పత్రిక ముఖ్యాంశం | బైబిలు దాడుల్ని తట్టుకొని నిలిచింది
కొన్ని ముఖ్యమైన వాస్తవాలు
మతగ్రంథాల్లో బైబిలుకు సాటిగా నిలిచే గ్రంథం మరొకటి లేదు. ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది జీవితాలను తీర్చిదిద్దిన ఏకైక గ్రంథం బైబిలు. మరోవైపున, అత్యధిక అధ్యయనాలు జరిగినది, విమర్శలు వచ్చింది కూడా బైబిలు మీదే.
అలాంటి కొన్ని విమర్శలు గమనించండి. ఇప్పుడున్న బైబిల్లోని సందేశం నమ్మదగినది కాదని కొంతమంది నిపుణులు అంటారు. మతగ్రంథాలను అధ్యయనం చేసే ఒక ప్రొఫెసర్ ఇలా అన్నాడు, “మూలప్రతుల్లో ఉన్న సమాచారాన్ని ఉన్నదున్నట్టుగా అనువదించారని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. ఇప్పుడున్న బైబిలు కాపీలన్నిటిలో తప్పులే ఉన్నాయి. వీటిలో ఎక్కువశాతం కాపీలు, మూలప్రతులు రాయబడిన ఎన్నో వందల సంవత్సరాల తర్వాత తయారుచేయబడ్డాయి. వీటికీ, మూలప్రతులకీ మధ్య లెక్కలేనన్ని తేడాలున్నాయి.”
ఇతర మతాలు, బైబిల్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయని బోధిస్తున్నాయి. అలాంటి మతాలకు చెందిన కొంతమంది, బైబిలు నమ్మదగినదేనా అని ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు ఫైజల్ అనే వ్యక్తి అనుభవాన్ని పరిశీలించండి. బైబిలు ఒక పవిత్ర గ్రంథమే అయినప్పటికీ, అందులోని సందేశం ఇప్పుడు మారిపోయిందని వేరే మతస్థులైన తన కుటుంబ సభ్యులు అతనికి చెప్పారు. ఫైజల్ ఇలా అన్నాడు, “ఎవరైనా నా దగ్గరికి వచ్చి బైబిలు గురించి మాట్లాడతామంటే నేను అస్సలు ఇష్టపడేవాడిని కాదు. ఎందుకంటే వాళ్ల దగ్గరున్నది అసలైన బైబిలు కాదని, అందులోని సందేశం మారిపోయిందని నేను నమ్మాను.”
బైబిల్లో మార్పులు చేర్పులు జరిగాయో లేదో తెలుసుకోవడం నిజంగా ముఖ్యమంటారా? ఒకసారి ఆలోచించండి. బైబిల్లో మన భవిష్యత్తుకు సంబంధించి ఓదార్పుకరమైన వాగ్దానాలు ఉన్నాయి. అయితే, అవి నిజంగా మూలప్రతుల్లో ఉన్నవేనా లేక కొత్తగా చేర్చబడినవా అనేది తెలియకపోతే, మీరు వాటిని నమ్ముతారా? (రోమీయులు 15:4) ఇప్పుడు మన దగ్గరున్న బైబిల్లో తప్పులుంటే ఉద్యోగానికి, కుటుంబానికి, ఆరాధనకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందులోని సూత్రాల్ని మీరు పాటిస్తారా?
నిజమే, బైబిలు రచయితలు రాసిన అసలైన మూలప్రతులు ఇప్పుడు లేవు. అయితే ప్రాచీనకాలంలో నకలు రాయబడిన కొన్నివేల రాతప్రతులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. (మూలప్రతులను చూస్తూ అందులోని విషయాల్ని చేత్తో కాపీ చేసినవాటిని రాతప్రతులు అంటారు.) మరి, అంత ప్రాచీన రాతప్రతులు ఇప్పటికీ పాడవకుండా ఎలా ఉన్నాయి? వాటిని నాశనం చేయడానికి, అందులోని సందేశాన్ని మార్చడానికి వ్యతిరేకులు ప్రయత్నించినా అవి ఇప్పటికీ భద్రంగా ఎలా ఉన్నాయనే సందేహం మీకు రావచ్చు. బైబిలు సందేశం మారలేదనే విశ్వాసం మీకు కలగాలంటే, కొన్ని వాస్తవాలు తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? వీటికి జవాబుల్ని తర్వాతి ఆర్టికల్స్‌లో తెలుసుకోండి.