కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అభిప్రాయభేదాల్ని ప్రేమతో పరిష్కరించుకోండి

అభిప్రాయభేదాల్ని ప్రేమతో పరిష్కరించుకోండి

‘ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి.’మార్కు 9:50.

పాటలు: 39, 35

1, 2. మనుషులు ఎదుర్కొన్న ఎలాంటి సమస్యల గురించి ఆదికాండములో ఉంది? వాటినుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

 అభిప్రాయభేదాలకు సంబంధించి బైబిల్లో నమోదైన సంఘటనల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆదికాండములోని మొదటి కొన్ని అధ్యాయాల్లోనే, కయీను హేబెలును చంపాడని (ఆది. 4:3-8); తనను కొట్టినందుకు లెమెకు ఓ యువకుడిని చంపాడని (ఆది. 4:23); అబ్రాహాము పశువుల కాపరులు, లోతు పశువుల కాపరులతో వాదనకు దిగారని చదువుతాం (ఆది. 13:5-7). హాగరు శారాను చిన్నచూపు చూడడం, శారా అబ్రాహాము మీద కోప్పడడం గురించి కూడా ఆ అధ్యాయాల్లో చదువుతాం. (ఆది. 16:3-6) అంతేకాదు, ఇష్మాయేలు అందరితో గొడవలు పడేవాడని, అతన్ని ఎవ్వరూ ఇష్టపడేవాళ్లు కాదని చూస్తాం.—ఆది. 16:12.

2 అయితే బైబిల్లో వీటి గురించి ఎందుకు ఉంది?జీవితంలో సమస్యలు ఎదుర్కొన్న అపరిపూర్ణ మానవుల అనుభవాల నుండి మనం పాఠాలు నేర్చుకోవడానికే దేవుడు వాటిని బైబిల్లో రాయించాడు. మనం కూడా అపరిపూర్ణులమే కాబట్టి, మనకు కూడా అలాంటి సమస్యలు ఎదురవ్వవచ్చు. అలాంటప్పుడు బైబిల్లో ఉన్న మంచివాళ్ల ఉదాహరణలను అనుకరిస్తూ, చెడ్డ వ్యక్తుల ఉదాహరణలను పాటించకుండా జాగ్రత్తపడాలి. (రోమా. 15:4) ఇతరులతో సమాధానంగా ఎలా ఉండాలో నేర్చుకోవడానికి అవి మనకు సహాయం చేస్తాయి.

3. ఈ ఆర్టికల్‌లో వేటిగురించి చర్చిస్తాం?

3 ఈ ఆర్టికల్‌లో, మనం విభేదాలను ఎందుకు, ఎలా పరిష్కరించుకోవాలో నేర్చుకుంటాం. అంతేకాదు సమస్యల్ని పరిష్కరించుకోవడానికీ అలాగే యెహోవాతో, ఇతరులతో మంచి సంబంధం కలిగివుండడానికీ సహాయం చేసే కొన్ని లేఖన సూత్రాల గురించి కూడా తెలుసుకుంటాం.

దేవుని ప్రజలు అభిప్రాయభేదాల్ని ఎందుకు పరిష్కరించుకోవాలి?

4. ఎలాంటి ఆలోచనా విధానం నేడు ప్రపంచమంతా ఉంది? దాని ఫలితమేమిటి?

4 ప్రజల్లో ఐక్యత లేకపోవడానికి, ఒకరితో ఒకరు గొడవలుపడడానికి అసలు కారణం సాతాను. అలాగని ఎందుకు చెప్పవచ్చు? దేవుని సహాయం లేకుండా మంచేదో చెడేదో నిర్ణయించుకోగలిగే సామర్థ్యం మనుషులకు ఉంది కాబట్టి వాళ్లే సొంతగా నిర్ణయాలు తీసుకోవాలని సాతాను చెప్పాడు. (ఆది. 3:1-5) కానీ నేడు లోకంలోని పరిస్థితులు చూస్తుంటే, అలాంటి ప్రవర్తన కేవలం సమస్యల్ని తెచ్చిపెడుతుందని తెలుస్తోంది. చాలామంది, తమకు మంచేదో చెడేదో నిర్ణయించుకునే హక్కు ఉందని అనుకుంటున్నారు. అలాంటివాళ్లలో గర్వం, స్వార్థం, పోటీతత్వం పెరిగిపోయాయి, తమ నిర్ణయాల వల్ల వేరేవాళ్లు బాధపడినా వాళ్లు పట్టించుకోరు. నిజానికి అలాంటి ప్రవర్తన గొడవలకు దారితీస్తుంది. అయితే మనకు త్వరగా కోప్పడే స్వభావం ఉంటే, ఇతరులతో ఎన్నో విభేదాలు వస్తాయనీ, చాలా తప్పులు చేస్తామనీ బైబిలు మనకు గుర్తుచేస్తోంది.—సామె. 29:22.

5. ఏవైనా అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు ఏమి చేయాలని యేసు ప్రజలకు బోధించాడు?

5 యేసు కొండమీద ప్రసంగంలో, ఇతరులతో సమాధానంగా ఉండమని, గొడవలు పడొద్దని తన శిష్యులకు బోధించాడు. అలా ఉన్నందుకు తమకు హాని కలుగుతుందని అనిపించినప్పటికీ సమాధానంగానే ఉండాలని ఆయన వాళ్లకు చెప్పాడు. అంతేకాదు దయగా, సమాధానంగా ఉండమనీ; కోపం వంటి లక్షణాల్ని తీసేసుకోమనీ; అభిప్రాయభేదాల్ని త్వరగా పరిష్కరించుకోమనీ; తమ శత్రువుల్ని ప్రేమించమనీ కూడా యేసు తన శిష్యులకు బోధించాడు.—మత్త. 5:5, 9, 22, 25, 44.

6, 7. (ఎ) అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు వాటిని త్వరగా పరిష్కరించుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) దేవుని ప్రజలందరూ ఏ ప్రశ్నల గురించి ఆలోచించాలి?

6 నేడు మనం ప్రార్థించడం, ప్రకటించడం, మీటింగ్స్‌కు వెళ్లడం ద్వారా యెహోవాను ఆరాధిస్తున్నాం. ఒకవేళ మనం తోటి సహోదరసహోదరీలతో సమాధానంగా ఉండకపోతే యెహోవా మన ఆరాధనను అంగీకరించడు. (మార్కు 11:25) కాబట్టి యెహోవాకు స్నేహితులుగా ఉండాలంటే ఇతరుల పొరపాట్లను మనం క్షమించాలి.—లూకా 11:4; ఎఫెసీయులు 4:32 చదవండి.

7 తన సేవకులందరూ ఇతరుల్ని క్షమించేవాళ్లుగా ఉండాలనీ, ఇతరులతో సమాధానంగా ఉండాలనీ యెహోవా కోరుకుంటున్నాడు. కాబట్టి మనమిలా ప్రశ్నించుకోవాలి, ‘నా సహోదరుల్ని నేను త్వరగా క్షమిస్తున్నానా? వాళ్లతో సమయం గడపడానికి ఇష్టపడుతున్నానా?’ ఒకవేళ మీరు క్షమించే మనసును మరింతగా వృద్ధి చేసుకోవాలని గుర్తిస్తే, సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించండి. వినయంగా చేసే అలాంటి ప్రార్థనల్ని మన పరలోక తండ్రి వింటాడు, జవాబిస్తాడు కూడా.—1 యోహా. 5:14, 15.

ఇతరులు మిమ్మల్ని నొప్పిస్తే

8, 9. ఎవరైనా మనల్ని బాధపెడితే ఏమి చేయాలి?

8 మనందరం అపరిపూర్ణులం కాబట్టి ఎవరోఒకరు మనల్ని తమ మాటల ద్వారానో లేదా చేతల ద్వారానో బాధపెట్టి తీరుతారు. (ప్రసం. 7:20; మత్త. 18:7) మరి అలాంటి సమయంలో మీరైతే ఏమి చేస్తారు? ఈ అనుభవం పరిశీలించండి: ఒక రోజు ఓ సహోదరి ఇద్దరు సహోదరుల్ని పలకరించింది. అయితే మొదటి సహోదరుడు, ఆమె పలకరించిన విధానం బట్టి నొచ్చుకున్నాడు. దాంతో ఎవరూ లేనప్పుడు అతను రెండవ సహోదరుని దగ్గర ఆ సహోదరిని విమర్శిస్తూ మాట్లాడడం ప్రారంభించాడు. కానీ ఆమె ఎన్ని కష్టాలు ఎదురైనా 40 ఏళ్లుగా యెహోవాను నమ్మకంగా సేవిస్తోందని రెండవ సహోదరుడు అతనికి గుర్తుచేశాడు. అంతేకాదు ఆమె కావాలని అలా మాట్లాడి ఉండదని కూడా చెప్పాడు. అప్పుడు ఆ మొదటి సహోదరుడు ఎలా స్పందించాడు? అతనిలా అన్నాడు, “నువ్వు చెప్పింది నిజమే.” ఆ తర్వాత, జరిగినదాన్ని మర్చిపోవాలని అతడు నిర్ణయించుకున్నాడు.

9 ఈ అనుభవం నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు మనమెలా స్పందిస్తామనేది మన చేతుల్లోనే ఉంటుంది. ప్రేమగలవాళ్లు ఇతరుల్ని క్షమిస్తారు. (సామెతలు 10:12; 1 పేతురు 4:8 చదవండి.) అలా క్షమించేవాళ్లను యెహోవా ఇష్టపడతాడు. (సామె. 19:11; ప్రసం. 7:9) కాబట్టి ఈసారి ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టేలా ఏదైనా మాట్లాడినా లేదా చేసినా ఇలా ఆలోచించండి, ‘దీన్ని నేను పట్టించుకోకుండా ఉండవచ్చా? నేను ఈ విషయం గురించి ఆలోచిస్తూ కూర్చోవడం నిజంగా అవసరమా?’

10. (ఎ) ఇతరులు తన గురించి చెడుగా మాట్లాడినప్పుడు ఓ సహోదరి మొదట్లో ఎలా స్పందించింది? (బి) కానీ వాటిని పట్టించుకోకుండా ఉండడానికి ఏ లేఖనాలు ఆమెకు సహాయం చేశాయి?

10 ఇతరులు మన గురించి చెడుగా మాట్లాడినప్పుడు, దాన్ని పట్టించుకోకుండా ఉండడం కష్టంగా అనిపించవచ్చు. లత అనే ఓ పయినీరు సహోదరి అనుభవాన్ని పరిశీలించండి. ఆమె పరిచర్య చేసే విధానం గురించి, సమయాన్ని ఉపయోగించే తీరు గురించి సంఘంలో కొంతమంది చెడుగా మాట్లాడారు. దాంతో ఆమె చాలా బాధపడి, ఏమి చేయాలో చెప్పమని పరిణతిగల కొంతమంది సహోదరుల్ని సలహా అడిగింది. వాళ్లేమి చెప్పారు? ఇతరులు అన్న మాటల గురించి కాకుండా, యెహోవా గురించి ఎక్కువగా ఆలోచించేందుకు సహాయం చేసే లేఖనాల్ని తనకు చూపించారని లత చెప్పింది. మత్తయి 6:1-4 వచనాల్ని చదివినప్పుడు ఆమె చాలా ప్రోత్సాహం పొందింది. (చదవండి.) యెహోవాను సంతోషపెట్టడమే అన్నిటికన్నా చాలా ముఖ్యమని ఆ లేఖనాలు ఆమెకు గుర్తుచేశాయి. దాంతో ఇతరులు తన గురించి చెడుగా చెప్పిన మాటల్ని పట్టించుకోకూడదని ఆమె నిర్ణయించుకుంది. ఇప్పుడు తన పరిచర్య గురించి ఇతరులు చెడుగా మాట్లాడినా లత బాధపడట్లేదు. ఎందుకంటే యెహోవాను సంతోషపెట్టడానికి తాను చేయగలిగినదంతా చేస్తున్నానని ఆమెకు తెలుసు.

ఓ విషయం మీ మనశ్శాంతిని పాడుచేస్తే . . . 

11, 12. (ఎ) తోటి సహోదరునికి తనతో ‘విరోధమేమైనా’ ఉందనిపిస్తే ఓ క్రైస్తవుడు ఏమి చేయాలి? (బి) ఓ సమస్య వచ్చినప్పుడు అబ్రాహాము వ్యవహరించిన తీరు నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

11 “అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము.” (యాకో. 3:2) ఒకవేళ మీ మాటలు లేదా పనులు వల్ల ఓ సహోదరుడు బాధపడ్డాడని తెలిస్తే అప్పుడు మీరేమి చేయాలి? “నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము” అని యేసు చెప్పాడు. (మత్త. 5:23, 24) కాబట్టి మీ సహోదరునితో అభిప్రాయభేదం వస్తే, వెళ్లి అతనితో మాట్లాడండి. అయితే మీ తప్పు ఒప్పుకుని అతనితో సమాధానపడాలనే ఉద్దేశంతోనే మాట్లాడండి. అంతేగానీ జరిగిన దాంట్లో అతని తప్పు కూడా ఉందని నిందించడానికి ప్రయత్నించకండి. మన సహోదరసహోదరీలతో సమాధానంగా ఉండడమే అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యం.

12 అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు దేవుని సేవకులు ఎలా సమాధానపడాలో బైబిలు చెప్తోంది. ఉదాహరణకు అబ్రాహాముకు, ఆయన అన్న కొడుకైన లోతుకు చాలా పశువులు ఉండేవి. అయితే వాటన్నిటికీ సరిపోయే ప్రాంతం లేనందువల్ల వాటి కాపరుల మధ్య గొడవ మొదలైంది. అబ్రాహాము సమాధానంగా ఉండాలని కోరుకున్నాడు కాబట్టి మంచి ప్రదేశాన్ని ఎంచుకునే అవకాశాన్ని ముందు లోతుకు ఇచ్చాడు. (ఆది. 13:1, 2, 5-9) అబ్రాహాము మనకెంత మంచి ఆదర్శం ఉంచాడో కదా! అలా ఉదార స్వభావాన్ని చూపించడం వల్ల అబ్రాహాము ఏమైనా నష్టపోయాడా? లేనేలేదు. ఇది జరిగిన వెంటనే, యెహోవా అబ్రాహాముకు అతను పోగొట్టుకున్న దానికన్నా ఎంతో ఎక్కువ ఇస్తానని మాటిచ్చాడు. గొప్ప దీవెనల్ని ఇస్తానని మాటిచ్చాడు. (ఆది. 13:14-17) మరి మనమేమి నేర్చుకోవచ్చు? అభిప్రాయభేదాల్ని పరిష్కరించుకునేటప్పుడు మనం ఏదైనా కోల్పోవాల్సివచ్చినా, వాటిని ప్రేమగా పరిష్కరించుకుంటే యెహోవా మనల్ని దీవిస్తాడు. [1]

13. ఓ సహోదరుడు కఠినంగా మాట్లాడినప్పుడు ఓ పర్యవేక్షకుడు ఎలా స్పందించాడు? ఆయన్నుండి మీరేమి నేర్చుకున్నారు?

13 మనకాలంలోని ఓ అనుభవాన్ని పరిశీలించండి. సమావేశ డిపార్ట్‌మెంట్‌ కొత్త పర్యవేక్షకుడు, ఓ సహోదరునికి ఫోన్‌ చేసి అతను ఆ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయడానికి వీలౌతుందో లేదో అడిగాడు. కానీ ఆ సహోదరునికి ఇంతకుముందు ఉన్న పర్యవేక్షకుని మీద ఇంకా కోపం ఉండడం వల్ల కఠినంగా మాట్లాడి ఫోన్‌ పెట్టేశాడు. ఆ మాటలకు కొత్త పర్యవేక్షకుడు బాధపడలేదు కానీ ఆ సహోదరుడు అసలు ఎందుకలా మాట్లాడాడోనని మాత్రం ఆలోచించాడు. దాంతో గంట తర్వాత మళ్లీ ఆ సహోదరునికి ఫోన్‌ చేసి తనను కలవాలనుకుంటున్నానని చెప్పాడు. తర్వాతి వారం ఆ సహోదరులిద్దరూ రాజ్యమందిరంలో కలుసుకుని, ప్రార్థన చేసుకుని దాదాపు గంటసేపు మాట్లాడుకున్నారు. ఇంతకుముందున్న డిపార్ట్‌మెంట్‌ పర్యవేక్షకునితో ఏం జరిగిందో ఆ సహోదరుడు వివరించాడు. కొత్త పర్యవేక్షకుడు వాటన్నిటినీ దయగా విని, ఉపయోగపడే కొన్ని లేఖనాల్ని ఆ సహోదరునికి చెప్పాడు. దానివల్ల ఆ సహోదరులిద్దరూ సమాధానపడి సమావేశంలో కలిసి పనిచేయగలిగారు. కొత్త పర్యవేక్షకుడు తనతో దయగా, మృదువుగా మాట్లాడినందుకు ఆ సహోదరుడు చాలా ఆనందించాడు.

ఆ విషయం గురించి మీరు సంఘపెద్దలకు చెప్పాలా?

14, 15. (ఎ) మత్తయి 18:15-17 వచనాల్లోని సలహాను ఏ సందర్భాల్లో పాటించాలి? (బి) యేసు ఏ మూడు విషయాల గురించి చెప్పాడు? వాటిని పాటించేటప్పుడు మన లక్ష్యం ఏమై ఉండాలి?

14 ఇద్దరు క్రైస్తవుల మధ్య వచ్చే సమస్యల్ని చాలావరకు వాళ్లకు వాళ్లే పరిష్కరించుకోవచ్చు, అలానే పరిష్కరించుకోవాలి కూడా. కానీ మత్తయి 18:15-17 వచనాలు చెప్తున్నట్లు కొన్ని సందర్భాల్లో ఇతరుల సహాయం అవసరంకావచ్చు. (చదవండి.) ఈ లేఖనాల్లో యేసు చెప్తున్న “తప్పిదము” క్రైస్తవుల మధ్య వచ్చే చిన్న అభిప్రాయభేదం కాదు. అది మనకెలా తెలుసు? ఎందుకంటే సహోదరులు, సాక్షులు, బాధ్యతగల సహోదరులు మాట్లాడిన తర్వాత కూడా తప్పు చేసిన వ్యక్తి పశ్చాత్తాపపడకపోతే అతన్ని ‘అన్యున్ని, సుంకరిని’ చూసినట్లు చూడాలని యేసు చెప్పాడు. అంటే మనకాలంలోనైతే అతన్ని సంఘం నుండి బహిష్కరించాలని అర్థం. అయితే ఆ తప్పిదాల్లో మోసం చేయడం లేదా ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం కూడా ఉండవచ్చు. కానీ వ్యభిచారం, ఒకే లింగ వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం, మతభ్రష్టత్వం, విగ్రహారాధన వంటివి సొంతగా పరిష్కరించుకునే తప్పిదాల్లోకి రావు. వీటిని ఖచ్చితంగా పెద్దలే పరిష్కరించాలి.

మీ సహోదరునితో సమాధానపడడానికి, మీరు అతనితో ఒకటికన్నా ఎక్కువసార్లు మాట్లాడాల్సి రావచ్చు(15వ పేరా చూడండి)

15 మనం తోటి సహోదరుణ్ణి ప్రేమిస్తాం కాబట్టి అతనికి ఎలా సహాయం చేయాలో మనకు నేర్పించడానికి యేసు ఈ సలహా ఇచ్చాడు. (మత్త. 18:11-14) మరి మనం దాన్నెలా పాటించవచ్చు? (1) ఇతరుల జోక్యం లేకుండా మన సహోదరునితో సమాధానపడడానికి ప్రయత్నించాలి. ఆ క్రమంలో అతనితో మనం చాలాసార్లు మాట్లాడాల్సిరావచ్చు. అయినా సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడేమి చేయాలి? (2) ఆ సమస్య గురించి తెలిసిన మరొక సహోదరుణ్ణి లేదా తప్పు జరిగిందో లేదో చెప్పగలిగే వ్యక్తిని తీసుకెళ్లి అతనితో మాట్లాడాలి. ఒకవేళ సమస్య పరిష్కారమైతే మీరు మీ ‘సహోదరున్ని సంపాదించుకున్నట్లే.’ కానీ మీరు ఎన్నిసార్లు మాట్లాడినా సమస్య పరిష్కారం అవ్వకపోతే అప్పుడేమి చేయాలి? (3) ఆ సమస్య గురించి సంఘపెద్దలకు చెప్పాలి.

16. యేసు ప్రేమతో ఇచ్చిన సలహా ఉపయోగపడుతుందని ఎందుకు చెప్పవచ్చు?

16 చాలా సందర్భాల్లో, మత్తయి 18:15-17 వచనాల్లోని మూడు విషయాల్నీ పాటించాల్సిన అవసరం రాకపోవచ్చు. ఇదెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఎందుకు? ఎందుకంటే చాలా సందర్భాల్లో, తప్పు చేసిన వ్యక్తి తన తప్పును గుర్తించి సరిచేసుకుంటాడు. దాంతో అతన్ని సంఘం నుండి బహిష్కరించాల్సిన అవసరం ఏర్పడదు. అప్పుడు, బాధపడిన వ్యక్తి తన తోటి సహోదరుణ్ణి క్షమించి సమాధానపడవచ్చు. కాబట్టి యేసు ఇచ్చిన సలహాను బట్టి, ఎవరితోనైనా అభిప్రాయభేదం రాగానే సంఘపెద్దల దగ్గరకు వెళ్లాల్సిన అవసరంలేదు. మొదటి రెండు విషయాలు పాటించిన తర్వాత, ఏదో తప్పు జరిగిందని అనడానికి నిజమైన ఆధారాలు ఉంటేనే సంఘపెద్దలకు చెప్పాలి.

17. ఇతరులతో సమాధానంగా ఉండడానికి కృషి చేసినప్పుడు మనమెలాంటి దీవెనలు పొందుతాం?

17 మనం అపరిపూర్ణులుగా ఉన్నంతకాలం, ఇతరుల్ని బాధపెడుతూనే ఉంటాం. శిష్యుడైన యాకోబు ఇలా రాశాడు, “ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును.” (యాకో. 3:2) అభిప్రాయభేదాల్ని పరిష్కరించుకోవాలంటే మనం ‘సమాధానాన్ని వెదకి దాన్ని వెంటాడడానికి’ చేయగలిగినదంతా చేయాలి. (కీర్త. 34:14) మనం ఎల్లప్పుడూ ఇతరులతో సమాధానంగా ఉంటే, తోటి సహోదరసహోదరీలతో మనకు మంచి సంబంధం ఉంటుంది. అప్పుడు మనం ఐక్యంగా ఉండగలుగుతాం. (కీర్త. 133:1-3) అన్నిటికన్నా ముఖ్యంగా, ‘సమాధానకర్త అయిన’ యెహోవా దేవునితో మనకు మంచి సంబంధం ఉంటుంది. (రోమా. 15:33) అయితే మనం ఈ దీవెనలన్నిటినీ పొందాలంటే అభిప్రాయభేదాల్ని ప్రేమగా పరిష్కరించుకోవాలి.

^ [1] (12వ పేరా) సమస్యల్ని సమాధానంగా పరిష్కరించుకున్న ఇతరులు: ఏశావుతో యాకోబు (ఆది. 27:41-45; 33:1-11); తన అన్నలతో యోసేపు (ఆది. 45:1-15); ఎఫ్రాయిమీయులతో గిద్యోను (న్యాయా. 8: 1-3). బైబిల్లో ఉన్న అలాంటి మరితర ఉదాహరణల గురించి కూడా మీరు ఆలోచించవచ్చు.