కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారం నుండి పూర్తి ప్రయోజనం పొందండి

యెహోవా ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారం నుండి పూర్తి ప్రయోజనం పొందండి

“నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును.”యెష. 48:17.

పాటలు: 20, 37

1, 2. (ఎ) యెహోవాసాక్షులు బైబిలు గురించి ఎలా భావిస్తారు? (బి) బైబిల్లో మీకు ఇష్టమైన పుస్తకం ఏది?

 యెహోవాసాక్షులమైన మనం బైబిల్ని ప్రేమిస్తాం. అది మనకు ఓదార్పును, నిరీక్షణను, నమ్మదగిన సలహాలను ఇస్తుంది. (రోమా. 15:4) బైబిలు మనుషుల ఆలోచనలున్న పుస్తకం కాదుగానీ “దేవుని వాక్యము.”—1 థెస్స. 2:13.

2 బహుశా మనందరికీ బైబిల్లోని ఏదోక పుస్తకమంటే చాలా ఇష్టం ఉండవచ్చు. కొంతమంది సువార్త వృత్తాంతాల్ని ఇష్టపడతారు. ఎందుకంటే, యెహోవాకున్న ఆకర్షణీయమైన లక్షణాల్ని యేసు ఎలా చూపించాడో వాటిలో తెలుసుకుంటాం. (యోహా. 14:9) ఇంకొంతమంది, ప్రకటన లాంటి ప్రవచన పుస్తకాలను ఇష్టపడతారు. “త్వరలో సంభవింపనైయున్న” సంఘటనల గురించి ఆ పుస్తకాలు తెలియజేస్తాయి. (ప్రక. 1:1) మరికొంతమంది కీర్తనలు చదివి ఓదార్పు పొందుతారు. ఇంకొందరు, సామెతల పుస్తకంలో ఉన్న మంచి సలహాలను చదవడానికి ఇష్టపడతారు. వీటన్నిటినిబట్టి బైబిలు అందరికీ ఉపయోగపడే పుస్తకం అని స్పష్టంగా తెలుస్తోంది.

3, 4. (ఎ) మన ప్రచురణల గురించి మనమెలా భావిస్తాం? (బి) ప్రత్యేకించి కొంతమంది కోసం ఎలాంటి బైబిలు ఆధారిత ప్రచురణల్ని మనం అందుకుంటున్నాం?

3 మనం బైబిల్ని ప్రేమిస్తాం కాబట్టి, బైబిలు ఆధారంగా తయారుచేసిన మన ప్రచురణల్ని కూడా ప్రేమిస్తాం. మనకు అందుబాటులో ఉన్న పుస్తకాలు, బ్రోషుర్లు, పత్రికలు, ఇతర సాహిత్యాలు అన్నీ యెహోవా ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారమే. అవన్నీ ఆయనకు దగ్గరవ్వడానికి, విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి మనకు సహాయం చేస్తాయి.—తీతు 2:2.

4 మన ప్రచురణల్లో చాలావాటిని యెహోవాసాక్షులందరి కోసం తయారుచేస్తారు. కొన్ని ప్రచురణల్ని ప్రత్యేకించి యౌవనుల కోసం లేదా తల్లిదండ్రుల కోసం తయారుచేస్తారు. అయితే, మన వెబ్‌సైట్‌లో ఉన్న ఆర్టికల్స్‌ని, వీడియోల్ని చాలావరకు యెహోవాసాక్షులుకాని వాళ్లకోసం తయారుచేశారు. అలాంటి వివిధ ప్రచురణల్ని ఇవ్వడం ద్వారా, అన్నిరకాలైన ప్రజలకు కావాల్సిన నిర్దేశాల్ని సమృద్ధిగా ఇస్తానని తాను ఇచ్చిన మాటను యెహోవా నిలబెట్టుకున్నాడని చెప్పవచ్చు.—యెష. 25:6.

5. దేన్ని చూసి యెహోవా సంతోషిస్తాడనే నమ్మకంతో మనం ఉండవచ్చు?

5 బైబిల్ని, మన ప్రచురణల్ని చదవడానికి ఎక్కువ సమయం ఉంటే బాగుంటుందని మనలో చాలామందిమి అనుకోవచ్చు. అయితే మనకు అందే ప్రతీ ప్రచురణను చదవడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించలేకపోవచ్చు. కానీ క్రమంగా బైబిలు చదువుతూ, వ్యక్తిగత అధ్యయనం చేస్తూ సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించేందుకు మనం చేసే కృషిని చూసి యెహోవా సంతోషిస్తాడు. (ఎఫె. 5:15, 16) కానీ మనం ఓ ప్రమాదం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏంటది?

6. దేనివల్ల మనం ఆధ్యాత్మిక ఆహారమంతటి నుండి ప్రయోజనం పొందలేకపోవచ్చు?

6 మనం జాగ్రత్తగా లేకపోతే ఫలానా బైబిలు పుస్తకాలు లేదా ప్రచురణలు మనకోసం కాదని అనుకునే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, ఒకానొక బైబిలు భాగంలోని విషయాలు మన పరిస్థితికి ఉపయోగపడవని అనిపిస్తే? లేదా ఒకానొక ప్రచురణ మనల్ని ఉద్దేశించి తయారు చేసింది కాకపోతే? అలాంటి వాటిని పైపైన చదువుతున్నామా లేదా అసలు చదవట్లేదా? ఒకవేళ వాటిని చదవకపోతే మనకు ఉపయోగపడే విలువైన సమాచారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అలా జరగకూడదంటే ఏమి చేయాలి? మనకు అందుబాటులోకి వచ్చే ప్రతీది యెహోవా నుండి వస్తుందని గుర్తుంచుకోవాలి. “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును” అని బైబిలు చెప్తుంది. (యెష. 48:17) యెహోవా ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారమంతటి నుండి ప్రయోజనం పొందడానికి సహాయం చేసే మూడు సలహాలను ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం.

బైబిలు చదవడంవల్ల వచ్చే ప్రయోజనాల్ని పొందడానికి సలహాలు

7. మనం బైబిల్ని ఎలా చదవాలి?

7 బైబిలు చదువుతున్నప్పుడు అందులో మనకు ఏ పాఠాలు ఉన్నాయో ఆలోచించాలి. బైబిల్లోని కొన్ని భాగాలు ప్రత్యేకించి ఒక వ్యక్తి కోసం లేదా గుంపు కోసం రాయబడ్డాయన్న మాట వాస్తవమే. కానీ, “దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ప్రయోజనకరమై యున్నది” అని బైబిలు స్పష్టంగా చెప్తుంది. (2 తిమో. 3:16, 17) అందుకే బైబిలు చదువుతున్నప్పుడు అందులోని విషయాలు మనకెలా ఉపయోగపడతాయో ఆలోచిస్తూ చదవాలి. ఓ సహోదరుడు ఇలా చెప్తున్నాడు, ‘నేను బైబిలు చదువుతున్నప్పుడు, ఒక్క వృత్తాంతంలోనే ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చనే విషయాన్ని గుర్తుంచుకుంటాను. అలా గుర్తుంచుకోవడంవల్ల వెంటనే అర్థంకాని పాఠాల్ని కూడా నేను తెలుసుకోగలిగాను.’ కాబట్టి బైబిలు చదవడానికి ముందు అందులో మనకు ఉపయోగపడే విషయాల్ని గుర్తించేందుకు, యెహోవా మనకు నేర్పించాలనుకుంటున్న పాఠాల్ని అర్థంచేసుకునేందుకు కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వమని యెహోవాను అడగాలి.—ఎజ్రా 7:10; యాకోబు 1:5 చదవండి.

8, 9. (ఎ) బైబిలు చదువుతున్నప్పుడు మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి? (బి) సంఘపెద్దలకు ఉండాల్సిన అర్హతలు యెహోవా గురించి ఏమి చెప్తున్నాయి?

8 ప్రశ్నలు వేసుకోండి. మీరు బైబిలు చదువుతున్నప్పుడు, ఇలా ప్రశ్నించుకోండి, ‘దీని నుండి యెహోవా గురించి నేనేమి నేర్చుకోవచ్చు? దీన్ని నా జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు? ఇతరులకు సహాయం చేసేందుకు దీన్నెలా ఉపయోగించవచ్చు?’ ఈ ప్రశ్నల గురించి ఆలోచించినప్పుడు బైబిలు చదవడం నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతాం. ఓ ఉదాహరణ పరిశీలిద్దాం. సంఘపెద్దలకు ఉండాల్సిన కొన్ని అర్హతల గురించి బైబిలు వివరిస్తుంది. (1 తిమోతి 3:2-7 చదవండి.) అయితే, మనలో చాలామందిమి సంఘపెద్దలం కాదు కాబట్టి, ఈ లేఖనాలు మనకు ఏ విధంగానూ ఉపయోగపడవని అనుకోవచ్చు. కానీ ముందు ప్రస్తావించిన మూడు ప్రశ్నల సహాయంతో ఈ అర్హతలు మనకెలా ఉపయోగపడతాయో చూద్దాం.

బైబిలు చదవడంవల్ల వచ్చే పూర్తి ప్రయోజనాన్ని పొందుతున్నారా? (7వ పేరా చూడండి)

9 దీని నుండి యెహోవా గురించి నేనేమి నేర్చుకోవచ్చు? సంఘపెద్దలకు ఎలాంటి అర్హతలు ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడో బైబిల్లో ఉంది. సంఘంలోని బాధ్యతగల పురుషుల విషయంలో యెహోవాకు ఉన్నతమైన ప్రమాణాలు ఉన్నాయి. దీన్నిబట్టి యెహోవా సంఘాన్ని చాలా విలువైనదిగా చూస్తున్నాడని తెలుస్తోంది. ఆయన దాన్ని తన ‘సొంత కొడుకు రక్తంతో’ కొన్నాడని బైబిలు చెప్తుంది. (అపొ. 20:28, NW) అందుకే, సంఘపెద్దలు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని యెహోవా ఆశిస్తున్నాడు. అంతేకాదు, సంఘంలోని వాళ్లను చూసుకునే విషయంలో పెద్దలు యెహోవాకు లెక్క అప్పజెప్పాలి. వాళ్ల సంరక్షణలో మనం సురక్షితంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. (యెష. 32:1, 2) కాబట్టి ఈ అర్హతల గురించి చదివినప్పుడు యెహోవాకు మనపట్ల నిజంగా ఎంత శ్రద్ధ ఉందో మనకు అర్థమౌతుంది.

10, 11. (ఎ) పెద్దల అర్హతల గురించి చదువుతున్నప్పుడు దాన్ని మన జీవితంలో ఎలా ఉపయోగించవచ్చు? (బి) ఇతరులకు సహాయం చేయడానికి ఎలా ఉపయోగించవచ్చు?

10 దీన్ని నా జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు? ఒకవేళ మీరు సంఘపెద్దగా సేవచేస్తుంటే ఆ అర్హతల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఇంకా మెరుగవ్వడానికి ప్రయత్నించాలి. ఒకవేళ మీరు ‘సంఘంలో పర్యవేక్షకుడు అవ్వడానికి కృషి చేస్తుంటే’ ఆ అర్హతలు చేరుకోవడానికి చేయగలిగినదంతా చేయండి. (1 తిమో. 3:1, NW) కానీ క్రైస్తవులందరూ ఆ అర్హతల గురించి ఆలోచించడంవల్ల ప్రయోజనం పొందవచ్చు. ఉదాహరణకు, మనందరం సహేతుకంగా ఉండాలని, మంచి వివేచనను ఉపయోగించాలని యెహోవా ఆశిస్తున్నాడు. (ఫిలి. 4:5; 1 పేతు. 4:7) పెద్దలు “మందకు మాదిరులుగా” ఉన్నప్పుడు మనం వాళ్లనుండి నేర్చుకుంటాం, “వారి విశ్వాసమును” అనుకరిస్తాం.—1 పేతు. 5:3; హెబ్రీ. 13:7.

11 ఇతరులకు సహాయం చేసేందుకు దీన్నెలా ఉపయోగించవచ్చు? క్రైస్తవ పెద్దలకు, మత బోధకులకు మధ్య ఉన్న తేడా గురించి బైబిలు విద్యార్థులకు, ఆసక్తి ఉన్నవాళ్లకు వివరించడానికి మనం ఆ అర్హతలను ఉపయోగించవచ్చు. సంఘపెద్దల కష్టాన్ని గుర్తుంచుకోవడానికి కూడా ఆ అర్హతలు మనకు సహాయం చేస్తాయి. అప్పుడు వాళ్లను గౌరవించడానికి అవి తోడ్పడతాయి. (1 థెస్స. 5:12) వాళ్లను మనమెంత గౌరవిస్తే, వాళ్లు అంత ఆనందంగా సేవచేయగలుగుతారు.—హెబ్రీ. 13:17.

12, 13. (ఎ) మనం పరిశోధన ఎలా చేయాలి? (బి) వెంటనే అర్థంకాని పాఠాలు గుర్తించడానికి ఆ వృత్తాంతం రాసిన సందర్భం మనకెలా సహాయం చేస్తుందో ఓ ఉదాహరణ చెప్పండి.

12 పరిశోధన చేయండి. బైబిలు చదువుతున్నప్పుడు ఈ కింది ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి:

  •   ఈ భాగాన్ని రాసింది ఎవరు?

  •   ఎక్కడ, ఎప్పుడు రాశారు?

  •   దీన్ని రాస్తున్నప్పుడు ఏ ప్రాముఖ్యమైన సంఘటనలు జరిగాయి?

 ఇలాంటి సమాచారం తెలుసుకోవడంవల్ల మనకు వెంటనే అర్థంకాని పాఠాల్ని కూడా గుర్తించగలుగుతాం.

13 ఉదాహరణకు యెహెజ్కేలు 14:13, 14 లో ఇలా ఉంది, “ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపముచేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండజేసి కరవు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును.నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతిచేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.” అయితే మనం కొంత పరిశోధన చేస్తే యెహెజ్కేలు ఆ మాటల్ని, యేసుక్రీస్తు పుట్టడానికి దాదాపు 612 సంవత్సరాల ముందు రాశాడని తెలుసుకుంటాం. అప్పటికే నోవహు, యోబు చనిపోయి వందల సంవత్సరాలు గడిచిపోయినా, వాళ్లు చూపించిన విశ్వాసాన్ని యెహోవా ఇంకా గుర్తుంచుకున్నాడు. దానియేలు అప్పటికి బ్రతికేవున్నాడు. అతను నోవహు, యోబులాగే నీతిమంతుడని యెహోవా చెప్పినప్పుడు బహుశా అతనికి 20 ఏళ్లు ఉండివుంటాయి. దీన్నుండి మనమేమి నేర్చుకోవచ్చు? యౌవనులతో సహా, తన నమ్మకమైన సేవకులందర్నీ యెహోవా చూస్తాడు, వాళ్లను విలువైనవాళ్లుగా ఎంచుతాడు.—కీర్త. 148:12-14.

వివిధ ప్రచురణల నుండి ప్రయోజనం పొందండి

14. యౌవనుల కోసం తయారుచేసే సమాచారం నుండి వాళ్లు ఎలా ప్రయోజనం పొందుతున్నారు? దాన్ని చదవడంవల్ల ఇతరులు కూడా ఏవిధంగా ప్రయోజనం పొందవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

14 యౌవనుల కోసం ప్రచురణలు. బైబిల్లోని అన్ని భాగాల నుండి మనం ప్రయోజనం పొందవచ్చని తెలుసుకున్నాం. అదేవిధంగా మన ప్రచురణలన్నిటి నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు. కొన్ని ఉదాహరణల్ని పరిశీలిద్దాం. ఈ మధ్యకాలంలో యౌవనుల కోసం యెహోవా ఎంతో సమాచారాన్ని అందించాడు. [1] స్కూల్లో వచ్చే ఒత్తిళ్లను, ఎదుగుతున్నప్పుడు వచ్చే సవాళ్లను తట్టుకోవడానికి వాళ్లకు ఈ సమాచారం సహాయం చేస్తుంది. అయితే ఆ ఆర్టికల్స్‌ని, పుస్తకాల్ని చదవడంవల్ల మనందరం ఎలాంటి ప్రయోజనం పొందవచ్చు? మనం ఆ సమాచారాన్ని చదవడంవల్ల యౌవనులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకోగలుగుతాం. అప్పుడు మనం వాళ్లకు ఇంకా ఎక్కువ సహాయం చేస్తూ, ప్రోత్సహించగలుగుతాం.

15. యౌవనుల కోసం తయారుచేసే సమాచారాన్ని పెద్దవాళ్లు కూడా ఎందుకు చదవాలి?

15 యౌవనుల కోసం తయారుచేసే ఆర్టికల్స్‌ని మేము చదవాల్సిన అవసరం లేదని పెద్దవాళ్లు అనుకోకూడదు. ఎందుకంటే ఆ ఆర్టికల్స్‌లో చర్చించే చాలా సమస్యలు ప్రతీ క్రైస్తవుడు ఎదుర్కొనేవే. ఉదాహరణకు, మన మతనమ్మకాల గురించి ఇతరులకు వివరించాల్సిన పరిస్థితి అందరికీ ఎదురౌతుంది, మనందరం మన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి, తోటివాళ్ల ఒత్తిడిని ఎదిరించాలి, చెడు స్నేహాలకు-వినోదానికి దూరంగా ఉండాలి. కాబట్టి ఈ ప్రచురణలు యౌవనుల కోసమే అయినప్పటికీ అందులోని సమాచారాన్ని బైబిలు ఆధారంగానే తయారుచేస్తారు, వాటినుండి క్రైస్తవులందరూ ప్రయోజనం పొందవచ్చు.

16. యౌవనులు ఇంకా ఏమి చేయడానికి మన ప్రచురణలు సహాయం చేస్తాయి?

16 యౌవనుల కోసం తయారుచేసిన ప్రచురణలు, యెహోవాతో ఉన్న స్నేహాన్ని బలపర్చుకోవడానికి వాళ్లకు సహాయం చేస్తాయి. (ప్రసంగి 12:1, 13 చదవండి.) వాటినుండి పెద్దవాళ్లు కూడా ప్రయోజనం పొందవచ్చు. ఉదాహరణకు, తేజరిల్లు! జూలై 2006 సంచికలో “యువత ఇలా అడుగుతోంది . . . నేను ఎందుకు చదవాలి?” అనే ఆర్టికల్‌ ఉంది. అందులో ఎన్నో అనుభవాలు, ఎవరికివాళ్లు ఆలోచించుకోవాల్సిన ప్రశ్నలు ఉన్నాయి. అలాంటి ఆర్టికల్స్‌ నుండి పెద్దవాళ్లు ప్రయోజనం పొందగలరా? పిల్లలున్న ఓ సహోదరి, తనకు బైబిలు చదవడం ఎప్పుడూ కష్టంగా ఉండేదని చెప్పింది. కానీ మన ప్రచురణలో వచ్చిన సలహాల్ని పాటించిన తర్వాత, బైబిల్లోని పుస్తకాలు ఒకదానికొకటి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో అర్థం చేసుకోగలిగిందని, వాటిని చక్కగా చిత్రీకరించుకోగలిగిందని ఆమె చెప్తుంది. అంతేకాదు ఆమె ఇలా అంది, “ఇప్పుడు నాకు బైబిల్ని ఎప్పుడెప్పుడు చదువుదామా అని అనిపిస్తుంటుంది. ముందెప్పుడూ లేనంత ఆసక్తిగా బైబిల్ని చదువుతున్నాను.”

17, 18. ప్రీచింగ్‌లో కలిసే ప్రజల కోసం తయారుచేసిన పత్రికల్ని చదవడంవల్ల మనమెలాంటి ప్రయోజనం పొందవచ్చు? ఓ ఉదాహరణ చెప్పండి.

17 పరిచర్యలో కలిసే ప్రజల కోసం ప్రచురణలు. మనం 2008వ సంవత్సరం నుండి కావలికోట అధ్యయన ప్రతి ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతున్నాం. ఈ పత్రికను ముఖ్యంగా యెహోవాసాక్షుల కోసమే తయారుచేశారు. అయితే పరిచర్యలో కలిసే ప్రజల కోసం కూడా పత్రికలు ఉన్నాయి. వాటినుండి కూడా మనమెలా ప్రయోజనం పొందవచ్చు? ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. మీరు ఆహ్వానించిన వ్యక్తి మీటింగ్‌కి వస్తే మీరు చాలా సంతోషిస్తారు. అంతేకాదు మీటింగ్‌ జరుగుతున్నప్పుడు, ఆ రోజు ప్రసంగంలోని విషయాలు అతనికి ఎలా అనిపిస్తున్నాయో, అతనిలో ఎలాంటి మార్పులు తీసుకురాగలవో ఆలోచిస్తారు. అప్పుడు ఆ ప్రసంగం మీ హృదయానికి చేరుకుంటుంది, అందులోని విషయాలపట్ల మీ కృతజ్ఞత కూడా పెరుగుతుంది.

18 అదేవిధంగా, ప్రీచింగ్‌లో ప్రజలకు అందించే పత్రికల్ని మనం చదివినప్పుడు కూడా మనలో కృతజ్ఞత పెరుగుతుంది. ఉదాహరణకు, బైబిల్లోని విషయాల్ని వివరించడానికి సార్వజనిక పత్రికలో, jw.org వెబ్‌సైట్‌ ఆర్టికల్స్‌లో తేలిగ్గా అర్థమయ్యే పదాలను, పదబంధాలను ఉపయోగిస్తారు. వాటిని చదివినప్పుడు మనకు బాగా తెలిసిన బైబిలు సత్యాలపట్ల మన ప్రేమ, అవగాహన ఇంకా పెరుగుతాయి. అంతేకాదు, ప్రీచింగ్‌లో కొత్తకొత్త విధానాల్లో మన నమ్మకాలను ఎలా వివరించవచ్చో నేర్చుకుంటాం. అదేవిధంగా తేజరిల్లు! పత్రిక, సృష్టికర్త ఉన్నాడనే మన నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది. అలాగే ఇతరులకు మన నమ్మకాల్ని ఎలా వివరించాలో నేర్పిస్తుంది.—1 పేతురు 3:15-16 చదవండి.

19. యెహోవా ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారానికి మనమెలా కృతజ్ఞత చూపించవచ్చు?

19 మన ప్రయోజనం కోసం యెహోవా ఎన్నో సలహాల్ని, నిర్దేశాల్ని ఇస్తున్నాడని స్పష్టంగా చెప్పవచ్చు. ఆయనిచ్చే ఆధ్యాత్మిక ఆహారం నుండి మనం పూర్తి ప్రయోజనం పొందడానికి కృషి చేస్తూనే ఉందాం. అలా చేస్తే మనకు ప్రయోజనం కలిగేలా బోధిస్తున్న యెహోవాకు కృతజ్ఞత చూపించిన వాళ్లమౌతాం.—యెష. 48:17.

^ [1] (14వ పేరా) అలాంటి సమాచారం యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మక సమాధానాలు (ఇంగ్లీషు) 1, 2 సంపుటిల్లోనూ అలాగే ఇంటర్నెట్‌లో మాత్రమే ప్రచురించబడే “యువత అడిగే ప్రశ్నలు” అనే ఆర్టికల్స్‌లోనూ అందుబాటులో ఉంది.