కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | మనకు ఓదార్పు ఎక్కడ దొరుకుతుంది?

దేవుడు ఎలా ఓదారుస్తాడు

దేవుడు ఎలా ఓదారుస్తాడు

“సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు . . . మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు” అని అపొస్తలుడైన పౌలు యెహోవాను a వర్ణిస్తున్నాడు. (2 కొరింథీయులు 1:3, 4) దేవుడు సహాయం చేయలేని వాళ్లంటూ ఎవరూ లేరు, మన పరలోక తండ్రి ఓదార్చలేనంత పెద్ద విషాదం అంటూ ఏదీ ఉండదు అని బైబిలు చెప్తుంది.

దేవుని నుండి ఓదార్పును పొందాలంటే మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. మనం హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్‌ని కలవకపోతే, ఆయన మనకు ఎలా సహాయం చేయగలడు? ప్రవక్త అయిన ఆమోసు ఇలా అడుగుతున్నాడు: “సమ్మతింపకుండ ఇద్దరు కూడి నడుతురా?” (ఆమోసు 3:3) అందుకే, దేవుని వాక్యం ఇలా చెప్తుంది: “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.”—యాకోబు 4:8.

దేవుడు మనకు దగ్గర అవుతాడని మనం ఖచ్చితంగా ఎందుకు నమ్మవచ్చు? ఎందుకంటే, ఆయన మనకు సహాయం చేయాలనుకుంటున్నాడని చాలాసార్లు చెప్పాడు. ( దీనికి సంబంధించిన బాక్సు చూడండి.) తర్వాత, ప్రాచీన కాలంలోనూ మన కాలంలోనూ ఆయన నుండి ఓదార్పును పొందిన ఎంతోమంది అనుభవాలు మన దగ్గర ఉన్నాయి.

ఈ రోజుల్లో చాలామంది దేవుని సహాయం కోసం వెదుకుతున్నారు. రాజైన దావీదు ఎంతో విషాదాన్ని అనుభవించాడు. సహాయం కోసం ఆయన కూడా యెహోవాను ఇలా వేడుకున్నాడు: “నేను నీకు మొఱ్ఱపెట్టునప్పుడు . . . నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము.” మరి దేవుడు సమాధానం ఇచ్చాడా? ఇచ్చాడు. దావీదు ఇంకా ఇలా అంటున్నాడు: “నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది.”—కీర్తన 28:2, 7.

దుఃఖిస్తున్న వాళ్లను యేసు ఎలా ఓదారుస్తాడు

ప్రజలను ఓదార్చడంలో యేసుకు ముఖ్య పాత్ర ఉండాలని దేవుని ఉద్దేశం. దేవుడు యేసుకు ఎన్నో పనులతోపాటు, నలిగిన హృదయముగలవారిని దృఢపర్చే పనిని, దుఃఖాక్రాంతులందరిని ఓదార్చే పనిని అప్పగించాడు. (యెషయా 61:1, 2) ముందు చెప్పినట్లుగానే, “ప్రయాసపడి భారము మోసికొనుచున్న” వాళ్లమీద యేసు ప్రత్యేక శ్రద్ధ చూపించాడు.—మత్తయి 11:28-30.

యేసు ప్రజలకు ఉపయోగపడే మంచి సలహాలు ఇచ్చాడు. వాళ్లతో దయగా ప్రవర్తించాడు. కొన్నిసార్లు వాళ్ల అనారోగ్యాన్ని స్వస్థపర్చాడు. ఇవన్నీ చేసి ఆయన ప్రజలను ఓదార్చాడు. ఒకరోజు ఒక కుష్ఠరోగి యేసును ఇలా వేడుకున్నాడు: “నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు.” అప్పుడు యేసు జాలిపడి, “నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని” అతనితో చెప్పాడు. (మార్కు 1:40, 41) ఆ కుష్ఠరోగి స్వస్థత పొందాడు.

మన దగ్గరుండి మనల్ని ఓదార్చడానికి ఈరోజు దేవుని కుమారుడు భూమి మీద లేడు. కానీ ఆయన తండ్రి, “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు” అయిన యెహోవా, అవసరంలో ఉన్న వాళ్లకు సహాయం చేస్తూ ఉంటాడు. (2 కొరింథీయులు 1:3) దేవుడు ప్రజల్ని ఓదార్చడానికి ఉపయోగించే నాలుగు విధానాలను పరిశీలించండి.

  • బైబిలు. “ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.”—రోమీయులు 15:4.

  • దేవుని పవిత్రశక్తి. యేసు దూరమైన కొన్నిరోజుల్లోనే క్రైస్తవ సంఘంలో ప్రశాంతమైన వాతావరణం తిరిగి వచ్చింది. ఎందుకంటే సంఘమంతా “ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి” నడుచుకుంది. (అపొస్తలుల కార్యములు 9:31) దేవుని పవిత్రశక్తి లేదా పరిశుద్ధాత్మ చాలా శక్తిమంతమైనది. దేవుడు ఆ శక్తిని ఉపయోగించి ఎవరికైనా ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇవ్వగలడు.

  • ప్రార్థన. “దేనినిగూర్చియు చింతపడకుడి” అని పవిత్ర లేఖనాలు మనకు సలహా ఇస్తున్నాయి. ఇంకా, “మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము . . . మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును” అని చెప్తున్నాయి.—ఫిలిప్పీయులు 4:6, 7.

  • తోటి క్రైస్తవులు మనకు నిజమైన స్నేహితుల్లా ఓదార్పునిచ్చే ‘రక్షణ వలయంగా’ ఉంటారు. అపొస్తలుడైన పౌలుకున్న “యిబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను” అతని సహచరులు ఎంతో “ఆదరణ” లేదా ఓదార్పును ఇచ్చారని ఆయన చెప్పాడు.—కొలొస్సయులు 4:11; 1 థెస్సలొనీకయులు 3:7.

కానీ ఇదంతా నిజ జీవితంలో ఎలా జరుగుతుందని మీరు అనుకోవచ్చు. ముందు చెప్పిన అనుభవాలను దగ్గరగా చూద్దాం. వాళ్లు “ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను” అని దేవుడు ఇచ్చిన మాటను నెరవేరడాన్ని చూశారు. మీరు కూడా చూస్తారు.—యెషయా 66:13. (wp16-E No. 5)

a దేవుని పేరు యెహోవా అని బైబిల్లో ఉంది.