కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీలాగే మీ పొరుగువాళ్లను ప్రేమిస్తున్నారా?

మీలాగే మీ పొరుగువాళ్లను ప్రేమిస్తున్నారా?

“నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను.”మత్త. 22:39.

పాటలు: 25, 36

1, 2. ప్రేమ చాలా ముఖ్యమని లేఖనాలు ఎలా చూపిస్తున్నాయి?

 యెహోవాకున్న లక్షణాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రేమే. (1 యోహా. 4:16) దేవుడు మొదటిగా సృష్టించిన యేసు, కొన్ని కోట్ల సంవత్సరాలు తండ్రితోపాటు పరలోకంలో ఉన్నాడు. కాబట్టి తన తండ్రి ఎంత ప్రేమగలవాడో ఆయనకు తెలుసు. (కొలొ. 1:15) యేసు కూడా పరలోకంలో, అలాగే భూమ్మీద ఉన్నప్పుడు అలాంటి ప్రేమనే చూపించాడు. కాబట్టి యెహోవా, యేసు ఎల్లప్పుడూ ప్రేమతో పరిపాలిస్తారని మనం నమ్మకంతో ఉండవచ్చు.

2 ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని ఓ వ్యక్తి యేసును అడిగినప్పుడు ఆయనిలా చెప్పాడు, “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.”—మత్త. 22:37-39.

3. మన ‘పొరుగువాళ్లు’ ఎవరు?

3 మనం అందరిమీద ప్రేమ చూపించాలి. మనం యెహోవాను, మన పొరుగువాళ్లను ప్రేమించాలని యేసు చెప్పాడు. ఇంతకీ మన ‘పొరుగువాళ్లు’ ఎవరు? మీరు పెళ్లైనవాళ్లైతే, మీ భార్య లేదా భర్తే మీ మొదటి పొరుగువాళ్లు. తోటి సహోదరసహోదరీలు కూడా మన పొరుగువాళ్లే. ఇక మనం పరిచర్యలో కలిసేవాళ్లు కూడా మనకు పొరుగువాళ్లే అవుతారు. మనం మన పొరుగువాళ్లమీద ఎలా ప్రేమ చూపించవచ్చో ఇప్పుడు చూద్దాం.

మీ భర్తను/భార్యను ప్రేమించండి

4. మనం అపరిపూర్ణులమైనా వివాహ జీవితంలో ఎలా సంతోషం పొందవచ్చు?

4 యెహోవా ఆదాముహవ్వలను సృష్టించి వాళ్లను ఒకటి చేశాడు, అదే మొట్టమొదటి పెళ్లి. వాళ్లు భార్యాభర్తలుగా సంతోషంగా జీవిస్తూ, తమ పిల్లలతో ఈ భూమిని నింపాలని యెహోవా కోరుకున్నాడు. (ఆది. 1:27, 28) కానీ ఆదాముహవ్వలు యెహోవా మాట వినకపోవడంవల్ల వాళ్ల వివాహబంధం బలహీనపడింది, వాళ్ల పిల్లలమైన మనందరికీ పాపమరణాలు వచ్చాయి. (రోమా. 5:12) అయినప్పటికీ మనం వివాహ జీవితంలో సంతోషం పొందవచ్చు. ఎందుకంటే వివాహ ఏర్పాటును ప్రారంభించిన యెహోవా, భార్యాభర్తలకు అవసరమైన చక్కని సలహాల్ని బైబిల్లో ఇచ్చాడు.—2 తిమోతి 3:16, 17 చదవండి.

5. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండడం ఎందుకు ముఖ్యం?

5 ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉన్నప్పుడే వాళ్ల బంధం బలంగా ఉంటుందని బైబిలు చెప్తుంది. ఈ సలహా భార్యాభర్తలకు కూడా వర్తిస్తుంది. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో వర్ణిస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు, “ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వతకాలముండును.” (1 కొరిం. 13:4-8) ఈ మాటల గురించి ఆలోచించి వాటిని పాటిస్తే, వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది.

భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలో బైబిలు చెప్తుంది (6, 7 పేరాలు చూడండి)

6, 7. (ఎ) శిరస్సత్వం గురించి బైబిలు ఏమి చెప్తుంది? (బి) భర్త తన భార్యను ఎలా చూసుకోవాలి?

6 కుటుంబానికి శిరస్సుగా ఎవరు ఉండాలో యెహోవా నిర్ణయించాడు. “ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను” అని పౌలు అన్నాడు. (1 కొరిం. 11:3) కుటుంబ శిరస్సుగా భర్త తన భార్యను ప్రేమగా చూసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. భర్త తన భార్యను ఎన్నడూ తక్కువగా చూడకూడదు లేదా కఠినంగా ప్రవర్తించకూడదు. యేసుకు శిరస్సుగా యెహోవా తన అధికారాన్ని ఎంతో దయగా, నిస్వార్థంగా చూపిస్తున్నాడు. అందుకే యేసు ఎల్లప్పుడూ యెహోవా అధికారాన్ని గౌరవిస్తాడు. ఆయనిలా అన్నాడు, ‘నేను తండ్రిని ప్రేమిస్తున్నాను.’ (యోహా. 14:31) ఒకవేళ యెహోవా తనతో కఠినంగా ప్రవర్తించివుంటే యేసు అలా అనేవాడు కాదు.

7 భర్త శిరస్సైనప్పటికీ తన భార్యను గౌరవించాలని బైబిలు ఆజ్ఞాపిస్తుంది. (1 పేతు. 3:7) భర్త తన భార్యను ఎలా గౌరవించవచ్చు? ఆమె అవసరాలను తీరుస్తూ, ఆమె ఇష్టాయిష్టాలకు విలువివ్వడం ద్వారా అలా చేయవచ్చు. బైబిలు ఇలా చెప్తుంది, ‘పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.’ (ఎఫె. 5:25-27) అవును, యేసు తన శిష్యుల కోసం ప్రాణాన్ని కూడా ఇచ్చాడు. భర్త యేసును అనుకరిస్తూ తన శిరస్సత్వాన్ని ప్రేమగా చూపించినప్పుడు భార్య ఆయన్ను ప్రేమిస్తుంది, గౌరవిస్తుంది. అంతేకాదు ఆయనకు లోబడడం ఆమెకు తేలికవుతుంది.—తీతు 2:3-5 చదవండి.

తోటి సహోదరసహోదరీల్ని ప్రేమించండి

8. తోటి సహోదరసహోదరీలను మనమెలా చూడాలి?

8 నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది ప్రజలు యెహోవాను ఆరాధిస్తున్నారు. ఆ సహోదరసహోదరీలను మనం ఎలా చూడాలి? ‘అందరి యెడల, విశేషంగా విశ్వాసగృహానికి చేరినవారియెడల మేలు చేద్దాం’ అని బైబిలు చెప్తోంది. (గల. 6:10; రోమీయులు 12:10 చదవండి.) అంతేకాదు, సత్యానికి విధేయులయ్యాం కాబట్టి మనం తోటి సహోదరసహోదరీల మీద నిజమైన ప్రేమ చూపించాలని అపొస్తలుడైన పేతురు రాశాడు. ‘అన్నిటికంటె ముఖ్యంగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై ఉండాలి’ అని పేతురు తోటి క్రైస్తవుల్ని ప్రోత్సహించాడు.—1 పేతు. 1:22, 23; 4:8.

9, 10. దేవుని ప్రజలు ఎందుకు ఐక్యంగా ఉండగలుగుతున్నారు?

9 మన తోటి సహోదరసహోదరీల మీద నిజమైన ప్రేమ చూపిస్తాం కాబట్టి మనమంతా ఓ ప్రత్యేక ప్రపంచవ్యాప్త సంస్థగా తయారయ్యాం. అంతేకాదు, మనం యెహోవాను ప్రేమిస్తూ ఆయన నియమాలకు లోబడుతున్నాం కాబట్టి ఆయన అత్యంత శక్తివంతమైన పరిశుద్ధాత్మనిచ్చి మనకు అండగా ఉంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరసహోదరీలందరితో ఐక్యంగా ఉండడానికి ఆ పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది.—1 యోహాను 4:20, 21 చదవండి.

10 క్రైస్తవుల మధ్య ప్రేమ ఉండడం ఎంత ముఖ్యమో వివరిస్తూ పౌలు ఇలా రాశాడు, “మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.” (కొలొ. 3:12-14) మనం ఏ ప్రాంతానికి చెందిన వాళ్లమైనా మనమధ్య “పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ” ఉన్నందుకు మనమెంత కృతజ్ఞులమో కదా!

11. నిజ క్రైస్తవుల్ని దేన్నిబట్టి గుర్తించవచ్చు?

11 యెహోవా సేవకుల మధ్య ఉన్న నిజమైన ప్రేమ, ఐక్యతే వాళ్లది నిజమైన మతం అనడానికి గుర్తు. “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు” అని యేసు అన్నాడు. (యోహా. 13:34, 35) అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు, “దీనినిబట్టి దేవుని పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనమొకని నొకడు ప్రేమింపవలెననునది మొదటనుండి మీరు వినిన వర్తమానమేగదా.” (1 యోహా. 3:10, 11) యెహోవాసాక్షుల మధ్య ఉండే నిజమైన ప్రేమ, ఐక్యతనుబట్టి వాళ్లే క్రీస్తు నిజ అనుచరులు అని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా రాజ్యసువార్త ప్రకటించడానికి యెహోవా వాళ్లనే ఉపయోగించుకుంటున్నాడు.—మత్త. 24:14.

ఓ ‘గొప్పసమూహాన్ని’ సమకూర్చడం

12, 13. ‘గొప్పసమూహానికి’ చెందినవాళ్లు ప్రస్తుతం ఏమి చేస్తున్నారు? భవిష్యత్తులో వాళ్ల జీవితం ఎలా ఉంటుంది?

12 నేడున్న యెహోవా దేవుని సేవకుల్లో చాలామంది ‘గొప్పసమూహానికి’ చెందినవాళ్లే. వేర్వేరు దేశాలకు చెందిన వీళ్లు దేవుని రాజ్యానికి నమ్మకంగా మద్దతిస్తున్నారు. వీళ్లు యేసు అర్పించిన బలిపట్ల విశ్వాసం ఉంచడం ద్వారా ‘గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాల్ని ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు.’ అంతేకాదు వీళ్లు ‘మహాశ్రమల్ని’ తప్పించుకుంటారు. ‘గొప్పసమూహానికి’ చెందినవాళ్లు యెహోవాను, ఆయన కుమారుణ్ణి ప్రేమిస్తూ “రాత్రింబగళ్లు” యెహోవాను ఆరాధిస్తున్నారు.—ప్రక. 7:9, 14, 15.

13 యెహోవా త్వరలోనే చెడ్డవాళ్లందర్నీ మహాశ్రమల కాలంలో నాశనం చేస్తాడు. (మత్త. 24:21; యిర్మీయా 25:32, 33 చదవండి.) కానీ ఆయన ఎంతో ప్రేమించే తన సేవకుల్ని కాపాడి, కొత్తలోకంలోకి నడిపిస్తాడు. దాదాపు 2,000 సంవత్సరాల క్రితం మాటిచ్చినట్లు, అప్పుడు ‘ఆయన వాళ్ల కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచేస్తాడు, మరణము ఇక ఉండదు, దుఃఖం, ఏడ్పు, వేదన ఇక ఉండవు.’ చెడుతనం, బాధలు, మరణం ఉండని పరదైసులో జీవించడం కోసం మీరు ఎదురుచూస్తున్నారా?—ప్రక. 21:4.

14. గొప్పసమూహానికి చెందినవాళ్లు నేడు ఎంతమంది ఉన్నారు?

14 అంత్యదినాలు మొదలైన 1914⁠లో, పరలోక నిరీక్షణ ఉన్నవాళ్లు దాదాపు 5,000 మంది మాత్రమే ఉన్నారు. వాళ్లకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా తమ పొరుగువాళ్లమీద ఉన్న ప్రేమతో, పరిశుద్ధాత్మ సహాయంతో రాజ్యసువార్తను ప్రకటించారు. దాని ఫలితం? ఈ భూమి మీద నిత్యం జీవించే ఓ ‘గొప్పసమూహం’ నేడు సమకూర్చబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,15,400 సంఘాల్లో దాదాపు 80 లక్షలమంది సాక్షులు ఉన్నారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉదాహరణకు, 2014 సేవా సంవత్సరంలో 2,75,500 కన్నా ఎక్కువమంది బాప్తిస్మం తీసుకున్నారు. అంటే ప్రతీ వారం సగటున 5,300 మంది బాప్తిస్మం తీసుకుంటున్నారు.

15. నేడు ప్రకటనా పని ఎంత విస్తృతంగా జరుగుతోంది?

15 రాజ్యసువార్త ఎంతమందికి చేరుతోందో చూస్తే చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. నేడు మన ప్రచురణలు 700 కన్నా ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. కావలికోట ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా పంచిపెట్టబడుతున్న పత్రిక. ఈ పత్రిక 247 భాషల్లో వస్తోంది, ప్రతీనెల 5 కోట్ల 20 లక్షలకన్నా ఎక్కువ కాపీలు ప్రింట్‌ అవుతున్నాయి. మనం బైబిలు స్టడీలు చేయడానికి ఉపయోగిస్తున్న బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం 250 కన్నా ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉంది. ఇప్పటిదాకా 20 కోట్లకన్నా ఎక్కువ కాపీలు ప్రింట్‌ చేశారు.

16. యెహోవా సంస్థ రోజురోజుకూ ఎందుకు అభివృద్ధి చెందుతోంది?

16 మనం యెహోవామీద విశ్వాసం ఉంచడంతోపాటు బైబిలు దేవుని వాక్యమని నమ్ముతున్నాం కాబట్టి మన సంస్థ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. (1 థెస్స. 2:13) అంతేకాక సాతాను మనల్ని ద్వేషిస్తూ వ్యతిరేకిస్తున్నా యెహోవా మనపై ఆశీర్వాదాలు కుమ్మరిస్తూనే ఉన్నాడు.—2 కొరిం. 4:4.

ఇతరుల్ని ప్రేమిస్తూ ఉండండి

17, 18. తనను ఆరాధించనివాళ్లను మనమెలా చూడాలని యెహోవా కోరుకుంటున్నాడు?

17 తనను ఆరాధించనివాళ్లను మనమెలా చూడాలని యెహోవా కోరుకుంటున్నాడు? మనం సువార్త ప్రకటించేటప్పుడు ప్రజలు వేర్వేరుగా స్పందిస్తారు. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. వాళ్లు ఎలా స్పందించినా మనం మాత్రం బైబిలు ఇస్తున్న ఈ సలహాను పాటిస్తాం, “ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.” (కొలొ. 4:6) మనం పొరుగువాళ్లను ప్రేమిస్తాం కాబట్టి “సాత్వికముతో,” ప్రగాఢ గౌరవంతో వాళ్లకు మన నమ్మకాల గురించి వివరిస్తాం.—1 పేతు. 3:15, 16.

18 ప్రజలు మనమీద కోప్పడి మనం చెప్పే సువార్త వినకపోయినా వాళ్లను ప్రేమిస్తాం. అలాంటి పరిస్థితుల్లో మనం యేసులాగే నడుచుకుంటాం. యేసు ‘దూషించబడినా బదులు దూషింపలేదు, శ్రమపెట్టబడినా బెదిరించలేదు,’ బదులుగా యెహోవా మీద నమ్మకముంచాడు. (1 పేతు. 2:23) కాబట్టి మనం ఎల్లప్పుడూ వినయంగా ఉంటూ ఈ సలహాను పాటిస్తాం, ‘కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణయైనను చేయక దీవించుడి.’—1 పేతు. 3:8, 9.

19. మన శత్రువుల్ని మనమెలా చూడాలి?

19 మనకు వినయం ఉంటే యేసు ఇచ్చిన ఈ ప్రాముఖ్యమైన సూత్రాన్ని పాటిస్తాం, “నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థనచేయుడి. ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.” (మత్త. 5:43-45) మన శత్రువులు మనతో ఎలా ప్రవర్తించినప్పటికీ, దేవుని సేవకులమైన మనం మాత్రం వాళ్లను ప్రేమించాలి.

20. కొత్తలోకంలో భూమంతా యెహోవాను, పొరుగువాళ్లను ప్రేమించే ప్రజలతో నిండిపోతుందని మనకెలా తెలుసు? (ప్రారంభ చిత్రం చూడండి.)

20 మనం యెహోవాను, మన పొరుగువాళ్లను ఎల్లప్పుడూ ప్రేమించాలి. ప్రజలు మనల్ని, మనం చెప్పే సువార్తను వ్యతిరేకించినా వాళ్లు అవసరంలో ఉన్నప్పుడు మనం సహాయం చేస్తాం. పౌలు ఇలా రాశాడు, “ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్నయెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. ప్రేమ పొరుగువానికి కీడుచేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.” (రోమా. 13:8-10) దేవుని సేవకులు ఐక్యత, ప్రేమ లేని సాతాను దుష్టలోకంలో జీవిస్తున్నప్పటికీ వాళ్లు తమ పొరుగువాళ్లను ప్రేమిస్తారు. (1 యోహా. 5:19) యెహోవా సాతానును, అతని దయ్యాలను, ఈ చెడ్డలోకాన్ని నాశనం చేసిన తర్వాత కొత్తలోకంలో ఎక్కడ చూసినా ప్రేమే కనిపిస్తుంది. భూమ్మీదున్నవాళ్లందరు యెహోవాను, తమ పొరుగువాళ్లను ప్రేమించే ఆ రోజు ఎంత బాగుంటుందో కదా!