కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు తెలివిని కాపాడుకుంటున్నారా?

మీరు తెలివిని కాపాడుకుంటున్నారా?

ఒక కథ ప్రకారం, ఓ మారుమూల పల్లెటూర్లో ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. ఆ పిల్లవాడు తెలివితక్కువ వాడనుకొని ఆ ఊరిలోవాళ్లు అతన్ని ఎగతాళి చేసేవాళ్లు. పల్లెటూరుని చూడడానికి ఎవరైనా వచ్చినప్పుడు ఆ ఊరిలోని కొంతమంది తమ స్నేహితుల ముందు ఆ పిల్లవాడిని ఆటపట్టించేవాళ్లు. వాళ్లు, ఒక చేతిలో పెద్ద వెండి నాణాన్ని, మరో చేతిలో వెండి నాణెం కన్నా రెండింతలు విలువైన చిన్న బంగారు నాణాన్ని పట్టుకొనేవాళ్లు. వాటిని ఆ పిల్లవాడికి చూపించి, “నీకు ఏది కావాలో తీసుకో” అని అనేవాళ్లు. ఆ పిల్లవాడు వెండి నాణాన్ని తీసుకొని పరిగెత్తుకుని వెళ్లిపోయేవాడు.

ఊరును చూడడానికి వచ్చిన ఓ వ్యక్తి ఆ పిల్లవాడిని ఇలా అడిగాడు, “వెండి నాణెం కన్నా బంగారు నాణెం రెండింతలు విలువైనదని నీకు తెలీదా?” అందుకు ఆ పిల్లవాడు నవ్వి, “నాకు తెలుసు” అని అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, “మరి నువ్వు వెండి నాణాన్ని ఎందుకు తీసుకుంటున్నావు? బంగారు నాణాన్ని తీసుకుంటే, రెండింతలు డబ్బు వస్తుంది” అని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లవాడు, “కానీ నేను ఒకవేళ బంగారు నాణాన్ని తీసుకుంటే, ప్రజలు నాతో ఆడడం మానేస్తారు. ఇప్పుడు నా దగ్గర ఎన్ని వెండి నాణాలు ఉన్నాయో మీకు తెలుసా?” అని అన్నాడు. ఈ కథలోని పిల్లవాడు, పెద్దవాళ్లు ప్రయోజనం పొందగల ఒక లక్షణాన్ని చూపించాడు. అదే తెలివి అనే లక్షణం.

బైబిలు ఇలా చెప్తుంది, “లెస్సయైన జ్ఞానమును [తెలివిని, NW] వివేచనను భద్రము చేసికొనుము. . . . అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు.” (సామె. 3:21, 23) నిజానికి తెలివి అంటే ఏమిటో, దాన్నెలా ఉపయోగించాలో నేర్చుకుంటే అది మనకు భద్రతనిస్తుంది. ఆధ్యాత్మికంగా పడిపోకుండా, మన ‘పాదాన్ని’ నిలకడగా ఉంచుతుంది.

తెలివి అంటే ఏమిటి?

జ్ఞానం, అవగాహన, తెలివి ఈ మూడింటి మధ్య తేడా ఉంది. జ్ఞానం ఉన్న వ్యక్తి సమాచారాన్ని లేదా వాస్తవాలను సేకరిస్తాడు. అవగాహన ఉన్న వ్యక్తి వాస్తవాలు ఒకదానికొకటి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చూస్తాడు. తెలివి ఉన్న వ్యక్తి జ్ఞానాన్ని, అవగాహనను జత చేసి వాటిని తన పనిలో ఉపయోగించుకుంటాడు.

ఉదాహరణకు, ఒక వ్యక్తికి తక్కువ సమయంలోనే బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకాన్ని చదివి, దాన్ని అర్థంచేసుకునే సామర్థ్యం ఉండవచ్చు. అతను స్టడీ తీసుకుంటున్న సమయంలో సరైన జవాబులు చెప్పవచ్చు, మీటింగ్స్‌కి రావచ్చు, మంచి వ్యాఖ్యానాలు కూడా చెప్పవచ్చు. ఇవన్నీ, అతను ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తున్నాడని చూపించవచ్చు. కానీ దానర్థం అతను తెలివిని సంపాదించుకున్నాడని కాదు. ఎందుకంటే, బహుశా అతనికి విషయాలను త్వరగా నేర్చుకునే సామర్థ్యం ఉండవచ్చు. అయితే తన జ్ఞానాన్ని, అవగాహనను సరైన విధంగా ఉపయోగిస్తూ సత్యం ప్రకారం ప్రవర్తించినప్పుడు, అతను తెలివిని సంపాదించుకుంటున్నట్లు అవుతుంది. ముందుచూపుతో ఆలోచించి తీసుకున్న నిర్ణయాలకు మంచి ఫలితాలు వస్తే, అతను తెలివిని చూపించాడని అది స్పష్టంగా తెలియజేస్తుంది.

మత్తయి 7:24-27 వచనాల్లో, ఇల్లు కట్టుకున్న ఇద్దరు వ్యక్తుల గురించి యేసు ఓ ఉపమానం చెప్పాడు. వాళ్లలో ఒక వ్యక్తి ‘బుద్ధిమంతునిలా’ ప్రవర్తించాడని ఆ ఉపమానం వివరిస్తుంది. ఎందుకంటే జరగబోయే దాన్ని ముందుగానే ఆలోచించి, తన ఇల్లును బండ మీద కట్టుకున్నాడు. అతనికి ముందుచూపు, తెలివి ఉన్నాయని అది చూపిస్తుంది. ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే తక్కువ ఖర్చుతో, పని త్వరగా అయిపోతుందని అతను అనుకోలేదు. బదులుగా తాను చేసే పనివల్ల భవిష్యత్తులో వచ్చే పర్యవసానాల గురించి తెలివిగా ఆలోచించాడు. అందుకే తుఫాను వచ్చినప్పుడు అతని ఇల్లు కూలిపోలేదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, తెలివి అనే విలువైన లక్షణాన్ని మనం ఎలా సంపాదించుకోవచ్చు, దాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

తెలివిని ఎలా సంపాదించుకోవచ్చు?

మొదటిగా మీకా 6:9, NWలో ఏముందో గమనించండి. అక్కడిలా ఉంది. ‘తెలివిగలవాడు, [దేవుని] పేరుకు భయపడతాడు.’ యెహోవా పేరుకు భయపడడమంటే ఆయనను గౌరవించడమని అర్థం. అంటే ఆయన పేరు ప్రాతినిధ్యం వహిస్తున్న వాటిపట్ల, ఆయన ప్రమాణాలపట్ల భక్తిపూర్వక గౌరవాన్ని చూపించడం. ఒక వ్యక్తిని గౌరవించాలంటే, అతని ఆలోచనలు ఎలా ఉంటాయో మీకు తెలుసుండాలి. అప్పుడు మీరు అతన్ని నమ్మగలుగుతారు, అతని నుండి నేర్చుకోగలుగుతారు, అతనిలాగే తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మనం చేసే పనులు యెహోవాతో మనకున్న సంబంధంపై ముందుముందు ఎలాంటి ప్రభావం చూపిస్తాయని ఆలోచిస్తే, ఆయన ప్రమాణాల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటే, మనం తెలివిని సంపాదించుకుంటున్నట్లే.

రెండవదిగా, సామెతలు 18:1 చెప్తున్నదాన్ని గమనించండి, “వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు [తెలివికి, NW] విరోధి.” ఒకవేళ మనం జాగ్రత్తగా లేకపోతే యెహోవాకు, ఆయన ప్రజలకు దూరమైపోయే ప్రమాదం ఉంది. మనం వేరైపోకూడదంటే యెహోవాపట్ల భయం, ఆయన ప్రమాణాలపట్ల గౌరవం చూపించేవాళ్లతో సమయం గడపాలి. సాధ్యమైనంతవరకు, రాజ్యమందిరానికి వెళ్లి సంఘంలోని సహోదరసహోదరీలతో క్రమంగా సహవసించాలి. మీటింగ్‌లో ఉన్నప్పుడు, అక్కడ చెప్పే విషయాలు మన మీద ప్రభావం చూపించేలా మనసుపెట్టి వినాలి.

దానితోపాటు, ప్రార్థనలో యెహోవా ముందు మన హృదయాల్ని కుమ్మరించినప్పుడు ఆయనకు మరింత దగ్గరౌతాం. (సామె. 3:5, 6) బైబిల్ని, యెహోవా సంస్థ తయారుచేసే ప్రచురణల్ని మనం శ్రద్ధగా చదివినప్పుడు, మన పనులకు భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలు వస్తాయో కొంతవరకు అర్థమౌతుంది అప్పుడు దానికి తగ్గట్టుగా ప్రవర్తించగలుగుతాం. పరిణతిగల సహోదరులు ఇచ్చే సలహాలను కూడా మనం వినాలి. (సామె. 19:20) అలా చేస్తే, ‘తెలివికి విరోధిగా’ ఉండే బదులు ఆ ప్రాముఖ్యమైన లక్షణాన్ని మరింతగా వృద్ధిచేసుకుంటూ ఉంటాం.

అది నా కుటుంబానికి ఎలా ఉపయోగపడుతుంది?

తెలివి కుటుంబాలను కాపాడగలదు. ఉదాహరణకు, భార్యకు తన భర్త మీద “ప్రగాఢ గౌరవం” ఉండాలని బైబిలు ప్రోత్సహిస్తుంది. (ఎఫె. 5:33) ఒక భర్త తన భార్య ప్రగాఢ గౌరవాన్ని ఎలా సంపాదించుకోగలడు? ఒకవేళ అతను బలవంతంగానో, కఠినంగా ప్రవర్తించో దాన్ని పొందాలనుకుంటే దాన్ని కొంతకాలమే పొందగలడు. గొడవ రాకుండా ఉండేందుకు, భార్య కేవలం అతను ఉన్నప్పుడే కొంతవరకు గౌరవం చూపించవచ్చు. కానీ అతను లేనప్పుడు కూడా గౌరవించడానికి ఆమె ఇష్టపడుతుందా? చాలావరకు ఆమె ఇష్టపడకపోవచ్చు. భార్య తనను ఎప్పటికీ గౌరవించాలంటే ఏమి చేయాలో అతను ఆలోచించాలి. ఒకవేళ అతను పవిత్రశక్తి పుట్టించే లక్షణాలైన ప్రేమ, దయ చూపిస్తే తన భార్య ప్రగాఢ గౌరవాన్ని సంపాదించుకుంటాడు. నిజానికి, తన గౌరవాన్ని సంపాదించుకునేలా భర్త ప్రవర్తించినా ప్రవర్తించకపోయినా క్రైస్తవ భార్య అతన్ని గౌరవించాలి.—గల. 5:22-24.

భర్త తన భార్యను ప్రేమించాలని కూడా బైబిలు చెప్తుంది. (ఎఫె. 5:28, 33) అయితే భర్త ప్రేమను పొందాలనే ప్రయత్నంలో, అతనికి నచ్చని విషయాలు చెప్పకుండా దాచడం మంచిదని భార్య అనుకోవచ్చు. నిజానికి వాటిని తెలుసుకునే హక్కు అతనికి ఉంది. మరి అలా దాచిపెట్టడం తెలివైన పనే అంటారా? ఆమె దాచిపెట్టిన విషయాలు కొంతకాలం తర్వాత అతనికి తెలిసినప్పుడు ఏమి జరుగుతుంది? అతనికి ఆమె మీదున్న ప్రేమ పెరుగుతుందా? బహుశా అలా ప్రేమించడం అతనికి కష్టమవ్వచ్చు. ఒకవేళ ఆమె సరైన సమయాన్ని ఎంచుకుని అతనికి నచ్చని విషయాలను నెమ్మదిగా వివరిస్తే, ఆమె నిజాయితీని భర్త మెచ్చుకోవచ్చు. అప్పుడు అతనికి ఆమె మీదున్న ప్రేమ పెరుగుతుంది.

పిల్లలకు ఇప్పుడు మీరు క్రమశిక్షణ ఇచ్చే విధానం, వాళ్లు పెద్దయ్యాక మీరు వాళ్లతో చేసే సంభాషణపై ప్రభావం చూపిస్తుంది

పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడాలి, యెహోవా ప్రమాణాల ప్రకారం వాళ్లు ఇచ్చే క్రమశిక్షణను తీసుకోవాలి. (ఎఫె. 6:1, 4) అంటే పిల్లలు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలిపే పెద్ద లిస్టు తల్లిదండ్రులు ఇవ్వాలని కాదు. పిల్లలు కేవలం తల్లిదండ్రులు పెట్టిన నియమాలను లేదా ఏదైన తప్పు చేస్తే వచ్చే శిక్షను తెలుసుకుంటే సరిపోదు. తెలివిగల తల్లిదండ్రులు పిల్లలు తమకు ఎందుకు లోబడాలో అర్థంచేసుకునేందుకు సహాయం చేస్తారు.

ఉదాహరణకు, ఒక పిల్లవాడు తన తండ్రితోనో తల్లితోనో గౌరవంలేకుండా మాట్లాడాడనుకోండి. ఆ పిల్లవాడిని తిట్టడమో లేదా అక్కడికక్కడే శిక్షించడమో చేస్తే అది అతన్ని అవమానపర్చవచ్చు లేదా మౌనంగా ఉండిపోయేలా చేయవచ్చు. కానీ హృదయంలో అతనికి కోపం ఉండవచ్చు, దానివల్ల ఆ పిల్లవాడు తన తల్లిదండ్రులకు దూరమయ్యే ప్రమాదం ఉంది.

తెలివిని పెంపొందించుకుంటున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రమశిక్షణ ఇచ్చే విధానం గురించి, భవిష్యత్తులో అది వాళ్లపై చూపించే ప్రభావం గురించి ఆలోచిస్తారు. పిల్లలు తమను బాధపెట్టినందుకు తల్లిదండ్రులు వెంటనే ఏదోఒక చర్య తీసుకోకూడదు. బహుశా ఆ పిల్లవాడిని పక్కకు తీసుకెళ్లి, శాశ్వత ప్రయోజనం పొందేందుకు తల్లిదండ్రుల్ని గౌరవించాలని యెహోవా కోరుకుంటున్నాడని పిల్లవాడికి నెమ్మదిగా, ప్రేమగా వివరించవచ్చు. అలా చేస్తే, ఈసారి ఆ పిల్లవాడు తల్లిదండ్రులను గౌరవించినప్పుడు, తాను యెహోవాను ఘనపరుస్తున్నానని అర్థంచేసుకుంటాడు. (ఎఫె. 6:2, 3) తల్లిదండ్రులు అలా దయగా ప్రవర్తించినప్పుడు ఆ పిల్లవాడిలో మంచి మార్పు రావచ్చు. అంతేకాదు తల్లిదండ్రులకు అతని మీదున్న నిజమైన శ్రద్ధను అర్థంచేసుకుని, వాళ్లను మరింత గౌరవిస్తాడు. ఆ తర్వాత ప్రాముఖ్యమైన విషయాల్లో తల్లిదండ్రుల సహాయం అడగడం ఆ పిల్లవాడికి సులభమౌతుంది.

పిల్లలు ఎక్కడ బాధపడతారోనని కొంతమంది తల్లిదండ్రులు వాళ్లను సరిదిద్దరు. అలా చేస్తే పిల్లలు పెద్దవాళ్లయ్యాక ఏమి జరుగుతుంది? వాళ్లు యెహోవాకు భయపడతారా? ఆయన ప్రమాణాలను పాటించడం తెలివైన పనని వాళ్లు గుర్తిస్తారా? యెహోవా చెప్పేవాటిని శ్రద్ధగా వినడానికి ఇష్టపడతారా లేదా ఆయనకు దూరమౌతారా?—సామె. 13:1; 29:21.

ఒక మంచి శిల్పకారుడు, తాను ఏమి తయారు చేయాలనుకుంటున్నాడో ముందుగానే ఆలోచించుకుంటాడు. అంతేగానీ అతను ఇష్టమొచ్చినట్టు చెక్కి ఒక మంచి శిల్పం తయారవ్వాలని ఆశించడు. అదేవిధంగా తెలివిగల తల్లిదండ్రులు యెహోవా ప్రమాణాలను నేర్చుకోవడానికి, వాటిని పాటించడానికి ఎన్నో గంటలు వెచ్చిస్తారు. అలా యెహోవాపట్ల తమకు భయముందని చూపిస్తారు. వాళ్లు యెహోవాకూ, ఆయన సంస్థకూ సన్నిహితంగా ఉంటూ తెలివిని సంపాదించుకుంటారు. అంతేకాదు దాన్ని తమ కుటుంబాన్ని బలపర్చుకోవడానికి ఉపయోగిస్తారు.

భవిష్యత్తు మీద ప్రభావం చూపించగల నిర్ణయాలను మనం ప్రతీరోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఏమీ ఆలోచించకుండా వెంటనే ఏదోక నిర్ణయం తీసేసుకునే బదులు, కాసేపు ఆగి ఆలోచించడం మంచిది. ఆ నిర్ణయంవల్ల భవిష్యత్తులో ఎలాంటి పర్యవసానాలు వస్తాయో జాగ్రత్తగా ఆలోచిద్దాం. యెహోవా నిర్దేశం కోసం అడిగి, ఆయనిచ్చే జ్ఞానాన్ని ఉపయోగిద్దాం. అప్పుడు మనం తెలివిని కాపాడుకుంటాం, అది మనకు జీవాన్ని ఇస్తుంది.—సామె. 3:21, 22.