కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని రాజ్యానికి నమ్మకంగా ఉండండి

దేవుని రాజ్యానికి నమ్మకంగా ఉండండి

‘వాళ్లు లోకసంబంధులు కాదు.’—యోహా. 17:16.

పాటలు: 18, 54

1, 2. (ఎ) మనం యెహోవాకు నమ్మకంగా ఉన్నప్పుడు లోక వ్యవహారాల విషయంలో ఎలా ఉంటాం? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) చాలామంది వేటికి నమ్మకంగా ఉంటారు? దాని ఫలితం ఏమిటి?

 యెహోవాసాక్షులు జాతి, తెగ, నేపథ్యం వంటివాటికి సంబంధించిన వివాదాల్లో తలదూర్చరు. ఎందుకు? ఎందుకంటే మనం యెహోవాను ప్రేమిస్తాం, ఆయనకే నమ్మకంగా ఉంటూ లోబడతాం. (1 యోహా. 5:3) మనం ఏ దేశానికి, ప్రాంతానికి లేదా సంస్కృతికి చెందినవాళ్లమైనా, యెహోవా ప్రమాణాలను పాటిస్తాం. మనం అన్నిటికన్నా ఎక్కువగా యెహోవాకూ, ఆయన రాజ్యానికే నమ్మకంగా ఉంటాం. (మత్త. 6:33) అందుకే మనం ‘లోకసంబంధులుగా’ ఉండం.—యోహాను 17:11, 15-16 చదవండి; యెష. 2:4.

2 నేడు లోకంలో చాలామంది తమ దేశానికి, జాతికి, సంస్కృతికి, ఆఖరికి తమ క్రీడా జట్టుకు కూడా నమ్మకంగా ఉంటారు. దానివల్ల ప్రజల్లో పోటీతత్వం, ద్వేషం పెరిగిపోయి, చివరికి అవతలి వాళ్లను చంపడానికి కూడా వెనకాడడం లేదు. మనం అలాంటి పోరాటాల్లో పాల్గొనకపోయినా అవి మనమీద, మన కుటుంబం మీద ప్రభావం చూపించవచ్చు, కొన్నిసార్లు మనకు ఘోరమైన అన్యాయం కూడా జరగవచ్చు. అయితే, ఏది న్యాయమో ఏది అన్యాయమో గుర్తించే సామర్థ్యాన్ని యెహోవా మనకిచ్చాడు కాబట్టి ప్రభుత్వం అన్యాయంగా ప్రవర్తించినప్పుడు దాని వ్యతిరేక పార్టీకి మద్దతివ్వాలని మనకనిపించవచ్చు. (ఆది. 1:27; ద్వితీ. 32:4) మరి అలాంటి అన్యాయం జరిగినప్పుడు మీరేమి చేస్తారు? తటస్థంగా ఉంటారా లేక ఎవరో ఒకరికి మద్దతిస్తారా?

3, 4. (ఎ) మనం ఈ లోక పోరాటాల్లో ఎందుకు తలదూర్చం? (బి) ఈ ఆర్టికల్‌లో మనమేమి పరిశీలిస్తాం?

3 పోరాటాలు జరిగేటప్పుడు చాలామంది ప్రజలు ఏదో ఒక పార్టీకి మద్దతిస్తారు. అలా మద్దతిచ్చేవాళ్లే మంచి పౌరులని ప్రభుత్వాలు చెప్తుంటాయి. కానీ మనం యేసును అనుకరిస్తాం కాబట్టి రాజకీయాల్లోగానీ, యుద్ధాల్లోగానీ పాల్గొనం. (మత్త. 26:52) సాతాను లోకంలోని ఒక పార్టీ మరో పార్టీకన్నా మంచిదని మనం అనుకోం. (2 కొరిం. 2:11) కాబట్టి మనం ఈ లోక పోరాటాల్లో తలదూర్చం.—యోహాను 15:18, 19 చదవండి.

4 మనం అపరిపూర్ణులం కాబట్టి వేరే దేశానికి, జాతికి లేదా భాషకు చెందినవాళ్ల మీద మనకు ఒకప్పుడు చెడు అభిప్రాయాలు ఉండివుంటాయి. వాటిని తీసేసుకోవడానికి మనలో కొంతమందిమి ఇప్పటికీ కృషి చేస్తుండవచ్చు. (యిర్మీ. 17:9; ఎఫె. 4:22-24) అందుకు సహాయం చేసే కొన్ని సూత్రాలను ఈ ఆర్టికల్‌లో చూద్దాం. అలాగే మనం యెహోవాలా, యేసులా ఆలోచించడానికి కృషిచేయడం ద్వారా రాజ్యానికి ఎలా నమ్మకంగా ఉండవచ్చో కూడా పరిశీలిద్దాం.

మనమెందుకు లోక వ్యవహారాల్లో జోక్యం చేసుకోం?

5, 6. తన కాలంలోని వేర్వేరు జాతుల ప్రజల విషయంలో యేసుకు ఎలాంటి అభిప్రాయం ఉండేది? ఎందుకు?

5 ఏదైనా ఒక విషయంలో తటస్థంగా ఉండడం కష్టమని మీకనిపిస్తే, ‘నా స్థానంలో యేసు ఉంటే ఏమి చేసేవాడు?’ అని ఆలోచించండి. ఆయన భూమ్మీద జీవించిన కాలంలో యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాల ప్రజలకు ఒకళ్లంటే ఒకళ్లకు పడేది కాదు. ఉదాహరణకు యూదులూ సమరయులూ మాట్లాడుకునేవాళ్లు కాదు. (యోహా. 4:9) పరిసయ్యులకు సద్దూకయ్యులకు చాలా విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉండేవి. (అపొ. 23:6-9) ధర్మశాస్త్రాన్ని చదివిన యూదులు తాము ఇతరులకన్నా గొప్పవాళ్లమని అనుకునేవాళ్లు. (యోహా. 7:49) అంతేకాదు యూదులు సుంకరులను ద్వేషించేవాళ్లు. (మత్త. 9:11) అయితే, యేసు వీళ్ల గొడవల్లో ఎప్పుడూ తలదూర్చలేదు. ఆయన యెహోవా గురించిన సత్యాన్ని మాత్రమే సమర్థించాడు. అంతేకాదు, ఇశ్రాయేలీయులు దేవుని ప్రత్యేక జనాంగం అని తెలిసినా, వాళ్లు ఇతరులకన్నా గొప్పవాళ్లని యేసు ఎన్నడూ బోధించలేదు. (యోహా. 4:22) బదులుగా, ప్రజలందర్నీ ప్రేమించమని ఆయన తన శిష్యులకు నేర్పించాడు.—లూకా 10:27.

6 ఒక జాతి మరో జాతికన్నా గొప్పదని యేసు ఎందుకు అనుకోలేదు? ఎందుకంటే యెహోవా, యేసుక్రీస్తు ప్రజల్ని చూసే విధానం వేరు. భూమిని వేర్వేరు జాతుల ప్రజలతో నింపగల సామర్థ్యంతో యెహోవా మనుషుల్ని సృష్టించాడు. (ఆది. 1:27, 28) కాబట్టి యెహోవాగానీ, యేసుగానీ ఫలానా జాతి, దేశం, భాష వేరేవాటికన్నా గొప్పవని అనుకోరు. (అపొ. 10:34, 35; ప్రక. 7:9, 13, 14) మనం వాళ్లలాగే ఆలోచించాలి.—మత్త. 5:43-48.

7, 8. (ఎ) మనం ఎవరికి మద్దతిస్తాం? ఎందుకు? (బి) మనుషుల సమస్యల్ని ఏది మాత్రమే పరిష్కరిస్తుందని మనం గుర్తుంచుకోవాలి?

7 మనం ఎందుకు మానవ నాయకులకు లేదా ప్రభుత్వాలకు మద్దతివ్వం? ఎందుకంటే మనం యెహోవాకే మద్దతిస్తాం, ఆయనే మన పరిపాలకుడు. కానీ యెహోవా మంచి పరిపాలకుడు కాదని సాతాను నిందమోపాడు. అంతేకాదు దేవుని మార్గాలకన్నా తన మార్గాలే సరైనవని అతను ప్రజల్ని నమ్మిస్తున్నాడు. అయితే మనం ఎవరివైపు ఉంటామో నిర్ణయించుకునే స్వేచ్ఛ యెహోవా మనకే ఇచ్చాడు. మరి మీరేం చేస్తారు? మీ మార్గాలకన్నా యెహోవా మార్గాలే సరైనవని నమ్ముతూ ఆయనకు లోబడతారా? మన కష్టాల్ని దేవుని రాజ్యం మాత్రమే తీర్చగలదని మీరు నమ్ముతున్నారా లేక, మనుషులు తమను తామే పరిపాలించుకోగలరని అనుకుంటున్నారా?—ఆది. 3:4, 5.

8 ఉదాహరణకు ఫలానా రాజకీయ పార్టీ గురించి, ఉద్యమం లేదా సంస్థ గురించి మీ అభిప్రాయమేంటని ఎవరైనా అడిగితే, మీరేమి చెప్తారు? బహుశా కొన్ని పార్టీలు లేదా సంస్థలు ప్రజలకు సహాయం చేయడానికి నిజంగానే ప్రయత్నిస్తుండవచ్చు. అయితే, దేవుని రాజ్యం మాత్రమే మనం అనుభవిస్తున్న కష్టాల్ని, అన్యాయాల్ని తీసేస్తుందని మనకు తెలుసు. అంతేకాదు, సంఘంలో కూడా మనకు ఇష్టమొచ్చినట్లు నడుచుకునే బదులు మనం యెహోవా నిర్దేశాన్ని పాటిస్తాం. అందువల్లే సంఘం ఐక్యంగా ఉండగలుగుతుంది.

9. మొదటి శతాబ్దంలో కొరింథు సంఘంలో ఏ సమస్య ఉండేది? వాళ్లకు పౌలు ఏ సలహా ఇచ్చాడు?

9 మొదటి శతాబ్దంలో కొరింథు సంఘంలోని కొంతమంది, ‘నేను పౌలువాడను, నేను అపొల్లోవాడను, నేను కేఫావాడను, నేను క్రీస్తువాడను’ అని వాదించుకున్నారు. ఈ విషయం తెలిసినప్పుడు పౌలుకు కోపమొచ్చింది. అలాంటివాళ్ల వల్ల సంఘ ఐక్యత పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే పౌలు వాళ్లను “క్రీస్తు విభజింపబడి యున్నాడా?” అని సూటిగా ప్రశ్నిస్తూ ఈ సలహా ఇచ్చాడు, ‘సహోదరులారా, మీరందరు ఏకభావంతో మాట్లాడాలని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతో ఏకతాత్పర్యముతో, మీరు సన్నద్ధులై ఉండాలని, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను.’ ఈ సలహా నేటికీ వర్తిస్తుంది. కాబట్టి మనం సంఘంలో ఎలాంటి విభజనలకూ చోటివ్వకూడదు.—1 కొరిం. 1:10-13; రోమీయులు 16:17, 18 చదవండి.

10. పౌలు అభిషిక్త క్రైస్తవులను ఏమని ప్రోత్సహించాడు? దానినుండి మనమేమి నేర్చుకోవచ్చు?

10 అభిషిక్త క్రైస్తవులకు పరలోక పౌరసత్వం ఉంది కాబట్టి, ‘భూసంబంధమైనవాటి మీద’ మనసు పెట్టవద్దని పౌలు వాళ్లను ప్రోత్సహించాడు. (ఫిలి. 3:17-20) a అభిషిక్తులు దేవునికి, క్రీస్తుకు రాయబారులు. ఓ రాయబారి వేరే దేశంలో ఉన్నప్పుడు ఆ దేశ వ్యవహారాల్లో, రాజకీయాల్లో తలదూర్చడు. అదేవిధంగా అభిషిక్తులు కూడా ఈ లోక వ్యవహారాల్లో, రాజకీయాల్లో జోక్యం చేసుకోరు. (2 కొరిం. 5:20) అంతేకాదు, భూనిరీక్షణగలవాళ్లు కూడా దేవుని రాజ్యానికి నమ్మకంగా ఉంటారు, ఈ లోక పోరాటాల్లో వాళ్లు ఎవ్వరికీ మద్దతివ్వరు.

రాజ్యానికి నమ్మకంగా ఉండేలా మీ మనస్సాక్షికి శిక్షణ ఇవ్వండి

11, 12. (ఎ) దేవుని రాజ్యానికి నమ్మకంగా ఉండాలంటే ఎలాంటి ఆలోచనలకు దూరంగా ఉండాలి? (బి) ఓ సహోదరి ఎలాంటి సవాలు ఎదుర్కొంది? ఆమె తన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చుకుంది?

11 ప్రపంచంలోని చాలా ప్రాంతాల ప్రజలకు తమ దేశానికి, సంస్కృతికి, భాషకు చెందినవాళ్లంటే ప్రత్యేక అభిమానం ఉంటుంది. వాళ్లు తమ దేశాన్ని చూసి గర్వపడతారు కూడా. కానీ మనం అలా ఉండకూడదు. బదులుగా మన ఆలోచనా విధానాన్ని మార్చుకుని, ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పక్షపాతం చూపించకుండా ఉండేలా మన మనస్సాక్షికి శిక్షణ ఇవ్వాలి. దాన్ని మనమెలా చేయవచ్చు?

12 ఉదాహరణకు, మీర్యేటా b అనే సహోదరి గతంలో యుగోస్లావియా అని పిలువబడిన దేశంలో పుట్టింది. ఆమె ప్రాంతంలోని ప్రజలు సెర్బియన్‌లను ద్వేషించేవాళ్లు. అయితే ఆమె సత్యం తెలుసుకున్నాక, యెహోవా ఒక జాతిని మరో జాతికన్నా గొప్పగా చూడడని గ్రహించింది. అంతేకాదు, ప్రజలు ఒకర్నొకరు ద్వేషించాలని కోరుకునేది సాతానే అని అర్థం చేసుకుంది. దాంతో తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడానికి ఆమె చాలా కృషి చేసింది. అయితే తన ప్రాంతంలో వేర్వేరు తెగల మధ్య పోరాటం జరిగినప్పుడు ఆమె మళ్లీ సెర్బియన్‌లను ద్వేషించడం మొదలుపెట్టింది. వాళ్లకు అసలు సువార్త ప్రకటించకూడదని అనుకుంది. కానీ అలా ఆలోచించడం తప్పని తెలుసుకొని, తనను సరిదిద్దుకోవడానికి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించింది. పయినీరు సేవ మొదలుపెట్టేందుకు సహాయం చేయమని కూడా అడిగింది. ఆమె ఇలా చెప్తుంది, “పరిచర్య మీద మనసుపెట్టడం నాకు చాలా సహాయం చేసింది. సువార్త ప్రకటిస్తున్నప్పుడు నేను యెహోవాలా ప్రేమ చూపించడానికి ప్రయత్నించాను. దానివల్ల నాకున్న ప్రతికూల ఆలోచనలు మటుమాయం అయిపోయాయి.”

13. (ఎ) థాయిలా అనే సహోదరి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంది? ఆమె ఏమి చేసింది? (బి) ఆ సహోదరి అనుభవం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

13 మెక్సికో దేశానికి చెందిన థాయిలా అనే సహోదరి ప్రస్తుతం యూరప్‌లో నివసిస్తోంది. అక్కడ ఆమె వెళ్తున్న సంఘంలో, లాటిన్‌ అమెరికాలోని వేరే దేశాలకు చెందిన సహోదరసహోదరీలు కూడా ఉన్నారు. వాళ్లలో కొంతమంది అప్పుడప్పుడు ఆమె దేశాన్ని, అక్కడి ఆచారాలను, సంగీతాన్ని ఎగతాళి చేసేవాళ్లు. అవి విని ఆమె నొచ్చుకున్నా, ఎక్కువగా బాధపడకుండా ఉండేందుకు సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించింది. ఒకవేళ ఆమె స్థానంలో మనం ఉంటే ఏమి చేసేవాళ్లం? మన దేశం లేదా రాష్ట్రం గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే బాధపడకుండా ఉండడానికి మనలో కొంతమందిమి ఇప్పటికీ కృషి చేస్తున్నాం. కాబట్టి ఫలానా వాళ్లు మిగతావాళ్లకన్నా గొప్పవాళ్లు అనిపించేలా మనం ఎప్పుడూ మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు. మనం సహోదరసహోదరీల మధ్య లేదా ఇతరుల మధ్య అలాంటి విభజనలు సృష్టించకూడదు.—రోమా. 14:19; 2 కొరిం. 6:3.

14. ప్రజల్ని యెహోవా చూసినట్లు చూడడానికి మీకేది సహాయం చేస్తుంది?

14 యెహోవా సేవకులమైన మనమంతా ఒక్కటే కాబట్టి, ఫలానా ప్రాంతం లేదా దేశం వేరేవాటికన్నా గొప్పవని మనం ఎప్పుడూ అనుకోకూడదు. కానీ మీరు పెరిగిన వాతావరణం, స్నేహితుల ప్రభావం వల్ల మీకు దేశాభిమానం ఉండవచ్చు. దాంతో ఇతర దేశాలకు, సంస్కృతులకు, భాషలకు లేదా జాతులకు చెందినవాళ్లను మీరు అప్పుడప్పుడూ చిన్నచూపు చూస్తుండవచ్చు. అయితే, అలాంటి ఆలోచనల్ని తీసేసుకోవడానికి మీకేది సహాయం చేస్తుంది? తమ దేశాన్ని చూసి గర్వపడేవాళ్లను లేదా ఇతరులకన్నా తామే గొప్పవాళ్లమని అనుకునేవాళ్లను యెహోవా ఎలా చూస్తాడో ఆలోచించండి. ఈ అంశం గురించి మీ వ్యక్తిగత అధ్యయనంలో లేదా కుటుంబ ఆరాధనలో పరిశోధన చేయండి. ఆ తర్వాత, ప్రజల్ని యెహోవా చూసినట్లు చూడడానికి సహాయం చేయమని ఆయనకు ప్రార్థించండి.—రోమీయులు 12:2 చదవండి.

యెహోవాకు నమ్మకంగా ఉండాలంటే, ఇతరులు ఏమి చేసినా మనం ఆయనకే లోబడాలి (15, 16 పేరాలు చూడండి)

15, 16. (ఎ) మనం భిన్నంగా ఉన్నందుకు కొంతమంది మనతో ఎలా ప్రవర్తిస్తారు? (బి) తమ పిల్లలు యెహోవాకు నమ్మకంగా ఉండేలా తల్లిదండ్రులు ఎలా సహాయం చేయవచ్చు?

15 మనం మంచి మనస్సాక్షితో యెహోవాను ఆరాధించాలని కోరుకుంటాం, కాబట్టి మనం తోటి ఉద్యోగస్థులకు, విద్యార్థులకు, పొరుగువాళ్లకు లేదా బంధువులకు భిన్నంగా ఉంటాం. (1 పేతు. 2:19) అలా ఉన్నందుకు ఇతరులు మనల్ని ద్వేషిస్తారని కూడా యేసు ముందే హెచ్చరించాడు. అయితే మనల్ని వ్యతిరేకించేవాళ్లలో చాలామందికి దేవుని రాజ్యం గురించి తెలీదు. అందుకే, మనం మానవ ప్రభుత్వాలకు కాకుండా దేవునిరాజ్యానికి ఎందుకు నమ్మకంగా ఉంటామో వాళ్లకు అర్థంకాదు.

16 మనం యెహోవాకు నమ్మకంగా ఉండాలంటే, ఇతరులు మనల్ని ఏమన్నా, ఏమి చేసినా ఆయనకే లోబడాలి. (దాని. 3:16-18) ముఖ్యంగా మన యౌవనులకు, తోటివాళ్లలా ప్రవర్తించకుండా ఉండడం కష్టం కావచ్చు. కాబట్టి తల్లిదండ్రులారా, స్కూల్లో ధైర్యంగా ఉండడానికి మీ పిల్లలకు సహాయం చేయండి. బహుశా మీ పిల్లలు జెండా వందనం లేదా దేశభక్తిని చూపే ఇతర ఆచారాలకు దూరంగా ఉండడానికి భయపడుతుండవచ్చు. ఇలాంటి వాటి విషయంలో యెహోవా అభిప్రాయం ఏమిటో మీ కుటుంబ ఆరాధనలో చర్చించండి. తమ నమ్మకాలను ఇతరులకు స్పష్టంగా, గౌరవంతో ఎలా చెప్పాలో మీ పిల్లలకు నేర్పించండి. (రోమా. 1:16) అవసరమైతే మీరు వాళ్ల టీచర్లను కలిసి మన నమ్మకాల గురించి వివరించవచ్చు.

యెహోవా సృష్టి అంతటినీ ఆనందించండి

17. మనం ఎలాంటి స్వభావాన్ని అలవర్చుకోకూడదు? ఎందుకు?

17 సాధారణంగా మనం నివసిస్తున్న దేశాన్ని, అక్కడి సంస్కృతిని, భాషను, ఆహారాన్ని ఇష్టపడతాం. అయితే “మాదే గొప్పది” అనే స్వభావాన్ని మాత్రం మనం అలవర్చుకోకూడదు. సృష్టిలో ఉన్న వైవిధ్యాలన్నిటినీ యెహోవా మన ఆనందం కోసమే తయారుచేశాడు. (కీర్త. 104:24; ప్రక. 4:10, 11) మరి అలాంటప్పుడు ఇలానే ఉండాలి, ఇలాగే చేయాలి అని పట్టుబట్టడం ఎందుకు?

18. ఇతరుల్ని యెహోవా చూసినట్లు చూడడంవల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం?

18 అన్ని జాతులవాళ్లు తన గురించి తెలుసుకుని తనను ఆరాధించాలనీ నిత్యజీవం పొందాలనీ యెహోవా కోరుకుంటున్నాడు. (యోహా. 3:16; 1 తిమో. 2:3, 4) కాబట్టి మన తోటివాళ్ల అభిప్రాయాలు కాస్త వేరుగా ఉన్నా వాటిని వినడానికీ, ఒప్పుకోవడానికీ మనం ఇష్టపడాలి. అప్పుడే మన జీవితం ఆసక్తికరంగా ఉంటుంది, తోటి సహోదరసహోదరీలతో కూడా ఐక్యంగా ఉంటాం. మనం యెహోవాకు, ఆయన రాజ్యానికి నమ్మకంగా ఉంటాం కాబట్టి ఈ లోక పోరాటాల్లో ఎవ్వరికీ మద్దతివ్వం. అంతేకాక సాతాను లోకంలోని గర్వానికి, పోటీ స్వభావానికి దూరంగా ఉంటాం. వినయంగా, సమాధానంగా ఉండడం నేర్పిస్తున్నందుకు మనం యెహోవాకు ఎంతో కృతజ్ఞులం. అందుకే కీర్తనకర్తలాగే మనం కూడా ఇలా భావిస్తాం: “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!”—కీర్త. 133:1.

a బహుశా, ఫిలిప్పీ సంఘంలోని కొంతమంది క్రైస్తవులకు ఓ విధమైన రోమా పౌరసత్వం ఉండివుంటుంది. దానివల్ల వాళ్లకు, మిగతా సహోదరసహోదరీలకన్నా ఎక్కువ హక్కులు ఉండేవి.

b అసలు పేర్లు కావు.