కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇది మన ఆరాధనా మందిరం

ఇది మన ఆరాధనా మందిరం

‘నీ ఇంటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది.’—యోహా. 2:17.

పాటలు: 13, 21

1, 2. (ఎ) గతంలో యెహోవా సేవకులు ఆయన్ను ఎక్కడ ఆరాధించారు? (బి) యెరూషలేములోని యెహోవా ఆలయం గురించి యేసు ఎలా భావించాడు? (సి) ఈ ఆర్టికల్‌లో ఏమి చర్చిస్తాం?

 దేవుని ప్రజలకు గతంలోనూ అలాగే ఇప్పుడూ ఆరాధనా స్థలాలు ఉన్నాయి. ఉదాహరణకు, హేబెలు యెహోవాకు బలులు అర్పించడానికి ఓ బలిపీఠాన్ని కట్టివుంటాడు. (ఆది. 4:3, 4) నోవహు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, మోషే వంటివాళ్లు కూడా బలిపీఠాల్ని కట్టారు. (ఆది. 8:20; 12:7; 26:25; 35:1; నిర్గ. 17:15) ఇశ్రాయేలీయులు యెహోవా నిర్దేశం ప్రకారం ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించారు. (నిర్గ. 25:8) తర్వాత, యెహోవాను ఆరాధించడానికి వాళ్లు ఓ ఆలయాన్ని నిర్మించారు. (1 రాజు. 8:27, 29) బబులోను చెర నుండి తిరిగొచ్చిన తర్వాత యూదులు సమాజమందిరాల్లో క్రమంగా కలుసుకునేవాళ్లు. (మార్కు 6:2; యోహా. 18:20; అపొ. 15:21) మొదటి శతాబ్దంలోనైతే, క్రైస్తవులు తోటి సహోదరుల ఇళ్లల్లో సమకూడేవాళ్లు. (అపొ. 12:12; 1 కొరిం. 16:19) నేడు యెహోవా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది రాజ్యమందిరాల్లో కలుసుకుని ఆయన గురించి నేర్చుకుంటున్నారు, ఆయన్ను ఆరాధిస్తున్నారు.

2 యెరూషలేములోని యెహోవా ఆలయమంటే యేసుకు ఎంతో గౌరవం. ఆలయం మీద ఆయనకున్న ప్రేమను గమనించిన శిష్యులకు, “నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది” అని కీర్తనకర్త రాసిన మాటలు గుర్తొచ్చాయి. (కీర్త. 69:9; యోహా. 2:17) అయితే అప్పటి యెరూషలేము ఆలయాన్ని పిలిచినట్లుగా, ఇప్పుడున్న ఏ రాజ్యమందిరాన్నీ దేవుని ఇల్లు అని పిలవలేము. (2 దిన. 5:13; 33:4) అయినప్పటికీ మనం అక్కడ యెహోవాను ఆరాధిస్తాం కాబట్టి వాటిపట్ల గౌరవం చూపించాలి. కాబట్టి మనం రాజ్యమందిరంలో ఎలా ఉండాలో, దాన్ని సరైన స్థితిలో ఎలా ఉంచాలో, రాజ్యమందిరాల నిర్మాణానికి ఎలా సహాయం చేయాలో తెలియజేసే బైబిలు సూత్రాలను ఈ ఆర్టికల్‌లో చర్చిద్దాం. a

కూటాల పట్ల గౌరవం చూపించండి

3-5. మనం రాజ్యమందిరాల్లో ఎందుకు కలుసుకుంటాం? మీటింగ్స్‌ విషయంలో మన అభిప్రాయం ఎలా ఉండాలి?

3 యెహోవాను ఆరాధించడానికి ప్రజలు రాజ్యమందిరాల్లోనే కలుసుకుంటారు. కూటాలు యెహోవా ఇచ్చిన ఓ బహుమతి, మనం ఆయనకు మరింత దగ్గరవ్వడానికి అవి సహాయం చేస్తాయి. ఆయన తన సంస్థ ద్వారా ఇస్తున్న ప్రోత్సాహాన్ని, మార్గనిర్దేశాన్ని మనం కూటాల్లోనే పొందుతాం. యెహోవా, ఆయన కుమారుడు ఇస్తున్న ఆహ్వానాన్ని అంగీకరించి మనం కూటాలకు వస్తున్నాం. ప్రతీవారం యెహోవా ‘బల్ల వద్ద’ భోజనం చేయడం మనకు దొరికిన గొప్ప గౌరవం. దాన్ని మనం ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు.—1 కొరిం. 10:21.

4 మనం మీటింగ్స్‌కు వచ్చి తనను ఆరాధించాలని, ఒకరినొకరం ప్రోత్సహించుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. (హెబ్రీయులు 10:24, 25 చదవండి.) మనకు యెహోవాపై గౌరవం ఉంది కాబట్టి, చిన్నచిన్న కారణాల వల్ల మీటింగ్స్‌ మానేయం. బాగా సిద్ధపడి, చక్కని కామెంట్స్‌ ఇచ్చినప్పుడు మనకు వాటిపట్ల కృతజ్ఞత ఉందని చూపిస్తాం.—కీర్త. 22:22.

5 మనం రాజ్యమందిరంలో ఎలా ఉంటున్నాం, దాన్ని ఎంత శుభ్రంగా ఉంచుతున్నాం అనే దాన్నిబట్టి మనకు యెహోవామీద ఎంత గౌరవముందో తెలుస్తుంది. రాజ్యమందిరం బయట కనిపించే యెహోవా పేరుకు ఘనత వచ్చేలా మనం ప్రవర్తించాలి.—1 రాజులు 8:17తో పోల్చండి.

6. రాజ్యమందిరాల్ని, కూటాలకు హాజరైనవాళ్లను చూసి కొంతమంది ఏమని మెచ్చుకున్నారు? (ప్రారంభ చిత్రం చూడండి.)

6 రాజ్యమందిరాల పట్ల మనం చూపించే గౌరవాన్ని ఇతరులు గమనిస్తారు. ఉదాహరణకు టర్కీలోని ఒకాయన ఇలా అన్నాడు, ‘రాజ్యమందిరంలోని శుభ్రత, అంతా పద్ధతిగా జరగడం నాకెంతో నచ్చింది. అక్కడున్న వాళ్లంతా హుందాగా బట్టలేసుకున్నారు, ప్రతీ ఒక్కరూ చిరునవ్వు చిందిస్తున్నారు. వాళ్లు నన్ను ఆప్యాయంగా పలకరించారు. అది నన్నెంతో ఆకట్టుకుంది.’ ఆయన క్రమంగా కూటాలకు వస్తూ, కొంతకాలానికే బాప్తిస్మం తీసుకున్నాడు. ఇండోనేషియాలోని ఓ నగరంలో, సహోదరులు తమ కొత్త రాజ్యమందిరాన్ని చూడడానికి రమ్మని పొరుగువాళ్లను, నగర మేయర్‌ను, ఇతర అధికారుల్ని ఆహ్వానించారు. ఆ రాజ్యమందిరాన్ని కట్టిన విధానాన్ని, దాని డిజైన్‌ని, అందమైన తోటని చూసి ముగ్ధుడైన మేయర్‌ ఇలా అన్నాడు, “మీరు ఈ హాలును శుభ్రంగా ఉంచడం చూస్తుంటే, మీ విశ్వాసం నిజమైనదని అర్థమౌతుంది.”

దేవునిమీద మనకు గౌరవం ఉందో లేదో మన ప్రవర్తన చూపిస్తుంది (7, 8 పేరాలు చూడండి)

7, 8. రాజ్యమందిరంలో ఉన్నప్పుడు మనం యెహోవా మీద ఎలా గౌరవం చూపించవచ్చు?

7 మీటింగ్స్‌కు రమ్మని మనల్ని ఆహ్వానిస్తున్న యెహోవామీద మనకు గౌరవం ఉంది. అందుకే మీటింగ్స్‌కి ఎలా తయారై వస్తున్నామో, అక్కడ ఎలా ప్రవర్తిస్తున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే మనం మరీ అతిగా ప్రవర్తించం, అంటే మీటింగ్స్‌లో ఇలాగే ఉండాలన్నట్లు సీరియస్‌గా ఉండం లేదా ఇంట్లో ఉన్నట్లుగా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించం. నిజమే మనమూ, మనం ఆహ్వానించే ఇతరులూ రాజ్యమందిరంలో ఏ ఇబ్బందిపడకుండా కూటాలు వినాలని యెహోవా కోరుకుంటున్నాడు. అయితే మనం ఏ విధంగానూ మీటింగ్స్‌ విషయంలో అగౌరవం చూపించకుండా జాగ్రత్తపడాలి. అందుకే మనం అపరిశుభ్రంగా అమర్యాదగా ఉండే బట్టలు వేసుకోం, లేదా మీటింగ్స్‌ మధ్యలో ఫోన్లో మెసేజ్‌లు పంపించడం, మాట్లాడడం, తినడం-తాగడం లాంటివి చేయం. అంతేకాదు, రాజ్యమందిరంలో పరుగెత్తకూడదని, ఆడుకోకూడదని తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించాలి.—ప్రసం. 3:1.

8 దేవాలయంలో వ్యాపారం చేస్తున్న కొంతమందిని చూసినప్పుడు, యేసు వాళ్లను కోపపడి అక్కడినుండి వెళ్లగొట్టాడు. (యోహా. 2:13-17) అలాగే రాజ్యమందిరాల్లో మనం యెహోవాను ఆరాధిస్తాం, ఆయన గురించి నేర్చుకుంటాం కాబట్టి, అక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడం సరికాదు.—నెహెమ్యా 13:7, 8తో పోల్చండి.

రాజ్యమందిరాల నిర్మాణానికి సహాయం చేయండి

9, 10. (ఎ) యెహోవా ప్రజలు రాజ్యమందిరాల్ని ఎలా నిర్మించగలుగుతున్నారు? దాని ఫలితం ఏమిటి? (బి) రాజ్యమందిరాల్ని సొంతంగా నిర్మించుకోలేని సంఘాలు ఎలా ప్రయోజనం పొందాయి?

9 ప్రపంచవ్యాప్తంగా యెహోవా ప్రజలు రాజ్యమందిరాల నిర్మాణంలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. రాజ్యమందిరాల నమూనాలు గీయడం, వాటిని నిర్మించడం, పాతవాటికి మెరుగులు దిద్దడం వంటి పనులన్నీ స్వచ్ఛంద సేవకులే చేస్తున్నారు. అందువల్ల 1999 నవంబరు 1 నుండి ప్రపంచవ్యాప్తంగా 28,000 కన్నా ఎక్కువ రాజ్యమందిరాల్ని కట్టగలిగాం. అంటే గడిచిన 15 సంవత్సరాల్లో మనం సగటున రోజుకు ఐదు అందమైన రాజ్యమందిరాల్ని నిర్మించగలిగాం.

10 యెహోవా సంస్థ, అవసరం ఉన్న ప్రాంతాల్లో స్వచ్ఛంద సేవకుల సహాయంతో, విరాళాల ద్వారా రాజ్యమందిరాల్ని నిర్మిస్తోంది. డబ్బున్నవాళ్లు, అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయవచ్చనే బైబిలు సూత్రాన్ని మనం పాటిస్తాం. (2 కొరింథీయులు 8:13-15 చదవండి.) దానివల్ల రాజ్యమందిరాల్ని సొంతంగా నిర్మించుకోలేని సంఘాల కోసం అందమైన రాజ్యమందిరాల్ని నిర్మించగలిగాం.

11. తమ కొత్త రాజ్యమందిరం గురించి కొంతమంది సహోదరులు ఏమన్నారు? అలాంటి మాటలు విన్నప్పుడు మీకెలా అనిపిస్తుంది?

11 కోస్టరికాలో ఉన్న ఓ సంఘంలోని సహోదరులు ఇలా రాశారు: “మా కొత్త రాజ్యమందిరం బయట నిలబడినప్పుడు మాకు అదంతా కలలా అనిపించింది! మా కళ్లను మేమే నమ్మలేకపోయాం. కేవలం 8 రోజుల్లోనే మా అందమైన రాజ్యమందిరం నిర్మాణ పనంతా అయిపోయింది. యెహోవా ఆశీర్వాదం, ఆయన సంస్థ చేసిన ఏర్పాట్లు, సహోదరులు ఇచ్చిన మద్దతు వల్లే అది సాధ్యమైంది. ఈ రాజ్యమందిరం నిజంగా యెహోవా మాకిచ్చిన ఓ విలువైన బహుమతి. మాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది.” రాజ్యమందిరాన్ని ఇచ్చినందుకు సహోదరసహోదరీలు యెహోవాకు అలా కృతజ్ఞతలు చెప్పడం విన్నప్పుడు మనం ఎంతో ఆనందిస్తాం. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవా ప్రజలకు సొంత రాజ్యమందిరాలు ఉన్నందుకు కూడా మనమెంతో సంతోషిస్తున్నాం. రాజ్యమందిరాల నిర్మాణం పూర్తైన వెంటనే, చాలామంది కొత్తవాళ్లు యెహోవా గురించి నేర్చుకోవడానికి మీటింగ్స్‌కు రావడం మొదలుపెడతారు. దీన్నిబట్టి, రాజ్యమందిరాల నిర్మాణంపై యెహోవా ఆశీర్వాదం ఉందని స్పష్టమౌతుంది.—కీర్త. 127:1.

12. రాజ్యమందిరాల నిర్మాణానికి మీరెలా సహాయం చేయవచ్చు?

12 రాజ్యమందిరాల నిర్మాణానికి మీరు ఎలా సహాయం చేయవచ్చు? వీలైతే వాటిని నిర్మించే పనిలో స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. దానితోపాటు వాటి నిర్మాణానికి అవసరమైన విరాళాలు కూడా ఇవ్వవచ్చు. ఆ పనికి మద్దతుగా మనం చేయగలిగినదంతా చేసినప్పుడు, ఇవ్వడం వల్ల వచ్చే ఆనందాన్ని ఆస్వాదిస్తాం, మరిముఖ్యంగా యెహోవాను ఘనపరుస్తాం. అలా మనం, ఆరాధనా స్థలాల నిర్మాణానికి ఉత్సాహంగా విరాళమిచ్చిన ప్రాచీన కాలంలోని దేవుని సేవకుల్ని అనుకరిస్తాం.—నిర్గ. 25:2; 2 కొరిం. 9:7.

మన రాజ్యమందిరాన్ని శుభ్రంగా ఉంచుకుందాం

13, 14. మన రాజ్యమందిరాన్ని ఎందుకు పరిశుభ్రంగా ఉంచుకోవాలో చూపించే బైబిలు సూత్రాలను వివరించండి.

13 మనం ఆరాధించే దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు. అన్నీ పద్ధతి ప్రకారం జరగాలని ఆయన కోరుకుంటాడు. అందుకే మన రాజ్యమందిరాన్ని పరిశుభ్రంగా, చక్కగా ఉంచుకోవాలి. (1 కొరింథీయులు 14:33, 39-40 చదవండి.) మనం యెహోవాలా పరిశుద్ధంగా ఉండాలంటే మన ఆరాధనను, ఆలోచనల్ని, పనుల్ని పవిత్రంగా ఉంచుకోవడంతోపాటు మన శరీరాల్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.—ప్రక. 19:8.

14 మన రాజ్యమందిరాన్ని శుభ్రంగా, చక్కగా ఉంచుకుంటే ఇతరుల్ని మీటింగ్స్‌కి ఆహ్వానించడానికి ఏమాత్రం వెనకాడం. వాళ్లు మన రాజ్యమందిరానికి వచ్చినప్పుడు, పరిశుభ్రమైన కొత్తలోకం గురించి మనం ప్రకటిస్తున్న సువార్త ప్రకారం జీవిస్తున్నామని తెలుసుకుంటారు. అంతేకాదు, మనం ఆరాధించే దేవుడు పవిత్రుడనీ పరిశుద్ధుడనీ, ఆయన త్వరలోనే భూమిని అందమైన పరదైసుగా మారుస్తాడని వాళ్లు అర్థం చేసుకుంటారు.—యెష. 6:1-3; ప్రక. 11:18.

15, 16. (ఎ) శుభ్రత విషయంలో ప్రజలకు వేర్వేరు అభిప్రాయాలు ఎందుకు ఉంటాయి? రాజ్యమందిరాన్ని ఎందుకు శుభ్రంగా ఉంచుకోవాలి? (బి) క్లీనింగ్‌ కోసం మీ సంఘంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మనందరికీ ఏ గొప్ప అవకాశం ఉంది?

15 పరిశుభ్రత విషయంలో ప్రజలకు వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి. ఎందుకు? వాళ్లు పెరిగిన వాతావరణం అందుకు ఓ కారణం కావచ్చు. వాళ్లు ఉంటున్న ప్రాంతాల్లో దుమ్ము లేదా మట్టిరోడ్లు ఎక్కువగా ఉండవచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో నీళ్లుగానీ, శుభ్రం చేసే సామాగ్రిగానీ సరిపడా ఉండకపోవచ్చు. అయితే మనం ఏ ప్రాంతంలో ఉన్నా, అక్కడున్న ప్రజలకు శుభ్రత విషయంలో ఎలాంటి అభిప్రాయం ఉన్నా, మనం మాత్రం రాజ్యమందిరాన్ని పరిశుభ్రంగా, పద్ధతిగా ఉంచుకోవాలి. ఎందుకంటే, అది యెహోవాను ఆరాధించే స్థలం.—ద్వితీ. 23:14.

16 మన రాజ్యమందిరాన్ని వీలైనంత పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే మనం ఆ పనిని ఓ పద్ధతి ప్రకారం చేయాలి. సంఘపెద్దలు అందుకోసం ఓ పట్టికను తయారుచేయాలి, సరిపడా క్లీనింగ్‌ సామాగ్రి ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆ పని సరిగ్గా జరుగుతుందో లేదో చూసుకోవాలి. కొన్నిటిని ప్రతీ మీటింగ్‌ తర్వాత శుభ్రం చేయాల్సివుంటుంది, మరికొన్నిటిని అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. ఏదేమైనా, రాజ్యమందిరాన్ని శుభ్రం చేసే పనిలో సాయం చేసే గొప్ప అవకాశం మనందరికీ ఉంది.

రాజ్యమందిరాన్ని సరైన స్థితిలో ఉంచండి

17, 18. (ఎ) గతంలో యెహోవా ప్రజలు ఆలయాన్ని చూసుకున్న విధానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (బి) మనం రాజ్యమందిరాన్ని ఎందుకు సరైన స్థితిలో ఉంచాలి?

17 రాజ్యమందిరాన్ని సరైన స్థితిలో ఉంచడానికి అప్పుడప్పుడూ కొన్ని రిపేర్లు కూడా చేయించాల్సి ఉంటుంది. గతంలో కూడా యెహోవా ప్రజలు అదే చేశారు. ఉదాహరణకు, యూదా రాజైన యోవాషు కాలంలో ప్రజలు ఆలయం కోసం విరాళాలు ఇచ్చారు. వాటితో ఆలయానికి మరమ్మతులు చేయించమని ఆయన యాజకులకు ఆజ్ఞాపించాడు. (2 రాజు. 12:4, 5) సుమారు 200 సంవత్సరాల తర్వాత, రాజైన యోషీయా కూడా విరాళాల సహాయంతో ఆలయానికి మరమ్మతులు చేయించాడు.—2 దినవృత్తాంతములు 34:9-11 చదవండి.

18 ఇళ్లను లేదా వస్తువుల్ని శుభ్రంగా, సరైన స్థితిలో ఉంచడాన్ని తమ దేశ ప్రజలు పెద్దగా పట్టించుకోరని కొన్ని బ్రాంచి కమిటీలు చెప్పాయి. బహుశా అక్కడ చాలామందికి, శుభ్రంగా ఎలా ఉంచుకోవాలో తెలియకపోవడమో సరిపడా డబ్బు లేకపోవడమో అందుకు కారణం కావచ్చు. అయితే రాజ్యమందిరాల విషయానికొస్తే, అవసరమైనప్పుడు వాటిని రిపేరు చేయించకపోతే అవి తొందరగా పాడయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు, రాజ్యమందిరం సరిగ్గా లేకపోతే ప్రజలకు మనమీద మంచి అభిప్రాయం కలుగదు. అలాకాకుండా, రాజ్యమందిరాన్ని సరైన స్థితిలో ఉంచడానికి మనం చేయగలిగినదంతా చేసినప్పుడు యెహోవా నామానికి ఘనత తీసుకొస్తాం. మన సహోదరసహోదరీలు ఇచ్చిన విరాళాలు కూడా వృథా అవ్వకుండా ఉంటాయి.

మన రాజ్యమందిరాన్ని శుభ్రంగా, సరైన స్థితిలో ఉంచుకోవాలి (16, 18 పేరాలు చూడండి)

19. రాజ్యమందిరం పట్ల గౌరవం ఉందని మీరెలా చూపిస్తారు?

19 రాజ్యమందిరం ఏ మనిషికో లేదా సంఘానికో చెందింది కాదు, అది యెహోవాకు సమర్పించబడిన ఆరాధనా స్థలం. మనం ఈ ఆర్టికల్‌లో చూసినట్లు, యెహోవా ఆరాధన జరిగే ఈ మందిరాన్ని ఎలా చూసుకోవాలో తెలియజేసే సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. మనం యెహోవాను గౌరవిస్తాం కాబట్టి మీటింగ్స్‌ విషయంలో, రాజ్యమందిరం విషయంలో గౌరవం చూపిస్తాం. అందుకే రాజ్యమందిరాల నిర్మాణానికి సంతోషంగా విరాళాలిస్తాం. అంతేకాదు వాటిని పరిశుభ్రంగా, సరైన స్థితిలో ఉంచడానికి కష్టపడి పనిచేస్తాం. అప్పుడే, యెహోవా మందిరం పట్ల యేసులా మనకు కూడా ఆసక్తి ఉందని చూపిస్తాం.—యోహా. 2:17.

a ఈ ఆర్టికల్‌ ముఖ్యంగా రాజ్యమందిరాల గురించే మాట్లాడుతున్నా, ఇందులోని విషయాలు అసెంబ్లీ హాళ్లకు, ఇతర ఆరాధనా స్థలాలకు కూడా వర్తిస్తాయి.