీలు కష్టాల్లో ఉన్నప్పుడు, వీలైన సహాయం చేయవచ్చు, అలాగే వాళ్ల మనసు కుదుటపడేలా ఓదార్పుకరంగా మాట్లాడవచ్చు. (సామె. 17:17) ఉదాహరణకు, ప్రకృతి విపత్తులవల్ల నష్టపోయినవాళ్లకు చేయూతనివ్వవచ్చు. భర్తను కోల్పోయిన ఒక సహోదరి ఇల్లు ఓ పెద్ద తుఫానువల్ల బాగా పాడైంది. ఆమె ఇలా చెప్తుంది, ‘యెహోవా సంస్థలో ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. సహోదరసహోదరీలు భౌతికంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా సహాయం చేశారు.’ మరో ఒంటరి సహోదరి ఇల్లు, తుఫాను వల్ల దెబ్బతిన్నప్పుడు ఆమె నిరాశతో కృంగిపోయింది. సహోదరులు ఆ ఇంటిని బాగుచేసిన తర్వాత ఆమె ఇలా చెప్తుంది, ‘నాకెంత సంతోషంగా ఉందో చెప్పడానికి మాటలు రావట్లేదు. యెహోవా నీకు కృతజ్ఞతలు.’ మన సహోదరసహోదరీలు ఒకరిపట్ల ఒకరు శ్రద్ధ చూపిస్తున్నందుకు మనమెంతో సంతోషిస్తున్నాం. మరిముఖ్యంగా, మనపై నిజమైన శ్రద్ధ చూపిస్తున్న యెహోవాకు, యేసుకు ఎంతో రుణపడి ఉన్నాం.

18. యేసు చేసిన అద్భుతాల్లో ప్రత్యేకత ఏమిటి?

18 పరిచర్యలో ఎన్నో అద్భుతాలు చేయడం ద్వారా యేసు “దేవుని శక్తి” అని నిరూపించుకున్నాడు. కానీ ఆయన ఎన్నడూ తన శక్తిని ఇతరులను మెప్పించడానికో లేదా తన స్వార్థం కోసమో ఉపయోగించలేదు. బదులుగా, ప్రజల మీదున్న నిజమైన ప్రేమతో, అద్భుతాలు చేయడానికి తన శక్తిని ఉపయోగించాడు. తర్వాతి ఆర్టికల్‌లో దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం.