కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వేరే దేశంలో సేవ చేస్తున్నప్పుడు యెహోవాతో మీ సంబంధాన్ని కాపాడుకోండి

వేరే దేశంలో సేవ చేస్తున్నప్పుడు యెహోవాతో మీ సంబంధాన్ని కాపాడుకోండి

“నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను.”కీర్త. 119:11.

పాటలు: 142, 47

1-3. (ఎ) మనం ఎల్లప్పుడూ దేనికి మొదటిస్థానం ఇవ్వాలి? (బి) కొత్త భాష నేర్చుకునే వాళ్లకు ఎలాంటి సవాళ్లు ఎదురౌతాయి? అవి ఏ ప్రశ్నలకు దారితీస్తాయి? (ప్రారంభ చిత్రం చూడండి.)

 ‘ప్రతీ దేశానికి, తెగకు, భాషకు, జాతికి చెందిన ప్రజలకు’ మంచివార్త ప్రకటించాలనే ప్రవచనాన్ని నెరవేర్చడంలో చాలామంది యెహోవాసాక్షులు బిజీగా ఉన్నారు. (ప్రక. 14:6, NW) మీరూ వేరే భాష నేర్చుకుంటున్నారా? కొంతమంది మిషనరీలుగా సేవచేస్తున్నారు లేదా అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో ప్రకటించడానికి వేరే దేశం వెళ్తున్నారు. మరికొంతమంది తమ దేశంలోనే వేరే భాషా సంఘంలో జరిగే మీటింగ్స్‌కి వెళ్లడం మొదలుపెట్టారు.

2 దేవుని సేవకులందరూ యెహోవాతో తమకు, తమ కుటుంబానికి ఉన్న సంబంధాన్ని కాపాడుకోవడానికి మొదటిస్థానం ఇవ్వాలి. (మత్త. 5:6) కొన్నిసార్లు, ప్రయోజనం పొందే విధంగా వ్యక్తిగత అధ్యయనం చేసుకునే తీరిక మనకు ఉండకపోవచ్చు. అయితే వేరే భాషా సంఘాలతో సహవసించేవాళ్లకు ఇలాంటి వాటితోపాటు మరికొన్ని సవాళ్లు ఉంటాయి.

3 వేరే భాషా సంఘాల్లో సేవచేసేవాళ్లు కొత్త భాష నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు వాళ్లు దేవుని గురించిన లోతైన విషయాలు క్రమంగా అధ్యయనం చేసేందుకు సమయం కేటాయించాలి. (1 కొరిం. 2:10) కానీ సంఘకూటాల్లో చెప్పే విషయాలు వాళ్లకు పూర్తిగా అర్థంకానప్పుడు, లోతైన విషయాలు ఎలా తెలుసుకోగలుగుతారు? వేరే భాషా సంఘాల్లో సేవచేస్తున్న క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లల హృదయాల్లో సత్యం నాటేందుకు ఎందుకు ప్రయత్నించాలి?

యెహోవాతో మనకున్న సంబంధానికి ఎదురయ్యే ఒక ప్రమాదం

4. యెహోవాతో మనకున్న సంబంధం దేనివల్ల ప్రమాదంలో పడవచ్చు? ఓ ఉదాహరణ చెప్పండి.

4 వేరే భాషలో చెప్పే బైబిలు బోధలు మనకు అర్థంకానప్పుడు, యెహోవాతో మనకున్న సంబంధం ప్రమాదంలో పడవచ్చు. నెహెమ్యా యెరూషలేముకు తిరిగివచ్చినప్పుడు, అక్కడున్న పిల్లల్లో కొంతమందికి హీబ్రూ భాష రాకపోవడం అతను గమనించాడు. (నెహెమ్యా 13:23, 24 చదవండి.) ఆ భాష తెలియకపోవడం వల్ల ఆ పిల్లలు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి యెహోవాతో అలాగే ఆయన ఎంచుకున్న జనాంగంతో వాళ్లకున్న సంబంధం బలహీనపడింది.—నెహె. 8:2, 8.

5, 6. వేరే భాషా సంఘంలో సేవచేసే తల్లిదండ్రులు ఏమి గుర్తించారు? ఆ సమస్యకు కారణం ఏమిటి?

5 తమ పిల్లలకు యెహోవాతో ఉన్న సంబంధం బలహీనపడిందని వేరే భాషా సంఘంలో సేవచేస్తున్న కొంతమంది తల్లిదండ్రులు గుర్తించారు. ఎందుకంటే మీటింగ్స్‌లో చెప్పే విషయాలు పిల్లలకు పూర్తిగా అర్థం కాకపోవడంవల్ల ఆ విషయాలు వాళ్ల హృదయాలకు చేరట్లేదు. కుటుంబాన్ని తీసుకుని దక్షిణ అమెరికా నుండి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయిన పీటర్‌ [1] అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు, “ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతున్నప్పుడు హృదయం, భావోద్వేగాలు కీలకపాత్ర పోషించాలి.”—లూకా 24:32.

6 మనం సమాచారాన్ని వేరే భాషలో చదివినప్పుడు ఆ సమాచారం మన హృదయానికి చేరకపోవచ్చు. కానీ మాతృభాషలో చదివినప్పుడు ఆ సమాచారం మన హృదయానికి చేరుతుంది. అంతేకాదు వేరే భాషలో సంభాషించడం మనకు కష్టంగా ఉన్నప్పుడు, మానసికంగా ఎంత అలసిపోతామంటే దానివల్ల యెహోవాను సరిగ్గా ఆరాధించలేకపోతాం. కాబట్టి వేరే భాషా సంఘంలో సేవచేయాలనే మన కోరికను బలంగా ఉంచుకుంటూనే యెహోవాతో మనకున్న సంబంధాన్ని కూడా కాపాడుకోవాలి.—మత్త. 4:4.

వాళ్లు యెహోవాతో ఉన్న సంబంధాన్ని కాపాడుకున్నారు

7. తమ సంస్కృతిని, మతాన్ని స్వీకరించమని బబులోనీయులు దానియేలును ఎలా ఒత్తిడి చేశారు?

7 దానియేలు, అతని స్నేహితులు బబులోను చెరలో ఉన్నప్పుడు, తమ సంస్కృతిని, మతాన్ని స్వీకరించమని బబులోనీయులు వాళ్లను ఒత్తిడి చేశారు. ఎలా? వాళ్లు దానియేలుకు, అతని స్నేహితులకు ‘కల్దీయుల భాషను’ నేర్పించి, బబులోనీయుల పేర్లు పెట్టారు. (దాని. 1:3-7) వాళ్లు దానియేలుకు పెట్టిన కొత్త పేరు బబులోనులో ముఖ్య దేవుడైన బేలును సూచించింది. దీన్నిబట్టి దానియేలు ఆరాధించే దేవుని కన్నా బబులోను దేవుడే శక్తిమంతుడని దానియేలు నమ్మాలని రాజైన నెబుకద్నెజరు కోరుకొనివుంటాడని చెప్పవచ్చు.—దాని. 4:8.

8. యెహోవాతో తనకున్న సంబంధాన్ని దానియేలు ఎలా బలంగా ఉంచుకున్నాడు?

8 రాజు తినే ఆహారాన్ని తినమని దానియేలుకు చెప్పినప్పుడు, అతను దేవుని ఆజ్ఞకు లోబడాలని తన హృదయంలో నిశ్చయించుకున్నాడు. (దాని. 1:8) దానియేలు హీబ్రూ భాషలో ఉన్న పవిత్ర ‘గ్రంథములు’ చదువుతూ ఉండడంవల్ల, వేరే దేశంలో ఉన్నప్పటికీ యెహోవాతో తనకున్న సంబంధాన్ని బలంగా ఉంచుకోగలిగాడు. (దాని. 9:2) నిజానికి అతను బబులోనుకు వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కూడా దానియేలు అనే తన హీబ్రూ పేరుతోనే గుర్తించబడ్డాడు.—దాని. 5:13.

9. 119వ కీర్తన రాసిన వ్యక్తి మీద దేవుని వాక్యం ఎలా పనిచేసింది?

9 రాజభవనంలోని సభ్యులు 119వ కీర్తన రాసిన వ్యక్తికి విరుద్ధంగా మాట్లాడినప్పుడు అతను వాటిని సహించాల్సి వచ్చింది. అయితే దానికి కావాల్సిన బలాన్ని అతను దేవుని వాక్యం నుండి పొందాడు, అందుకే అతను ఇతరులకు భిన్నంగా ఉండగలిగాడు. (కీర్త. 119:23, 61) అంతేకాదు దేవుని వాక్యం తన హృదయాన్ని చేరేందుకు అతను అనుమతించాడు.—కీర్తన 119:11, 46 చదవండి.

యెహోవాతో మీకున్న సంబంధాన్ని బలంగా ఉంచుకోండి

10, 11. (ఎ) బైబిల్ని చదువుతున్నప్పుడు మన లక్ష్యం ఏమైవుండాలి? (బి) ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవచ్చు? ఓ ఉదాహరణ చెప్పండి.

10 సంఘానికి, ఉద్యోగానికి సంబంధించిన బాధ్యతలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగత అధ్యయనం, కుటుంబ ఆరాధన కోసం మనందరం సమయం కేటాయించాలి. (ఎఫె. 5:15, 16) బైబిల్లో, మన ప్రచురణల్లో ఇన్ని పేజీలు పూర్తి చేయాలని చదవడమో లేదా కేవలం మీటింగ్స్‌లో చెప్పే కామెంట్లు సిద్ధపడడమో మన లక్ష్యం కాకూడదు. దేవుని వాక్యం మన హృదయానికి చేరి, మన విశ్వాసాన్ని బలపర్చాలనేదే మన లక్ష్యంగా ఉండాలి.

11 మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనకు సమతుల్యత ఉండాలి. మనం ఏదైనా చదువుతున్నప్పుడు ఇతరుల ఆధ్యాత్మిక అవసరాల గురించే కాదుగానీ మన సొంత ఆధ్యాత్మిక అవసరాల గురించి కూడా ఆలోచించాలి. (ఫిలి. 1:9-11) మనం పరిచర్య కోసం, మీటింగ్స్‌ కోసం లేదా ప్రసంగాల కోసం సిద్ధపడుతున్నప్పుడు మనం చదివే వాటినుండి మనమేమి నేర్చుకోవాలో ఆలోచించకపోవచ్చు. ఉదాహరణకు, ఓ వంటవాడు తాను చేసిన వంటల్ని ఇతరులకు వడ్డించే ముందు కాస్త రుచిచూస్తాడు. అంతమాత్రాన అతను వాటిమీదే బ్రతకలేడు. అతను ఆరోగ్యంగా ఉండాలంటే తనకోసం ప్రతీరోజు ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండుకోవాలి. అలాగే మనం కూడా యెహోవాతో మనకున్న సంబంధాన్ని బలపర్చుకోవాలంటే బైబిల్ని క్రమంగా అధ్యయనం చేయాలి. అలా లోతుగా చదివినప్పుడు మన సొంత ఆధ్యాత్మిక అవసరాలు తీరతాయి.

12, 13. బైబిల్ని మాతృభాషలో చదవడం సహాయకరంగా ఉంటుందని చాలామంది ఎందుకు భావిస్తున్నారు?

12 వేరే భాషా సంఘాల్లో సేవచేసే చాలామంది, బైబిల్ని క్రమంగా తమ ‘మాతృభాషలో’ చదవడం సహాయకరంగా ఉంటుందని భావిస్తారు. (అపొ. 2:8, NW) మిషనరీలు కూడా వేరే దేశంలో తమ నియామకాన్ని పట్టుదలగా కొనసాగించడానికి కేవలం మీటింగ్స్‌లో వినే వాటిమీదే ఆధారపడ కూడదని వాళ్లకు తెలుసు.

13 ఎనిమిదేళ్లుగా పర్షియన్‌ భాష నేర్చుకుంటున్న ఆలన్‌ అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు, “నేను పర్షియన్‌ భాషలో మీటింగ్స్‌కి సిద్ధపడుతున్నప్పుడు కేవలం భాష మీదే మనసుపెట్టే వాడిని. అది నా మెదడుకు ఓ సాధనలా ఉండేదిగానీ నేను చదివే విషయాలు నా హృదయానికి చేరేవి కావు. అందుకే బైబిల్ని, ఇతర ప్రచురణల్ని నా మాతృభాషలో చదవడానికి క్రమంగా కొంత సమయాన్ని వెచ్చిస్తాను.”

మీ పిల్లల హృదయాన్ని తెలుసుకోండి

14. తల్లిదండ్రులు ఏమి చేయాలి? ఎందుకు?

14 తమ పిల్లల హృదయాల్లోకి, మనసుల్లోకి సత్యం చేరుకునేలా సహాయం చేయడానికి క్రైస్తవ తల్లిదండ్రులు చేయగలిగినదంతా చేయాలి. సెర్జ్‌, అతని భార్య మ్యురీయల్‌ అనుభవాన్ని పరిశీలించండి. వాళ్లు మూడు కన్నా ఎక్కువ సంవత్సరాలు వేరే భాషా సంఘంలో సేవచేశారు. అయితే వాళ్ల 17 ఏళ్ల అబ్బాయి పరిచర్యను, మీటింగ్స్‌ని ఆస్వాదించలేకపోతున్నాడని వాళ్లు గమనించారు. “వేరే భాషా ప్రాంతంలో ప్రీచింగ్‌ చేయాలంటే వాడికి ఇష్టం ఉండేది కాదు. కానీ ఇంతకుముందు తన సొంత భాష అయిన ఫ్రెంచ్‌లో చాలా ఉత్సాహంగా ప్రీచింగ్‌ చేసేవాడు” అని మ్యురీయల్‌ చెప్తుంది. “వేరే భాష అర్థంకాకపోవడం వల్ల మా అబ్బాయి ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించలేకపోతున్నాడని మేము గమనించినప్పుడు మా పాత సంఘానికి తిరిగి వెళ్లిపోవాలని మేము నిర్ణయించుకున్నాం” అని సెర్జ్‌ చెప్తున్నాడు.

సత్యం మీ పిల్లల హృదయాలకు చేరేలా సహాయం చేయండి (14, 15 పేరాలు చూడండి)

15. (ఎ) తమ సంఘానికి తిరిగి వెళ్లిపోవాలో వద్దో నిర్ణయించుకోవడానికి తల్లిదండ్రులకు ఏది సహాయం చేస్తుంది? (బి) ద్వితీయోపదేశకాండము 6:5-7 వచనాలు తల్లిదండ్రులకు ఏ నిర్దేశాన్ని ఇస్తున్నాయి?

15 తమ పిల్లలకు బాగా అర్థమయ్యే భాషలో మీటింగ్స్‌ జరిగే సంఘానికి వెళ్లాలో వద్దో నిర్ణయించుకోవడానికి తల్లిదండ్రులకు ఏది సహాయం చేస్తుంది? మొదటిగా, తమ పిల్లలకు యెహోవా గురించి బోధిస్తూనే వేరే భాషను కూడా నేర్పించేంత సమయం, ఓపిక తల్లిదండ్రులకు ఉందో లేదో ఆలోచించుకోవాలి. రెండవదిగా, తమ పిల్లలు వేరే భాషలో ప్రీచింగ్‌ చేయడాన్ని, మీటింగ్స్‌కి వెళ్లడాన్ని లేదా వేరే భాషా క్షేత్రంలో సేవచేయడాన్ని ఇష్టపడట్లేదని తల్లిదండ్రులు గుర్తించవచ్చు. ఈ కారణాల్నిబట్టి తమ పిల్లలకు బాగా అర్థమయ్యే భాషా సంఘానికి తిరిగి వెళ్లిపోవాలని తల్లిదండ్రులు నిర్ణయించుకోవచ్చు. పిల్లలు యెహోవాతో బలమైన సంబంధాన్ని ఏర్పర్చుకున్న తర్వాత మళ్లీ వేరే భాషా సంఘానికి వెళ్లాలని తల్లిదండ్రులు నిర్ణయించుకోవచ్చు.—ద్వితీయోపదేశకాండము 6:5-7 చదవండి.

16, 17. తమ పిల్లలకు యెహోవా గురించి బోధించడానికి కొంతమంది తల్లిదండ్రులకు ఏది సహాయం చేసింది?

16 మరికొంతమంది తల్లిదండ్రులు వేరే భాషా సంఘంతో లేదా గుంపుతో సహవసిస్తూనే తమ పిల్లలకు మాతృభాషలో యెహోవా గురించి నేర్పించడానికి కొన్ని మార్గాల్ని గుర్తించారు. ఛార్లెస్‌ అనే సహోదరునికి 9 నుండి 13 ఏళ్ల మధ్య వయసు ఉన్న ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వాళ్లందరూ లింగాలా భాష మాట్లాడే గుంపుతో సహవసిస్తున్నారు. అతనిలా చెప్తున్నాడు, “కుటుంబంగా మేము చేసుకునే అధ్యయనాలు, కుటుంబ ఆరాధన మా మాతృభాషలో చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అయితే మేము లింగాలా భాషలో కూడా పరిచర్య ఎలా చేయాలో, కామెంట్స్‌ ఎలా చెప్పాలో ప్రాక్టీస్‌ చేస్తుంటాం, లింగాలా భాషలో కొన్ని ఆటలు ఆడుకుంటాం. అలా పిల్లలు లింగాలా భాషను సరదాగా నేర్చుకుంటారు.”

స్థానిక భాషను నేర్చుకుని, మీటింగ్స్‌లో పాల్గొనడానికి కృషిచేయండి (16, 17 పేరాలు చూడండి)

17 కెవిన్‌ అనే సహోదరునికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒకరికి ఐదేళ్లు మరొకరికి ఎనిమిదేళ్లు. అతను తన ఇద్దరు కూతుళ్లకు సత్యాన్ని బోధించడానికి ఎంతో కృషిచేస్తాడు. ఎందుకంటే వేరే భాషా సంఘంలో హాజరయ్యే మీటింగ్స్‌ని పిల్లలిద్దరూ ఇంకా పూర్తిగా అర్థంచేసుకోలేకపోతున్నారు. అతనిలా చెప్తున్నాడు, “నేనూ, నా భార్య పిల్లలతో కలిసి వ్యక్తిగత అధ్యయనం మా మాతృభాష ఫ్రెంచ్‌లో చేస్తాం. అంతేకాదు మేము నెలలో ఒక్కసారి ఫ్రెంచ్‌లో జరిగే మీటింగ్స్‌కి వెళ్లాలనే లక్ష్యం పెట్టుకున్నాం. అలాగే సెలవు రోజుల్ని మా మాతృభాషలో జరిగే సమావేశాలకు హాజరవ్వడానికి ఉపయోగించుకుంటాం.”

18. (ఎ) మీ పిల్లలకు సహాయం చేసేందుకు సరైన నిర్ణయం తీసుకునేలా రోమీయులు 15:1, 2 వచనాలు మీకెలా ఉపయోగపడతాయి? (బి) కొంతమంది తల్లిదండ్రులు ఏ సలహాలు ఇచ్చారు? (అధస్సూచి చూడండి.)

18 తమ పిల్లలకు అలాగే యెహోవాతో తమకున్న సంబంధానికి ఏది మంచిదో ప్రతీ కుటుంబం సొంతగా నిర్ణయించుకోవాలి. [2] (గల. 6:5) తనకూ, తన భర్తకూ వేరే భాషా సంఘంలో సేవచేయాలనే బలమైన కోరిక ఉన్నప్పటికీ, తమ అబ్బాయికి యెహోవా మీదున్న ప్రేమ బలపడాలనే ఉద్దేశంతో వాళ్లు తిరిగి తమ మాతృభాషా సంఘానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని మ్యురీయల్‌ అనే సహోదరి చెప్తుంది. (రోమీయులు 15:1, 2 చదవండి.) తమ నిర్ణయం సరైనదేనని సెర్జ్‌కు ఇప్పుడు అర్థమౌతోంది. అతనిలా చెప్తున్నాడు, “మేము ఫ్రెంచ్‌ భాషా సంఘానికి తిరిగి వచ్చినప్పటినుండి మా అబ్బాయి ఆధ్యాత్మికంగా ఎదిగి, బాప్తిస్మం తీసుకున్నాడు. వాడు ఇప్పుడు క్రమ పయినీరుగా సేవచేస్తున్నాడు. అంతేకాదు వాడు వేరే భాషా గుంపుకు మళ్లీ వెళ్లాలని ఆలోచిస్తున్నాడు.”

దేవుని వాక్యం మీ హృదయాన్ని చేరనివ్వండి

19, 20. దేవుని వాక్యం మీద మనకున్న ప్రేమను ఎలా చూపించవచ్చు?

19 యెహోవా అందర్నీ ప్రేమిస్తాడు. అందుకే ఆయన ‘అన్నిరకాల ప్రజలు సత్యం గురించిన సరైన జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు’ వీలుగా బైబిల్ని వందల భాషల్లో అందుబాటులో ఉండేలా చూశాడు. (1 తిమో. 2:4, NW) మనకు బాగా అర్థమయ్యే భాషలో బైబిల్ని చదివితే ఆయనతో మనకున్న సంబంధం మరింత బలపడుతుందని ఆయనకు తెలుసు.

20 యెహోవాతో మనకున్న సంబంధం బలంగా ఉండేలా చూసుకోవడానికి మనందరం కష్టపడాలి. దానికోసం మనకు బాగా అర్థమయ్యే భాషలో బైబిల్ని క్రమంగా చదవాలి. అప్పుడు యెహోవాతో ఉన్న సంబంధాన్ని కాపాడుకోవడానికి మన కుటుంబంలోని వాళ్లకు కూడా సహాయం చేయగలుగుతాం. మనం దేవుని వాక్యాన్ని నిజంగా ప్రేమిస్తున్నామని చూపించగలుగుతాం.—కీర్త. 119:11.

^ [1] (5వ పేరా) అసలు పేర్లు కావు.

^ [2] (18వ పేరా) మీ కుటుంబానికి సహాయం చేయగల బైబిలు సూత్రాల కోసం 2002, అక్టోబరు 15 కావలికోట సంచికలోని “విదేశాల్లో పిల్లలను పెంచడంలో సవాళ్లు, ప్రతిఫలాలు” అనే ఆర్టికల్‌ చూడండి.