కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆనాటి జ్ఞాపకాలు

“బ్రిటన్‌లోని రాజ్య ప్రచారకులారా​—⁠మేల్కోండి!!”

“బ్రిటన్‌లోని రాజ్య ప్రచారకులారా​—⁠మేల్కోండి!!”

“బ్రిటన్‌లోని రాజ్యప్రచారకులారా—మేల్కోండి!!” అనే ఓ అత్యవసర పిలుపును ఇస్తూ ఒక ఆర్టికల్‌ వచ్చింది. (ఇన్‌ఫార్మెంట్‌, a డిసెంబరు 1937, లండన్‌ ఎడిషన్‌). ఆ ఆర్టికల్‌కు ఉపశీర్షికగా, “గత పది సంవత్సరాల్లో ఎలాంటి పెరుగుదల లేదు” అనే ఆలోచింపజేసే మాటల్ని రాశారు. ముందు పేజీలో వేసిన గత పది సంవత్సరాల (1928-1937) సేవా నివేదికే అందుకు రుజువు.

అధిక సంఖ్యలో పయినీర్లు

బ్రిటన్‌లో ప్రకటనాపని నత్తనడకగా సాగడానికి గల కారణం ఏమిటి? కారణమేమిటంటే, అక్కడున్న సంఘాలు, ఎన్నో ఏళ్ల ముందు ప్రకటనాపని జరిగిన వేగంలోనే సువార్త ప్రకటించాయి తప్ప తమ వేగాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించలేదు. దాంతోపాటు, సంఘాలతో కాకుండా మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తున్న దాదాపు 200 పయినీర్లకు మాత్రమే అక్కడున్న ప్రాంతం పరిచర్య చేయడానికి సరిపోతుందని బ్రాంచి నిర్ణయించింది. కాబట్టి పయినీర్లుగా సేవ చేయాలనుకుంటున్న వాళ్లు బ్రిటన్‌లో కాకుండా ఇతర యూరోపియన్‌ దేశాల్లో సేవ చేయడానికి వెళ్లాలని బ్రాంచి చెప్పింది. దాంతో భాష అంతంతమాత్రంగా తెలిసినా లేదా పూర్తిగా తెలియకపోయినా ప్రకటించే సామర్థ్యం ఉన్న ఎంతోమంది పయినీర్లు ఫ్రాన్స్‌ వంటి దేశాలకు వెళ్లిపోయారు.

“చర్య తీసుకోమనే పిలుపు”

1937⁠లోని ఇన్‌ఫార్మెంట్‌ ఆర్టికల్‌, 1938వ సంవత్సరానికల్లా సాధించాల్సిన ఓ పెద్ద లక్ష్యాన్ని పెట్టింది. అదే, పదిలక్షల గంటలు. ప్రచారకులు నెలకు 15 గంటలు, పయినీర్లు 110 గంటలు సేవ చేస్తే అనుకున్న లక్ష్యం చేరుకోవచ్చు. అంతేకాదు క్షేత్రసేవా గుంపులు ఏర్పాటు చేసి ఆయా రోజుల్లో ఐదు గంటలు ప్రకటనా పని చేసేలా, ముఖ్యంగా వారం మధ్యలో సాయంత్రం పూటలు పునర్దర్శనాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలనే సలహాలు కూడా ఆ ఆర్టికల్‌లో వచ్చాయి.

ఉత్సాహవంతులైన పయినీర్లు ప్రకటనాపనిపై మనసుపెట్టారు

ప్రకటనా పని చేయాలని ప్రోత్సహిస్తూ ఇలా కొత్తగా వస్తున్న సూచనలు చాలామందిలో ఉత్సాహాన్ని నింపాయి. “మమ్మల్ని చర్య తీసుకోమంటూ ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన పిలుపు అది. నిజానికి మాలో చాలామందిమి అలాంటి పిలుపు కోసం ఎంతో ఎదురుచూశాం, ఆ పిలుపు వల్ల కొంతకాలంలోనే అద్భుతమైన ఫలితాలు వచ్చాయి” అని హిల్డా పజెట్‌ b అనే సహోదరి గుర్తుచేసుకుంది. ఇ. ఎఫ్‌. వాలస్‌ అనే సహోదరి ఇలా చెప్పింది, ‘రోజులో ఐదు గంటలు ప్రకటనా పని చేయాలనే సలహా చాలా బాగనిపించింది. రోజంతా ప్రభువు సేవ చేయడం కన్నా మరింత సంతోషాన్నిచ్చే పని మరొకటి ఏముంటుంది? ఇంటికి వెళ్లేటప్పటికీ అలసిపోయినా, చాలా సంతోషంగా అనిపించేది.’ ప్రకటనా పనిని వేగవంతం చేయాలనే అత్యవసర పిలుపుకు స్టీవెన్‌ మిల్లర్‌ అనే యువకుడు స్పందించాడు. అవకాశం ఉన్నప్పుడే సేవ చేయాలని అతను అనుకున్నాడు. గుంపులుగా సైకిళ్ల మీద వెళ్తూ రోజంతా ప్రీచింగ్‌లో గడపడాన్ని, వేసవి కాలం సాయంత్రాలు రికార్డు చేయబడిన ప్రసంగాలు వినిపించడాన్ని అతను గుర్తుచేసుకున్నాడు. ప్లకార్డులు పట్టుకుని నడుస్తూ, అలాగే పత్రికలతో వీధి సాక్ష్యం చేస్తూ వాళ్లు ఎంతో ఉత్సాహంగా సువార్త ప్రకటించారు.

“1,000 మంది పయినీర్ల సైన్యం కావాలి” అనే కొత్త అభ్యర్థన ఇన్‌ఫార్మెంట్‌లో వచ్చింది. కొత్త క్షేత్ర పాలసీని బట్టి, ఇక మీద పయినీర్లు విడిగా కాకుండా సంఘాలతో కలిసి పనిచేయాలి. సంఘాలకు మద్దతిస్తూ అవి వృద్ధిచెందడానికి సహాయం చేయాలి. “చాలామంది సహోదరుల్లో, పయినీరు సేవ చేయాలనే మేల్కొలుపు వచ్చింది” అని జొయిస్‌ ఎలస్‌ అనే సహోదరి గుర్తుచేసుకుంది. అంతేకాదు ఆమె ఇలా చెప్పింది, “అప్పటికి నాకు 13 ఏళ్లే. అయినప్పటికీ నేను ఎలాగైనా పయినీరు సేవ చేయాలనుకున్నాను.” ఆమె తన లక్ష్యాన్ని 15 ఏళ్ల వయసులో అంటే 1940 జూలైలో సాధించింది. కొంతకాలానికి జొయిస్‌ని పెళ్లి చేసుకున్న పీటర్‌, అత్యవసర పిలుపు వల్ల మేల్కొలుపు కలిగి, “పయినీరు సేవ చేయడం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు.” అతనికి 17 ఏళ్లు ఉన్నప్పుడు అంటే 1940 జూన్‌లో సైకిల్‌పై 105 కి.మీ. స్కార్‌బరాకు ప్రయాణించి వెళ్లి పయినీరు సేవ అనే కొత్త నియామకాన్ని మొదలుపెట్టాడు.

కొత్తగా పయినీరు సేవ మొదలుపెట్టిన సిరల్‌, కిట్టీలు మరో అడుగు ముందుకు వేస్తూ స్వయంత్యాగ స్ఫూర్తి చూపించి చక్కని ఆదర్శాన్ని ఉంచారు. వాళ్లు తమ పూర్తికాల సేవకు అవసరమయ్యే డబ్బు కోసం తమ ఇంటిని, వస్తువుల్ని అమ్మేశారు. సిరల్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అలా వాళ్లు నెల తిరిగేలోపు పయినీరు సేవ చేయడానికి సిద్ధమయ్యారు. సిరల్‌ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు, “మేము చాలా నమ్మకంతో ఉన్నాం. మేం ప్రతీది ఇష్టంగా, సంతోషంగా చేశాం.”

పయినీర్ల గృహాలు ఏర్పాటు చేయడం

పయినీర్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగేసరికి, వాళ్లకు మద్దతివ్వడానికి సహాయపడే మార్గాల కోసం ప్రకటనా పనిని పర్యవేక్షిస్తున్న సహోదరులు ఆలోచించడం మొదలుపెట్టారు. 1938⁠లో జోన్‌ సర్వెంట్‌గా (ఇప్పుడు ప్రాంతీయ పర్యవేక్షకుడు అని పిలుస్తున్నాం) సేవ చేస్తున్న జిమ్‌ కార్‌ అనే సహోదరుడు పట్టణాల్లో పయినీర్ల గృహాలు ఏర్పాటు చేయాలనే సలహాను పాటించాడు. ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతో కొంతమంది పయినీర్లు ఒకేచోట ఉంటూ, కలిసి ప్రకటనాపని చేయాలని ప్రోత్సహించబడ్డారు. వాళ్లు షెఫీల్డ్‌లో ఓ పెద్ద ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన ఓ సహోదరుని పర్యవేక్షణలో అది ఉండేది. స్థానిక సంఘం డబ్బును, సామాగ్రిని విరాళంగా ఇచ్చింది. “ఆ ఏర్పాటు ద్వారా మంచి ఫలితాలు వచ్చేందుకు ప్రతీ ఒక్కరు కృషిచేశారు” అని జిమ్‌ గుర్తుచేసుకున్నాడు. ఆ ఇంట్లో పదిమంది పయినీర్లు కలిసి ఉంటూ, మంచి ఆధ్యాత్మిక ప్రణాళికను పాటిస్తూ కష్టపడి సేవ చేశారు. “ప్రతీరోజు ఉదయం టిఫిన్‌ చేసే బల్ల దగ్గర కూర్చుని దినవచనాన్ని చర్చించేవాళ్లు, ఆ తర్వాత పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో తమకు కేటాయించిన క్షేత్రాలకు పయినీర్లు వెళ్లేవాళ్లు.”

బ్రిటన్‌లో పయినీర్ల సంఖ్య అసాధారణంగా పెరిగింది

ప్రచారకులు, పయినీర్లు ఒకేలా స్పందించి 1938⁠లో పదిలక్షల గంటల్ని చేరుకోవాలనే లక్ష్యాన్ని సాధించారు. ప్రకటనా పనికి సంబంధించిన అన్నీ విషయాల్లో ప్రగతి సాధించారని నివేదికలు చూపించాయి. ఐదేళ్ల వ్యవధిలో బ్రిటన్‌లోని ప్రచారకుల సంఖ్య దాదాపు మూడింతలు అయ్యింది. ప్రకటనా పనిని మరింత చురుగ్గా చేయాలనే కొత్త పిలుపు, రాబోతున్న యుద్ధ సంవత్సరాల్ని తట్టుకుని ధైర్యంగా నిలబడేందుకు యెహోవా ప్రజలకు కావాల్సిన బలాన్నిచ్చింది.

దేవుని యుద్ధమైన హార్‌మెగిద్దోను దగ్గరపడుతుండగా నేడు బ్రిటన్‌లో పయినీర్ల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గత పది సంవత్సరాల్లో, పయినీరు సేవ చేసేవాళ్ల సంఖ్య కొత్త రికార్డుల్ని నెలకొల్పింది. 2015 అక్టోబరు నాటికి ఆ సంఖ్య 13,224కు చేరుకుంది. పూర్తికాల సేవ చేయడమే జీవితంలో చేయదగ్గ అత్యంత మంచి పని అనే మేల్కొలుపును ఈ పయినీర్లందరూ కలిగివున్నారు.

a కొంతకాలం తర్వాత మన రాజ్య పరిచర్య అని పిలిచేవాళ్లు.

b 1995, అక్టోబరు 1 కావలికోట సంచికలోని 19-24 పేజీల్లో సహోదరి హిల్డా పజెట్‌ జీవిత కథ ఉంది.