కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తప్పుల్ని ఎలా చూడాలి?

తప్పుల్ని ఎలా చూడాలి?

డాన్‌, a మార్గరెట్‌ దగ్గరకు వాళ్ల కూతురు కుటుంబంతో వచ్చింది. వాళ్లు అంతా కలిసి ఎంతో ఆనందించారు. తిరిగి వెళ్లే ముందు అందరు కలిసి భోజనం చేయడానికి మార్గరెట్‌ మనవళ్లకు బాగా ఇష్టమైన మ్యాకరోని, చీజ్‌ వండింది. ఆమె ఒక రిటైర్డ్‌ కుక్‌.

అందరూ కూర్చుని ఉన్నప్పుడు, మార్గరెట్‌ వాళ్లకు బాగా ఇష్టమైన ఆ వంటకాన్ని తెచ్చి టేబుల్‌ మీద పెట్టింది. ఆమె మూత తీయగానే, గిన్నెలో వేడి చీజ్‌ సాస్‌ మాత్రమే ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. మార్గరెట్‌ ముఖ్య ఐటమ్‌ మ్యాకరోని వేయడం మర్చిపోయింది. b

వయసు, అనుభవంతో సంబంధం లేకుండా మనందరం తప్పులు చేస్తుంటాం. అనాలోచితంగా అన్న మాటవల్ల, సమయం కాని సమయంలో చేసిన పని వల్ల లేదా ఒక విషయాన్ని అంతగా పట్టించుకోకపోవడం వల్ల లేదా మర్చిపోవడం వల్ల తప్పు చేయవచ్చు. తప్పులు ఎందుకు జరుగుతాయి? తప్పులు జరిగినప్పుడు మనం ఏమి చేయాలి? తప్పులు జరగకుండా ఆపవచ్చా? ఈ ప్రశ్నలకు జవాబులు తప్పులు విషయంలో మనకు సరైన ఆలోచన ఉన్నప్పుడు దొరుకుతుంది.

తప్పుల విషయంలో మన ఆలోచన, దేవుని ఆలోచన

ఏదైనా బాగా చేసినందుకు మనల్ని పొగిడినా లేదా మెచ్చుకున్నా మనం దానిని అంగీకరిస్తాం. అలాగే ఏదైనా తప్పు చేసినప్పుడు, దానిని అనుకోకుండా చేసినా లేదా ఎవరూ చూడకపోయినా ఆ తప్పుకు మనమే బాధ్యత వహించాలి కదా! అలా చేయాలంటే వినయం అవసరం.

మన గురించి మనం ఎక్కువగా అనుకుంటే, మనం చేసింది తప్పు కాదు అన్నట్లు సమర్థించుకోవచ్చు, వేరేవాళ్లను నిందించవచ్చు లేదా మన తప్పును ఒప్పుకోకపోవచ్చు. అలా చేస్తే చెడు పర్యవసానాలు వస్తాయి. ఆ సమస్య పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోతుంది, ఇతరులు ఆ నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం చేసిన తప్పుకు వచ్చే పర్యవసానాలను ఇప్పుడు తప్పించుకున్నా, మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చివరికి “ప్రతీ ఒక్కరం దేవునికి జవాబుదారులం.”—రోమీయులు 14:12.

దేవుడు తప్పుల్ని సరైన దృష్టితో చూస్తాడు. కీర్తనల పుస్తకంలో దేవున్ని “దయాదాక్షిణ్య పూర్ణుడు”; “ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు” అని వర్ణించారు. మనుషుల్లో లోపాలు ఉన్నాయని ఆయనకు తెలుసు, పుట్టినప్పటి నుండి మనకు ఉన్న బలహీనతలను ఆయన అర్థం చేసుకుంటూ, “మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు.”—కీర్తన 103:8, 9, 14.

అంతేకాదు, దేవుడు దయగల తండ్రిలా మన తప్పులను చూసినట్లే ఆయన పిల్లలుగా మనం కూడా అలానే చూడాలని కోరుకుంటున్నాడు. (కీర్తన 130:3) మన సొంత పొరపాట్లను, అలాగే ఇతరుల పొరపాట్లను మనం ఎలా చూడాలో తెలిపే ఎన్నో సలహాలను, నిర్దేశాలను ప్రేమతో ఆయన వాక్యంలో ఇచ్చాడు.

తప్పులు చేయకుండా ఉండడానికి సూచనలు

తప్పులు చేసినప్పుడు తప్పు చేసిన వాళ్లు సాధారణంగా ఇతరుల మీద కోప్పడడానికి, లేదా నిందించడానికి లేదా చేసిన తప్పును సమర్థించడానికి వాళ్ల సమయాన్ని, తెలివిని ఉపయోగిస్తారు. అలా కాకుండా, మీ మాటలు ఇతరులను బాధపెట్టినప్పుడు, క్షమించమని ఎందుకు అడగకూడదు, చేసిన తప్పును చక్కదిద్దుకుని స్నేహాన్ని ఎందుకు కాపాడుకోకూడదు. మీరు ఏదైనా పొరపాటు చేశారా? మిమ్మల్ని గానీ ఇతరులను గానీ ఇబ్బంది పెట్టారా? లేదా హాని చేశారా? మీమీద మీరు కోప్పడేకంటే, లేదా ఇతరులను నిందించే కంటే జరిగిన దాన్ని సరిచేయడానికి మీరు చేయగలిగిన దాన్ని ఎందుకు చేయకూడదు? తప్పు వేరే వాళ్ల దగ్గర ఉంది అని పట్టుబట్టడం వల్ల అనవసరంగా టెన్షన్‌ పెరుగుతుంది, సమస్య పెద్దది అవుతుంది. కాబట్టి తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని, దాన్ని సరి చేసుకుని, ముందుకు వెళ్లి పోవడం మంచిది.

వేరేవాళ్లు తప్పు చేసినప్పుడు త్వరగా స్పందించి అసహనం చూపించడం చాలా తేలిక. యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటలు పాటించడం ఎంత మంచిదో: “కాబట్టి ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో మీరూ వాళ్లతో అలాగే వ్యవహరించాలి.” (మత్తయి 7:12) మీరు తప్పు చేసినప్పుడు, అది చిన్న తప్పే అయినా ఇతరులు మీ విషయంలో దయగా వ్యవహరించాలని అనుకుంటారు, లేదా దాన్ని పట్టించుకోకుండా పూర్తిగా వదిలేయాలని అనుకుంటారు. కాబట్టి అలాంటి దయను ఇతరుల మీద ఎందుకు చూపించకూడదు?—ఎఫెసీయులు 4:32.

తప్పులను తగ్గించుకోవడానికి ఉపయోగపడే సూత్రాలు

“తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల, విషయం సరిగ్గా తెలీక పోవడం వల్ల లేదా సరిగ్గా అవధానం ఇవ్వకపోవడం వల్ల” తప్పులు జరుగుతాయని ఒక డిక్షనరీ వివరిస్తుంది. ఏదోక సమయంలో ప్రతి ఒక్కరం ఇలాంటి పొరపాట్లలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చేస్తుంటాం. కానీ లేఖనాల్లో ఉన్న ముఖ్యమైన సూత్రాలు పాటిస్తే మనం చేసే తప్పుల్ని తగ్గించుకోవచ్చు.

అలాంటి ఒక సూత్రం సామెతలు 18:13⁠లో ఉంది. అక్కడ: “సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును” అని ఉంది. అవును, కొంత సమయం తీసుకుని జరిగింది ఏమిటో పూర్తిగా విని ఎలా స్పందించాలో ఒకసారి ఆలోచిస్తే కోపంగా మాట్లాడకుండా లేదా తొందరపడకుండా జాగ్రత్త పడవచ్చు. విషయం తెలుసుకోవడానికి శ్రద్ధగా వింటే తప్పుగా అర్థం చేసుకోకుండా ఉంటాము, తప్పులు చేయకుండా ఉంటాము.

బైబిల్లో ఉన్న మరో సూత్రం ఇలా చెప్తుంది: “సాధ్యమైతే, మీకు చేతనైనంత వరకు మనుషులందరితో శాంతిగా మెలగండి.” (రోమీయులు 12:18) సమాధానాన్ని, సహకారాన్ని పెంచడానికి మీరు చేయగలిగినదంతా చేయండి. ఇతరులతో కలిసి పని చేస్తున్నప్పుడు, వాళ్లను అర్థం చేసుకోండి, గౌరవించండి, మెచ్చుకోవడానికి ప్రయత్నించండి, ప్రోత్సహించండి. అలాంటి మంచి వాతావరణంలో, అనాలోచితంగా మాట్లాడిన మాటలు, చేసిన పనులు వెంటనే క్షమించుకుంటారు లేదా వదిలేస్తారు, పెద్ద సమస్యలను స్నేహపూర్వకంగా సరిదిద్దవచ్చు లేదా పరిష్కరించవచ్చు.

చేసిన తప్పులు నుండి మీరు నేర్చుకోగల మంచి ఏమైనా ఉందేమో చూడండి. మీరు అన్నదానికి, చేసిన దానికి సాకులు వెదికే బదులు మంచి లక్షణాలు పెంచుకోవడానికి మీరు చేసిన తప్పును ఒక అవకాశంగా చూడండి. సహనం, దయ, ఆత్మనిగ్రహం వంటి లక్షణాలు ఇంకా పెంచుకోవడం అవసరమా? మృదుత్వం, సమాధానం, ప్రేమ వంటి లక్షణాల విషయం ఏమిటి? (గలతీయులు 5:22, 23) తర్వాత ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మీరు ఏమి చేయకూడదో తెలుసుకుంటారు. మీ గురించి మీరు మరీ బాధ్యత లేనట్లు కాదు గానీ మీ గురించి మీరు మరీ ఎక్కువ ఆలోచించకుండా జాగ్రత్త పడండి. కాస్త సరదాగా ఉంటే తప్పకుండా టెన్షన్‌ను తప్పించుకోవచ్చు.

సరైన దృష్టి వల్ల కలిగే ప్రయోజనం

తప్పుల విషయంలో సరైన దృష్టి ఉంటే అవి జరిగినప్పుడు తెలివిగా ప్రవర్తిస్తాం. అప్పుడు మనం, ఇతరులం ప్రశాంతంగా ఉండవచ్చు. మన తప్పుల నుండి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే, మనం తెలివిగల వాళ్లుగా, ఇతరులు ఇష్టపడే వాళ్లుగా అవుతాం. మరీ కృంగిపోము లేదా మన గురించి మనం తక్కువగా అనుకోము. ఇతరులు కూడా వాళ్ల తప్పుల విషయంలో పోరాడుతున్నారని తెలుసుకున్నప్పుడు మనం వాళ్లకు ఇంకా దగ్గర అవుతాం. అన్నిటికన్నా ముఖ్యంగా, దేవుని ప్రేమను, మనస్ఫూర్తిగా క్షమించే ఆయన గుణాన్ని అనుకరించడం ద్వారా ప్రయోజనం పొందుతాం.—కొలొస్సయులు 3:13.

మొదట్లో మనం మాట్లాడుకున్న మార్గరెట్‌ చేసిన పొరపాటు ఆ సమయంలో కుటుంబ ఆనందాన్ని పాడు చేసిందా? కానే కాదు. అందరూ, ముఖ్యంగా మార్గరెట్‌ దాన్ని సరదాగా తీసుకున్నారు, మ్యాకరోని లేకుండానే ఆ భోజనాన్ని ఆనందించారు. తర్వాత సంవత్సరాల్లో, కుటుంబమంతా కలిసి చేసిన ఆ భోజనం గురించి ఆ ఇద్దరు మనవళ్లు వాళ్ల పిల్లలకు చెప్పారు. అలా వాళ్ల అమ్మమ్మ, తాతయ్యల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చెప్పాలంటే, అది ఒక చిన్న పొరపాటే!

a అసలు పేర్లు కావు.

b మ్యాకరోని, చీజ్‌ అనే వంటకం ముఖ్యంగా మ్యాకరోని పాస్టా, చీజ్‌ సాస్‌తో కలిపి చేసే డిష్‌