కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవామీద నమ్మకం ఉంచి మంచి చేయండి

యెహోవామీద నమ్మకం ఉంచి మంచి చేయండి

“యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము.”కీర్త. 37:3.

పాటలు: 49, 18

1. యెహోవా మనుషులను ఏయే సామర్థ్యాలతో సృష్టించాడు?

 యెహోవా మనుషులను అద్భుతమైన సామర్థ్యాలతో సృష్టించాడు. మన సమస్యలను పరిష్కరించుకొని, భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవడానికి ఆయన మనకు ఆలోచనా సామర్థ్యాన్ని ఇచ్చాడు. (సామె. 2:11) ఆ ప్రణాళిక ప్రకారం పనిచేస్తూ మన లక్ష్యాలను చేరుకోవడానికి మనకు శక్తినిచ్చాడు. (ఫిలి. 2:13) అంతేకాదు మంచిని, చెడును గ్రహించడానికి మనస్సాక్షిని కూడా ఆయన ఇచ్చాడు. తప్పు చేయకుండా ఉండడానికి, చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి అది మనకు సహాయం చేస్తుంది.—రోమా. 2:15.

2. మన సామర్థ్యాల్ని ఎలా ఉపయోగించాలని యెహోవా ఆశిస్తున్నాడు?

2 మన సామర్థ్యాల్ని మంచి చేయడానికి ఉపయోగించాలని యెహోవా ఆశిస్తున్నాడు. ఎందుకంటే, ఆయనకు మనమంటే ఇష్టం, అంతేకాదు ఆయనిచ్చిన సామర్థ్యాల్ని ఉపయోగించినప్పుడు మనం సంతోషంగా ఉంటామని ఆయనకు తెలుసు. ఉదాహరణకు, హీబ్రూ లేఖనాల్లో మనమిలా చదువుతాం, “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు,” “చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము.” (సామె. 21:5; ప్రసం. 9:10) గ్రీకు లేఖనాల్లో మనమిలా చదువుతాం, “మనకు అవకాశం ఉన్నంతవరకు అందరికీ మంచి చేస్తూ ఉందాం,” “మీరు పొందినంత మేరకు మీలో ప్రతీ ఒక్కరు మీ వరాన్ని ఒకరికొకరు పరిచారం చేసుకోవడానికి ఉపయోగించండి.” (గల. 6:10; 1 పేతు. 4:10) అవును, మనకు అలాగే ఇతరులకు ప్రయోజనం కలిగేలా మనం చేయగలిగినవి చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు.

3. మనుషులకు ఏ పరిమితులు ఉన్నాయి?

3 మనం మన సామర్థ్యాల్ని ఉపయోగించాలని యెహోవా కోరుకుంటున్నప్పటికీ, మనకు పరిమితులు ఉన్నాయని ఆయనకు తెలుసు. ఉదాహరణకు అపరిపూర్ణతను, పాపాన్ని, మరణాన్ని మనం తీసేయలేం. అంతేకాదు, ప్రతీఒక్కరికి తమకు నచ్చింది చేసే స్వేచ్ఛ ఉంది కాబట్టి, వాళ్ల నిర్ణయాల్ని మనం తీసుకోలేం, వాళ్లు ఎలా జీవించాలో మనం నిర్ణయించలేం. (1 రాజు. 8:46) మనకు ఎంత జ్ఞానం, అనుభవం ఉన్నప్పటికీ అవి యెహోవాకు ఉన్నవాటితో ఎప్పటికీ సాటిరావు.—యెష. 55:9.

సమస్యల్లో ఉన్నప్పుడు, యెహోవామీద నమ్మకం ఉంచి మంచి చేయండి

4. ఈ ఆర్టికల్‌లో మనం ఏమి పరిశీలిస్తాం?

4 మనం ఎల్లప్పుడూ నిర్దేశం కోసం యెహోవాపై ఆధారపడుతూ, ఆయన మనకు సహాయం చేస్తాడని, మన విషయంలో మనం చేయలేనివి ఆయన చేస్తాడని నమ్మకముంచాలి. అంతేకాదు సమస్యలను ఎలా పరిష్కరించాలో, ఇతరులకు ఎలా సహాయం చేయగలమో మనం ఆలోచించాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు. (కీర్తన 37:3 చదవండి.) మనం ‘యెహోవామీద నమ్మకముంచాలి’ అలాగే ‘మేలు చేయాలి.’ ఇవి ఎలా చేయగలం? ఈ విషయంలో యెహోవాపై ఆధారపడిన నోవహు, దావీదు, ఇతర నమ్మకమైన యెహోవా సేవకుల నుండి మనమేమి నేర్చుకోవచ్చో పరిశీలిద్దాం. అలా పరిశీలిస్తుండగా, వాళ్లు చేయలేని పనులు కొన్ని ఉన్నప్పటికీ, చేయగలిగిన పనుల మీద వాళ్లు మనసుపెట్టారని మనం చూస్తాం.

మన చుట్టూ చెడుతనం ఉన్నప్పుడు

5. నోవహు జీవించినప్పుడు లోకంలో పరిస్థితులు ఎలా ఉండేవి?

5 నోవహు జీవించిన కాలంలో లోకం ‘బలాత్కారంతో,’ అనైతికతతో నిండిపోయింది. (ఆది. 6:4, 9-13) ఆ చెడ్డ ప్రజల్ని యెహోవా కొంతకాలం తర్వాత నాశనం చేస్తాడని నోవహుకు తెలిసినప్పటికీ, వాళ్ల పనుల్ని చూసి అతను బాధపడివుంటాడు. అలాంటి పరిస్థితిలో, తాను చేయలేని పనులు కొన్ని ఉన్నప్పటికీ, చేయగలిగే పనులు కూడా ఉన్నాయని అతను గుర్తించాడు.

ప్రకటనాపనికి వ్యతిరేకత (6-9 పేరాలు చూడండి)

6, 7. (ఎ) నోవహు చేయలేనివి ఏమిటి? (బి) మనం కూడా నోవహు ఉన్నలాంటి పరిస్థితుల్లోనే ఉన్నామని ఎలా చెప్పవచ్చు?

6 నోవహు చేయలేనివి: యెహోవా ఇచ్చిన హెచ్చరికల్ని నోవహు నమ్మకంగా ప్రకటించాడు గానీ ఆ హెచ్చరికల్ని పాటించమని అతను ప్రజల్ని బలవంతపెట్టలేడు. అంతేకాదు జలప్రళయం త్వరగా వచ్చేలా అతను చేయలేడు. అయితే, చెడుతనాన్ని అంతం చేస్తానని ఇచ్చిన మాటను యెహోవా నిలబెట్టుకుంటాడని, సరైన సమయానికే ఆయన దాన్ని చేస్తాడని నమ్మడం మాత్రమే నోవహు చేయగలడు.—ఆది. 6:17.

7 మనం కూడా చెడుతనం నిండిన లోకంలో జీవిస్తున్నాం. ఈ చెడుతనాన్ని శాశ్వతంగా లేకుండా చేస్తానని యెహోవా మాటిచ్చాడని మనకు తెలుసు. (1 యోహా. 2:17) ఈలోగా, “రాజ్యం గురించిన మంచివార్త” అంగీకరించమని మనం ప్రజలను బలవంతపెట్టలేము. అంతేకాదు, “మహాశ్రమ” ముందే మొదలయ్యేలా చేయలేము. (మత్త. 24:14, 21) కాబట్టి నోవహులాగే మనం కూడా, యెహోవా చెడుతనాన్నంతటినీ త్వరలోనే తీసివేస్తాడనే గట్టి నమ్మకాన్ని కలిగివుండాలి. (కీర్త. 37:10, 11) యెహోవా ఈ చెడుతనాన్ని నాశనం చేయడానికి నిర్ణయించిన రోజు వచ్చాక ఒక్కరోజు కూడా ఆగడనే నమ్మకం మనకుంది.—హబ. 2:3.

8. నోవహు దేనిమీద మనసుపెట్టాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)

8 నోవహు చేయగలిగినవి: తాను చేయలేనివాటిని బట్టి నిరాశపడే బదులు, నోవహు తాను చేయగలిగే వాటిమీద మనసుపెట్టాడు. యెహోవా ఇచ్చిన హెచ్చరికల్ని నోవహు నమ్మకంగా ప్రకటించాడు. (2 పేతు. 2:5) తన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి అదే అతనికి సహాయం చేసివుంటుంది. ప్రకటనాపని చేయడంతోపాటు, ఓడను కట్టమని యెహోవా ఇచ్చిన నిర్దేశాన్ని కూడా నోవహు పాటించాడు.—హెబ్రీయులు 11:7 చదవండి.

9. నోవహును మనమెలా అనుకరించవచ్చు?

9 నోవహులాగే మనం కూడా “ప్రభువు సేవలో” బిజీగా ఉంటాం. (1 కొరిం. 15:58) ఉదాహరణకు రాజ్యమందిరాలను, అసెంబ్లీ హాళ్లను కట్టేపనిలో, వాటిని సరైన స్థితిలో ఉంచే పనిలో మనం సహాయం చేయవచ్చు. సమావేశాల్లో, బ్రాంచి కార్యాలయంలో లేదా అనువాద కార్యాలయాల్లో స్వచ్ఛందంగా పనిచేయవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా, మన నిరీక్షణను బలంగా ఉంచే ప్రకటనాపనిలో మనం బిజీగా ఉంటాం. నమ్మకంగా సేవచేసే ఓ సహోదరి ఏమంటుందంటే, “ప్రజలు తమకు ఎలాంటి నిరీక్షణ లేదని, తమ సమస్యలు ఇక ఎప్పటికీ తీరవని అనుకుంటున్నారు. ఆ విషయాన్ని మీరు, వాళ్లకు దేవుని రాజ్యం తీసుకొచ్చే ఆశీర్వాదాల గురించి చెప్పినప్పుడు గ్రహిస్తారు.” ఆ సహోదరి చెప్పినట్లే మనకు కూడా ఓ నిరీక్షణ ఉంది, దానిగురించి ఇతరులకు చెప్పినప్పుడు అది మరింత బలపడుతుంది. అంతేకాదు జీవపు పరుగుపందెంలో కొనసాగేందుకు అది మనకు సహాయం చేస్తుంది.—1 కొరిం. 9:24.

మనం పాపం చేసినప్పుడు

10. దావీదు పరిస్థితిని వర్ణించండి.

10 రాజైన దావీదు నమ్మకమైన వ్యక్తి. యెహోవాకు అతనంటే చాలా ఇష్టం. (అపొ. 13:22) అయితే ఓ సందర్భంలో, దావీదు బత్షెబతో వ్యభిచారం చేసి ఘోరమైన పాపం చేశాడు. దానికన్నా ఘోరం ఏమిటంటే, చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి బత్షెబ భర్తయైన ఊరియాను యుద్ధంలో చంపించే పథకం వేశాడు. పైగా ఊరియాను చంపమనే నిర్దేశాలున్న ఉత్తరాన్ని స్వయంగా అతనితోనే దావీదు పంపించాడు. (2 సమూ. 11:1-21) చివరికి, దావీదు పాపాలు బయటపడ్డాయి. (మార్కు 4:22) అప్పుడు దావీదు ఏమి చేశాడు?

గతంలో చేసిన పాపాలు (11-14 పేరాలు చూడండి)

11, 12. (ఎ) పాపం చేసిన తర్వాత, దావీదు చేయలేనిది ఏమిటి? (బి) మనం పశ్చాత్తాపం చూపిస్తే యెహోవా మనకు ఏమి చేస్తాడు?

11 దావీదు చేయలేనివి: తనవల్ల జరిగిపోయిన వాటిని దావీదు మార్చలేడు. నిజానికి, చేసిన పాపంవల్ల కలిగే కొన్ని పర్యవసానాల్ని దావీదు తన మిగిలిన జీవితంలో అనుభవించక తప్పదు. (2 సమూ. 12:10-12, 14-15) కాబట్టి అతనికి విశ్వాసం అవసరమైంది. అయితే నిజంగా పశ్చాత్తాపం చూపిస్తే, యెహోవా తనను క్షమిస్తాడని, తన పాపంవల్ల వచ్చే పర్యవసానాల్ని సహించడానికి సహాయం చేస్తాడని దావీదు నమ్మకముంచాలి.

12 మనం అపరిపూర్ణులం కాబట్టి అందరం పాపం చేస్తాం. కానీ కొన్ని పాపాలు చాలా ఘోరమైనవి, కొన్నిసార్లయితే వాటిని ఎప్పటికీ సరిదిద్దుకోలేం. మనం కూడా చేసిన తప్పులకు పర్యవసానాలు అనుభవించాల్సి రావచ్చు. (గల. 6:7) కానీ ఒకవేళ మనం పశ్చాత్తాపపడితే, మన కష్టసమయాల్లో మనకు సహాయం చేస్తానని యెహోవా మాట ఇస్తున్నాడు. అయితే ఆ కష్టాలు మనం చేసిన పొరపాట్ల వల్ల వచ్చినవే అయినా ఆ సమయంలో యెహోవామీద నమ్మకం ఉంచుతాం.—యెషయా 1:18, 19; అపొస్తలుల కార్యములు 3:19 చదవండి.

13. దావీదు యెహోవా స్నేహాన్ని మళ్లీ ఎలా పొందాడు?

13 దావీదు చేయగలిగినవి: దావీదు యెహోవా స్నేహాన్ని మళ్లీ పొందాలనుకున్నాడు. అందుకోసం ఏమి చేశాడు? అతను యెహోవా సహాయం తీసుకున్నాడు. ఉదాహరణకు, ప్రవక్తయైన నాతాను ఇచ్చిన దిద్దుబాటును దావీదు అంగీకరించాడు. (2 సమూ. 12:13) అతను యెహోవాకు ప్రార్థించి తన పాపాల్ని ఒప్పుకున్నాడు. అలా చేయడం ద్వారా యెహోవా అనుగ్రహాన్ని తాను మళ్లీ కోరుకుంటున్నానని దావీదు చూపించాడు. (కీర్త. 51:1-17) అపరాధ భావంతో కృంగిపోయే బదులు, దావీదు తన పొరపాట్ల నుండి పాఠం నేర్చుకున్నాడు. అలాంటి ఘోరమైన పాపాల్ని అతను మళ్లీ ఎప్పుడూ చేయలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను నమ్మకమైన వ్యక్తిగా చనిపోయాడు, యెహోవా కూడా అతన్ని అలాంటి వ్యక్తిగానే గుర్తుపెట్టుకున్నాడు.—హెబ్రీ. 11:32-34.

14. దావీదు నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

14 దావీదు నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? మనం ఒకవేళ ఘోరమైన పాపం చేస్తే, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడాలి, మన పాపాన్ని యెహోవా ముందు ఒప్పుకోవాలి, క్షమాపణ అడగాలి. (1 యోహా. 1:9) అంతేకాదు చేసిన పాపం గురించి పెద్దలతో కూడా మాట్లాడాలి. ఎందుకంటే యెహోవా స్నేహాన్ని మళ్లీ పొందడానికి వాళ్లు మనకు సహాయం చేయగలరు. (యాకోబు 5:14-16 చదవండి.) మనం యెహోవా సహాయం తీసుకున్నప్పుడు, మనల్ని క్షమిస్తానని ఆయన ఇచ్చిన మాట మీద మనకు నమ్మకం ఉందని చూపిస్తాం. దానితోపాటు, మనం మన పొరపాట్ల నుండి పాఠాలు నేర్చుకుంటూ, నమ్మకంతో యెహోవాను సేవిస్తూ ఉండాలి.—హెబ్రీ. 12:12, 13.

వేరే పరిస్థితుల్లో

ఆరోగ్య సమస్యలు (15వ పేరా చూడండి)

15. మనం హన్నా నుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు?

15 ఇతర నమ్మకమైన సేవకులు, కష్ట పరిస్థితుల్లో తాము చేయగలిగేవి చేస్తూ యెహోవాపై ఎలా నమ్మకం ఉంచారో మీరు ఆలోచించవచ్చు. ఉదాహరణకు, ఒకానొక సమయంలో హన్నాకు పిల్లలు లేరు. ఆ సమస్యను పరిష్కరించే సామర్థ్యం ఆమెకు లేదు. కానీ యెహోవా తనను ఓదారుస్తాడని ఆమె నమ్మింది. అందుకే ఆమె గుడారం వద్ద యెహోవాను ఆరాధిస్తూ, ఆయనకు ప్రార్థనలో తన భావాలను చెప్పుకుంది. (1 సమూ. 1:9-11) ఆమె ఎంత చక్కటి ఆదర్శమో కదా! మనం పరిష్కరించలేని అనారోగ్యం లేదా ఇతర సమస్యలు మనకు ఉన్నప్పుడు, మన ఆందోళనంతా యెహోవా మీద వేసి, ఆయనే మనల్ని చూసుకుంటాడనే నమ్మకంతో ఉంటాం. (1 పేతు. 5:6, 7) అంతేకాదు మీటింగ్స్‌ నుండి, యెహోవా సంస్థ ఏర్పాటు చేస్తున్న ఇతర కార్యక్రమాల నుండి ప్రయోజనం పొందడానికి చేయగలిగింది చేస్తాం.—హెబ్రీ. 10:24, 25.

యెహోవాను సేవించడం ఆపేసిన పిల్లలు (16వ పేరా చూడండి)

16. తల్లిదండ్రులు సమూయేలు నుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు?

16 కొంతమంది పిల్లలు యెహోవాను సేవించడం ఆపేస్తున్నారు. అలాంటి పిల్లలున్న నమ్మకమైన తల్లిదండ్రుల సంగతేమిటి? ప్రవక్తయైన సమూయేలు ఎదిగిన తన పిల్లల్ని యెహోవాకు నమ్మకంగా ఉండమని బలవంతం చేయలేదు. (1 సమూ. 8:1-3) ఆ విషయాన్ని అతను యెహోవాకు వదిలేయాల్సి వచ్చింది. అయితే, సమూయేలు మాత్రం దేవునికి నమ్మకంగా ఉంటూ ఆయన్ని సంతోషపెట్టడానికి చేయగలిగింది చేశాడు. (సామె. 27:11) నేడు, చాలామంది తల్లిదండ్రులు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. యేసు చెప్పిన తప్పిపోయిన కుమారుని ఉపమానంలోని తండ్రిలా, పశ్చాత్తాపపడిన పాపులను తిరిగి చేర్చుకోవడానికి యెహోవా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని వాళ్లు నమ్ముతారు. (లూకా 15:20) ఈలోగా, తమ మంచి ఆదర్శాన్నిబట్టి పిల్లలు మళ్లీ యెహోవాకు దగ్గరౌతారని ఆశిస్తూ, తల్లిదండ్రులు యెహోవాకు నమ్మకంగా ఉండడం మీద మనసుపెట్టవచ్చు.

సరిపడా డబ్బు లేకపోవడం (17వ పేరా చూడండి)

17. పేద విధవరాలు చూపించిన ఆదర్శం మనకెందుకు ప్రోత్సాహాన్నిస్తుంది?

17 మరో మంచి ఆదర్శం ఎవరంటే యేసు కాలంలోని పేద విధవరాలు. (లూకా 21:1-4 చదవండి.) ఆలయంలో జరుగుతున్న అవినీతిని ఆపడానికి ఆమె చేయగలిగిందేమీ లేదు. అంతేకాదు తన పేదరికాన్ని కూడా ఆమె ఏమీ చేయలేదు. (మత్తయి 21:12, 13) కానీ యెహోవా మీద ఆమెకున్న నమ్మకమే సత్యారాధనకు మద్దతిచ్చేలా ఆమెను ప్రోత్సహించింది. ఆమె ఉదారంగా, “రెండు చిన్న నాణేలు” అంటే ఆమె దగ్గరున్న డబ్బు అంతటినీ వేసేసింది. ఆ నమ్మకమైన స్త్రీ యెహోవాను పూర్తిగా నమ్మింది. యెహోవా సేవకు మొదటి స్థానం ఇస్తే తనకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తాడని ఆమెకు తెలుసు. అదేవిధంగా, మనం దేవునికి మొదటి స్థానం ఇస్తే ఆయనే మనకు అవసరమైన వాటిని ఇస్తాడని నమ్ముతాం.—మత్త. 6:33.

18. సరైన ఆలోచనా విధానాన్ని కలిగివున్న ఓ సహోదరుని గురించి చెప్పండి.

18 నేడు చాలామంది సహోదరసహోదరీలు తాము చేయలేని వాటిమీద కాకుండా చేయగలిగే వాటిమీద మనసుపెట్టడం ద్వారా యెహోవా మీద అలాంటి నమ్మకాన్నే చూపిస్తున్నారు. మాల్‌కమ్‌ అనే సహోదరుణ్ణే తీసుకోండి. అతను 2015లో చనిపోయేవరకు నమ్మకంగా జీవించాడు. అతనూ, అతని భార్య చాలా సంవత్సరాలు యెహోవా సేవలో గడిపారు. ఆ సంవత్సరాల్లో వాళ్లు మంచి-చెడు, రెండూ ఎదుర్కొన్నారు. ఆ సహోదరుడు ఇలా చెప్పాడు, “జీవితంలో ఏమి జరుగుతుందో, ఎప్పుడు ఎలా ఉంటుందో కొన్నిసార్లు చెప్పలేము, కష్టమైన పరిస్థితులు కూడా రావచ్చు. కానీ తనమీద ఆధారపడే వాళ్లను యెహోవా దీవిస్తాడు.” మరి మాల్‌కమ్‌ ఇచ్చిన సలహా ఏమిటి? “యెహోవా సేవను వీలైనంత ఫలవంతంగా, ఉత్సాహంగా చేసేలా సహాయం చేయమని ప్రార్థన చేయండి. మీరు చేయలేని వాటిమీద కాకుండా చేయగలిగే వాటిమీద మనసుపెట్టండి.” a

19. (ఎ) మనం 2017 కోసం ఎంపిక చేసుకున్న వార్షిక వచనం సరైనదని ఎందుకు చెప్పవచ్చు? (బి) ఈ సంవత్సరం వార్షిక వచనాన్ని మీ జీవితంలో ఎలా పాటిస్తారు?

19 ఈ లోకం ‘అంతకంతకూ చెడిపోతోంది’ కాబట్టి మన కష్టాలు ఇంకా ఎక్కువౌతాయి. (2 తిమో. 3:1, 13) అయితే కష్టాలవల్ల ఎక్కువ ఆందోళన పడుకుండా ఉండడం ఇంతకుముందుకన్నా ఇప్పుడు మరీ ప్రాముఖ్యం. బదులుగా, యెహోవామీద గట్టి నమ్మకం ఉంచి, మనం చేయగలిగే వాటిమీద మనసుపెట్టాలి. కాబట్టి 2017 కోసం సరైన వార్షిక వచనం ఎంపిక చేసుకున్నామని చెప్పవచ్చు. వార్షిక వచనం ఏమిటంటే: యెహోవామీద నమ్మకం ఉంచి మంచి చేయండి.—కీర్త. 37:3.

2017 వార్షిక వచనం: యెహోవామీద నమ్మకం ఉంచి మంచి చేయండి.​—కీర్త. 37:3.