కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులుగా చేయండి’

‘మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులుగా చేయండి’

“మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి . . . వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.”మత్త. 28:19, 20.

పాటలు: 141, 17

1, 2. మత్తయి 24:14 లో ఉన్న యేసు మాటలనుబట్టి ఏ ప్రశ్నలు తలెత్తుతాయి?

 చివరిరోజుల్లో, రాజ్యసువార్త ప్రజలందరికీ ప్రకటించబడుతుందని యేసు ముందే చెప్పాడు. (మత్త. 24:14) యెహోవాసాక్షులమైన మనం ప్రకటనాపని చేస్తామని ప్రపంచవ్యాప్తంగా అందరికీ బాగా తెలుసు. మనం ప్రకటించే సందేశం కొంతమందికి నచ్చుతుంది, మరికొంతమందికి నచ్చదు. కానీ మనం ప్రకటించే సందేశాన్ని ఇష్టపడనివాళ్లు కూడా మనం చేస్తున్న పనినిబట్టి మనల్ని గౌరవిస్తున్నారు. అయితే, యేసు ఆజ్ఞాపించిన పనిని మనం మాత్రమే చేస్తున్నామని చెప్తాం. అలా చెప్పే హక్కు మనకు ఉందా? యేసు ఆజ్ఞాపించిన పనినే మనం చేస్తున్నామని ఎలా చెప్పవచ్చు?

2 చాలా మతాలవాళ్లు సువార్తను ప్రకటిస్తున్నామని చెప్పుకుంటారు. కానీ వాళ్లు చర్చీలో, టీ.వీ.లో లేదా ఇంటర్నెట్‌లో మాత్రమే ప్రసంగాలు ఇస్తారు లేదా తాము క్రైస్తవులుగా ఎలా మారారో సాక్ష్యాలు చెప్తారు. మరికొందరైతే, అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయడం లేదా డాక్టర్లుగా, నర్సులుగా, టీచర్లుగా ఇతరులకు సేవ చేయడమే ప్రకటనాపని అనుకుంటారు. ఇంతకీ యేసు చేయమని చెప్పిన ప్రకటనాపని ఇదేనా?

3. మత్తయి 28:19, 20 వచనాల్లో ఉన్న ఆజ్ఞనుబట్టి యేసు అనుచరులు ఏ నాలుగు పనులు చేయాలి?

3 ప్రజలే తమ దగ్గరికి వచ్చేవరకు శిష్యులు ఆగాలా? లేదు. యేసుక్రీస్తు పునరుత్థానమైన తర్వాత, వందల సంఖ్యలో ఉన్న తన శిష్యులకు ఇలా చెప్పాడు, “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి . . . వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.” (మత్త. 28:19, 20) కాబట్టి యేసు శిష్యులుగా మనం నాలుగు పనులు చేయాలి. అవేంటంటే శిష్యుల్ని చేయాలి, బాప్తిస్మం ఇవ్వాలి, బోధించాలి. వీటన్నిటికన్నా ముందు మనం ప్రజల దగ్గరకు వెళ్లాలి. ఒక బైబిలు విద్వాంసుడు ఇలా వివరించాడు, “‘వెళ్లి’ ప్రకటించడం ప్రతీ విశ్వాసి చేయాల్సిన పని. అందుకోసం వీధైనా, మహాసముద్రమైనా దాటి వెళ్లాల్సిందే.”—మత్త. 10:7; లూకా 10:3.

4. “మనుష్యులను పట్టుజాలరులు” అవ్వాలంటే ఏమి చేయాలి?

4 తన శిష్యులు ఏం చేయాలని యేసు కోరుకున్నాడు? ప్రకటనాపనిని వాళ్ల ఇష్టప్రకారం చేయాలని కోరుకున్నాడా లేదా ఒక గుంపుగా పద్ధతి ప్రకారం చేయాలని కోరుకున్నాడా? ఒక్క వ్యక్తి ‘సమస్త జనులకు’ ప్రకటించడం అసాధ్యం కాబట్టి తన శిష్యులు ఆ పనిని ఒక గుంపుగా పద్ధతి ప్రకారం చేయాలి. “మనుష్యులను పట్టుజాలరులు” అవ్వమని తన శిష్యుల్ని ఆహ్వానించినప్పుడు యేసు ఉద్దేశం అదే. (మత్తయి 4:18-22 చదవండి.) యేసు ఆ మాటల్ని ఒక్క జాలరిని ఉద్దేశించి, అంటే గాలాన్నీ ఎరనూ వేసి చేపలు వచ్చి చిక్కేవరకు ఏమి చేయకుండా కూర్చునే ఒక్క వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు. బదులుగా వలల్ని ఉపయోగించి చేపలుపట్టడం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ పద్ధతిలో చేపలు పట్టాలంటే చాలా కష్టపడాలి, క్రమపద్ధతిలో దాన్ని చేయాలి, చాలామంది కలిసి పనిచేయాలి.—లూకా 5:1-11.

5. ఏ నాలుగు ప్రశ్నలకు మనం జవాబులు తెలుసుకోవాలి? ఎందుకు?

5 యేసు చెప్పిన మాట ప్రకారం నేడు ఎవరు రాజ్యసువార్త ప్రకటిస్తున్నారో తెలుసుకోవాలంటే, ఈ నాలుగు ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి:

  •   యేసు అనుచరులు ఏ సందేశం ప్రకటించాలి?

  •   ఏ ఉద్దేశంతో ప్రకటించాలి?

  •   ఏ పద్ధతుల్ని ఉపయోగించాలి?

  •   ఎంత విస్తృతంగా, ఎంతకాలం ప్రకటించాలి?

 ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకున్నప్పుడు, జీవాన్ని కాపాడే పనిని ఎవరు చేస్తున్నారో గుర్తించగలుగుతాం. ఆ పనిని కొనసాగించాలనే మన కోరిక కూడా బలపడుతుంది.—1 తిమో. 4:16.

సందేశం

6. యేసు చెప్పిన సందేశాన్నే యెహోవాసాక్షులు ప్రకటిస్తున్నారని ఖచ్చితంగా ఎందుకు చెప్పవచ్చు?

6 లూకా 4:43 చదవండి. యేసు “రాజ్యసువార్తను” ప్రకటించాడు, తన శిష్యులు కూడా ఆ సువార్తనే ప్రకటించాలని ఆయన కోరుకున్నాడు. మరి ప్రజలందరికీ ఆ సువార్తను ఎవరు ప్రకటిస్తున్నారు? యెహోవాసాక్షులు మాత్రమే. ఈ విషయాన్ని మనల్ని ఇష్టపడని కొంతమంది కూడా ఒప్పుకుంటారు. ఉదాహరణకు ఓ మిషనరీ ప్రీస్టు ఒక యెహోవాసాక్షితో, తాను వేర్వేరు దేశాలకు వెళ్లాడనీ, అక్కడ యెహోవాసాక్షుల్ని కలిసినప్పుడు, వాళ్లు దేని గురించి ప్రకటిస్తారని అడిగాడనీ చెప్పాడు. అంతేకాదు ఆ ప్రీస్టు ఇంకా ఇలా అన్నాడు, “వాళ్లు ఎంత మూర్ఖులంటే, ‘రాజ్యసువార్త’ ప్రకటిస్తామని అందరూ ఒకే జవాబు చెప్పారు.” ఆ ప్రీస్టు మాటలనుబట్టి, మనం మూర్ఖులము కాదుగానీ నిజక్రైస్తవులుగా ఐక్యంగా ఉన్నామని రుజువౌతుంది. (1 కొరిం. 1:10) కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది అనే పత్రిక కూడా ముఖ్యంగా చెప్పేది దేవుని రాజ్యం గురించే. ఈ పత్రిక 254 భాషల్లో ప్రతీ సంచిక దాదాపు 5 కోట్ల 90 లక్షల కాపీలు ముద్రించబడుతోంది. ప్రపంచంలోనే ఎంతో ఎక్కువగా పంచిపెట్టబడుతోన్న పత్రిక ఇదే.

7. క్రైస్తవమత నాయకులు రాజ్య సందేశాన్ని ప్రకటించట్లేదని మనకెలా తెలుసు?

7 క్రైస్తవమత నాయకులు దేవుని రాజ్యం గురించి ప్రకటించట్లేదు. ఒకవేళ ప్రకటించినా, అది ఒక వ్యక్తి హృదయంలో ఉండే భావన అని వాళ్లలో చాలామంది చెప్తారు. (లూకా 17:21) దేవుని రాజ్యం అంటే ఒక నిజమైన పరలోక ప్రభుత్వమని, దాన్ని యేసు పరిపాలిస్తున్నాడని వాళ్లు బోధించరు. బదులుగా క్రిస్మస్‌ పండుగ సమయంలో యేసు పసిబాలుడిగా ఉండడం గురించి, ఈస్టర్‌ పండుగ సమయంలో ఆయన మరణం గురించే ఎక్కువ చెప్తారు. అంతేగానీ దేవుని రాజ్యం మనుషుల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తుందని, భూమ్మీదున్న చెడంతటినీ త్వరలోనే తీసేస్తుందని వాళ్లు వివరించరు. (ప్రక. 19:11-21) నిజానికి, దేవుని రాజ్యానికి రాజుగా యేసు ఏమి చేస్తాడో క్రైస్తవమత నాయకులకు తెలీదు. యేసు ప్రకటించిన సందేశం ఏమిటో వాళ్లకు అర్థంకాదు కాబట్టి, ఎందుకు ప్రకటించాలనే విషయం కూడా వాళ్లకు అర్థంకాదు.

ఉద్దేశం

8. ప్రకటనాపనిని ఏ ఉద్దేశంతో చేయకూడదు?

8 యేసు శిష్యులు ప్రకటనాపనిని డబ్బులు కూడబెట్టుకోవడానికో లేదా పెద్దపెద్ద మేడలు కట్టుకోవడానికో చేయకూడదు. యేసు తన శిష్యులతో, “మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి” అని చెప్పాడు. (మత్త. 10:8, NW) కాబట్టి ప్రకటనాపనిని ఒక వ్యాపారంలా చేయకూడదు. ప్రకటిస్తున్నందుకు డబ్బులు ఇవ్వమని యేసు శిష్యులు అడగకూడదు. (అపొస్తలుల కార్యములు 20:33-35 చదవండి.) బైబిలు ఇంత స్పష్టంగా చెప్తున్నప్పటికీ, చాలా చర్చీలు తమ చర్చీల కోసం అలాగే మతనాయకులకు-వాళ్లదగ్గర పని చేసేవాళ్లకు జీతాలు ఇవ్వడం కోసం ప్రజల దగ్గర డబ్బులు తీసుకోవడంపైనే మనసుపెడుతున్నారు. అలా చేయడంవల్ల ఎంతోమంది క్రైస్తవమత నాయకులు కోట్లకు పడగలెత్తారు.—ప్రక. 17:4, 5.

9. యెహోవాసాక్షులు సరైన ఉద్దేశంతోనే ప్రకటనాపని చేస్తున్నారని ఎలా చూపించారు?

9 యెహోవాసాక్షులు తమ రాజ్యమందిరాల్లో లేదా సమావేశాల్లో డబ్బులు వసూలు చేస్తారా? చేయరు. వాళ్ల పని స్వచ్ఛంద విరాళాలతో జరుగుతుంది. (2 కొరిం. 9:7) గత సంవత్సరం, యెహోవాసాక్షులు దాదాపు 200 కోట్ల గంటలు ప్రకటనాపని కోసం వెచ్చించారు, ప్రతీనెల 90 లక్షల కన్నా ఎక్కువ బైబిలు స్టడీలు చేశారు. ఈ పని చేస్తున్నందుకు వాళ్లకు ఎలాంటి జీతాలు ఉండవు. అయినా వాళ్లు తమ సొంత డబ్బుతో సంతోషంగా ఈ పనిచేస్తున్నారు. ఒక పరిశోధకుడు యెహోవాసాక్షుల పని గురించి మాట్లాడుతూ ఇలా చెప్పాడు, “ప్రకటించడం, బోధించడం మాత్రమే వాళ్ల ముఖ్య లక్ష్యం.” అంతేకాదు, యెహోవాసాక్షుల్లో మతనాయకులు ఉండరు కాబట్టి వాళ్లు డబ్బు ఆదా చేయగలుగుతున్నారని కూడా అన్నాడు. మరి మనం డబ్బు కోసం కానప్పుడు, ఏ ఉద్దేశంతో ప్రకటిస్తున్నాం? మనం యెహోవాను, ప్రజలను ప్రేమిస్తున్నాం కాబట్టి ఈ పనిని మనస్ఫూర్తిగా చేస్తున్నాం. అలా చేయడంవల్ల, కీర్తన 110:3⁠లోని మాటల్ని నెరవేరుస్తున్నాం. (చదవండి.)

పద్ధతులు

ప్రజలు ఎక్కడుంటే మనం అక్కడ ప్రకటిస్తాం (10వ పేరా చూడండి)

10. ప్రకటనాపని చేయడానికి యేసు, ఆయన శిష్యులు ఏ పద్ధతుల్ని ఉపయోగించారు?

10 ప్రకటనాపని చేయడానికి యేసు, ఆయన శిష్యులు ఏ పద్ధతుల్ని ఉపయోగించారు?వాళ్లు ప్రజలు ఎక్కడుంటే అక్కడికి వెళ్లారు. ఉదాహరణకు వీధుల్లో, మార్కెట్లలో, ఇంటింటికి కూడా వెళ్లి ప్రకటించారు. (మత్త. 10:11; లూకా 8:1; అపొ. 5:42; 20:20-21) అన్నిరకాల ప్రజలను కలవడానికి ఇంటింటి పరిచర్యే ఒక క్రమమైన పద్ధతి.

11, 12. సువార్త ప్రకటించే విషయంలో యెహోవాసాక్షులకు క్రైస్తవమత నాయకులకు ఎలాంటి తేడా ఉంది?

11 యేసు ప్రకటించినట్లే క్రైస్తవమత చర్చీలు కూడా సువార్త ప్రకటిస్తున్నాయా? సాధారణంగా జీతాలు తీసుకునే మతనాయకులు, వాళ్ల చర్చీకి వచ్చేవాళ్లకు ప్రసంగాలు ఇస్తారు. వీళ్లు కొత్త శిష్యులను తయారుచేయరు కానీ ఇప్పటికే తమ చర్చీకి వస్తున్నవాళ్లను మరెక్కడికీ వెళ్లకుండా చూసుకుంటారు. ప్రకటనాపని చేయమని కూడా కొన్నిసార్లు తమ చర్చీ సభ్యుల్ని ప్రోత్సహించారు. ఉదాహరణకు 2001⁠లో పోప్‌ జాన్‌ పాల్‌ II ఒక ఉత్తరంలో, తమ చర్చీ సభ్యులు సువార్తను ప్రకటించాలని ప్రోత్సహించాడు. అంతేకాదు, “అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ” అని చెప్పిన అపొస్తలుడైన పౌలుకు ఉన్నలాంటి ఆసక్తినే చూపించాలనీ రాశాడు. అయితే ఈ పనిని కేవలం శిక్షణ పొందిన కొంతమంది మాత్రమే కాదుగానీ చర్చీ సభ్యులందరూ చేయాలని చెప్పాడు. కానీ ఎవ్వరూ పోప్‌ చెప్పినట్టు చేయలేదు.

12 మరి యెహోవాసాక్షుల సంగతేంటి? యేసు 1914 నుండి రాజుగా పరిపాలిస్తున్నాడని వాళ్లు మాత్రమే ప్రకటిస్తున్నారు. వాళ్లు యేసుకు లోబడుతూ, తమ జీవితంలో ప్రకటనాపనికి అన్నిటికన్నా ముఖ్యమైన స్థానం ఇస్తున్నారు. (మార్కు 13:10) పిల్లర్స్‌ ఆఫ్‌ ఫెయిత్‌—అమెరికన్‌ కాంగ్రిగేషన్స్‌ అండ్‌ దెయిర్‌ పార్ట్‌నర్స్‌ అనే పుస్తకం, “యెహోవాసాక్షులకు ప్రకటనాపనే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది” అని చెప్పింది. అంతేకాదు ఆకలితో, ఒంటరితనంతో, అనారోగ్యంతో బాధపడుతున్నవాళ్లు ఎదురుపడితే యెహోవాసాక్షులు వాళ్లకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ రాబోయే అంతం గురించి ప్రకటించే, రక్షణ గురించి బోధించే తమ ముఖ్య లక్ష్యాన్ని మాత్రం వాళ్లు ఎన్నడూ మర్చిపోరు అని కూడా ఆ పుస్తకం పేర్కొంది. అవును యేసూ, అలాగే ఆయన శిష్యులూ ఉపయోగించిన పద్ధతుల్ని ఉపయోగిస్తూ యెహోవాసాక్షులు ఆ సందేశాన్ని ప్రకటిస్తూనే ఉంటారు.

ఎంత విస్తృతంగా, ఎంతకాలం?

13. ప్రకటనాపనిని ఎంత విస్తృతంగా చేయాలి?

13 తన అనుచరులు “లోకమందంతట” సువార్తను ప్రకటిస్తారని, బోధిస్తారని యేసు చెప్పాడు. “సమస్త జనులను” శిష్యుల్ని చేయమని ఆయన వాళ్లను ఆజ్ఞాపించాడు. (మత్త. 24:14; మత్త. 28:19, 20) అంటే సువార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడాలని దానర్థం.

14, 15. విస్తృతంగా ప్రకటించడం గురించి యేసు ముందే చెప్పిన మాటల్ని యెహోవాసాక్షులు మాత్రమే నెరవేర్చారని ఏది చూపిస్తుంది? (ప్రారంభ చిత్రాల్ని చూడండి.)

14 లోకమందంతట సువార్త ప్రకటించబడుతుందని యేసు చెప్పిన మాటల్ని యెహోవాసాక్షులు మాత్రమే నెరవేర్చారు. ఎందుకలా చెప్పవచ్చు? అమెరికాలో క్రైస్తవమత నాయకులు దాదాపు 6 లక్షలు ఉంటే, సువార్తను ప్రకటించే యెహోవాసాక్షులు దాదాపు 12 లక్షలు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్యాథలిక్‌ ప్రీస్టులు 4 లక్షలు ఉంటే, 240 దేశాల్లో సువార్త ప్రకటిస్తున్న యెహోవాసాక్షులు దాదాపు 80 లక్షలమంది ఉన్నారు. దీన్నిబట్టి యెహోవాకు ఘనత, మహిమ తెచ్చే సువార్తను ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తున్నది యెహోవాసాక్షులు మాత్రమేనని స్పష్టంగా అర్థమౌతోంది.—కీర్త. 34:1; 51:15.

15 అంతం రాకముందే సాధ్యమైనంత ఎక్కువమందికి సువార్త ప్రకటించాలన్నదే యెహోవాసాక్షులైన మన లక్ష్యం. అందుకోసం, లక్షలకొద్దీ పుస్తకాలను, పత్రికలను, కరపత్రాలను, సమావేశ-జ్ఞాపకార్థ ఆహ్వానపత్రాలను 700 కన్నా ఎక్కువ భాషల్లో అనువదించి, ప్రచురిస్తున్నాం. మనం ప్రజలకు వాటిని ఉచితంగా ఇస్తాం. ఒక్క గత సంవత్సరంలోనే, దాదాపు 450 కోట్ల బైబిలు ఆధారిత ప్రచురణల్ని ప్రచురించాం. అంతేకాదు, 20 కోట్లకన్నా ఎక్కువ కాపీల పరిశుద్ధ లేఖనాల నూతనలోక అనువాదం బైబిళ్లను 130 కన్నా ఎక్కువ భాషల్లో ప్రచురించాం. మన వైబ్‌సైట్‌లో ఉన్న సమాచారం 750 కన్నా ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉంది. ఇలాంటి అద్భుతమైన పని చేస్తున్నది కేవలం యెహోవాసాక్షులే.

16. యెహోవాసాక్షులకు పవిత్రశక్తి సహాయం ఉందని ఎలా చెప్పవచ్చు?

16 ప్రకటనాపని ఎంతకాలం జరుగుతుంది? అంతం వచ్చేవరకు సువార్త ప్రకటించబడుతుందని యేసు చెప్పాడు. యెహోవా పవిత్రశక్తి వల్లే మనం ఈ చివరి రోజుల్లో కూడా ప్రకటనాపనిని కొనసాగించగలుగుతున్నాం. (అపొ. 1:8; 1 పేతు. 4:14) అయితే కొన్ని మతాలవాళ్లు, “మాకు పవిత్రశక్తి సహాయం ఉంది” అని అనవచ్చు. మరి వాళ్లు ఈ చివరి రోజుల్లో కూడా ప్రకటనాపని చేయగలుగుతున్నారా? యెహోవాసాక్షులు చేసినట్లే ప్రకటనాపని చేయాలని కొంతమంది ప్రయత్నించారు కానీ అది వాళ్ల వల్లకాలేదు. ఇంకొంతమందికి చేయాలనే ఇష్టం ఉన్నా ఎక్కువకాలం చేయలేకపోయారు. మరికొంతమంది ఇంటింటికి వెళ్లి ప్రకటిస్తున్నప్పటికీ, వాళ్లు ప్రకటించేది మాత్రం రాజ్యసువార్త కాదు. కాబట్టి యేసు మొదలుపెట్టిన పనిని వాళ్లు చేయట్లేదని స్పష్టమౌతుంది.

నేడు నిజంగా ఎవరు సువార్త ప్రకటిస్తున్నారు?

17, 18. (ఎ) నేడు రాజ్యసువార్తను ప్రకటిస్తున్నది యెహోవాసాక్షులే అని ఖచ్చితంగా ఎందుకు చెప్పవచ్చు? (బి) ఈ పనిని కొనసాగిస్తూ ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది?

17 మరి రాజ్యసువార్తను నేడు ఎవరు ప్రకటిస్తున్నారు? యెహోవాసాక్షులు మాత్రమే. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే మనం యేసు చెప్పిన సందేశాన్నే అంటే రాజ్యసువార్తను ప్రకటిస్తున్నాం. ప్రజల దగ్గరకు వెళ్లి సువార్త ప్రకటిస్తున్నాం కాబట్టి మనం సరైన పద్ధతుల్ని ఉపయోగిస్తున్నాం. మనం సరైన ఉద్దేశంతోనే అంటే యెహోవాపై, ప్రజలపై ఉన్న ప్రేమతోనే ప్రకటనాపని చేస్తున్నాం. మనం దీన్ని ఎంత విస్తృతంగా చేస్తున్నామంటే అన్ని దేశాల ప్రజలకు, భాషలవాళ్లకు ప్రకటిస్తున్నాం. అంతం వచ్చేదాక మనం ప్రకటిస్తూనే ఉంటాం.

18 ఈ చివరిరోజుల్లో యెహోవా ప్రజలు చేస్తున్న ఈ అద్భుతమైన పనిని చూస్తుంటే నిజంగా ఆశ్చర్యమనిపిస్తుంది. కానీ మనం సువార్తను ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రకటించగలుగుతున్నాం? అపొస్తలుడైన పౌలు ఇలా వివరిస్తున్నాడు, “తనకు ఇష్టమైనవి చేయాలనే కోరికను మీలో కలిగించి, దాని ప్రకారం ప్రవర్తించే శక్తిని మీకు ఇచ్చి మిమ్మల్ని బలపర్చేది దేవుడే. అలా చేయడం ఆయనకు ఇష్టం.” (ఫిలి. 2:13, NW) యేసుక్రీస్తు ఆజ్ఞాపించినట్లు సువార్తను ప్రకటిస్తూనే ఉండడానికి కావాల్సిన శక్తిని యెహోవా ఇస్తూనే ఉండాలని కోరుకుందాం.—2 తిమో. 4:5.