కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ చివరిరోజుల్లో చెడు స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి

ఈ చివరిరోజుల్లో చెడు స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి

“చెడు సహవాసం మంచి ప్రవర్తనను చెడగొడుతుంది.”1 కొరిం. 15:33, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

పాటలు: 25, 20

1. మనం ఇప్పుడు ఎలాంటి కాలంలో జీవిస్తున్నాం?

 నేడు మనం ‘అపాయకరమైన కాలాల్లో’ జీవిస్తున్నాం. 1914⁠లో ‘అంత్యదినాలు’ మొదలైనప్పటి నుండి లోక పరిస్థితులు అంతకంతకూ ఘోరంగా తయారౌతున్నాయి. (2 తిమో. 3:1-5) అవి ముందుముందు ఇంకా దిగజారిపోతాయని మనకు తెలుసు. ఎందుకంటే, ‘దుర్మార్గులు వంచకులు అంతకంతకు చెడిపోతూ ఉంటారు’ అని బైబిలు ముందే చెప్పింది.—2 తిమో. 3:13, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

2. చాలామంది ప్రజలు ఎలాంటి వినోదాన్ని ఇష్టపడుతున్నారు? (ప్రారంభ చిత్రం చూడండి.)

2 నేడు చాలామంది ప్రజలు వినోదం కోసం హింస, అనైతికత లేదా మంత్రాలకు-దయ్యాలకు సంబంధించిన కార్యక్రమాలు చూస్తున్నారు లేదా అలాంటి పనులు చేస్తున్నారు. ఇంటర్నెట్‌, టీవీ కార్యక్రమాలు, సినిమాలు, పుస్తకాలు, పత్రికలు తరచూ హింస, అనైతికత వంటివి తప్పు కావన్నట్లు చూపిస్తున్నాయి. ఒకప్పుడు అసహ్యించుకున్న కొన్ని పనుల్ని ప్రజలు ఇప్పుడు తప్పు కావన్నట్లు చూస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో అయితే వాటిని చట్టబద్ధం చేశారు కూడా. కానీ యెహోవా అలాంటి ప్రవర్తనను ఇష్టపడడు.—రోమీయులు 1:28-32 చదవండి.

3. దేవుని ప్రమాణాల ప్రకారం జీవించేవాళ్లను ప్రజలు ఎలా చూస్తారు?

3 మొదటి శతాబ్దంలోని ప్రజలు కూడా హింస, అనైతికత ఉన్న వినోదాన్ని ఇష్టపడ్డారు. కానీ యేసు శిష్యులు దేవుని ప్రమాణాల ప్రకారం జీవించారు కాబట్టి అలాంటి వినోదానికి దూరంగా ఉన్నారు. వాళ్లను చూసి చుట్టూ ఉన్న ప్రజలు ‘ఆశ్చర్యపోయారు.’ దానివల్ల ప్రజలు క్రైస్తవుల్ని ఎగతాళి చేసి హింసించారు. (1 పేతు. 4:4) నేడు కూడా దేవుని ప్రమాణాల ప్రకారం జీవిస్తున్నవాళ్లను ప్రజలు వింతగా చూస్తున్నారు. నిజానికి, యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడిచేవాళ్లు ‘హింస పొందుతారు’ అని బైబిలు చెప్తుంది.—2 తిమో. 3:12.

“చెడు సహవాసం మంచి ప్రవర్తనను చెడగొడుతుంది”

4. మనం లోకాన్ని ఎందుకు ప్రేమించకూడదు?

4 మనం దేవుని చిత్తం చేయాలని కోరుకుంటే, ‘లోకాన్ని, లోకంలో ఉన్నవాటిని’ ప్రేమించకూడదు. (1 యోహాను 2:15, 16 చదవండి.) లోకం ‘ఈ యుగ సంబంధ దేవతైన’ సాతాను గుప్పిట్లో ఉంది. అతను లోకంలోని మతాలను, ప్రభుత్వాలను, వ్యాపార సంస్థలను, ప్రసార మాధ్యమాలను ఉపయోగించి ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నాడు. (2 కొరిం. 4:4; 1 యోహా. 5:19) ఈ లోక ప్రభావం మనమీద పడకూడదంటే మనం చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. బైబిలు స్పష్టంగా ఇలా హెచ్చరిస్తుంది, ‘మోసపోకండి, చెడు సహవాసం మంచి ప్రవర్తనను చెడగొడుతుంది.’—1 కొరిం. 15:33, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

5, 6. మనం ఎవరితో స్నేహం చేయకూడదు? ఎందుకు?

5 యెహోవాతో మన స్నేహాన్ని కాపాడుకోవాలంటే, చెడ్డ పనులు చేసేవాళ్లతో స్నేహం చేయకూడదు. అంతేకాదు, యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూనే ఆయన ఆజ్ఞలకు లోబడని ప్రజలతో కూడా స్నేహం చేయకూడదు. అలాంటివాళ్లు ఏదైనా పెద్ద తప్పు చేసి, పశ్చాత్తాపపడకపోతే మనం వాళ్లకు దూరంగా ఉండాలి.—రోమా. 16:17, 18.

6 సాధారణంగా ప్రజలు, తమ స్నేహితులకు నచ్చింది చేస్తూ వాళ్లను సంతోషపెట్టాలని కోరుకుంటారు. ఒకవేళ మనం దేవుని మాట విననివాళ్లతో స్నేహం చేస్తే, మనం కూడా వాళ్లలా ప్రవర్తించాలని కోరుకోవచ్చు. ఉదాహరణకు, నైతికంగా దిగజారిపోయిన వాళ్లతో స్నేహం చేస్తే మనం కూడా వాళ్లలాగే తయారవ్వచ్చు. మన సహోదరసహోదరీల్లో కొంతమందికి అలాగే జరిగింది. వాళ్లలో పశ్చాత్తాపపడనివాళ్లను సంఘం నుండి బహిష్కరించారు. (1 కొరిం. 5:11-13) అప్పటికీ పశ్చాత్తాపం చూపించకపోతే వాళ్ల పరిస్థితి పేతురు వర్ణించినట్లుగానే ఉంటుంది.—2 పేతురు 2:20-22 చదవండి.

7. మనం ఎలాంటి వాళ్లతో స్నేహం చేయాలి?

7 మనం అందరితో స్నేహంగా ఉండాలని కోరుకున్నా, దేవునికి లోబడని వాళ్లతో మాత్రం స్నేహం చేయకూడదు. కాబట్టి పెళ్లికాని ఓ సహోదరుడు లేదా సహోదరి, యెహోవాను ఆరాధించని వ్యక్తిని, ఆయన ప్రమాణాల పట్ల గౌరవం లేని వ్యక్తిని ప్రేమించడం తప్పు. యెహోవామీద ప్రేమ లేనివాళ్లను సంతోషపెట్టడంకన్నా ఆయన్ను సంతోషపెట్టడమే చాలా ప్రాముఖ్యం. దేవుని చిత్తం చేసేవాళ్లతో మాత్రమే మనం స్నేహం చేయాలి. ‘దేవుని చిత్తం చొప్పున జరిగించేవాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి’ అని యేసు చెప్పాడు.—మార్కు 3:35.

8. చెడు స్నేహాలవల్ల ఇశ్రాయేలీయులకు ఏమి జరిగింది?

8 చెడు స్నేహాలు చాలా ప్రమాదకరం. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులకు ఏమి జరిగిందో పరిశీలించండి. వాళ్లు వాగ్దాన దేశంలోకి వెళ్లేముందు యెహోవా అక్కడ ఉండే ప్రజల గురించి ఇలా హెచ్చరించాడు, “వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు; వారి క్రియలవంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలముచేసి, వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను.” (నిర్గ. 23:24, 25) కానీ ఇశ్రాయేలీయుల్లో చాలామంది దేవుని మాటను పట్టించుకోలేదు, ఆయనకు ఏమాత్రం నమ్మకంగా ఉండలేదు. (కీర్త. 106:35-39) దాని ఫలితం? యెహోవా ఇశ్రాయేలీయుల్ని తిరస్కరించి కొత్తగా ఏర్పడిన క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు.—మత్త. 23:38; అపొ. 2:1-4.

మీరు చదివేవాటిని, చూసేవాటిని జాగ్రత్తగా ఎంచుకోండి

9. ఈ లోకంలోని ప్రచార మాధ్యమాలు ఎందుకు ప్రమాదకరమైనవి?

9 ఈ లోకంలోని చాలా ప్రచార మాధ్యమాలు అంటే టీవీ కార్యక్రమాలు, వెబ్‌సైట్‌లు, పుస్తకాలు యెహోవాతో మనకున్న స్నేహాన్ని పాడుచేయగలవు. క్రైస్తవులు యెహోవాపై, ఆయన వాగ్దానాలపై విశ్వాసం ఉంచడానికి అవి ఏమాత్రం సహాయం చేయవు. బదులుగా అవి సాతాను లోకంపై నమ్మకముంచేలా ప్రజల్ని ప్రోత్సహిస్తాయి. కాబట్టి ‘లోక సంబంధమైన దురాశలను’ పుట్టించే వేటినీ చూడకుండా, చదవకుండా, వినకుండా మనం జాగ్రత్తపడాలి.—తీతు 2:12.

10. ఈ లోక ప్రచార మాధ్యమాలు చివరికి ఏమౌతాయి?

10 త్వరలోనే సాతాను లోకం, దాని ప్రచార మాధ్యమాలు నాశనమౌతాయి. బైబిలు ఇలా చెప్తుంది, “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.” (1 యోహా. 2:17) అలాగే కీర్తనకర్త ఇలా పాడాడు, ‘కీడు చేసేవాళ్లు నిర్మూలం అవుతారు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు బహు క్షేమము కలిగి సుఖిస్తారు.’ అలా ఎంతకాలం జీవిస్తారు? ‘నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు వాళ్లు దానిలో నిత్యం నివసిస్తారు.’—కీర్త. 37:9, 11, 29.

11. మనం తనకు నమ్మకంగా ఉండేలా యెహోవా ఏయే విధాలుగా సహాయం చేస్తున్నాడు?

11 అయితే యెహోవా సంస్థ మాత్రం, నిత్యజీవం పొందేలా జీవించమని మనల్ని ప్రోత్సహిస్తుంది. యేసు ఇలా ప్రార్థించాడు, “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహా. 17:3) యెహోవా తన సంస్థ ద్వారా ఎన్నో విషయాలు తెలియజేస్తూ మనం తన గురించి తెలుసుకునేలా సహాయం చేస్తున్నాడు. ఉదాహరణకు, దేవుని సేవలో కొనసాగడానికి మనకు సహాయం చేసే ఎన్నో పత్రికలు, బ్రోషుర్‌లు, పుస్తకాలు, వీడియోలు, ఇంటర్నెట్‌ సమాచారం అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా 1,10,000కు పైగా ఉన్న సంఘాల్లో క్రమంగా మీటింగ్స్‌ జరిగేలా కూడా సంస్థ ఏర్పాటు చేసింది. మీటింగ్స్‌లో, సమావేశాల్లో మనం నేర్చుకునే విషయాలు యెహోవాపై, ఆయన వాగ్దానాలపై మన విశ్వాసాన్ని బలపరుస్తాయి.—హెబ్రీ. 10:24, 25.

‘ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలి’

12. ‘ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలి’ అంటే అర్థమేమిటి?

12 ఎవర్ని పెళ్లి చేసుకోవాలనే విషయంలో క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యమిలా చెప్తుంది, “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?” (2 కొరిం. 6:14) ‘ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలి’ అని బైబిలు చెప్తుంది. అంటే యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకుని, ఆయన ప్రమాణాల ప్రకారం జీవిస్తున్నవాళ్లను మాత్రమే పెళ్లి చేసుకోవాలి. (1 కొరిం. 7:39) యెహోవాను ప్రేమించేవాళ్లను పెళ్లిచేసుకుంటే, దేవునికి నమ్మకంగా ఉండేందుకు వాళ్లు మీకు సహాయం చేస్తారు.

13. పెళ్లి విషయంలో యెహోవా ఇశ్రాయేలీయులకు ఏమని ఆజ్ఞాపించాడు?

13 మనకేది మంచిదో యెహోవాకు తెలుసు, అందుకే ‘ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలి’ అనే ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఆ ఆజ్ఞ కొత్తదేమీ కాదు. తనను ఆరాధించని ప్రజల గురించి యెహోవా ఇశ్రాయేలీయులకు ఏమి ఆజ్ఞాపించాడో గమనించండి. “నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు; అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును.”—ద్వితీ. 7:3, 4

14, 15. యెహోవా ఆజ్ఞను పట్టించుకోకపోవడం వల్ల సొలొమోనుకు ఏమి జరిగింది?

14 సొలొమోను రాజైనప్పుడు, ఇశ్రాయేలీయుల్ని పరిపాలించడానికి జ్ఞానాన్ని ఇవ్వమని యెహోవాకు ప్రార్థించాడు. యెహోవా ఆయన ప్రార్థనకు జవాబిచ్చాడు. దాంతో సొలొమోను, వృద్ధి చెందుతున్న ఆ జనాంగాన్ని చక్కగా పరిపాలిస్తూ, జ్ఞానంగల రాజుగా పేరుగాంచాడు. ఆయన జ్ఞానం చూసి ముగ్ధురాలైన షేబదేశపు రాణి ఇలా చెప్పింది, “నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినినదానిని బహుగా మించియున్నవి.” (1 రాజు. 10:7) అయితే సొలొమోను జీవితం మనకు ఓ హెచ్చరికగా కూడా ఉంది. దేవుని ఆజ్ఞను లెక్కచేయకుండా అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే ఏమి జరుగుతుందో ఆయన ఉదాహరణ నేర్పిస్తుంది.—ప్రసం. 4:13.

15 యెహోవా తన కోసం ఎంత చేసినా, సొలొమోను మాత్రం ఆయనిచ్చిన ఆజ్ఞను లెక్కచేయలేదు. సొలొమోను యెహోవాను ఆరాధించని “అనేకమంది పరస్త్రీలను మోహించి” చివరకు 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగివున్నాడు. ఫలితం? సొలొమోనుకు వయసు పైబడినప్పుడు ‘అతని భార్యలు అతని హృదయాన్ని ఇతర దేవతలతట్టు తిప్పారు. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు.’ (1 రాజు. 11:1-6) చెడ్డవాళ్లతో సహవాసం చేయడం వల్ల ఆయన యెహోవాను ఆరాధించడం మానేశాడు. సొలొమోనుకే అలా జరిగిందంటే మనలో ఎవ్వరికైనా జరగవచ్చు. అందుకే, యెహోవాను ప్రేమించని వ్యక్తిని పెళ్లిచేసుకోవాలని మనం కలలో కూడా అనుకోం.

16. అవిశ్వాసియైన భర్త/భార్య ఉన్నవాళ్లకు బైబిలు ఏ సలహా ఇస్తుంది?

16 అవిశ్వాసియైన భర్త/భార్య ఉన్నవాళ్ల విషయమేమిటి? బైబిలు వాళ్లకిలా చెప్తుంది, “స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.” (1 పేతు. 3:1, 2) ఈ మాటలు అవిశ్వాసియైన భార్య ఉన్న భర్తకు కూడా వర్తిస్తాయి. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్నట్లు, మంచి భర్తగా లేదా భార్యగా ఉంటూ దేవుడిచ్చిన ప్రమాణాలను పాటించండి. అలాచేస్తే మీప్రవర్తనలో వచ్చిన మంచి మార్పును గమనించి అవిశ్వాసియైన మీ భర్త/భార్య యెహోవాను ఆరాధించాలని కోరుకోవచ్చు. చాలామంది దంపతులకు ఇలాంటి అనుభవాలే ఉన్నాయి.

యెహోవాను ప్రేమించేవాళ్లతో స్నేహం చేయండి

17, 18. జలప్రళయాన్ని తప్పించుకోవడానికి నోవహుకు ఏమి సహాయం చేసింది? మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఎలా యెరూషలేము నాశనాన్ని తప్పించుకోగలిగారు?

17 చెడు స్నేహితులు, మీరు యెహోవా దేవునికి అవిధేయులయ్యేలా చేస్తారు, కానీ మంచి స్నేహితులు మాత్రం మీరు ఆయనకు నమ్మకంగా ఉండేందుకు సహాయం చేస్తారు. నోవహు ఉదాహరణ పరిశీలించండి. ఆయన కాలంలో భూమ్మీద చెడుతనం ఎంత ఎక్కువైపోయిందంటే యెహోవా ఇలా అన్నాడు, “వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డది.” (ఆది. 6:5) కాబట్టి ఆ చెడ్డ ప్రజలందర్నీ నాశనం చేయాలని యెహోవా నిర్ణయించుకున్నాడు. కానీ నోవహు, వాళ్లలా కాకుండా ‘నీతిపరునిగా ఉంటూ దేవునితో నడిచాడు.’—ఆది. 6:7-9.

18 నోవహు యెహోవాను ప్రేమించని ప్రజలతో స్నేహం చేయలేదు. ఆయన, ఆయన కుటుంబం ఓడను కట్టడంలో బిజీగా ఉన్నారు. అంతేకాదు ఆయన ‘నీతిని ప్రకటించాడు.’ (2 పేతు. 2:5) నోవహు, ఆయన భార్య, ముగ్గురు కొడుకులు, కోడళ్లు ఒకరితో ఒకరు స్నేహంగా ఉంటూ యెహోవాకు ఇష్టమైన పనుల్ని చేశారు. అందుకే వాళ్లు జలప్రళయాన్ని తప్పించుకోగలిగారు. మనందరం వాళ్లనుండే వచ్చాం. యెహోవాకు లోబడి, చెడు స్నేహాలకు దూరంగా ఉన్నందుకు నోవహుకు, ఆయన కుటుంబానికి మనమెంతో కృతజ్ఞులం. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు కూడా యెహోవాకు లోబడుతూ, ఆయన్ను ప్రేమించని వాళ్లతో స్నేహం చేయలేదు. అందుకే సా.శ. 70⁠లో యెరూషలేము నాశనమైనప్పుడు వాళ్లు తప్పించుకున్నారు.—లూకా 21:20-22.

యెహోవాను ప్రేమించేవాళ్లతో స్నేహం చేసినప్పుడు కొత్తలోకంలో జీవితం ఎలా ఉంటుందో రుచి చూస్తాం (19వ పేరా చూడండి)

19. యెహోవాకు నమ్మకంగా ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది?

19 మనం నోవహును, ఆయన కుటుంబాన్ని, మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్ని అనుకరిస్తూ యెహోవాను ప్రేమించనివాళ్లతో స్నేహం చేయకుండా ఉందాం. మనం స్నేహం చేయడానికి లక్షలమంది నమ్మకమైన సహోదరసహోదరీలు ఉన్నారు. ఈ అపాయకరమైన కాలాల్లో మనం ‘విశ్వాసమందు నిలకడగా ఉండడానికి’ వాళ్లు సహాయం చేస్తారు. (1 కొరిం. 16:13; సామె. 13:20) కాబట్టి మనం చెడు స్నేహాలకు ఇప్పుడు దూరంగా ఉంటేనే, ఈ దుష్టలోక అంతాన్ని తప్పించుకుని కొత్తలోకంలో సంతోషంగా జీవించగలుగుతాం.