కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆధ్యాత్మిక పరదైసును అందంగా తీర్చిదిద్దండి

ఆధ్యాత్మిక పరదైసును అందంగా తీర్చిదిద్దండి

“నేను నా పాదస్థలమును మహిమపరచెదను.”—యెష. 60:13.

పాటలు: 28, 53

1, 2. ‘పాదపీఠం’ అనే పదం వేటిని సూచిస్తుంది?

 ‘ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం’ అని యెహోవా చెప్పాడు. (యెష. 66:1) “నేను నా పాదస్థలమును మహిమపరచెదను” అని కూడా ఆయన అన్నాడు. (యెష. 60:13) యెహోవా తన పాదపీఠమైన భూమిని ఎలా మహిమపరుస్తాడు? దానివల్ల భూమ్మీద జీవిస్తున్న మనం ఎలా ప్రయోజనం పొందుతాం?

2 హీబ్రూ లేఖనాల్లో ‘పాదపీఠం’ అనే పదం, ప్రాచీన ఇశ్రాయేలులోని దేవాలయాన్ని కూడా సూచిస్తుంది. (1 దిన. 28:2; కీర్త. 132:7) ఆ ఆలయంలో ప్రజలు యెహోవాను ఆరాధించేవాళ్లు, కాబట్టి అది ఆయన దృష్టిలో ఎంతో అందమైనది. అంతేకాదు, ఆ దేవాలయం యెహోవా పాదపీఠమైన భూమికి మహిమ తీసుకొచ్చింది.

3. నేడు ఏ ఆలయంలో దేవుని సేవకులు యెహోవాను ఆరాధిస్తున్నారు? అది ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది?

3 అయితే మనకాలంలో, భూమ్మీదున్న ఏ ఆలయం కాదుగానీ ఓ ఆధ్యాత్మిక ఆలయం సత్యారాధనకు కేంద్రంగా ఉంది. ఆ ఆలయం కంటికి కనిపించే కట్టడం కాదు. అది మరే ఇతర ఆలయంకన్నా ఎక్కువగా యెహోవాను మహిమపరుస్తుంది. యేసుక్రీస్తు బలి ఆధారంగా, మనుషులు తనకు స్నేహితులయ్యేందుకు, తనను ఆరాధించేందుకు యెహోవా చేసిన ఏర్పాటే ఆ ఆధ్యాత్మిక ఆలయం. యేసు సా.శ. 29లో బాప్తిస్మం తీసుకుని దేవుని ఆధ్యాత్మిక ఆలయానికి ప్రధాన యాజకునిగా అభిషేకించబడినప్పుడు అది ఉనికిలోకి వచ్చింది.—హెబ్రీ. 9:11, 12.

4, 5. (ఎ) సత్యారాధకులు ఏమి చేయాలని కోరుకుంటారని 99వ కీర్తన చెప్తుంది? (బి) మనం ఏమని ప్రశ్నించుకోవాలి?

4 సత్యారాధన కోసం యెహోవా చేసిన ఆ ఏర్పాటుకు మనం ఎంతో కృతజ్ఞులం. ఆయన నామం గురించి, విమోచన క్రయధనం అనే అద్భుతమైన బహుమానం గురించి ఇతరులకు చెప్పడం ద్వారా మనం యెహోవాను స్తుతిస్తాం. నేడు 80 లక్షలకన్నా ఎక్కువమంది సత్యారాధకులు యెహోవాను స్తుతిస్తున్నారని తెలుసుకోవడం మనకెంతో సంతోషాన్నిస్తుంది. వేరే మతాలకు చెందిన చాలామంది, తాము చనిపోయాక పరలోకానికి వెళ్తామని అక్కడ దేవున్ని స్తుతిస్తామని అనుకుంటారు. అయితే ఇక్కడే, ఇప్పుడే యెహోవాను స్తుతించడం చాలా ముఖ్యమని యెహోవా ప్రజలమైన మనకు తెలుసు.

5 మనం యెహోవాను స్తుతించినప్పుడు, కీర్తన 99:1-3, 5-7 వచనాల్లో ఉన్న దేవుని సేవకులను అనుకరిస్తాం. (చదవండి.) మోషే, అహరోను, సమూయేలు వంటి నమ్మకమైన సేవకులు అప్పట్లో సత్యారాధన కోసం దేవుడు చేసిన ఏర్పాటుకు పూర్తిగా మద్దతిచ్చారు. అభిషిక్తులు పరలోకంలో యేసుతోపాటు యాజకులుగా సేవచేసే ముందు, ఆధ్యాత్మిక ఆలయంలోని భూభాగంలో యెహోవాకు నమ్మకంగా సేవ చేస్తారు. వాళ్లకు లక్షలమంది ‘వేరే గొర్రెలు’ నమ్మకంగా మద్దతిస్తారు. (యోహా. 10:16) ఈ రెండు గుంపుల వాళ్లు యెహోవా ‘పాదపీఠమైన’ భూమిపై ఆయన్ను ఐక్యంగా ఆరాధిస్తున్నారు. మరి మన విషయమేమిటి? ‘సత్యారాధన కోసం యెహోవా చేసిన ఏర్పాటుకు నేను పూర్తిగా మద్దతిస్తున్నానా?’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.

ఆధ్యాత్మిక ఆలయంలో సేవించేవాళ్లను యెహోవా గుర్తించాడు

6, 7. బైబిలు ముందే చెప్పినట్లు తొలి క్రైస్తవ సంఘానికి ఏమైంది? వందల సంవత్సరాల తర్వాత యెహోవా ఏమి చేశాడు?

6 క్రైస్తవ సంఘం స్థాపించి 100 ఏళ్లు అవ్వకముందే మతభ్రష్టత్వం మొదలైంది. దానిగురించి బైబిలు ముందే చెప్పింది. (అపొ. 20:28-30; 2 థెస్స. 2:3, 4) కాలం గడిచేకొద్దీ, దేవుని నిజమైన ఆరాధకులు ఎవరో గుర్తుపట్టడం మరింత కష్టమైంది. అయితే వందల సంవత్సరాల తర్వాత యెహోవా యేసును ఉపయోగించుకుని, ఆధ్యాత్మిక ఆలయంలో తనను నిజంగా సేవిస్తున్నవాళ్లను గుర్తించాడు.

7 దేవుని ఆమోదం ఎవరికి ఉందో, ఆయన ఆధ్యాత్మిక ఆలయంలో ఎవరు సేవిస్తున్నారో 1919 కల్లా స్పష్టమైంది. వాళ్లు తమ ఆరాధనా పద్ధతుల్లో ఎన్నో మార్పులు చేసుకుని యెహోవాకు ఇష్టమైన విధంగా ఆరాధించడం మొదలుపెట్టారు. (యెష. 4:2, 3; మలా. 3:1-4) అలా, కొన్ని వందల సంవత్సరాల క్రితం అపొస్తలుడైన పౌలు చూసిన ఓ దర్శనం నెరవేరడం ప్రారంభమైంది.

8, 9. పౌలు దర్శనంలో చూసిన “పరదైసు” దేన్ని సూచిస్తుంది?

8 పౌలు చూసిన దర్శనం గురించి 2 కొరింథీయులు 12:1-4 వచనాల్లో ఉంది. (చదవండి.) భవిష్యత్తులో ఉండే ఓ పరిస్థితిని యెహోవా పౌలుకు ఆ దర్శనంలో చూపించాడు. ఆయన చూసిన “పరదైసు” దేన్ని సూచిస్తుంది? మొదటిగా, అది త్వరలో రానున్న భూపరదైసును సూచించవచ్చు. (లూకా 23:43) రెండవదిగా, కొత్తలోకంలో ప్రజలు అనుభవించే పరిపూర్ణ ఆధ్యాత్మిక పరదైసును సూచించవచ్చు. మూడవదిగా, ‘దేవుని పరదైసును’ అంటే పరలోకంలో ఉండే అద్భుతమైన పరిస్థితుల్ని సూచించవచ్చు.—ప్రక. 2:7.

9 మరి ఆ దర్శనంలో వచింపశక్యం కాని మాటలు విన్నాననీ, వాటిని ఎవరూ పలకకూడదనీ పౌలు ఎందుకు అన్నాడు? ఎందుకంటే, దర్శనంలో చూసిన అద్భుతమైన విషయాల్ని పూర్తిగా వివరించడానికి యెహోవా పౌలుకు అప్పుడు అనుమతివ్వలేదు. అయితే యెహోవా ఇప్పుడు మనల్ని అనుమతిస్తున్నాడు కాబట్టి, మనం అనుభవిస్తున్న ఆశీర్వాదాల గురించి ఇతరులకు చెప్పవచ్చు.

10. “ఆధ్యాత్మిక పరదైసు,” “ఆధ్యాత్మిక ఆలయం” ఒకటేనా? వివరించండి.

10 ఆధ్యాత్మిక పరదైసు అనే మాట మన ప్రచురణల్లో చాలాసార్లు వస్తుంటుంది. ఇంతకీ ఆధ్యాత్మిక పరదైసు అంటే ఏమిటి? ఆధ్యాత్మిక పరదైసు, ఆధ్యాత్మిక ఆలయం ఒకటేనా? కాదు. ఆధ్యాత్మిక పరదైసు అంటే యెహోవా ప్రజలు మాత్రమే అనుభవించే సమాధానకరమైన పరిస్థితి. కానీ ఆధ్యాత్మిక ఆలయం అంటే సత్యారాధన కోసం యెహోవా దేవుడు చేసిన ఏర్పాటు. యెహోవా ప్రజల మధ్యవున్న సమాధానాన్ని బట్టి, వాళ్లు మాత్రమే దేవుని ఆధ్యాత్మిక ఆలయంలో ఆయన్ను సేవిస్తున్నారని చెప్పవచ్చు.—మలా. 3:18.

11. నేడు మనకు ఏ గొప్ప అవకాశం ఉంది?

11 ఆధ్యాత్మిక పరదైసును సాగుచేసి, దాన్ని వృద్ధి చేస్తూ విస్తరింపజేసే గొప్ప అవకాశాన్ని యెహోవా 1919 నుండి అపరిపూర్ణ మనుషులకు ఇస్తున్నాడు. ఆ అద్భుతమైన పనిలో మీరూ పాల్గొంటున్నారా? యెహోవా ‘పాదపీఠాన్ని’ మహిమపర్చడంలో ఆయనతో కలిసి పనిచేసే అవకాశాన్ని మీరు అమూల్యంగా ఎంచుతున్నారా?

యెహోవా తన సంస్థను మరింత అందంగా తీర్చిదిద్దుతున్నాడు

12. యెషయా 60:17 నెరవేరిందని మనమెలా చెప్పవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

12 దేవుని సంస్థలోని భూమ్మీద భాగంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరుగుతాయని యెషయా ప్రవచించాడు. (యెషయా 60:17 చదవండి.) మన మధ్యవున్న యౌవనులు లేదా కొత్తగా సత్యంలోకి వచ్చినవాళ్లు ఆ మార్పుల గురించి కేవలం చదివుంటారు లేదా వినుంటారు. కానీ చాలామంది సహోదరసహోదరీలు వాటిని కళ్లారా చూశారు. అందుకే, మన రాజైన యేసుక్రీస్తు ద్వారా యెహోవా తన సంస్థను నడిపిస్తున్నాడని వాళ్లకు నమ్మకం కుదిరింది. వాళ్ల అనుభవాలు విన్నప్పుడు యెహోవాపై మన విశ్వాసం, నమ్మకం బలపడతాయి.

13. కీర్తన 48:12-14 వచనాల ప్రకారం మనమేమి చేయాలి?

13 నిజక్రైస్తవులందరూ యెహోవా సంస్థ గురించి ఇతరులకు చెప్పాలి. సాతాను లోకంలో జీవిస్తున్నప్పటికీ, యెహోవా ప్రజలందరూ సమాధానంగా, ఐక్యంగా ఉండడం ఎంత అద్భుతమైన విషయం! “సీయోను” గురించి అంటే యెహోవా సంస్థ గురించి అద్భుతమైన విషయాల్ని, మనం అనుభవిస్తున్న ఆధ్యాత్మిక పరదైసు గురించిన సత్యాన్ని ‘రాబోయే తరాలకు’ చెప్పడం ఎంతో సంతోషాన్నిస్తుంది.—కీర్తన 48:12-14 చదవండి.

14, 15. దేవుని సంస్థలో 1970 తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి? అవి ఎందుకు ప్రయోజనకరం?

14 మన మధ్యవున్న వృద్ధ సహోదరసహోదరీలు దేవుని సంస్థలో వచ్చిన ఎన్నో మార్పుల్ని స్వయంగా చూశారు. అవి దేవుని సంస్థలోని భూమ్మీద భాగాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాయి. ఉదాహరణకు, సంఘాల్లో ఒకప్పుడు పెద్దల సభకు బదులు సంఘ సేవకుడు ఉండేవాడు. సంఘానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా ఆయన ఒక్కడే తీసుకునేవాడు. అలాగే బ్రాంచి కమిటీకి బదులు బ్రాంచి సేవకుడు, యెహోవాసాక్షుల పరిపాలక సభకు బదులు వాచ్‌ టవర్‌ సొసైటీ అధ్యక్షుడు ఉండేవాళ్లు. వీళ్లకు సహాయకులుగా కొంతమంది నమ్మకమైన సహోదరులు ఉన్నప్పటికీ, నిర్ణయాలన్నిటినీ ఒక్కరే తీసుకునేవాళ్లు. అయితే 1970 తర్వాత ఈ పద్ధతిలో మార్పు వచ్చింది, నిర్ణయాల్ని ఒకేవ్యక్తి తీసుకునే బదులు కొంతమంది పెద్దల గుంపు తీసుకోవడం మొదలైంది.

15 మరి ఇలాంటి మార్పుల వల్ల సంస్థకు ప్రయోజనం కలిగిందా? ఖచ్చితంగా. ఎందుకంటే, లేఖనాలను మరింత బాగా అర్థం చేసుకున్న తర్వాతే ఆ మార్పుల్ని చేశారు. నిర్ణయాలన్నీ ఒక్కరే తీసుకునే బదులు, యెహోవా దేవుడు అనుగ్రహించిన ‘ఈవులు’ లేదా పెద్దలందరూ కలిసి తీసుకోవడం వల్ల వాళ్లకున్న మంచి లక్షణాలనుండి సంస్థ ప్రయోజనం పొందుతుంది.—ఎఫె. 4:8; సామె. 24:6.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు అవసరమైన మార్గనిర్దేశాన్ని యెహోవా ఇస్తున్నాడు (16, 17 పేరాలు చూడండి)

16, 17. ఈ మధ్యకాలంలో సంస్థ చేసిన మార్పుల్లో మీకేది బాగా నచ్చింది? ఎందుకు?

16 ఈ మధ్యకాలంలో మన ప్రచురణల రూపురేఖల్లో, సమాచారంలో, వాటిని పంచిపెట్టే విధానంలో వచ్చిన మార్పుల గురించి కూడా ఒకసారి ఆలోచించండి. మన ప్రచురణలు అందరికీ ఉపయోగపడే సమాచారంతో ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా ఉంటున్నాయి కాబట్టి వాటిని ఎంతో సంతోషంగా అందిస్తున్నాం. అంతేకాదు, సువార్త ప్రకటించడానికి ఆధునిక టెక్నాలజీని ఏయే విధాల్లో ఉపయోగిస్తున్నామో కూడా ఆలోచించండి. దానికో ఉదాహరణ, మన jw.org వెబ్‌సైట్‌. సరైన నిర్దేశం కోసం ఎదురుచూస్తున్న చాలామంది ప్రజలు దీని నుండి ప్రయోజనం పొందుతున్నారు. ఈ మార్పులన్నిటినీ చూస్తే ప్రజలమీద యెహోవాకు ఎంత శ్రద్ధ, ప్రేమ ఉన్నాయో అర్థమౌతుంది.

17 మన సంస్థ ఎంతో ఆలోచించి కూటాల విషయంలో మార్పులు చేసినందుకు కూడా మనమెంతో సంతోషిస్తున్నాం. వాటివల్ల కుటుంబ ఆరాధనకు లేదా వ్యక్తిగత అధ్యయనానికి ఇప్పుడు మనకు మరింత సమయం ఉంటుంది. అంతేకాదు అసెంబ్లీలు, సమావేశ కార్యక్రమాల్లో కూడా మార్పులు వచ్చాయి, సంవత్సరాలు గడిచేకొద్దీ అవి మరింత ప్రయోజనకరంగా ఉంటున్నాయి. అనేక బైబిలు పాఠశాలల ద్వారా యెహోవా మనకు శిక్షణ ఇస్తున్నందుకు ఎంతో కృతజ్ఞులం. ఈ మార్పులన్నీ చూస్తుంటే, యెహోవా దేవుడే తన సంస్థను నడిపిస్తూ ఆధ్యాత్మిక పరదైసును మరింత అందంగా తీర్చిదిద్దుతున్నాడని అర్థమౌతుంది.

ఆధ్యాత్మిక పరదైసును అందంగా తీర్చిదిద్దడంలో మన పాత్ర

18, 19. ఆధ్యాత్మిక పరదైసును మరింత అందంగా తీర్చిదిద్దడంలో మనమెలా సహాయపడవచ్చు?

18 ఆధ్యాత్మిక పరదైసును మరింత అందంగా తీర్చిదిద్దే పనిలో సహాయం చేయడం మనకు దొరికిన గొప్ప గౌరవం. కాబట్టి మనం రాజ్యసువార్తను ఉత్సాహంగా ప్రకటిస్తూ, ఎక్కువమందిని శిష్యులుగా చేయాలి. అలా, ఒకవ్యక్తి దేవుని సేవకుడయ్యేందుకు సహాయం చేసిన ప్రతీసారి మనం ఆధ్యాత్మిక పరదైసును విస్తరింపజేయడంలో చేయి కలిపినట్టే.—యెష. 26:15; 54:2.

19 అంతేకాదు, మన క్రైస్తవ లక్షణాలను మెరుగుపర్చుకోవడం ద్వారా కూడా మనం ఆధ్యాత్మిక పరదైసును మరింత అందంగా తీర్చిదిద్దుతాం. దానివల్ల ఇతరులు ఆధ్యాత్మిక పరదైసుకు మరింత ఆకర్షితులౌతారు. సాధారణంగా ప్రజల్ని మొదట ఆకర్షించేది మన బైబిలు జ్ఞానం కాదుగానీ మన మంచి ప్రవర్తనే. దాన్నిబట్టే వాళ్లు మన సంస్థకు ఆ తర్వాత యెహోవాకు, యేసుక్రీస్తుకు దగ్గరౌతారు.

ఆధ్యాత్మిక పరదైసును విస్తరింపజేయడంలో మీరూ సహాయం చేయవచ్చు (18, 19 పేరాలు చూడండి)

20. సామెతలు 14:35 ప్రకారం మనమేమి చేయాలి?

20 మన మధ్యవున్న అందమైన ఆధ్యాత్మిక పరదైసును చూసి యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ఎంతో సంతోషిస్తుంటారు. ఆధ్యాత్మిక పరదైసును అందంగా తీర్చిదిద్దుతూ మనం ఇప్పుడు ఎంతో ఆనందిస్తున్నాం. అయితే ఈ ఆనందం, భూమి అంతటినీ నిజమైన పరదైసుగా మారుస్తున్నప్పుడు మనం పొందే అసలైన ఆనందానికి ఓ శాంపిల్‌ మాత్రమే. సామెతలు 14:35లో ఉన్న ఈ మాటల్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకుందాం, “బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు.” కాబట్టి, ఆధ్యాత్మిక పరదైసును అందంగా తీర్చిదిద్దుతూ మనం జ్ఞానంతో నడుచుకుందాం.