కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మా పాఠకుల ప్రశ్న . . .

క్రిస్మస్‌ క్రైస్తవుల పండగా?

క్రిస్మస్‌ క్రైస్తవుల పండగా?

ప్రపంచంలో ఉన్న లక్షలమంది యేసుక్రీస్తు పుట్టిన రోజు జరుపుకోవడమే క్రిస్మస్‌ ఆచారం అని నమ్ముతారు. కానీ, యేసుకు చాలా దగ్గరైన మొదటి శతాబ్ద క్రైస్తవులు క్రిస్మస్‌ను జరుపుకున్నారా లేదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పుట్టిన రోజుల గురించి బైబిలు ఏమి చెప్తుందో మీకు తెలుసా? మేము అడిగే ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం ద్వారా క్రిస్మస్‌ క్రైస్తవుల పండుగా కాదా తెలుస్తుంది.

మొదటిది, యేసుకు లేదా ఏ నమ్మకమైన దేవుని సేవకులకు జరిగిన పుట్టిన రోజు వేడుకల గురించి బైబిల్లో ప్రస్తావించలేదు. పుట్టిన రోజు జరుపుకున్న ఇద్దరి గురించి మాత్రమే లేఖనాలు వివరిస్తున్నాయి. కానీ వాళ్ల ఇద్దరిలో ఎవరూ బైబిల్లో దేవుడైన యెహోవా ఆరాధకులు కాదు. అంతేకాదు వాళ్ల పుట్టిన రోజు వేడుకల్లో చాలా చెడు సంఘటనలు జరిగాయి. (ఆదికాండము 40:20; మార్కు 6:21) ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం తొలి క్రైస్తవులు “అన్యుల ఆచారామైన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడాన్ని” వ్యతిరేకించారు.

యేసు ఏ తేదీన పుట్టాడు?

యేసు ఎప్పుడు పుట్టాడో బైబిలు ఖచ్చితంగా చెప్పట్లేదు. “క్రొత్త నిబంధన గ్రంథం నుండి అయినా వేరే ఏ ఆధారం నుండి అయినా యేసు సరిగ్గా ఏ రోజు పుట్టాడో నిర్ధారించలేము” అని మెక్‌క్లింటాక్‌ అండ్‌ స్ట్రాంగ్స్‌ సైక్లోపీడియా చెప్తుంది. నిజంగా శిష్యులు తన పుట్టిన రోజును జరుపుకోవాలని యేసు కోరుకుని ఉంటే వాళ్లకు ఖచ్చితంగా ఆయన పుట్టిన తేదీ తెలిసేలా చూసుకునేవాడు.

రెండవది, యేసు గానీ ఏ ఇతర శిష్యులు గానీ క్రిస్మస్‌ జరుపుకున్నట్లు బైబిల్లో నమోదు కాలేదు. న్యూ క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా ప్రకారం క్రిస్మస్‌ మొదటిసారి జరుపుకోవడం గురించి ‘ఫిలోకాలూస్‌ క్రోనోగ్రాఫ్‌లో ఉంది. ఇది ఒక రోమన్‌ పంచాంగం. దీనికి ఆధారమైన సమాచారం దాదాపు క్రీ.శ. 336 నాటిది అని చెప్పవచ్చు.’ అంటే అది బైబిలు రాయడం పూర్తి అయిన తర్వాత, యేసు భూమిమీద జీవించిన కొన్ని శతాబ్దాల తర్వాత అని స్పష్టంగా తెలుస్తుంది. అందుకే, మెక్‌క్లింటాక్‌ అండ్‌ స్ట్రాంగ్స్‌ చెప్తున్నట్లుగా “క్రిస్మస్‌ జరుపుకోవడం దేవుడు నియమించిన ఆచారం కాదు, క్రొత్త నిబంధనలో పుట్టింది కాదు.” a

తన శిష్యులకు యేసు ఏ సంఘటనను ఆచరించమని చెప్పాడు?

గొప్ప బోధకుడిగా, యేసు తన అనుచరులు ఏమి చేయాలని కోరుకుంటున్నాడో స్పష్టంగా నిర్దేశించాడు. అవన్నీ బైబిల్లో నమోదయ్యి ఉన్నాయి. అందులో క్రిస్మస్‌ జరుపుకోవడం గురించి లేదు. ఎలా అయితే స్కూల్‌ టీచర్‌ తను ఇచ్చిన ఆదేశాలను పిల్లలు మీరకూడదని అనుకుంటారో అలానే యేసు కూడా తన అనుచరులు ‘లేఖనాల్లో రాసివున్న వాటిని మీరకూడదు’ అని అనుకున్నాడు.—1 కొరింథీయులు 4:6.

కానీ, తొలి క్రైస్తవులకు ఒక ముఖ్యమైన సంఘటన గురించి బాగా తెలుసు. అది యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం లేదా గుర్తు చేసుకోవడం. యేసే స్వయంగా తన శిష్యులకు ఈ ఆచరణ ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో చెప్పాడు. ఈ ఖచ్చితమైన సూచనలు, ఆయన మరణించిన తేదీ బైబిల్లో నమోదై ఉన్నాయి.—లూకా 22:19; 1 కొరింథీయులు 11:25.

మనం చూసినట్లుగా క్రిస్మస్‌ ఒక పుట్టిన రోజు పండుగ. తొలి క్రైస్తవులు ఈ అన్య ఆచారాన్ని పాటించలేదు. ఇంకాచెప్పాలంటే, యేసుకానీ వేరేవాళ్లు ఎవరైనా కానీ క్రిస్మస్‌ను జరుపుకున్నారని బైబిల్లో లేదు. ఈ వాస్తవాల వెలుగులో ప్రపంచంలో ఉన్న లక్షలమంది క్రైస్తవులు క్రిస్మస్‌ వాళ్లకోసం కాదు అనే ముగింపుకు వచ్చారు.

a క్రిస్మస్‌ ఆచారాలు ఎలా ప్రారంభమయ్యాయి అనే విషయంలో ఎక్కువ సమాచారం కోసం, 2016, నం. 1, కావలికోటలో “మా పాఠకుల ప్రశ్నలో క్రిస్మస్‌కి సంబంధించిన ఆచారాల్లో తప్పేమైనా ఉందా?” అనే ఆర్టికల్‌ చూడండి. ఇది www.pr418.com/te వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.