కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

త్రిక ముఖ్యాంశం | ఆందోళనలను ఎలా తట్టుకోవాలి?

కుటుంబం గురించి ఆందోళన

కుటుంబం గురించి ఆందోళన

“మా నాన్న చనిపోయిన కొంత కాలానికి నా భర్త తనకు వేరే ఆమెతో సంబంధం ఉందని చెప్పాడు. తర్వాత ఇంకేం మాట్లాడకుండా, వెళ్తున్నానని కూడా చెప్పకుండా తన బట్టలు సర్దుకుని నన్ను, నా ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయాడు” అని జానెట్‌ చెప్తుంది. జానెట్‌కు ఒక ఉద్యోగం దొరికింది కానీ ఆ జీతం ఇంటి లోన్‌ తీర్చడానికి సరిపోలేదు. కేవలం ఆర్థిక ఇబ్బందులే కాదు, ఇంకా వేరే ఆందోళనలు కూడా ఆమెను కృంగదీశాయి. “ఇప్పుడు అన్ని బాధ్యతల్ని నేనే ఒంటరిగా చూసుకోవాలి అనేది నాకు మోయలేని బరువులా అనిపించింది. వేరే తల్లిదండ్రుల్లా నా పిల్లలకు కావల్సినవన్నీ నేను ఇవ్వలేకపోతున్నాను అని దిగులుపడ్డాను. నా గురించి, నా పిల్లల గురించి వేరేవాళ్లు ఏమనుకుంటారు? నా భర్తతో సంబంధాన్ని కాపాడుకోవడానికి నేను చేయగలిగినదంతా చేయలేదని వాళ్లు అనుకుంటున్నారా? అని ఇప్పటికీ నేను దిగులు పడుతుంటాను.”

జానెట్‌

బాధను తట్టుకోవడానికి, దేవునితో స్నేహాన్ని పెంచుకోవడానికి జానెట్‌కు ప్రార్థన సహాయం చేసింది. “రాత్రులు చాలా కష్టంగా ఉండేది. చుట్టూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, నా ఆలోచనలు ఇంకా ఎక్కువైపోయేవి. ప్రార్థన చేయడం, బైబిలు చదవడం నాకు నిద్రపట్టడానికి సహాయం చేశాయి. ‘దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును’ అని ఫిలిప్పీయులు 4:6, 7లో ఉన్న మాటలు నాకు చాలా ఇష్టం. ఎన్నో రాత్రులు నేను ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని, అప్పుడు యెహోవా ఇచ్చే సమాధానము నన్ను ఓదార్చింది.”

కొండ మీద ప్రసంగంలో యేసు “మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును” అని చెప్పాడు. ప్రార్థన గురించి ఇచ్చిన ఈ అభయం అన్నిరకాల ఆందోళనల్లో సహాయం చేస్తుంది. (మత్తయి 6:8) మనకు ఏం కావాలో ఆయన్ని మనం అడగాలి. దేవునికి దగ్గరవ్వడానికి మనకు మొదటగా సహాయం చేసేది ప్రార్థన, అలా ప్రార్థన చేసినప్పుడు ఆయన కూడా మనకు దగ్గరవుతాడు.—యాకోబు 4:8.

మన బాధనంతా చెప్పుకుని గుండె బరువు దించుకోవడానికే కాకుండా ప్రార్థన ఇంకా చాలా విధాలుగా మనకు సహాయం చేస్తుంది. ‘ప్రార్థనలు ఆలకించే’ యెహోవా తనపై నమ్మకం ఉంచే వాళ్లందరికీ సహాయం చేయడానికి ముందుకొస్తాడు. (కీర్తన 65:2) అందుకే, యేసు తన అనుచరులకు “విసుకక నిత్యము ప్రార్థన” చేయమని చెప్పాడు. (లూకా 18:1) మనం ఆయన మీద నమ్మకం ఉంచితే తప్పకుండా మనకు సహాయం చేస్తాడనే నమ్మకంతో దేవుని సహాయాన్ని, నిర్దేశాన్ని అడుగుతూనే ఉండాలి. మనకు సహాయం చేయాలనే కోరిక, సహాయం చేసే శక్తి దేవునికి ఉందా? అని సందేహించాల్సిన అవసరం లేదు. “యెడతెగక ప్రార్థన” చేస్తున్నామంటే మనకు నిజమైన విశ్వాసం ఉన్నట్లు.—1 థెస్సలొనీకయులు 5:15.

నిజమైన విశ్వాసం అంటే . . .

నిజమైన విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం ఉండాలంటే ముందుగా దేవుడు ఎలాంటివాడో తెలుసుకోవాలి. (యోహాను 17:3) అందుకోసం మనం బైబిల్లో ఉన్న దేవుని ఆలోచనలను అర్థం చేసుకుని, ఆయనలా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఆయన మనలో ప్రతీ ఒక్కరినీ చూస్తున్నాడని, మనకు సహాయం చేయాలనుకుంటున్నాడని అప్పుడు మనకు తెలుస్తుంది. అయితే నిజమైన విశ్వాసం ఉండాలంటే కేవలం దేవుని గురించి ఎంతోకొంత తెలుసుకుంటే సరిపోదు. గౌరవం, స్నేహం కలగలిసిన మంచి బంధం ఆయనతో ఏర్పర్చుకోవాలి. రాత్రికిరాత్రే ఎవరూ మంచి స్నేహితులైపోరు, దేవునితో స్నేహం కూడా అంతే. దేవుని గురించి తెలుసుకుంటూ, “ఆయన కిష్టమైన” పనులు చేస్తూ, ఆయన సహాయం తీసుకుంటుంటే మన విశ్వాసం ‘అభివృద్ధి’ చెందుతుంటుంది. (2 కొరింథీయులు 10:15; యోహాను 8:29) అలాంటి విశ్వాసమే ఆందోళనలను అధిగమించడానికి జానెట్‌కు సహాయం చేసింది.

“నేను వేసే ప్రతీ అడుగులో యెహోవా నా చేయి పట్టుకుని నడిపిస్తున్నాడని చూసినప్పుడు నిజంగా నా విశ్వాసం పెరిగింది” అని జానెట్‌ అంటుంది. “భరించడం చాలా కష్టం అనిపించే అన్యాయాలను ఎన్నోసార్లు ఎదుర్కొన్నాం. ఎంతగానో ప్రార్థించడం వల్ల వీటన్నిటి నుండి బయటపడడానికి యెహోవా నాకు దారి చూపించాడు. నా అంతట నేనే అయితే ఈ ఆందోళనల నుండి బయటపడేదాన్ని కాదు. దేవునికి కృతజ్ఞతలు చెప్పిన ప్రతీసారి, ఆయన నాకోసం ఎన్ని చేశాడో గుర్తొస్తుంది. దేవుడు చాలాసార్లు సరిగ్గా అవసరమైన సమయంలోనే, ఏ ఆలస్యం లేకుండా నాకు సహాయం చేశాడు. నిజమైన క్రైస్తవ స్త్రీపురుషులను ఆయన నాకు స్నేహితులుగా ఇచ్చాడు. నాకు ఏ సహాయం కావాలన్నా వాళ్లున్నారు, నా పిల్లలకు మంచి ఆదర్శంగా ఉన్నారు.” a

“భార్యను విడిచిపెట్టడం అసహ్యమైన పని అని యెహోవా ఎందుకు చెప్తున్నాడో నాకు తెలుసు. (మలాకీ 2:16) ఏ తప్పూ చేయని భార్య లేదా భర్తకు ఆ నమ్మకద్రోహం వల్ల అయ్యే గాయం మానడం చాలా కష్టం. నా భర్త వెళ్లిపోయి చాలా సంవత్సరాలు గడిచినా ఒంటరితనం నన్ను వెంటాడుతూనే ఉంది, నేను చేతగానిదాన్నేమో అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించినప్పుడు ఎవరికైనా సహాయం చేస్తూ ఉంటాను, దానివల్ల నిజానికి నేనే సహాయం పొందాను.” అందరికీ దూరంగా ఒంటరిగా ఉండడం మంచిది కాదనే బైబిలు సూత్రాన్ని పాటిస్తూ జానెట్‌ తన ఆందోళనను తగ్గించుకుంది. bసామెతలు 18:1.

‘దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్త.’—కీర్తన 68:5

దేవుడు “తండ్రి లేనివారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త” అని తెలుసుకోవడం నాకు ఎంతో ఓదార్పునిచ్చింది. నా భర్తలా దేవుడు మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. (కీర్తన 68:5) దేవుడు మనకు చెడు చేస్తూ మనల్ని పరీక్షించడని జానెట్‌కు తెలుసు. దేవుడు “అందరికి ధారాళముగ” జ్ఞాన్నాన్ని, తన గొప్ప శక్తిని ఇస్తూ ఆందోళనలు అధిగమించడానికి సహాయం చేస్తాడు.—యాకోబు 1:5, 13; 2 కొరింథీయులు 4:7.

అయితే మన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన పడుతుంటే, అప్పుడేంటి? (w15-E 07/01)

b ఆందోళనను తగ్గించుకోవడానికి సహాయపడే మరి కొన్ని సలహాలను తెలుసుకోవడానికి జూలై 2015 తేజరిల్లు! (ఇంగ్లీషు) పత్రికలో “మీ జీవితం మీ అదుపులో ఉందా?” అనే ఆర్టికల్‌ చదవండి. దీన్ని www.pr418.comలో చూడవచ్చు.