కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాను సేవించేలా మీ పిల్లలకు శిక్షణనివ్వండి

యెహోవాను సేవించేలా మీ పిల్లలకు శిక్షణనివ్వండి

‘నీవు పంపిన దైవజనుడు, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుము.’న్యాయా. 13:8.

పాటలు: 4, 6

1. తమకు ఓ కొడుకు పుట్టబోతున్నాడనే వార్త విన్నప్పుడు మానోహ ఏమి చేశాడు?

 మానోహ, ఆయన భార్య తమకు ఇక పిల్లలు పుట్టరని అనుకున్నారు. కానీ ఓరోజు దేవదూత మానోహ భార్యకు కనిపించి, వాళ్లకు ఓ కొడుకు పుడతాడని చెప్పాడు. ఆ వార్త విని ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ఆమె ఆ విషయాన్ని తన భర్తకు చెప్పినప్పుడు, ఆయన కూడా చాలా సంతోషించాడు. అయితే ఓ తండ్రిగా తాను ఏమి చేయాలని యెహోవా కోరుకుంటున్నాడో కూడా మానోహ తీవ్రంగా ఆలోచించాడు. ఎందుకంటే ఆ కాలంలోని ఇశ్రాయేలీయులు చెడ్డ పనులు చేస్తుండేవాళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో మానోహ, ఆయన భార్య తమ కొడుకును యెహోవా ఆరాధకునిగా ఎలా పెంచగలరు? మానోహ యెహోవాను ఇలా వేడుకున్నాడు, “నీవు పంపిన దైవజనుడు మరల మాయొద్దకు వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుము.”—న్యాయా. 13:1-8.

2. మీ పిల్లలకు చక్కగా శిక్షణ ఇవ్వాలంటే మీరు ఏమి చేయాలి? (“మీకు అందరికన్నా ముఖ్యమైన బైబిలు విద్యార్థులు” అనే బాక్సు కూడా చూడండి.)

2 మీరు తల్లిదండ్రులైతే, మానోహ ఎందుకలా ప్రార్థించాడో మీకు అర్థమయ్యేవుంటుంది. మీ పిల్లలు యెహోవా గురించి తెలుసుకుని, ఆయన్ను ప్రేమించేలా సహాయం చేయాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. (సామె. 1:8) అందుకోసం మీరు కుటుంబ ఆరాధనలో వాళ్లకు యెహోవా గురించి, బైబిలు గురించి నేర్పిస్తుండవచ్చు. అయితే మీ పిల్లల మనసులో బైబిలు సత్యాలు నాటాలంటే అది మాత్రమే సరిపోదు. (ద్వితీయోపదేశకాండము 6:6-9 చదవండి.) మరి మీ పిల్లలు యెహోవాను ప్రేమించి, ఆయన్ను సేవించాలంటే మీరింకా ఏమి చేయాలి? మీరు యేసును అనుకరించాలి. యేసుకు పిల్లలు లేకపోయినా, ఆయన తన శిష్యులకు బోధించి, శిక్షణనిచ్చిన విధానం నుండి మీరు ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. యేసు తన శిష్యుల్ని ప్రేమించాడు. వినయం, వివేచన వంటి లక్షణాలను చూపించాడు. తల్లిదండ్రులైన మీరు యేసును ఎలా అనుకరించవచ్చో ఇప్పుడు చూద్దాం.

మీ పిల్లల్ని ప్రేమించండి

3. యేసు తమను ప్రేమిస్తున్నాడని శిష్యులకు ఎలా తెలుసు?

3 తాను వాళ్లను ప్రేమిస్తున్నానని యేసు తన శిష్యులతో చాలాసార్లు అన్నాడు. (యోహాను 15:9 చదవండి.) ఆయన వాళ్లతో ఎక్కువ సమయం గడిపేవాడు కూడా. (మార్కు 6:31, 32; యోహా. 2:2; 21:12, 13) ఆయన వాళ్లకు కేవలం ఓ బోధకుడు మాత్రమే కాదు, మంచి స్నేహితుడు కూడా. యేసు తమను ప్రేమిస్తున్నాడనే విషయంలో శిష్యులకు ఏమాత్రం సందేహం లేదు. ఈ విషయంలో యేసు నుండి మీరేమి నేర్చుకోవచ్చు?

4. మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారని ఎలా చూపించవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

4 మీరు కూడా, మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారనే విషయాన్ని వాళ్లకు చెప్పండి. వాళ్లు మీకు ఎంత ముఖ్యమైనవాళ్లో చూపించండి. (సామె. 4:3; తీతు 2:3-5) ఆస్ట్రేలియాలో ఉంటున్న సామ్యూల్‌ ఇలా చెప్తున్నాడు, “చిన్నప్పుడు, మా నాన్న రోజూ సాయంత్రం నా బైబిలు కథల పుస్తకంలోని పాఠాలను చదివి వినిపించేవాడు. నేను అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబిచ్చేవాడు. నన్ను ప్రేమగా హత్తుకుని, ముద్దు పెట్టుకుని గుడ్‌నైట్‌ చెప్పేవాడు. అయితే పిల్లల్ని అలా ప్రేమగా దగ్గరకు తీసుకునే కుటుంబంలో నాన్న పెరగలేదని తెలిసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. అయినప్పటికీ, నాన్న నాపట్ల తనకున్న ప్రేమను చూపించడానికి చాలా కృషి చేశాడు. దానివల్ల నేను ఆయనకు మరింత దగ్గరయ్యాను, ఏ భయం లేకుండా చాలా సంతృప్తిగా ఉండగలిగాను.” మీ పిల్లలు కూడా అలాగే అనుకోవాలంటే, మీరు కూడా “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని వాళ్లతో చెప్తూ ఉండండి. వాళ్లను హత్తుకోండి, ముద్దాడండి. వాళ్లతో మాట్లాడండి, కలిసి భోజనం చేయండి, కలిసి ఆటలాడండి.

5, 6. (ఎ) యేసు తన శిష్యుల్ని ప్రేమించాడు కాబట్టి ఏమి చేశాడు? (బి) మీరు మీ పిల్లలకు ఎలా క్రమశిక్షణనివ్వాలి?

5 యేసు ఇలా చెప్పాడు, “నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను.” a (ప్రక. 3:19) ఉదాహరణకు, తమలో ఎవరు గొప్ప అని తన శిష్యులు చాలాసార్లు వాదించుకున్నప్పుడు, వాళ్లిక ఎప్పటికీ మారరని యేసు అనుకోలేదు. లేదా ఆ సమస్యను చూసీచూడనట్లు వదిలేయలేదు. బదులుగా ఎంతో ఓపిగ్గా పదేపదే వాళ్లను సరిదిద్దాడు. అయితే సరైన సమయంలో, స్థలంలో ఎంతో దయగా వాళ్లను సరిదిద్దేవాడు.—మార్కు 9:33-37.

6 మీకు మీ పిల్లలమీద ప్రేమ ఉంది కాబట్టి వాళ్లకు క్రమశిక్షణ ఇవ్వాలని మీకు తెలుసు. కొన్నిసార్లు, ఫలానా పని ఎందుకు సరైనదో, ఎందుకు కాదో వివరిస్తే సరిపోతుంది. వాళ్లు అప్పటికీ మాట వినకపోతే? (సామె. 22:15) యేసులాగే మీరు కూడా ఓపిగ్గా వాళ్లను సరైన దారిలో నడిపిస్తూ, శిక్షణనిస్తూ, సరిదిద్దుతూ ఉండండి. సరైన సమయంలో, స్థలంలో దయగా వాళ్లకు క్రమశిక్షణనివ్వండి. దక్షిణ ఆఫ్రికాకు చెందిన ఇలాన్‌ అనే సహోదరి, తన తల్లిదండ్రులు తనకు ఏ విధంగా క్రమశిక్షణ ఇచ్చారో గుర్తు చేసుకుంటుంది. తన ప్రవర్తన ఎలా ఉండాలో తన తల్లిదండ్రులు స్పష్టంగా వివరించేవాళ్లని ఆమె చెప్తుంది. ఒకవేళ అలా ఉండకపోతే శిక్షిస్తామని వాళ్లు చెప్పేవాళ్లు, అలాగే చేసేవాళ్లు కూడా. అయితే, “వాళ్లు కోపంగా ఉన్నప్పుడో లేదా కారణం చెప్పకుండానో నన్ను ఎప్పుడూ శిక్షించేవాళ్లు కాదు” అని ఆమె చెప్తుంది. అందుకే తన తల్లిదండ్రులకు తనమీద ప్రేమ ఉందని ఆమె ఎప్పుడూ నమ్ముతుంది.

వినయం చూపించండి

7, 8. (ఎ) యేసు చేసిన ప్రార్థనల నుండి ఆయన శిష్యులు ఏమి నేర్చుకున్నారు? (బి) మీ ప్రార్థనలు మీ పిల్లలకు ఎలా సహాయం చేస్తాయి?

7 యేసు ఇంకొన్ని గంటల్లో చనిపోతాడనగా తన తండ్రిని ఇలా వేడుకున్నాడు, “నాయనా తండ్రీ, నీకు సమస్తము సాధ్యము; ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము; అయినను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము.” (మార్కు 14:36) ఆయన చేసిన ఈ ప్రార్థన విన్నప్పుడు శిష్యులకు ఎలా అనిపించి ఉంటుందో ఒకసారి ఊహించండి. పరిపూర్ణుడైన యేసే సహాయం కోసం వినయంగా తన తండ్రికి ప్రార్థించాడు కాబట్టి తాము కూడా యెహోవాపై ఆధారపడాలని వాళ్లు అర్థం చేసుకున్నారు.

8 మీ ప్రార్థనల నుండి మీ పిల్లలు ఎంతో నేర్చుకుంటారు. నిజమే, కేవలం మీ పిల్లలకు బోధించడానికే మీరు ప్రార్థన చేయకపోవచ్చు. కానీ వాళ్లు మీ ప్రార్థనల్ని విన్నప్పుడు యెహోవాపై ఆధారపడడం నేర్చుకుంటారు. బ్రెజిల్‌లో ఉంటున్న ఆన అనే సహోదరి ఇలా చెప్తుంది, ‘మా అమ్మమ్మ, తాతయ్యలకు బాలేకపోవడం వంటి సమస్యలు వచ్చినప్పుడు, వాటిని తట్టుకోవడానికి కావాల్సిన బలాన్ని ఇవ్వమని, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయమని యెహోవాకు మా అమ్మానాన్నలు ప్రార్థించేవాళ్లు. తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినప్పుడు కూడా వాళ్లు యెహోవామీదే భారం వేసేవాళ్లు. దానివల్ల నేను కూడా యెహోవాపై ఆధారపడడం నేర్చుకున్నాను.’ కాబట్టి మీ పిల్లలతో కలిసి ప్రార్థించేటప్పుడు కేవలం మీ పిల్లలకు సహాయం చేయమనే కాదు, మీకు కూడా సహాయం చేయమని వేడుకోండి. ఉదాహరణకు, మీ పొరుగువాళ్లకు సాక్ష్యం ఇచ్చేందుకు లేదా సమావేశం కోసం మీ యజమానిని సెలవు అడిగేందుకు ధైర్యం ఇమ్మని మీరు ప్రార్థించవచ్చు. మీరు అలా వినయంగా యెహోవాపై ఆధారపడడం చూసినప్పుడు మీ పిల్లలు కూడా అలాగే చేయడం నేర్చుకుంటారు.

9. (ఎ) వినయంగా, నిస్వార్థంగా ఉండడం యేసు తన శిష్యులకు ఎలా నేర్పించాడు? (బి) మీరు వినయంగా ఉంటూ, ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటే మీ పిల్లలు ఏమి నేర్చుకుంటారు?

9 వినయంగా, నిస్వార్థంగా ఉండమని యేసు తన శిష్యులకు నేర్పించాడు. అంతేకాక ఈ విషయంలో ఆయనే చక్కని ఆదర్శం ఉంచాడు. (లూకా 22:27 చదవండి.) యెహోవాను సేవించడానికి, ఇతరులకు సహాయం చేయడానికి యేసు ఎన్నో త్యాగాలు చేశాడు. వాటిని చూసి అపొస్తలులు కూడా అలాగే చేయడం నేర్చుకున్నారు. మీరు కూడా మీ ప్రవర్తన ద్వారా మీ పిల్లలకు ఎంతో నేర్పించవచ్చు. ఇద్దరు పిల్లలున్న డెబీ అనే సహోదరి ఇలా చెప్తుంది, ‘సంఘపెద్దగా నా భర్త ఇతరుల కోసం సమయం వెచ్చించడం చూసి నేనెప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే మాకు తన సహాయం అవసరమైనప్పుడు, ఆయన తప్పకుండా సమయం కేటాయిస్తాడని నాకు తెలుసు.’ (1 తిమో. 3:4, 5) డెబీ, ఆమె భర్త ప్రానాస్‌ చూపించిన ఆదర్శం వాళ్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపించింది? సమావేశాల్లో ఏవైనా పనులు చేయడానికి తమ పిల్లలు ఎప్పుడూ ముందుండేవాళ్లని ప్రానాస్‌ చెప్తున్నాడు. అంతేకాదు వాళ్లు సంతోషంగా ఉండేవాళ్లనీ, మంచి స్నేహితుల్ని సంపాదించుకున్నారనీ, తోటి సహోదరసహోదరీలతో సమయం గడపడానికి ఇష్టపడేవాళ్లని కూడా ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబంలోని వాళ్లందరూ పూర్తికాల సేవ చేస్తున్నారు. కాబట్టి మీరు వినయంగా ఉంటూ, ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు.

వివేచన చూపించండి

10. గలిలయలో కొంతమంది ప్రజలు తనను కలవడానికి వచ్చినప్పుడు యేసు ఎలా వివేచన చూపించాడు?

10 యేసుకు పరిపూర్ణమైన వివేచన ఉంది. ప్రజలు ఏదైనా ఓ పని చేసినప్పుడు, వాళ్లు దాన్ని ఎందుకు చేశారో ఆయన ఆలోచించేవాడు. ఆయన వాళ్ల హృదయాల్ని చదివేవాడు. ఉదాహరణకు, ఓ సందర్భంలో గలిలయలో కొంతమంది ప్రజలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చారు. (యోహా. 6:22-24) అయితే వాళ్లు వచ్చింది తన బోధ వినడానికి కాదుగానీ ఆహారం కోసమని యేసు గ్రహించాడు. (యోహా. 2:24, 25) వాళ్ల మనసులో ఏముందో ఆయనకు తెలుసు కాబట్టే ఓపిగ్గా వాళ్లను సరిదిద్ది, ఏయే మార్పులు చేసుకోవాలో వాళ్లకు వివరించాడు.—యోహాను 6:25-27 చదవండి.

పరిచర్యలో ఆనందించేలా మీ పిల్లలకు సహాయం చేయండి (11వ పేరా చూడండి)

11. (ఎ) మీ పిల్లలు పరిచర్యను ఇష్టపడుతున్నారో లేదో మీరెలా తెలుసుకోవచ్చు? (బి) మీ పిల్లలు పరిచర్యలో ఆనందించాలంటే మీరేమి చేయాలి?

11 అయితే మీరు యేసులాగే హృదయాల్ని చదవలేకపోయినా మీరు కూడా వివేచన చూపించవచ్చు. ఉదాహరణకు పరిచర్యను మీ పిల్లలు ఇష్టపడుతున్నారో లేదో తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించవచ్చు. మీరిలా ప్రశ్నించుకోండి, ‘మా పిల్లలకు పరిచర్య అంటే ఇష్టమేనా? లేక పరిచర్య మధ్యలో ఏదైనా తినడానికి ఎప్పుడెప్పుడు ఆగుతామా అని చూస్తున్నారా?’ మీ పిల్లలు పరిచర్యను అంతగా ఇష్టపడట్లేదని మీకనిపిస్తే, వాళ్లకు చిన్నచిన్న లక్ష్యాలు పెడుతూ పరిచర్యపట్ల వాళ్ల ఆసక్తిని పెంచండి. అప్పుడు తాము కూడా పరిచర్య చేయగలుగుతున్నామని వాళ్లు సంతోషిస్తారు.

12. (ఎ) యేసు దేనిగురించి తన శిష్యుల్ని హెచ్చరించాడు? (బి) యేసు సరైన సమయంలో ఆ హెచ్చరిక ఇచ్చాడని ఎందుకు చెప్పవచ్చు?

12 యేసు మరోవిధంగా కూడా వివేచన చూపించాడు. ఓ పొరపాటు మరో పొరపాటుకు, చివరికి పెద్ద తప్పుకు కూడా దారితీయగలదని యేసుకు తెలుసు. ఈ విషయం గురించే ఆయన తన శిష్యుల్ని హెచ్చరించాడు. ఉదాహరణకు వ్యభిచారం తప్పని శిష్యులకు తెలుసు, అయితే ఆ తప్పుకు దారితీసే వాటిగురించి యేసు వాళ్లను ఇలా హెచ్చరించాడు, “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము.” (మత్త. 5:27-29) యేసు శిష్యులు నైతికంగా దిగజారిన రోమా ప్రజల మధ్య జీవించారు. రోమన్లు అసభ్యకరమైన సన్నివేశాలు, బూతులు ఉన్న వినోదాన్నే ఎక్కువగా ఇష్టపడేవాళ్లు. కాబట్టి నైతిక పవిత్రతకు భంగం కలిగించే దేన్నీ చూడొద్దని యేసు ప్రేమతో తన శిష్యుల్ని హెచ్చరించాడు.

13, 14. మీ పిల్లలు చెడు వినోదానికి దూరంగా ఉండడానికి మీరెలా సహాయం చేయవచ్చు?

13 యెహోవాకు ఇష్టంలేనివాటిని చేయకుండా మీ పిల్లల్ని కాపాడడానికి మీరు కూడా వివేచన ఉపయోగించవచ్చు. విచారకరంగా, ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా అశ్లీల చిత్రాలను లేదా సమాచారాన్ని చూస్తున్నారు. అలాంటివాటిని చూడడం తప్పని మీరు మీ పిల్లలకు చెప్పాలి. అయితే వాళ్లను కాపాడడానికి అది మాత్రమే సరిపోదు. మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి, ‘అశ్లీల చిత్రాలను చూడడం ఎందుకు ప్రమాదకరమో మా పిల్లలకు తెలుసా? వాటిని చూడాలని వాళ్లకు ఎందుకు అనిపిస్తుంది? ఎప్పుడైనా అశ్లీల చిత్రాలు చూడాలనిపిస్తే వాళ్లు భయపడకుండా నా దగ్గరకు వచ్చి మాట్లాడేంత స్నేహంగా నేను ఉంటున్నానా?’ మీ పిల్లలు చాలా చిన్నవాళ్లైనా మీరు వాళ్లతో ఇలా చెప్పవచ్చు, “నీకు ఎప్పుడైనా అశ్లీల చిత్రం కనిపిస్తే లేదా చూడాలనిపిస్తే నా దగ్గరికి వచ్చి నాతో చెప్పడానికి భయపడొద్దు, సిగ్గుపడొద్దు. నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను.”

14 మీరు వినోదాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు మీ పిల్లలకు ఎలా ఆదర్శంగా ఉండవచ్చో ఆలోచించండి. ముందు పేరాల్లో మనం చూసిన ప్రానాస్‌ ఇలా చెప్తున్నాడు, ‘మీరు మీ పిల్లలకు ఎన్నో విషయాలు చెప్పవచ్చు, అయితే వాళ్లు మాత్రం మీరేమి చేస్తున్నారన్నదే గమనిస్తారు, అలాగే ప్రవర్తిస్తారు.’ మీరు ఎప్పుడూ సరైన వినోదాన్నే ఎంపిక చేసుకుంటుంటే మీ పిల్లలు కూడా అదే చేస్తారు.—రోమా. 2:21-24.

యెహోవా మీకు సహాయం చేస్తాడు

15, 16. (ఎ) మీ పిల్లలకు శిక్షణ ఇచ్చే విషయంలో యెహోవా మీకు సహాయం చేస్తాడని ఎందుకు నమ్మవచ్చు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి చర్చిస్తాం?

15 ఒక మంచి తండ్రిగా ఉండడానికి సహాయం చేయమని మానోహ అడిగినప్పుడు ‘దేవుడు మానోహ ప్రార్థనను ఆలకించాడు.’ (న్యాయా. 13:9) తల్లిదండ్రులారా, యెహోవా మీ ప్రార్థనలను కూడా వింటాడు. మీ పిల్లలకు శిక్షణ ఇచ్చే విషయంలో మీకు సహాయం చేస్తాడు. అంతేకాదు, పిల్లల్ని పెంచే విషయంలో మీరు ప్రేమ, వినయం, వివేచన చూపించడానికి ఆయన సహాయం చేస్తాడు.

16 మీ పిల్లలకు చిన్నప్పుడే కాదు, టీనేజీలో ఉన్నప్పుడు కూడా శిక్షణ ఇవ్వడానికి యెహోవా మీకు సహాయం చేస్తాడు. యెహోవాను సేవించేలా టీనేజీ పిల్లల్ని పెంచడానికి యేసులా ప్రేమ, వినయం, వివేచన చూపించడం ఎలా సహాయం చేస్తుందో తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాం.

a క్రమశిక్షణ ఇవ్వడం అంటే సరైన దారిలో నడిపించడం, శిక్షణనివ్వడం, సరిదిద్దడం, కొన్నిసార్లు శిక్షించడం అని బైబిలు చెప్తుంది. అయితే తల్లిదండ్రులు పిల్లలకు దయగా క్రమశిక్షణ ఇవ్వాలేగానీ కోపంగా ఉన్నప్పుడు కాదు.