కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ముఖ్యమైన మతాల వాళ్లందరూ మనిషికి అమర్త్యమైన ఆత్మ ఉందని నమ్ముతారు

పత్రిక ముఖ్యాంశం | జీవం, మరణం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

ఒక చిక్కు ప్రశ్న

ఒక చిక్కు ప్రశ్న

జీవం, మరణం గురించి ఎన్నో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. చనిపోయాక ఏదో ఒక రూపంలో, ఏదో ఒక చోట బ్రతికే ఉంటామని కొంతమంది నమ్ముతారు. ఇంకొంతమంది వేరే రూపంలో పునర్జన్మిస్తారని నమ్ముతారు. మరికొంతమంది, మరణంతో అంతా సమాప్తం అవుతుందని అనుకుంటారు.

మీరు పెరిగిన విధానాన్నిబట్టి, మీ సంస్కృతిని బట్టి ఈ విషయం గురించి మీకు మీ సొంత నమ్మకాలు ఉండవచ్చు. అయితే మరణం తర్వాత ఏం జరుగుతుందనే విషయం గురించి ఇన్ని రకాల అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఈ చిక్కు ప్రశ్నకు నిజమైన, నమ్మదగిన జవాబులు ఎవరి దగ్గరైనా, ఎక్కడైనా దొరుకుతాయా?

ఎన్నో వందల సంవత్సరాలుగా మతనాయకులు ఆత్మ అమర్త్యమైనదని లేదా ఆత్మకు చావు లేదని బోధిస్తూ వచ్చారు. ముఖ్య మతాలైన క్రైస్తవులు, హిందువులు, యూదులు, ముస్లింలు, వేరే మతాలవాళ్లు అమర్త్యమైన ఆత్మ ఉంటుందని, అది శరీరం చనిపోయాక కూడా ఉంటుందని, ఆత్మ లోకంలో బ్రతికే ఉంటుందని నమ్ముతారు. కానీ బౌద్ధులు ఒక మనిషిలో ఉండే శక్తి, లేదా మానసిక శక్తి ఎన్నో పునర్జన్మల ద్వారా పరమానందాన్ని పొందుతుందని అంటారు. దాన్నే నిర్వాణం అని పిలుస్తారు.

ఇలాంటి బోధలన్నిటి వల్ల ప్రపంచంలో ఉన్న చాలామంది ప్రజలు మరణం ఇంకో లోకంలో జీవితానికి దారితీస్తుందని నమ్ముతున్నారు. అందుకే చాలామందికి జీవిత చక్రంలో మరణం ఒక ముఖ్య ఘట్టం, చనిపోవడం దైవ నిర్ణయం లేదా దేవుని చిత్తమని అనిపిస్తుంది. అయితే, ఈ విషయం గురించి బైబిలు ఏం చెప్తుంది? తర్వాత పేజీల్లో ఉన్న సమాచారం దయచేసి చదవండి. ఆ జవాబు మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు.