కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా వాగ్దానాలపై విశ్వాసం ఉంచండి

యెహోవా వాగ్దానాలపై విశ్వాసం ఉంచండి

‘మనం నమ్మేవి కంటికి కనిపించకపోయినా అవి నిజంగా ఉన్నాయనడానికి రుజువే విశ్వాసం.’హెబ్రీ. 11:1, NW.

పాటలు: 54, 43

1. మనం విశ్వాసం కలిగివుండేలా యెహోవా సహాయం చేసినందుకు మనమెలా భావించాలి?

 విశ్వాసం అందరికీ ఉండే లక్షణం కాదు. (2 థెస్స. 3:2) కానీ తన ఆరాధకులందరూ విశ్వాసం కలిగివుండేందుకు యెహోవా సహాయం చేస్తున్నాడు. (రోమా. 12:3; గల. 5:22) ఆ విషయంలో మనమెంత కృతజ్ఞులమో కదా!

2, 3. (ఎ) మనకు విశ్వాసం ఉంటే ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం? (బి) మనమిప్పుడు ఏమి పరిశీలిస్తాం?

2 యెహోవా తన ప్రియ కుమారుడైన యేసును మనందరి కోసం ఇచ్చాడు. యేసు మీద విశ్వాసం ఉంచే ప్రతీఒక్కరు తమ పాపాలకు క్షమాపణ పొందుతారు. దానివల్ల మనుషులు యెహోవాతో స్నేహం చేయడం, నిరంతరం జీవించడం వీలౌతుంది. (యోహా. 6:44, 65; రోమా. 6:23) యెహోవా మనమీద ఎంతో దయ చూపించాడు. మనం పాపులమైనప్పటికీ, మరణానికి పాత్రులమైనప్పటికీ మంచి పనులు చేయగల సామర్థ్యం మనకుందని ఆయన గుర్తించాడు. (కీర్త. 103:10) యేసు గురించిన, ఆయనిచ్చిన బలి గురించిన మంచివార్తను తెలుసుకోవడానికి యెహోవా మనకు సహాయం చేశాడు. అయితే మనం భవిష్యత్తులో నిత్యజీవం పొందాలంటే యేసు మీద విశ్వాసం ఉంచి, ఆయన్ను అనుకరించాలి.—1 యోహాను 4:9, 10 చదవండి.

3 కానీ విశ్వాసం గురించి మనమింకా ఏమి తెలుసుకోవచ్చు? దేవుడు మనకోసం ఏమి చేశాడో, ఏమి చేయబోతున్నాడో తెలుసుకున్నంత మాత్రాన మనకు విశ్వాసం ఉన్నట్లా? మనమింకా ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

‘హృదయంలో విశ్వాసం చూపించండి’

4. మనకు విశ్వాసం ఉంటే ఏమి చేస్తాం?

4 మనకు యెహోవా మీద, యేసు మీద విశ్వాసం ఉంటే, వాళ్లు మనకోసం ఏమి చేశారో, ఏమి చేయబోతున్నారో కేవలం తెలుసుకోవడమే కాదు. వాళ్ల ఇష్టప్రకారం జీవించాలని బలంగా కోరుకుంటాం కూడా. అంతేకాదు ఇతరులు కూడా యెహోవా గురించి, యేసు గురించి తెలుసుకునేలా సహాయం చేస్తాం. అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు, “యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.”—రోమా. 10:9, 10; 2 కొరిం. 4:14, 15.

5. విశ్వాసం ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది? దాన్ని బలంగా ఉంచుకోవాలంటే మనమేమి చేయాలి? ఓ ఉదాహరణ చెప్పండి.

5 దేవుడు తీసుకొచ్చే కొత్త లోకంలో నిరంతరం జీవించాలంటే మనకు విశ్వాసం ఉండాలి, ఆ విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవాలి. విశ్వాసం ఓ మొక్కలాంటిది. మొక్క బలంగా ఉంటూ ఎదగాలంటే నీళ్లు పోస్తూ ఉండాలి. ఒకవేళ మనం నీళ్లు పోయకపోతే మొక్క వాడిపోయి, చచ్చిపోతుంది. అదేవిధంగా మన విశ్వాసం కూడా బలంగా, ‘అభివృద్ధిపొందుతూ’ ఉండాలంటే శ్రద్ధ తీసుకోవాలి.—తీతు 2:2; 2 థెస్స. 1:3; లూకా 22:32; హెబ్రీ. 3:12.

విశ్వాసం గురించి బైబిలు ఇచ్చే వివరణ

6. హెబ్రీయులు 11:1వ వచనం విశ్వాసాన్ని ఏ రెండు విధాలుగా వివరిస్తోంది?

6 ‘మనం ఎదురుచూసేవి తప్పక జరుగుతాయని బలంగా నమ్మడమే విశ్వాసం; అంతేకాదు, మనం నమ్మేవి కంటికి కనిపించకపోయినా అవి నిజంగా ఉన్నాయనడానికి రుజువే విశ్వాసం’ అని బైబిలు వివరిస్తోంది. (హెబ్రీ. 11:1, NW) (1) విశ్వాసం అంటే, ‘మనం ఎదురుచూసేవి తప్పక జరుగుతాయని బలంగా నమ్మడం.’ మనం ‘ఎదురుచూసే’ విషయాల్లో భవిష్యత్తు గురించి దేవుడు చేసిన వాగ్దానాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు చెడుతనం అంతమౌతుందనీ, కొత్తలోకం వస్తుందనీ మనం నమ్ముతాం. (2) విశ్వాసం అంటే, ‘మనం నమ్మేవి కంటికి కనిపించకపోయినా అవి నిజంగా ఉన్నాయనడానికి రుజువు.’ యెహోవా, యేసుక్రీస్తు, దూతలు మనకు కనిపించకపోయినా వాళ్లు ఉన్నారని మనకు తెలుసు. అలాగే పరలోక ప్రభుత్వాన్ని మనం చూడలేకపోయినా అది నిజంగా ఉందని మనం నమ్ముతాం. (హెబ్రీ. 11:3) దేవుని వాగ్దానాల మీద, కనిపించని వాటిమీద మనకు నిజంగా విశ్వాసం ఉందని ఎలా చూపించవచ్చు? దాన్ని మన జీవన విధానంలో, మన మాటల్లో, చేతల్లో చూపిస్తాం.

7. విశ్వాసం కలిగివుండడమంటే ఏమిటో అర్థంచేసుకోవడానికి నోవహు ఉదాహరణ ఎలా సహాయం చేస్తుంది? (ప్రారంభ చిత్రం చూడండి.)

7 విశ్వాసం గురించి నోవహు నుండి మనమేమి నేర్చుకోవచ్చు? అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు, “నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను.” (హెబ్రీ. 11:7) యెహోవా చెప్పిన వాటిమీద నోవహుకు విశ్వాసం ఉంది కాబట్టే అతను పెద్ద ఓడను నిర్మించాడు. ఓడ ఎందుకు నిర్మిస్తున్నావని బహుశా చుట్టుపక్కలవాళ్లు అతన్ని అడిగివుంటారు. అప్పుడు అతను వాళ్లకు ప్రకటించి ఉంటాడని చెప్పవచ్చు. ఎందుకంటే బైబిలు అతన్ని, “నీతిని ప్రకటించిన నోవహు” అని పిలుస్తుంది. (2 పేతు. 2:5) దుష్టుల్ని నాశనం చేయడానికి దేవుడు జలప్రళయాన్ని తీసుకురాబోతున్నాడని నోవహు ప్రజల్ని హెచ్చరించాడు. సరిగ్గా యెహోవా చెప్పిన ఈ విషయాన్నే అతను ప్రజలకు చెప్పివుంటాడు, “సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది . . . ఇదిగో నేనే జీవ వాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండ కుండ నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును.” అంతేకాదు, ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవాలంటే ‘ఓడలోకి ప్రవేశించాలి’ అని యెహోవా ఆజ్ఞాపించిన విషయాన్ని కూడా నోవహు వాళ్లకు వివరించి ఉంటాడు.—ఆది. 6:13, 17, 18.

8. విశ్వాసం గురించి యాకోబు ఏమి చెప్పాడు?

8 యాకోబు కూడా విశ్వాసం గురించి రాశాడు. బహుశా అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు ఉత్తరం రాసిన కొంతకాలానికి యాకోబు విశ్వాసం గురించి రాసివుంటాడు. అతనిలా రాశాడు, “క్రియలు లేకుండ నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియలచేత నా విశ్వాసము నీకు కనుపరతును.” (యాకో. 2:18) నమ్మడానికి, విశ్వాసం కలిగివుండడానికి గల తేడాను యాకోబు స్పష్టంగా వివరించాడు. దేవుడు ఉన్నాడని చెడ్డదూతలు నమ్ముతారు, కానీ వాళ్లు యెహోవా మీద విశ్వాసం ఉంచరు. బదులుగా దేవున్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. (యాకో. 2:19, 20) మరోవైపు, విశ్వాసం ఉన్న వ్యక్తి మంచి పనులు చేస్తూ దేవున్ని సంతోషపెడతాడు. అదే అబ్రాహాము చేశాడు. దానిగురించి యాకోబు ఇలా రాశాడు, “మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠముమీద అర్పించినప్పుడు అతడు క్రియలవలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతోకూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియలమూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా?” ఆ తర్వాత, విశ్వాసాన్ని క్రియల్లో చూపించడం ఎంత ప్రాముఖ్యమో వివరిస్తూ, “ప్రాణము లేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము” అని యాకోబు నొక్కిచెప్పాడు.—యాకో. 2:21-23, 26.

9, 10. కుమారుని మీద విశ్వాసం ఉంచడమంటే ఏమిటి?

9 ముప్పై కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత యోహాను, ఒక సువార్త వృత్తాంతాన్ని అలాగే మూడు పత్రికల్ని రాశాడు. మిగతా బైబిలు రచయితల్లాగే యోహాను కూడా విశ్వాసం అంటే ఏమిటో అర్థంచేసుకున్నాడు. అతను రాసిన సువార్తలో, పత్రికల్లో చాలాసార్లు, ‘విశ్వాసముంచడం’ అని అనువదించిన గ్రీకు క్రియాపదాన్ని ఉపయోగించాడు.

10 ఉదాహరణకు యోహాను ఇలా వివరించాడు, “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.” (యోహా. 3:36) కుమారుని మీద విశ్వాసం ఉంచాలంటే మనం యేసు చెప్పిన మాటలు వినాలి. నిజానికి, తన మీద, తండ్రి మీద విశ్వాసం చూపిస్తూ ఉండమని యేసు తరచుగా చెప్పడాన్ని యోహాను రాసిన సువార్తలో, పత్రికల్లో గమనిస్తాం.—యోహా. 3:16; 6:29, 40; 11:25, 26; 14:1, 12.

11. సత్యం తెలుసుకోవడానికి సహాయం చేసినందుకు యెహోవాకు మనమెలా కృతజ్ఞత చూపించవచ్చు?

11 తన గురించిన, తన కుమారుని గురించిన సత్యాన్ని మనం అర్థంచేసుకునేలా, వాళ్లిద్దరి మీద విశ్వాసం ఉంచేలా సహాయం చేయడానికి యెహోవా తన పవిత్రశక్తిని ఉపయోగించాడు. (లూకా 10:21 చదవండి.) మరి యెహోవా చేసినవాటన్నిటి పట్ల మనమెలా కృతజ్ఞత చూపించవచ్చు? మనం తనతో ఓ మంచి సంబంధం కలిగివుండేలా ‘విశ్వాసమునకు ముఖ్య ప్రతినిధి, దాన్ని పరిపూర్ణం చేసే వ్యక్తి అయిన’ యేసును యెహోవా ఏర్పాటు చేశాడు. అందుకు మనం ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. (హెబ్రీ. 12:1, 2, NW) అంతేకాదు మనం ఆయనకు ఎల్లప్పుడూ ప్రార్థించడం, బైబిల్ని లోతుగా చదవడం ద్వారా మన విశ్వాసాన్ని బలపర్చుకుంటూ ఉండాలి.—ఎఫె. 6:18; 1 పేతు. 2:1-3.

అవకాశం దొరికినప్పుడల్లా మంచివార్త ప్రకటిస్తూ మీ విశ్వాసం చూపించండి (12వ పేరా చూడండి)

12. మనకు విశ్వాసం ఉంటే ఏమి చేస్తాం?

12 యెహోవా వాగ్దానాల మీద మనకు బలమైన విశ్వాసం ఉందని మన పనుల ద్వారా చూపిస్తూ ఉండాలి. ఉదాహరణకు, మనం దేవుని రాజ్యం గురించి ఇతరులకు ప్రకటిస్తూ, వాళ్లు యేసు శిష్యులు అయ్యేలా సహాయం చేస్తూనే ఉంటాం. అలాగే మనం, “అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు” చేస్తూ ఉంటాం. (గల. 6:10) అంతేకాదు, దేవునితో మనకున్న స్నేహాన్ని పాడుచేయగల ప్రతీదానికి దూరంగా ఉంటూ మన “ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ” విడిచిపెట్టడానికి తీవ్రంగా కృషిచేస్తాం.—కొలొ. 3:5, 8-10.

దేవుని మీద విశ్వాసం మన పునాదిలో ఓ భాగం

13. ‘దేవుని మీద విశ్వాసం’ కలిగివుండడం ఎందుకు ప్రాముఖ్యం? దాని గురించి బైబిలు ఏమి చెప్తుంది? ఎందుకు?

13 “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను” అని బైబిలు చెప్తుంది. (హెబ్రీ. 11:6) అంతేకాదు నిజక్రైస్తవులకు ఉండాల్సిన ముఖ్యమైన వాటిలో ‘దేవుని మీద విశ్వాసం’ ఒకటి అని, అది ‘పునాదిలో’ ఒక భాగమని బైబిలు చెప్తుంది. (హెబ్రీ. 6:1, NW) అయితే యెహోవాతో స్నేహం కావాలన్నా, దాన్ని కొనసాగించాలన్నా మనకు విశ్వాసంతోపాటు మరికొన్ని ముఖ్యమైన లక్షణాలు అవసరం.—2 పేతురు 1:5-7 చదవండి; యూదా 20, 21.

14, 15. విశ్వాసంతో పాటు ప్రేమ ఉండడం ఎందుకు చాలా ప్రాముఖ్యం?

14 క్రైస్తవ గ్రీకు లేఖనాలను రాసినవాళ్లు వేరే ఏ లక్షణం కన్నా విశ్వాసం గురించి ఎక్కువసార్లు రాశారు. అంటే మనకు ఉండాల్సిన లక్షణాల్లో విశ్వాసమే అన్నిటికన్నా ప్రాముఖ్యమని దానర్థమా?

15 పౌలు విశ్వాసాన్ని ప్రేమతో పోలుస్తూ ఇలా రాశాడు, “కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.” (1 కొరిం. 13:2) దేవున్ని ప్రేమించడమే “ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ” అని యేసు చెప్పాడు. (మత్త. 22:35-40) దేవున్ని సంతోషపెట్టే ఎన్నో ఇతర లక్షణాలు వృద్ధిచేసుకోవడానికి ప్రేమ మనకు సహాయం చేస్తుంది. ఉదాహరణకు, ప్రేమ “అన్నిటిని నమ్మును” అని బైబిలు చెప్తుంది. కాబట్టి బైబిల్లో దేవుడు చెప్పే ప్రతీ విషయాన్ని నమ్మడానికి లేదా వాటిపై విశ్వాసం ఉంచడానికి ప్రేమ మనకు సహాయం చేస్తుంది.—1 కొరిం. 13:4, 7.

16, 17. విశ్వాసం, ప్రేమ గురించి బైబిలు ఏమి చెప్తుంది? ఈ లక్షణాల్లో ఏది గొప్పది? ఎందుకు?

16 ప్రేమ, విశ్వాసం రెండూ చాలా ప్రాముఖ్యమైన లక్షణాలు. అందుకే బైబిలు రచయితలు చాలాసార్లు ఈ రెండు లక్షణాలను కలిపి ప్రస్తావించారు. పౌలు తన సహోదరులను, ‘విశ్వాస ప్రేమలను కవచము ధరించుకోండి’ అని ప్రోత్సహించాడు. (1 థెస్స. 5:8) యేసు గురించి పేతురు ఇలా రాశాడు, ‘మీరు ఆయన్ను చూడకపోయినా ప్రేమిస్తున్నారు; ఇప్పుడు ఆయన్ను కన్నులార చూడకపోయినా విశ్వసిస్తున్నారు.’ (1 పేతు. 1:8-9) యాకోబు తన అభిషిక్త సహోదరులను ఇలా అడిగాడు, “ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?” (యాకో. 2:5) పౌలు ఇలా రాశాడు, “క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడవై, నీవు నావలన వినిన హితవాక్యప్రమాణమును గైకొనుము.”—2 తిమో. 1:13.

17 అంతేకాదు, ‘విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుస్తాయి; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమే’ అని కూడా పౌలు రాశాడు. (1 కొరిం. 13:13) కొత్తలోకం గురించి దేవుడు చేసిన వాగ్దానాల మీద మనం విశ్వాసం ఉంచాల్సిన అవసరం భవిష్యత్తులో ఉండదు, ఎందుకంటే అవి అప్పటికి నెరవేరుతాయి. బైబిలు చెప్తున్న అద్భుతమైన జీవితాన్ని అప్పటికి మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ దేవుని మీద, ఆయన ప్రజల మీద ప్రేమ చూపిస్తూ ఉండాల్సిన అవసరం ఎప్పటికీ ఉంటుంది. నిజానికి వాళ్ల మీద మనకున్న ప్రేమ నిరంతరం పెరుగుతూ ఉంటుంది.

యెహోవా మన విశ్వాసాన్ని దీవించాడు

18, 19. నేడు దేవుని ప్రజలు చూపించే విశ్వాసానికి ఎలాంటి ఫలితం వచ్చింది? ఆ ఘనత ఎవరికి చెందుతుంది?

18 మన కాలంలోని యెహోవా ప్రజలు, దేవుని రాజ్యం మీద విశ్వాసం ఉంచుతూ దానికి మద్దతిస్తున్నారు. అంతేకాదు వాళ్లు ఒకరిపట్ల ఒకరు ప్రేమ చూపించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్లు తమ జీవితాల్లో పవిత్రశక్తి నిర్దేశాన్ని పాటిస్తున్నారు. (గల. 5:22-24) దాని ఫలితం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న 80 లక్షలకన్నా ఎక్కువమంది సహోదరసహోదరీలు తమ సంఘాల్లో శాంతిని, ఐక్యతను అనుభవిస్తున్నారు. కాబట్టి విశ్వాసం, ప్రేమ శక్తివంతమైన లక్షణాలని స్పష్టంగా అర్థమౌతోంది.

19 ఈ ఐక్యత కేవలం మన దేవుడైన యెహోవా వల్లే సాధ్యమైంది. ఈ ఘనత ఆయనకే చెందుతుంది. (యెష. 55:13) ‘విశ్వాసం ద్వారా రక్షించబడే’ ఏర్పాటు చేసినందుకు యెహోవాకు మనం ఎంతో రుణపడివున్నాం. (ఎఫె. 2:8) తన మీద విశ్వాసం ఉంచేలా ఇంకా ఎంతోమందికి ఆయన సహాయం చేస్తూనే ఉంటాడు. ఆఖరికి ఈ భూమంతా ఆయన్ను నిరంతరం స్తుతించే పరిపూర్ణమైన, నీతియుక్తమైన, సంతోషకరమైన ప్రజలతో నిండిపోతుంది.