కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా తన ప్రజల్ని నడిపించాడు

యెహోవా తన ప్రజల్ని నడిపించాడు

“యెహోవా నిన్ను నిత్యము నడిపించును.”యెష. 58:11.

పాటలు: 3, 4

1, 2. (ఎ) యెహోవాసాక్షులకూ ఇతర మతాలవాళ్లకూ మధ్య తేడా ఏమిటి? (బి) ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

 “మీ నాయకుడు ఎవరు” అని ప్రజలు యెహోవాసాక్షుల్ని తరచుగా అడుగుతుంటారు. చాలా మతాల్లో ఓ పురుషుడు లేదా స్త్రీ నాయకత్వం వహించడం సహజం కాబట్టి వాళ్లు అలా అడుగుతుంటారు. అయితే మన నాయకుడు ఓ అపరిపూర్ణ వ్యక్తి కాదని గర్వంగా చెప్పుకుంటాం. అవును, మన నాయకుడు యేసుక్రీస్తు. ఆయన తన తండ్రీ, నాయకుడూ అయిన యెహోవాకు విధేయత చూపిస్తాడు.—మత్త. 23:10.

2 నేడు భూమ్మీద దేవుని ప్రజల్ని నడిపించడానికి కొంతమంది పురుషులు ఉన్నారు. వాళ్లనే “నమ్మకమైన బుద్ధిగల దాసుడు” అని పిలుస్తున్నాం. (మత్త. 24:45) మరైతే యెహోవాయే తన కుమారుని ద్వారా మనల్ని నడిపిస్తున్నాడని మనకెలా తెలుసు? ప్రాచీన కాలం మొదలుకొని, మనకాలం వరకు యెహోవా తన ప్రజల్ని నడిపించడానికి మనుషుల్ని ఎలా ఉపయోగించుకుంటున్నాడో ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. అయితే గతంలో నాయకత్వం వహించిన, ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న మనుషుల వెనుక ఉన్న అసలైన నాయకుడు యెహోవాయే అని చెప్పడానికి గల మూడు రుజువుల్ని ఈ రెండు ఆర్టికల్స్‌లో పరిశీలిస్తాం.—యెష. 58:11.

పవిత్రశక్తి వాళ్లకు బలాన్నిచ్చింది

3. మోషేకు ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి ఏది సహాయం చేసింది?

3 పవిత్రశక్తి దేవుని ప్రతినిధుల్ని బలపర్చింది. ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి దేవుడు మోషేను ఎంచుకున్నాడు. అతి ప్రాముఖ్యమైన ఆ నియామకాన్ని నిర్వహించడానికి మోషేకు ఏది సహాయం చేసింది? యెహోవా అతనికి తన పవిత్రశక్తిని ఇచ్చాడు. (యెషయా 63:11-14 చదవండి.) ఆ పవిత్రశక్తి ద్వారానే మోషే ఇశ్రాయేలీయుల్ని నడిపించగలిగాడు కాబట్టి యెహోవాయే తన ప్రజల్ని నడిపించాడని చెప్పవచ్చు.

4. మోషేకు పవిత్రశక్తి సహాయం ఉందని ప్రజలు ఎలా గ్రహించగలిగారు? (ప్రారంభ చిత్రం చూడండి.)

4 పవిత్రశక్తి సహాయం మోషేకు ఉందని ప్రజలు గ్రహించారా? అవును గ్రహించారు. ఎందుకంటే, యెహోవా ఇచ్చిన పవిత్రశక్తి సహాయంతోనే మోషే అద్భుతాలు చేశాడు, ఐగుప్తు శక్తిమంతమైన పరిపాలకుడైన ఫరోకు యెహోవా గురించి తెలిసేలా చేయగలిగాడు. (నిర్గ. 7:1-3) అంతేకాదు మోషే కాలంలోని ఇతర దేశాల నాయకులు కఠినంగా, స్వార్థపరులుగా ఉండేవాళ్లు. కానీ మోషే మాత్రం పవిత్రశక్తితో ప్రేమగా, సహనంగా ఉంటూ ప్రజల్ని నడిపించగలిగాడు. (నిర్గ. 5:2, 6-9) వీటన్నిటినిబట్టి యెహోవా తన ప్రజల్ని నడిపించడానికి మోషేను ఎంచుకున్నాడని స్పష్టంగా అర్థమౌతుంది.

5. తన ప్రజల్ని నడిపించడానికి యెహోవా ఇంకెవరికి కూడా పవిత్రశక్తి ఇచ్చాడు?

5 తన ప్రజల్ని నడిపించడానికి యెహోవా ఇంకెవరికి కూడా పవిత్రశక్తి ఇచ్చాడు? బైబిలు ఇలా చెప్తుంది, ‘యెహోషువ పవిత్రశక్తితో నిండి ఉన్నాడు.’ (ద్వితీ. 34:9, NW) ‘యెహోవా పవిత్రశక్తి గిద్యోను మీదకు వచ్చింది.’ (న్యాయా. 6:34, NW) ‘యెహోవా పవిత్రశక్తి దావీదును బలవంతున్ని చేయడం మొదలుపెట్టింది.’ (1 సమూ. 16:13, NW) వీళ్లందరూ తమ సొంత శక్తితో చేయలేని పనుల్ని దేవుని పవిత్రశక్తి సహాయంతో చేయగలిగారు. (యెహో. 11:16, 17; న్యాయా. 7:7, 22; 1 సమూ. 17:37, 50) వీళ్లు గొప్ప పనులు చేయడానికి శక్తినిచ్చింది యెహోవాయే కాబట్టి ఆయనే మహిమపర్చబడ్డాడు.

6. తమకు నాయకత్వం వహిస్తున్న వాళ్లను ఇశ్రాయేలీయులు ఎందుకు గౌరవించాలి?

6 మోషే, యెహోషువ, గిద్యోను, దావీదులకు పవిత్రశక్తి సహాయం ఉందని గ్రహించిన ఇశ్రాయేలీయులు ఏమి చేసి ఉండాల్సింది? వాళ్లను గౌరవించాల్సింది. మోషే మీద ప్రజలు ఫిర్యాదు చేసినప్పుడు యెహోవా ఏమన్నాడో చూడండి, “ఎన్నాళ్లవరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు?” (సంఖ్యా. 14:2-3, 11) అవును, తన ప్రజల్ని నడిపించడానికి యెహోవాయే వాళ్లను ఎంచుకున్నాడు. కాబట్టి ప్రజలు వాళ్లను గౌరవిస్తే యెహోవాను నాయకునిగా గుర్తించినట్లే.

దూతలు వాళ్లకు సహాయం చేశారు

7. దూతలు మోషేకు ఎలా సహాయం చేశారు?

7 దూతలు దేవుని ప్రతినిధులకు సహాయం చేశారు. (హెబ్రీయులు 1:7, 14 చదవండి.) మోషేను నిర్దేశించడానికి యెహోవా దూతల్ని ఉపయోగించాడు. మొదటిగా, మోషేకు ఒక దూత “ముళ్లపొదలో” కనిపించి ఇశ్రాయేలీయుల్ని విడిపించి, వాళ్లను నడిపించే నియామకాన్ని ఇచ్చాడు. (అపొ. 7:35) రెండవదిగా, దేవుడు దూతల్ని ఉపయోగించుకుని ఇశ్రాయేలీయులకు బోధించడానికి కావాల్సిన ధర్మశాస్త్రాన్ని మోషేకు ఇచ్చాడు. (గల. 3:19) మూడవదిగా, యెహోవా మోషేతో ఇలా అన్నాడు, “నీవు వెళ్లి నేను నీతో చెప్పినచోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్లును.” (నిర్గ. 32:34) అయితే దూత ఇవన్నీ చేయడం ఇశ్రాయేలీయులు చూశారని బైబిలు చెప్పట్లేదు. కానీ మోషే ప్రజలకు బోధించిన, నిర్దేశించిన విధానాన్నిబట్టి దూతలు అతనికి సహాయం చేశారని స్పష్టమైంది.

8. యెహోషువకు, హిజ్కియాకు దూతలు ఎలా సహాయం చేశారు?

8 దూతలు ఇంకెవరికి కూడా సహాయం చేశారు? “యెహోవా సేనాధిపతిగా” వచ్చిన ఒక దూత, కనానీయులపై విజయం సాధించడానికి యెహోషువకు సహాయం చేశాడని బైబిలు చెప్తుంది. (యెహో. 5:13-15; 6:2, 21) ఆ తర్వాత రాజైన హిజ్కియా పరిపాలనలో, అష్షూరీయుల గొప్ప సైన్యం యెరూషలేమును నాశనం చేస్తానని బెదిరించింది. కానీ ఒక్క రాత్రిలోనే “యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి లక్ష యెనుబది యయిదు వేలమందిని హతముచేసెను.”—2 రాజు. 19:35.

9. నాయకత్వం వహించేవాళ్లు అపరిపూర్ణులైనప్పటికీ ఇశ్రాయేలీయులు ఏమి చేయాలని యెహోవా కోరుకున్నాడు?

9 దూతలు పరిపూర్ణులు. కానీ వాళ్లు సహాయం చేసిన మనుషులు పరిపూర్ణులు కాదు. ఉదాహరణకు ఒక సందర్భంలో మోషే యెహోవాను ఘనపర్చలేకపోయాడు. (సంఖ్యా. 20:12) గిబియోనీయులు యెహోషువతో సంధి చేసుకోవడానికి వచ్చినప్పుడు, అతను యెహోవా అభిప్రాయాన్ని అడగలేదు. (యెహో. 9:14, 15) ఒకానొక సమయంలో హిజ్కియా గర్వంగా ప్రవర్తించాడు. (2 దిన. 32:25, 26) వాళ్లు అపరిపూర్ణులైనప్పటికీ వాళ్ల నాయకత్వానికి ఇశ్రాయేలీయులు విధేయత చూపించాలని యెహోవా కోరుకున్నాడు. నాయకత్వం వహిస్తున్న వాళ్లకు సహాయం చేయడానికి యెహోవా దూతల్ని ఉపయోగించుకుంటున్నాడని ఇశ్రాయేలీయులు గుర్తించారు. అవును, యెహోవాయే తన ప్రజల్ని నడిపిస్తున్నాడు.

దేవుని వాక్యం వాళ్లకు సహాయం చేసింది

10. దేవుని ధర్మశాస్త్రం మోషేను ఎలా నిర్దేశించింది?

10 దేవుని వాక్యం తన ప్రతినిధులను నిర్దేశించింది. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని, “మోషే ధర్మశాస్త్రము” అని బైబిలు పిలుస్తోంది. (1 రాజు. 2:3) అయితే ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది యెహోవాయే అని బైబిలు స్పష్టంగా చెప్తోంది. అంతేకాదు మోషే కూడా ఆ ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. (2 దిన. 34:14) అందుకు ఓ ఉదాహరణ ఏమిటంటే గుడారాన్ని నిర్మించే సమయంలో ‘యెహోవా తనకు ఆజ్ఞాపించిన వాటన్నిటి ప్రకారం మోషే చేశాడు. అతను సరిగ్గా అలాగే చేశాడు.’—నిర్గ. 40:1-16, NW.

11, 12. (ఎ) యోషీయా అలాగే ఇతర రాజులు ఏమి చేయాల్సిన అవసరం ఉండేది? (బి) నాయకత్వం వహించిన పురుషులను దేవుని వాక్యం ఎలా నడిపించింది?

11 యెహోషువ నాయకుడు అయినప్పుడు అతని దగ్గర దేవుని వాక్యం ఉండేది. యెహోవా అతనికి ఇలా చెప్పాడు, ‘దానిలో రాయబడి ఉన్నవాటన్నిటినీ జాగ్రత్తగా పాటించేలా రాత్రీపగలూ దాన్ని చిన్న స్వరంతో చదవాలి.’ (యెహో. 1:8, NW) తర్వాతి కాలంలో దేవుని ప్రజల్ని పరిపాలించిన రాజులు కూడా ప్రతీరోజు ధర్మశాస్త్రాన్ని చదవాలి, తమకోసం ఒక ప్రతిని రాసుకోవాలి. అంతేకాదు, వాళ్లు ‘ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని, కట్టడలను అనుసరించి నడవాలి.’ద్వితీయోపదేశకాండము 17:18-22చదవండి.

12 నాయకత్వం వహించిన పురుషులను దేవుని వాక్యం ఎలా నిర్దేశించింది? ఉదాహరణకు, రాజైన యోషీయా గురించి ఆలోచించండి. మోషే ధర్మశాస్త్రం దొరికిన తర్వాత, కార్యదర్శి దాన్ని యోషీయా రాజుకు చదివి వినిపించడం మొదలుపెట్టాడు. a ‘రాజు ధర్మశాస్త్రంలోని మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకున్నాడు.’ దేశంలో ఉన్న విగ్రహాలన్నిటినీ నాశనం చేసి, అంతకుముందెప్పుడూ జరగనంత అతిపెద్ద పస్కా పండుగను ఏర్పాటు చేసేలా దేవుని వాక్యం అతన్ని ప్రోత్సహించింది. (2 రాజు. 22:11; 23:1-23) యోషీయా, ఇతర నమ్మకమైన నాయకులు దేవుని వాక్యాన్ని పాటించారు కాబట్టే ప్రజలకు వాళ్లు ఇచ్చే నిర్దేశాల్ని మార్చుకోవడానికి ఇష్టపడ్డారు. దానివల్ల ప్రజలు యెహోవాకు లోబడడం వీలైంది.

13. దేవుని ప్రజల్ని నడిపించే నాయకులకు, ఇతర జనాంగాల నాయకులకు ఉన్న తేడా ఏమిటి?

13 ఇతర జనాంగాల నాయకులు తమకున్న తక్కువ జ్ఞానాన్నిబట్టి నడుచుకున్నారు. ఉదాహరణకు కనానీయుల నాయకులు, వాళ్ల ప్రజలు రక్తసంబంధులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, సలింగ సంయోగం, జంతువులతో సంపర్కం, పిల్లల్ని బలివ్వడం, విగ్రహారాధన వంటి ఘోరమైన పనులు చేశారు. (లేవీ. 18:6, 21-25) అంతేకాదు, పరిశుద్ధత విషయంలో దేవుని ప్రజలు పాటిస్తున్నలాంటి నియమాలు బబులోనీయుల, ఐగుప్తీయుల నాయకులకు లేవు. (సంఖ్యా. 19:13) కానీ దేవుని ప్రజల్ని నడిపిస్తున్న నాయకులు మాత్రం స్వచ్ఛమైన ఆరాధన చేయాలనీ, నైతికంగా-శారీరకంగా పరిశుభ్రంగా ఉండాలనీ ప్రజల్ని ప్రోత్సహించేవాళ్లు. వాటన్నిటిని బట్టి యెహోవాయే తన ప్రజల్ని నడిపించాడని చెప్పవచ్చు.

14. యెహోవా కొంతమంది నాయకులకు ఎందుకు క్రమశిక్షణ ఇచ్చాడు?

14 అయితే, దేవుని ప్రజల్ని పరిపాలించిన రాజుల్లో కొంతమంది యెహోవా నిర్దేశాల్ని పాటించలేదు. వాళ్లు పవిత్రశక్తి, దూతలు, దేవుని వాక్యం ఇచ్చే నడిపింపును తిరస్కరించారు. కొన్ని సందర్భాల్లో యెహోవా అలాంటివాళ్లకు క్రమశిక్షణ ఇచ్చాడు లేదా వాళ్ల స్థానంలో వేరే వాళ్లను నియమించాడు. (1 సమూ. 13:13, 14) కొంతకాలానికి, మనుషులందరి కన్నా ఎంతో ఉన్నతమైన ఓ వ్యక్తిని యెహోవా నాయకునిగా నియమించాడు.

యెహోవా ఓ పరిపూర్ణ వ్యక్తిని నాయకునిగా నియమించడం

15. (ఎ) ఓ పరిపూర్ణ నాయకుడు రాబోతున్నాడని ప్రవక్తలు ఎలా చూపించారు? (బి) పరిపూర్ణ నాయకుడు ఎవరు?

15 తన ప్రజల్ని నడిపించడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తిని నాయకునిగా నియమిస్తానని వందల సంవత్సరాలుగా యెహోవా మాటిస్తూ వచ్చాడు. ఉదాహరణకు, మోషే ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు, “నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను.” (ద్వితీ. 18:16) ఆయనే ‘జనములకు నాయకునిగా, అధిపతిగా’ ఉంటాడని యెషయా చెప్పాడు. (యెష. 55:4, NW) ‘నాయకుడిగా’ ఉండబోయే మెస్సీయ గురించి దానియేలు కూడా రాశాడు. (దాని. 9:25, NW) చివరిగా, యేసుక్రీస్తే స్వయంగా తాను దేవుని ప్రజలకు ‘నాయకుడినని’ చెప్పాడు. (మత్తయి 23:10 చదవండి.) యేసు శిష్యులు ఆయన్ని ఇష్టంగా అనుకరించారు, యెహోవా ఎంపిక చేసుకున్నది ఆయన్నేనని నమ్మారు. (యోహా. 6:68, 69) తన ప్రజల్ని నడిపించడానికి యెహోవా ఎంచుకున్న వ్యక్తి యేసేనని శిష్యులు దేన్నిబట్టి నమ్మారు?

16. పవిత్రశక్తి యేసుకు బలాన్నిచ్చిందని ఏ విధంగా చెప్పవచ్చు?

16 పవిత్రశక్తి యేసుకు బలాన్నిచ్చింది. యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు “ఆకాశం తెరుచుకోవడం, పవిత్రశక్తి పావురం రూపంలో” యేసు మీదకు రావడం యోహాను చూశాడు. అది జరిగిన వెంటనే “యేసు అరణ్యంలోకి వెళ్లేలా పవిత్రశక్తి ఆయన్ని బలంగా ప్రేరేపించింది.” (మార్కు 1:10-12) యేసు భూపరిచర్య అంతటిలో ఆయన ఇతరులకు బోధించేలా, అద్భుతాలు చేసేలా దేవుని పవిత్రశక్తి సహాయం చేసింది. (అపొ. 10:38) అంతేకాదు యేసు ప్రేమ, సంతోషం, బలమైన విశ్వాసం చూపించేలా పవిత్రశక్తి సహాయం చేసింది. (యోహా. 15:9; హెబ్రీ. 12:2) వేరే ఏ నాయకుని మీద దేవుని పవిత్రశక్తి ఇంతలా పని చేసినట్లు ఆధారాలు లేవు. ఈ కారణాల్ని బట్టి, నాయకునిగా ఉండడానికి యెహోవా ఎంచుకున్న వ్యక్తి యేసేనని స్పష్టంగా తెలుస్తోంది.

యేసు బాప్తిస్మం తీసుకున్న తర్వాత దూతలు ఆయనకు ఎలా సహాయం చేశారు? (17వ పేరా చూడండి)

17. యేసుకు దూతలు ఎలా సహాయం చేశారు?

17 దూతలు యేసుకు సహాయం చేశారు. యేసు బాప్తిస్మం తీసుకున్న కొన్ని రోజులకు, “దేవదూతలు వచ్చి ఆయనకు సేవ చేయడం మొదలుపెట్టారు.” (మత్త. 4:11) ఆయన చనిపోవడానికి కొన్ని గంటల ముందు, “పరలోకం నుండి వచ్చిన ఒక దేవదూత ఆయనకు కనిపించి, ఆయన్ని బలపర్చాడు.” (లూకా 22:43) తనకు అవసరమైనప్పుడల్లా యెహోవా దూతల్ని పంపి తప్పకుండా సహాయం చేస్తాడని యేసుకు తెలుసు.—మత్త. 26:53.

18, 19. దేవుని వాక్యం యేసు జీవితాన్ని, ఆయన బోధల్ని ఎలా నిర్దేశించింది?

18 దేవుని వాక్యం యేసును నిర్దేశించింది. యేసు తన పరిచర్య ఆరంభం నుండి హింసాకొయ్య మీద చనిపోయే వరకు లేఖనాల నిర్దేశాల్ని పాటించాడు. ఆయన చనిపోయేటప్పుడు కూడా మెస్సీయకు సంబంధించిన ప్రవచనాల్ని ప్రస్తావించాడు. (మత్త. 4:4; మత్త. 27:46; లూకా 23:46) కానీ ఆ కాలంలోని మతనాయకులు యేసుకు పూర్తి భిన్నంగా ఉండేవాళ్లు. వాళ్ల సొంత బోధలకు, లేఖనాల్లోని విషయాలకు పొంతన లేనప్పుడు దేవుని వాక్యాన్ని పట్టించుకునేవాళ్లు కాదు. అందుకే యేసు వాళ్ల గురించి మాట్లాడుతున్నప్పుడు లేఖనాల్లోని ఈ మాటల్ని ఎత్తి చెప్పాడు, “ఈ ప్రజలు పెదవులతో నన్ను కీర్తిస్తారు కానీ వీళ్ల హృదయాల్లో నా మీద ప్రేమ లేదు. వీళ్లు మనుషులు పెట్టిన నియమాల్ని దేవుని బోధలన్నట్టు బోధిస్తారు కాబట్టి వీళ్లు నన్ను ఆరాధిస్తూ ఉండడం వృథా.” (మత్త. 15:7-9) తన వాక్యం పాటించని వాళ్లను తన ప్రజల్ని నడిపించడానికి యెహోవా ఎన్నడూ ఉపయోగించుకోడు.

19 యేసు ఇతరులకు బోధించేటప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ఉపయోగించాడు. మతనాయకులు తనను ప్రశ్నించినప్పుడు యేసు తన సొంత తెలివిని లేదా అనుభవాన్ని ఉపయోగించి జవాబు చెప్పలేదు. బదులుగా, ఆయన లేఖనాలను ఉపయోగించి ప్రజలకు బోధించాడు. (మత్త. 22:33-40) ఆయన కావాలనుకుంటే పరలోకంలో తన జీవితంలో ఎలా ఉండేదో లేదా విశ్వాన్ని సృష్టించినప్పుడు తాను ఏమేమి చేశాడో చెప్పి ప్రజల్ని ఆకట్టుకోగలడు. కానీ యేసుకు దేవుని వాక్యం మీద ప్రేమ ఉంది కాబట్టి అందులో ఉన్న విషయాల్ని ఇతరులతో పంచుకోవాలని ఎంతో కోరుకున్నాడు. అందుకే, “వాళ్లు లేఖనాల అర్థాన్ని పూర్తిగా గ్రహించేలా ఆయన వాళ్ల మనసుల్ని” తెరిచాడు.—లూకా 24:32, 45.

20. (ఎ) యేసు యెహోవాను ఎలా ఘనపర్చాడు? (బి) యేసుకు, హేరోదు అగ్రిప్పకు మధ్య తేడా ఏమిటి?

20 యేసు, ‘మనోహరమైన మాటలతో’ ప్రజల్ని ఆశ్చర్యపర్చినప్పటికీ, ఆయన తన బోధకుడైన యెహోవాకే ఘనత ఇచ్చాడు. (లూకా 4:22) ఓ ధనవంతుడైన వ్యక్తి యేసును “మంచి బోధకుడా” అనే బిరుదుతో ఘనపర్చడానికి ప్రయత్నించినప్పుడు, యేసు వినయంగా ఇలా అన్నాడు, “నన్ను మంచివాడని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప మంచివాళ్లెవరూ లేరు.” (మార్కు 10:17, 18) అయితే యేసు చనిపోయిన దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత హేరోదు అగ్రిప్ప I యూదయకు నాయకుడు అయ్యాడు. అతను యేసులాంటి వైఖరిని చూపించలేదు. ఒక రోజు, ఓ ప్రత్యేకమైన కూటంలో హేరోదు చాలా ఖరీదైన, ఆకర్షణీయమైన రాజవస్త్రాన్ని వేసుకున్నాడు. ప్రజలు అతన్ని చూసినప్పుడు, అతని మాటలు విన్నప్పుడు, “ఇది దేవుని స్వరమే కానీ మనిషి స్వరం కాదు!” అని అరవడం మొదలుపెట్టారు. హేరోదు తనకు ఘనత రావాలని కోరుకున్నాడు. తర్వాత ఏమి జరిగింది? “అతను దేవుణ్ణి మహిమపర్చలేదు కాబట్టి వెంటనే యెహోవా దూత అతన్ని జబ్బుపడేలా చేశాడు. దాంతో అతను పురుగులు పడి చనిపోయాడు.” (అపొ. 12:21-23) యెహోవా హేరోదును నాయకునిగా ఎంచుకోలేదని స్పష్టంగా అర్థమౌతోంది. కానీ యెహోవా తనను ఎంచుకున్నాడని యేసు నిరూపించాడు, యెహోవాయే తన ప్రజల అత్యున్నత నాయకుడని ఎల్లప్పుడూ ఘనపర్చాడు.

21. తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

21 యేసు కేవలం కొన్ని సంవత్సరాలే నాయకుడిగా ఉండాలని యెహోవా కోరుకోలేదు. పునరుత్థానమైన తర్వాత యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు, “పరలోకంలో, భూమ్మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది . . . ఇదిగో! ఈ వ్యవస్థ ముగింపు వరకు నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను.” (మత్త. 28:18-20) అయితే యేసు పరలోకంలో ఆత్మప్రాణిగా ఉంటూ భూమ్మీద దేవుని ప్రజల్ని ఎలా నడిపిస్తాడు? యేసుకు భూమ్మీద ప్రాతినిధ్యం వహించడానికి యెహోవా ఎవరిని ఉపయోగించుకుంటాడు? దేవుని ప్రతినిధుల్ని క్రైస్తవులు ఎలా గుర్తించవచ్చు? ఈ ప్రశ్నలన్నిటికీ తర్వాతి ఆర్టికల్‌లో జవాబులు తెలుసుకుంటాం.

a బహుశా ఇది మోషే రాసిన అసలు ప్రతి అయ్యుంటుంది.