కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

హింస లేని ప్రపంచం వస్తుందా?

హింస లేని ప్రపంచం వస్తుందా?

మీరు లేదా మీ కుటుంబంలో వాళ్లు, ఎప్పుడైనా హింసకు గురయ్యారా? అలాంటిదేమైనా జరుగుతుందని మీరు భయపడుతున్నారా? హింస ఇప్పుడు “ప్రపంచంలో పెరుగుతున్న ఒక జబ్బు” అని అంటున్నారు. కొన్ని ఉదాహరణలు చూద్దాం.

గృహ హింస, లైంగిక దాడులు: “ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకర్ని వాళ్ల జీవితంలో ఏదో ఒక సమయంలో భర్త గానీ సన్నిహితంగా ఉండేవాళ్లు గానీ శారీరకంగా లేదా లైంగికంగా హింసించి ఉంటారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు స్త్రీలలో ఒకరిపై అత్యాచారం లేదా అత్యాచార ప్రయత్నమైనా జరుగుతుంది అని అంచనా.” ఇది ఐక్యరాజ్య సమితి ఇస్తున్న నివేదిక.

రౌడీ ముఠాలు: అమెరికాలో రౌడీ ముఠాలు లేదా గ్యాంగ్‌లు 30,000 కన్నా ఎక్కువే ఉన్నాయి. లాటిన్‌ అమెరికాలో ముగ్గురిలో కనీసం ఒక్కరైనా ఘోరమైన హింసకు గురయ్యారు.

హత్యలు: ఈ మధ్యకాలంలో కేవలం ఒక్క సంవత్సరంలోనే దాదాపు 10 లక్షలమందిని హత్య చేశారని అంచనా. యుద్ధాల్లో చనిపోయిన వాళ్లకన్నా ఎక్కువమంది ఇలా చనిపోయారు. ఆఫ్రికాలోని దక్షిణ దేశాల్లో, మధ్య అమెరికాలో ఎక్కువ హత్యలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సగటు కన్నా ఇది నాలుగు రెట్లు ఎక్కువ. లాటిన్‌ అమెరికాలో ఒక్క సంవత్సరంలోనే 1,00,000కన్నా ఎక్కువమందిని, ఒక్క బ్రెజిల్‌లోనే దాదాపు 50,000 కన్నా ఎక్కువమందిని హత్య చేశారు. ఈ హింసకు శాశ్వత పరిష్కారం వస్తుందా?

ఈ హింసను ఆపడం సాధ్యమేనా?

ఎక్కడ చూసిన ఎందుకు ఇంత హింస ఉంది? చాలా కారణాలు గుర్తించారు, వాటిలో కొన్ని: సామాజిక ఆర్థిక తేడాల వల్ల వచ్చే సమస్యలు, వేరే వాళ్ల జీవితం అంటే లెక్క లేకపోవడం, మద్యం మాదక ద్రవ్యాలు విపరీతంగా తీసుకోవడం, చిన్నతనం నుండే పిల్లలు పెద్దవాళ్లను చూసి హింసను నేర్చుకోవడం, శిక్ష పడుతుందనే భయం నేరగాళ్లకు లేకపోవడం.

ప్రపంచంలో కొన్ని చోట్ల హింసను అరికట్టడానికి చేసిన ప్రయత్నాలు కొంతవరకు ఫలితాన్ని ఇచ్చాయి. బ్రెజిల్‌లో జనాభా ఎక్కువగా ఉన్న సాఓ పౌలో నగరంలో గత పది సంవత్సరాల్లో హత్యల సంఖ్య దాదాపు 80 శాతం తగ్గింది. కానీ వేరే రకాల నేరాలన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ 1,00,000మందిలో దాదాపు 10 హత్యలు జరుగుతున్నాయి. మరి హింసని పూర్తిగా నిర్మూలించడానికి ఏమి చేయాల్సి ఉంటుంది.

హింసకు పూర్తి పరిష్కారం చివరికి మనుషుల స్వభావాలు, ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. క్రూరమైన వాళ్లు మారాలంటే, వాళ్లలో ఉన్న కొన్ని లక్షణాలు మారాలి. అహంకారం, అత్యాశ, స్వార్థం లాంటి లక్షణాలు పోయి ప్రేమ, గౌరవం, ఇతరుల మీద శ్రద్ధ రావాలి.

అంత పెద్ద మార్పులు చేసుకోవడానికి ఒక మనిషిని ఏది కదిలిస్తుంది? బైబిలు ఏమి నేర్పిస్తుందో చూడండి:

  • “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట.”—1 యోహాను 5:3.

  • “యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే.” aసామెతలు 8:13.

దేవుని మీద ప్రేమ, ఆయన్ను బాధపెట్టకూడదనే భక్తిపూర్వక భయం బలంగా పని చేసి హింసించే వాళ్లను కూడా మారుస్తుంది. పైపైన కాకుండా వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసుకోవడానికి ఇదంతా నడిపిస్తుంది. మరి అసలు ఇది జరుగుతుందా?

బ్రెజిల్‌లో, అలెక్స్‌ b అనే అతను చాలా దాడులు చేసి 19 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 2000లో ఆయన యెహోవాసాక్షుల దగ్గర బైబిలు గురించి నేర్చుకుని యెహోవాసాక్షి అయ్యాడు. ఆయన చెడు స్వభావాన్ని నిజంగా మార్చుకున్నాడా? అలెక్స్‌ చేసిన చెడు పనులన్నిటి గురించి చాలా బాధపడుతున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు, “నాకు నిజంగా క్షమాపణ దొరికిందనే భావనను ఇచ్చినందుకు నేను దేవున్ని ఎంతో ప్రేమిస్తున్నాను. యెహోవా మీదున్న ప్రేమ కృతజ్ఞత, నా ప్రవర్తన మార్చుకోవడానికి నాకు సహాయం చేశాయి.”

బ్రెజిల్‌లోనే సాజర్‌ అనే ఇంకొకతను చాలా దొంగతనాలు, దోపిడీలు చేశాడు. 15 సంవత్సరాలు అవే పనులు చేస్తూ ఉన్నాడు. తర్వాత మారాడు. ఎలా అంటే జైల్లో ఉన్నప్పుడు ఆయనను యెహోవాసాక్షులు కలిశారు. బైబిలు గురించి నేర్పించారు. సాజర్‌ ఇలా అంటున్నాడు: “మొదటిసారి నా జీవితానికున్న అర్థం తెలిసింది. దేవున్ని ప్రేమించడం నేర్చుకున్నాను. ఆయనకు భయపడడం కూడా నేర్చుకున్నాను. చెడ్డ పని చేస్తే యెహోవాను బాధపెడతానేమో అని భయపడుతున్నాను. యెహోవా చూపించిన దయకు కృతజ్ఞత లేకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. అలాంటి ప్రేమ, భయం నేను మారడానికి నన్ను కదిలించాయి.”

హింసలేని లోకంలో ఉండాలంటే ఏమి చేయాలో నేర్చుకోండి

ఈ నిజ జీవిత అనుభవాలు మనకు ఏమి చూపిస్తున్నాయి? మనుషులు ఆలోచించే విధానాన్నే మార్చేసి వాళ్లలో గట్టి మార్పు తెచ్చే శక్తి బైబిలుకు ఉంది. (ఎఫెసీయులు 4:23) ముందు చూసిన అలెక్స్‌ ఇలా అంటున్నాడు: “నేను బైబిల్లో నేర్చుకున్న విషయాలు శుద్ధమైన నీళ్లలా నాలో ప్రవహించి, నాలో ఉన్న చెడ్డ ఆలోచనలను మెల్లమెల్లగా కడిగేశాయి. ఇలాంటి వాటిని మానుకుంటానని కలలో కూడా అనుకోలేదు.” అది నిజం, ఎందుకంటే మన మనసుల్ని బైబిల్లో ఉన్న స్వచ్ఛమైన సందేశంతో నింపుకున్నప్పుడు, అదే మనలో ఉన్న చెడును తరిమేస్తుంది. దేవుని మాటలకు అంత బలం ఉంది. (ఎఫెసీయులు 5:26) దాని ఫలితంగానే క్రూరమైన స్వార్థపరులు కూడా దయగా, శాంతంగా మారతారు. (రోమీయులు 12:18) బైబిలు సూత్రాలను పాటించడం వల్ల వాళ్ల జీవితాల్లో మనశ్శాంతిని అనుభవిస్తున్నారు.—యెషయా 48:18.

80 లక్షలకన్నా ఎక్కువమంది యెహోవాసాక్షులు 240 దేశాల్లో హింసను ఎలా అరికట్టాలో కనుక్కున్నారు. అన్ని జాతుల నుండి వచ్చినవాళ్లు, వేర్వేరు సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవాళ్లు యెహోవాను ప్రేమించడం ఆయనకు భయపడడం, ఒకరినొకరు ప్రేమించడం నేర్చుకున్నారు, ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిసి శాంతితో ఒక కుటుంబంగా ఉంటున్నారు. (1 పేతురు 4:8) హింసలేని లోకం సాధ్యం అనడానికి వాళ్లే ఒక రుజువు.

హింసలేని లోకం దగ్గర్లో ఉంది

దేవుడు త్వరలో భూమి మీద హింస లేకుండా చేస్తాడని బైబిలు చెప్తుంది. దైవభక్తిలేని ప్రజలు నాశనమయ్యే తీర్పు రోజును హింసతో నిండిన ఈ లోకం ఎదుర్కొంటుంది. (2 పేతురు 3:5-7) ఆ తర్వాత ఎవరూ ఇతరుల్ని హింసించరు. దేవుడు జోక్యం చేసుకుని హింస లేకుండా చేస్తాడని మనం ఎందుకు నమ్మవచ్చు?

“బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు” అని దేవుని గురించి బైబిలు చెప్తుంది. (కీర్తన 11:5) సృష్టికర్త శాంతిని, న్యాయాన్ని ప్రేమిస్తాడు. (కీర్తన 33:5; 37:28) అందుకే ఆయన హింసించేవాళ్లను ఇంక ఉండనివ్వడు.

అవును, శాంతి ఉండే క్రొత్త లోకం రాబోతుంది. (కీర్తన 37:11; 72:14) అలాంటి హింసలేని లోకంలో ఉండాలంటే ఏమి చేయాలో ఎక్కువ విషయాలు మీరు తెలుసుకోవచ్చు కదా? (w16-E No. 4)

a బైబిల్లో దేవుని పేరు యెహోవా.

b అసలు పేర్లు కావు.