కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునితో కలిసి పనిచేయడం​—⁠సంతోషించడానికి ఓ కారణం

దేవునితో కలిసి పనిచేయడం​—⁠సంతోషించడానికి ఓ కారణం

“మేము దేవునితోపాటు పనిచేస్తూ, మీరు పొందిన ఆయన కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్ములను వేడుకొంటున్నాం.”2 కొరిం. 6:1, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

పాటలు: 28, 10

1. యెహోవా విశ్వంలో అందరికన్నా గొప్పవాడైనప్పటికీ ఇతరులకు ఆయన ఏ ఆహ్వానం ఇస్తున్నాడు?

 యెహోవా విశ్వంలో అందరికన్నా గొప్పవాడు. ఆయనే సమస్తాన్ని సృష్టించాడు. ఆయనకు అంతులేని జ్ఞానం, శక్తి ఉన్నాయి. యెహోవా సహాయంతో యోబు ఈ విషయాల్ని అర్థంచేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఇలా అన్నాడు, “నీవు సమస్తక్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని.” (యోబు 42:2) అవును, యెహోవా ఎవ్వరి సహాయం లేకుండా అనుకున్నది చేయగలడు. అయినప్పటికీ తన సంకల్పాన్ని నెరవేర్చడంలో తనతో కలిసి పనిచేయమని ఇతరుల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు.

2. యెహోవా యేసుకు ఏ ప్రాముఖ్యమైన పని చేసే అవకాశం ఇచ్చాడు?

2 మొట్టమొదట దేవుడు తన కుమారుడైన యేసును చేశాడు. ఆ తర్వాత, మిగతా సృష్టిని చేయడంలో సహాయం చేసే అవకాశాన్ని ఆయన తన కుమారునికి ఇచ్చాడు. (యోహా. 1:1-3, 18) యేసు గురించి అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు, “ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.” (కొలొ. 1:15-17) యెహోవా తన కుమారునికి ఓ ప్రాముఖ్యమైన పని ఇవ్వడమే కాకుండా, దానిగురించి ఇతరులకు చెప్పడం ద్వారా ఆయన్ను ఘనపర్చాడు.

3. యెహోవా ఆదాముకు ఏ పనుల్ని అప్పగించాడు? ఎందుకు?

3 తనతో కలిసి పనిచేసే అవకాశాన్ని యెహోవా మనుషులకు కూడా ఇచ్చాడు. ఉదాహరణకు, ఆయన జంతువులన్నిటికీ పేర్లు పెట్టే పనిని ఆదాముకు ఇచ్చాడు. (ఆది. 2:19, 20) ఆ పనిని చేస్తూ ఆదాము ఎంత సంతోషించివుంటాడో ఒక్కసారి ఊహించండి. ఆదాము జంతువులను, వాటి ప్రవర్తనను జాగ్రత్తగా పరిశీలించి వాటికి సరిగ్గా సరిపోయే పేర్లు పెట్టాడు. అసలు జంతువుల్ని సృష్టించింది యెహోవాయే కాబట్టి వాటికి పేర్లు కూడా ఆయనే పెట్టివుండొచ్చు. కానీ ఆయన ప్రేమతో ఆ అవకాశాన్ని ఆదాముకు ఇచ్చాడు. అంతేకాదు, భూమంతటినీ పరదైసుగా మార్చే పనిని కూడా ఆయన ఆదాముకే ఇచ్చాడు. (ఆది. 1:27, 28) కానీ ఆదాము దేవునితో కలిసి పనిచేయడం మానేశాడు. దానివల్ల అతనితోపాటు అతని సంతానమంతా కష్టాలపాలైంది.—ఆది. 3:17-19, 23.

4. యెహోవా చిత్తాన్ని నెరవేర్చడంలో ఇతరులు ఆయనతో ఏవిధంగా కలిసి పనిచేశారు?

4 ఆ తర్వాతి కాలంలో, తనతో కలిసి పనిచేయమని యెహోవా ఇతరులను కూడా ఆహ్వానించాడు. నోవహు తనను, తన కుటుంబాన్ని జలప్రళయం నుండి రక్షించుకోవడానికి ఓడను కట్టాడు. మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుండి విడిపించాడు. యెహోషువ ఇశ్రాయేలీయుల్ని వాగ్దాన దేశంలోకి నడిపించాడు. సొలొమోను యెరూషలేములో ఆలయాన్ని కట్టాడు. మరియ యేసుకు తల్లి అయింది. ఈ నమ్మకమైన సేవకులతోపాటు ఎంతోమంది ఇతరులు యెహోవా చిత్తాన్ని నెరవేర్చడంలో ఆయనతో కలిసి పనిచేశారు.

5. మనందరం ఏ పనిలో భాగం వహించవచ్చు? ఆ అవకాశాన్ని మనకు ఇవ్వాల్సిన అవసరం యెహోవాకు ఉందా? (ప్రారంభ చిత్రం చూడండి.)

5 నేడు కూడా యెహోవా, తన రాజ్యానికి మద్దతివ్వడానికి చేయగలిగినదంతా చేయమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. యెహోవాకు మనం ఎన్నో విధాలుగా సేవచేయవచ్చు. మనలో ప్రతీఒక్కరం ఒకే విధంగా సేవ చేయలేకపోవచ్చు. కానీ మనందరం రాజ్యసువార్తను ప్రకటించవచ్చు. ఈ పనిని యెహోవాయే స్వయంగా చేయగలడు. ఆయన పరలోకం నుండి భూమ్మీదున్న ప్రజలతో నేరుగా మాట్లాడగలడు. తన రాజ్యాన్ని పరిపాలించే రాజు గురించి ప్రకటించే సామర్థ్యాన్ని యెహోవా రాళ్లకు కూడా ఇవ్వగలడని యేసు చెప్పాడు. (లూకా 19:37-40) కానీ తన ‘జత పనివాళ్లుగా’ ఉండే అవకాశాన్ని యెహోవా మనకిచ్చాడు. (1 కొరిం. 3:9) అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు, “మేము దేవునితోపాటు పనిచేస్తూ, మీరు పొందిన ఆయన కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్ములను వేడుకొంటున్నాం.” (2 కొరిం. 6:1, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) అవును, దేవునితో కలిసి పనిచేసే అవకాశం మనకు దొరికిన గొప్ప గౌరవం. అంతేకాదు అది మనకు ఎంతో సంతోషాన్నిస్తుంది, దానికి కొన్ని కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దేవునితో పనిచేయడం మనకు సంతోషాన్నిస్తుంది

6. తన తండ్రితో కలిసి పనిచేయడం గురించి యేసు ఏమి చెప్పాడు?

6 దేవునితో కలిసి పనిచేయడం ఆయన సేవకులకు ఎప్పుడూ సంతోషాన్నిచ్చింది. భూమ్మీదికి రాకముందు దేవుని మొట్టమొదటి కుమారుడైన యేసు ఇలా అన్నాడు, “పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున . . . యెహోవా నన్ను కలుగజేసెను. నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని.” (సామె. 8:22, 30) యేసు తన తండ్రితో కలిసి పనిచేసినప్పుడు చాలా సంతోషించాడు. ఎందుకంటే ఆయన ఎన్నో పనులు చేయగలిగాడు, తండ్రి తనను ప్రేమిస్తున్నాడని తెలుసుకోగలిగాడు. మరి మన విషయమేమిటి?

ఇతరులకు సత్యాన్ని బోధించడం కన్నా సంతృప్తినిచ్చే పని మరొకటి ఏముంటుంది? (7వ పేరా చూడండి)

7. ప్రకటనాపని మనకెందుకు సంతోషాన్నిస్తుంది?

7 ఇవ్వడంలో అలాగే తీసుకోవడంలో సంతోషముంటుందని యేసు అన్నాడు. (అపొ. 20:35) నిజమే, ఇతరుల నుండి సత్యం తెలుసుకున్నప్పుడు మనం చాలా ఆనందించాం. ఆ సత్యాన్ని వేరేవాళ్లతో పంచుకున్నప్పుడు కూడా మనకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్లు బైబిలు ఏమి చెప్తుందో అర్థంచేసుకుని దేవునితో స్నేహం చేయడం మొదలుపెట్టినప్పుడు ఎంత సంతోషిస్తారో మనం కళ్లారా చూస్తాం. వాళ్లు తమ ఆలోచనా తీరును, జీవన విధానాన్ని మార్చుకోవడం మనకు చాలా సంతోషాన్నిస్తుంది. ప్రకటనాపనే అన్నిటికన్నా ముఖ్యమైనది, అన్నిటికన్నా ఎక్కువ సంతృప్తినిచ్చేది. దేవునితో స్నేహం చేసేవాళ్లు నిత్యజీవం పొందడానికి ఆ పని సహాయం చేస్తుంది.—2 కొరిం. 5:20.

8. యెహోవాతో కలిసి పనిచేయడం వల్ల కలిగే అనుభూతి గురించి కొంతమంది ఏమంటున్నారు?

8 మనం ప్రకటించే సువార్తకు ప్రజలు చక్కగా స్పందించడం మాత్రమే మన సంతోషానికి కారణం కాదు. ఆ పని చేస్తూ యెహోవాను సంతోషపెడుతున్నామని, తనను సేవించడానికి మనం చేస్తున్న కృషిని ఆయన విలువైనదిగా చూస్తున్నాడని తెలుసుకోవడం కూడా మనకు సంతోషాన్నిస్తుంది. (1 కొరింథీయులు 15:58 చదవండి.) ఇటలీలో ఉంటున్న మార్కో ఇలా అంటున్నాడు, “నేను చేసినదాన్ని త్వరగా మర్చిపోయేవాళ్లకు కాకుండా యెహోవాకు శ్రేష్ఠమైనది ఇస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందానికి వెలకట్టలేం.” అదే దేశంలో ఉంటున్న ఫ్రాంకో ఏమంటున్నాడంటే, “మనం చేస్తున్న కృషి మనకు గొప్పగా అనిపించకపోవచ్చు. కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడనీ మనం చేసే ప్రతీదాన్ని విలువైనదిగా చూస్తున్నాడనీ తన వాక్యం ద్వారా, ఆధ్యాత్మిక ఏర్పాట్ల ద్వారా యెహోవా ప్రతీరోజు మనకు గుర్తుచేస్తున్నాడు. అందుకే ఆయనతో కలిసి పనిచేయడం నాకు సంతోషాన్ని, నా జీవితానికో అర్థాన్ని ఇస్తుంది.”

దేవునితో పనిచేయడం వల్ల ఆయనకు, ఇతరులకు దగ్గరౌతాం

9. యెహోవాకు యేసుకు మధ్య ఎలాంటి సంబంధం ఉంది? ఎందుకు?

9 మనం ప్రేమించేవాళ్లతో కలిసి పనిచేసినప్పుడు వాళ్లకు మనం దగ్గరౌతాం. అంతేకాదు వాళ్ల వ్యక్తిత్వం, లక్షణాల గురించి ఎక్కువ తెలుసుకుంటాం. వాళ్ల లక్ష్యాలేమిటో, వాటిని చేరుకోవడానికి ఎలా ప్రయత్నిస్తున్నారో కూడా మనకు తెలుస్తుంది. యేసు యెహోవాతో కలిసి బహుశా కొన్ని కోట్ల సంవత్సరాలు పనిచేసివుంటాడు. దానివల్ల వాళ్లిద్దరి మధ్య ఉన్న ప్రేమాప్యాయతలు ఎవ్వరూ విడదీయలేనంత బలంగా అయ్యాయి. వాళ్లు ఎంత సన్నిహితంగా ఉన్నారో వివరిస్తూ యేసు ఇలా అన్నాడు, ‘నేనూ తండ్రీ ఏకమై ఉన్నాము.’ (యోహా. 10:30) అవును, వాళ్లు నిజంగానే ఐక్యంగా ఉంటూ, చేస్తున్న పనిలో ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉన్నారు.

10. ప్రకటనాపని మనల్ని దేవునికి, ఇతరులకు ఎందుకు దగ్గర చేస్తుంది?

10 యేసు తన శిష్యులను కాపాడమని యెహోవాను అడిగాడు. ఎందుకంటే ఆయన యెహోవాతో ‘ఏకమై ఉన్నట్లు వాళ్లూ ఏకమై ఉండాలని’ యేసు కోరుకున్నాడు. (యోహా. 17:11) మనం దేవుని ప్రమాణాలకు తగ్గట్లు జీవిస్తూ, ప్రకటనా పనిలో పాల్గొన్నప్పుడు దేవుని అద్భుతమైన లక్షణాలను మరింత బాగా అర్థంచేసుకోగలుగుతాం. అంతేకాదు ఆయనమీద నమ్మకముంచడం, ఆయన నిర్దేశాల్ని పాటించడం ఎందుకు తెలివైన పనో తెలుసుకోగలుగుతాం. అలా మనం ఆయనకు దగ్గరైనప్పుడు ఆయన కూడా మనకు దగ్గరౌతాడు. (యాకోబు 4:8 చదవండి.) మనకూ మన తోటి సహోదరసహోదరీలకూ ఒకేలాంటి కష్టసుఖాలు, లక్ష్యాలు ఉంటాయి కాబట్టి మనం వాళ్లకు కూడా దగ్గరౌతాం. అవును మనందరం కలిసి పనిచేస్తాం, ఆనందిస్తాం, సహిస్తాం. బ్రిటన్‌లో ఉంటున్న ఆక్టేవీయ ఇలా చెప్పింది, “యెహోవాతో కలిసి పనిచేయడంవల్ల నేను ఇతరులకు దగ్గరవ్వగలుగుతున్నాను.” తనలాంటి లక్ష్యాలే ఉన్నవాళ్లతో, తను వెళ్లే బాటలోనే వెళ్తున్నవాళ్లతో స్నేహం చేయడంవల్లే అది సాధ్యమైందని ఆమె వివరించింది. మన మనసులో కూడా ఇలాంటి అభిప్రాయమే ఉంది కదా. యెహోవాను సంతోషపెట్టడానికి మన తోటి సహోదరసహోదరీలు చేస్తున్న కృషిని చూసినప్పుడు మనం వాళ్లకు దగ్గరౌతాం.

11. కొత్తలోకంలో మనం యెహోవాకు అలాగే తోటి సహోదరసహోదరీలకు ఎందుకు మరింత దగ్గరౌతాం?

11 దేవునిపట్ల, మన సహోదరసహోదరీలపట్ల మనకు బలమైన ప్రేమ ఉంది. కొత్తలోకంలో అది మరింత బలపడుతుంది. మనందరం భవిష్యత్తులో చేయబోయే ఆసక్తికరమైన పని గురించి ఒకసారి ఆలోచించండి. పునరుత్థానమైన వాళ్లను ఆహ్వానిస్తూ వాళ్లకు యెహోవా గురించి నేర్పిస్తాం. భూమిని పరదైసుగా మార్చే పని కూడా చేస్తాం. అందరం కలిసిమెలిసి పనిచేస్తూ, క్రీస్తు పరిపాలనలో క్రమక్రమంగా పరిపూర్ణులవ్వడం నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడు మనందరం ఒకరికొకరం, అలాగే ‘ప్రతి జీవి కోరికను తృప్తిపరచే’ యెహోవాకు మరింత దగ్గరౌతాం.—కీర్త. 145:16.

దేవునితో పనిచేయడం మనల్ని కాపాడుతుంది

12. ప్రకటనాపని మనల్ని ఎలా కాపాడుతుంది?

12 యెహోవాతో మన స్నేహాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మనం సాతాను లోకంలో జీవిస్తున్నాం, పైగా అపరిపూర్ణులం కాబట్టి మనం ఈ లోకంలోని వాళ్లలా ఆలోచిస్తూ వాళ్లలా ప్రవర్తించడం చాలా తేలిక. ఇది, నది ప్రవాహానికి ఎదురీదడంతో సమానం. మనం ఆ ప్రవాహంలో కొట్టుకొనిపోకూడదంటే మన బలాన్నంతా కూడగట్టుకుని దానికి ఎదురీదాలి. అదేవిధంగా సాతాను లోక ప్రభావం మనమీద పడకూడదంటే మనం చాలా కృషిచేయాలి. ఈ విషయంలో ప్రకటనాపని మనల్ని ఎలా కాపాడుతుంది? మనం ఇతరులతో యెహోవా గురించీ బైబిలు గురించీ మాట్లాడినప్పుడు, మన విశ్వాసాన్ని బలహీనపర్చే వాటిపై కాకుండా ముఖ్యమైన వాటిపై, మంచి విషయాలపై మనసుపెట్టినవాళ్లమౌతాం. (ఫిలి. 4:8) ప్రకటనాపని మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఎందుకంటే దేవుని వాగ్దానాలను, ఆయన ప్రేమతో ఇచ్చిన ప్రమాణాలను అది మనకు గుర్తుచేస్తుంది. అంతేకాదు సాతాను నుండి, అతని లోకం నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి అవసరమైన లక్షణాల్ని వృద్ధిచేసుకోవడానికి ప్రకటనాపని మనకు సహాయం చేస్తుంది.—ఎఫెసీయులు 6:14-17 చదవండి.

13. ఆస్ట్రేలియాలో ఉంటున్న ఓ సహోదరుడు ప్రకటనాపని గురించి ఏమంటున్నాడు? పరిచర్య గురించి మీ అభిప్రాయమేమిటి?

13 మనం పరిచర్యలో, ఇతర ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో బిజీగా ఉంటే మన సమస్యల గురించి అతిగా ఆలోచించే సమయం మనకుండదు. ఆ విధంగా అవి మనల్ని కాపాడతాయి. ఆస్ట్రేలియాలో ఉంటున్న జోయెల్‌ అనే సహోదరుడు ఏమంటున్నాడంటే, “వాస్తవాల్ని మర్చిపోకుండా ఉండడానికి ప్రకటనా పని నాకు సహాయం చేస్తుంది. అంతేకాదు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని, బైబిలు సూత్రాలు పాటించడంవల్ల నేను పొందిన ప్రయోజనాల్ని అది నాకు గుర్తుచేస్తుంది. వినయంగా ఉండేందుకు కూడా ప్రకటనాపని నాకు సహాయం చేస్తుంది. యెహోవాపై, తోటి సహోదరసహోదరీలపై ఆధారపడడానికి నాకు అది ఓ అవకాశాన్నిస్తుంది.”

14. దేవుని పవిత్రశక్తి మనకు అండగా ఉందనడానికి ఏ రుజువు ఉంది?

14 దేవుని పవిత్రశక్తి మనకు అండగా ఉందనే నమ్మకం ప్రకటనాపని వల్ల మరింత బలపడుతుంది. ఈ ఉదాహరణ గురించి ఆలోచించండి. మీ ప్రాంతంలో ఉంటున్నవాళ్లకు పౌష్టికాహారాన్ని పంచిపెట్టే ఉద్యోగం మీకు దొరికింది అనుకోండి. కానీ ఈ పని చేసినందుకు మీకు ఎలాంటి జీతం ఉండదు, పైగా మీ ఖర్చులన్నిటినీ మీరే భరించుకోవాలి. అయితే, మీరు ఇచ్చే ఆహారాన్ని చాలామంది తీసుకోవట్లేదు. కొంతమందైతే దాన్ని ఇస్తున్నందుకు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎంతకాలం ఆ ఉద్యోగాన్ని చేయడానికి ఇష్టపడతారు? ఖచ్చితంగా నిరుత్సాహపడి, ఆ ఉద్యోగాన్ని బహుశా వదిలేస్తారు. కానీ ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా మనలో చాలామందిమి ప్రకటనా పనిని మాత్రం ఆపట్లేదు. ఆ పని చేయడానికి మన డబ్బు ఖర్చయినా, ప్రజలు మనల్ని చూసి ఎగతాళి చేసినా, కోప్పడినా పరిచర్య మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాం. దేవుని శక్తి మనకు సహాయం చేస్తుందనడానికి ఇదే రుజువు.

దేవునితో పనిచేయడం ఆయనపై, ఇతరులపై మనకున్న ప్రేమకు రుజువు

15. మనుషులపట్ల దేవుని సంకల్పానికి, ప్రకటనాపనికి మధ్య ఉన్న సంబంధమేమిటి?

15 మనుషులపట్ల దేవుని సంకల్పానికి, ప్రకటనాపనికి మధ్య ఉన్న సంబంధమేమిటి? మనుషులు నిత్యం జీవించాలన్నది దేవుని సంకల్పం. అయితే ఆదాము పాపం చేసినప్పటికీ దేవుని సంకల్పం మారలేదు. (యెష. 55:11) మనల్ని పాపమరణాల నుండి విడిపించడానికి దేవుడు ప్రేమతో ఓ ఏర్పాటు చేశాడు. ఏమిటా ఏర్పాటు? యేసు భూమ్మీదికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు. కానీ ఆయన బలి నుండి ప్రయోజనం పొందాలంటే మనుషులు దేవుని మాట వినాలి. కాబట్టి మనుషులు ఏమి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో యేసు బోధించాడు, వాటిని బోధించమని తన శిష్యులకు కూడా ఆజ్ఞాపించాడు. నేడు మనం ప్రకటనాపని చేస్తూ ప్రజలు దేవుని స్నేహితులవ్వడానికి సహాయం చేస్తున్నామంటే మనుషుల్ని పాపమరణాల నుండి విడిపించడానికి దేవునితో కలిసి పనిచేస్తున్నట్లే.

16. దేవుడిచ్చిన రెండు ముఖ్యమైన ఆజ్ఞలకు ప్రకటనాపనికి ఉన్న సంబంధమేమిటి?

16 నిత్యజీవాన్ని సొంతం చేసుకునేందుకు ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనకు వాళ్లపై, యెహోవాపై ప్రేమ ఉందని చూపిస్తాం. “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై” ఉండాలన్నది యెహోవా కోరిక. (1 తిమో. 2:4) దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఏది గొప్పదని ఓ పరిసయ్యుడు యేసును అడిగినప్పుడు ఆయనిలా జవాబిచ్చాడు, “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.” (మత్త. 22:37-39) రాజ్యసువార్త ప్రకటించడం ద్వారా మనం ఆ ఆజ్ఞలకు లోబడతాం.—అపొస్తలుల కార్యములు 10:42 చదవండి.

17. సువార్త ప్రకటించే గొప్ప అవకాశం గురించి మీకేమనిపిస్తుంది?

17 రాజ్యసువార్త ప్రకటించడం మనకు ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా దేవునికి, తోటి సహోదరసహోదరీలకు మనల్ని మరింత దగ్గర చేస్తుంది. అంతేకాదు దేవునితో మన స్నేహాన్ని కాపాడుతుంది. దేవునిపట్ల, ఇతరులపట్ల మనకున్న ప్రేమను చూపించేందుకు మనకు ఓ అవకాశాన్ని కూడా ఇస్తుంది. అలాంటి పనిని ఇచ్చి యెహోవా మనల్ని ఎంత ఆశీర్వదించాడో కదా! ప్రపంచవ్యాప్తంగా యెహోవాకు లక్షలమంది సేవకులున్నారు, వాళ్లందరికీ వేర్వేరు పరిస్థితులున్నాయి. కానీ మనం యౌవనులమైనా-ముసలివాళ్లమైనా, ధనవంతులమైనా-పేదవాళ్లమైనా, బలవంతులమైనా-బలహీనులమైనా మన విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవడానికి చేయగలిగినదంతా చేస్తాం. ఫ్రాన్స్‌కు చెందిన చ్యాన్‌టెల్‌ ఇలా అంటోంది, “విశ్వంలో అందరికన్నా శక్తివంతమైన, సమస్తాన్ని సృష్టించిన, సంతోషంగల దేవుడు, ‘వెళ్లు! మాట్లాడు! నా తరఫున మాట్లాడు, హృదయపూర్వకంగా మాట్లాడు. నీకు నా బలాన్ని, నా వాక్యమైన బైబిల్ని, దేవదూతల మద్దతును, భూమ్మీదున్న నా సేవకుల తోడును, అవసరమైన శిక్షణను, సరైన సమయంలో సూటైన సూచనలను ఇస్తాను’ అని నాతో చెప్తున్నాడు. యెహోవా మన నుండి కోరేది చేస్తూ ఆయనతో కలిసి పని చేయడం ఎంతో గొప్ప అవకాశం.” మనందరం కూడా ఆ సహోదరిలాగే భావిస్తాం.