కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు చూడ్డానికి నిజంగా ఎలా ఉంటాడు?

యేసు చూడ్డానికి నిజంగా ఎలా ఉంటాడు?

యేసు ఫోటో ఎవరి దగ్గర లేదు. ఆయన ఎప్పుడూ శిల్పం చెక్కించుకోలేదు లేదా చిత్రం గీయించుకోలేదు. అయినా శతాబ్దాలుగా ఎంతోమంది కళాకారులు చేసిన పెయింటింగ్స్‌లో, శిల్పాల్లో ఆయన కనిపిస్తూనే ఉన్నాడు.

నిజమే, ఆ కళాకారులకు యేసు నిజంగా ఎలా ఉంటాడో తెలీదు. స్థానిక సంస్కృతిని బట్టి, మత నమ్మకాలను బట్టి, బొమ్మ వేయమని చెప్పిన ఆసక్తిపరుల అభిరుచిని బట్టి ఆ కళాకారులు యేసు చిత్రాన్ని చేశారు. అయినా కూడా ఆ పెయిటింగ్‌లు, శిల్పాలు యేసు గురించి, ఆయన బోధల గురించి ప్రజల అభిప్రాయాన్ని బాగా ప్రభావితం చేశాయి లేదా నిజాలను కప్పేశాయి.

కొంతమంది చిత్రకారులు యేసును పొడవాటి జుట్టు, సన్నని గడ్డంతో నీరసంగా చూపించారు, లేదా ఎంతో విచారంతో ఉన్నట్లు చూపించారు. ఇంకొన్ని చిత్రాలు, యేసుకు మానవాతీత శక్తి ఉన్నట్లు, ఆయన చుట్టూ గుండ్రంగా వెలుగు ఉన్నట్లు, చుట్టూ ఉన్నవాళ్లకన్నా ప్రత్యేకంగా ఉన్నట్లు చూపిస్తున్నాయి. అవి యేసును సరిగ్గా చూపిస్తున్నాయా? మనం ఎలా తెలుసుకోవచ్చు? ఒక మార్గం ఏమిటంటే, ఆయన ఎలా ఉన్నాడో తెలిపే బైబిల్‌ విషయాల వెలుగులో వాస్తవాలను జాగ్రత్తగా పరీశీలించాలి. అవి ఆయన గురించి సరైన అభిప్రాయం కలిగి ఉండడానికి కూడా మనకు సహాయం చేస్తాయి.

“నాకు ఒక శరీరాన్ని ఏర్పాటు చేశావు”

ఈ మాటలు యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ప్రార్థనలో చెప్పినవి. (హెబ్రీయులు 10:5; మత్తయి 3:13-17) ఆయన శరీరం చూడ్డానికి ఎలా ఉంటుంది? ఆయన బాప్తిస్మానికి 30 సంవత్సరాల వెనక్కి వెళ్తే, దూత అయిన గబ్రియేలు మరియకు ఇలా చెప్పాడు: “నువ్వు గర్భవతివై కొడుకును కంటావు . . . దేవుని కుమారుడని పిలవబడతాడు.” (లూకా 1:31, 35) దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఎలా అయితే ఏ లోపం లేకుండా ఉన్నాడో యేసు కూడా అలానే లోపం లేకుండా ఉన్నాడు. (లూకా 3:38; 1 కొరింథీయులు 15:45) యేసు పూర్తిగా ఎదిగిన మనిషి అయ్యాడు, బహుశా ఆయనకు యూదురాలైన అతని తల్లి మరియ పోలికలు వచ్చి ఉంటాయి.

యేసుకు గడ్డం ఉండేది, రోమన్లలా కాకుండా గడ్డం పెంచుకోవడం యూదుల సంస్కృతి. అలాంటి గడ్డం గౌరవానికి మర్యాదకు గుర్తుగా ఉండేది. వాళ్ల గడ్డం మరీ పొడవుగా, చింపిరిగా ఉండేది కాదు. యేసు తప్పకుండా ఆయన గడ్డాన్ని ట్రిమ్‌ చేసుకుని జుట్టును చక్కగా కత్తిరించుకొని ఉంటాడు. నాజీరులుగా ఉన్న సమ్సోను లాంటి కొంతమంది మాత్రమే జుట్టును కత్తిరించుకునేవాళ్లు కాదు.—సంఖ్యాకాండము 6:5; న్యాయాధిపతులు 13:5.

ఆయనకు 30 సంవత్సరాలు వచ్చేవరకు చాలాకాలం వడ్రంగిగా పనిచేశాడు. ఇప్పుడున్న అత్యాధునిక పనిముట్లు అప్పట్లో లేవు. (మార్కు 6:3) కాబట్టి ఆయన తప్పకుండా బలంగా కండలతో ఉండి ఉంటాడు. ఆయన పరిచర్య మొదట్లో, ఒకరోజు ఆయన ఒక్కడే “గొర్రెల్ని, పశువుల్ని ఆలయంలో నుండి వెళ్లగొట్టాడు. డబ్బు మార్చేవాళ్ల నాణేలను, వాళ్ల బల్లలను కింద పడేశాడు.” (యోహాను 2:14-17) ఆ పని చేయడానికి చాలా బలం, శక్తి అవసరం. దేవుడు ఇచ్చిన పనిని పూర్తి చేయడానికి ఆయన ఇచ్చిన శరీరాన్ని యేసు ఉపయోగించుకున్నాడు: “నేను మిగతా నగరాల్లో కూడా దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించాలి. ఇందుకోసమే దేవుడు నన్ను పంపించాడు.” (లూకా 4:43) పాలస్తీనా అంతా కాలినడకన వెళ్తూ ఈ మంచివార్తను ప్రకటించడానికి ఎంతో శక్తి అవసరం.

“నా దగ్గరికి రండి, నేను మీకు సేదదీర్పును ఇస్తాను”

యేసు ముఖం, ఆయన రూపం ఆ ఆహ్వానాన్ని మరింత ఆకర్షణీయంగా చేశాయి. ముఖ్యంగా “భారం మోస్తూ అలసిపోయిన” వాళ్లకు ఆ ఆహ్వానం ఎంతో అర్థవంతంగా ఉండి ఉంటుంది. (మత్తయి 11:28-30) యేసు దగ్గర నేర్చుకోవాలనుకున్న వాళ్లకు ఆయన సేదదీర్పును ఇస్తానని మాట ఇచ్చాడు. యేసుకున్న ఆప్యాయత, దయ ఆయన ఇచ్చిన మాటకు మరింత బలాన్ని ఇచ్చాయి. చిన్నపిల్లలు కూడా యేసుకు దగ్గరవ్వాలని అనుకున్నారు. ‘ఆయన పిల్లల్ని ఎత్తుకొన్నాడు’ అని బైబిలు చెప్తుంది.—మార్కు 10:13-16.

యేసు మరణించే ముందు ఎంతో బాధను అనుభవించాడు, కానీ ఆయన ఎప్పుడూ దిగులుగా ఉండే మనిషి కాదు. ఉదాహరణకు, కనానులో పెళ్లి జరుగుతున్నప్పుడు నీళ్లను మంచి ద్రాక్షారసంలా మార్చాడు. (యోహాను 2:1-11) మిగతా సందర్భాల్లో మర్చిపోలేని విలువైన పాఠాలు బోధించాడు.—మత్తయి 9:9-13; యోహాను 12:1-8.

మరిముఖ్యంగా యేసు చేసిన పరిచర్య, వినే వాళ్లందరికీ నిత్య జీవితాన్ని పొందే అవకాశాన్ని ఇచ్చింది. (యోహాను 11:25, 26; 17:3) ఆయన 70 మంది శిష్యులు పరిచర్యలో వాళ్ల అనుభవాలను చెప్తున్నప్పుడు, యేసు “ఎంతో సంతోషించి” ఇలా అన్నాడు: “మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయని సంతోషించండి.”—లూకా 10:20, 21.

“అయితే మీరు అలా ఉండకూడదు”

యేసు కాలంలో ఉన్న మత నాయకులు ప్రజలను వాళ్లవైపు తిప్పుకోవడానికి, అధికారాన్ని చెలాయించడానికి పథకాలు వేస్తూ ఉండేవాళ్లు. (సంఖ్యాకాండము 15:38-40; మత్తయి 23:5-7) వాళ్లలా కాకుండా యేసు తన అపొస్తలులకు ఇతరుల “మీద అధికారం” చేలాయించకూడదని బోధించాడు. (లూకా 22:25, 26) నిజానికి, యేసు ఇలా హెచ్చరించాడు: “శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పొడవాటి అంగీలు వేసుకొని తిరగడం, సంతల్లో ప్రజల చేత నమస్కారాలు పెట్టించుకోవడం వాళ్లకు ఇష్టం.”—మార్కు 12:38.

వాళ్లకు పూర్తి వేరుగా, యేసు ప్రజలలో కలిసిపోయేవాడు, కాబట్టి కొన్నిసార్లు ఆయనను గుర్తు పట్టలేక పోయేవాళ్లు. (యోహాను 7:10, 11) చివరికి ఆయన 11 మంది నమ్మకమైన శిష్యులతో కలిసి ఉన్నప్పుడు కూడా ఆయన చూడ్డానికి వేరుగా కనబడలేదు. తనతో ఉన్న గుంపు యేసును గుర్తుపట్టడానికి వీలుగా నమ్మకద్రోహి అయిన యూదా ముద్దు పెట్టడం ద్వారా “ఒక గుర్తు” ఇచ్చాడు.—మార్కు 14:44, 45.

ఎక్కువ వివరాలు తెలియకపోయినా, ప్రజలు ఇప్పుడు చూపిస్తున్న విధంగా మాత్రం యేసు లేడని స్పష్టం అవుతుంది. ఆయన చూడడానికి నిజంగా ఎలా ఉంటాడో అనే దానికన్నా ఆయనను మనం ఇప్పుడు ఎలా చూడాలి అనేది ఎక్కువ ముఖ్యం.

“కొంత సమయం తర్వాత లోకం ఇక ఎప్పుడూ నన్ను చూడదు”

యేసు ఆ మాటలు చెప్పిన రోజే, చనిపోయి సమాధి చేయబడ్డాడు. (యోహాను 14:19) ఆయన తన ప్రాణాన్ని “ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా” ఇచ్చాడు. (మత్తయి 20:28) మూడవ రోజు, దేవుడు ఆయనను “పరలోక సంబంధమైన శరీరంతో” తిరిగి బ్రతికించి, ఆయన శిష్యుల్లో కొంతమందికి “కనిపించేలా చేశాడు.” (1 పేతురు 3:18; అపొస్తలుల కార్యాలు 10:40) యేసు తన శిష్యులకు కనిపించినప్పుడు చూడ్డానికి ఎలా ఉన్నాడు? ఇంతకుముందులా కాకుండా చాలా వేరుగా ఉన్నాడు, అందుకే ఆయన దగ్గరి శిష్యులు కూడా ఆయనను వెంటనే గుర్తు పట్టలేదు. మగ్దలేనే మరియ ఆయనను చూసి తోటమాలి అనుకుంది. ఎమ్మాయు అనే గ్రామానికి వెళ్తున్న ఇద్దరు శిష్యులు ఆయనను చూసి ఆయన ఎవరో అనుకున్నారు.—లూకా 24:13-18; యోహాను 20:1, 14, 15.

మనం ఈరోజు యేసును ఎలా చిత్రీకరించుకోవచ్చు? యేసు చనిపోయిన 60 సంవత్సరాలకు ప్రియ అపొస్తలుడైన యోహాను యేసును గురించిన దర్శనాలను చూశాడు. మ్రాను మీద యేసు చనిపోతున్న దృశ్యాన్ని యోహాను చూడలేదు. కానీ ‘రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా,’ దేవుని రాజ్యానికి రాజుగా ఆయనను చూశాడు. ఆయన దేవుని శత్రువులైన చెడ్డ దూతలను, మనుషులను త్వరలోనే ఓడించి, ప్రజలందరికీ శాశ్వత ఆశీర్వాదాలను తీసుకువస్తాడు.—ప్రకటన 19:16; 21:3, 4.