కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘భయపడకు నేను నీకు సహాయం చేస్తాను’

‘భయపడకు నేను నీకు సహాయం చేస్తాను’

అర్థరాత్రి రోడ్డుమీద మీరు ఒంటరిగా నడుస్తున్నట్లు ఊహించుకోండి. కొంతదూరం వెళ్లాక ఎవరో మీ వెనకాలే వస్తున్న చప్పుడు వినిపించింది. మీరు ఆగితే ఆ అడుగుల చప్పుడు కూడా ఆగుతోంది. మీరు వేగంగా నడిస్తే ఆ వ్యక్తి అడుగులు కూడా అంతే వేగంగా మీ వెంట వస్తున్నాయి. మీరు వెంటనే దగ్గర్లో ఉన్న మీ స్నేహితుని ఇంటికి పరుగెత్తారు. ఆ స్నేహితుడు తలుపు తీసి ఇంట్లోకి రమ్మనగానే మీరు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

బహుశా మీకు అలాంటి అనుభవం ఎదురై ఉండకపోవచ్చు. కానీ మీరు వేరే విషయాల గురించి ఆందోళన పడుతుండవచ్చు. ఉదాహరణకు, ఎంత ప్రయత్నించినా ఒకానొక బలహీనతను అధిగమించలేక ఒకే తప్పును మళ్లీమళ్లీ చేస్తున్నారా? మీరు ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్నా ఉద్యోగం దొరకట్లేదా? మీ వయసు పైబడుతుందనీ, భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వస్తాయనీ ఆందోళన చెందుతున్నారా? లేదా వేరే దేనిగురించైనా దిగులుపడుతున్నారా?

మీ సమస్య ఏదైనా దాన్ని వినడానికి, మీకు సహాయం చేయడానికి ఓ స్నేహితుడు ఉంటే బాగుంటుంది. మరి మీకు అలాంటి దగ్గరి స్నేహితుడు ఉన్నాడా? ఉన్నాడు, యెహోవాయే ఆ స్నేహితుడు. అవును, యెషయా 41:8-13 వచనాలు చెప్తున్నట్లుగా ఆయన నమ్మకస్థుడైన అబ్రాహాముకు స్నేహితునిగా ఉన్నట్లే మీకు కూడా స్నేహితునిగా ఉన్నాడు. 10, 13 వచనాల్లో యెహోవా మనలో ప్రతీఒక్కరికి ఇలా మాటిస్తున్నాడు, ‘నీకు తోడైవున్నాను భయపడకు నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులుపడకు నేను నిన్ను బలపరుస్తాను నీకు సహాయం చేసేవాడిని నేనే, నీతి అనే నా దక్షిణహస్తంతో [కుడిచేతితో] నిన్ను ఆదుకుంటాను. నీ దేవుడనైన యెహోవానగు నేను—భయపడకు నేను నీకు సహాయం చేస్తాను అని చెప్తూ నీ కుడిచేతిని పట్టుకుంటున్నాను.’

‘నిన్ను ఆదుకుంటాను’

యెహోవా మాటలు చాలా ఓదార్పునిస్తాయి. ఆయన ఇచ్చిన మాట గురించి ఒకసారి లోతుగా ఆలోచించండి. మీరు యెహోవా చెయ్యి పట్టుకుని ఆయన పక్కన నడుస్తున్నారని ఆ వచనం చెప్పట్లేదు. ఒకవేళ మీరు ఆయన పక్కన నడుస్తుంటే యెహోవా తన కుడి చేతితో మీ ఎడమ చేతిని పట్టుకొని ఉండాలి. కానీ యెహోవా మిమ్మల్ని ఓ కష్టపరిస్థితి నుండి బయటకు లాగుతున్నట్లు, తన ‘నీతి అనే దక్షిణహస్తంతో’ అంటే తన కుడిచేతితో, ‘మీ కుడిచేతిని పట్టుకుంటున్నాడు.’ యెహోవా మీ కుడిచేతిని పట్టుకున్నప్పుడు, ‘భయపడకు నేను నీకు సహాయం చేస్తాను’ అని ధైర్యం చెప్తాడు.

మీరు యెహోవాను ఓ ప్రేమగల తండ్రిగా, స్నేహితునిగా భావిస్తున్నారా? కష్టాలు వచ్చినప్పుడు ఆయన మీకు సహాయం చేస్తాడని నమ్ముతున్నారా? యెహోవాకు మీపట్ల నిజంగా శ్రద్ధ ఉంది, ఆయన మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు కూడా. మీకు సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు ఆందోళనపడకుండా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అంతేకాదు, “ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.”—కీర్త. 46:1.

గతంలో చేసిన తప్పుల్నిబట్టి బాధపడుతుంటే . . .

కొంతమంది తాము గతంలో చేసిన తప్పుల్ని ఎప్పటికీ గుర్తుచేసుకుంటూ దేవుడు తమను క్షమించాడా లేదా అని ఆలోచిస్తుంటారు. ఒకవేళ మీకలా అనిపిస్తే యోబును గుర్తుచేసుకోండి. అతను యౌవనంలో ఉన్నప్పుడు తప్పు చేశానని ఒప్పుకున్నాడు. (యోబు 13:26) కీర్తనకర్త దావీదుకు కూడా అలానే అనిపించింది అందుకే, “నా బాల్యపాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసికొనకుము” అని యెహోవాను వేడుకున్నాడు. (కీర్త. 25:7) మనందరం అపరిపూర్ణులం కాబట్టి, “పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను” పొందలేకపోతున్నాం.—రోమా. 3:23.

యెషయా 41వ అధ్యాయంలోని ఓదార్పునిచ్చే మాటలు ఇశ్రాయేలీయుల్ని ఉద్దేశించి రాయబడ్డాయి. వాళ్లు ఎంత ఘోరమైన పాపాలు చేశారంటే, వాళ్లను బబులోనుకు చెరగా పంపించడం ద్వారా శిక్షిస్తానని యెహోవా చెప్పాడు. (యెష. 39:6, 7) అదే సమయంలో, ఎవరైతే తమ పాపాల్ని ఒప్పుకుని, తన దగ్గరకు తిరిగి వస్తారో వాళ్లను విడిపిస్తానని కూడా యెహోవా మాటిచ్చాడు. (యెష. 41:8-10; 49:8) నేడు కూడా ఎవరైతే తమ తప్పుల్ని నిజాయితీగా ఒప్పుకుని, తనను సంతోషపెడతారో యెహోవా వాళ్లపై అలాంటి ప్రేమను, దయనే చూపిస్తున్నాడు.—కీర్త. 51:1.

తేజ a అనే సహోదరుని అనుభవాన్ని పరిశీలించండి. అతను అశ్లీల చిత్రాలు చూడడం, హస్తప్రయోగం చేయడం వంటి చెడు అలవాట్ల నుండి బయటపడడానికి చాలా ప్రయత్నించాడు. కానీ చాలాసార్లు వాటిని చేయకుండా ఉండలేకపోయాడు. అప్పుడు అతనికి ఎలా అనిపించింది? అతనిలా అంటున్నాడు, “నేను ఎందుకూ పనికిరానివాడినని అనిపించింది, కానీ క్షమించమని యెహోవాను అడిగినప్పుడు, ఆయన నాకు సహాయం చేశాడు.” ఇంతకీ యెహోవా అతనికి ఎలా సహాయం చేశాడు? ఆ అలవాటుకు లొంగిపోయిన ప్రతీసారి తమకు ఫోన్‌ చేయమని సంఘపెద్దలు అతనికి చెప్పారు. తేజ ఇలా చెప్తున్నాడు, “వాళ్లకు ఫోన్‌ చేయడానికి ఇబ్బందిగా అనిపించేది. కానీ ఫోన్‌ చేసిన ప్రతీసారి వాళ్లు నన్ను బలపర్చేవాళ్లు.” ఆ తర్వాత అతన్ని ప్రాంతీయ పర్యవేక్షకుడు కలిసేలా సంఘపెద్దలు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతీయ పర్యవేక్షకుడు అతనితో ఇలా అన్నాడు, “నేను అనుకోకుండా ఇక్కడికి రాలేదు. నేను ఇక్కడికి రావాలని మీ పెద్దలు కోరినందువల్లే వచ్చాను. ఈ కాపరి సందర్శనాన్ని వాళ్లు నీ కోసమే ఏర్పాటు చేశారు.” తేజ ఇలా చెప్తున్నాడు, “నేను పాపం చేస్తున్నప్పటికీ, సంఘపెద్దల ద్వారా నాకు సహాయం చేయడానికి యెహోవా ముందుకొచ్చాడు.” కొంతకాలానికే తేజ ఆ అలవాట్లను మానుకుని క్రమ పయినీరు సేవ మొదలుపెట్టాడు, ప్రస్తుతం బ్రాంచి కార్యాలయంలో సేవచేస్తున్నాడు. తప్పులు చేసినప్పుడు తేజకు సహాయం చేసినట్లే యెహోవా మీకూ సహాయం చేస్తాడు.

ఉద్యోగం దొరకడం లేదని ఆందోళనపడుతుంటే . . .

ఉద్యోగం పోయి, వేరే ఉద్యోగం దొరకనప్పుడు కొంతమంది ఆందోళనపడతారు. ఎంతమందిని అడిగినా ఉద్యోగం లేదని చెప్తుంటే ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకోండి. కొంతమంది ఆ కష్టాన్ని ఎదుర్కొంటున్నప్పుడు తాము పనికిరానివాళ్లమని అనుకుంటారు. మరి యెహోవా మీకెలా సహాయం చేస్తాడు? ఆయన మీకు ఓ మంచి ఉద్యోగాన్ని వెంటనే ఇవ్వకపోవచ్చు, కానీ దావీదు అన్న మాటల్ని మీరు గుర్తుచేసుకోవడానికి సహాయం చేయగలడు. దావీదు ఇలా చెప్పాడు, “నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి యుండలేదు.” (కీర్త. 37:25) యెహోవా మిమ్మల్ని విలువైనవాళ్లుగా చూస్తాడు. అందుకే ఆయన తన ‘నీతి అనే కుడిచేతితో’ మిమ్మల్ని ఆదుకుంటాడు, అప్పుడు ఆయన్ను సేవించడానికి అవసరమైన వాటిని మీరు పొందుతారు.

ఉద్యోగం పోతే యెహోవా మీకెలా సహాయం చేయగలడు?

కొలంబియాలో ఉంటున్న శారా అనే సహోదరి అనుభవాన్ని పరిశీలించండి. ఆమె తన జీవితంలో యెహోవా సహాయాన్ని చవిచూసింది. ఆమె ఓ పెద్ద కంపెనీలో మంచి జీతం వచ్చే ఉద్యోగం చేసేది. కానీ యెహోవా సేవలో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని మానేసి పయినీరు సేవ మొదలుపెట్టింది. అయితే తనకు సరిపోయే పార్ట్‌టైమ్‌ ఉద్యోగం దొరకడం చాలా కష్టమవ్వడంతో చిన్న ఐస్‌క్రీమ్‌ దుకాణం పెట్టుకుంది. కానీ డబ్బులు సరిపోక కొంతకాలానికే ఆ వ్యాపారాన్ని ఆపేసింది. శారా ఇలా చెప్తుంది, “మూడు సంవత్సరాలు చాలా కష్టంగా గడిచాయి, అయినా సహించడానికి యెహోవా నాకు సహాయం చేసినందుకు ఆయనకు చాలా కృతజ్ఞురాలిని.” తనకు నిజంగా ఏవి అవసరమో శారా తెలుసుకుంది, రేపటి గురించి చింతించకుండా ఎలా ఉండాలో కూడా నేర్చుకుంది. (మత్త. 6:33, 34) కొంతకాలానికి తన పాత కంపెనీ యజమాని శారాను పిలిచి, ఆమె ఇదివరకు చేసిన ఆ ఉద్యోగాన్నే ఇస్తానని చెప్పాడు. అయితే పరిచర్యకు, కూటాలకు వెళ్లడానికి వీలుగా పార్ట్‌టైమ్‌ ఉద్యోగమైతేనే చేస్తానని శారా ఆ యజమానికి చెప్పింది. ఆమెకు ఒకప్పుడు వచ్చినంత జీతం ఇప్పుడు రాకపోయినా పయినీరు సేవను మాత్రం కొనసాగించగలుగుతోంది. ఆ కష్టపరిస్థితిలో యెహోవా ప్రేమగల హస్తాన్ని చూశానని ఆమె చెప్తుంది.

వయసు పైబడతుందనే ఆందోళన

వయసు పైబడుతుందనీ, త్వరలోనే రిటైర్‌ అవుతామనీ చాలామంది ఆందోళనపడతారు. రిటైర్‌మెంట్‌ తర్వాత హాయిగా బ్రతకడానికి కావాల్సినంత డబ్బు ఉంటుందా అని వాళ్లు ఆలోచిస్తారు. అంతేకాదు భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయోనని చింతిస్తారు. బహుశా రాజైన దావీదు యెహోవాను ఇలా అడిగివుంటాడు, “వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము.”—కీర్త. 71:9, 18.

వృద్ధులు భవిష్యత్తు గురించి ధైర్యంగా ఉండడానికి ఏమి చేయాలి? యెహోవా మీద వాళ్లకున్న విశ్వాసాన్ని బలపర్చుకుంటూ, ఆయన తమకు కావాల్సినవన్నీ ఇస్తాడనే నమ్మకాన్ని కలిగివుండాలి. కొంతమంది ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు విలాసవంతంగా జీవించారు. కానీ ఇప్పుడు సాదాసీదాగా జీవిస్తూ ఉన్నదాంతో సంతృప్తి చెందడం వాళ్లు నేర్చుకోవాలి. అంతేకాదు, ‘కొవ్విన ఎద్దు మాంసం’ తినడం కన్నా ‘ఆకుకూరల భోజనం’ చేయడం తమ ఆరోగ్యానికి మంచిదని వాళ్లు గుర్తించవచ్చు. (సామె. 15:17) యెహోవా సేవ ఎక్కువ చేస్తే, మీరు ముసలివాళ్లు అయినప్పుడు మీకు అవసరమైనవన్నీ ఆయన తప్పకుండా ఇస్తాడు.

టోనీ-వెన్‌డీలతో హోసే-రోజ్‌

65 కన్నా ఎక్కువ ఏళ్లు పూర్తికాల సేవచేసిన హోసే-రోజ్‌ అనే దంపతుల గురించి ఆలోచించండి. ఆ సంవత్సరాలన్నింటిలో వాళ్లు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. రోజ్‌ వాళ్ల నాన్నకు 24 గంటలూ ఎవరోఒకరి సహాయం కావాలి కాబట్టి వాళ్లు ఆయన్ను దగ్గరుండి చూసుకున్నారు. అంతేకాదు హోసేకు క్యాన్సర్‌ వల్ల ఓ సర్జరీ జరిగింది, ఆ తర్వాత కీమోథెరఫీ కూడా చేశారు. మరి ఈ నమ్మకస్థులైన దంపతులకు యెహోవా తన కుడిచేతిని ఎలా అందించాడు? దానికోసం ఆయన టోనీ-వెన్‌డీ అనే మరో జంటను ఉపయోగించుకున్నాడు. టోనీ-వెన్‌డీలకు ఓ ఫ్లాట్‌ ఉండేది. వాళ్లు దాన్ని పూర్తికాల సేవకులకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. టోనీ స్కూల్లో ఉన్నప్పుడు తన క్లాస్‌రూమ్‌ కిటికీ నుండి హోసే-రోజ్‌లు క్రమంగా ప్రీచింగ్‌కు వెళ్లడం చూసేవాడు. వాళ్లు చూపించిన ఉత్సాహం టోనీకి బాగా నచ్చింది, అతను దాన్ని మర్చిపోలేదు. హోసే-రోజ్‌లు తమ జీవితాన్నంతా పూర్తికాల సేవలో గడిపారు కాబట్టి టోనీ-వెన్‌డీలు తమ ఫ్లాట్‌ను వాళ్లకు ఇచ్చారు. గత 15 ఏళ్లుగా వాళ్లే హోసే-రోజ్‌లను చూసుకుంటున్నారు. టోనీ-వెన్‌డీలు యెహోవా తమకిచ్చిన బహుమానమని ప్రస్తుతం దాదాపు 85 ఏళ్లున్న హోసే-రోజ్‌లు చెప్తున్నారు.

‘భయపడకు నేను నీకు సహాయం చేస్తాను’ అని యెహోవా మాటిస్తున్నాడు. ఆయన తన ‘నీతి అనే కుడిచేతిని’ మీకు కూడా అందిస్తున్నాడు. మరి ఆయనకు మీ చేతిని ఇస్తారా?

a అసలు పేర్లు కావు.