కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యౌవనులారా—బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?

యౌవనులారా—బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?

“మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా?”లూకా 14:28.

పాటలు: 6, 34

తర్వాతి రెండు ఆర్టికల్‌లు, బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్న యౌవనుల కోసం తయారుచేశాం

1, 2. (ఎ) నేడు దేవుని ప్రజలకు ఏది సంతోషాన్నిస్తుంది? (బి) బాప్తిస్మం తీసుకోవడమంటే ఏమిటో అర్థంచేసుకోవడానికి క్రైస్తవ తల్లిదండ్రులు, పెద్దలు యౌవనులకు ఎలా సహాయం చేయవచ్చు?

 “నువ్వు పుట్టినప్పటి నుండి నాకు తెలుసు. నువ్వు బాప్తిస్మం తీసుకోవాలని అనుకుంటున్నావంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను, ‘నువ్వు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలని అనుకుంటున్నావు?’” అని ఓ సంఘపెద్ద 12 ఏళ్ల క్రిస్టఫర్‌ను అడిగాడు. ఆయన అలా అడగడానికి సరైన కారణాలే ఉన్నాయి. ప్రతీ సంవత్సరం వేలమంది యౌవనులు బాప్తిస్మం తీసుకోవడం చూసి మనందరం సంతోషిస్తున్నాం. (ప్రసం. 12:1) అయితే అలా బాప్తిస్మం తీసుకోవాలని వాళ్లంతట వాళ్లే నిర్ణయించుకున్నారో లేదో, అసలు బాప్తిస్మం తీసుకోవడం అంటే ఏమిటో అర్థం చేసుకున్నారో లేదో సంఘపెద్దలు, తల్లిదండ్రులు తెలుసుకోవాలి.

2 సమర్పణ, బాప్తిస్మంతో ఓ క్రైస్తవునికి కొత్త జీవితం మొదలౌతుందని బైబిలు చెప్తుంది. ఆ కొత్త జీవితం, యెహోవా ఇచ్చే ఎన్నో దీవెనలతోపాటు సాతాను నుండి వ్యతిరేకతలను కూడా తీసుకొస్తుంది. (సామె. 10:22; 1 పేతు. 5:8) అందుకే క్రైస్తవ తల్లిదండ్రులు సమయం తీసుకుని క్రీస్తు శిష్యులుగా ఉండడమంటే ఏమిటో తమ పిల్లలకు నేర్పించాలి. ఒకవేళ తల్లిదండ్రులు క్రైస్తవులు కాకపోతే, ఆ పిల్లలకు సంఘపెద్దలే సమర్పణ, బాప్తిస్మం అంటే ఏమిటో అర్థంచేసుకోవడానికి ప్రేమతో సహాయం చేస్తారు. (లూకా 14:27-30 చదవండి.) ఓ బిల్డింగ్‌ కట్టాలంటే సిద్ధపాటు ఎలా అవసరమో, బాప్తిస్మం తీసుకోవడానికి ముందు యౌవనులకు కూడా సిద్ధపాటు అవసరం. దానివల్ల వాళ్లు యెహోవాను “అంతమువరకు” నమ్మకంగా సేవించగలుగుతారు. (మత్త. 24:13) జీవితాంతం యెహోవాను నమ్మకంగా సేవించాలని బలంగా నిర్ణయించుకోవడానికి యౌవనులకు ఏమి సహాయం చేస్తుంది? ఇప్పుడు చూద్దాం.

3. (ఎ) యేసు, పేతురు చెప్పిన మాటలు బాప్తిస్మం ప్రాముఖ్యత గురించి ఏం చెప్తున్నాయి? (మత్త. 28:19, 20; 1 పేతు. 3:21) (బి) మనం ఏ ప్రశ్నల గురించి చర్చిస్తాం? ఎందుకు?

3 మీరు బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్న యౌవనులా? అలాగైతే, మీరు చాలా మంచి లక్ష్యం పెట్టుకున్నారు. బాప్తిస్మం తీసుకుని ఓ యెహోవాసాక్షిగా అవ్వడం చాలా గొప్ప గౌరవం. ప్రతీ క్రైస్తవుడు బాప్తిస్మం తీసుకోవాలి. మహాశ్రమలను తప్పించుకోవడానికి అది చాలా ప్రాముఖ్యం కూడా. (మత్త. 28:19, 20; 1 పేతు. 3:21) మీరు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా, యెహోవాను ఎప్పటికీ సేవిస్తూ ఉంటానని మాటిస్తున్నారు. దాన్ని నిలబెట్టుకోవాలంటే, అసలు మీరు బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి మీకు ఈ ప్రశ్నలు సహాయం చేస్తాయి: (1) ఆ నిర్ణయం తీసుకునేంత పరిణతి నాకు ఉందా? (2) బాప్తిస్మం తీసుకోవాలనే కోరిక నాలో ఉందా? (3) యెహోవాకు సమర్పించుకోవడం అంటే ఏమిటో నాకు తెలుసా? ఈ ప్రశ్నల గురించి ఇప్పుడు చర్చించుకుందాం.

పరిణతి చెందే వయసు ఏది?

4, 5. (ఎ) బాప్తిస్మం కేవలం పెద్దవాళ్లు మాత్రమే తీసుకోవాలా? (బి) పరిణతి అంటే ఏమిటి?

4 కేవలం పెద్దవాళ్లు లేదా ఫలానా వయసున్నవాళ్లు మాత్రమే బాప్తిస్మం తీసుకోవడానికి అర్హులని బైబిలు చెప్పట్లేదు. “బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టలవలన తెలియజేయును” అని సామెతలు 20:11 చెప్తుంది. అంటే సరైనది చేయడమంటే ఏమిటో, సృష్టికర్తకు సమర్పించుకోవడమంటే ఏమిటో ఓ చిన్నపిల్లవాడు కూడా అర్థం చేసుకోగలడని దీనిబట్టి చెప్పవచ్చు. కాబట్టి ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునే సామర్థ్యం ఉండి, యెహోవాకు సమర్పించుకున్న యౌవనస్థులు ఎవరైనా బాప్తిస్మం తీసుకోవచ్చు. అది చాలా ప్రాముఖ్యం కూడా.—సామె. 20:7.

5 పరిణతి అంటే ఏమిటి? పరిణతి కేవలం ఓ వ్యక్తి వయసును లేదా అతని శారీరక ఎదుగుదలను మాత్రమే సూచించదు. పరిణతిగలవాళ్లు “మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు” కలిగివుంటారని బైబిలు చెప్తుంది. (హెబ్రీ. 5:14) పరిణతిగల వాళ్లకు యెహోవా దృష్టిలో ఏది మంచిదో తెలుసు, పైగా దాన్ని మాత్రమే చేయాలని వాళ్లు హృదయంలో నిర్ణయించుకుంటారు. కాబట్టి వాళ్లు అంత తేలిగ్గా తప్పు చేయాలనే శోధనకు లొంగిపోరు. అంతేకాదు పరిణతిగల వాళ్లకు, ఏది సరైనదో ప్రతీసారి ఎవరోఒకరు చెప్పాల్సిన అవసరం ఉండదు. అందుకే, తల్లిదండ్రులు లేదా ఇతర పెద్దవాళ్లు తమ పక్కన లేనప్పుడు కూడా బాప్తిస్మం తీసుకున్న యౌవనులు సరైనదాన్ని చేయాలని యెహోవా కోరుకోవడం సరైనదే.—ఫిలిప్పీయులు 2:12 పోల్చండి.

6, 7. (ఎ) బబులోనులో ఉన్నప్పుడు దానియేలుకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయో వివరించండి. (బి) తాను పరిణతిగల వ్యక్తినని దానియేలు ఎలా నిరూపించుకున్నాడు?

6 యౌవనస్థులు నిజంగా అలాంటి పరిణతిని చూపించగలరా? దానియేలు అనుభవాన్ని పరిశీలించండి. దానియేలును తల్లిదండ్రులకు దూరంగా బబులోను చెరకు తీసుకువెళ్లే సమయానికి ఆయన టీనేజీలో ఉండివుండవచ్చు. అనుకోని పరిస్థితుల్లో ఆయన దేవుని ప్రమాణాలను పాటించని ప్రజల మధ్య జీవించాల్సి వచ్చింది. దానియేలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఇంకాస్త లోతుగా ఆలోచిద్దాం. బబులోనులో ఆయన్ను చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా చూసేవాళ్లు. నిజానికి రాజు దగ్గర ఉండడానికి జాగ్రత్తగా ఎంచుకున్న యౌవనుల్లో ఆయన కూడా ఒకడు. (దాని. 1:3-5, 13) బహుశా దానియేలుకు బబులోనులో దొరికిన అవకాశాలు ఇశ్రాయేలులో ఎన్నటికీ దొరికి ఉండేవి కావు.

7 మరి యౌవనుడైన దానియేలు ఏమి చేశాడు? బబులోను ప్రజలను చూసి ఆయన కూడా మారిపోయాడా లేదా ఆయన విశ్వాసం తగ్గిపోయిందా? అస్సలు లేదు. బబులోనులో ఉండగా అబద్ధ ఆరాధనకు సంబంధించిన దేనితోనైనా ‘తనను అపవిత్రం చేసుకోకూడదని దానియేలు తన హృదయంలో నిశ్చయించుకున్నాడు’ అని బైబిలు చెప్తుంది. (దాని. 1:8, NW) ఆయన ఎంత పరిణతి చూపించాడో కదా!

పరిణతిగల యౌవనులు రాజ్యమందిరంలో దేవుని స్నేహితుల్లా, స్కూల్లో లోకస్థుల్లా ప్రవర్తించరు (8వ పేరా చూడండి)

8. దానియేలు నుండి మీరేమి నేర్చుకోవచ్చు?

8 దానియేలు నుండి మీరేమి నేర్చుకోవచ్చు? పరిణతిగల యౌవనులు, కష్టసమయాల్లో కూడా తమ నమ్మకాలకు అంటిపెట్టుకుని ఉంటారు. అంతేకానీ రాజ్యమందిరంలోనేమో దేవుని స్నేహితుల్లా, స్కూల్లోనేమో లోకంలోని వాళ్లలా ఉంటూ పరిసరాలను బట్టి రంగులు మారే ఊసరవెల్లిలా ప్రవర్తించరు. బదులుగా, కష్టపరిస్థితుల్లో కూడా నమ్మకంగా ఉంటారు.—ఎఫెసీయులు 4:14, 15 చదవండి.

9, 10. (ఎ) ఈ మధ్యకాలంలో తమ విశ్వాసానికి పరీక్షలు ఎదురైనప్పుడు తాము ఎలా ప్రవర్తించామో ఆలోచించుకోవడం వల్ల యౌవనులు ఎలాంటి ప్రయోజనం పొందవచ్చు? (బి) బాప్తిస్మం తీసుకోవడమంటే ఏమిటి?

9 నిజమే మనందరిలో లోపాలు ఉన్నాయి. యౌవనులే కాదు పెద్దవాళ్లు కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేస్తుంటారు. (ప్రసం. 7:20) కానీ బాప్తిస్మం తీసుకోవాలని అనుకుంటుంటే మాత్రం, మీరు దేవుని ఆజ్ఞల్ని పాటించాలని ఎంత బలంగా నిశ్చయించుకున్నారో ఓసారి ఆలోచించుకోవడం మంచిది. మీరిలా ప్రశ్నించుకోవచ్చు, ‘నేను ఇప్పటిదాకా దేవుని ప్రమాణాలను ఎంతవరకు పాటించాను?’ అంతేకాదు ఈ మధ్యకాలంలో మీ విశ్వాసానికి పరీక్షలు ఎదురైనప్పుడు మీరెలా ప్రవర్తించారో ఆలోచించుకోండి. ఆ సమయంలో ఏమి చేయడం సరైనదో మీరు గ్రహించగలిగారా? దానియేలును ప్రోత్సహించినట్లే, మిమ్మల్ని కూడా మీ నైపుణ్యాలను సాతాను లోకంలో ఉపయోగించమని ఎవరైనా ప్రోత్సహించారా? ఇలాంటి శోధనలు ఎదురైనప్పుడు, ఏం చేస్తే యెహోవా సంతోషిస్తాడో మీరు గ్రహించగలుగుతున్నారా?—ఎఫె. 5:17.

10 అలాంటి ప్రశ్నల గురించి ఆలోచించి, వాటికి మీ మనసు ఇచ్చే జవాబు ఏంటో తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? ఎందుకంటే బాప్తిస్మం ఎంత పెద్ద విషయమో అర్థంచేసుకోవడానికి అవి మీకు సహాయం చేస్తాయి. బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మీరు యెహోవాకు ఓ ప్రాముఖ్యమైన మాట ఇచ్చారని అందరికీ చూపిస్తారు. మీరు యెహోవాను ప్రేమిస్తూ, జీవితాంతం ఆయన్ను పూర్ణ హృదయంతో సేవిస్తారన్నదే ఆ మాట. (మార్కు 12:30) బాప్తిస్మం తీసుకున్న ప్రతీఒక్కరూ ఆ మాటను నిలబెట్టుకోవాలని నిశ్చయించుకోవాలి.—ప్రసంగి 5:4, 5 చదవండి.

బాప్తిస్మం తీసుకోవాలనే కోరిక మీలో ఉందా?

11, 12. (ఎ) బాప్తిస్మం తీసుకోవాలనుకునే వ్యక్తి దేన్ని పరిశీలించుకోవాలి? (బి) బాప్తిస్మాన్ని యెహోవా చూసినట్లు చూడడానికి మీకేది సహాయం చేస్తుంది?

11 యెహోవా ప్రజలందరూ, చివరికి యౌవనులు కూడా ఆయన్ను “ఇష్టపూర్వకముగా” సేవిస్తారని బైబిలు చెప్తుంది. (కీర్త. 110:3) కాబట్టి బాప్తిస్మం తీసుకోవాలనుకునే వ్యక్తికి, నిజంగా అలా తీసుకోవాలనే కోరిక తనలో ఉండాలి. దానికోసం మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. మరిముఖ్యంగా, మీరు యెహోవాసాక్షుల కుటుంబంలో పెరిగిన వాళ్లయితే మీలో ఆ కోరిక ఉందో లేదో మరింత జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.

12 మీరు పెద్దవాళ్లవుతుండగా, ఎంతోమంది బాప్తిస్మం తీసుకోవడం మీరు చూసివుండవచ్చు. అలా తీసుకున్నవాళ్లలో మీ స్నేహితులు, తోబుట్టువులు కూడా ఉండివుండవచ్చు. కానీ మీకు ఫలానా వయసు వచ్చింది కాబట్టి లేదా అందరూ బాప్తిస్మం తీసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా తీసుకోవాలని అనుకోకండి. బాప్తిస్మాన్ని యెహోవా చూసినట్లు చూడడానికి మీకేది సహాయం చేస్తుంది? బాప్తిస్మం తీసుకోవడం ఎందుకు చాలా ప్రాముఖ్యమో ఆలోచించడానికి సమయం తీసుకోండి. దాని ప్రాముఖ్యతను తెలిపే ఎన్నో మంచి కారణాలను మీరు ఈ ఆర్టికల్‌లో, దీని తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుంటారు.

13. బాప్తిస్మం తీసుకోవాలనే కోరిక మీలో ఉందో లేదో ఎలా తెలుసుకోవచ్చు?

13 బాప్తిస్మం తీసుకోవాలనే కోరిక మీలో ఉందో లేదో తెలుసుకోవడానికి సహాయం చేసే ఓ మార్గమేమిటంటే, మీ ప్రార్థనల్ని పరిశీలించుకోవడం. మీరు యెహోవాకు ఎన్నిసార్లు ప్రార్థిస్తారు? మీ అవసరాల గురించి మీరెంత వివరంగా ప్రార్థిస్తున్నారు? ఈ ప్రశ్నలకు జవాబులు యెహోవాతో మీ స్నేహం ఎంత బలంగా ఉందో చూపిస్తాయి. (కీర్త. 25:4) చాలాసార్లు మన ప్రార్థనలకు జవాబుల్ని యెహోవా బైబిలు ద్వారా ఇస్తాడు. మీరు నిజంగా యెహోవాకు మరింత దగ్గరవ్వాలనుకుంటున్నారనీ, ఆయన్ను మనస్ఫూర్తిగా సేవించాలనుకుంటున్నారనీ చూపించే మరో మార్గమేమిటంటే, మీ అధ్యయన అలవాట్లను పరిశీలించుకోవడం. (యెహో. 1:8) మీరిలా ప్రశ్నించుకోండి, ‘నేను బైబిల్ని క్రమంగా చదువుతున్నానా? మా కుటుంబ ఆరాధనలో నేను ఇష్టంగా భాగం వహిస్తున్నానా?’ ఈ ప్రశ్నలకు జవాబులు, బాప్తిస్మం తీసుకోవాలనే కోరిక మీలో ఉందో లేదో తెలుసుకోవడానికి సహాయం చేస్తాయి.

యెహోవాకు సమర్పించుకోవడం అంటే ఏమిటి?

14. సమర్పణకు, బాప్తిస్మానికి మధ్య ఉన్న తేడా ఏమిటి?

14 సమర్పణకు, బాప్తిస్మానికి మధ్య తేడా ఏమిటో కొంతమంది యౌవనులకు తెలిసుండకపోవచ్చు. కొంతమంది, తాము ఇప్పటికే తమ జీవితాల్ని యెహోవాకు సమర్పించుకున్నాం గానీ బాప్తిస్మం తీసుకోవడానికి మాత్రం సిద్ధంగా లేమని అనవచ్చు. నిజానికి అది సాధ్యమా? సమర్పణ అంటే, మీరు యెహోవాను ఎప్పటికీ సేవిస్తారని మాటిస్తూ ఆయనకు చేసే ప్రార్థన. బాప్తిస్మం తీసుకోవడం ద్వారా, మీరు ఇప్పటికే యెహోవాకు సమర్పించుకున్నారని ఇతరులకు చూపిస్తారు. కాబట్టి బాప్తిస్మం తీసుకోవడానికి ముందు, దేవునికి సమర్పించుకోవడం అంటే ఏమిటో మీరు అర్థంచేసుకోవాలి.

15. యెహోవాకు సమర్పించుకున్నప్పుడు మీరేమి చేస్తారు?

15 ఒక్కమాటలో చెప్పాలంటే, మీరు యెహోవాకు సమర్పించుకున్నప్పుడు మీపై పూర్తి అధికారాన్ని ఆయనకు ఇస్తారు. ఆయన్ను సేవించడమే జీవితంలో మీకు అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యమని మాటిస్తారు. (మత్తయి 16:24 చదవండి.) దేవునికి మీరిచ్చే మాటను తేలిగ్గా తీసుకోకూడదు. (మత్త. 5:33) అయితే మీపై పూర్తి అధికారాన్ని నిజంగా యెహోవాకు ఇచ్చేశారని మీరు ఎలా చూపిస్తారు?—రోమా. 14:8.

16, 17. (ఎ) మీ జీవితాన్ని యెహోవాకు అంకితం చేయడమంటే ఏమిటో ఓ ఉదాహరణతో చెప్పండి. (బి) యెహోవాకు సమర్పించుకోవడం అంటే ఏమని చెప్తున్నట్లు?

16 ఈ ఉదాహరణను పరిశీలించండి. మీ స్నేహితుడు మీకు ఓ కారును గిఫ్టుగా ఇచ్చాడనుకోండి. ఆ కారుకు సంబంధించిన పత్రాలన్నీ మీకిచ్చి, “ఈ కారు నీది” అని చెప్పాడు. కానీ ఆ తర్వాత, “కారు తాళాలు మాత్రం నాతోనే ఉంటాయి. కారు డ్రైవ్‌ చేసేది కూడా నువ్వు కాదు నేనే” అని అన్నాడనుకోండి. మీ స్నేహితుని గురించి, ఆయనిచ్చిన గిఫ్టు గురించి మీకేమనిపిస్తుంది?

17 ఓ వ్యక్తి తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకోవడం ద్వారా, “నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నాను. ఇక నేను నీ సొత్తు” అని మాట ఇస్తాడు. అతను ఆ మాట నిలబెట్టుకోవాలని ఆశించే హక్కు యెహోవాకు ఉంది. కానీ ఒకవేళ ఆ వ్యక్తి యెహోవాసాక్షికాని అమ్మాయిని రహస్యంగా ప్రేమిస్తూ దేవుని మాట వినకపోతే అప్పుడేంటి? లేదా ప్రీచింగ్‌కు, మీటింగ్‌కు వెళ్లడానికి ఆటంకంగా ఉండే ఉద్యోగంలో చేరితే? ఒకవేళ ఆ వ్యక్తి అలాచేస్తే యెహోవాకు అతను ఇచ్చిన మాటను నిలబెట్టుకోనట్లే. అది, మీరు ఇంకొకరికి గిఫ్టుగా ఇచ్చిన కారు తాళాలను మీ దగ్గరే పెట్టుకున్నట్లు ఉంటుంది. కానీ నిజానికి మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు, “నా జీవితం నాది కాదు, అది నీకే సొంతం” అని యెహోవాకు చెప్తాం. కాబట్టి మనం ఎల్లప్పుడూ యెహోవాకు ఇష్టమైనదే చేస్తాం, అది చేయడం మనకు ఇష్టం లేకపోయినా సరే. యేసు సరిగ్గా అదే చేశాడు. ఆయన ఇలా అన్నాడు, “నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.”—యోహా. 6:38.

18, 19. (ఎ) బాప్తిస్మం ఎన్నో దీవెనలను తీసుకొస్తుందని రోజ్‌, క్రిస్టఫర్‌ అనుభవాలు ఎలా చూపిస్తున్నాయి? (బి) బాప్తిస్మం తీసుకోవడం గురించి మీ అభిప్రాయమేమిటి?

18 బాప్తిస్మం తీసుకోవాలనుకోవడం చాలా పెద్ద నిర్ణయం. యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడం అనేది ఓ గొప్ప అవకాశం. యెహోవాను ప్రేమిస్తూ, సమర్పించుకోవడం అంటే ఏమిటో అర్థంచేసుకున్న యౌవనులు తమ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవడానికి ఆలస్యం చేయరు. అంతేకాదు వాళ్లు ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఏమాత్రం బాధపడరు. బాప్తిస్మం తీసుకున్న రోజ్‌ అనే ఓ టీనేజీ అమ్మాయి ఇలా చెప్తోంది, “నేను యెహోవాను ప్రేమిస్తున్నాను. యెహోవాను సేవించకుండా నేను ఏమి చేసినా ఇంత సంతోషంగా ఉండేదాన్ని కాదు. బాప్తిస్మం తీసుకోవాలని నిర్ణయించుకున్నంత బలంగా నేను నా జీవితంలో ఏదీ అనుకోలేదు.”

19 ఈ ఆర్టికల్‌లోని మొదటి పేరాలో మనం చూసిన క్రిస్టఫర్‌ సంగతేంటి? బాప్తిస్మం తీసుకోవాలని 12 ఏళ్ల వయసులో తీసుకున్న నిర్ణయం గురించి అతను ఎలా భావిస్తున్నాడు? ఆ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని క్రిస్టఫర్‌ చెప్తున్నాడు. అతనికి 17 ఏళ్లున్నప్పుడు క్రమ పయినీరు సేవ చేయడం మొదలుపెట్టాడు. 18 ఏళ్లకు పరిచర్య సేవకుడు అయ్యాడు, ఇప్పుడు బెతెల్‌లో సేవ చేస్తున్నాడు. క్రిస్టఫర్‌ ఇలా అంటున్నాడు, “బాప్తిస్మం తీసుకోవాలనుకోవడం నేను తీసుకున్న సరైన నిర్ణయం. యెహోవాకు, ఆయన సంస్థకు సేవచేస్తూ నా జీవితంలో చాలా సంతృప్తిని అనుభవిస్తున్నాను.” ఒకవేళ మీరు బాప్తిస్మం తీసుకోవాలని అనుకుంటుంటే, మీరు దానికి ఎలా సిద్ధపడవచ్చు? ఈ ప్రశ్నకు సమాధానాన్ని తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాం.