కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు క్రీస్తులాంటి పరిణతిని సాధించడానికి కృషిచేస్తున్నారా?

మీరు క్రీస్తులాంటి పరిణతిని సాధించడానికి కృషిచేస్తున్నారా?

‘క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగివుండండి.’ఎఫె. 4:11, 12.

పాటలు: 11, 42

1, 2. ప్రతీ క్రైస్తవుని లక్ష్యం ఏమిటి? ఉదాహరణతో చెప్పండి.

 పండ్లను కొనడానికి మార్కెట్‌కి వెళ్లినప్పుడు సాధారణంగా మనం ఎలాంటి వాటిని కొంటాం? బాగా పెద్దగా ఉండేవాటిని లేదా మరీ చవగ్గా వచ్చేవాటిని కాదుగానీ, కమ్మని వాసన వస్తూ తినడానికి అనువుగా ఉండే తాజా పండ్లను కొంటాం. ఒక్కమాటలో చెప్పాలంటే పండిన వాటిని లేదా పక్వానికి వచ్చిన వాటిని కొంటాం.

2 యెహోవా కూడా తన సేవకులు పరిణతి సాధించాలని కోరుకుంటున్నాడు. అయితే అది వయసు పెరగడంవల్ల వచ్చే శారీరక పరిణతి కాదుగానీ ఆధ్యాత్మిక పరిణతి. ప్రతీ క్రైస్తవుడు పరిణతి సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఓ వ్యక్తి యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా పరిణతి సాధిస్తూనే ఉండాలి. ఎఫెసు సంఘంలోని వాళ్లు అలాంటి పరిణతినే సాధించాలని అపొస్తలుడైన పౌలు కోరుకున్నాడు. విశ్వాసంలో ఐక్యంగా ఉండమని, క్రీస్తు గురించి నేర్చుకుంటూ ఆయనలాంటి పరిణతిని సాధించడానికి కృషి చేయమని పౌలు వాళ్లను ప్రోత్సహించాడు.—ఎఫె. 4:11, 12.

3. ఎఫెసు సంఘంలోని వాళ్లకు, నేడున్న యెహోవా ప్రజలకు ఎలాంటి పోలికలు ఉన్నాయి?

3 పౌలు ఎఫెసీయులకు పత్రిక రాసే సమయానికి, అక్కడ సంఘం ఏర్పడి అప్పటికే కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ సంఘంలో చాలామంది అనుభవంగల క్రైస్తవులు అంటే పరిణతి సాధించినవాళ్లు ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం ఇంకా సాధించాల్సి ఉంది. అలాగే నేడుకూడా, యెహోవాను ఎంతో కాలంగా సేవిస్తూ పరిణతి సాధించిన చాలామంది సహోదరసహోదరీలు మన మధ్య ఉన్నారు. కానీ కొంతమంది ఇంకా సాధించలేదు. ప్రతీ సంవత్సరం వేలమంది బాప్తిస్మం తీసుకుంటున్నారు, కాబట్టి పరిణతి సాధించాల్సిన వాళ్లు ఇంకా ఉన్నారని అర్థమౌతుంది. మరి మీ విషయమేమిటి?—కొలొ. 2:6, 7.

క్రైస్తవులు ఎలా పరిణతి సాధించగలరు?

4, 5. పరిణతిగల క్రైస్తవుల మధ్య ఎలాంటి తేడాలు ఉండవచ్చు? అయితే వాళ్లందరిలోనూ ఏమి ఉంటాయి? (ప్రారంభ చిత్రం చూడండి.)

4 పక్వానికి వచ్చిన పండ్లన్నీ ఒకేలా ఉండవు. అయితే వాటిలో తేడాలున్నా, అవి పండాయని తెలియజేసే కొన్ని లక్షణాలు మాత్రం వాటన్నిటిలో ఉంటాయి. అదేవిధంగా పరిణతి సాధించిన క్రైస్తవులందరూ ఒకేలా ఉండరు. వాళ్ల దేశం, నేపథ్యం, వయసు, ఇష్టాయిష్టాలు వేర్వేరుగా ఉండవచ్చు. అయితే వాళ్లు పరిణతి సాధించారని సూచించే కొన్ని లక్షణాలు వాళ్లందరిలోనూ ఉంటాయి. ఏమిటా లక్షణాలు?

5 పరిణతిగల క్రైస్తవుడు యేసును అనుకరిస్తూ ఆయన ‘అడుగుజాడల్లో’ నడుస్తాడు. (1 పేతు. 2:21) మనం పూర్ణ హృదయంతో, ఆత్మతో, మనస్సుతో యెహోవాను ప్రేమించాలని, మనల్ని మనం ప్రేమించుకున్నట్లే పొరుగువాళ్లను ప్రేమించాలని యేసు చెప్పాడు. (మత్త. 22:37-39) పరిణతిగల క్రైస్తవుడు ఆ సలహాను పాటించడానికి ఎంతో కృషి చేస్తాడు. యెహోవాతో ఉన్న సంబంధం, ఇతరులను ప్రేమించడం తనకు అన్నిటికన్నా ముఖ్యమని ఆయన తన జీవన విధానం ద్వారా చూపిస్తాడు.

వయసుపైబడిన క్రైస్తవులు, సంఘంలో నాయకత్వం వహిస్తున్న యువ సహోదరులకు మద్దతిచ్చి నప్పుడు యేసులా వినయం చూపిస్తారు (6వ పేరా చూడండి)

6, 7. (ఎ) పరిణతిగల క్రైస్తవులకు ఏయే ఇతర లక్షణాలు ఉంటాయి? (బి) మనం ఏమని ప్రశ్నించుకోవాలి?

6 పరిణతిగల క్రైస్తవుడు చూపించే చాలా లక్షణాల్లో ప్రేమ ఒకటి మాత్రమే. (గల. 5:22-24) ఆయన సాత్వికం, ఆశానిగ్రహం, సహనం వంటి లక్షణాలు కూడా చూపిస్తాడు. ఇబ్బందులు వచ్చినప్పుడు చిరాకు పడకుండా ఉండడానికి, నిరుత్సాహం ఎదురైనప్పుడు ఆశ వదులుకోకుండా ఉండడానికి అవి ఆయనకు సహాయం చేస్తాయి. ఆయన వ్యక్తిగత అధ్యయనం చేసేటప్పుడు, మంచిచెడులను గుర్తించడానికి సహాయం చేసే బైబిలు సూత్రాల కోసం వెదుకుతాడు. అలా బైబిలు సహాయంతో తన మనస్సాక్షికి శిక్షణనిస్తూ తెలివైన నిర్ణయాలు తీసుకుంటాడు. పరిణతిగల క్రైస్తవుడు వినయంగా ఉంటూ తన సొంత ఆలోచనలు, ప్రమాణాలకన్నా యెహోవా ఆలోచనలు, ప్రమాణాలు ఎప్పుడూ ఉన్నతమైనవని నమ్ముతాడు. a ఆయన ఉత్సాహంగా సువార్త ప్రకటిస్తూ, సంఘ ఐక్యత కోసం చేయగలిగినదంతా చేస్తాడు.

7 మనం ఎంతకాలంగా సత్యంలో ఉన్నా ప్రతీ ఒక్కరం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘యేసును ఇంకా ఎక్కువగా అనుకరించడానికి నేను ఏమైనా మార్పులు చేసుకోవాలా? నేను ఇంకా ఏయే విషయాల్లో మెరుగవ్వాలి?’

పరిణతిగల క్రైస్తవులు ‘బలమైన ఆహారం’ తీసుకుంటారు

8. యేసుకు లేఖనాలు ఎంత బాగా తెలుసు?

8 యేసుకు దేవుని వాక్యంపై మంచి అవగాహన ఉంది. 12 ఏళ్ల వయసులోనే ఆయన లేఖనాలు ఉపయోగిస్తూ దేవాలయంలోని బోధకులతో మాట్లాడాడు. ‘ఆయన చెప్తున్నది విన్నవాళ్లంతా ఆయన వివేకానికీ ఆయన ఇచ్చే జవాబులకూ విస్మయం చెందారు.’ (లూకా 2:46-47, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) ఆయన పెద్దయ్యాక, పరిచర్యలో దేవుని వాక్యాన్ని ఉపయోగించి శత్రువుల నోళ్లు మూయించాడు.—మత్త. 22:41-46.

9. (ఎ) పరిణతి సాధించాలనుకునే వాళ్లకు ఎలాంటి అధ్యయన అలవాట్లు ఉండాలి? (బి) మనం ఏ ఉద్దేశంతో బైబిలు చదవాలి?

9 కాబట్టి పరిణతి సాధించాలని కోరుకునే క్రైస్తవుడు యేసును అనుకరిస్తూ, సాధ్యమైనంత ఎక్కువగా బైబిల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. పరిణతిగల క్రైస్తవులకు ‘బలమైన ఆహారం’ అవసరమని ఆయన గుర్తించి, లోతైన బైబిలు సత్యాలను క్రమంగా పరిశోధిస్తాడు. (హెబ్రీ. 5:14) అంతేకాదు బైబిలు గురించిన ఖచ్చితమైన ‘జ్ఞానాన్ని’ పొందాలని కోరుకుంటాడు. (ఎఫె. 4:11, 12) కాబట్టి మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను రోజూ బైబిలు చదువుతున్నానా? వ్యక్తిగత అధ్యయనానికి సమయం కేటాయిస్తున్నానా? ప్రతీవారం కుటుంబ ఆరాధన చేసుకుంటున్నానా?’ మీరు బైబిలు చదివేటప్పుడు యెహోవా దేవుని ఆలోచనలను, భావాలను అర్థం చేసుకోవడానికి సహాయం చేసే సూత్రాల కోసం చూడండి. వాటిని మనసులో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు యెహోవాకు మరింత దగ్గరౌతారు.

10. పరిణతిగల క్రైస్తవుడు దేవుడిచ్చే సలహాలను, సూత్రాలను ఎలా చూస్తాడు?

10 పరిణతిగల క్రైస్తవుడు బైబిలు చెప్పేది తెలుసుకోవడంతో పాటు దేవుడిచ్చే సలహాలను, సూత్రాలను ప్రేమించాలి కూడా. అలా ప్రేమిస్తే ఆయన తనకు నచ్చింది కాకుండా యెహోవాకు నచ్చింది చేయాలని కోరుకుంటాడు. అంతేకాదు తన జీవన విధానంలో, ఆలోచనల్లో, పనుల్లో మార్పులు చేసుకుంటాడు. ఉదాహరణకు ఆయన యేసు అడుగుజాడల్లో నడుస్తూ ‘నీతితో, యథార్థమైన భక్తితో, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని’ ధరించుకుంటాడు. (ఎఫెసీయులు 4:22-24 చదవండి.) బైబిల్ని పరిశుద్ధాత్మ సహాయంతో రాశారు కాబట్టి ఓ క్రైస్తవుడు బైబిలు ప్రమాణాల్ని మరింత ఎక్కువగా అర్థం చేసుకుంటూ, వాటిని ప్రేమించినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన హృదయంపై, మనసుపై పనిచేస్తుంది. అప్పుడు ఆయన యెహోవాకు మరింత దగ్గరౌతాడు.

సంఘం ఐక్యంగా ఉండడానికి సహాయం చేస్తారు

11. భూమ్మీదున్నప్పుడు యేసు ఎలాంటి ప్రజల మధ్య జీవించాడు?

11 పరిపూర్ణుడైన యేసు భూమ్మీదున్నప్పుడు అపరిపూర్ణ ప్రజల మధ్య జీవించాడు. ఆయన తల్లిదండ్రులు, తమ్ముళ్లు, చెల్లెళ్లు అందరూ అపరిపూర్ణులే. చివరికి ఎప్పుడూ ఆయన్నే అంటిపెట్టుకుని ఉన్న శిష్యులు కూడా గర్వం, స్వార్థం వంటి లక్షణాల్ని చూపించారు. ఆయన ఇంకొన్ని గంటల్లో చనిపోతాడనగా వాళ్లు “తమలో ఎవడు గొప్పవాడు” అని వాదించుకున్నారు. (లూకా 22:24) అయితే తన అనుచరులు అపరిపూర్ణులైనా వాళ్లు త్వరలోనే పరిణతి సాధిస్తారని, ఐక్య సంఘాన్ని స్థాపిస్తారని యేసుకు తెలుసు. అందుకే, తన శిష్యులు ఐక్యంగా ఉండేలా చూడమని యేసు ఆ రోజురాత్రి తన తండ్రిని వేడుకున్నాడు. ఆయనిలా ప్రార్థించాడు, ‘తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నట్లు వాళ్లూ మనయందు ఏకమై ఉండాలి. మనం ఏకమై ఉన్నట్లు వాళ్లూ ఏకమై ఉండాలి.’—యోహా. 17:20-22.

12, 13. (ఎ) క్రైస్తవులమైన మనం ఏమి కోరుకుంటాం? (బి) సంఘ ఐక్యత కోసం ఓ సహోదరుడు ఏమి చేశాడు?

12 పరిణతిగల క్రైస్తవుడు సంఘం ఐక్యంగా ఉండడానికి సహాయం చేస్తాడు. (ఎఫెసీయులు 4:1-6, 15-16 చదవండి.) క్రైస్తవులమైన మనమందరం “చక్కగా అమర్చబడి” ఉండాలని అంటే ఐక్యంగా ఉండాలని కోరుకుంటాం. మనకు వినయం ఉంటేనే అలా ఐక్యంగా ఉండగలుగుతాం. కాబట్టి పరిణతిగల క్రైస్తవుడు, తోటివాళ్ల వల్ల చిన్నచిన్న ఇబ్బందులు వచ్చినా సంఘ ఐక్యత కోసం వినయంగా కృషి చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఇలా ప్రశ్నించుకుందాం, ‘తోటి సహోదరసహోదరీలు ఏదైనా పొరపాటు చేస్తే నేనెలా స్పందిస్తాను? ఎవరైనా నన్ను బాధపెడితే నేనేమి చేస్తాను? వాళ్లతో మాట్లాడడం మానేస్తానా లేక వాళ్లతో ఎప్పటిలా స్నేహంగా ఉంటానా?’ పరిణతిగల క్రైస్తవుడు సంఘంలో సమస్యల్ని పరిష్కరిస్తాడేగానీ తానే ఓ సమస్యగా మారడు.

13 యూవ అనే ఓ సహోదరుని అనుభవం పరిశీలించండి. ఆయన ఒకప్పుడు తోటి సహోదరసహోదరీలు చేసే చిన్నచిన్న తప్పులకు కూడా నొచ్చుకునేవాడు. దాంతో అతను బైబిలు, లేఖనాలపై అంతర్దృష్టి (ఇంగ్లీషు) పుస్తకాల సహాయంతో దావీదు జీవితం గురించి పరిశోధించాలని అనుకున్నాడు. దావీదు గురించే ఎందుకు? ఎందుకంటే దావీదు కూడా తోటి విశ్వాసులవల్ల సమస్యలు ఎదుర్కొన్నాడు. రాజైన సౌలు ఆయన్ను చంపాలని ప్రయత్నించాడు, మరో సందర్భంలో కొంతమంది ప్రజలు ఆయనను రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. చివరికి ఆయన భార్య కూడా ఆయన్ను ఎగతాళి చేసింది. (1 సమూ. 19:9-11; 30:1-6; 2 సమూ. 6:13-22) అయితే ఇతరులు ఏమి చేసినా దావీదు మాత్రం యెహోవాను ప్రేమిస్తూ, ఆయనపై నమ్మకం ఉంచాడు. అంతేకాదు దావీదు ఎంతో జాలి గలవాడు కూడా. తాను కూడా దావీదులాగే ప్రవర్తించి ఉండాల్సిందని యూవ అంటున్నాడు. దావీదు జీవితాన్ని పరిశీలించాక, తాను ఇతరుల పొరపాట్లను చూసే విధానాన్ని మార్చుకోవాలని యూవ అర్థం చేసుకున్నాడు. దాంతో అతను తోటివాళ్ల తప్పుల గురించి ఆలోచించడం మానేసి, సంఘ ఐక్యత కోసం కృషి చేయడం మొదలుపెట్టాడు. మీరూ అలాగే చేయాలనుకుంటున్నారా?

దేవుని చిత్తం చేస్తున్నవాళ్లతో స్నేహం చేస్తారు

14. యేసు ఎలాంటి వాళ్లతో స్నేహం చేశాడు?

14 యేసుక్రీస్తు ప్రజలతో స్నేహంగా ఉండేవాడు. స్త్రీలు, పురుషులు, పెద్దవాళ్లు, యౌవనులు అందరూ, చివరికి చిన్నపిల్లలు కూడా యేసు దగ్గరికి వచ్చేవాళ్లు. అయితే యేసు తన స్నేహితులను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నాడు. ఆయన తన అపొస్తలులతో ఇలా అన్నాడు, ‘నేను మీకు ఆజ్ఞాపించేవాటిని చేస్తే, మీరు నా స్నేహితులుగా ఉంటారు.’ (యోహా. 15:14) తనను నమ్మకంగా అనుసరించే వాళ్లను, యెహోవాను ప్రేమిస్తూ ఆయన సేవ చేసేవాళ్లను యేసు తన స్నేహితులుగా చేసుకున్నాడు. మీరు కూడా, యెహోవాను మనస్ఫూర్తిగా ప్రేమించేవాళ్లనే స్నేహితులుగా చేసుకుంటారా? అలా చేసుకోవడం ఎందుకు ముఖ్యం?

15. పరిణతిగల క్రైస్తవులతో స్నేహం చేయడంవల్ల యౌవనులు ఎలా ప్రయోజనం పొందవచ్చు?

15 సహోదరసహోదరీలు చూపించే ప్రేమ, మీరు పరిణతి సాధించేలా సహాయం చేస్తుంది. బహుశా మీరు యువతీయువకులైతే, జీవితంలో ఏం చేద్దామా అని ఆలోచిస్తుండవచ్చు. అలాంటప్పుడు కొంతకాలంగా యెహోవా సేవ చేస్తూ, సంఘ ఐక్యత కోసం కృషి చేస్తున్నవాళ్లను స్నేహితులుగా చేసుకోండి. వాళ్లు గతంలో కొన్ని సమస్యలు ఎదుర్కొని ఉండవచ్చు లేదా యెహోవా సేవలో కొన్ని కష్టాల్ని కూడా అనుభవించి ఉండవచ్చు. వాళ్లతో సమయం గడపడం వల్ల మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటూ, పరిణతి సాధించగలరు. అలా మీరు మంచి జీవితాన్ని ఎంపిక చేసుకోవడానికి వాళ్లు సహాయం చేయగలరు.—హెబ్రీయులు 5:14 చదవండి.

16. ఓ సహోదరికి సంఘంలోని పరిణతిగల క్రైస్తవులు ఎలా సహాయం చేశారు?

16 హెల్గా అనే సహోదరి అనుభవం పరిశీలించండి. తన స్కూల్‌ చివరి సంవత్సరంలో, తోటి విద్యార్థులందరూ ముందుముందు ఏమి చేయాలనుకుంటున్నారో మాట్లాడుకుంటున్నారు. వాళ్లలో చాలామంది పైచదువులు చదివి, పెద్ద ఉద్యోగం చేయాలని కోరుకున్నారు. అయితే హెల్గా మాత్రం తన సంఘంలోని పరిణతిగల క్రైస్తవులతో మాట్లాడింది. ఆమె ఇలా చెప్తుంది, ‘వాళ్లలో చాలామంది నాకన్నా పెద్దవాళ్లు. వాళ్లు నాకెంతో సహాయం చేశారు. వాళ్లు నన్ను పూర్తికాల సేవ చేయమని ప్రోత్సహించారు, దాంతో నేను ఐదు సంవత్సరాలు పయినీరు సేవ చేశాను. దానిగురించి ఇప్పుడు ఆలోచిస్తే, నా యౌవనంలో ఎక్కువ సమయాన్ని యెహోవా సేవలో గడిపినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఏమాత్రం బాధపడట్లేదు.’

17, 18. మనం ఎప్పుడు యెహోవాను మరింత బాగా సేవిస్తాం?

17 మనం యేసును అనుకరించినప్పుడు పరిణతి సాధిస్తాం. యెహోవాకు మరింత దగ్గరౌతాం, ఆయన సేవ చేయాలనే కోరిక కూడా పెరుగుతుంది. పరిణతి సాధించినప్పుడే మనం యెహోవా సేవను మరింత బాగా చేయగలుగుతాం. యేసు తన అనుచరుల్ని ఇలా ప్రోత్సహించాడు, “మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.”—మత్త. 5:16.

18 పరిణతిగల క్రైస్తవులు సంఘానికి ఎలా ఉపయోగపడతారో మనం చూశాం. అయితే ఓ క్రైస్తవుడు తన మనస్సాక్షిని ఉపయోగించే విధానంలో కూడా అతని పరిణతి కనిపిస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి మనస్సాక్షి ఎలా సహాయం చేస్తుంది? మనం ఇతరుల మనస్సాక్షిని ఎలా గౌరవించవచ్చు? వీటి గురించి తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాం.

a ఉదాహరణకు, వయసుపైబడిన సహోదరులు కొన్నిసార్లు తమ సంఘ బాధ్యతల్ని యువ సహోదరులకు అప్పగించి, వాళ్లకు సహకరించాల్సి ఉంటుంది.