కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘నీ మొక్కుబడి చెల్లించు’

‘నీ మొక్కుబడి చెల్లించు’

“మీరు యెహోవాకు చేసుకున్న మొక్కుబళ్లను చెల్లించాలి.”మత్త. 5:33.

పాటలు: 18, 7

1. (ఎ) యెఫ్తాకు, హన్నాకు ఉన్న పోలిక ఏమిటి? (ప్రారంభ చిత్రాలు చూడండి.) (బి) ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

 యెఫ్తా ధైర్యంగల నాయకుడు, వెన్నుచూపని యోధుడు. హన్నా తన భర్తను, ఇంటిని శ్రద్ధగా చూసుకునే వినయంగల స్త్రీ. వీళ్లిద్దరూ యెహోవా ఆరాధకులే. అయితే వాళ్లిద్దరికి ఒక పోలిక ఉంది. అదేంటంటే యెఫ్తా, హన్నా ఇద్దరూ యెహోవాకు మొక్కుబడి చేసుకున్నారు, దానికి నమ్మకంగా కట్టుబడి ఉన్నారు కూడా. నేడు యెహోవాకు మొక్కుబడి చేసుకోవాలనుకునే వాళ్లకు యెఫ్తా, హన్నా చక్కని ఆదర్శం ఉంచారు. ఇంతకీ మొక్కుబడి అంటే ఏమిటి? దేవునికి మొక్కుబడి చేసుకోవడం ఎందుకు అంత ప్రాముఖ్యమైనది? యెఫ్తా, హన్నా నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? ఈ మూడు ప్రశ్నలకు ఈ ఆర్టికల్‌లో జవాబులు తెలుసుకుందాం.

2, 3. (ఎ) మొక్కుబడి అంటే ఏమిటి? (బి) దేవునికి చేసుకునే మొక్కుబడి గురించి లేఖనాలు ఏమి చెప్తున్నాయి?

2 బైబిలు ప్రకారం మొక్కుబడి చేసుకోవడం అంటే దేవునికి చేసే ఒక ప్రాముఖ్యమైన ప్రమాణం. ఉదాహరణకు ఒకవ్యక్తి, ఏదైనా పని చేస్తానని, ఒక కానుక ఇస్తానని, ఫలానా సేవలో అడుగుపెడతానని, లేదా కొన్ని పనులకు దూరంగా ఉంటానని యెహోవాకు ప్రమాణం చేయవచ్చు. అయితే మొక్కుబడి అనేది స్వేచ్ఛాచిత్తాన్ని ఉపయోగించి, ఎవ్వరి బలవంతం లేకుండా చేసుకునేది. కానీ ఒక వ్యక్తి ఏదైనా చేస్తానని మొక్కుబడి చేసుకుంటే యెహోవా ఆ ప్రమాణాన్ని చాలా ప్రాముఖ్యమైనదిగా చూస్తాడు. అంతేకాదు ఆ వ్యక్తి తాను చేసుకున్న మొక్కుబడిని గౌరవించాలని, దానికి కట్టుబడి ఉండాలని యెహోవా కోరుకుంటాడు. ఒట్టేసిన పనిని చేయడం ఎంత ప్రాముఖ్యమో, మొక్కుబడిని చెల్లించడం కూడా అంతే ప్రాముఖ్యమని బైబిలు చెప్తుంది. ఒట్టేయడం అంటే ఒకవ్యక్తి ఏదైనా పని చేస్తానని లేదా చేయనని ప్రమాణం చేయడం. (ఆది. 14:22, 23; హెబ్రీ. 6:16, 17) దేవునికి మనం చేసుకునే మొక్కుబడిని ఎంత ప్రాముఖ్యంగా ఎంచాలని బైబిలు చెప్తోంది?

3 ఒక వ్యక్తి యెహోవాకు మొక్కుబడి చేసుకుంటే, ‘అతను మాట తప్పకూడదు. తాను చేస్తానని మాటిచ్చిన ప్రతీది అతను చేయాలి’ అని మోషే ధర్మశాస్త్రంలో ఉంది. (సంఖ్యా. 30:2, NW) తర్వాత సొలొమోను ఇలా రాశాడు, “నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము; బుద్ధిహీనులయందు ఆయన కిష్టములేదు. నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము.” (ప్రసం. 5:4, 5) దేవునికి చేసుకున్న మొక్కుబడి చాలా ప్రాముఖ్యంగా ఎంచాలని చెప్తూ యేసు ఇలా అన్నాడు, “‘మీరు ఒట్టు పెట్టుకుని దాన్ని తప్పకూడదు, కానీ మీరు యెహోవాకు చేసుకున్న మొక్కుబళ్లను చెల్లించాలి’ అని పూర్వీకులతో చెప్పబడిందని మీరు విన్నారు కదా.”—మత్త. 5:33.

4. (ఎ) దేవునికి చేసే మొక్కుబడి ఎంత ప్రాముఖ్యమైనది? (బి) యెఫ్తా, హన్నాలకు సంబంధించి మనం ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

4 మనం యెహోవాకు చేసే ఏ ప్రమాణాన్నైనా చాలా ప్రాముఖ్యమైనదిగా ఎంచాలని స్పష్టంగా అర్థమౌతుంది. మొక్కుబడులను మనం చూసే విధానం యెహోవాతో మనకున్న సంబంధంపై ప్రభావం చూపిస్తుంది. ఆ విషయాన్ని దావీదు స్పష్టం చేస్తూ ఇలా అన్నాడు, “యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? . . . కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే.” (కీర్త. 24:3, 4) ఇంతకీ యెఫ్తా, హన్నా యెహోవాకు చేసుకున్న మొక్కుబడులు ఏమిటి? వాటిని చెల్లించడం తేలికేనా?

వాళ్లు దేవునికి చేసుకున్న మొక్కుబడిని చెల్లించారు

5. యెఫ్తా ఏ మొక్కుబడి చేసుకున్నాడు? దాని ఫలితమేమిటి?

5 యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్లేముందు యెహోవాకు ఒక ప్రమాణం చేశాడు. అమ్మోనీయులు దేవుని ప్రజల శత్రువులు. కాబట్టి వాళ్లపై విజయం సాధించేలా సహాయం చేయమని యెఫ్తా యెహోవాను వేడుకున్నాడు. (న్యాయా. 10:7-9) అంతేకాదు అతను ఇలా మొక్కుబడి చేసుకున్నాడు, “నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించినయెడల నేను అమ్మోనీయులయొద్దనుండి క్షేమముగా తిరిగివచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొనుటకు నా యింటిద్వారమునుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును.” యెఫ్తా యుద్ధంలో గెలిచేలా సహాయం చేయడం ద్వారా యెహోవా అతని ప్రార్థనకు జవాబిచ్చాడు. అయితే యెఫ్తా ఇంటికి వెళ్లినప్పుడు, అతని కూతురే మొదటిగా ఎదురొచ్చింది. కాబట్టి ఆమె ‘యెహోవాకు ప్రతిష్ఠితమవ్వాలి.’ (న్యాయా. 11:30-34) అంటే ఆమె ఏమి చేయాలి?

6. (ఎ) దేవునికి చేసుకున్న మొక్కుబడి చెల్లించడం యెఫ్తాకు, అతని కూతురుకు తేలికేనా? (బి) మొక్కుబడుల గురించి ద్వితీయోపదేశకాండము 23:21, 23; కీర్తన 15:4 లేఖనాల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

6 యెఫ్తా చేసుకున్న మొక్కుబడిని చెల్లించాలంటే అతని కూతురు గుడారానికి వెళ్లి యెహోవా సేవకే అంకితమవ్వాలి. అయితే యెఫ్తా దీనిగురించి ఏమాత్రం ఆలోచించకుండానే ఆ ప్రమాణం చేశాడా? లేదు. తనను కలవడానికి తన కూతురే మొదటిగా ఎదురొస్తుందని బహుశా యెఫ్తా ఊహించి ఉండవచ్చు. అయితే ఆ విషయం అతనికి తెలిసినా, తెలియకపోయినా యెహోవాకు చేసుకున్న ఆ మొక్కుబడిని చెల్లించడం అతనికి, అతని కూతురికి అంత తేలిక కాదు. అందుకే యెఫ్తా తన కూతుర్ని చూసినప్పుడు, ‘నువ్వు నా గుండెను బద్దలు చేశావు’ అని అన్నాడు. తర్వాత అతని కూతురు తన ‘కన్యత్వం గురించి ఏడ్వడానికి’ వెళ్లిపోయింది. యెఫ్తాకు కొడుకులు లేరు, పైగా ఇప్పుడు తన ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేసుకోకూడదు, పిల్లల్ని కనకూడదు. యెఫ్తా వంశం అక్కడితో ఆగిపోతుంది. అయితే యెఫ్తా, అతని కూతురు వాటికి అంత ప్రాముఖ్యతను ఇవ్వలేదు. యెఫ్తా ఇలా అన్నాడు, ‘నేను యెహోవాకు మాటిచ్చాను, దాన్ని వెనక్కి తీసుకోలేను.’ దానికి అతని కూతురు, ‘నువ్వు మాటిచ్చినట్లే నాకు చేయి’ అని చెప్పింది. (న్యాయా. 11:35-39, NW) యెఫ్తా, అతని కూతురు నమ్మకమైన యెహోవా సేవకులు. అందుకే దేవునికి చేసుకున్న మొక్కుబడిని చెల్లించకుండా తప్పించుకోవాలనే ఆలోచనను కూడా వాళ్లు ఎన్నడూ రానివ్వలేదు. మొక్కుబడిని చెల్లించడం కష్టంగా ఉన్నప్పటికీ వాళ్లు దానికి కట్టుబడి ఉన్నారు.—ద్వితీయోపదేశకాండము 23:21, 23; కీర్తన 15:4 చదవండి.

7. (ఎ) హన్నా ఏమని మొక్కుబడి చేసుకుంది, ఎందుకు? దానికి జవాబుగా ఏమి జరిగింది? (బి) హన్నా మొక్కుబడి ప్రకారం సమూయేలు ఏమి చేయాల్సివుంటుంది? (అధస్సూచి చూడండి.)

7 హన్నా కూడా తన జీవితంలో కష్టతరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు యెహోవాకు మొక్కుబడి చేసుకుంది. పిల్లలు లేరని ఆమె బాధపడేది, పైగా ఇతరులు చేసిన ఎగతాళి వల్ల ఆ బాధ మరింత ఎక్కువైంది. (1 సమూ. 1:4-7, 10, 16) అప్పుడు ఆమె తన మనసులోని భావాల్ని యెహోవాకు చెప్పుకుని ఈ ప్రమాణం చేసింది, ‘సైన్యాలకు అధిపతైన యెహోవా, నువ్వు నీ సేవకురాలి బాధను చూసి, నీ సేవకురాలైన నన్ను మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని, నీ సేవకురాలికి ఒక మగ పిల్లవాణ్ణి ఇస్తే, యెహోవా, ఆ అబ్బాయి తాను బ్రతికిన రోజులన్నీ నిన్ను సేవించేలా నీకు ఇస్తాను. అతని తలమీద మంగలి కత్తి పడదు.’ a (1 సమూ. 1:11, NW) ఆ ప్రార్థనకు జవాబుగా ఆ మరుసటి సంవత్సరంలోనే హన్నాకు మగబిడ్డ పుట్టాడు, అతనే సమూయేలు. హన్నా చాలా సంతోషించింది. కానీ ఆమె యెహోవాకు చేసుకున్న మొక్కుబడిని మాత్రం మర్చిపోలేదు. ఆ పిల్లవాడు పుట్టినప్పుడు, ‘నేను ఇతని కోసం యెహోవాను అడిగాను’ అని అంది.—1 సమూ. 1:20, NW.

8. (ఎ) యెహోవాకు చేసుకున్న మొక్కుబడిని చెల్లించడం హన్నాకు తేలికేనా? (బి) 61వ కీర్తనలోని మాటలు హన్నా ఉంచిన మంచి ఆదర్శాన్ని ఎలా గుర్తుచేస్తున్నాయి?

8 సమూయేలుకు దాదాపు మూడేళ్లున్నప్పుడు హన్నా యెహోవాకు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకుంది. షిలోహులోని గుడారంలో సేవచేసే ప్రధాన యాజకుడైన ఏలీ దగ్గరకు సమూయేలును తీసుకెళ్లి ఆమె ఇలా అంది, ‘ఈ బాబు కోసమే నేను ప్రార్థించాను, నేను యెహోవాకు చేసుకున్న విన్నపాన్ని ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు నేను అతన్ని యెహోవాకే ఇస్తున్నాను. అతను బ్రతికిన రోజులన్నీ యెహోవాకే చెందుతాడు.’ (1 సమూ. 1:24-28, NW) అప్పటినుండి సమూయేలు గుడారంలోనే ఉండిపోయాడు. “బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి యెదుగుచుండెను” అని బైబిలు చెప్తుంది. (1 సమూ. 2:21) తాను చేసుకున్న మొక్కుబడిని చెల్లించడం హన్నాకు అంత తేలికేమీ కాదు. ఎందుకంటే ఆమె ఎంతో ఇష్టపడే తన కొడుకైన సమూయేలుతో ప్రతీరోజు సమయం గడపలేదు. అతను పెరిగి పెద్దవ్వడాన్ని కళ్లారా చూసుకోలేదు. కానీ హన్నా యెహోవాకు చేసుకున్న మొక్కుబడిని ప్రాముఖ్యంగా ఎంచింది. అందుకే ఆమె చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండడం కోసం ఆ ఆనందాలన్నిటినీ త్యాగం చేసింది.—1 సమూ. 2:1, 2; కీర్తన 61:1, 5, 8 చదవండి.

మీరు యెహోవాకు చేసుకున్న మొక్కుబడులను చెల్లిస్తున్నారా?

9. ఇప్పుడు మనం వేటిని పరిశీలిస్తాం?

9 యెహోవాకు మొక్కుబడి చేసుకోవడం అనేది ఎంత ప్రాముఖ్యమో ఇప్పుడు మనం అర్థంచేసుకున్నాం. కాబట్టి ఈ ప్రశ్నల్ని పరిశీలిద్దాం, నేడు మనం ఎలాంటి మొక్కుబడులు చేస్తుంటాం? ఆ మొక్కుబడులు చెల్లించాలని మనం ఎంత బలంగా కోరుకోవాలి?

సమర్పణ

సమర్పణ (10వ పేరా చూడండి)

10. క్రైస్తవుడు చేసే అత్యంత ప్రాముఖ్యమైన మొక్కుబడి ఏమిటి? ఆ మొక్కుబడి చెల్లించాలంటే ఏమి చేయాల్సివుంటుంది?

10 ఒక క్రైస్తవుడు చేసుకునే అత్యంత ప్రాముఖ్యమైన మొక్కుబడి ఏంటంటే, తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకోవడం. సమర్పణ అంటే, ఏమి జరిగినా సరే ఎప్పటికీ యెహోవాను సేవించడానికే తన జీవితాన్ని ఉపయోగిస్తానని ఒక వ్యక్తి తన ప్రార్థనలో ప్రమాణం చేయడం. అంటే యేసు చెప్పినట్లుగా, మనం మన “జీవితాన్ని త్యాగం చేసి” మన సొంత కోరికలకు కాకుండా యెహోవాకే మొదటి స్థానం ఇస్తామని ప్రమాణం చేస్తాం. (మత్త. 16:24) ఆరోజు నుండి మనం “యెహోవాకు చెందుతాం.” (రోమా. 14:8) మనం మన సమర్పణను చాలా ప్రాముఖ్యంగా ఎంచుతాం. కీర్తనకర్తలాగే మనం కూడా ఇలా భావిస్తాం, “యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును? యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. ఆయన ప్రజలందరి యెదుటనే చెల్లించెదను.”—కీర్త. 116:12, 14.

11. బాప్తిస్మం తీసుకున్న రోజు మీరు ఏమి చేశారు?

11 మీరు యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్నారా? ఒకవేళ మీరు ఇప్పటికే అలా చేసివుంటే మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం. మీరు బాప్తిస్మం తీసుకున్న రోజు సహోదరుడు ఇచ్చిన సమర్పణ ప్రసంగంలో, ‘మీరు యెహోవాకు మీ జీవితాన్ని సమర్పించుకున్నారా? “మీ సమర్పణ, బాప్తిస్మం ద్వారా యెహోవాసాక్షుల్లో మీరు ఒకరు అవుతారని అర్థంచేసుకున్నారా?”’ అని అడగడం మీకు గుర్తుండివుంటుంది. మీరు “అవును” అనే సమాధానం ఇచ్చినప్పుడు, మీరు మీ జీవితాన్ని యెహోవాకు సమర్పించుకున్నారనీ, నియమిత పరిచారకునిగా బాప్తిస్మానికి అర్హులయ్యారనీ అక్కడ హాజరైన వాళ్లందరూ తెలుసుకున్నారు. మిమ్మల్ని చూసి యెహోవా చాలా సంతోషించివుంటాడు.

12. (ఎ) మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి? (బి) మనం ఏ లక్షణాల్ని పెంచుకోవాలని పేతురు ప్రోత్సహించాడు?

12 మీరు బాప్తిస్మం తీసుకున్నప్పుడు, మీ జీవితాన్ని యెహోవా సేవకోసమే ఉపయోగిస్తారని, ఆయన సూత్రాలు పాటించడానికి చేయగలిగినదంతా చేస్తారని ప్రమాణం చేశారు. అయితే బాప్తిస్మం కేవలం ప్రారంభం మాత్రమే. కాలం గడుస్తుండగా, ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనమిలా ప్రశ్నించుకోవచ్చు, ‘నేను బాప్తిస్మం తీసుకున్న రోజు నుండి ఇప్పటి వరకు యెహోవాతో నా సంబంధం ఎంత బలపడింది? నేను ఇప్పటికీ మనస్ఫూర్తిగా యెహోవాను సేవిస్తున్నానా? (కొలొ. 3:23) క్రమంగా ప్రార్థిస్తున్నానా? ప్రతీరోజు బైబిలు చదువుతున్నానా? మీటింగ్స్‌కి క్రమంగా వెళ్తున్నానా? వీలైనంత ఎక్కువగా ప్రీచింగ్‌ చేస్తున్నానా? లేదా వీటిని చేయడంలో నా ఉత్సాహం ఏమైనా తగ్గిందా?’ యెహోవా సేవ చేసే విషయంలో మనం నిష్క్రియులుగా తయారయ్యే ప్రమాదం ఉందని అపొస్తలుడైన పేతురు హెచ్చరించాడు. ఆ ప్రమాదంలో పడకూడదంటే మన విశ్వాసాన్ని, జ్ఞానాన్ని, సహనాన్ని, దైవభక్తిని పెంచుకోవడానికి కృషిచేయాలి.—2 పేతురు 1:5-8 చదవండి.

13. సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవుడు ఏ విషయాన్ని గుర్తించాలి?

13 యెహోవాకు ఒక్కసారి మొక్కుబడి చేసుకున్నామంటే దాన్ని వెనక్కి తీసుకోలేం. యెహోవా సేవపై లేదా క్రైస్తవుడిగా జీవించడంపై ఆసక్తి కోల్పోయిన వ్యక్తి, తాను దేవునికి నిజంగా సమర్పించుకోలేదని, తన బాప్తిస్మం చెల్లదని చెప్పలేడు. b ఒకవేళ యెహోవాకు సమర్పించుకున్న వ్యక్తి ఏదైనా గంభీరమైన తప్పు చేస్తే అతను యెహోవాకు, సంఘానికి జవాబుదారుడు అవుతాడు. (రోమా. 14:12) యేసు మనల్ని చూసి, “మొదట్లో నీకున్న ప్రేమను నువ్వు వదిలేశావు” అని అనాలని మనం ఎప్పటికీ కోరుకోం. బదులుగా, “నీ పనుల గురించి, నీ ప్రేమ గురించి, నీ విశ్వాసం గురించి, నీ పరిచర్య గురించి, నీ సహనం గురించి నాకు తెలుసు. అలాగే, మొదట్లో నువ్వు చేసిన పనులకన్నా ఈమధ్య చేసిన పనులు మెరుగ్గా ఉన్నాయని కూడా నాకు తెలుసు” అని యేసు మన గురించి చెప్పాలనుకుంటాం. (ప్రక. 2:4, 19) మన సమర్పణకు అనుగుణంగా జీవిస్తూ, యెహోవా సేవను ఉత్సాహంగా చేస్తూ ఆయన్ను సంతోషపెట్టాలని మనం కోరుకుంటాం.

పెళ్లి

పెళ్లి (14వ పేరా చూడండి)

14. ఒక క్రైస్తవుడు తన జీవితంలో చేసే రెండో ప్రాముఖ్యమైన మొక్కుబడి ఏమిటి? అది ఎందుకు ముఖ్యమైనది?

14 ఒక క్రైస్తవుడు తన జీవితంలో చేసే రెండో అత్యంత ప్రాముఖ్యమైన మొక్కుబడి ఏమిటంటే, పెళ్లిప్రమాణం. పెళ్లి అనేది పవిత్రమైన ఏర్పాటు. పెళ్లికి సంబంధించిన మొక్కుబడిని యెహోవా చాలా ప్రాముఖ్యంగా ఎంచుతాడు. పెళ్లిప్రమాణం చేయడమంటే పెళ్లికూతురు-పెళ్లికొడుకు యెహోవా ముందు అలాగే అక్కడ హాజరైనవాళ్ల ముందు మాటిస్తున్నట్లే. ఉదాహరణకు వాళ్లు, దేవుడు ఏర్పాటు చేసిన వివాహ ఏర్పాటు ప్రకారం భూమ్మీద కలిసి జీవించినంతకాలం ఒకరినొకరు ప్రేమించుకుంటామనీ, మద్దతిచ్చుకుంటామనీ, ప్రగాఢంగా గౌరవించుకుంటామనీ మాటిస్తారు. ఇంకొంతమంది ఈ పదాలనే ఉపయోగించకపోయినా వాళ్లు దేవుని ముందు మొక్కుబడి చేసుకుంటారు. ఈ ప్రమాణాలు చేసుకోవడంతో వాళ్లిద్దరూ భార్యాభర్తలు అవుతారు. పెళ్లి చేసుకుంటే జీవితాంతం కలిసివుండాలి. (ఆది. 2:24; 1 కొరిం. 7:39) “దేవుడు ఒకటి చేసినవాళ్లను ఏ మనిషీ విడదీయకూడదు” అని యేసు చెప్పాడు. కాబట్టి పెళ్లి చేసుకునేవాళ్లు, ఒకవేళ తాము ఒకరికొకరు సరిపోమని తర్వాత అనిపిస్తే ఎప్పుడైనా విడాకులు తీసుకోవచ్చని అనుకోకూడదు.—మార్కు 10:9.

15. క్రైస్తవులు పెళ్లిని లోకంలోని వాళ్లలా ఎందుకు చూడకూడదు?

15 అవును, మనుషులు అపరిపూర్ణులు కాబట్టి వివాహబంధంలో సమస్యలు రాకుండా ఉండవు. అందుకే పెళ్లిచేసుకున్న ప్రతీఒక్కరికి “శరీర సంబంధమైన శ్రమలు వస్తాయి” అని బైబిలు చెప్తుంది. (1 కొరిం. 7:28) నేడు లోకంలోని చాలామంది పెళ్లిని చాలా చులకనగా చూస్తున్నారు. ఒకరికొకరు సరిపోరని అనిపిస్తే ఎప్పుడైనా విడిపోవచ్చని వాళ్లు అనుకుంటున్నారు. కానీ క్రైస్తవ దంపతులు పెళ్లి ఏర్పాటును అలా చూడరు. వాళ్లు తమ పెళ్లి ప్రమాణాన్ని దేవుని ముందు చేశామని గుర్తుంచుకుంటారు. ఒకవేళ వాళ్లు ఆ ప్రమాణానికి కట్టుబడి జీవించకపోతే, దేవునికి అబద్ధం చెప్పినట్లే. అబద్ధం చెప్పేవాళ్లంటే దేవునికి అసహ్యం. (లేవీ. 19:12; సామె. 6:16-19) పెళ్లయిన క్రైస్తవులు అపొస్తలుడైన పౌలు అన్న ఈ మాటల్ని గుర్తుపెట్టుకోవాలి, “నీకు భార్య ఉందా? అయితే ఆమె నుండి విడిపోవాలని ప్రయత్నించకు.” (1 కొరిం. 7:27) నమ్మకద్రోహం చేసి విడాకులు ఇవ్వడాన్ని యెహోవా అసహ్యించుకుంటాడని పౌలుకు తెలుసు కాబట్టే ఆ మాటల్ని చెప్పగలిగాడు.—మలా. 2:13-16.

16. విడాకులు, వేరైపోవడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

16 వ్యభిచారం చేసిన వివాహజతను క్షమించలేనప్పుడు మాత్రమే విడాకులు తీసుకోవచ్చని యేసు చెప్పాడు. (మత్త. 19:9; హెబ్రీ. 13:4) అయితే భార్యాభర్తలు వేరైపోవచ్చా? బైబిలు దీనిగురించి కూడా స్పష్టంగా చెప్తుంది. (1 కొరింథీయులు 7:10, 11 చదవండి.) భార్యాభర్తలు వేరుగా ఉండడానికి బైబిలు అనుమతించట్లేదు. అయితే కొన్నిసార్లు తప్పని పరిస్థితిలో ఒకవ్యక్తి తన భర్త లేదా భార్య నుండి వేరుగా ఉండాలని అనుకోవచ్చు. ఉదాహరణకు, శారీరకంగా హింసించే లేదా మతభ్రష్టులైన వివాహజతతో ఉండడంవల్ల తమ ప్రాణం లేదా యెహోవాతో తమ సంబంధం చాలా ప్రమాదంలోపడే అవకాశం ఉందని ఒక వ్యక్తి గుర్తించవచ్చు. c

17. వివాహబంధం ఎప్పటికీ బలంగా ఉండాలంటే భార్యాభర్తలు ఏమి చేయవచ్చు?

17 వివాహ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు సలహా కోసం భార్యాభర్తలు సంఘపెద్దల దగ్గరకు వెళ్తారు. అలాంటి సందర్భాల్లో సంఘపెద్దలు వాళ్లను, ‘నిజమైన ప్రేమ అంటే ఏమిటి? (ఇంగ్లీషు) వీడియో చూశారా’ అని అలాగే ‘ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం బ్రోషురు చదివారా’ అని వాళ్లను అడగవచ్చు. వివాహ బంధాన్ని మరింత బలంగా చేసుకోవడానికి సహాయం చేసే బైబిలు సూత్రాలు వాటిలో ఉన్నాయి. ఒక జంట ఇలా చెప్పింది, “మేము ఈ బ్రోషురు చదువుతున్నప్పటి నుండి మా వివాహ జీవితం ఎప్పుడూ లేనంత సంతోషంగా సాగుతోంది.” పెళ్లయి 22 ఏళ్లు అవుతున్న ఒక సహోదరి తన భర్త నుండి విడిపోవాలని అనుకుంది. అప్పుడు ఆ సహోదరి నిజమైన ప్రేమ అంటే ఏమిటి? అనే వీడియో చూసింది. ఆమె ఇలా చెప్తుంది, “మేమిద్దరం బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులమే. కానీ మా ఇద్దరి భావోద్వేగాలు పూర్తి వేరుగా ఉండేవి. సరిగ్గా మాకు అవసరమైనప్పుడే ఆ వీడియో వచ్చింది. భార్యాభర్తలుగా ఇప్పుడు మేము చాలా ఆనందంగా ఉన్నాం.” కాబట్టి భార్య అలాగే భర్త యెహోవా ఇచ్చిన సూత్రాల్ని తమ వివాహ జీవితంలో పాటిస్తే, వాళ్లు మరింత సంతోషంగా ఉంటారు, వాళ్ల బంధం మరింత బలపడుతుంది.

ప్రత్యేక పూర్తికాల సేవ

18, 19. (ఎ) చాలామంది తల్లిదండ్రులు ఏమి చేశారు? (బి) ప్రత్యేక పూర్తికాల సేవలో ఉన్నవాళ్లు ఎలాంటి మొక్కుబడి చేసుకున్నారు?

18 యెఫ్తా, హన్నా చేసుకున్న మొక్కుబడుల గురించి ప్రారంభంలో మనం చర్చించుకున్నాం. ఆ మొక్కుబడుల వల్ల యెఫ్తా కూతురు, హన్నా కొడుకు తమ జీవితాల్ని ప్రత్యేకమైన విధానాల్లో యెహోవా సేవకోసం ఉపయోగించారు. నేడు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని పూర్తికాల సేవ చేపట్టమని, దేవుని సేవకే తమ జీవితాల్ని అంకితం చేయమని ప్రోత్సహిస్తున్నారు. మనం కూడా ఆ యౌవనస్థుల్ని ఆ సేవలో కొనసాగమని ప్రోత్సహించవచ్చు.—న్యాయా. 11:40; కీర్త. 110:3.

ప్రత్యేక పూర్తికాల సేవ (19వ పేరా చూడండి)

19 ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 67,000 మంది ప్రత్యేక పూర్తికాల సేవకులు ఉన్నారు. వాళ్లలో కొంతమంది బెతెల్‌లో, నిర్మాణ పనిలో లేదా ప్రాంతీయ పనిలో సేవచేస్తున్నారు. ఇంకొంతమంది ఉపదేశకులుగా, ప్రత్యేక పయినీర్లుగా, మిషనరీలుగా, అసెంబ్లీ హాళ్ల సర్వెంట్లుగా, లేదా బైబిలు పాఠశాలల సర్వెంట్లుగా కష్టపడి సేవచేస్తున్నారు. వాళ్లందరూ “విధేయత, పేదరిక ప్రతిజ్ఞ” చేశారు. ఈ ప్రతిజ్ఞ లేదా మొక్కుబడిలో భాగంగా, యెహోవా సేవలో తమకిచ్చిన ఏ నియామకాన్నైనా కష్టపడి చేస్తామని, సాదాసీదాగా జీవిస్తామని, అనుమతి లేకుండా బయట ఉద్యోగాలు చేయమని వాళ్లు ప్రమాణం చేస్తారు. అయితే, ఆ సేవచేసే వ్యక్తులు ప్రత్యేకమైనవాళ్లు కాదుగానీ వాళ్లు చేసే నియామకం మాత్రమే ప్రత్యేకమైనది. వాళ్లు ఆ ప్రత్యేక పూర్తికాల సేవలో ఉన్నంతకాలం, చేసిన ప్రమాణానికి వినయంగా కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు.

20. మనం దేవునికి చేసుకున్న మొక్కుబడులను ఎలా చూడాలి? ఎందుకు?

20 యెహోవాకు చేసుకునే మూడు మొక్కుబడుల గురించి మనం ఈ ఆర్టికల్‌లో చర్చించుకున్నాం. బహుశా మీరు అందులో కొన్ని మొక్కుబడులు చేసుకొని ఉంటారు వాటిని చాలా ప్రాముఖ్యమైనవిగా ఎంచాలి, వాటికి కట్టుబడి ఉండడానికి చేయగలినదంతా చేయాలి. (సామె. 20:25) ఒకవేళ మనం యెహోవాకు చేసుకున్న మొక్కుబడిని చెల్లించకపోతే చాలా ఘోరమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. (ప్రసం. 5:6) కాబట్టి “దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించునట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను” అని సంతోషంగా చెప్దాం.—కీర్త. 61:8.

a కొడుకు పుడితే ఆ పిల్లవాడు జీవితాంతం యెహోవాకు నాజీరుగా ఉండేలా ఇస్తానని ఆమె ప్రమాణం చేసింది. నాజీరుగా ఉండే వ్యక్తి తన జీవితాన్ని సమర్పించుకుని, యెహోవా సేవ కోసం ప్రత్యేకించబడతాడు.—సంఖ్యా. 6:2, 5, 8.

b ఒకరు బాప్తిస్మానికి అర్హులో కాదో నిర్ణయించడానికి సంఘపెద్దలు చాలా విషయాల్ని పరిశీలిస్తారు కాబట్టి బాప్తిస్మం చెల్లకపోవడం అనేది చాలా అరుదు.

c “దేవుని ప్రేమలో నిలిచి ఉండండి” పుస్తకంలోని 251-253 పేజీలు చూడండి.