కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ బట్టలు దేవునికి మహిమ తెస్తున్నాయా?

మీ బట్టలు దేవునికి మహిమ తెస్తున్నాయా?

“సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.”1 కొరిం. 10:31.

పాటలు: 34, 29

1, 2. బట్టల్ని ఎంపిక చేసుకునే విషయంలో యెహోవాసాక్షులు ఉన్నత ప్రమాణాలను ఎందుకు పాటిస్తారు? (ప్రారంభ చిత్రం చూడండి.)

 ఒకానొక మీటింగ్‌లో చర్చి నాయకులు ఎలాంటి బట్టలు వేసుకున్నారో వివరిస్తూ ఓ డచ్‌ వార్తాపత్రిక ఇలా రాసింది, “వాతావరణం వేడిగా ఉండడం వల్ల చాలామంది ఇంట్లో వేసుకునే లాంటి బట్టలు వేసుకొచ్చారు.” కానీ యెహోవాసాక్షులు మాత్రం తమ సమావేశానికి అలాంటి బట్టలు వేసుకుని రాలేదని అదే వార్తాపత్రిక పేర్కొంది. అంతేకాదు అబ్బాయిలు, మగవాళ్లు సూట్లు వేసుకుని టైలు కట్టుకున్నారు. అమ్మాయిలు, ఆడవాళ్లు అటు ఆధునికంగానూ, ఇటు అణకువగానూ ఉండేలా తగిన పొడవున్న స్కర్ట్‌లు వేసుకున్నారని ఆ పత్రిక తెలియజేసింది. యెహోవాసాక్షులు అణకువగల బట్టలు వేసుకుంటారని చాలామంది మెచ్చుకుంటారు. క్రైస్తవులు వేసుకునే బట్టలు వాళ్లకు ‘అణకువ, మంచి వివేచన’ ఉన్నాయని చూపించాలని, దేవుని సేవకులకు అలాంటి బట్టలే తగినవని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (1 తిమో. 2:8 -11, NW) ఆ సందర్భంలో పౌలు స్త్రీల గురించి మాట్లాడుతున్నప్పటికీ, ఆ ప్రమాణం క్రైస్తవ పురుషులకు కూడా వర్తిస్తుంది.

2 యెహోవా ప్రజలుగా మనం, బట్టల్ని ఎంపిక చేసుకునే విషయంలో ఉన్నత ప్రమాణాలను పాటించడాన్ని ప్రాముఖ్యంగా ఎంచుతాం. మనం ఆరాధించే దేవుడు కూడా అలానే ఎంచుతాడు. (ఆది. 3:21) తన సేవకులు ఎలాంటి బట్టలు వేసుకోవాలనే విషయంలో ఈ విశ్వానికి సర్వాధిపతియైన యెహోవాకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయని బైబిలు స్పష్టంగా చెప్తోంది. కాబట్టి మనం వేసుకునే బట్టలు మనకు మాత్రమే కాదు, మరి ముఖ్యంగా మన సర్వాధిపతియైన యెహోవాకు నచ్చాలి.

3. బట్టల గురించి మోషే ధర్మశాస్త్రంలో ఉన్న నియమం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

3 ఇశ్రాయేలీయుల చుట్టుప్రక్కల జనాంగాల వాళ్లు నైతికంగా చాలా దిగజారిపోయిన జీవితాన్ని జీవించేవాళ్లు. ఇశ్రాయేలీయులు అలాంటి జీవితానికి అలవాటుపడకుండా మోషే ధర్మశాస్త్రంలోని నియమాలు వాళ్లను కాపాడాయి. మగవాళ్లో ఆడవాళ్లో తేడా తెలియనట్లుగా ఉండే బట్టల్ని యెహోవా అసహ్యించుకుంటున్నాడని ధర్మశాస్త్రం స్పష్టం చేసింది. మనకాలంలో కూడా అలాంటి ఫ్యాషన్‌ ఉంది. (ద్వితీయోపదేశకాండము 22:5 చదవండి.) అయితే, మగవాళ్లు ఆడవాళ్లలా, ఆడవాళ్లు మగవాళ్లలా కనిపించే బట్టల్నీ, అసలు ఆడవాళ్లో మగవాళ్లో కనిపెట్టడానికి కష్టంగా అనిపించే బట్టల్నీ యెహోవా ఇష్టపడడని ధర్మశాస్త్రం బట్టి మనకు అర్థమౌతోంది.

4. ఎలాంటి బట్టలు వేసుకోవాలో నిర్ణయించుకోవడానికి క్రైస్తవులకు ఏమి సహాయం చేయగలదు?

4 బట్టల్ని ఎంచుకునే విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి బైబిలు సూత్రాలు మనకు సహాయం చేస్తాయి. మనం ఏ దేశంలో ఉంటున్నా, ఎలాంటి వాతావరణంలో జీవిస్తున్నా, లేదా ఏ సంస్కృతికి చెందిన వాళ్లమైనా ఈ సూత్రాల్ని పాటించాలి. ఎలాంటి బట్టలు వేసుకోవాలో, ఎలాంటివి వేసుకోకూడదో చెప్పే ఓ పెద్ద చిట్టా మనకు ఉండాల్సిన అవసరం లేదు. కేవలం లేఖన సూత్రాల్ని పాటిస్తూ మనకు నచ్చిన బట్టలు వేసుకుంటే సరిపోతుంది. ఎలాంటి బట్టలు వేసుకోవాలో నిర్ణయించుకునేటప్పుడు “ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో” తెలుసుకోవడానికి సహాయం చేసే బైబిలు సూత్రాల్లో కొన్నింటిని ఇప్పుడు పరిశీలిద్దాం.—రోమా. 12:1, 2.

‘దేవుని పరిచారకులమై ఉండి మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాం’

5, 6. మన బట్టలు ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపించాలి?

5 అపొస్తలుడైన పౌలు 2 కొరింథీయులు 6:4, 8 వచనాల్లో ఓ ప్రాముఖ్యమైన సూత్రాన్ని చెప్పాడు. (చదవండి.) మనం కనిపించే తీరు ఇతరులకు మన గురించి చెప్పకనే చెప్తుంది. అంతేకాదు చాలామంది మనం కనిపించే తీరును బట్టే మన మీద ఓ అభిప్రాయం ఏర్పర్చుకుంటారు. (1 సమూ. 16:7) మనం దేవుని సేవకులం కాబట్టి కేవలం మనకు సౌకర్యవంతంగా అనిపించే బట్టలు లేదా మనకు నచ్చిన బట్టలు వేసుకుంటే సరిపోదు. బైబిలు సూత్రాల్ని మనసులో ఉంచుకుని బిగుతుగా ఉండే వాటిని, శరీరం కనిపించేలా, ఇతరుల్లో కోరికల్ని రెచ్చగొట్టేలా ఉండే వాటిని మనం వేసుకోకూడదు. మన బట్టలు ఇతరుల్ని ఇబ్బందిపెట్టేలా లేదా ఇతరులు మనల్ని తప్పుడు దృష్టితో చూసేలా ఉండకూడదు.

6 మనం శుభ్రంగా, చక్కగా తయారై, అణకువగా బట్టలు వేసుకున్నప్పుడు ప్రజలు మనల్ని సర్వోన్నతుడైన యెహోవా సేవకులుగా గౌరవిస్తారు. అంతేకాదు మనం ఆరాధించే దేవుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి వాళ్లలో మరింత కలుగుతుంది, మన సంస్థపై గౌరవం పెరుగుతుంది. దానితోపాటు ప్రాణాలు కాపాడే సందేశాన్ని మనం చెప్పినప్పుడు వినడానికి కూడా వాళ్లు మరింతగా ఇష్టపడతారు.

7, 8. మనం ముఖ్యంగా ఎలాంటి సందర్భాల్లో మర్యాదపూర్వకంగా కనిపించాలి?

7 యెహోవాకూ, మనం ప్రకటించే సందేశానికీ ఘనత తెచ్చేవిధంగా తయారవ్వడం మన బాధ్యత. అలా చేస్తే పరిశుద్ధుడైన యెహోవా దేవుని పట్ల, తోటి సహోదరసహోదరీల పట్ల, ప్రీచింగ్‌లో కలిసే ప్రజల పట్ల మనకు గౌరవముందని చూపిస్తాం. (రోమా. 13:8-10) ముఖ్యంగా మీటింగ్స్‌కు, ప్రీచింగ్‌కు వెళ్తున్నప్పుడు, ఎలాంటి బట్టలు వేసుకుంటున్నామనేది ప్రాముఖ్యం. దేవున్ని ఆరాధించే ప్రజలకు తగిన విధంగానే మనం తయారవ్వాలి. (1 తిమో. 2:10) నిజమే, ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన బట్టల్ని వేసుకుంటారు. అయితే మనం ఏ ప్రాంతంలో ఉంటున్నా, యెహోవాసాక్షులమైన మనం ఇతరుల్ని ఇబ్బందిపెట్టే బట్టల్ని వేసుకోకూడదు.

మీ బట్టల్ని బట్టి, మీరు ప్రాతినిధ్యం వహించే దేవున్ని ఇతరులు గౌరవిస్తారా? (7, 8 పేరాలు చూడండి)

8 1 కొరింథీయులు 10:31 చదవండి. మనం సమావేశాలకు వెళ్తున్నప్పుడు మర్యాదపూర్వకంగా, అణకువగా కనిపించే బట్టల్ని వేసుకోవాలి. అంతేగానీ లోకంలో సర్వసాధారణమైపోయిన ఫ్యాషన్‌ను అనుకరించకూడదు. సమావేశం మొదలవ్వడానికి ముందు లేదా అయిపోయాక, అలాగే హోటల్‌లో రూమ్‌ తీసుకోవడానికి వెళ్లినప్పుడు లేదా ఖాళీ చేసి వెళ్లిపోతున్నప్పుడు కూడా మనం మర్యాదపూర్వకంగా కనిపించాలి. ఇంట్లో వేసుకునేలాంటి బట్టల్ని వేసుకోకూడదు. ఆ విధంగా మనం యెహోవాసాక్షులుగా గుర్తించబడడానికి గర్వపడుతున్నామని చూపిస్తాం, ఏ సమయంలోనైనా సాక్ష్యమివ్వడానికి సిద్ధంగా ఉండగలుగుతాం.

9, 10. ఎలాంటి బట్టలు వేసుకోవాలో నిర్ణయించుకోవడానికి ఫిలిప్పీయులు 2:4 మనకెలా సహాయం చేస్తుంది?

9 ఫిలిప్పీయులు 2:4 చదవండి. మనం వేసుకునే బట్టల గురించి తోటి సహోదరసహోదరీలు ఏమనుకుంటున్నారో ఎందుకు ఆలోచించాలి? అందుకు ఒక కారణమేమిటంటే, దేవుని ప్రజలు ఈ సలహాను పాటించడానికి చాలా కష్టపడతారు: ‘భూమ్మీదున్న మీ అవయవాలను, అనగా జారత్వాన్ని, అపవిత్రతను, కామాతురతను చంపేయండి.’ (కొలొ. 3:2-3, 5) మన సహోదరసహోదరీల్లో కొంతమంది అనైతిక జీవితాన్ని విడిచిపెట్టి వచ్చారు. కానీ బహుశా తప్పుడు కోరికలను అధిగమించడానికి వాళ్లింకా పోరాడుతూ ఉండవచ్చు. ఒకవేళ మనం జాగ్రత్తగా లేకపోతే, మనం వేసుకునే బట్టల వల్ల బైబిలు ఇచ్చిన సలహాను పాటించడం, తప్పుడు కోరికలతో పోరాడడం వాళ్లకు మరింత కష్టమవ్వవచ్చు. (1 కొరిం. 6:9, 10) వాళ్లు చేస్తున్న పోరాటాన్ని మరింత కష్టతరం చేయాలని మనం కోరుకోం. మీరేమంటారు?

10 మనం తోటి సహోదరసహోదరీలతో ఉన్నప్పుడు మర్యాదపూర్వకంగా ఉండే బట్టలు వేసుకోవడం ద్వారా సంఘం పవిత్రతకు నిలయంగా ఉండేందుకు సహాయం చేస్తాం. కాబట్టి మీటింగ్‌ సమయంలోనైనా లేదా మామూలు సందర్భంలోనైనా మనం అలాంటి బట్టలే వేసుకోవాలి. ఎలాంటి బట్టలు వేసుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ మనకుంది. అదే సమయంలో, ఇతరులు దేవుని ఎదుట తమ ఆలోచనల్ని, మాటల్ని, ప్రవర్తనను పవిత్రంగా ఉంచుకునేందుకు సహాయం చేసే విధంగా తయారవ్వాల్సిన బాధ్యత కూడా మనకుంది. (1 పేతు. 1:14-16) నిజమైన ప్రేమ ‘మర్యాద లేకుండా ప్రవర్తించదు, స్వార్థం చూసుకోదు.’—1 కొరిం. 13:4, 5, NW.

సందర్భానికి, ప్రాంతానికి తగిన బట్టలు

11, 12. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రసంగి 3:1, 17 వచనాలు మనకెలా సహాయం చేస్తాయి?

11 దేవుని సేవకులు ఎలాంటి బట్టలు వేసుకోవాలో నిర్ణయించుకునేటప్పుడు, ‘ప్రతి ప్రయత్నానికి, ప్రతి క్రియకు తగిన సమయం’ ఉందని గుర్తుంచుకుంటారు. (ప్రసం. 3:1, 17) వాతావరణాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి మనం వేసుకునే బట్టలు మారవచ్చు. కానీ యెహోవా ప్రమాణాలు మాత్రం ఎప్పటికీ మారవు.—మలా. 3:6.

12 వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కూడా మర్యాదపూర్వకంగా, అణకువగా ఉండే బట్టలు వేసుకోవడం కష్టమే. అయితే మనం ఒళ్లు కనిపించేలా మరీ బిగుతుగా లేదా మరీ వదులుగా ఉండే బట్టల్ని వేసుకోనప్పుడు తోటి సహోదరసహోదరీలు సంతోషిస్తారు. (యోబు 31:1) బీచ్‌కు లేదా స్విమ్మింగ్‌ పూల్‌కు వెళ్లినప్పుడు వేసుకునే బట్టలు కూడా అణకువగా ఉండాలి. (సామె. 11:2, 20) చాలామంది స్విమ్మింగ్‌కు వెళ్లేటప్పుడు ఒళ్లు కనిపించే బట్టలు వేసుకున్నప్పటికీ మనం మాత్రం మన పరిశుద్ధ దేవుడైన యెహోవాకు ఘనత తీసుకొచ్చే బట్టల్ని ఎంచుకోవాలి.

13. ఎలాంటి బట్టలు వేసుకోవాలో నిర్ణయించుకునేటప్పుడు 1 కొరింథీయులు 10:32, 33 వచనాల్లో ఉన్న సలహాను ఎందుకు మనసులో ఉంచుకోవాలి?

13 సరైన బట్టల్ని ఎంచుకునేందుకు మరో ప్రాముఖ్యమైన సూత్రం కూడా మనకు సహాయం చేస్తుంది. అదేమిటంటే, ఇతరుల మనస్సాక్షిని నొప్పించకుండా మనం జాగ్రత్తపడాలి. (1 కొరింథీయులు 10:32, 33 చదవండి.) తోటి సహోదరసహోదరీలు, అలాగే యెహోవాను ఆరాధించని ప్రజలు అభ్యంతరపడే లాంటి బట్టలు వేసుకోకుండా ఉండడం మన బాధ్యత. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు, ‘తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దానియందు అతనిని సంతోషపర్చాలి.’ అందుకు కారణమేమిటంటే, ‘క్రీస్తుకూడ తన్ను తాను సంతోషపర్చుకోలేదు.’ (రోమా. 15:2, 3) యేసులాగే, మన ఇష్టాల కన్నా దేవుని చిత్తం చేయడం, ఇతరులకు సహాయం చేయడమే మనకు ముఖ్యమై ఉండాలి. కాబట్టి ఏవైనా బట్టలు మనకు నచ్చినప్పటికీ, వాటివల్ల ప్రజలు మనం చెప్పే సువార్తను వినడానికి ఇష్టపడరనిపిస్తే వాటిని ఎంపిక చేసుకోం.

14. దేవునికి మహిమ తీసుకొచ్చే బట్టల్ని ఎంచుకునేలా పిల్లలకు తల్లిదండ్రులు ఎలా శిక్షణనివ్వవచ్చు?

14 బైబిలు సూత్రాల ప్రకారం నడుచుకునేలా పిల్లలకు బోధించాల్సిన బాధ్యత క్రైస్తవ తల్లిదండ్రులకు ఉంది. అందులో భాగంగా తల్లిదండ్రులూ, పిల్లలూ వేసుకునే బట్టలు, కనిపించే తీరు మర్యాదపూర్వకంగా ఉండాలి, అలా ఉంటే వాళ్లు యెహోవాను సంతోషపెట్టినవాళ్లౌతారు. (సామె. 22:6; 27:11) మన పరిశుద్ధ దేవున్ని, ఆయన ప్రమాణాలను గౌరవించే విధంగా పిల్లలకు తల్లిదండ్రులు ఎలా శిక్షణనివ్వవచ్చు? ముందుగా వాళ్లు పిల్లలకు మంచి ఆదర్శాన్ని ఉంచాలి. అంతేకాదు సరైన బట్టలు ఎక్కడ దొరుకుతాయో, వాటిని ఎలా ఎంపిక చేసుకోవాలో ప్రేమగా వాళ్లకు నేర్పించాలి. పిల్లలు కేవలం వాళ్లకు నచ్చే వాటిని కాదుగానీ వాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న యెహోవాకు ఘనత తీసుకొచ్చే బట్టల్ని ఎంచుకోవడం చాలా ప్రాముఖ్యం.

మీ స్వేచ్ఛను జ్ఞానయుక్తంగా ఉపయోగించండి

15. జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది?

15 యెహోవాకు ఘనత తీసుకొచ్చేలా తెలివైన నిర్ణయాలు తీసుకునేందుకు బైబిలు మనకు ఎంతో సహాయం చేస్తుంది. అయినప్పటికీ మనం వేసుకునే బట్టలు మన సొంత ఇష్టాలకు తగినట్లుగా ఉంటాయి. అయితే మనలో ఒక్కొక్కరికీ ఒక్కోలాంటి బట్టలు నచ్చుతాయి, ఆర్థిక స్తోమత కూడా ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. ఏదేమైనా మన బట్టలు ఎప్పుడూ శుభ్రంగా, అణకువగా, సందర్భానికి తగినట్లుగా, స్థానిక సంస్కృతికి సరిపోయేలా ఉండాలి.

16. మర్యాదపూర్వకంగా కనిపించేందుకు మనం చేసే కృషి ఎందుకు విలువైనది?

16 అణకువగా, మర్యాదపూర్వకంగా ఉండే బట్టల్ని ఎంచుకోవడం అన్ని సమయాల్లో అంత తేలిక కాదు. చాలా షాపుల్లో ప్రజలు ఎక్కువగా వాడే ఫ్యాషన్‌ బట్టల్ని మాత్రమే అమ్ముతారు. కాబట్టి అణకువగా ఉండే స్కర్టులను, డ్రస్సులను, జాకెట్లను అదేవిధంగా బిగుతుగా లేని షర్టులను, ప్యాంట్లను కొనుక్కోవడానికి చాలా సమయం, కృషి అవసరమౌతాయి. కానీ అందంగా, మర్యాదపూర్వకంగా ఉండే బట్టల్ని వేసుకోవడానికి మనం చేసే కృషిని తోటి సహోదరసహోదరీలు గుర్తిస్తారు, మెచ్చుకుంటారు. అంతేకాదు ప్రేమగల మన పరలోక తండ్రికి మహిమ తీసుకొచ్చినప్పుడు కలిగే సంతృప్తి, మనం పడిన ఇబ్బందులన్నిటినీ మర్చిపోయేలా చేస్తుంది.

17. ఓ సహోదరుడు గడ్డం పెంచుకోవాలో వద్దో దేన్నిబట్టి నిర్ణయించుకోవచ్చు?

17 సహోదరులు గడ్డం పెంచుకోవచ్చా? మోషే ధర్మశాస్త్రం ప్రకారం మగవాళ్లు గడ్డం పెంచుకోవాలి. అయితే క్రైస్తవులు ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం కింద లేరు కాబట్టి వాళ్లు ఆ నియమాన్ని పాటించాల్సిన అవసరం లేదు. (లేవీ. 19:27; 21:5; గల. 3:24, 25) కొన్ని సంస్కృతుల్లో, గడ్డం ట్రిమ్‌ చేసుకోవడం ఆనవాయితీ. ప్రజలు అలాంటివాళ్లను గౌరవిస్తారు, రాజ్యసువార్తను వినడానికి కూడా అభ్యంతరపడరు. నిజానికి అలాంటి సంస్కృతుల్లో, సంఘంలో బాధ్యతలు నిర్వహిస్తున్న కొంతమంది సహోదరులు గడ్డం పెంచుకుంటారు. అయినప్పటికీ కొంతమంది సహోదరులు పూర్తిగా తీసేసుకోవాలని నిర్ణయించుకోవచ్చు. (1 కొరిం. 8:9, 13; 10:32) మిగతా సంస్కృతుల్లో లేదా ప్రాంతాల్లో గడ్డం పెంచుకోవడం ఆనవాయితీగా ఉండదు, యెహోవాసాక్షులకు కూడా అది మర్యాదపూర్వకంగా ఉండదు. ఒకవేళ ఓ సహోదరుడు గడ్డం పెంచుకుంటే దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా, ‘నిందారహితునిగా’ ఉండలేకపోవచ్చు.—1 తిమో. 3:2-3, 7; రోమా. 15:1-3.

18, 19. మీకా 6:8 మనకెలా సహాయం చేస్తుంది?

18 ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలా తయారవ్వాలి వంటి విషయాలకు సంబంధించి పెద్ద చిట్టా ఇవ్వనందుకు యెహోవాకు మనమెంతో కృతజ్ఞులం. బైబిలు సూత్రాల ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఆయన మనకు ఇచ్చాడు. కాబట్టి బట్టలు, కనిపించే తీరు విషయంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దేవున్ని సేవిస్తూ అణకువగా ఉండాలని కోరుకుంటున్నట్లు చూపిస్తాం.—మీకా 6:8.

19 యెహోవా దేవుడు పవిత్రుడని, పరిశుద్ధుడని, ఆయన ప్రమాణాలు చక్కగా ఉపయోగపడతాయని మనం అణకువగా గుర్తిస్తాం. మనం అణకువగా, వినయంగా ఉండాలనుకుంటే ఆయన ఇచ్చిన ప్రమాణాల్ని పాటిస్తాం. అంతేకాదు అణకువ ఉంటే ఇతరుల భావాల్ని, అభిప్రాయాల్ని గౌరవిస్తాం.

20. మన బట్టలు, కనిపించే తీరు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపించాలి?

20 మనం యెహోవా దేవుని సేవకులమని మనం వేసుకునే బట్టలు స్పష్టంగా తెలియజేయాలి. యెహోవా ప్రమాణాలు ఉన్నతమైనవి, మనం వాటిని సంతోషంగా పాటిస్తాం. మన సహోదరసహోదరీల చక్కని ప్రవర్తన, కనిపించే తీరునుబట్టి మనం వాళ్లను మెచ్చుకుంటాం. వాళ్లు వినయంగల ప్రజల్ని, ప్రాణాలు కాపాడే బైబిలు సందేశం వైపు నడిపిస్తున్నారు. అంతేకాదు యెహోవాకు మహిమ, ఆనందం తీసుకొస్తున్నారు. మనం బట్టల్ని ఎంపిక చేసుకునే విషయంలో జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ‘మహాత్మ్యమును ప్రభావాన్ని ధరించిన’ యెహోవాకు మహిమ తీసుకొస్తూ ఉంటాం.—కీర్త. 104:1, 2.