కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం

యేసు ఎందుకు బాధ అనుభవించి చనిపోయాడు?

యేసు ఎందుకు బాధ అనుభవించి చనిపోయాడు?

ఒక మనిషి [ఆదాము] ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి.—రోమీయులు 5:12

“మీకు ఎప్పుడూ బ్రతికే ఉండాలని ఉందా?” అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు ఏమని సమాధానం ఇస్తారు. చాలామంది, అవును చనిపోకుండా ఉంటే బాగుంటుంది, కానీ అది జరగదు కదా అంటారు. మరణం జీవితంలో ఒక భాగం, పుట్టాక ఎవరికైనా చావు తప్పదు అంటారు.

కానీ, అదే ప్రశ్నని మార్చి, “మీరు ఇప్పుడు చనిపోవాలనుకుంటున్నారా?” అని ఎవరైనా అడిగితే, సాధారణంగా లేదు అనే అంటారు. కాబట్టి విషయం ఏంటంటే, ఎన్ని కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నా సహజంగా మనకు జీవించాలనే ఉంటుంది. ఆ కోరికతో, ఆ ఇష్టంతో దేవుడు మనుషుల్ని చేశాడని బైబిల్లో ఉంది. నిజానికి “ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడు” అని అందులో ఉంది.—ప్రసంగి 3:11.

అయితే మనుషులెవరూ చనిపోకుండా లేరు. ఎందుకు ఇలా జరిగింది? ఈ పరిస్థితిని మార్చడానికి దేవుడు ఏమైనా చేశాడా? వీటి గురించి బైబిల్లో ఉన్న విషయాలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి, అంతేకాదు యేసు ఎందుకు బాధపడి చనిపోవాల్సి వచ్చిందో కూడా వివరిస్తాయి.

మనుషులు ఎందుకు చనిపోతున్నారు?

బైబిల్లో ఉన్న ఆదికాండము 1-3 అధ్యాయాల్లో దేవుడు మొదటి మనుషులు ఆదాము, హవ్వను చేసి వాళ్ల ముందు మరణం లేని జీవితాన్ని ఉంచాడని ఉంది. దానికోసం వాళ్లేమి చేయాలో చెప్పాడు. వాళ్లు దేవుని మాట వినకుండా ఆ అవకాశాన్ని ఎలా పోగొట్టుకున్నారో కూడా అక్కడ ఉంది. ఈ వివరాలు సూటిగా, చాలా మామూలుగా ఉన్నాయి. అందుకే చాలామంది ఇది ఎవరో కల్పించిన కథ అని అనుకుంటారు. కానీ ఆదికాండము కూడా సువార్తల్లానే ఖచ్చితమైన, చారిత్రకమైన పుస్తకం. a

ఆదాము దేవుని మాట వినక పోవడం వల్ల ఏం జరిగింది? బైబిలు ఇలా చెప్తుంది: “ఇట్లుండగా ఒక మనుష్యుని [ఆదాము] ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” (రోమీయులు 5:12) దేవుని మాట వినకుండా ఆదాము పాపం చేశాడు. అందుకే మరణం లేని జీవితాన్ని పోగొట్టుకున్నాడు, చివరికి చనిపోయాడు. ఆయనకు పుట్టిన పిల్లలుగా మనందరికీ అదే పాప పరిస్థితి వచ్చింది. మనమెందుకు చనిపోతున్నామో ఇక్కడ చెప్పిన విషయాలు, నేడు సైన్స్‌ చెప్పే విషయాలు ఒకేలా ఉన్నాయి. సైన్స్‌ ప్రకారం పిల్లలకు పోలికలు, లక్షణాలన్నీ తల్లిదండ్రుల ద్వారా వస్తాయి. అందుకే మనకు జబ్బులు, ముసలితనం, మరణం వస్తున్నాయి. మరి దీన్ని మార్చడానికి దేవుడేమైనా చేశాడా?

దేవుడు ఏమి చేశాడు

ఆదాము వల్ల అతని పిల్లలు పోగొట్టుకున్న వాటిని తిరిగి తీసుకురావడానికి, లేదా పాప పరిస్థితి నుండి మనుషుల్ని విడిపించడానికి, మరణం లేని జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు ఏర్పాట్లు చేశాడు. దేవుడు దాన్ని ఎలా చేశాడు?

బైబిలు ‘పాపంవల్ల వచ్చే జీతం మరణం’ అని రోమీయులు 6:23⁠లో చెప్తుంది. అంటే పాపానికి ఫలితం మరణం. ఆదాము పాపం చేశాడు అందుకే మరణించాడు. మనం కూడా పాపం చేస్తాం, అందుకే దాని ఫలితంగా చనిపోతాం. కానీ మనం ఏ తప్పు చేయకుండానే ఈ పాపంలో పుట్టాం. అందుకే దేవుడు ప్రేమతో ఆయన కుమారుడైన యేసును పంపి, పాపం వల్ల వచ్చే పర్యవసానాల్ని లేదా ‘పాపం వల్ల వచ్చే జీతాన్ని’ మనకి బదులు ఆయన భరించాడు. కానీ అదెలా సాధ్యం?

యేసు మరణం ద్వారా చనిపోకుండా సంతోషంగా ఉండే జీవితం వచ్చింది

ఏ లోపం లేని ఒక్క మనిషి ఆదాము, దేవుని మాట వినకపోవడం వల్ల పాపం, మరణం మనకు వచ్చాయి. అలాగే ఏ లోపం లేని ఒక్క మనిషి, ప్రాణం పోయే స్థితిలో కూడా దేవుని మాట వింటేనే మనకు ఈ భారం నుండి విడుదల వస్తుంది. బైబిలు ఆ విషయాన్ని ఇలా వివరిస్తుంది: “ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు.” (రోమీయులు 5:19) విధేయత చూపించిన ఆ మనుష్యుడు యేసే. ఆయన పరలోకాన్ని విడిచి వచ్చాడు, ఏ లోపం లేని మనిషిగా b పుట్టాడు, మన కొరకు చనిపోయాడు. అందుకే దేవుని యెదుట నీతిమంతులుగా ఉండగలుగుతున్నాము. భవిష్యత్తులో మరణం లేని జీవితం పొందుతాం.

యేసు ఎందుకు బాధ అనుభవించి చనిపోయాడు

ఇదంతా జరగాలంటే యేసు చనిపోవాల్సిందేనా? ఆదాము నుండి వచ్చిన మనుషులందరూ చనిపోకుండా బ్రతికి ఉండాలని సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక్క మాట చెప్తే సరిపోదా? ఆయనకు అలా చేసే అధికారం ఉంది. కానీ అలా చేస్తే ‘పాపం వల్ల వచ్చే జీతం మరణం’ అని ఆయన పెట్టిన నియమాన్ని, ఆయనే నిర్లక్ష్యం చేసినట్లు అవుతుంది. వీలునుబట్టి మార్చుకోవడానికి లేదా తీసేయడానికి ఆ నియమం చిన్న ఆజ్ఞ కాదు. అది నిజమైన న్యాయానికి ఆధారం.—కీర్తన 37:28.

దేవుడు ఈ ఒక్క విషయంలో న్యాయాన్ని పక్కన పెట్టినట్లయితే, అప్పుడు మిగతా విషయాల్లో దేవుడు ఇలానే ఉంటాడా అని మనుషులు అనుకోవచ్చు. ఉదాహరణకు, ఆదాము సంతానంలో ఎవరికి నిత్యజీవం ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనే విషయంలో ఆయన న్యాయంగా ఉంటాడా? ఆయన చేసిన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడని నమ్మవచ్చా? మనల్ని కాపాడడానికి దేవుడు న్యాయానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టే, ఆయన ఎప్పుడూ సరైనదే చేస్తాడనే అభయం మనకు ఉంది.

యేసు చేసిన ప్రాణ త్యాగం వల్ల భూమి మీద పరదైసులో మరణం లేని జీవితానికి దేవుడు మార్గం తెరిచాడు. యోహాను 3:16⁠లో యేసు మాటలు చూడండి: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” అంటే యేసు మరణం దేవుని తిరుగులేని న్యాయానికి గుర్తు మాత్రమే కాదుగానీ, ముఖ్యంగా, ఆయనకు మనుషుల మీదున్న గొప్ప ప్రేమకు నిదర్శనం.

అయితే సువార్తల్లో చెప్పిన విధంగా యేసు అంత క్రూరంగా హింసను అనుభవించి ఎందుకు చనిపోవాలి? మనుషులకు కష్టాలు ఎదురైతే దేవునికి నమ్మకంగా ఉండరని సాతాను ఆరోపించాడు. యేసు ఇంత తీవ్ర పరీక్షను అనుభవించి, నమ్మకంగా ఉండడం వల్ల సాతాను ఆరోపణకు ఒక్కసారిగా జవాబిచ్చాడు. (యోబు 2:4, 5) సాతాను ఆదామును పాపం చేసేలా ప్రేరేపించినప్పుడు అతని ఆరోపణ నిజమని అనిపించి ఉండవచ్చు. కానీ అదాముకు సరిసమానంగా ఉన్న యేసు విపరీతమైన బాధలో కూడా దేవునికి విధేయుడై ఉన్నాడు. (1 కొరింథీయులు 15:45) ఆదాము కూడా అనుకున్నట్లయితే, దేవునికి విధేయత చూపించవచ్చు అని యేసు నిరూపించాడు. బాధను తట్టుకుని యేసు మన కోసం మంచి మాదిరి ఉంచాడు. (1 పేతురు 2:21) పూర్తిగా విధేయత చూపించినందుకు దేవుడు యేసుకు పరలోకంలో అమర్త్యమైన జీవాన్ని ఇచ్చాడు.

మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు

యేసు మరణం ఒక వాస్తవం. దానివల్ల మరణం లేని జీవితం సాధ్యమౌతుంది. మీరు ఎప్పుడూ జీవించే ఉండాలని అనుకుంటున్నారా? దానికోసం మనమేమి చేయాలో యేసు అన్న ఈ మాటల్లో తెలుస్తుంది: ‘అద్వితీయ సత్యదేవుడవైన నిన్నూ, నీవు పంపిన యేసుక్రీస్తునూ ఎరుగుటయే నిత్యజీవం.’—యోహాను 17:3.

ఈ పత్రిక ప్రచురణకర్తలు నిజమైన దేవుడైన యెహోవా గురించి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు గురించి మీరు ఎక్కువ తెలుసుకోవాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మీ ప్రాంతంలో ఉన్న యెహోవాసాక్షులు మీకు సహాయం చేస్తారు. మీరు మా వెబ్‌సైట్‌ jw.orgలో కూడా ఎంతో మంచి సమాచారం తెలుసుకోవచ్చు. ▪ (w16-E No.2)

a యెహోవాసాక్షులు ప్రచురించిన ఇన్‌సైట్‌ ఆన్‌ ద స్క్రిప్చర్స్‌ 922వ పేజీలో ఉన్న “The Historical Character of Genesis,” అనే భాగం చూడండి.

b దేవుడు ఆయన కుమారుని ప్రాణాన్ని పరలోకం నుండి మరియ గర్భంలో పెట్టాడు. మరియలో ఉన్న పాపం వారసత్వంగా యేసుకు రాకుండా దేవుని పరిశుద్ధాత్మ ఆయన్ను కాపాడింది.—లూకా 1:31, 35.